close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వియత్నాం... ఓ పచ్చని లోకం..!

వియత్నాం... ఓ పచ్చని లోకం..!

‘అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మొత్తం చూడాల్సిన పని లేదు. ఓ దేశం గురించి తెలుసుకోవడానికి ఆ దేశంలోని అడుగడుగునీ స్పృశించనక్కర్లేదు, ఆ దేశప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ వాళ్ల ఆశయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒక్క నిర్మాణాన్ని చూసినా చాలు... అన్నదానికి ప్రత్యక్ష తార్కాణమే వియత్నాం హోచిమిన్‌ మాసోలియం’ అంటున్నారు అనంతపురానికి చెందిన వేలూరు జయచంద్ర.

క్రౌన్‌ ప్లాజా హోటల్‌, హనోయ్‌ నగరం, వియత్నాం. ఉదయం ఆరు గంటలు. గది చల్లగా ఉంది. దుప్పటి తియ్యాలనిపించడం లేదు. నిద్ర లేవగానే కర్టెన్‌ తొలగించడం, హనోయ్‌ నగర అందాలను చూడటం... గత రెండు రోజులుగా అలవాటైపోయింది. విశాలమైన రోడ్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చటిచెట్లు, ఉద్యానవనాలు, ఎత్తైన భవనాలతో హనోయ్‌ నిండుగా మనోహరంగా ఉంది. లేత బూడిదరంగు ఆకాశంలో అక్కడక్కడా నారింజరంగు ఛాయలు కనబడుతున్నాయి సూర్యోదయానికి గుర్తుగా. కానీ నగరం ఇంకా పొగమంచు మేఘాల్లో తేలియాడుతున్నట్లుగానే ఉంది. అయినా లేచి త్వరగా తయారై హోచిమిన్‌ మాసోలియానికి బయలుదేరాం.

మనదేశంలోని తాజ్‌మహల్‌, లెనిన్‌ మాసోలియం, టర్కీలోని మాసలస్‌ సమాధి, లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్‌అబే, ఈజిప్టులోని పిరమిడ్లు... అన్నీ సుప్రసిద్ధమైన సమాధులే. ఇవన్నీ తమకు తామో లేదా ఆత్మీయుల ప్రేమకు చిహ్నంగానో నిర్మించినవే. కానీ తమ జీవితాల్లో వెలుగునింపిన నాయకుల కోసం ప్రజలే నిర్మించిన సమాధులూ, స్మృతి మందిరాలూ అరుదనే చెప్పాలి. ఆ కోవకే చెందుతుంది హోచిమిన్‌ సమాధి. పరాయిదేశ వలసపాలనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఏకతాటిమీదకు తీసుకువచ్చి అలుపెరగని పోరాటం చేసి ప్రజాస్వామ్య గణతంత్ర వియత్నాంకు కారణమైన యోధుడే హోచిమిన్‌... వియత్నామీయులు ఎంతో ఇష్టంతో పిలుచుకునే అంకుల్‌ హో.

సమాధిలో అంకుల్‌ హో!
నిజానికి హోచిమిన్‌ మరణానంతరం తనకు సమాధిగానీ, స్మారకమందిరంగానీ నిర్మించవద్దనీ తన చితాభస్మాన్ని తాను నడిచిన నేల నలుచెరుగులా చల్లమని ప్రజల్ని కోరారు. తన ప్రజల ఆకలి తీర్చే పంటభూమికి తన దేహం సారంగా మారాలన్నదే హోచిమిన్‌ ఆకాంక్ష. కానీ 1969, సెప్టెంబరు 2న తీవ్ర గుండెపోటుతో హోచిమిన్‌ మరణించిన తరవాత ఆయన ఆకాంక్షకు భిన్నంగా స్మృతిమందిరం నిర్మించాలని అక్కడి ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ దురాక్రమణల నుంచీ వలస పాలనల నుంచీ తమకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన ‘అంకుల్‌ హో’కు వియత్నాం ప్రజలు ఇంతకుమించి మరేమి కానుకగా ఇవ్వగలరు? సుంసంపన్నమైన నేలనూ, రాళ్లనూ, చెట్లనూ తమ వంతు కానుకగా అందించి హో మాసోలియంను ప్రజలే నిర్మించారు. చరిత్రలో నిలిపారు. ఈ మాసోలియం నిర్మాణానికి లెనిన్‌ స్మారకమే ప్రేరణ. లెనిన్‌ మృతదేహాన్ని ఎంబామింగ్‌ చేసి సంరక్షణా బాధ్యతలు చూస్తోన్న మాస్కోకు చెందిన బయోకెమికల్‌ టెక్నాలజీ శాస్త్రీయబోధన మరియు పరిశోధనా సంస్థకే హోచిమిన్‌ మృతదేహ సంరక్షణ బాధ్యతనూ అప్పగించారు.

