close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సెల్లుకి-సెల్లు

సెల్లుకి-సెల్లు
- గంటి ఉషాబాల

దయం నా కూతురు రమ్య అన్న మాటలు విన్నప్పటినుంచీ నా కడుపు మండిపోతోంది. ఇంట్లో అందరిమీదా పీకల వరకూ కోపంగా ఉంది. అసలు నేనొక మనిషిగా ఆనుతున్నానా వీళ్ళకి? నేనేమన్నా వంటింటి యంత్రాన్నా? మిక్సీ, గ్రైండర్‌ ఎంతో నేనూ అంతేనా? బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ చేసిపెట్టే షెఫ్‌నా? అరే, నేనీ ఇంటి ఇల్లాలినన్న విషయం ఎవరూ పట్టించుకోరే. ఎవరిమటుకు వాళ్ళు చేతిలో చాటంత సెల్‌ఫోనొకటి పట్టుకుని కన్నార్పకుండా అద్భుత దృశ్యాలేవో మిస్సయిపోతామేమో అన్నంతగా గుడ్లప్పగించేస్తూ ఉంటారు. నేనో మనిషిని కొంపలో పడి ఉంటానన్న జ్ఞానమే ఉండదు వీళ్ళకు. ఆ తడిమే తెరఫోన్లు- అదే స్మార్ట్‌ఫోనండీ- కనిపెట్టినవాణ్ణి ఎవరూ చూడకుండా నాలుగు తన్నులు తన్నాలనిపిస్తుంది. ఏదైనా అంటే ‘నువ్వూ ఓటి కొనుక్కో, వద్దన్నామా?’ అంటారు - ఏదో సంతలోంచి చింతకాయలు తెచ్చుకోవచ్చుగా అన్నంత ఈజీగా.

ఇంకా నా కూతురు ఏమంటుందో తెలుసా... ‘నీకెందుకమ్మా, ఈ మాడ్రన్‌ గాడ్జెట్లన్నీ, ఇవన్నీ మాలాంటి యంగర్‌ జనరేషన్‌కి. నువ్వు హాయిగా టీవీలో వచ్చే అత్తాకోడళ్ళ ట్రాజెడీ సీరియల్సో, ఏంకర్‌ ఆంటీ షోలో ఆంటీలతో ఆడించే తాడాటా, తొక్కుడుబిళ్ళొ చూసి ఎంజాయ్‌ చెయ్‌’ అంటూ వెక్కిరిస్తుంది. బీటెక్‌ అవగానే క్యాంపస్‌ సెలెక్షన్‌లో ఉద్యోగం సంపాదించింది తను.

ఇక, నా సుపుత్రుడు- చెవిలో ఎప్పుడూ ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ ఇరవై నాలుగ్గంటలూ ఏదో ‘యోయో’ లోకంలోనే ఉంటాడు. ఎప్పుడైనా చెవులు దిబ్బడొస్తే కాసేపు చెవులు మూసుకుని కళ్ళని ఫోనుకప్పగించేస్తాడు. ఏం తింటున్నాడో ఎప్పుడు నిద్రపోతాడో వాడికే తెలీదు. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కూడా గబగబా తలుపు తీసి నీళ్ళు కారుకుంటూనే ‘అమ్మా, నా ఫోనేమైనా మోగిందా?’ అంటాడు. అలా అప్పుడప్పుడూ మాత్రమే వాడు గట్టిగా మాట్లాడతాడు. చేతిలో ఫోనుంటే వాడి గొంతు మూగబోతుంది మరి. ఇక, శ్రీవారు శ్రీశ్రీశ్రీ సుందరమూర్తిగారి సంగతి చెప్పనే అక్కరలేదు. పొద్దున అలారం మోగినది మొదలు వాట్సప్‌లో మెసేజీలూ వీడియోలూ చూసుకుంటూ మంచం మీద మఠం వేసుక్కూర్చుని ‘హహ్హహ్హ’ అని గట్టిగా చూసేవాళ్ళు హడిలి చచ్చేలా నవ్వుతూ కాసేపు కాలక్షేపం చేసి తీరుబడిగా బాత్‌రూమ్‌లోకి వెళతారు. బయటకొచ్చి ఆఫీసుకు లేటయిపోతోందంటూ ఆదరాబాదరాగా అద్దంముందు నిలబడి ముఖానికింత పౌడరు అద్దుకుని ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలో సుత్తివేలులా ఆఫీసుకి బయలుదేరుతారు. ఇన్ని స్మార్ట్‌ఫోన్ల మధ్య ల్యాండ్‌లైన్‌లా నేను. ఇక్కడ పుల్లతీసి అక్కడ పెట్టేవారు లేరు. మరి, నాలాంటి బాధిత ఇల్లాళ్ళ బాధలెవరికెరుక చెప్పండి? నేనో జీవమున్న ప్రాణిననే విషయం వాళ్ళకి గుర్తే ఉండదు. పైగా ఇవాళ పొద్దున్న రమ్య ఏమందనుకున్నారు?

