close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాస్‌వర్డ్‌ జర భద్రం

పాస్‌వర్డ్‌ జర భద్రం

అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లిన అలీబాబా బందిపోటు దొంగల చప్పుడు విని ఓ చెట్టెక్కి కూర్చుంటాడు. దొంగలు వచ్చి ‘ఖుల్‌జా సిమ్‌ సిమ్‌’ అనగానే గుహ తలుపు తెరుచుకుంటుంది.తాము తెచ్చిన మూటలన్నీ లోపల పెట్టి బయటకు వచ్చిన దొంగలు ‘బంద్‌హోజా సిమ్‌ సిమ్‌‘ అనగానే గుహ తలుపు మూసుకుపోతుంది. ఆ మాటల్ని బాగా గుర్తుపెట్టుకున్న అలీబాబా దొంగల సొత్తును దోచుకుని సంపన్నుడైన కథంతా మనకు తెలుసు.కథే అయినా... బహుశా మనకు తెలిసిన తొలి పాస్‌వర్డ్‌ చోరీ ఇదే కావచ్చు!

టెక్‌ నిపుణుడి టెడ్‌ ప్రసంగం... వర్చువల్‌ ప్రపంచంలోని సాధ్యాసాధ్యాలపై అతను ఆసక్తికరంగా చెబుతున్నాడు. ‘కేవలం 20 సెకన్లు... మీ ఫోన్‌లోకి నాకు 20 సెకన్లు యాక్సెస్‌ లభిస్తే చాలు. మీ టెక్ట్స్‌ మెసేజీలు, మీరు ఎవరెవరికి ఫోన్‌ చేసి, ఎంత సేపు మాట్లాడారో తెలిపే కాల్‌ లాగ్‌, అంతర్జాలంలో మీరు ఏయే సైట్లు బ్రౌజ్‌ చేశారో ఆ హిస్టరీ... ఒకటేమిటి మీ ఫోనులో దాచుకున్న ఫైల్స్‌, ఫొటోలతో సహా మొత్తం సమాచారం నా చేతికొచ్చేస్తుంది...’

సభికులందరి చేతులూ ఫోన్లపై గట్టిగా బిగుసుకున్నాయి. ఫోను తమచేతిలోనే ఉన్నా సమాచారం ఎలా వెళ్లిపోతుందో ఉపన్యాసకుడు చెప్తున్నది వారికి అర్థమైంది. అయినా... అదో అసంకల్పిత ప్రతీకార చర్య. అంతే. కొందరికైతే వెన్నులోంచి వణుకొచ్చినట్లయింది. అవును మరి... అరచేతిలో ఉన్న ఆ చిన్ని సాధనంలో మనసైన విషయాలనుంచీ మనీ లావాదేవీల దాకా మొత్తం జాతకాలు ఇమిడి ఉంటున్నాయి.

‘ప్రపంచంలో రెండే రకాల ప్రజలున్నారు. తాము హ్యాకింగ్‌కి గురయ్యామని తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు...’ అంటూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లను ఎలా హ్యాక్‌ చేయవచ్చో సోదాహరణంగా వివరించిన ఆ ఉపన్యాసకుడు ఎథికల్‌ హ్యాకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి నేడు వ్యాపారవేత్తగా మారిన సాకేత్‌ మోదీ.

ఖాతాదారుడి ప్రమేయం లేకుండా ఓ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మాయమవుతుంది. వ్యక్తిగత సమాచారం చేతులు మారుతుంది. ఫొటోలు మార్ఫింగ్‌కి గురై అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. అయినా ఏదో నిర్లిప్తత. మన దాకా వస్తే కానీ పట్టించుకోని మనస్తత్వం ఎప్పటికప్పుడు వ్యక్తుల్నీ వ్యవస్థల్నీ ప్రమాదం అంచున నిలబెడుతూనే ఉంది.

