close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్వచ్ఛ ఇండోర్‌ వెనుక తెలుగు కలెక్టర్‌

స్వచ్ఛ ఇండోర్‌ వెనుక తెలుగు కలెక్టర్‌

దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఇటీవల రికార్డుకెక్కింది. ఆ రికార్డు వెనక ఓ తెలుగు అధికారి ఉన్నారు. ఆయన పేరు పరికిపండ్ల నరహరి. ఇండోర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న నరహరి ‘లాడ్లీ లక్ష్మీ యోజన’లాంటి అద్భుత పథకానికి రూపకర్త కూడా. సమర్థమైన, నిజాయతీగల ఐఏఎస్‌గా పేరు సంపాదించుకున్న నరహరి నడిచిన బాట ఓ స్ఫూర్తి పాట. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

నేను పుట్టింది ఒకప్పటి కరీంనగర్‌ జిల్లా, రామగుండం మండలం, బసంత్‌ నగర్‌లో. నాన్న టైలర్‌. వరంగల్‌ జిల్లా నుంచి అక్కడికి ఉపాధి కోసం వచ్చారు. అక్కడి ఇండియన్‌ మిషన్‌ సెకండరీ స్కూల్లో చదువుకున్నాను. టెన్త్‌లో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చాను. అమ్మానాన్నల సంతానం ఆరుగురం. అందుకే నా ఇంటర్మీడియెట్‌ చదువు ఇంట్లో భారం కాకూడదని ‘ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌(ఏపీఆర్‌జేసీ)’లో సీటు సంపాదించి కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎంపీసీ గ్రూపులో చేరాను. అక్కడ బోధన చాలా బావుండేది. కానీ భోజనం మాత్రం తినడానికి కష్టంగా ఉండేది. 1992-94 మధ్య అక్కడ చదివాను. రాత్రి భోజనం సాయంత్రం ఆరింటికే తినేసి నిద్రపోయి రాత్రి పన్నెండింటికి లేచి అయిదింటి వరకూ చదువుకునేవాణ్ని. అందరూ పన్నెండు వరకూ చదివేవారు. దాంతో బల్బు నుంచి వెలుగు తక్కువగా వచ్చేది. పన్నెండు తర్వాత ఒకట్రెండు లైట్లు వేస్తే వెలుగు బాగా వచ్చేది. ఇంటర్లో కాలేజీ టాపర్‌గా నిలిచాను. ఐఐటీ ప్రవేశ పరీక్ష రాశాను కానీ సీటు రాలేదు. నా లక్ష్యం ఐఏఎస్‌. హైదరాబాద్‌లో అయితే శిక్షణ సంస్థలు ఉంటాయనిపించింది. అక్కడి వాసవీ కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాను.

రెండో ప్రయత్నంలో
ఇంజినీరింగ్‌ చదివే సమయానికి ఇంట్లో ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండేది. దాంతో ఇంట్లోవాళ్లమీద ఆధారపడకుండా ట్యూషన్లు చెప్పేవాణ్ని. తర్వాత పెద్ద తమ్ముడూ, చెల్లీ నా రూమ్‌లోనే ఉంటూ చదువుకున్నారు. నేను ఇంజినీరింగ్‌ చదువుతూనే మరోపక్క సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతుండేవాణ్ని. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సివిల్స్‌కి ప్రిపేరవుతున్నవారితో పరిచయాలు పెంచుకొని గైడెన్స్‌ తీసుకునేవాణ్ని. 1998లో ఇంజినీరింగ్‌ పూర్తయింది. ఓయూ పరిధిలో మెకానికల్‌ విభాగంలో ఫస్ట్‌ వచ్చాను. నాల్కో లాంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చాయి. కానీ నా లక్ష్యానికి దూరమవుతానేమోనని వాటిలో చేరలేదు. తర్వాత హైదరాబాద్‌లోని ఏపీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటూ 1999లో సివిల్స్‌ రాశాను. అప్పుడు ప్రిలిమ్స్‌కి ఎంపికకాలేకపోయాను. అదే సంవత్సరం ‘ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌’ పరీక్షద్వారా హైదరాబాద్‌లోని ‘ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఆర్కి)’లో అసిస్టెంట్‌ సైంటిస్ట్‌గా ఎంపికయ్యాను. అక్కడ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి సిద్ధమయ్యాను. రెండో ప్రయత్నంలో 2001లో 78 ర్యాంకు వచ్చింది. మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌కు ఎంపికయ్యాను.

