close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘యూట్యూబ్‌’ కుటుంబం!

‘యూట్యూబ్‌’ కుటుంబం!

ఉపాధ్యాయులూ, వైద్యులూ, ఇంజినీర్లూ ఎక్కువగా ఉండే కుటుంబాల్ని చూశాం. కానీ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల కాలమిది. ఇప్పుడు కొత్త ఉపాధి మార్గాలు వస్తున్నాయి. అలాంటి అవకాశాన్ని అందుకొని యూట్యూబర్లుగా మారిన ఓ కుటుంబం నోయిడాలో ఉంది. వీడియో తీసి యూట్యూబ్‌లో చూపాల్సినంత కథే ఉంది దీని వెనుక.

సాధారణంగా ఏ కుటుంబంలోనైనా పెద్దవాళ్లు చూపినబాటలో- ముఖ్యంగా మగవాళ్లు చూపిన బాటలో నడుస్తారు మిగతావాళ్లు. కానీ శృతి అర్జున్‌ దీనికి భిన్నమైన సంప్రదాయాన్ని సృష్టించింది. ఓ ఇంటికి ఇల్లాలిగా వెళ్లి ఆ కుటుంబ సభ్యులు తన బాటలో సాగేలా వారిలో స్ఫూర్తినింపింది. శృతితో ప్రారంభించి ఇప్పుడు ఆ కుటుంబంలో ఎనిమిది మంది యూట్యూబ్‌ద్వారానే ఉపాధి పొందుతున్నారు.

ఇలా మొదలైంది...
శృతి భర్త అర్జున్‌ అమెరికాలో కొన్నాళ్లు పనిచేశాడు. 2013లో భర్తతో పాటు ఆమె కూడా అమెరికా వెళ్లింది. భర్త ఆఫీసుకు వెళ్లాక శృతికి ఉబుసు పోయేది కాదట. అక్కడ మేకప్‌ సామాగ్రి తక్కువ ధరకే దొరికేదట. ఆ సమయంలో తనకు తాను వివిధ రకాలుగా మేకప్‌ చేసుకుంటూ వాటిని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టేది. ఆ తర్వాత వాళ్లు ఇండియా తిరిగి వచ్చేశారు. ఇక్కడికి వచ్చాక కూడా శృతి వీడియోల్ని తీసి యూట్యూబ్‌లో పెట్టేది. వాటికి ఇక్కడ వూహించని విధంగా స్పందన రావడం చూసి దాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంజినీరింగ్‌ చేసిన శృతి మేకప్‌లో ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. తనకున్న అవగాహనతోనే మేకప్‌ చేసుకుంటూ, వీడియోల్ని తీసేది. ప్రస్తుతం ‘శృతి అర్జున్‌ ఆనంద్‌’ పేరుతో ఆమె నిర్వహిస్తోన్న యూట్యూబ్‌ ఛానల్‌కు 7.2 లక్షల మంది చందాదారులున్నారంటే ఆమె వీడియోలకు లభిస్తున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. మేకప్‌, ఫ్యాషన్‌, బ్యూటీ విభాగాలతోపాటు తనకు తోచిన ప్రతి అంశాన్నీ వీడియోగా తీసి ఈ ఛానల్‌లో పెడుతుంది. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో కొత్త వీడియోల్ని అప్‌లోడ్‌ చేస్తుంది. ఇప్పటివరకూ ఈమె వీడియోలకు 13 కోట్లకుపైగా వీక్షణలు వచ్చాయి. ఈమెకు ప్రకటనలూ వస్తున్నాయి. దాంతోపాటు లాక్మే, నైకా, ఎల్‌ఏ గర్ల్‌... లాంటి సౌందర్య సాధనాల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల్ని వాడి చూడమని ఉచితంగా అందిస్తున్నాయి. శృతి తీసే పెళ్లి కూతురు అలంకరణ, హెయిర్‌స్టైల్స్‌, కనుబొమ్మలు తీర్చిదిద్దడంలాంటి వీడియోలకు ఎక్కువ వీక్షణలు ఉంటాయి.