మూడేళ్ల క్రితం సీబీఐ తొలిసారిగా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో అమిత్‌ విక్రమ్‌ తివారీని అరెస్టు చేసింది. అతడు తన సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానంతో ఆర్థిక నేరస్థులకు తోడ్పడ్డాడు. వారు కోరిన ఈమెయిల్స్‌కి పాస్‌వర్డ్‌ను ఛేదించి ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించేవాడు. మూడేళ్ల వ్యవధిలో 900 ఈమెయిల్స్‌కి పాస్‌వర్డ్‌ కనిపెట్టి ఒక్కోదానికీ 15నుంచి 30 వేల రూపాయల వరకూ వసూలుచేశాడు. బాధితుల్లో 170 మంది దాకా భారతీయులే. ఎఫ్‌బీఐ హెచ్చరికతో అప్రమత్తమైన సీబీఐ నిఘా పెట్టి పుణెలో తివారీని అరెస్టు చేసింది. తివారీ చేసిన పని హ్యాకింగ్‌.

పదిహేను రోజుల క్రితం పలు దేశాలను వణికించి, వివిధ దేశాల్లో వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిన వాన్న క్రై మాల్‌ వేర్‌ సమస్య కూడా హ్యాకింగ్‌ ఫలితమే. ఇటీవలి దాకా సైబర్‌ భద్రతకు సంబంధించి 2014 సంవత్సరం అత్యంత దారుణమైనదిగా పేర్కొంటారు. ఆ ఏడాది సోనీ, జేపీ మోర్గాన్‌, టార్గెట్‌ లాంటి పలు కార్పొరేట్‌ సంస్థల సమాచారం చోరీకి గురయ్యింది. పలువురు సెలెబ్రిటీల వ్యక్తిగత చిత్రాలు అంతర్జాలంలో వెల్లువెత్తాయి. ఆరు లక్షల మంది డొమినోస్‌ పిజ్జా వినియోగదారుల వివరాలు 40వేల డాలర్లకు అమ్ముడైపోయాయి. టార్గెట్‌ సంస్థ నుంచి కోటిమంది వినియోగదారుల క్రెడిట్‌కార్డు వివరాలు, అడ్రసులతో సహా చోరీకి గురయ్యాయి. ఈ బే, హోమ్‌ డిపో... ఇలా ఎన్నో సంస్థలు ఆ ఏడాది హ్యాకింగ్‌ బాధితులయ్యాయి.

గత ఏడాది మొదట్లో బంగ్లాదేశ్‌ బ్యాంకు దోపిడీ బ్యాంకుల మీద జరిగిన అతి పెద్ద సైబర్‌దాడి. ఏకంగా 6వేల కోట్లు దోచుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఐదే లావాదేవీలతో 650 కోట్లు చేతులు మారాయి. ఇక ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిల్లరీ మెయిల్స్‌ హ్యాకైన విషయమూ మనకు తెలిసిందే. జాతీయ భద్రత పేరుతో కొన్ని ప్రభుత్వాలే హ్యాకింగ్‌ని ప్రోత్సహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ భద్రతపై ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తుచేసింది వాన్న క్రై.

అసలేమిటీ హ్యాకింగ్‌?
హ్యాకింగ్‌ అంటే ఓ కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లోకి అనుమతి లేకుండా చొరబడడం. అందులోని సమాచారాన్ని తారుమారుచేయడం, తస్కరించడం, ఆ వ్యవస్థను పనిచేయకుండా చేయడం. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ విద్యలో అసాధారణ ప్రజ్ఞ, ఆసక్తి ఉన్నవారు హ్యాకర్లుగా మారతారు. ఈ హ్యాకింగ్‌ వేర్వేరు పద్ధతుల్లో జరుగుతుంది. అయితే ఏ ప్రయోజనాన్ని ఆశించి హ్యాకింగ్‌ చేశారనేదాన్ని బట్టి దాని పర్యవసానాలుంటాయి. వ్యవస్థలకు నష్టం కలిగిస్తూ స్వార్థ ప్రయోజనాలకోసం పనిచేసేవారిని సాధారణంగా హ్యాకర్లంటారు. అలా కాకుండా భద్రతకోసం, ఇతరుల మేలు కోసం హ్యాకింగ్‌ చేసేవారిని ఎథికల్‌ హ్యాకర్లంటారు.

హ్యాకింగ్‌ చేసే పద్ధతిని బట్టి మూడు రకాలు. వాన్న క్రై లాంటి మాల్‌వేర్‌ వైరస్‌తో వ్యవస్థలను పాడుచేసేవారినీ, సమాచారాన్ని తస్కరించేవారినీ బ్లాక్‌హ్యాట్‌ హ్యాకర్లంటారు. వీళ్లు నేరస్థులు. తమ నైపుణ్యాలను సంఘవిద్రోహ శక్తులకు తాకట్టు పెడతారు. దేశ భద్రతకూ ముప్పు తెస్తారు.