అదే స్ఫూర్తి
స్కూల్‌ రోజుల్లో చదువుతోపాటు ఆటలూ, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాణ్ని. అలా అన్నింటిలోనూ ప్రవేశం ఉన్నపుడే ఆలోచనల పరిధి పెరుగుతుంది. నేను పదో తరగతి చదువుతున్నపుడు- ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల అధికారిగా ఉన్న భన్వర్‌లాల్‌ కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా ఉండేవారు. అక్కడ ‘అక్షర ఉజ్వల’ పేరుతో వయోజన విద్యా కార్యక్రమాన్ని చేపట్టారు. మా స్కూల్‌ తరఫున ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. సాయంత్రం ఆ గ్రామానికి వెళ్లి వయోజనులకు చదువు చెప్పేవాళ్లం. అప్పుడు కలెక్టర్‌ గారిని ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి ఉద్యోగంలో ఉంటే సమాజానికి సేవ చేయొచ్చనిపించింది. అలా ఐఏఎస్‌ అవ్వాలన్న నా కోరికకు బీజం పడింది. నా ఉద్దేశంలో ఐఏఎస్‌ అంటే అధికారం కాదు, ప్రజాసేవకు ఉన్నత అవకాశం. ఆ ఆలోచనతోనే నేటికీ పనిచేస్తాను. ప్రారంభంలో రాజకీయ నాయకులతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇండోర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్నపుడు ఒక రాష్ట్ర మంత్రితో గొడవైంది. అవినీతికి తావులేదని చెప్పినందుకు నన్ను బదిలీ చేయించారు. ఆ సమయంలో మూడు రోజులపాటు మున్సిపల్‌ కార్యాలయ సిబ్బంది విధులకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు. కొన్ని సంఘాలు నగర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ తర్వాత నా దారి సరైనదేననీ, ప్రజాధనాన్ని కాపాడటం నా బాధ్యతనీ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లాను. నాకు పనే ముఖ్యమన్న సంగతి మెల్లమెల్లగా అధికార, పాలక వర్గాలకు అర్థమైంది. ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాల బాధ్యతల్నీ అప్పగించడం మొదలుపెట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ స్థానం నుంచి నన్ను ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా మార్చారు. ఆ సమయంలో... ‘రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోంది. గ్వాలియర్‌, చంబల్‌ ప్రాంతంలో 1000 మంది మగపిల్లలకు 850 మంది ఆడపిల్లలే ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ఏదైనా చేయాలి’ అని ముఖ్యమంత్రి ఒక సమావేశంలో చెప్పారు. ప్రధాన కార్యదర్శి నాకు ఆ బాధ్యత అప్పగించారు. దీనికి సంబంధించి పథకాలుంటే తెలుసుకుందామని కొన్ని రాష్ట్రాలకు వెళ్లాను. అక్కడా పరిష్కారం కనిపించలేదు. ఆడపిల్లల భ్రూణహత్యలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని ఆ రంగంలో పనిచేస్తున్న సామాజికవేత్తల్ని కలిసి మాట్లాడాను. వరకట్న సమస్యే ప్రధానమని చెప్పారు. అమ్మాయి అంటే ఆర్థిక భారమనే భావనలో సమాజం ఉందన్నారు. ఆ భావాన్ని తీర్చితే సమస్యని పరిష్కరించవచ్చనిపించింది. అందుకోసం కొన్ని మార్గదర్శకాలను సూచించాను. అమ్మాయి పుట్టగానే ఆమె పేరున రూ.30 వేలు బ్యాంకులో పొదుపు చేయడం, ఆమెకు 18 ఏళ్లు వచ్చాక లక్ష రూపాయలు అందివ్వడం... ఇలాంటివన్నీ అందులో ఉన్నాయి. అలాంటపుడు లక్ష్మీదేవి పుట్టిందన్న భావన కలుగుతుందనేది నా ఉద్దేశం. ఆ మార్గదర్శకాలతోనే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ పథకాన్ని 2007లో ప్రారంభించింది. తర్వాత తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చింది కూడా. ఆడపిల్లల నిష్పత్తి వెయ్యికి 900 దాటింది. ఈ పథకం స్ఫూర్తితో దేశంలోని 13 రాష్ట్రాలు ఇలాంటి పథకాన్ని తెచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘బంగారు తల్లి’గా అమల్లో ఉంది. దీని స్ఫూర్తితో కేంద్రం ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నాకు అప్పగించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో సింగ్రౌలీ జిల్లాలో 25వేల ఎకరాల భూసేకరణ ఒకటి. అక్కడ బొగ్గు గనులు ఎక్కువ. ఆ చుట్టుపక్కల విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కోసం కలెక్టర్‌, ఇతర అధికారులు గ్రామాలకు వెళ్లినపుడు జనాలు ఆగ్రహంతో వాళ్లపైకి రాళ్లు విసిరి నిరసన తెలియజేశారు. దాంతో ఆ అధికారుల్ని కూడా బదిలీచేయాల్సి వచ్చింది. తర్వాత నన్ను అక్కడికి కలెక్టర్‌గా పంపారు. మూడేళ్లపాటు అక్కడ ఉండి ప్రజలకు అత్యుత్తమమైన ప్యాకేజీ, పునరావాసం కల్పించి భూసేకరణ విజయవంతంగా పూర్తిచేశాను. సమాజంలో నిజాయతీకి విలువా గుర్తింపూ తప్పక ఉంటాయి. కాకపోతే దానికి కాస్త సమయం పడుతుంది. ఆలోపే విలువల్ని తాకట్టు పెట్టకూడదు.