‘అమ్మా, ఫోను గురించి మమ్మల్ని కామెంట్‌ చెయ్యకు. అందరమ్మలూ చేతిలో స్మార్ట్‌ఫోన్లతో ఎంతో ఎదిగి స్మార్ట్‌మమ్మీల్లా తయారవుతుంటే నువ్వేమో ఇంకా ల్యాండ్‌లైన్‌ అమ్మలాగే ఉండిపోయావు. కాస్త ఎదుగు’ అంది. ఎంత మాటంది? నేను ల్యాండ్‌లైన్‌ అమ్మనా... అన్నీ అమర్చిపెట్టే అమ్మ ఇంత లోకువైపోయిందా? అదిగో అప్పటి నుంచీ నాకు కుతకుతలాడిపోతోంది. వీళ్ళకి నా విలువ తెలీడం లేదు. ‘కొత్తొక వింత పాతొక రోత’ అన్నట్టు తయారవుతున్నారు జనం. ఎంతసేపూ వాట్సప్‌లూ ఇన్‌స్టాగ్రాములూ ట్విటర్‌లూ... ఇవేనా జీవితం. కాస్త ఇంట్లోవాళ్ళతోనైనా గడిపే సమయం కేటాయించొద్దూ. నన్నో పల్లెటూరి మొద్దులా జమకట్టి ఎంత లోకువచేసి మాట్లాడుతున్నారు. నేను ‘ఇంటర్మీడియట్‌ ఫ్రమ్‌ ఇరగవరం’ ఏమనుకుంటున్నారో!? మా నాన్న త్వరగా పెళ్ళి చేసేశాడుగానీ, లేకుంటే నేనూ డిగ్రీలూ, పీజీలూ చదివి పేద్ద ఉద్యోగస్తురాలినయ్యేదాన్ని. ఏదిఏమైనా, ఈ పిచ్చింకా ముదిరిపోకముందే వీళ్ళకి ఏదో రకంగా బుద్ధి చెప్పాలి. అప్పుడైనా కాస్త జనజీవన స్రవంతిలో కలుస్తారేమో. ఎంత ఆలోచించినా ఓ దారి కనబడి చావడంలేదు. వంట చేయడం మానేసి హఠం చేద్దామా అంటే భోజనం ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేసి తెప్పించుకుని నన్ను వూరిస్తూ పీకలదాకా మెక్కేస్తారు. ఇలాంటి అనుభవాలు చాలా అయ్యాయి. ఇంతోటి సంబడానికి ఎందుకొచ్చిన ఖర్చులే అని వంటచేసి పడేస్తాను.

