close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిరునవ్వు

చిరునవ్వు
- తిరుమలశ్రీ

ఫ్యాన్సీ షాపులో అడుగుపెడుతూనే కౌంటర్‌ వెనుక కూర్చున్న షాపు యజమాని వంక చూసి, పూర్వ పరిచయం ఉన్నదానిలా పలకరింపుగా చిరునవ్వు నవ్వింది మమ్మీ. నిజానికి ఆ షాపునకు మేము వెళ్ళడం అదే మొదటిసారి.

‘‘ఏం కావాలి, మేడమ్‌?’’ అనడిగాడు అతను.

‘‘మా పాపకు గోళ్ళరంగులవీ కావాలటండీ. మీ దగ్గర ఏమేమి షేడ్స్‌ ఉన్నాయో మంచివి చూపించండి’’ అంది మమ్మీ.

షాపులో ఇంకా అరడజను మంది ఆడ, మగ కస్టమర్స్‌ ఉన్నారు. ఇద్దరు సేల్స్‌బాయ్స్‌ వారికి కావాల్సిన వస్తువులను చూపిస్తున్నారు.

షాపు యజమాని నాకు కావలసిన వస్తువుల్ని తీస్తుండగా, మమ్మీ మిగతా కస్టమర్స్‌ దగ్గరకు వెళ్ళి చిరునవ్వుతో పలుకరించింది. వాళ్ళు కొనుగోలు చేస్తున్న వస్తువులను చూస్తూ ‘‘బావున్నాయి’’ అని మెచ్చుకుంది. తోచిన సలహాలు ఇస్తోంది.

మమ్మీ ప్రవర్తన నాకు ఇబ్బందిగా అనిపించింది ఎప్పటిలాగే!

ఎక్కడికి వెళ్ళినా అంతే తాను- ముక్కూ మొహమూ ఎరుగనివాళ్ళని చూసి చిరునవ్వు నవ్వుతుంది- పరిచయం ఉన్నదానిలా! స్నేహితులతో మాట్లాడుతున్నట్లు కలుపుగోలుగా ప్రవర్తిస్తుంది. అందుకు అందరి స్పందనా ఒకేలా ఉండదు... కొందరు తిరిగి స్మైల్‌ చేస్తుంటారు. మరికొందరు ఓ కొత్త మనిషి తమను చూసి నవ్వడంతో తికమకకు గురై మొహమాటంగా పెదవులు విడీవిడనట్టుగా నవ్వుతుంటారు. ఇంకొందరైతే మమ్మీ వంక వింతగా చూసి, ముఖాలు తిప్పేసుకోవడం కూడా కద్దు. ఒక్కోసారి ‘మీరెవరు? ఇంతకుముందు మనం ఎక్కడా కలుసుకున్నట్టులేదే!’ అంటూ నిర్మొహమాటంగా అడిగేసినవాళ్ళూ ఉన్నారు.

కానీ మమ్మీకి మాత్రం ఎలాంటి రిజర్వేషన్సూ ఉన్నట్టు కనిపించదు. కొత్తా పాతా అన్నది లేకుండా, ఎంత గంభీరంగా ఉండేవాళ్ళనైనా తన చిరునవ్వుతో మాటల్లోకి దింపి, ఫ్రీగా సంభాషించేలా చేస్తుంది. చిత్రమేమిటంటే, మేము ఆ ప్రదేశం నుంచి బైటపడేసరికి, పాత స్నేహితుల్లా ప్రవర్తిస్తారంతా- మమ్మీతో!

సెవెన్త్‌క్లాస్‌ చదువుతున్న నాకు... ఎందుకో మమ్మీ తీరు సుతరామూ నచ్చదు. అనవసరంగా కొత్తవారితో మాటలు కలపడం నాకు ఇష్టం ఉండదు. వెకిలి మనిషి అనుకుంటారేమోనని భయం. కనిపించిన వారందర్నీ చూసి స్మైల్‌ చేసే మమ్మీ వెంట ఉండటానికి చిన్నతనంగా అనిపించి కాస్త దూరంగా నిలుచుంటూ ఉంటాను.

నెయిల్‌ పాలిష్‌, హెయిర్‌ బ్యాండ్స్‌, ఇయర్‌ రింగ్స్‌, రిస్ట్‌ బ్యాండ్‌, బాడీ లోషన్‌ వగైరా నాకు కావాల్సిన వస్తువుల్ని తీసుకుని... మమ్మీ షాపు ఓనరుతో ఏవో కబుర్లు చెబుతూ బిల్‌ చెల్లిస్తుంటే, ఇంకో క్షణం అక్కడ నిల్చోకుండా షాపులోంచి బైటపడ్డాను నేను.