ఏడేళ్ల పాపకూ ఛానల్‌
తన వీడియోల్లో హెయిర్‌స్టైల్స్‌ చూపించడానికి మోడల్‌గా తన మూడేళ్ల మేనకోడలు అనంత్యాని పెట్టేది శృతి. అనంత్య కెమేరా ముందు ఎలాంటి ఇబ్బందీ పడకుండా జడలు వేయించుకునేది. కొన్నిసార్లు శృతిని అనుకరించేది. ఆమెలోనూ ఒక యూట్యూబర్‌ ఉన్నాడని గుర్తించిన శృతీ అర్జున్‌లు ‘మై మిస్‌ ఆనంద్‌’ పేరుతో మూడేళ్ల కిందట ఒక ఛానల్‌ను ప్రత్యేకంగా ప్రారంభించారు. దీన్లో పిల్లలకు సంబంధించిన హెయిర్‌స్టైల్స్‌తోపాటు, తన ఇంట్లో, బడిలో జరిగిన సంగతుల్నీ పంచుకుంటుంది అనంత్య. ఈ ఛానల్‌కు 1.4లక్షల మంది చందాదారులుగా ఉన్నారు. కూతురు స్ఫూర్తిగా అనంత్య తల్లి నిషా తొప్వాల్‌, నిషా సోదరి ప్రియా మల్‌ కూడా ఛానళ్లను ప్రారంభించారు. మూడు నెలల కిందట వంటల ఛానెల్‌ ‘కుక్‌ విత్‌ నిషా’ను ప్రారంభించింది నిషా. ప్రియా కూడా చర్మ, కేశ సౌందర్య సంరక్షణకు సంబంధించిన వీడియోల్ని పెడుతోంది. ప్రియా ఛానల్‌ ‘ప్రెట్టీ ప్రియా’ను అయిదు లక్షల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఇవి కాకుండా వైరల్‌ మెహందీ, వైరల్‌ హెయిర్‌స్టైల్స్‌ ఛానల్సూ వీరికి ఉన్నాయి. అంటే ఈ కుటుంబ సభ్యులే మొత్తం ఆరు యూట్యూబ్‌ ఛానల్స్‌ను నిర్వహిస్తున్నారు. వీటిలో వైరల్‌ హెయిర్‌స్టైల్స్‌ను కూడా ప్రియ నిర్వహిస్తోంది. ప్రియ ఇప్పుడు ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాన్ని వదులుకుని పూర్తిగా యూట్యూబర్‌గానే పనిచేస్తోంది.

ఐఐటీలో చదువుకున్న 35 ఏళ్ల అర్జున్‌ ఎన్‌ఐఐటీలో సీనియర్‌ స్థాయిలో ఉద్యోగిగా పనిచేసేవాడు. ఏడాదికి రూ.30లక్షల జీతం వచ్చే ఆ ఉద్యోగాన్ని గతేడాది వదులుకున్నాడు. తమ కుటుంబ సభ్యుల యూట్యూబ్‌ ఛానల్స్‌ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ఓ సంస్థను ప్రారంభించాడు. దీనికి శృతి, అర్జున్‌ డైరెక్టర్లు. వీరి కుటుంబానికే చెందిన విశాల్‌, విక్రమ్‌, పంకజ్‌... వీడియోల ఎడిటింగ్‌, అప్‌లోడింగ్‌, మొదలైన వ్యవహారాలు చూసుకుంటారు. ఇలా ఆ కుటుంబంలోని ఎనిమిది మందికి యూట్యూబ్‌ ఉపాధి కల్పిస్తోందన్నమాట. వీరి ఆరు ఛానల్స్‌ నుంచి వారంలో 10 వరకూ వీడియోలు వస్తాయి. వీరి ఛానళ్లన్నింటికీ కలిపి దాదాపు 14 లక్షల మంది చందాదారులున్నారు. వీటికి నెలకు మూడు కోట్ల వీక్షణలు వస్తాయి. నోయిడాలో ఈ మధ్యనే ప్రారంభించిన ఓ కార్యాలయంలో వీరంతా కలిసి పనిచేస్తున్నారు. ప్రతి సోమవారం సమావేశమై ఏయే అంశాల్ని వీడియోలుగా తీయాలో చర్చిస్తారు. ‘మేమంతా చాలా స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకుంటాం. మా మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలూ ఉండవు. ఎప్పుడైనా శృతికీ, నాకూ మధ్య చిన్న చిన్న అభ్యంతరాలు వస్తుంటాయి. కానీ అవి నాణ్యమైన వీడియోల్ని తీయడం గురించే’ అని చెబుతాడు అర్జున్‌.

బహుశా దేశంలోనే మొదటి యూట్యూబర్ల కుటుంబం వీరిదేనేమో!