సిగరెట్టూ మందులాగే టీవీ, ఫోను లాంటివి కూడా అలవాటు నుంచి వ్యసనంగా మారిపోతున్నాయి. మన బుర్ర ఫలానా దాని గురించి ఆలోచించండి అని బలవంతంగా చెప్పకపోవడంతోనే ఈ అలవాట్లన్నీ వ్యసనాలయి కూర్చుంటున్నాయి... ఇలా నా బుర్రంతా ఆ దిక్కుమాలిన ఫోను చుట్టూ తిరుగుతుండగానే రమ్య గదిలోంచి పెద్దగా కేకలు వినబడటంతో ‘ఏం మునిగిందా’ అని దాని గదిలోకి పరిగెత్తాను.

‘‘చూడమ్మా, వీడు నా ఫోను లాక్కున్నాడు మేనర్స్‌లెస్‌ ఫెలో’’ అంటూ తమ్ముడి మీద కంప్లైంటు.

‘‘చూడవే అమ్మా, ఈ డాన్సు వీడియో. ఈ కుప్పిగంతులన్నీ ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పెట్టింది. ఎంతమంది చూస్తారది, పరువు పోదూ’’ అన్నాడు పెద్ద ఆరిందలా.

‘‘ఆఁ ఏంట్రా... నువ్వు పరువు గురించి మాట్లాడుతున్నావు? మరి నువ్వు చేసిన కామెడీ డబ్‌స్మాష్‌ మాటేవిట్రా? అది చూసి మా ఫ్రెండ్స్‌ అంతా ‘మీ తమ్ముడు భలే బఫూన్‌ క్యారెక్టరే’ అంటూ పళ్ళికిలించి నవ్వుతుంటే, మరి నా పరువు పోలేదూ’’ అంటూ మంచం మీద దిండు తీసి వాడి మొహాన కొట్టింది.

యవ్వనంలో ఉన్న పురుషపుంగవుడు వాడూరుకుంటాడా- బట్టలు ఇస్త్రీ చేసి పక్కన పెట్టిన వేడివేడి ఇస్త్రీ పెట్టె పట్టుకుని దాని మీదకెళ్ళాడు. అది చెయ్యి అడ్డంపెట్టి దాన్ని తోసేయడంతో మోచెయ్యి కాలి, కుయ్యో మొర్రోమని అరవడం మొదలుపెట్టింది. అక్కడేం జరుగుతోందో ఒక్క క్షణం నాకర్థంకాలేదు. తరవాత వాళ్ళిద్దరినీ విడదీసి వాళ్ళు హోరాహోరీగా పోట్లాడుకోవడానికి కారణం నాకు అత్యంత శత్రువైన సెల్‌ఫోనని తెలుసుకుని ‘హతవిధీ’ అనుకుంటూ హాల్లోకొచ్చి ఉసూరుమంటూ సోఫాలో ఇలా వాలానో లేదో కాలింగ్‌బెల్‌ మోగింది. ‘ఈ టైమ్‌లో ఎవరబ్బా- సూర్యాస్తమయానికి ముందు శ్రీవారు గృహప్రవేశం చెయ్యరే’ అనుకుంటూ తలుపు తీశాను. ఆశ్చర్యం, ఎదురుగా శ్రీవారే! చేతిలో స్మార్ట్‌ఫోన్‌లో ఏదో చూస్తూ ఓ కాలు గుమ్మం లోపలా మరో కాలు బయటా పెట్టి నిలబడ్డారు.

‘‘హలో సార్‌, ఇది మీ ఇల్లే. కరక్టు అడ్రస్‌కే వచ్చారు. కాస్త ఇంట్లోకి వేంచేసి ఆ దిక్కుమాలిన ఫోన్‌ చూసుకోండి’’ అంటూ గట్టిగా అరిచాను.

శ్రీవారు మాత్రం కూల్‌గా ‘‘ఆఫీసులో వైఫై ఉండదుకదటోయ్‌. చూడు ఎన్ని మెసేజ్‌లో. వాటిని చూస్తూ నువ్వు తలుపు తీసేలోగా ఇక్కడ నిలబడ్డానంతే. వస్తాను... రాక ఎక్కడికి పోతాను’’ అన్నారు ఫోన్లోంచి ముఖం తిప్పకుండానే.