ఎథికల్‌ హ్యాకర్లను వైట్‌ హ్యాట్‌ హ్యాకర్లంటారు. సైబర్‌ భద్రత నిపుణులైన వీరు నేటి డిజిటల్‌ సమాజానికి విలువైన సేవలందిస్తున్నారు. చట్టబద్ధమైన వృత్తి ఇది. ప్రభుత్వాలు, కార్పొరేట్‌ సంస్థలు వీరిని ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వైట్‌ హ్యాట్‌ హ్యాకింగ్‌లో సర్టిఫైడ్‌ శిక్షణ ఇచ్చే గుర్తింపు పొందిన సంస్థలూ ఉన్నాయి. సైబర్‌ నేరాల పరిష్కారంలో పోలీసులకు తోడ్పడేది వీరే.

ఇటీవల గురుగ్రామ్‌ పోలీసులకు ఓ యువతి తన మాజీ భర్తపై ఫిర్యాదు చేసింది. తన ఫేస్‌బుక్‌ ఖాతా పాస్‌వర్డ్‌ సంపాదించిన అతడు తన పేరుతో స్నేహితులకు అసభ్య సందేశాలూ ఫొటోలూ పంపాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయంతో విచారణ జరిపారు. యువతి ల్యాప్‌టాప్‌ పాస్‌వర్డ్‌ ఛేదించడం ద్వారా భర్త నేరుగా ఆమె ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచేవాడని రుజువైంది. తమ అనుబంధం చెడిందన్న ఆగ్రహంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోడానికే అలా చేసినట్లు అతడు అంగీకరించాడు. అది తెలీకుండా ఉండడానికి మొత్తం ఫైల్స్‌ అన్నీ డిలీట్‌ చేసి ల్యాప్‌టాప్‌ని ఫార్మాట్‌ కూడా చేశాడు. అయినా సరే, పోలీసులకు సహకరించిన సైబర్‌ నిపుణులు అతడు తొలగించిన సమాచారాన్ని తిరిగి సంపాదించి కేసును ఛేదించగలిగారు. అందుకు వీరు చేసిన పనీ హ్యాకింగే, అయితే మంచి పని కోసం చేశారు కాబట్టి దాన్ని ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటారు.

పై రెండింటికీ మధ్యలో ఉండేవారిని గ్రే హ్యాట్‌ హ్యాకర్లంటారు. వీరు సొంతంగానూ సంస్థలుగానూ పనిచేస్తారు. తమ స్వతంత్ర పరిశోధనలతో డిజిటల్‌ వ్యవస్థలు, కోడ్‌లలోని లోపాలను కనిపెట్టి ప్రభుత్వ, చట్టబద్ధ, కార్పొరేట్‌ సంస్థలకు అందజేస్తారు. అందుకు తగిన ప్రతిఫలం పొందుతారు. అంతర్జాల వినియోగదారుల భద్రతకు సహకరించే వీరూ ఎథికల్‌ హ్యాకర్ల కిందికే వచ్చినా లోపాలను కనిపెట్టడమే లక్ష్యంగా స్వతంత్రంగా పనిచేస్తారు కాబట్టి బగ్‌ హంటర్లనీ సాఫ్ట్‌వేర్‌ పరిశోధకులనీ అంటారు.

