close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
థ్యాంక్‌యూ అమ్మా!

థ్యాంక్‌యూ అమ్మా!
అమ్మ కాబోతున్న ఓ అమ్మాయి అంతరంగం...

మ్‌...మ్మా...

ఇదే కేక... అమ్మ గర్భంలోంచి భూమి మీదకు వస్తూ నేను విన్న మొదటి కేక. పురిటినొప్పులు తట్టుకోలేక- తొమ్మిది నెలలు మోసిన బిడ్డను పేగుబంధంతో ప్రపంచానికి అందిస్తూ...

తాను అమ్మ కావడానికి మా అమ్మ పెట్టిన కేక!

ఇంకా విచ్చుకోని నా చెవులకి వినిపించిన ఆనందపు బాధ అది!

నెమ్మదిగా - నీరసంగా అమ్మ చెయ్యి నా తల నిమురుతూ ఉంటే - ఇంకా రెప్పలు తెరవని నా కళ్ళకి - కనిపించిన భయంలేని ధైర్యం అది!

అప్పుడు నాకేం తెలీదు. అసలు అమ్మా నేనూ కలిసి ఒక్కరే అనుకునేదాన్ని. నేను గుక్కపెట్టి ఏడ్చినప్పుడల్లా- కళ్ళనిండా నీళ్ళు అమ్మకి ఉబికేవి. నాకు ఆకలి వేసినప్పుడల్లా... అమ్మ తన గుండెలు పిండితే నా కడుపు నిండేది. దీన్ని ఏమనాలో అప్పటికి తెలీదు కానీ... ఇప్పుడైతే ‘అద్వైతం’ అంటాను.

చిట్టిచిట్టిగా కనిపించే నాకు పొద్దున్నయితే చాలు... రోజూ వెన్న మీగడలు ఒంటికి రుద్ది, వేడినీళ్ళతో స్నానం చేయించేది. ముందు తన చేతిమీద నీళ్ళు పోసుకుని ఆ తర్వాతే నాకు పోసేది- అవి వేడిగా ఉంటే నాకేమీ కాకూడదని. లాల పోసి, పాలుపట్టి, ఉయ్యాల బల్ల మీద కూర్చుని పెద్ద గాయనిలా ‘జోల’ పాడేది... నాకు నిద్రపట్టాలని.

నాన్న ఆ జోల విని వెక్కిరించేవాడు. ‘ఏంటా గొంతు? పాప పడుకోదు. భయపడి ఏడుస్తుంది’ అనేవాడు. అమ్మ మాత్రం నన్ను గుండెలకు హత్తుకుని ‘ఏం కాదు- నా బంగారుకొండ హాయిగా బజ్జుంటుందీ’ అనేది.

నిజమేనేమో.. ఇప్పుడు పెద్దయ్యాక రాత్రి పన్నెండుదాకా టీవీ చూస్తున్నా రాని నిద్ర- అప్పుడు పిలిస్తే వచ్చేసేది.

నేను నిద్రపోయాక అప్పుడు ఆదరాబాదరా ఇల్లు చక్కబెట్టుకుని రెండు చెంబులు పైన గుమ్మరించుకుని పళ్ళెం ముందు కూర్చునేదా... ఎవరో తట్టిలేపినట్లు అప్పుడే లేచేదాన్ని కెవ్వుమంటూ. పాపం అమ్మ- అన్నం పళ్ళెం పక్కకు నెట్టేసి పరుగున వచ్చేది. ఒళ్ళొకి తీసుకుని బుజ్జగించేది. భుజం మీద వేసుకుని అటుతిప్పి ఇటుతిప్పి మళ్ళీ నిద్రపుచ్చేది.

నాకు మంచి పేరు పెట్టడానికి అమ్మపడే ఆరాటాన్ని చూసి అందరూ నవ్వడమే. ఎంతమందిని అడిగిందీ... ఎన్ని పుస్తకాలు తిరగేసిందీ... ఏ పేరూ నచ్చదే! ఎలాగైతేనేం చివరకు ఒక పేరు సెలక్ట్‌ చేసింది. ఆ రోజు బియ్యంలో అక్షరాలు దిద్దుతుంటే అమ్మ ముఖం అందమైన అరవిందమయ్యింది.