పిచ్చెక్కి జుట్టు పీక్కోవడమొక్కటే తరువాయి నాకు. ‘ఇదేమి వైపరీత్యంరా భగవంతుడా... వీళ్ళనెలా బాగు చేయాలి... ఓ గాడ్‌ ప్లీజ్‌ సేవ్‌ మీ’ అనుకున్నాను ఎదురుగా ఉన్న వెంకన్నబాబు ఫొటో వంక చూస్తూ. ఓ నాలుగు రోజులు ఆలోచించగా ఆలోచించగా ఓ ఐడియా నా బుర్రలో తళుక్కున మెరిసింది.

తరవాత ఆ ఐడియా మా ఇంటి వాతావరణాన్ని ఎలా మార్చేసిందో చూడండి.

* * *

‘‘అమ్మా, కాఫీ’’ అంటూ అరుస్తోంది నా కూతురు రమ్య.

‘‘మమ్మీ, నేను ఏడున్నరకే కాలేజీకి వెళ్ళాలి. బ్రేక్‌ఫాస్ట్‌ రెడీనా?’’ అంటూ ఓ కేకేసి మళ్ళీ చెవిలో ఇయర్‌ఫోన్స్‌ కుక్కేసి బాత్‌రూమ్‌లో దూరాడు సుపుత్రుడు.

ఇక శ్రీవారు ఉదయరాగంలో వచ్చే ప్రవచనాలు వింటూ వాకింగ్‌కి వెళ్ళినట్టున్నారు. నేను మాత్రం నేను కొత్తగా కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్లో నాకిష్టమైన పాటలు వింటూ ఓరకంట అంతా గమనిస్తున్నాను.

‘‘అమ్మా, ఇంకా లేవలేదూ?’’ గయ్‌మంటూ వచ్చింది రమ్య. నా చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోనూ చెవిలో ఉన్న ఇయర్‌ఫోన్సూ చూసి ఖంగుతింది.

‘‘ఈ ఫోనెప్పుడు కొన్నావూ, పైగా లేటెస్ట్‌ ఫోన్‌. నీకీ ఫోన్‌ అవసరమా?’’ అంటూ నా చెవిలో ఉన్న ఇయర్‌ఫోన్సు లాగేసింది.

‘‘అబ్బా ఉండవే... ఎన్నాళ్ళయిందో ఈ ఓల్డ్‌ మెలొడీస్‌ విని, ఎప్పుడో చిన్నప్పుడు ట్రాన్సిస్టర్‌లో వినేదాన్ని. నన్ను డిస్ట్రబ్‌ చెయ్యకు’’ అన్నాను తెచ్చిపెట్టుకున్న కోపంతో.

‘‘సరే, కొనుక్కుంటే కొనుక్కున్నావుగానీ, పనంతా అయ్యాక వినొచ్చు కదా ఆ మెలొడీసేవో. అయినా ఇంట్లో ల్యాండ్‌లైన్‌ ఉండగా ఇంత ఖరీదైన ఫోన్‌ నీకవసరమా?’’ అంది ఫోన్‌ని అటూ ఇటూ తిప్పుతూ.

‘‘అంటే అక్కడికి నువ్వొక్కర్తివే ఖరీదైన ఫోను కొనుక్కోవాలా? ఓ గవర్నమెంటు ఆఫీసర్‌ పెళ్ళాన్ని నేను కొనుక్కోకూడదా?’’ అన్నాను అక్కసుగా.

‘‘సర్లేగానీ నాక్కొచెం కాఫీ ఇవ్వమ్మా... రాత్రంతా నిద్రలేదు. తలనొప్పిగా ఉంది.’’

‘‘తలనొప్పి ఎందుకొచ్చిందో పాపం’’ అన్నాను.