మనమే ఫస్ట్‌
ఎథికల్‌ హ్యాకింగ్‌లో మనవాళ్లదే పై చేయి. పలువురు సైబర్‌ నిపుణులుగా ప్రభుత్వ, కార్పొరేట్‌ సంస్థలకు సేవలు అందిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలు ప్రకటించే కార్యక్రమాల్లో టీనేజీ కుర్రాళ్లు సైతం బగ్‌లను పట్టేసి బౌంటీ(ప్రతిఫలం)లను కొట్టేస్తున్నారు. 1995లో తొలిసారి నెట్‌స్కేప్‌ ప్రారంభించింది ఈ బగ్‌ బౌంటీ కార్యక్రమాన్ని. బగ్‌క్రౌడ్‌ అనే సంస్థ అంచనా ప్రకారం గత మార్చి వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎథికల్‌ హ్యాకర్లుగా నమోదుచేసుకున్నవారిలో 28.2 శాతం భారతీయులున్నారు. ఆ తర్వాత స్థానం అమెరికా (24.4)ది. ఫేస్‌ బుక్‌ ఐదేళ్ల పాటు నిర్వహించిన బగ్‌ బౌంటీ కార్యక్రమంలో వందలాది హ్యాకర్లు పాల్గొని, పరిశోధించి, వేలల్లో నివేదికలు సమర్పించగా వారిలో అత్యధిక పారితోషికం అందుకుని ప్రథమ స్థానంలో నిలిచింది భారతీయులే. ఉబర్‌ సంస్థకోసం పనిచేసిన భద్రతా పరిశోధకుల్లో టాప్‌ 50లో ఆరుగురు భారతీయులున్నారు. వేర్వేరు దేశాలకు చెందిన మొత్తం 500 మంది పనిచేయగా ఉబర్‌ వారికి రూ.ఐదున్నర కోట్లు చెల్లించింది. చాలా కీలకమైన లోపాలు కనిపెట్టిన పార్థ మల్హోత్రా రూ.25 లక్షలు దక్కించుకోగా, ఆనంద్‌ ప్రకాశ్‌కి 9 లక్షలు లభించాయి. ట్విటర్‌ సైతం బగ్‌ హంటర్స్‌కి గత రెండేళ్లలో రెండు కోట్ల రూపాయలకు పైగానే చెల్లించింది.

ఉబర్‌ ప్రయాణికులకు అప్పుడప్పుడు ఫ్రీరైడ్‌లు ఇస్తుంది. అందుకు ఒక కోడ్‌ కూడా పంపిస్తుంది. అయితే ఆ కోడ్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఓ చిన్న లోపంతో ఎవరైనా జీవితకాలం ఉచిత సర్వీసు పొందే అవకాశం కన్పించింది ఆనంద్‌కి. దాన్ని అతడు సంస్థ దృష్టికి తెచ్చాడు. సాధారణ ప్రజలకు అది అర్థం కాదు కానీ సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి తేలిగ్గానే తెలిసిపోతుంది. అదే బ్లాక్‌ హ్యాట్‌ హ్యాకర్స్‌ దృష్టికి వస్తే సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లి ఉండేది. అలాగే ఫేస్‌బుక్‌ ఖాతాదారు ఆ ఆప్‌ చాట్‌ ఫీచర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఇతరులకు కనపడడాన్ని కూడా ఆనంద్‌ గమనించి రిపోర్ట్‌ చేశాడు. ఇలాంటి లోపాలనే బగ్‌ హంటర్స్‌ పట్టుకుంటారు. లోపం తీవ్రతను బట్టి ఆయా సంస్థలు ప్రతిఫలం చెల్లిస్తాయి.

ఇంత నిర్లక్ష్యమా?
సైబర్‌ భద్రత అనేది కొంతకాలం క్రితం వరకూ బోర్డ్‌రూమ్‌లో చర్చించే అంశాల్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు చర్చించక తప్పని పరిస్థితి. మన దేశంలో చాలా సంస్థలు సాంకేతికతను ఒక పట్టాన అప్‌డేట్‌ చేసుకోవు. పాత సాంకేతికతను వాడుతున్నప్పుడు హ్యాకింగ్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వినియోగదారుల అజాగ్రత్త వల్లే హ్యాకింగ్‌ జరుగుతుందన్నది వారి వాదన. చాలా మంది పాస్‌వర్డుల విషయంలో విపరీతమైన నిర్లక్ష్యం చూపుతుంటారు. ప్యూ రీసెర్చ్‌ వారి నివేదిక ప్రకారం మార్చి 2014 ఉదంతం తర్వాత పాస్‌వర్డులు మార్చుకున్నవారి శాతం కేవలం 40. తమ సమాచారం చోరీకి గురైందేమోనన్న ఆందోళన వ్యక్తంచేసిన వారు ఆరు శాతమే. ఫలితం... అదే ఏడాది ఆగస్టులో ఓ రష్యన్‌ సంస్థ 120 కోట్ల ఈ మెయిల్‌ ఐడీల పాస్‌వర్డులను సేకరించింది. ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఆ ఆర్నెల్ల వ్యవధిలోనే సైబర్‌ చోరీ సంఘటనలు పది రెట్లు పెరగడం. అంటే భద్రత సమస్య ఉందని తెలిశాక కూడా జాగ్రత్త పడకపోవడానికి నిదర్శనం ఈ అంకెలు. 2014లో వివిధ సంస్థలు కోల్పోయిన సమాచారం విలువ 491 బిలియన్‌ డాలర్లుంటుందని మైక్రోసాఫ్ట్‌ అంచనా. డ్రగ్‌ మాఫియాలానే అంతర్జాలంనుంచి తస్కరించిన సమాచారాన్ని అమ్మే మాఫియా కూడా ఉంది. ఈ మెయిల్స్‌, క్రెడిట్‌ కార్డుల సమాచారానికి ప్రాధాన్యాన్ని బట్టి రేటు.