మృతదేహాన్ని సుదీర్ఘకాలం భద్రపరచడంలో శరీరరంగునీ సహజత్వాన్నీ కాపాడడమే కీలకం. శరీరం నల్లబడకుండా ఉండేందుకు ఏటా ఫార్మాల్డీహైడ్‌, పొటాషియం ఎసిటేట్‌, ఆల్కహాల్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌... వంటి రసాయనాలు కలిపిన గ్లిసరాల్‌తో శుభ్రపరుస్తారు. ఇందుకోసం 30-40 రోజుల సమయం పడుతుంది. ఈ కారణం చేతనే మాసోలియాన్ని అక్టోబరు నుంచి డిసెంబరు రెండో వారంవరకూ మూసివేస్తారు. కాలక్రమంలో చర్మం, శరీరభాగాలు దెబ్బతినవచ్చు. అప్పుడు వాటిని పారఫిన్‌, గ్లిజరిన్‌, కెరోటిన్‌ల మిశ్రమంతో తయారుచేసిన కృత్రిమచర్మం, శరీరభాగాలతో పునరుద్ధరిస్తారు. ఎంబామింగ్‌ పూర్తయిన దేహానికి తగిన వస్త్రాలను తొడిగి సందర్శకులకోసం సిద్ధంచేస్తారు. తమ నాయకుణ్ణి స్పష్టంగా చూడ్డానికి వీలుగా క్రిస్టల్‌ పేటికను ఉపయోగించారు. ఇందులో జెనాన్‌ దీపాలను అమర్చారు. ఇవి పేటికలో ఉష్ణోగ్రత పెరగకుండా చర్మం సహజరంగులో కనబడేలా చేస్తాయి. సందర్శనాకాలం ఎక్కువైతే ఉష్ణోగ్రత పెరిగి దేహం క్షీణించే అవకాశం ఎక్కువ. అందుకే రోజుకి మూడు నుంచి నాలుగుగంటలు మాత్రమే చూడ్డానికి అనుమతిస్తారు. తరవాత పేటికను అతిశీతల గదిలో భద్రపరుస్తారు. ఈ కారణంగానే హోచిమిన్‌ మాసోలియం సందర్శనకాలం ఉదయం 8 నుంచి 11 గంటల వరకే ఉంటుంది. అందుకే మేం త్వరగా తయారై బస్సులో బాదిన్‌ స్క్వేర్‌కు బయలుదేరాం.

బస్‌ దిగేసరికి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడు కన్నా తక్కువగా ఉన్నట్లుంది. వేసుకున్న స్వెటర్‌ చలిని ఆపలేకపోతోంది. పసుపురంగు నక్షత్రాలతో సగర్వంగా ఎగురుతోన్న వియత్నాం అరుణపతాకం సాదర స్వాగతం పలకడంతో ముందుకు సాగాం. నిశ్శబ్దంగా వెళుతోన్న జన వరుసతో కలిశాం. సెక్యూరిటీ చెక్‌ పాయింట్‌లో అంకుల్‌ హో సమాధివద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు. అందరితో కలిసి నడుస్తూ హో స్మృతిమందిరాన్ని చేరాం. పేటికలో తెల్లటి సంప్రదాయ రైతు దుస్తుల్లో, నెరసిన గెడ్డంతో హాయిగా నిద్రిస్తున్నట్లున్నట్లుగా ఉన్నారు అంకుల్‌ హో. ఎమ్‌.ఎస్‌. రామారావు గానం చేసిన ‘ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా’ పాట స్మృతి పథంలో మెదిలింది. పేటిక నలువైపులా తెల్లటి దుస్తుల్లో సైనిక వందనం చేస్తున్న సైనికులు నిలబడి ఉన్నారు. వియత్నాం జనుల దైన్యాన్ని తొలగించిన ఆ మహనీయుడికి హృదయపూర్వక నివాళులర్పించి మౌనంగా వెనుతిరిగాం.

