close
అల్లాని ప్రార్థిస్తా... గుడికీవెళ్తా!

అల్లాని ప్రార్థిస్తా... గుడికీవెళ్తా!

హెబ్బా పటేల్‌... చూడ్డానికి అతి మామూలు అమ్మాయిలా కన్పిస్తుంది, తెరపైన చూస్తే ఆమె నటనేంటో తెలుస్తుంది. ‘కుమారి 21ఎఫ్‌’ చూసిన వారికి ఆ విషయం బాగా అర్థమవుతుంది. కుమారి తర్వాత కూడా వరుస హిట్‌లతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హెబ్బా. ‘ఏంజెల్‌’గా రాబోతున్న హెబ్బాని పలకరిస్తే బోలెడు విషయాలు తన గురించి చెప్పింది. అవేంటో మీరే చదవండి!

మ్మ, అమ్మమ్మ, పిన్ని, ఇద్దరు చెల్లెళ్లు, నేను... చిన్నపుడు ఇదీ మా కుటుంబం. సొంతూరు ముంబయి. స్కూల్‌ రోజుల్లో చదువు, తిండి, టీవీ, నిద్ర... ఇవే నా ప్రపంచం. ఫ్రెండ్స్‌ కూడా లేరు. నలుగురితో అంత సులభంగా కలవలేకపోయేదాన్ని. మూడో తరగతి చదువుతున్నపుడు క్లాసులో ఏదో విషయంపైన నా వాదనను బలంగా వినిపించడాన్ని చూసిన మా టీచర్‌ ‘నువ్వు ఎలక్యూషన్‌, ఎస్సే రైటింగ్‌, డిబేట్‌ పోటీల్లో పాల్గొంటే బావుంటుంది’ అని సలహా ఇచ్చారు. ఆ ఏడాది ఎలక్యూషన్‌ పోటీలో పాల్గొని గెలిచాను. అప్పట్నుంచీ ఆ తరహా పోటీల్లో పాల్గొనేదాన్ని. ఆటలకు మాత్రం దూరంగా ఉండేదాన్ని. ప్లస్‌వన్‌లో చేరాకే నలుగురితో కలవడం అలవాటైంది. స్నేహితులందరూ ప్రాపంచిక విషయాల గురించి చర్చించుకుంటుంటే వినేదాన్ని. ఆ తర్వాత పత్రికలు చదవడం, వార్తా ఛానెళ్లు చూడటం అలవాటైంది. భవిష్యత్తులో జర్నలిస్టు అవ్వాలనుకొని డిగ్రీలో ‘మాస్‌ మీడియా’ కోర్సులో చేరాను.

అనుకోకుండా సినిమాలు
మా కాలేజీలో ఓ ఫెస్ట్‌ జరుగుతున్నపుడు అక్కడికి వచ్చిన ఎంటీవీ ప్రతినిధి నన్ను చూసి ‘మీరు మోడల్‌ హంట్‌లో పోటీపడుతున్నారా’ అని అడిగితే, లేదన్నాను. ‘ప్రయత్నించి చూడండి’ అన్నాడతను. అంతమందిలో నన్ను మాత్రమే అడిగారంటే నాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందనిపించి, అందులో పాల్గొని గెలిచాను. ఆ తర్వాత మోడలింగ్‌వైపు అడుగులు వేశాను. చెన్నైకి చెందిన ఓ జ్యువెలరీ సంస్థకు మోడల్‌గా పనిచేశాను. అందులో నన్ను చూసి కన్నడ సినిమా ‘అధ్యక్ష్య’లో అవకాశం ఇచ్చారు. ఓ తమిళ సినిమాకి రీమేక్‌ అది. అదే సినిమా తెలుగులో ‘కరెంట్‌ తీగ’గా వచ్చింది. తర్వాత ఓ తమిళ సినిమా చేశాను. ఆ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్నపుడు పక్కనే మరో తెలుగు సినిమా షూటింగ్‌ నడుస్తోంది. అక్కడ ఒకరు నన్ను చూసి ‘తెలుగులో చేస్తారా’ అని అడిగారు. ‘తప్పకుండా’ అని చెప్పాను. ఆ విధంగా ‘అలా ఎలా’లో అవకాశం వచ్చింది. తెలుగులో నా రెండో సినిమా ‘కుమారి 21ఎఫ్‌’కి ఆడిషన్‌ చేశారు కానీ మొదటి సినిమాకి మాత్రం చెయ్యలేదు.