‘‘యూట్యూబ్‌లో సినిమా చూస్తూ ఉండిపోయానమ్మా’’ అనేసి గబుక్కున నాలిక్కరుచుకుంది.

అంతా గమనిస్తున్న నేను మరింత బిగుసుకుపోయి ‘‘నో బేబీ, నేనీరోజు బిఫోర్‌ నైన్‌ కాలు మంచంమీద నుంచి కిందపెట్టను’’ మ్యూజిక్‌కి అనుగుణంగా కాళ్ళూపుతూ అన్నాను.

ఈలోగా బాత్‌రూమ్‌లోంచి బయటికి వచ్చిన నా ‘యోయో’ పుత్రుడు వివేక్‌ నా గదిలోకి తొంగిచూసి ‘‘అదేంటీ మమ్మీ ఇంకా లేవలేదూ, ఫీవరా?’’ అన్నాడు.

‘‘ఫీవరా పాడా. ఆవిడో స్మార్ట్‌ఫోను కొనుక్కుందిలే. ఓల్డ్‌ మెలొడీసట వింటూ పడుకుంది. తొమ్మిది దాటితేగానీ మంచం దిగదట. ఇప్పుడు డిక్లేర్‌ చేసింది. నేనూ, నాన్నా ఆఫీసుకెళ్ళాలా... మరి నువ్వు కాలేజీకి వెళ్ళాలా...’’ అంటూ నామీద తమ్ముడికి కంప్లైంట్‌ చేస్తుండగానే పాపం దాని ఫోన్‌ మోగింది. పరిగెత్తింది ఫోను అటెండవడానికి.

‘‘నో ప్రాబ్లమ్‌ మమ్మీ, కేరీఆన్‌... ఎంజాయ్‌ విత్‌ యువర్‌ న్యూ ఫోన్‌. మేం బయట తినేస్తాంలే’’ అంటూ నాకు భరోసా ఇచ్చి, వాడి గదిలోకి వెళ్ళాడు. అంతకన్నా ఎక్కువసేపు నిలబడి మాట్లాడే అలవాటు లేదు వాడికి మరి.

ఈలోగా చెమటలు కక్కుతూ వాకింగ్‌ నుండి ఇంటికొచ్చినట్టున్నారు శ్రీవారు. ‘‘మంచినీళ్ళు’’ అని కేకేశారు. నేను వినీ విననట్టు వూరుకుని ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వింటునట్టు పోజిస్తూ పడుకునే ఉన్నాను. ఎవరూ మంచినీళ్ళు ఇవ్వకపోయేసరికి ‘‘రమ్యా, అమ్మేదీ?’’ గట్టిగా అరిచారు. ఆయన గోడు పట్టించుకునే నాధుడేడీ అక్కడ. ఎవరిమటుకు వాళ్ళు ఫోన్లో బిజీ. ‘‘మణీ’’ అంటూ బెడ్‌రూమ్‌లోకొచ్చారు. అక్కడ నన్నూ, నా చేతిలో ఫోనూ, చెవిలో ఇయర్‌ఫోన్సూ చూసి ‘వా క్యా సీన్‌ హై’ అని నవ్వి, ‘‘బాగుందమ్మా, కొత్త బిచ్చగాడు పొద్దెరగడని... కోతికి కొబ్బరికాయలా నీకా ఫోను. ఇప్పుడు టైమ్‌ ఎనిమిది. నా ముఖాన కాసిన్ని కాఫీనీళ్ళు పోస్తే బాత్‌రూమ్‌కి వెళ్ళాలి’’ అన్నారు కోపం నటిస్తూ.

