close

సమీక్ష

సినిమా ‘నవల’

నవలలు సినిమాలుగా రావడం తెలిసిందే, కానీ సినిమాలూ నవలలుగా వచ్చాయంటే నమ్మగలరా. అవును, ఆ సంప్రదాయమూ ఉండేది. అలా వచ్చినవే ‘వెండితెర నవలలు’. ముళ్లపూడి, రావి కొండలరావు, శ్రీరమణ, గోటేటి, వంశీ... లాంటి రచయితలు చాలా సినిమాల్ని నవలలుగా రాశారు. ఈ నవలల్లో సినిమాలో ఉండే సంభాషణలూ, దృశ్యాలూ, పాటలకు తోడు కథానాయకుల ఫొటోల్నీ, తెరవెనక సంఘటనల్నీ కూడా జోడించేవారు. 1957లో వచ్చిన ‘తోడికోడళ్లు’ తెలుగులో తొలి వెండితెర నవలగా చెబుతారు. బొబ్బిలిపులి, మాయాబజార్‌, బుద్ధిమంతుడు, గుండమ్మకథ, శంకరాభరణం... ఇలా చాలా సినిమాలకు వెండితర నవలలు వచ్చాయి. ప్రచారానికి ఉపయోగపడతాయని నిర్మాణ సంస్థలే వీటిని తీసుకొచ్చేవి. కొన్నిసార్లు ఈ నవలలు సినిమాలకంటే గొప్పగా ఉండేవట. ’80ల వరకూ ఈ సంప్రదాయం ఉండేది. తర్వాత పాఠకులు కరవై కనుమరుగైపోయిన ఈ వెండితెర నవలల గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని ‘వెండి చందమామలు’ పుస్తకం ద్వారా అందించారు రచయితలు.

- రోహిత్‌

 

 

వెండి చందమామలు
రచన: పులగం చిన్నారాయణ
వడ్డి ఓంప్రకాశ్‌ నారాయణ
పేజీలు: 91: వెల: రూ. 50/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


మానవ సంబంధాలు

అనుబంధాలనూ ప్రేమాభిమానాలనూ జాగ్రత్తగా కాపాడుకోమని ప్రబోధిస్తాయి ఈ కథలు. ‘పిల్లలు ఎదిగే మొక్కల్లాంటి వాళ్లు. కుటుంబంలోని వాళ్లంతా ప్రేమ అనే ఎరువుని అందిస్తే వాళ్లు ఆరోగ్యంగా పెరిగి మంచి మనుషులుగా తయారవుతారనే సందేశం ‘వంతెన’ కథలో కనిపిస్తుంది. ప్రేమ పేరుతో పిల్లలు మతాంతర వివాహానికి సిద్ధపడితే, తల్లిదండ్రులు హుందాగా ఎలా ప్రవర్తించాలో ‘అడుగెయ్‌ నిబ్బరంగా’ కథలో నాయనమ్మ పాత్ర చెబుతుంది. అపార్ట్‌మెంట్‌ జీవితాల్లో ఏకాంత ద్వీపంగా మసలే వ్యక్తులను చూసి తల్లడిల్లిన తల్లికి మంచితనంపై నమ్మకం పెంచడానికి కొడుకు చెప్పే మాయ మాటలు ‘అమ్మకో అబద్ధం’ కథ.

- పార్థ సారథి

 

 

అమ్మకో అబద్ధం (కథలు)
రచన: అల్లూరి(పెన్మెత్స) గౌరీలక్ష్మి
పేజీలు: 151: వెల: రూ. 90/-
ప్రతులకు: ఫోన్‌- 9948392357


సంప్రదాయాలపై తిరుగుబాటు

విశాఖ జిల్లాలోని ఓ అగ్రహారం చుక్కపల్లి. అక్కడ సంప్రదాయ కుటుంబాల జీవనయాన చిత్రీకరణే ఈ నవల. అగ్రహారం అంటే అర్థం ఏమిటి- అన్న ప్రశ్నకు ‘ఫలానా గ్రామంలో మేం పన్నులు తీసుకోబోం అని ప్రభువులు చేసిన శాసనమే అగ్రహారం’ అని సూరిశాస్త్రి పాత్ర ద్వారా సమాధానం చెప్పిస్తారు. మెడిసిన్‌ చదువుతున్న అశ్వత్థ నారాయణ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. శాఖల పట్టింపు పేరుతో తండ్రి అంగీకరించడు. అశ్వత్థ తండ్రిని ఎదిరించి విజేతగా నిలవటమే కథ. శాఖాంతరపు పెళ్లిళ్లపై పెద్ద చర్చే చేశారు రచయిత. కళింగాంధ్ర యాసలో పదాల పోహళింపు చదివిస్తుంది.

- పారుపల్లి శ్రీధర్‌

 

 

బుగతలనాటి చుక్కపల్లి (నవల)
రచన: చింతకింది శ్రీనివాసరావు
పేజీలు: 181: వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


నాటి కవితలు నేటికీ...

యాభై ఏళ్ల క్రితం రాసుకున్న కవితల్ని గుదిగుచ్చి ప్రచురించిన పుస్తకమిది. నగరం నడిబొడ్డు మీద/నా గుండెను/ఎర్రజెండాగా ఎగరేసి/ ఎజెండాగా అయిపోతానని విరసం ఏర్పడకముందే ప్రకటించిన సామాజిక చైతన్యం ఈ కవిది. అవినీతి ఇప్పుడు తొండ కాదు/ ఊసరవెల్లిగా మారింది/ ఎవరూ గుర్తుపట్టడం లేదు... ‘కాలకన్య’లో కవి అన్న ఈ మాటలు ఎప్పుడో రాసిన ఈ కవితలు ఇప్పటికీ వర్తిస్తాయనడానికి నిదర్శనం. లాంగ్‌మార్చ్‌, నా గీతం, నిరీక్షణ... ఇలా పుస్తకంలోని కవితలన్నీ ఆలోచన రేకెత్తించేవే, సామాజిక చైతన్యానికి స్ఫూర్తినిచ్చేవే.

- శ్రీ

 

 

ఎర్రమందార మకరందం (కవిత్వం)
రచన: కె. ప్రభాకర్‌
పేజీలు: 164: వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 9440136665

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.