ఇంటికి వెళ్ళేసరికి గుమ్మంలోనే ఎదురయ్యారు డాడీ. ‘‘ఎక్కడికి వెళ్ళార్రా చిట్టితల్లీ? ఈవెనింగ్‌ వాక్‌కా?’’ అనడిగారు ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుంటూ.

‘‘చేతిలో క్యారీబ్యాగ్‌ చూస్తుంటే తెలియడంలేదూ? వూళ్ళొ ఉన్న ఫ్యాన్సీ షాపు మీద రెయిడ్‌ చేసింది మీ ముద్దుల కూతురు’’ అంది మమ్మీ నవ్వుతూ.

నాకు ఉక్రోషంగా ఉంది. ‘‘డాడీ, ఇక మీదట నేను మమ్మీతో బైటకు వెళ్ళను, అంతే’’ అన్నాను.

‘‘అంత పెద్ద నిర్ణయం ఇంత చిన్న వయసులోనే తీసుకున్నావంటే... మమ్మీ తప్పకుండా ఏదో గొప్ప ఇరకాటంలోనే పెట్టేసి ఉంటుంది నిన్ను, యామై రైట్‌?’’ అన్నారు డాడీ నవ్వుతూ.

‘‘ఔను. షాపులో కనిపించిన వాళ్ళందరినీ చూసి స్మైల్‌ చేస్తుంది. పరిచయం లేనివాళ్ళను సైతం పలుకరిస్తుంది. అది నాకు చాలా ఎంబరాసింగ్‌గా అనిపిస్తోంది డాడీ’’ అంటూ ఫిర్యాదు చేశాను.

‘‘రియల్లీ? నీది కేవలం ఎంబరాస్మెంటే. నాకైతే చచ్చేంత భయం’’ డాడీ భయం నటించారు.

‘‘భయమెందుకు డాడీ, ఆనక వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చి బ్యాంక్‌ లోన్స్‌ ఇప్పించమంటారనా?’’ అడిగాను విస్తుపోతూ. డాడీ ఆ వూళ్ళొ ఉన్న ఓ పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంక్‌కి బ్రాంచ్‌ మేనేజర్‌.

మూణ్ణెల్లక్రితం బదిలీపై ఆ వూరికి వచ్చాం మేం. పల్లే పట్టణమూ కాని వూరు అది.

‘‘నా భయం... పరిచయాల మూలంగా లోన్స్‌ అడుగుతారని కాదురా! మీ మమ్మీ చిరునవ్వుకు ఫ్లాట్‌ అయిపోయి ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని!’’ అని డాడీ జవాబివ్వడంతో-

‘‘అవ్వఁ’’ అంటూ నోరు నొక్కుకుంది మమ్మీ. ‘‘చిన్నపిల్ల ముందు అవేం మాటలండీ?’’ అంది మందలింపుగా.

‘‘స్మైల్‌ చేస్తే ఎత్తుకుపోతారా డాడీ?’’ భయంగా అడిగాను నేను.

డాడీ నవ్వేసి, ‘‘లేదురా, ఓసారి అలా జరిగిందని... మళ్ళీమళ్ళీ జరగాలని రూల్‌ లేదుగా’’ అన్నారు.

మమ్మీ చిరుకోపంతో డాడీ డొక్కలో మోచేత్తో పొడిచింది. అప్పుడు తన కన్నులలో తళుక్కుమన్న మెరుపులు నా దృష్టిని తప్పించుకోలేదు.

‘‘నిజమా డాడీ? స్మైల్‌ చేసిందని మమ్మీని ఎత్తుకుపోయారా... ఎవరు?’’ అడిగాను కంగారుగా.

‘‘నేనే!’’ అని డాడీ అనడంతో-

‘‘పో, డాడీ! యు ఆర్‌ ఫూలింగ్‌ మీ’’ అన్నాను బుంగమూతి పెట్టి.

‘‘లేదురా, నేను నిజమే చెబుతున్నాను’’ అన్నారు.

ఏదో ఉందనిపించింది నాకు. ‘‘డాడీ, ప్లీజ్‌ వివరంగా చెప్పవూ?’’ బతిమాలాను.

‘‘ఏయ్‌ వద్దు’’ అని మమ్మీ అభ్యంతరపెడుతున్నా వినిపించుకోకుండా డాడీ చెబుతున్న సంగతులు వింటూ సంభ్రమంతో నోరు వెళ్ళబెట్టాను నేను.