ఏ మాటకామాటే పాపం, మా ఆయన ‘కోపం’ అనే రసాన్ని నటించడంలో చాలా పూర్‌ సుమండీ. ఆయన మాటలకు నేను చెవిలోంచి ఆ ఈకలు (అవేనండీ ఇయర్‌ ఫోన్స్‌) తీసి, ‘‘మనింట్లో మూడు కోతులకు జతగా ఓ కొత్త కోతి చేరిందండోయ్‌’’ అనేసి మళ్ళీ వాటిని చెవిలో పెట్టేసుకున్నాను. ఈసారి ఆయనకి నిజంగానే కోపం వచ్చినట్టుంది. నావైపు కొరకొరా చూస్తూ బాత్‌రూమ్‌లో దూరారు. ‘తనదాకా వస్తేగానీ అన్నట్టు- నా గోడు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇరవైనాలుగు గంటలూ ఆ ఫోనుతోనే. అరే ఇన్నాళ్ళకు నేనో రెండు గంటలు ఫోన్‌లో పాటలు వింటుంటే ఎంత రాద్ధాంతం చేస్తున్నారు?’ అనుకుంటూ మొండిగా అలాగే పడుకున్నాను. ఎవరిమటుకు వాళ్ళు తయారై, నన్ను పలకరించకుండా, నాతో చెప్పకుండానే తలుపు ధడాలు ధడాలున వేస్తూ వెళ్ళిపోయారు.

‘హమ్మయ్య’ అనుకుంటూ లేచి చూద్దును కదా ఇల్లంతా కిష్కిందలా ఉంది. అలవాటులేని పడక మూలాన నడుం కూడా నొప్పెట్టింది. పనమ్మాయికి ఫోన్‌ చేసి పిలిపించి ఇల్లంతా శుభ్రం చేయించి ఇంత ఉడకేసుకుని తినేసరికి మధ్యాహ్నమయింది.

మళ్ళీ సాయంత్రం నా నాటకానికి తెరలేచింది. అందరూ ఇంటికి చేరే టైముకి చేతిలో ఫోనుతో హాల్లో కూర్చున్నాను- యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ. ముందు వివేక్‌ వచ్చాడు. ‘‘అమ్మా, ఆకలేస్తోంది... తినడానికేమైనా ఉన్నాయా?’’ అన్నాడు. పాపం వాణ్ణి చూస్తే జాలేసింది. కానీ, నా ఎజెండాలో జాలి అనేది లేదు. అందుకనే వాడి మాట విననట్టే వూరుకున్నాను.

ఇంతలో రమ్య కూడా వచ్చింది. వస్తూనే ‘‘కాస్త మంచినీళ్ళివ్వమ్మా’’ అంటూ సోఫాలో కూలబడింది. నేను కదలకపోయేసరికి నా చేతిలో ఫోన్‌ చూసి గయ్‌మని లేచింది. ‘‘నీకిదెక్కడ పిచ్చిపట్టిందీ, మమ్మల్నిలా చంపుకు తింటున్నావ్‌. రోజూ నేనొచ్చేసరికి అన్నీ రెడీగా అందించేదానివి’’ అంటూ కోపంగా హ్యాండ్‌బ్యాగ్‌ విసిరికొట్టి గదిలోకెళ్ళి తలుపేసుకుంది. ఇంతలో శ్రీవారూ ఇల్లు చేరారు. ‘ఈయనేం రుసరుసలాడతారో’ అనుకుంటూ టీవీలో వచ్చే సీరియల్స్‌నే యూట్యూబ్‌లో చూస్తున్నట్టు నటిస్తూ అంతా గమనిస్తున్నాను. రోజూ ఈపాటికి డిన్నర్‌ రెడీ చేసి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఎదురుచూసేదాన్ని. పాపం, వీళ్ళ కడుపు మాడ్చేస్తున్నాను. అయినా తప్పదు. ‘ఒక మార్పు కోసం, ఒక విప్లవం రావాల్సిందే’ అనుకుంటూ కంటిన్యూ అయిపోయాను. పాపం, ఆయన ఏమనుకున్నారో మౌనంగా బట్టలు మార్చుకుని వంటగదిలోకి వెళ్ళారు. కుక్కర్‌లో అన్నం, పప్పూ పెట్టేసినట్లున్నారు.