భ్రూణహత్యలు తగ్గాయిలా...
గ్వాలియర్‌కు 2011లో కలెక్టర్‌గా వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా ముందుగా స్థానిక సమస్యల్ని మూడు నెలలపాటు గమనించి వాటి పరిష్కారం దిశగా ఆలోచిస్తాను. గ్వాలియర్‌లో భ్రూణహత్యలు ఇంకా జరుగుతున్నాయని తెలుసుకున్నాను. దాంతో ఆడపిల్లల ప్రాధాన్యాన్ని వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేయించాను. నాలుగు రోడ్ల కూడళ్లలో తల్లిదండ్రులు ఆడపిల్లల్ని లాలిస్తున్న విగ్రహాల్ని ఏర్పాటుచేయించాను. మా నాన్నకి కూతురు కావాలని కోరిక. ఆరో బిడ్డగా అమ్మాయి పుట్టింది. ఈ విషయాన్ని చాలా సమావేశాల్లో చెప్పేవాణ్ని. లింగ నిర్ధారణ చేసి చెప్పే సోనోగ్రఫీ కేంద్రాల్లో ‘యాక్టివ్‌ ట్రాకింగ్‌ డివైస్‌’లను ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల్లో గర్భిణీలకు స్కానింగ్‌ చేసే పరికరాన్ని పొట్టపైన పెట్టగానే యాక్టివ్‌ ట్రాకింగ్‌ పరికరాలద్వారా అక్కడ ఆడియో, వీడియో రికార్డింగ్‌ మొదలవుతుంది. గ్వాలియర్‌లో 100 సోనోగ్రఫీ కేంద్రాల్లో వీటిని ఏర్పాటుచేశాం. అక్కడ రికార్డ్‌ అయ్యే వీడియోని నా కార్యాలయంలోంచే చూడొచ్చు. ఆ వీడియోల్లో దొరికిన ఇద్దరు ముగ్గురు వైద్యుల్ని జైలుకి పంపాం. అనుమానం వచ్చిన కేంద్రాలపైన నిఘా పెంచాం. రెండేళ్లలో మార్పు వచ్చింది. ‘బేటీ బచావో, బేటీ పఢావో’లో ఈ గ్వాలియర్‌ మోడల్‌ని దేశవ్యాప్తంగా అమలులో పెట్టాలని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ దగ్గర దారి
గ్వాలియర్‌ పట్టణజనాభా ఎక్కువగా ఉన్న జిల్లా. విస్తీర్ణం కూడా ఎక్కువ. ప్రభుత్వ అధికారులూ, ప్రజల మధ్య దూరం ఎక్కువగా ఉందనిపించింది. ఆ దూరం తగ్గించడానికి సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకున్నాను. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో ఖాతాలు తెరిచి ప్రజా సమస్యల్ని నాతో పంచుకోమన్నాను. వారంలోనే నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ గురించి ప్రజల్లోకి సమాచారం వెళ్లింది. ఫేస్‌బుక్‌లో చెప్పిన సమస్యల్ని సంబంధిత శాఖకు వెంటనే తెలియజేసేవాణ్ని. ఉద్యోగమేళాలూ, రుణాలూ, స్వయం ఉపాధి పథకాల గురించీ సోషల్‌ మీడియాద్వారా తెలియజేస్తాను. ప్రస్తుతం నా ఫేస్‌బుక్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నా తర్వాత ఇతర అధికారులూ సోషల్‌ మీడియాలోకి వచ్చారు. ప్రజల్లో కలెక్టర్‌ స్పందిస్తారన్న ముద్ర పడింది. సమస్యల్ని పరిష్కరించకుంటే వ్యతిరేక ప్రచారం వచ్చే ప్రమాదమూ ఉంటుంది. ప్రతి సోమవారం రెండు గంటలపాటు జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశమవుతాను. ఆ సమయంలో సోషల్‌ మీడియాలో, ప్రజావాణిలో గుర్తించిన సమస్యల్ని ఎంతవరకూ పరిష్కరించారో అడిగి తెలుసుకుంటాను. దివ్యాంగులూ, వృద్ధులూ, గర్భిణీలూ వచ్చేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ, ఆసుపత్రులూ, ఆలయాలూ, పాఠశాలలూ, పర్యాటక ప్రాంతాలలో ర్యాంప్‌లూ, రైలింగ్‌లను ఏర్పాటుచేయాలనేది చట్టం. కానీ ఎవరూ దాన్ని పట్టించుకోరు. గ్వాలియర్‌లో ఈ చట్టం కచ్చితంగా అమలయ్యేలా చూశాను. మాట విననివారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. ఏడాది వ్యవధిలో అందరినీ దారికి తెచ్చాం. ఆమిర్‌ఖాన్‌ ‘సత్యమేవజయతే’ కార్యక్రమంలో గ్వాలియర్‌లో తెచ్చిన ఈ మార్పుని చూపించి మెచ్చుకున్నారు. అది చాలా సంతృప్తినిచ్చింది. దీనికి రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నాను కూడా.