వెదురుపొదల వేణునాదం!
బయటకు వచ్చి పరిసరాలను గమనించాం. మాసోలియం మూడంతస్తుల భవనం. రెండో అంతస్తులో హోచిమన్‌ పేటికను ఉంచారు. ఎత్తైన బూడిద రంగు గ్రానైట్‌ స్తంభాలు మాసోలియానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ సమాధి చుట్టూ నాటిన 79 సైకస్‌ వృక్షాలు హో 79 వసంతాల స్ఫూర్తిమంతమైన జీవితానికి ప్రతీక. ఇరువైపులా రెండు వరసలతో ఉన్న వెదురుపొదలు అధ్యక్షుడికి నిరంతరం తమ వేణుగానంతో నివాళులర్పిస్తున్నట్లనిపించాయి. మాసోలియం ప్రాంగణాన్ని 240 చతురస్రాకార భాగాలుగా విభజించి, 250 రకాల వైవిధ్యభరితమైన సహజ వృక్షాలను పెంచారు. మాసోలియానికి ఇరువైపులా ఉన్న ఫలకాల్లో ఒకదానిమీద ‘ఛైర్మన్‌ హోచిమిన్‌’ అనీ, మరోదానిమీద ‘సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ వియత్నాం అమరం’ అనీ వియత్నాం భాషలో రాసి ఉంది. పాలరాతి సమాధి మందిరం ప్రవేశద్వారానికి ముందువైపు ‘స్వేచ్ఛాస్వాతంత్య్రాలకంటే ఏదీ విలువైనది కాదు’ అన్న హో ప్రవచనం లిఖించి ఉంది. అక్కడికి సమీపంలోనే అధ్యక్షభవనం, నేషనల్‌ అసెంబ్లీలు ఆ ప్రాంతానికి ఓ ప్రత్యేకతను చేకూర్చాయి.

మాసోలియం దగ్గర్లోనున్న అధ్యక్షభవనం, హో నివాసం, ఏకస్తంభ పగోడా, హోచిమిన్‌ మ్యూజియం... అన్నీ దర్శనీయ స్థలాలే. ముందుగా హో గృహాన్ని చూడాలని అటుగా వెళ్లాం. రంగురంగుల చేపలు, కలువపూలు, చుట్టూ పండ్లమొక్కలతో ఉన్న ఓ పెద్ద కొలను అంచున చెక్కదిమ్మలతో రెండంతస్తులుగా నిర్మించినదే అంకుల్‌ హో నివాసం. కింది అంతస్తును సమావేశ మందిరంగా ఉపయోగించేవారు. అందులో ఓ పెద్ద టేబుల్‌, 12 చెక్క కుర్చీలు, ఓ పడక కుర్చీ, పాత టైప్‌రైటర్‌ ఉన్నాయి. పై అంతస్తును పుస్తకాల అర రెండు భాగాలుగా విభజిస్తుంది. ఓ వైపు పడక గది, మరోవైపు రీడింగ్‌ రూం ఉన్నాయి. పడకగదిలో చెక్కమంచం, చాప, దిండు, తాటాకు విసనకర్ర, రేడియో, అలారం వాచ్‌ ఉన్నాయి. రీడింగ్‌రూమ్‌ టేబుల్‌ పైభాగంలో మార్క్స్‌, లెనిన్‌ల చిత్రపటాలున్నాయి. హో నిరాడంబర జీవితానికి ఆయన నివసించిన ఇల్లే నిదర్శనం. నిజానికి 1900-1906 మధ్య ఇండోచైనా ఫ్రెంచ్‌ గవర్నర్‌ జనరల్‌కోసం నిర్మించిన రాజభవనాన్ని స్వాతంత్య్రం తరవాత వియత్నాం ప్రభుత్వం హో నివాసంగా ప్రకటించింది. అందులో ఉండటానికి నిరాకరించిన హో, దానికి సమీపంలో ఓ ఎలక్ట్రీషియన్‌ ఉండే సాధారణ చెక్క గృహంలోనే జీవితాంతం నివసించారు. అది చూసి తిరిగి హోటల్‌కు వచ్చాం.