 

పొలంబడి

వ్యవసాయ శ్రమనూ, ఖర్చునూ తగ్గించేందుకు ఎన్నో యంత్ర పరికరాలు తయారవుతున్నాయి. వాటి వినియోగం, అందులోని మెలకువలు నేర్చుకోవడంలోనే రైతులకు ఇబ్బంది తలెత్తుతోంది. యంత్రాల ఎంపిక నుంచి వినియోగం, బాగుచేత దాకా వివిధ విషయాల మీద రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మన దగ్గరే పెద్ద సంస్థ ఉంది. అనంతపురం దగ్గర్లో ఉన్న ఈ సంస్థలో సాగులోని మెలకువలూ నేర్పుతారు.

ర్షాలు పడకపోవడం, గిట్టుబాటు ధరలు రాకపోవడం, పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం... కారణమేదైనా కావచ్చు, సమాజానికి వెన్నెముకలాంటి రైతుకు పంటసాగు కష్టాలసాగే అవుతోంది. అయితే తక్కువ పెట్టుబడి, పరిమిత నీటి వాడకం, పంటసాగులో యంత్రాల వినియోగం నేర్పుతూ... ఇలా సాగుబడి చేస్తే వ్యవసాయమూ కాసుల్ని కురిపిస్తుందంటుందీ పొలంబడి. అదే అనంతపురం జిల్లా గార్లదిన్నెలోని ట్రాక్టర్‌ నగర్‌, దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్ర శిక్షణ పరిరక్షణ సంస్థ. గత మూడు దశాబ్దాలుగా కొన్ని వేల మందిని వ్యవసాయ సాంకేతికతలో మెరికల్లా తీర్చిదిద్దుతోంది.

ఏ యంత్రం ఎక్కడ...
యాంత్రీకరణ వల్ల వ్యవసాయ పెట్టుబడుల్లో పొదుపూ, దిగుబడుల్లో పెరుగుదలా సాధ్యమన్నది తెలిసిందే. అయితే ఏ యంత్రాన్ని ఎక్కడ ఎలా వాడాలి, మనం పండించే పంటలకు తగ్గట్టు ఏయే యంత్రాలు అందుబాటులో ఉంటాయి, వాటి వాడకం వల్ల ఎంత వరకూ లాభం పొందొచ్చు లాంటి అనేక కోణాల్లో రైతులకూ, యంత్రాల వినియోగదారులకూ ఉత్పత్తిదారులకూ, సాంకేతిక విద్యార్థులకూ పాఠాలు చెబుతారిక్కడ. 185 హెక్టార్ల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఇందులో కొంత మేర వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేరిన ఎవరైనా పంట సాగుబడిలో మెలకువలనూ యంత్రాల వాడకాన్నీ ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చు. వ్యవసాయ విజ్ఞానం (అగ్రికల్చర్‌సైన్స్‌) చదివే విద్యార్థులకు ఇక్కడ ప్రయోగాత్మక శిక్షణ ఇస్తున్నారు. నిరక్షరాస్యులైన వారి నుంచి డాక్టరేట్‌ చేసిన వారి వరకూ ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న ఎవరైనా ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చు.