‘‘మణీ, రమ్యా, వివేక్‌ భోజనానికి రండి’’ అని పిలిచారు. చెప్పొద్దూ, దిక్కుమాలిన డ్రామా కాదుగానీ కడుపులో కరకరలాడుతోంది. పిల్లిలా వెళ్ళి డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టినవి ‘ఆకలి రుచెరగదు’ అనుకుంటూ తినేశాను. అక్కడి వాతావరణం తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. పిల్లలు నావంక కచ్చగా చూస్తున్నారు.

ఇంతలో నాలోని నటీమణి నిద్ర లేచింది. ‘‘ఏయ్‌ రమ్యా, నా వాట్సప్‌ డి.పి. చూశావా?’’ అన్నాను ఫోన్‌ చేతిలోకి తీసుకుంటూ.

‘‘ఛీ పో!’’ అంటూ అది గదిలోకి వెళ్ళిపోయింది.

‘‘పోనీ నువ్వు చూడరా వివేక్‌ ఎలా ఉందో’’ అన్నాను.

‘‘వాట్‌ మమ్మీ సిల్లీగా’’ అంటూ వెళ్ళిపోయాడు.

‘అవును నేను చేస్తే అది సిల్లీ... మీరు చేసేదేమిటో’ అనుకుంటూ మళ్ళీ హాల్లోకొచ్చి ‘శభాష్‌’ అనుకుంటూ నా భుజం నేనే తట్టుకుని ఫోన్‌ పట్టుకుని కూర్చున్నాను.

కాసేపయ్యాక ఆయన హాల్లోకొచ్చి నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ ‘‘రమ్యా, వివేక్‌ ఇలా రండి’’ అని గట్టిగా పిలిచారు. ఆయన అలా అరిచినట్లుగా పిలిచేసరికి వాళ్ళూ బిక్కుబిక్కుమంటూ వచ్చి కూర్చున్నారు. ఆశ్చర్యం, వాళ్ళిద్దరి చేతుల్లోనూ ఫోన్లు లేవు. చెప్పొద్దూ, నేనూ ఉలిక్కిపడి సర్దుక్కూర్చున్నాను. ఉపోద్ఘాతమేం లేకుండా ‘‘అమ్మ ఇలా అయిపోవడానికి కారణమెవరో తెలుసా... మనమే’’ అంటూ ఒక్క క్షణం ఆగారు. కొంపతీసి నాకు ఏ కొరివి దెయ్యమో పట్టిందనుకోవట్లేదు కదా. మళ్ళీ ఆయనే గొంతు సవరించుకుని ‘‘చూడండి, ఏదైనా ‘అతిహాని మితహాయి’ అన్నట్టు మనం ఇంట్లో ఇంకో మనిషి ఉందన్న ఇంగితం లేకుండా ఫోన్లతో గడిపేస్తూ అమ్మను పట్టించుకోకపోవడంవల్లే తనిలా అయిపోయింది. లేకపోతే అమ్మ మనల్ని పట్టించుకోకుండా ఒక్క క్షణమైనా ఉందా? అప్పుడు మనకా విలువ తెలీలేదు. ఇందులో నా తప్పూ ఉందనుకోండి...’’ అనేసి, వాతావరణం తేలిక చేయడానికన్నట్టు నవ్వుతూ నావైపు చూశారు. అప్పటిదాకా బింకంగా ఉన్న నేను ఒక్కసారిగా బావురుమన్నాను. ఆయన నాపక్కకొచ్చి కూర్చుంటూ ‘‘చాలామంది ఇళ్ళలో జరిగే భాగోతమే ఇది మణీ. మనకేం కావాలో ఎంతకావాలో తెలీక ‘కొత్త వింత పాత రోత’ అన్నట్టుగా ప్రవర్తిస్తే ఇదిగో ఇంట్లో ఒకళ్ళమధ్య ఒకళ్ళకి సయోధ్య కరువై ఎవరికివారే అన్నట్టు తయారవుతుంది. అమ్మో, ఒక్కరోజుకే నిన్నిలా చూడ్డం భరించలేకపోయాం. మరి నువ్వు ఎన్నేళ్ళనుంచో ఇదంతా భరిస్తున్నావు. అందుకనే నేనో నిర్ణయం తీసుకుంటున్నాను’’ చెప్పడం ఆపి, అందరి ముఖాలవైపూ చూశారు.