చూస్తుండగానే (నేను కాదు- మిగిలిన అందరూ) కాస్త కాస్త ఎదుగుతున్నాను. బోర్లాపడగానే అమ్మ బొబ్బట్లు చేసింది. అడుగులు వేయగానే అరిసెలు వేసింది. గడప దాటగానే గారెలు చేసింది. ఇవేవీ నాకు పెట్టలేదు కానీ, ఆ రుచి మాత్రం అమ్మచేతి సువాసనలా నాకు తెలిసిపోయింది.

నా అన్నప్రాశన రోజు ఏం పట్టుకుంటానా అని అంతా ఆత్రంగా చూస్తుంటే... పాకుతున్న నాకు చిన్ని రాయి గుచ్చుకుంది. అంతే... గుక్కపట్టిన నన్ను గుండెలకదుముకుని ఆ రోజంతా అమ్మ అన్నం ముడితే ఒట్టు.

అందుకే అనిపిస్తుంది- అమ్మంటే వెండిగిన్నెలో కలిపిన వెన్నెల బువ్వ... అమ్మంటే గుండెలకి అదుముకునే వెచ్చటి చందమామ...

నాకు పూర్తిగా మాటలు రాక అ..త్త... అని ముద్దముద్దగా అంటుంటే- అమ్మ మురిసిపోయి చూస్తూ ముద్దులు పెట్టేసేది. వచ్చినవాళ్ళకల్లా మురిపెంగా చెప్పుకునేది.

ఎప్పుడైనా నాకు కాస్త జ్వరం వచ్చిందా- ఇంక అమ్మ కంగారు చూడాలి. ఒకసారి ఇలాగే డాక్టరుని కూడా తిట్టేసి ‘చంటిది అలా బాధపడుతుంటే ఏం మందులిస్తున్నారు మీరు?’ అని గద్దించింది. ఆయన అదిరిపడి ‘మందు వేసి పది నిమిషాలే అయిందమ్మా... కాస్త ఓ పూట ఓపికపట్టు’ అంటుంటే- అమ్మ సంగతేమో కానీ నాన్న మాత్రం చాలా ఇబ్బందిపడి తన చెయ్యి పుచ్చుకుని బయటకు లాక్కొచ్చాడు. జ్వరం తగ్గేదాకా అమ్మ ముఖంలో నవ్వనేది లేదు, నన్ను ఒడి దించలేదు.

నాకు కాస్త వూహ తెలిశాక (మరి ఇప్పటిదాకా చెప్పినవన్నీ నీకెలా తెలుసు అని అడగకండి. ఎవరెవరో ఎన్నెన్నో చెప్పేవారు. కానీ అన్నిటికన్నా ఎక్కువగా అన్నీ తెలిపే మహత్తు మనసుకే ఉంటుంది... తెలుసా?!) ప్రతిరోజూ రాత్రి బాదం చెట్టు కింద మంచంవేసి, నన్ను ఒళ్ళొ పడుకోపెట్టుకుని బోలెడు కథలు చెప్పేది అమ్మ. అవి వింటూ ‘వూఁ’ కొట్టేదాన్ని. పైన చూస్తే ఆకాశం నుంచి జారే వెన్నెల... పక్కన చూస్తే అమ్మ కన్నుల్లో కురిసే వెన్నెల... అది ఎంతసేపైనా నేలకు వాలని ఆనందాల అల!