హనోయ్‌... అద్భుతం!
గది ఖాళీ చేసి, లిఫ్ట్‌లో 35వ అంతస్తుకెళ్లి అద్దాల్లోంచి హనోయ్‌ నగర అందాలను వీక్షించాం. మా పక్కనే ఫుట్‌బాల్‌ స్టేడియం కనబడుతోంది. విశాలమైన రోడ్లు, రోడ్లనిండా మోటార్‌సైకిళ్లు, ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలు... ‘వావ్‌... హనోయ్‌... అద్భుతం!’ అనకుండా ఉండలేకపోయా. తరవాత బస్‌లో ఎయిర్‌పోర్టుకి బయలుదేరాం. బస్సు కిటికీలోంచి ఎర్రటి నీళ్లతో నెమ్మదిగా కదులుతోన్న రెడ్‌ రివర్‌ కనబడుతోంది. నీటి రంగే ఆ నదికి పేరైంది. నదిలో చిన్న చిన్న పడవలు ఉన్నాయి. ఒడ్డున జాలర్లు చేపలకోసం వలలు వేస్తున్నారు. చుట్టూ వరిపొలాలు, తలపై తాటాకు టోపీలతో ఉత్సాహంగా పనిచేసుకుంటోన్న రైతులు, అక్కడక్కడ గడ్డిమేస్తోన్న పశువులు, చెయ్యి తిరిగిన చిత్రకారుడి పెయింటింగ్‌లా ఉందా దృశ్యం. బస్‌ మరింత ముందుకు కదిలింది. ఒక్కసారిగా శబ్దం మారింది. బస్‌ ఓ పెద్ద వంతెన మీదుగా వెళుతోంది. దీన్ని ఇటీవలే ఇనుపతీగలతో ఎంతో కళాత్మకంగా నిర్మించారు. ఓ కమ్యూనిస్టు దేశం తన సంస్కృతికి ఇచ్చే విలువకు ఈ నాట్‌ తాన్‌ వంతెనే సాక్ష్యం. హనోయ్‌ నగరాన్ని పూర్వం ధాంగ్‌లాంగ్‌గా పిలిచేవారు. అప్పట్లో ధాంగ్‌లాంగ్‌ చుట్టూ ఎత్తైన కోట గోడ, దానికి 16 ద్వారాలు ఉండేవట. వాటిల్లో చాలా శిథిలమై ఐదు ద్వారాలు మాత్రమే మిగిలాయి. వియత్నాంవాసులు వీటిని తమ ప్రాచీన వైభవానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఆ ఐదు ద్వారాల నమూనాలో ఐదు టవర్లతో నాట్‌ తాన్‌ వంతెన నిర్మించుకున్నారు.

కాసేపట్లోనే మా బస్‌ హనోయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకుంది. బాగా ఆకలేస్తోంది. కానీ ఎక్కడచూసినా మాంసాహారమే. చివర్లో ఉన్న ఓ షాపులో వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌, వేరుసెనగ విత్తనాలు కనిపించాయి. ప్రాణం లేచి వచ్చింది. పల్లీలు కొనుక్కున్నాం. వాటిని లెమన్‌గ్రాస్‌తో కలిపి వేయించారు. మంచి వాసన వస్తూ రుచికరంగా ఉన్నాయి. తరవాత కాఫీ తాగాం. బోర్డింగ్‌ గేట్‌ తెరవడంతో తిన్నగా వెళ్లి విమానంలో కూర్చున్న నాకు ఓ కవరు మీద ‘అమేజింగ్‌ వియత్నాం’ అన్నది కనిపించింది. అది అక్షరాలా నిజం. ఎందుకంటే దాదాపు శతాబ్ద కాలంపాటు పరాయిదేశాల పాలనతో విసిగిపోయి, ఆపై సుమారు రెండు దశాబ్దాలపాటు అగ్రరాజ్యం అమెరికాతో భీకరయుద్ధం చేసి లక్షలాదిమందిని పోగొట్టుకున్ననాటి యుద్ధభూమిలో నేడు ఆ ఛాయలు మచ్చుకైనా లేవు. ఎక్కడచూసినా పచ్చని పంటపొలాలతో స్వచ్ఛమైన చిరునవ్వులతో స్వాగతించే వియత్నామే కనిపిస్తుంది. తమ దేశ విమోచనకోసం జీవితాన్ని వెచ్చించిన ప్రజానాయకుడు హోచిమిన్‌ దార్శనికత, నిజాయితీలే అక్కడి ప్రజల్ని ముందుకు నడిపిస్తున్నాయి.

మా విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా ఎగురుతోంది. దట్టమైన మేఘాలకింది చిక్కటి నీలం రంగులో వియత్నాం నేల తెరలు తెరలుగా కనిపిస్తోంది. ‘అమెరికన్‌ సామ్రాజ్యవాదులారా, వియత్నాం నిర్మాణాలను మాత్రమే విధ్వంసం చేయగలరు. సుందర నదులు, భూమి, పర్వతాలు మిగిలే ఉంటాయి. మాలో కొందరు మిగిలినా ఈ భూమిపై అత్యంత సుందరమైన వియత్నాంను నిర్మించి తీరుతాం’ అన్న హోచిమిన్‌ మాటలు గుర్తుకొస్తున్నాయి. అవును, వియత్నాం ప్రజలు ఆయన కలల్ని నిజం చేశారు. సత్యం... సుందరం... సోషలిస్టు వియత్నాం..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.