‘‘దాదాపు పదిహేనేళ్ళ కిందటి మాట... డాడీ పట్టణంలో బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవారు. పీజీ చేస్తున్న మమ్మీకి అదే బ్యాంకులో సేవింగ్స్‌ అకౌంట్‌ ఉండేది. అందువల్ల మమ్మీ ఆ బ్యాంక్‌కి వెళుతుండేది. ఓసారి క్యాష్‌ కౌంటర్లో కూర్చున్న డాడీని చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు డాడీకి ఆహ్లాదకరంగానూ మెస్మరైజింగ్‌గానూ అనిపించింది. ఆ తరవాత మమ్మీ బ్యాంక్‌కి చాలాసార్లు వెళ్ళింది. వెళ్ళినప్పుడల్లా డాడీని చూసి స్మైల్‌ చేసేది.

మమ్మీ అందంగా ఉంటుంది. దానికితోడు తన చిరునవ్వు ఎంతటివారినైనా ఆకట్టుకోవలసిందే! డాడీ మనసు మమ్మీ స్మైల్‌లో చిక్కుకుపోయింది. ఆమెకు తానంటే ఇష్టమనీ, ఆమె చిరునవ్వు తనకే ప్రత్యేకమనీ భావించారు. అయితే మమ్మీ బ్యాంక్‌లోని ఇతర సిబ్బందితోనేకాక, అక్కడకు వచ్చిన కస్టమర్స్‌ని కూడా చిరునవ్వులతో పలుకరించి మాటలు కలపడం గమనించి కంగారుపడ్డారు.

ఆలస్యంచేస్తే వేరెవరైనా మమ్మీకి చేరువైపోతారేమోనన్న భయంతో, ఓ రోజున తెగించి, ‘ఐ లవ్‌ యూ’ చెప్పేశారు ధైర్యంగా.

ఎదురుచూడని ఆ సంఘటనకు బిత్తరపోయింది మమ్మీ. కొన్నాళ్ళుగా డాడీని చూస్తున్నందున ఆయనపైన సదభిప్రాయమే ఉంది తనకు. దాంతో, తన తండ్రిని కలవమని చెప్పింది.

డాడీ, తాతయ్యను కలుసుకుని తన అభీష్టం చెప్పారు. తాతయ్య నవ్వారు. ‘మా త్రిపుర చిన్నప్పట్నుంచీ అంతే! కొత్త అన్నది లేకుండా కనిపించిన వారందరినీ చిరునవ్వుతో గ్రీట్‌ చేస్తుంది. అందుకే తన చుట్టూ ఉన్న సమాజంలో అపరిచితులంటూ ఉండరు తనకు. అందరూ పరిచయస్తులూ మిత్రులే. నువ్వు కేవలం తన చిరునవ్వుకు పడిపోయి పెళ్ళి చేసుకుందామనుకుంటే... మరోసారి ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే, ఆనక అదే చిరునవ్వు మీమధ్య మనస్పర్థలకు కారణం కాకూడదు’ అన్నారు.

అందుకు డాడీ కంగారుగా, ‘నో నో, సర్‌... మీ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను’ అన్నారు.

మమ్మీ చదువు పూర్తికాగానే ఇరువైపుల పెద్దల ఆశీస్సులతో వారి వివాహం జరిగిపోయింది.’’

‘‘ఓహ్‌! గ్రేట్‌’’ అంటూ చప్పట్లు కొట్టాను నేను. మమ్మీని కావలించుకుని ముద్దు పెట్టుకున్నాను. తాను చిన్నపిల్లలా సిగ్గుపడుతుంటే ముచ్చటవేసింది.

‘‘...అయినా కానీ, మరీ ముక్కూ మొహమూ ఎరుగనివారిని చూసి స్మైల్‌ చేయడం నాకైతే అబ్సర్డ్‌గా ఉంటోంది’’ అన్నాను ఓ క్షణం ఆగి.

‘‘జీవితం అద్దంలాంటిది శైలూ! మనం చిరునవ్వులు చిందిస్తే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది’’ అంది మమ్మీ. ‘‘నువ్వింకా చిన్నపిల్లవు. అందుకే నా తీరు నీకు ఎబ్బెట్టుగా ఉంటుంది.’’

‘‘ఔనురా చిట్టితల్లీ! చిరునవ్వు ఖర్చులేనిది. కానీ, దాని విలువ మాత్రం అమూల్యం’’ అన్నారు డాడీ.