స్వచ్ఛ బాటలో
నాలుగేళ్లు గ్వాలియర్‌ కలెక్టర్‌గా పనిచేశాక, 2015లో ఇండోర్‌కి బదిలీ అయింది. ఇక్కడా సోషల్‌ మీడియా సాయంతో సమస్యల పరిష్కారాన్ని కొనసాగిస్తున్నాను. గ్వాలియర్‌లానే ఇండోర్‌నూ దివ్యాంగుల అనుకూల నగరంగా మార్చాను. ‘స్వచ్ఛ్‌ భారత్‌ సర్వే 2017’లో ఇండోర్‌కు మొదటి స్థానం వచ్చింది. దీనికోసం రెండేళ్లనుంచి అధికార యంత్రాంగమంతా ప్రణాళికా బద్ధంగా పనిచేస్తోంది. రోడ్లపైన పెద్ద చెత్త కుండీలు లేకుండా ఇళ్లనుంచే చెత్తను సేకరించి ట్రాలీల్లో తరలిస్తున్నాం. వేల సంఖ్యలో వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్లని నిర్మించాం. ‘హో హల్లా...’ అంటూ సాగే ఓ స్వచ్ఛ భారత్‌ గీతాన్ని ఇండోర్‌కు ప్రత్యేకంగా రాయించి గాయకుడు షాన్‌చేత పాడించాం. నా ఫోన్‌ కాలర్‌ ట్యూన్‌ కూడా ఆ పాటే.

జీవితంలో ఎన్నో కష్టాల్ని చూశాను, అనుభవించాను. ఆ జ్ఞాపకాలు ఎంతలా పాతుకుపోయాయంటే, ఎవరైనా వారి సమస్యల్ని నాతో చెబుతుంటే వెంటనే గతం గుర్తుకొస్తుంది. నేను అక్కణ్నుంచి ఇక్కడికి వచ్చింది ఇలాంటివాళ్ల సమస్యల్ని పరిష్కరించడానికే కదా అనిపిస్తుంది. అదే నాకు పనిలో స్ఫూర్తినిస్తుంది.

ఇంకొంత...

తండ్రి సత్యనారాయణ, తల్లి సరోజన. వీరి ఆరుగురి సంతానంలో నరహరి మూడోవారు. నరహరి సోదరులంతా ఇంజినీర్లే. చెల్లెలు అమర్‌కంఠక్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
* శ్రీమతి పేరు భగవద్గీత, గ్వాలియర్‌లో సైకాలజీ ప్రొఫెసర్‌. పిల్లలు... శ్రీగౌరి ఆలయ, అక్షర్‌.
* బ్యాడ్మింటన్‌ ఆడటం, ట్రెడ్‌మిల్‌ వాకింగ్‌, స్విమ్మింగ్‌... వీటిలో ఏదో ఒకటి రోజూ చేస్తారు.
* పుస్తకాలు బాగా చదువుతారు. ఇష్టమైన నవల ‘ఏడు తరాలు’.
* సొంత రాష్ట్రానికి తరచూ వస్తారు. ఇక్కడి అధికారులతో ఆలోచనల్ని పంచుకోవడానికి ముందుంటారు. విద్యార్థులకు స్ఫూర్తి పాఠాలు చెప్పమన్నా ఎంతో ఆసక్తి చూపిస్తారు.
* ప్రస్తుతం ఇండోర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో ఉన్నారు.
* అంధులకు మసాజ్‌ చేయడంలో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేలా ‘పంచ్‌ స్పర్శ్‌’ పథకాన్ని రూపొందించారు.
* ‘ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన’లో భాగంగా ఇండోర్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో 90 శాతానికిపైగా రైతులచేత పంట బీమా కట్టించారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.