ప్రమాదాల డౌన్‌లోడ్‌
ఇది ఆప్‌ల కాలం. ఏ ఆప్‌ డౌన్‌లోడ్‌ చేయబోయినా అది కొన్ని అనుమతులు అడుగుతుంది. మనకి అర్జెంటుగా ఆప్‌ కావాలి. కాబట్టి అన్ని అనుమతులూ ఇచ్చేస్తూ ‘ఎగ్రీ’ బటన్‌ నొక్కేస్తాం. ఉదాహరణకు ఏ ఆప్‌కైనా మన టెక్ట్స్‌ మెసేజెస్‌లోకి అనుమతి ఇచ్చామనుకోండి. ఆప్‌ ప్రొవైడర్‌ ద్వారా మన ఫోన్‌ నంబరు బయటకు వెళ్లిపోతుంది. సాధారణంగా బ్యాంకు లావాదేవీల సందేశాలు మనకు టెక్ట్స్‌ మెసేజ్‌ రూపంలో వస్తాయి. ఈ ఆప్‌ ద్వారా వాటిని హ్యాకర్‌ తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఆ మెసేజ్‌ మనకు కన్పించకుండా చేయొచ్చు. దాంతో మన బ్యాంకు ఖాతాలో జరిగిన లావాదేవీల సందేశాలు మనకు రావు. ఒకవేళ అదే నంబరుతో మనకు వాట్సాప్‌ ఎకౌంట్‌ ఉంటే మొత్తం వాట్సాప్‌ సందేశాలన్నీ హ్యాకర్‌ చదివేయొచ్చు. ఒకవేళ ఏ ఆప్‌ అయినా మన ఎస్డీ కార్డుకి యాక్సెస్‌ అడిగితే... అప్పుడు అందులో మనం సేవ్‌ చేసుకున్న సమాచారం ఫొటోలు, ఫైళ్లతో సహా ఆప్‌కి అందుబాటులోకి వచ్చేస్తాయి. మనం నిత్యం వాడే సామాజిక మాధ్యమాల ఆప్స్‌ కూడా మన కాల్‌ లిస్ట్‌ని యాక్సెస్‌ చేసుకోగలవు. కొన్ని ఆప్స్‌ అయితే మన వ్యక్తిగత ఫొటోలనూ, డాక్యుమెంట్లను చూడడమే కాదు, ఎడిట్‌ కూడా చేయగలవట.