మమ్మీ ఎవరినీ స్పేర్‌ చేయదు. న్యూస్‌పేపర్‌ బాయ్‌, మిల్క్‌మేన్‌, పోస్ట్‌మేన్‌, వెచ్చాల కొట్టులో పొట్లాలు కట్టే బాయ్స్‌, కూరగాయలవాళ్ళు, వీధుల్లో బళ్ళమీద అమ్ముకునేవారు- చివరకు బిచ్చగాళ్ళను కూడా! అంతా ఆమె చిరునవ్వుకూ పలకరింపుకూ లొంగిపోవలసిందే! కొందరైతే మమ్మీతో మాట్లాడుతూ నన్ను ముద్దు చేసి నా బుగ్గలు పుణకడం కూడా కద్దు. అదంతా గుర్తుకు వచ్చి భుజాలు ఎగరేశాను నేను.

* * *

ఎంసెట్‌ పాసై హైదరాబాదులోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌లో చేరాను నేను. కాలేజీ హాస్టల్లో ఉంటున్నాను. నిజానికి నన్ను డాక్టర్ని చేయాలన్నది మమ్మీ అభిలాష. కానీ, నాకు వైద్యవిద్య మీద ఆసక్తిలేదు. రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. డిసెక్షన్సవీ నాకు సరిపడవు. తన అభీష్టాన్ని నా నెత్తిన రుద్దడానికి మమ్మీ ప్రయత్నించలేదు.

ఆమధ్య కాలంలో డాడీకి రెండు మూడు బదిలీలు జరిగాయి. ప్రస్తుతం ఓ ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తున్నారు.

ఆ వూరికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న టౌన్‌ ఉంది. ఆ వూరివాళ్ళంతా నిత్యావసర వస్తువుల కోసం ఆ టౌన్‌ మీదే ఆధారపడవలసి ఉంటుంది. ప్రతి శుక్రవారమూ అక్కడ జరిగే సంతకు వెళ్ళి, కావాల్సిన సరుకులు కొని తెచ్చుకుంటుంటారు. ఆ వూరి మీదుగా వెళ్ళే టౌన్‌ బస్‌ ఉంది. డాడీ అఫీషియల్‌ వర్క్‌తో బిజీగా ఉంటారు కనుక, మమ్మీ ఒంటరిగానే ఆ సంతకు వెళుతుంటుంది. వారానికి సరిపడా అన్నీ కొని తెచ్చుకుంటుంది.

సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాను నేను మమ్మీని ‘టౌన్‌కి తన వీక్లీ ట్రిప్స్‌ ఎలా ఉన్నాయ’ని. అప్పుడు మమ్మీ చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తి కలిగించాయి.

శుక్రవారపు సంతకు వెళ్ళేవారిలో అధికభాగం ఆడవాళ్ళే. వారిలో అన్ని వయసులవాళ్ళూ ఉన్నారు. మొదటిసారి మమ్మీ బస్‌ ఎక్కినప్పుడు అలవాటు ప్రకారం లోపల ఉన్నవారందరి వంకా చూసి చిరునవ్వులు గుప్పించింది. పలకరించడానికి ప్రయత్నించింది. కానీ, ఆశించినంత స్పందన కనిపించలేదు. ఎవరికివారే గంభీర వదనాలతో ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయినట్టు కనిపించారు.

అంతటితో వూరుకుంటే మమ్మీ ఎందుకు అవుతుంది! మరుసటి వారం ట్రిప్‌లో ఒక్కొక్కరి వద్దకూ వెళ్ళి చిరునవ్వుతో పలుకరించింది. ఎవరికి తగినట్టు వారితో మాటలు కలిపింది. మమ్మీ కలుపుగోలుతనం ముందు వారి గాంభీర్యం పలచబడిపోయింది. నెల తిరిగేసరికి ఫ్రైడే మార్కెట్‌ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అంతకుమునుపు అపరిచితుల్లా ప్రవర్తించేవారు... ఇప్పుడు చిరునవ్వుతో పలకరించుకోవడమూ సరదాగా కబుర్లు చెప్పుకోవడమూ ఆరంభించారు. అందరిలోనూ మమ్మీ ఎంత పాపులర్‌ అయిపోయిందంటే, ఎప్పుడైనా తాను రావడం కాస్త ఆలస్యమైతే అంతా తనకోసం ఎదురుచూడటం ఆరంభించారు- బస్‌ క్రూతో సహా!

‘‘మమ్మీ, యు ఆర్‌ గ్రేట్‌!’’ అన్నాను మనస్ఫూర్తిగా.

‘‘గ్రేట్‌ ఏముందే పిచ్చిపిల్లా, నేను చేసిందేముంది... సాటి మనిషిగా ఓ పలకరింపూ, ప్రేమతో చిన్న నవ్వూ, అంతే కదా!’’ అంది మమ్మీ నవ్వుతూ.