ఇద్దరు అమ్మలు
నాకు వూహ తెలిసేసరికే నాన్న చనిపోయారు. ఆ లోటుని తీర్చడానికేనేమో నాకు ఇద్దరు అమ్మల్ని ఇచ్చాడు దేవుడు. అమ్మ, పిన్ని ఇద్దరూ కుటుంబానికి రెండు స్తంభాలై మమ్మల్ని పెంచారు. నాకు మార్కులు రాకపోతే అమ్మ బాధపడేది. అమ్మని సంతోషపెట్టడానికి పుస్తకాలతో కుస్తీపడేదాన్ని. సబ్జెక్ట్‌ ఏదైనా బాగా బట్టీ పట్టేసేదాన్ని. ఇప్పుడది పనికొస్తోంది నాకు. దక్షిణాది భాషలు కొత్త కావడంతో డైలాగులు చెప్పడం కష్టంగా ఉంటుంది. అయినా ఇంగ్లిష్‌లో రాసుకొని కంఠతా పట్టేస్తుంటాను. అలాగని ఏ విషయాన్నీ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేను. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, పేరు సంపాదించుకోవాలని మొదట్నుంచీ ఉండేది. దాంతో సినిమాల్లో అవకాశం రాగానే చేద్దామనుకున్నాను. విషయం చెప్పగానే అమ్మ ఓకే అంది. పిన్ని మాత్రం... ‘మోడలింగ్‌, సినిమాలంటూ వేల మంది అమ్మాయిలు ప్రయత్నిస్తుంటారు. అక్కడ విజయం సాధించడం అంత తేలిక కాదు. ప్రయత్నించు కానీ, చదువుని నిర్లక్ష్యం చేయొద్దు’ అని చెప్పింది. పిన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. మా పెంపకం అమ్మ బాధ్యత అయినా పెళ్లి తర్వాత కూడా పిన్ని మా బాగోగుల్ని చూసుకునేది. నేను ఆమెలా నిస్వార్థంగా ఉండలేనేమో అనిపిస్తుంది. కష్టపడటంలో తనే నాకు రోల్‌మోడల్‌. మా ఇంట్లో అందరూ మహిళలే. నేను చదివిందీ అమ్మాయిల కాలేజీలోనే. అప్పట్లో ఒకరిద్దరితో తప్పించి నాకు అబ్బాయిలతో పెద్దగా పరిచయం లేదు. నాకు లింగ వివక్ష అంటే తెలియదు. మా కాలేజీలోనూ ఈ విషయంపైన ఎక్కువగా చర్చించేవారు కాదు. అలా చేస్తే మనల్ని మనం తక్కువగా వూహించుకున్నట్టే అనేది నా ఉద్దేశం.

చెల్లెళ్లూ నేనూ...
నాకు ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లు కవలలు కావడంతో ముగ్గురిలోకీ నేను వేరే అన్న భావన మొదట్లో నాకుండేది. కానీ క్రమేణా అదిపోయింది. చిన్నపుడు మా మధ్య ఎన్నో డిష్యుం డిష్యుంలు జరిగాయి. కానీ ఇప్పుడు మేమెంతో అన్యోన్యంగా ఉంటాం. స్నేహితుల్ని తక్కువ చేయనుకానీ, చెల్లెళ్లుంటే నాకు స్నేహితులు లేకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే వాళ్లు నాకు స్నేహితులు కూడా! పెద్ద చెల్లి హన్నా... సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. రెండో చెల్లి హాదిల్‌... ఓ బహుళజాతి సంస్థలో హెచ్‌.ఆర్‌. విభాగంలో చేస్తోంది. హన్నా అయితే ఒకప్పుడు ‘నీకు సినిమాలు అవసరమా’ అంది. కానీ ఇప్పుడు తనే అందరికంటే ముందు నా సినిమాల ట్రైలర్స్‌, చూస్తుంది, రివ్యూస్‌ చదువుతుంది. ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌ చూసి చెబుతుంది. మేం సీరియస్‌ విషయాల్నీ చర్చిస్తాం, జోకులూ వేసుకుంటాం, షికార్లకు వెళ్తుంటాం.