తరగతులు ఉచితమే...
ట్రాక్టర్‌నగర్‌ సంస్థ సాగుకు సంబంధించి విభిన్న తరగతులను అందుబాటులోకి తెస్తోంది. ఇతర జిల్లాలూ, రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భోజన, వసతి సదుపాయమూ ఉంది. నిరంతరం ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. తరగతులు వారం వ్యవధి ఉన్నవి మొదలు నెలల వరకూ సాగేవి ఉంటాయి. ఆధునిక వ్యవసాయంలో శక్తి వినియోగం అంశంలో నాలుగు వారాల శిక్షణ ఇస్తే, వివిధ రకాల వ్యవసాయ యంత్రాల ఎంపికా, వినియోగించే విధానమూ, నిర్వహణా, తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి ఆరు వారాల పాటు శిక్షణ ఇస్తోంది. మహిళా రైతులకు శ్రమను తగ్గించాలన్న భావనతో తేలికైన వ్యవసాయ పనిముట్ల వాడకం గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బిందు, తుంపర సేద్యాల్లో మెలకువలు నేర్పుతున్నారు. అలాగే సస్యరక్షణ పరికరాల ఎంపిక, ఉపయోగించే విధానం చెబుతారు. చేతి పంపుల ఎంపిక, వాడకంలోనూ శిక్షణనిస్తారు. అంతేకాదు పప్పులూ, నూనె ధాన్యాల పంటల ఉత్పత్తిలో వినియోగించే వివిధ యంత్రాల ఎంపికా, వాటి నిర్వహణా, మెట్ట సేద్యంలో యంత్రాల ఎంపికా వినియోగాలపైనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా ఉచితం. సాంకేతిక అంశాల విభాగంలో... ట్రాక్టర్లు, డీజిల్‌ ఇంజిన్ల మరమ్మతుల మీదా, పవర్‌ టిల్లర్ల మరమ్మతుల గురించీ శిక్షణ ఇస్తున్నారు. ఆటో ఎలక్ట్రికల్‌ పరికరాలూ, బ్యాటరీ బాగుసేత, వ్యవసాయ యంత్రాలు హైడ్రాలిక్‌ పద్ధతులు, నేలను చదును చేసే యంత్రాలూ, బుల్‌డోజర్ల యాజమాన్యంపైనా విద్యార్థులకు నామమాత్రపు రుసుముతో బోధనా తరగతులు నిర్వహిస్తారు. పదోతరగతి, ఐటీఐలు చదివిన వారూ ఇక్కడ శిక్షణ పొందొచ్చు. యంత్రాల ఉత్పత్తిదారులూ, డీజిల్‌ మెకానిక్కులకూ శిక్షణ ఇవ్వడంతో పాటూ డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకూ వివిధ అంశాల్లో నెలరోజుల శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికీ సంబంధిత సర్టిఫికెట్‌ను అందజేస్తారు. సంస్థ నాణ్యతా ప్రమాణాల పరంగా జాతీయ స్థాయి ధృవీకరణ(ఐఎస్‌ఓ) కూడా పొందింది. ఇక, ఎవరైనా తమ వూరివాళ్లకు శిక్షణ కావాలి అని ఫోన్‌ చేసినా, ఉత్తరం రాసినా సిబ్బంది ఆ వూరికి వెళ్లి మరీ తరగతులు చెబుతారు.

మొత్తం నాలుగే...
ఇలాంటి సంస్థలు దేశం మొత్తం మీద నాలుగే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఇదొక్కటే కాగా మధ్యప్రదేశ్‌ బుదినిలో ఒకటి, హరియాణాలోని హిస్సార్‌లో మరొకటి, అసోంలోని బిశ్వనాథ్‌ చెరలిలో ఇంకొకటీ ఉన్నాయి. వ్యవసాయ యంత్రమేదైనా మార్కెట్లోకి రావాలంటే ఈ సంస్థ ధృవీకరణ తప్పనిసరి. ఇక్కడ శిక్షణ పొందాలనుకున్నవారు www.srfmtti.dacnet.nic.in లేదా email: fmtlsr@nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తానికి ఈ పొలంబడిలోకి వెళితే రైతన్న సాగుబడిలో గట్టెక్కిపోతాడన్నమాట!

- పునికిలి హరగోపాలరాజు, ఈనాడు, అనంతపురం

సహకారం: జి.రామ్మోహన్‌, గార్లదిన్నె


 

వారెవా... వార్నర్‌!

ఐపీఎల్‌లో గతేడాది హైదరాబాద్‌ జట్టు ఛాంపియన్‌గా నిలిచినా, ఈసారీ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్నా... అదంతా డేవిడ్‌ వార్నర్‌ చలవే! సారథిగా జట్టుని నడిపిస్తూనే, బ్యాట్స్‌మన్‌గా జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయ తీరాలకు చేరుస్తున్నాడు. మైదానంతో పాటు బయట కూడా దూకుడుగా ఉండే ఈ ఆసీ క్రికెటర్‌ గురించి ఇంకొన్ని సంగతులు...

ఒకే ఒక్కడు:
132 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో ఎలాంటి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లూ ఆడకుండా నేరుగా ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న ఒకేఒక్క క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. స్కూల్‌, క్లబ్‌ స్థాయి క్రికెట్లో ‘హార్డ్‌ హిట్టర్‌’గా పేరు తెచ్చుకున్న వార్నర్‌, నేరుగా ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. ఆ మ్యాచ్‌లో 43 బంతుల్లోనే 89 పరుగుల్ని చేసి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

రచన: వార్నర్‌!:
ఆటగాడిగా మైదానంలో చెలరేగిపోయే వార్నర్‌ మంచి రచయిత కూడా. క్రికెటర్‌గా ఎదగాలని ఆశపడే ఓ పిల్లాడి కథని తెలియజేస్తూ

‘ది కబూమ్‌ కిడ్‌’ పేరుతో నాలుగు సిరీస్‌లలో సాగే పుస్తకాలను వార్నర్‌ రాశాడు. ఆ పుస్తకంలో హీరోకి అతడు పెట్టిన పేరు ‘డేవీ వార్నర్‌’.