ఏవిటా అది అనుకుంటూ అందరం ఆత్రంగా ఆయనవైపే చూశాం.

‘‘ఏం లేదు, ఇంట్లో వైఫై తీయించేద్దామనుకుంటున్నాను’’ అన్నారు.

‘‘అయ్యో, మరి నెట్టూ’’ ముక్తకంఠంతో అన్నారు పిల్లలిద్దరూ.

‘‘రమ్యా, నువ్వు సంపాదించుకుంటున్నదానివి. నీ ఫోన్లో నువ్వే డేటాకార్డు వేయించుకో. ఇక వివేక్‌, నువ్వు నెట్‌ అవసరం అనుకుంటే నీ ప్యాకెట్‌ మనీలోంచి వాడుకో. నేనూ అంతే చేస్తాను. అప్పుడైతే అవసరం మేరకే నెట్‌ వాడతాం. అంతేకాదు, ఇంటికి రాగానే ఫోన్‌కి అతుక్కుపోకుండా అమ్మతో కాసేపు కబుర్లు చెప్పాలి. అలాగే భోజనాల సమయంలో ఫోన్‌ తియ్యకూడదెవరూ’’ అంటూ నావైపు చూస్తూ, ‘‘మణీ, నువ్వనుకున్నట్టు అంతా చెడే కాదు దీనివల్ల. ఈ రోజుల్లో దీని వాడకం తప్పనిసరి కూడా. అన్ని వ్యవహారాలూ ఇప్పుడు దీని ద్వారానే. ప్రతి మనిషీ ఎంతోకొంత దీనిమీద ఆధారపడక తప్పదు. బ్యాంకింగ్‌, షాపింగ్‌, టికెట్‌ రిజర్వేషన్లు, సినిమా టికెట్లు... ఇలా అన్నీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే. ప్రపంచంలో విజ్ఞానం అంతా అరచేతుల్లోనే. మనం తీసుకునేదాన్నిబట్టే ఉంటుంది మంచీ చెడ్డా. చూడు... మొన్నటికి మొన్న పక్కింటి జగన్నాథంగారికి సుస్తీ చేస్తే అర్ధరాత్రిపూట క్యాబ్‌ బుక్‌ చేసి పేటీయంలో డబ్బులు కట్టి వైద్యం చేయించాం కదా. మరి పరోక్షంగా ఆయన ప్రాణం కాపాడింది ఈ స్మార్ట్‌ఫోనే కదా. కాకపోతే మేం దీన్ని నిన్ను నిర్లక్ష్యం చేసే లెవెల్లో వాడేశాం. అది తప్పే. సారీ మణీ’’ అన్నారు.

పిల్లలూ ఆయనకి వంతపాడారు.

హమ్మయ్య, నా పాచిక పారింది కదాని మనసులో పిచ్చిపిచ్చిగా ఆనందిస్తూ, ఇంత సాయం చేసినందుకు నా ఫ్రెండ్‌ శారదకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను- ఎందుకంటే తన ఫోను నాకు అప్పిచ్చి సహకరించినందుకు. ఈ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలీదండోయ్‌... మరి మీరూ చెప్పకండేం. దిగులుతీరి, మనసు ఆనందంతో గంతులేస్తుంటే ‘రేపు ఉదయం ఏం టిఫిన్‌ చెయ్యాలీ, భోజనంలోకి ఏం కూరలు చెయ్యాలీ’ అని ఆలోచిస్తూ ప్రశాంతంగా సంతృప్తిగా నిద్రలోకి జారుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.