* * *

చదువు పూర్తికాగానే క్యాంపస్‌ సెలక్షన్లో నాకు ఉద్యోగం రావడమూ, ఆనక పెళ్ళి కావడమూ జరిగిపోయాయి. నా భర్తా, నేనూ పనిచేసేది బెంగళూరులో. ఇద్దరమూ కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో పనిచేస్తున్న కారణంగా, అవి పూర్తయేంతవరకూ సంతానం వద్దనుకున్నందున మాకింకా పిల్లలు లేరు.

ఓసారి ఆంధ్రాలోని బంధువుల ఇంట్లో పెళ్ళికని కారులో బయలుదేరాం నేనూ, మా ఆయనా. డెస్టినేషన్‌ని సమీపిస్తూండగా ఓ వూళ్ళొ కారు ట్రబుల్‌ ఇచ్చింది. మా ఆయన మెకానిక్‌ని వెదుక్కుంటూ వెళ్తే, నేను కారు దిగి పరిసరాలను పరికించాను. అది డాడీ పనిచేసిన వూళ్ళలో ఒకటి.

అదిగో, అప్పుడు జరిగింది ఆ సంఘటన...

ఈవెనింగ్‌ వాక్‌కి వెళుతూన్న వయసైపోయిన స్త్రీలు ఇద్దరు నన్ను చూసి దగ్గరకు వచ్చారు. నా ముఖంలోకి పరీక్షగా చూసి ‘‘నువ్వు బ్యాంక్‌ మేనేజర్‌గారి భార్య త్రిపుర కూతురివి కదూ?’’ అనడిగింది ఒకావిడ.

మమ్మీ పోలిక నాది. ఔనన్నట్టు తలూపాను.

అంతే! ఆప్యాయంగా నన్ను కౌగిలించేసుకున్నారు ఇద్దరూ. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు, నేను మొహమాటపడుతున్నా వదలకుండా.

‘త్రిపుర కూతురు వచ్చిందన్న’ వార్త క్షణాల్లో వూరంతా పాకేసినట్టుంది... ఆడవాళ్ళ గుంపు వచ్చి చేరింది అక్కడ. మమ్మీ గురించి ఆసక్తిగా అడిగారు అందరూ.

మమ్మీ పోయి అయిదేళ్ళయిపోయింది. మమ్మీ లేని జీవితాన్ని జీర్ణించుకోలేని డాడీ, ఉద్యోగంలో వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని, ఋషీకేశ్‌లో దైవసన్నిధిలో స్థిరపడిపోయారు.

మమ్మీ ఇకలేదని తెలియడంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంతా. మమ్మీ జ్ఞాపకాలను కలబోసుకున్నారు. ‘ఆ నవ్వులతల్లిని పిన్నవయసులోనే తీసుకుపోవడానికి ఆ దేవుడికి మనసెలా ఒప్పిందో’ అంటూ దేవుణ్ణి తిట్టుకున్నారు.

వారి బలవంతం మీద ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాం.

మర్నాడు బయలుదేరుతుంటే ‘‘వీలైనప్పుడల్లా వస్తూండమ్మా, నిన్ను చూస్తుంటే మీ అమ్మను చూసినట్టే ఉంది’’ అంటూ, అంతా పసుపూ కుంకుమలతోపాటు జాకెట్‌ ముక్కలు పెట్టారు నాకు, వద్దంటున్నా. వారి ఆప్యాయతకూ అమ్మమీద వారికి ఉన్న అభిమానానికీ స్నేహభావానికీ నా మనసు ఆర్ద్రమయింది.

చిన్నప్పట్నుంచీ బాగా చదువుకోవడం, రకరకాల పిండివంటలు చేయడం మొదలుకుని జీవితాన్ని పద్ధతిగా తీర్చిరిద్దుకోవడందాకా- ఎన్నో సంగతులను నాకు పక్కనే ఉండి చెబుతూ నేర్పించింది మమ్మీ. ఒక చిరునవ్వు కాసేపైనా మనుషుల జీవితాలలో ఆహ్లాదపు వెలుగులను వెదజల్లుతుందన్న ఓ సామాన్య సూత్రాన్ని మాత్రం తన ప్రవర్తనతో చెప్పకనే చెప్పింది. కావలసిందల్లా ఎవరో ఒకరు ముందుగా దానికి నాంది పలకడమే!

మమ్మీ ఉన్నన్నాళ్ళూ ఆ సత్యాన్ని గుర్తించలేకపోయినందుకు మొదటిసారిగా విచారం కలిగింది నాకు. ఇకమీదట మమ్మీ చూపిన మార్గాన్ని అవలంబించాలని అప్పటికప్పుడే దృఢంగా నిర్ణయించుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.