జీవితం మారిపోయింది
తెలుగులో నా మొదటి సినిమా ‘అలా ఎలా’ పెద్ద హిట్‌ కాకపోయినా. నాకంటూ గుర్తింపు తెచ్చింది. రెండో సినిమా ‘కుమారి 21ఎఫ్‌’ నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా విజయంతో అవకాశాలు వరుసకట్టాయి. ఆర్థిక భద్రత వచ్చింది. ‘కుమారి...’ కథ రాయడంతోపాటు నిర్మాతగా వ్యవహరించిన సుకుమార్‌ గారు నాకు చాలా కావాల్సిన మనిషి అయ్యారు. నా ప్రతిభని గుర్తించి, నాపైన పూర్తి నమ్మకం ఉంచి ‘కుమారి...’లో అవకాశం ఇచ్చింది ఆయనే. ఆ పాత్రని చేయగలనా లేదా అన్న సందేహంలో ఉన్నపుడు చేయగలనంటూ నాలో ధైర్యం నింపారు సుకుమార్‌. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు డైలాగులు రాశారు. కుమారి తర్వాత నాలుగు సినిమాల్లో చేశాను. మరో రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నన్ను కుమారిలాంటి పాత్రల్లోనే చూడాలనుకునేవారూ, కొత్తగా చూడాలనుకునేవారూ... రెండు రకాల వారూ ఉన్నారు. అలాగని అందరినీ సంతృప్తి పరచలేను కదా. నాకొచ్చే కథల్లో ఏది బావుంటే అది మాత్రమే ఎంపికచేసుకోగలను. సినిమాలతో బిజీ అయ్యాక నా జీవితంలో మనుషులు తగ్గారు. ఇది వరకు పదిమంది ఉంటే ఇప్పుడు అయిదుగురే ఉన్నారు. కానీ వారు నాకు ముఖ్యమైనవారు. నాకున్న విలువైన సమయాన్ని ఆ విలువైన వ్యక్తులకి కేటాయిస్తాను. సినీ పరిశ్రమలో వెన్నెల కిషోర్‌ నాకు మంచి స్నేహితుడు. హైదరాబాద్‌లో ఉన్నా కుటుంబానికి దూరమయ్యానన్న ఫీలింగ్‌ లేకుండా చేస్తారు కిషోర్‌. నా మొదటి సినిమాలో ఆయనకూడా నటించారు. సెట్స్‌లో మేమిద్దరమూ బ్యాడ్‌ జోక్స్‌ వేయడంలో ఫస్ట్‌. అలా స్నేహితులయ్యాం. సినిమాల ఎంపికలో కిషోర్‌ అభిప్రాయాన్ని తీసుకుంటాను కూడా.

నా హీరోలు... దర్శకులు
కుమారి... దర్శకుడు ప్రతాప్‌కి కథ చెప్పడంలో తనదైన శైలి ఉంది. ప్రతి సీన్‌నీ తాను ముందు చేసి చూపిస్తారు. కుమారి పాత్రను తను నాకంటే బాగా చేస్తారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు వి ఆనంద్‌, ‘మిస్టర్‌’ దర్శకుడు శ్రీనువైట్ల... ఈ ముగ్గురి నుంచీ నటనకు సంబంధించి చాలా అంశాల్ని నేర్చుకున్నాను. తెలుగులో ఇప్పటివరకూ చేసిన, చేస్తున్న ఎనిమిది సినిమాల్లో మూడింటిలో రాజ్‌తరుణ్‌ ఉన్నాడు. ‘కుమారి...’తో మాకు హిట్‌ జోడీగా గుర్తింపు వచ్చింది. తర్వాత వెంటనే ‘ఈడో రకం ఆడో రకం’లో కలిసి చేశాం. ‘అందగాడు’లో రాజ్‌తరుణ్‌తో మరోసారి జతకట్టనున్నాను. ఆ సినిమా కథ నచ్చి చేశాను. వరుసగా రాజ్‌తరుణ్‌తో పనిచేయడం కాస్త బోరింగ్‌గా ఉన్నప్పటికీ, సౌకర్యంగానూ ఉంటుంది. ఎందుకంటే నేను నటనలో ఓనమాలు నేర్చుకున్న దశనుంచి తనకు తెలుసు. తనతోపాటు చేసినపుడు ఏదైనా సీన్‌ అనుకున్నట్టు చేయలేకపోయి, టేక్‌లు తీసుకున్నా ఇబ్బందిగా అనిపించదు. నేను చేసిన హీరోలందరిలోకీ రాహుల్‌ రవీంద్రన్‌ మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. నా మరో హీరో నిఖిల్‌... సాయంచేయడంలో ముందుంటాడు. నేనైతే సీన్‌ పూర్తయ్యాక మానిటర్‌ దగ్గరకు వెళ్లి నేను ఎలా చేశానన్నదే చూస్తాను. కానీ తను మాత్రం ఇద్దరి పర్‌ఫార్మెన్స్‌ చూసి చెబుతాడు. ఇలాంటి స్వభావం అందరిలోనూ కనిపించదు. వరుణ్‌తేజ్‌... చాలా సరదాగా ఉంటూ అందరిలోనూ కలిసిపోతాడు. అయితే, షూటింగ్‌లేనపుడే సరదా, పని విషయానికి వచ్చేసరికి మాత్రం సీరియస్‌ అండ్‌ సిన్సియర్‌. నా తదుపరి సినిమా ‘ఏంజెల్‌’. దీన్లో హీరో అన్వేష్‌. హీరోగా కొత్త అయినా ఇదివరకు బాలనటుడిగా చేశాడు. దాంతో కెమెరాముందు నాకంటే కంఫర్ట్‌గా ఉంటాడు. నేను కలిసి నటించిన హీరోలందరిలోకీ సెట్స్‌పైన బాగా కష్టపడేది తనే. మొదటి సినిమా కావడంవల్లనేమో!