ఒకప్పుడు మన దేశంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. వూళ్లలో పదిమంది కలిసి కబుర్లు చెప్పుకొనే రచ్చబండలుండేవి. అయినా ఇళ్లలో జరిగే విషయాలేవీ బయటకొచ్చేవి కాదు. ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలే. కానీ ఆంతరంగిక సమాచారం అంతా అంతర్జాలపు అంగట్లోనే. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారమంతా రచ్చబండకెక్కుతోంది. ఫోర్బ్స్‌ కాలమిస్టు ఆడమ్‌ టానర్‌ ఓ సదస్సుకి వెళ్లారు. అక్కడ కన్పించిన సమాచారం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్న 18 లక్షల మంది ఈ మెయిల్‌ చిరునామాలూ ఫోన్‌ నంబర్లూ అక్కడున్నాయి. అవి వాళ్లు స్వచ్ఛందంగా ఇచ్చినవేనని నిర్వాహకులు పేర్కొన్నారు. కానీ ఆయనకు నమ్మ బుద్ధి కాలేదు. చివరికి తెలిసిందేమిటంటే వారు ఆ చిరునామాలన్నిటినీ వివిధ వెబ్‌సైట్లనుంచి సేకరించారు. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చెప్తామంటూ కొన్ని వెబ్‌సైట్లు వ్యక్తుల వివరాలు సేకరిస్తాయి. వాటినిలా అమ్ముకుంటాయి. ఇలాంటి ఎన్నో విషయాలతో టానర్‌ ‘వాట్‌ స్టేస్‌ ఇన్‌ వెగాస్‌’ పేరుతో ఓ పుస్తకమే రాశారు. అంతర్జాలంతో భారతీయుల వ్యవహారం ఆయనకు మరింత విడ్డూరంగా కన్పించిందట. పాశ్చాత్యులు వ్యక్తిగత విషయాలుగా భావించే సమాచారాన్ని భారతీయులు వివాహ సంబంధాల వెబ్‌సైట్లలో స్వచ్ఛందంగా వెల్లడించడం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న ఇలాంటి సమాచారం ఆధారంగానే తాను నకిలీ విద్యార్థి గుర్తింపు కార్డునీ డ్రైవింగ్‌ లైసెన్సునీ పొందగలిగానని పట్టుబడిన ఓ తీవ్రవాది విచారణలో పేర్కొనడం గమనార్హం.

ఆ ఆసక్తి ఇక్కడ లేదే?
హ్యాకింగ్‌కి సంబంధించిన వార్తలు చదవడం, ఎవరు చేశారు, ఏం చేశారు, ఎలా చేశారన్న వివరాలు తెలుసుకోవడమంటే ప్రజలకు చాలా ఆసక్తిగా ఉంటుందంటాడు బగ్‌ హంటర్‌ రాహుల్‌ త్యాగి. కానీ అంతే ఆసక్తిని తమ సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడమెలా అన్నది తెలుసుకోవడంలో ఎందుకు చూపించరన్నది అతడి ప్రశ్న. ఎథికల్‌ హ్యాకర్స్‌గా ప్రపంచంలో మనవారే ముందుంటే మన దేశంలో మాత్రం వేళ్ల మీద లెక్కించగలిగిన సంస్థలు మాత్రమే తమ కోడ్‌లోకి వీరిని వేలు పెట్టనిస్తున్నాయి. చాలా సంస్థలు తమ సిబ్బందితోనే ఆ పని చేయిస్తున్నామని చెప్తాయి. పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికీ తమ ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదనీ పాశ్చాత్య సంస్థల్లాగా భారతీయ కంపెనీలు డబ్బు చెల్లించవనీ టీషర్టులో, పెన్‌డ్రైవ్‌లో పంపించి చేతులు దులుపుకొంటాయనీ అంటున్నారు యువ పరిశోధకులు.

ఈ డిజిటల్‌ యుగంలో బర్త్‌ సర్టిఫికెట్లతో మొదలుపెడితే ఉద్యోగంలో రిటైరయ్యే దాకా ఆఖరికి వైద్య నివేదికలతో సహా సమస్తం అంతర్జాలం లోనే. ఫోనుతో, కంప్యూటర్‌తో ఆ సమాచారాన్ని వినియోగించుకుంటాం. ఆ సమాచారం భద్రంగా ఉండాలంటే బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడమే కాక వాటిని తరచూ మార్చుకుంటూ ఉండాలి. ఫోనులో కాకుండా మరోచోట భద్రంగా దాచుకోవాలి.

నిజానికి ఏ వ్యవస్థా నూటికి నూరుపాళ్లూ భద్రమైనదని సైబర్‌ నిపుణులు కూడా గ్యారంటీ ఇవ్వరు. ఆంతరంగిక విషయాల భద్రత వ్యక్తిగత బాధ్యత. ఏ సమాచారమైనా మన ద్వారానే బయటకు వెళ్తుందన్నది వాస్తవం. అది తెలిసీ జాగ్రత్త వహించకపోవడం కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే. అవకాశం ఉంది కదా అని సోషల్‌ మీడియాను హద్దులు దాటి ఉపయోగిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ.

ఓ ఇంటిని దోచుకుని పోలీసులకు పట్టుబడ్డ దొంగని జడ్జి విచారిస్తున్నారు.

‘దొంగతనానికి ఆ ఇంటినే ఎందుకు ఎంచుకున్నావ్‌?’