భార్య ఐరన్‌ ఉమన్‌!: ఆస్ట్రేలియా ‘ఐరన్‌ ఉమన్‌’ టైటిల్‌ని గెలుచుకున్న క్యాండిస్‌ ఫాల్జన్‌ని వార్నర్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మోడల్‌గా మంచి పేరున్న క్యాండిస్‌, తీర ప్రాంతాల్లో మునిగిపోయిన వాళ్లని కాపాడేందుకు స్వచ్ఛందంగా ‘లైఫ్‌గార్డ్‌’గానూ సేవలందిస్తుంది. క్రికెట్‌ ఆడని రోజుల్లో వార్నర్‌, తన భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి విదేశీ పర్యటనల్లోనే ఎక్కువగా గడుపుతాడు.

హైదరా‘బాద్‌షా’!:
మూడేళ్లుగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌, గతేడాది జట్టుని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. తొలి ఏడాదిలో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన వార్నర్‌, రెండో ఏడాదిలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదీ టాప్‌-3లో కొనసాగుతున్నాడు.

ప్రపంచ నం.2:
టెస్టు, వన్డే, టీ20... మూడు ఫార్మాట్లలోనూ ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నరే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో ఏడో స్థానంలో ఉన్న వార్నర్‌, వన్డేల్లో ప్రపంచ నం.2గా కొనసాగుతున్నాడు.

కుడి ఎడమైతే...:
వార్నర్‌ ఎడమ చేతి వాటం ఆటగాడిగానే క్రికెట్‌లో ఓనమాలు దిద్దాడు. కానీ చిన్నప్పుడు తన క్రికెట్‌ కోచ్‌ అతడిని కుడి చేతి బ్యాట్స్‌మన్‌గా మార్చాడు. కోచ్‌ కోసం సహజమైన శైలిని వదులుకోవడం మంచిది కాదని తల్లి సూచించడంతో మళ్లీ ఎడమ చేతి వాటానికి మారిపోయాడు. అందుకే పేరుకి లెఫ్ట్‌ హ్యాండర్‌ అయినా, కుడి చేత్తోనూ వార్నర్‌ ‘స్విచ్‌ షాట్ల’ను అవలీలగా బాదేస్తుంటాడు. మరోపక్క ఎప్పుడూ కుడిచేత్తోనే బౌలింగ్‌ చేస్తూ భిన్నమైన క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ప్రత్యర్థులకూ ప్రశంసలు...:
మైదానంలో కోపాన్ని వెంటనే బయటపెట్టే వార్నర్‌, బయట తోటి క్రికెటర్లపైన తన అభిమానాన్నీ అలానే పంచుకుంటాడు. ‘ధోనీ మొన్న కొట్టిన బాల్‌ ఇందాకే మా ఇంటి కిటికీ అద్దానికి తగిలింది’ అనీ, ‘భారత్‌ కోహినూర్‌ని కోల్పోయినా, కోహ్లి ఉన్నాడు’ అనీ... ఇలా తనదైన శైలిలో అనేక సందర్భాల్లో ప్రత్యర్థులపైనా వార్నర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

గుర్రపు పందేల కోసం...:
హాలీవుడ్‌ సినిమాల్నీ, గుర్రపు పందేల్నీ చూడటం అంటే వార్నర్‌కి చాలా ఇష్టం. ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే... ఓసారి సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ తరఫున ఆడాల్సిన మ్యాచ్‌ని ఎగ్గొట్టి మరీ గుర్రపు పరుగు పందేల్ని చూడటానికి వెళ్లాడు. తరవాత దానికి శిక్ష కింద కొన్ని మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.

స్నేహితుడి మరణం!:
రెండున్నరేళ్ల క్రితం వార్నర్‌ ప్రాణ మిత్రుడూ, ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ క్రికెట్‌ ఆడుతూ బంతి తగిలి మైదానంలోనే ప్రాణం విడిచాడు. మళ్లీ మైదానంలోకి వస్తే స్నేహితుడే గుర్తొచ్చేవాడనీ, ఆ బాధ తట్టుకోలేక క్రికెట్‌కి గుడ్‌బై చెబుదామనుకున్న దశలో తన భార్య అడ్డుపడి తన మనసు మార్చిందనీ వార్నర్‌ చెబుతాడు.