సినిమా కెరీర్‌లో పెద్ద కష్టాలేవీ ఎదుర్కోలేదు. అలాగని నా ప్రయాణం అంత ఈజీగానూ సాగిపోలేదు. కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, సరైన సమయంలో మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చింది. అందుకే నా విజయం వెనక శ్రమతోపాటు దేవుడి దయ కూడా ఉందంటాను! నేను ఇస్లాంని నమ్ముతాను. నా దేవుడు అల్లా అయినా కూడా అందరి దేవుళ్లనీ ప్రార్థిస్తాను. అప్పట్లో పరీక్షలకు ముందూ, ఇప్పుడు సినిమాల రిలీజ్‌కు ముందూ గుడికీ, చర్చికీ తప్పక వెళ్తాను

 

నాపేరు హీబా

మ్మ నజ్మున్నీసా, నాన్న ఖాలిద్‌. మా పెదనాన్నగారి పేరు హీబా. ఆ పేరుకు అర్థం దేవుడిచ్చిన బహుమతి అని. నాకూ అదే పేరు పెట్టారు. కానీ స్కూల్లో టీచర్‌ స్పెల్లింగ్‌ తేడాగా రాయడంతో హీబాని కాస్తా హెబ్బాగా మారిపోయాను.
* షూటింగ్‌ లేకుంటే టీవీ షోలు చూస్తాను. ఒకప్పుడు బాగా చదివేదాన్ని. సిడ్నీ షెల్డన్‌, హారుకి మురకామి రచనలంటే ఇష్టం. కానీ ఇప్పుడు కుదరడంలేదు. ఈ-బుక్స్‌ చదువుకోవచ్చని కిండెల్‌ కొన్నాను. కానీ చదవలేకపోతున్నాను.
* బిజీ షెడ్యూళ్లూ, ప్రయాణాలవల్ల నిద్ర సరిగ్గా ఉండదు. అందుకే కాస్త టైమ్‌ దొరికినా నిద్రపోతాను. షాపింగ్‌ అన్నా ఇష్టమే. ఒక రోజంతా ఖాళీ దొరికితే నా రూమ్‌ని కొత్త వస్తువులతో నింపేస్తాను. షూస్‌, బట్టలు, మేకప్‌ వస్తువులూ ఎక్కువగా కొంటాను. వాచీలూ బ్యాగులకు మాత్రం అంత ప్రాధాన్యం ఇవ్వను.
* రెండేళ్లనుంచీ అమ్మ నన్ను రాకుమారిలా చూస్తోంది. బయట సరిగ్గా తింటున్నానో లేదో, నిద్ర పోతున్నానో లేదోనన్న బెంగతో ఇంటిదగ్గర నన్ను అడుగు కింద పెట్టనీకుండా అన్నీ చేసి పెడుతుంది. ముంబయిలో ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకూ, షికార్లకూ వెళ్తాను.
* అబ్బాయిల్లో సాయంచేసే గుణం, నవ్వించే స్వభావం ఉన్నవారు నచ్చుతారు. ఎప్పుడూ నెగెటివ్‌ ఆలోచనలతో ఉండి, పక్కవారి గురించి తక్కువగా మాట్లాడేవారు నాకు నచ్చరు. అలాంటివాళ్లు సంతోషంగా ఉండరు, పక్కవాళ్లని ఉండనివ్వరు.
* డైటింగ్‌ చేయడం నచ్చదు. అన్నీ తింటాను. నాన్‌వెజ్‌ చాలా ఇష్టంగా తింటా. అమ్మ బిర్యానీ, హలీమ్‌ బాగా చేస్తుంది. ఇంట్లో ఉంటే అవి తింటాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.