‘కారుల్లో తిరుగుతూ, మాల్స్‌లో షాపింగ్‌ చేస్తూ ఆ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుంటారండీ...అందుకే డబ్బున్నవారేనని...’

‘ఇంట్లో ఎవరూ లేరని నీకెలా తెలిసింది?’

‘కుటుంబమంతా వారం రోజులుగా మారిషస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నట్లు రోజూ ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెడుతున్నారండీ...’

అది విన్న జడ్జిగారు ఏం తీర్పు చెప్పారో తెలియదు కానీ ఇక్కడ మనం చేయకూడని పనులేమిటో స్పష్టంగానే అర్థమవుతోంది.

డిజిటల్‌ లావాదేవీల భద్రతకు పాస్‌వర్డ్‌ కీలకం. అల్లావుద్దీన్‌ అద్భుత దీపంలా అది ఎవరి దగ్గర ఉంటే వారికే సేవలందిస్తుంది. దాన్ని దొంగల చేతికి వెళ్లకుండా కాపాడుకోవలసిన బాధ్యత అసలు యజమానిదే.

 

హైస్కూల్‌ డ్రాపవుట్‌...

థికల్‌ హ్యాకర్‌ గొప్పదనం తెలియాలంటే త్రిష్నీత్‌ మాటలే వినాలి. ‘ఓ బ్యాంక్‌ అకౌంట్‌ని హ్యాక్‌ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టగల ప్రతిభ మన దగ్గర ఉండీ, ఆ పని చేయకపోవడమే... మా వృత్తి’ అంటాడతను. పంజాబ్‌లోని లూధియానాకి చెందిన త్రిష్నీత్‌ అరోరా(22) హైస్కూల్‌ డ్రాపవుట్‌. కానీ స్వయంకృషితో సైబర్‌ నిపుణుడిగా ఎదిగిన త్రిష్నీత్‌ ఇప్పుడు సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి ఒక మల్టినేషనల్‌ సంస్థకు యజమాని. సైబర్‌ భద్రతలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాటి కార్పొరేట్‌ సంస్థలకు, సైబర్‌ నేరాల పరిష్కారంలో సీబీఐ, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్ర పోలీసులకు సేవలందిస్తున్నాడు. హ్యాకింగ్‌ గురించి మూడు పుస్తకాలు రాశాడు. ప్రభుత్వం నుంచి ఓ అవార్డూ అందుకున్నాడు. ప్రస్తుతం తన సంస్థ సేవల్ని ఇతర దేశాలకూ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాడు.

 

లక్షాధికారినవుతాననుకోలేదు...

నంద్‌ప్రకాశ్‌(23)ది రాజస్థాన్‌లో చిన్న టౌను. కాలేజీలో చదివేటప్పుడు ఖర్చులకోసం ఓ పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం వెదుక్కుందా మనుకుంటుండగా ఫేస్‌బుక్‌ వారి బగ్‌ బౌంటీ కార్యక్రమం కన్పించింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌ తదితర కంపెనీలకు పనిచేసి కోటి రూపాయలపైనే సంపాదించిన ఆనంద్‌ ప్రకాశ్‌ తానసలు లక్షాధికారినవుతానని కలలో కూడా అనుకోలేదంటాడు. నిజానికి ఆనంద్‌ ఎక్కడా శిక్షణ పొందలేదు. బ్లాగ్స్‌ చదివీ యూట్యూబ్‌ చూసీ నేర్చుకున్నాడు. మెసెంజర్‌కి సంబంధించిన ఓ లొసుగుని ఆనంద్‌ కనిపెట్టగా ఫేస్‌బుక్‌ అతడికి 33 వేలు చెల్లించింది. అప్పట్నుంచీ ఒక్క ఫేస్‌బుక్‌లోనే దాదాపు 90 లోపాలను కనిపెట్టాడు ఆనంద్‌. అందులో కీలకమైన ఓ లోపానికి ఏకంగా పదిలక్షలు అందాయి. ఈ పని తాను డబ్బు కోసమే చేయడం లేదనీ వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఉంచడంలో లభించే ఆనందం కోసం చేస్తున్నాననీ అంటాడు ఆనంద్‌.

 

‘భీమ్‌’ భద్రత వీరి బాధ్యతే!

కోల్‌కతాకి చెందిన సాకేత్‌ మోదీ(26) దిల్లీలో లుసిడియస్‌ టెక్నాలజీ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పటినుంచీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో పరిశోధన పట్ల ఆసక్తి పెంచుకున్న సాకేత్‌ ఆ రంగంలోనే కృషిచేసి సొంత సంస్థను స్థాపించారు. ఆసియాలో 30 ఏళ్లలోపు ప్రతిభావంతుల ఫోర్బ్స్‌ 30 జాబితాలో సాకేత్‌ స్థానం పొందారు. నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపులకు వీలు కల్పిస్తూ ప్రధాని మోదీ ప్రారంభించిన భీమ్‌ ఆప్‌ భద్రత పర్యవేక్షణ బాధ్యతను సాకేత్‌ మోదీ బృందమే నిర్వహించింది. స్మార్ట్‌ ఫోన్‌ ప్రైవసీ కోసం వీరి సంస్థ అన్‌హ్యాక్‌ అనే ఓ ఆప్‌ని కూడా తయారుచేసింది. 

 

ఆ మజాయే వేరు!

ప్రపంచస్థాయి సంస్థలనుంచి ప్రశంసలు పొందడమంటే మాటలా.. ఆ మజాయే వేరు. అందుకే బగ్‌ హంటింగ్‌ని వృత్తిగా ఎంచుకున్నానంటాడు రాహుల్‌ త్యాగి. గురుదాస్‌పూర్‌లో తొలి కంప్యూటర్‌ని కొనుక్కుంది త్యాగినే. టీనేజర్‌గా ఉన్నప్పుడే మిత్రబృందంలో అతడికి టెకీ అని పేరు. ఇప్పుడు సాకేత్‌ మోదీతో కలిసి లుసిడియస్‌ టెక్నాలజీ సంస్థ నిర్వహణలో భాగస్వామిగా ఉన్న రాహుల్‌ గతంలో ఇంటెల్‌, సోనీ, హెచ్‌పీ, టెడ్‌ లాంటి సంస్థలకు సేవలందించాడు. బ్లాక్‌బెర్రీకోసం చేసిన పనికి గాను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. డిజిటల్‌ ఇండియా సాధన దిశగా జరుగుతున్న దానికి రెట్టింపు కృషి సైబర్‌ భద్రత దిశగా జరగాలంటాడు రాహుల్‌.

 

నా జీవితాన్నే మార్చేసింది

నీశ్‌ భట్టాచార్య కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చదువుతుండగా హ్యాకర్‌ వైభవ్‌ ఖట్కేతో పరిచయమైంది. అతని స్నేహంతో మొదలైన హ్యాకింగ్‌ మనీశ్‌కి పార్ట్‌ టైమ్‌ ఉద్యోగమైంది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సంపాదించుకోగలగడం, పైగా డాలర్లలో సంపాదించి రూపాయిల్లో ఖర్చు పెట్టడం మనీశ్‌కి థ్రిల్లింగ్‌గా ఉండేది. ఓ వేసవి సెలవుల్లో మైక్రోసాఫ్ట్‌ కోసం చేసిన పని అతడికి తొలి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో గుర్తించిన ఓ లొసుగుని వారికి తెలిపాడు. దానికి ప్రతిఫలంగా అసలు డబ్బిస్తారో ఇవ్వరో, ఇచ్చినా ఓ ఐదొందల డాలర్లిస్తే గొప్పే అనుకున్న మనీశ్‌కి ఏకంగా 5000 డాలర్లొచ్చాయి. అలా 10 రోజుల్లో తను సంపాదించిన డబ్బు తన తండ్రి వార్షిక వేతనంకన్నా మూడు రెట్లు ఎక్కువన్నది గ్రహించి ఆశ్చర్యపోయాడు మనీశ్‌. ఆ డబ్బుతోనే చదువుకు తీసుకున్న రుణం చెల్లించేశాడు. ఈ వృత్తి తన జీవితాన్నే మార్చేసిందనే మనీశ్‌ ‘అందరూ చేస్తున్న పనే చేయొద్దు, మీలో ఉన్న నైపుణ్యానికి డిమాండ్‌ ఎక్కువ ఉన్న పని చేయండి’ అని తోటివారికి సలహా ఇస్తుంటాడు కూడా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.