నాకు నాలుగేళ్ళు వచ్చేసరికి అమ్మకి అంతగా ఇష్టంలేని పని ఒకటి చేశారు నాన్న. అలా చేయొద్దని చాలా గొడవ పెట్టింది అమ్మ... ‘పిల్లని అప్పుడే బళ్ళొ వేయడం ఏమిటీ’ అని! నాన్న కాస్త విసుగ్గా ‘నీకు మతిపోయింది. దానికి చదువొద్దా’ అని అరిచేసరికి... ‘అబ్బే, అది బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అంది చటుక్కున. నాన్న ఒకటే నవ్వు. అప్పుడు అమ్మ ముఖం ఎర్రగా కందిపోయి, విచ్చుకున్న మందారంలా మారింది. ‘నవ్వకండి, ఇంత పసిదాన్ని అప్పుడే బడికి వెళ్ళనివ్వను’ అని ఏడుస్తుంటే- నాన్నే ఓదార్చి, ఒప్పించి నన్ను బళ్ళొ చేర్పించారు.

ఇక అమ్మకి రోజూ ఎదురుచూపులే! సాయంత్రమైతే చాలు... పసుపు రాసిన మా ఇంటి గుమ్మానికి ఆనుకుని- అలా నాకోసం నిరీక్షణ. వీధివీధంతా పరుగులు తీసే అమ్మ చూపులు. ఎప్పుడొస్తానా అని ఆత్రుత. వచ్చేస్తూ ఉంటుందన్న ఆశ...వచ్చే క్షణం వచ్చేయగానే పరుగులు తీసే సంతోషాల సెలయేరు. నన్ను ఎత్తుకుని, హత్తుకుని... అంతలోనే తనని తాను తిట్టుకుని, వంటింట్లో చేసిపెట్టిన జంతికలూ సున్నుండలూ గబగబా తెచ్చి నాకు తినిపించేది.

పరీక్షల ముందు చదివి చదివి బుర్ర వేడెక్కినపుడు కబుర్లు చెప్పి మనసు మళ్ళించేది. పరీక్ష బాగా రాయలేదని దిగులుపడి తప్పుతానేమోనని భయపడి ఏడుస్తూ కూర్చుంటే- ‘నువ్వు తప్పడం ఏంటీ, ఫస్టు వస్తావు చూడు’ అంటూ ధైర్యం చెప్పేది.

ఎన్నని చెప్పను ఆ కథలన్నీ...

పెద్దవుతున్నకొద్దీ అమ్మతో దగ్గరితనం ఇంకా పెరిగింది. మబ్బులుపట్టి ఆకాశం అంతా నల్లగా మారిపోతే... చల్లటిగాలి ఒంటిని తాకి ఝల్లుమనిపిస్తుంటే... వాన చినుకులు లేతలేతగా మేని మీద జారిపోతుంటే... అమ్మ చెయ్యి పట్టుకుని, పట్టీల కాళ్ళతో నీళ్ళల్లో ఘల్లుఘల్లున శబ్దం చేయడం... ఎంత గొప్ప సంగీతానుభూతి?!

సంక్రాంతి ముగ్గులు, ఉగాది చిగురులు, హేమంతాలు, వసంతాలు కలిపి చేసిన కొత్త రుతువులా... ఎప్పటికీ సవ్వడి చేస్తూనే ఉంటాయి ఈ గుండెలోతు వాద్యాలన్నీ...

అలా అలా... వయసుతోపాటే తరలివచ్చిన యవ్వనం పలకరించింది నన్ను.

బుగ్గలనిండా సిగ్గు, గుండెలనిండా గర్వం, కనురెప్పల మీద వాలే కలల కనకాంబరాలు, మెత్తటి పెదవి మీద పూచే మధురమైన వూహల ఉత్పలమాలలు. అన్నీ తెలిసిన క్షణంలో... ఏమీ తెలియనితనం కమ్మేసినప్పుడు అమ్మ చెప్పింది-

‘కంగారేంలేదురా బంగారుతల్లీ... ఎవరితోనైనా మాట్లాడు, ఫర్లేదు... కానీ, ఏం మాట్లాడుతున్నావో చూసుకో! ఎక్కడైనా నవ్వు, ఫర్లేదు... కానీ, ఎవరిముందు నవ్వుతున్నావో చూసుకో! ఎవరినైనా నమ్ము, ఫర్లేదు... కానీ, ఏ కారణంగా నమ్ముతున్నావో చూసుకో! వాళ్ళు ఆడా మగా అన్నది కాదు- పరిచయం వేరు, స్నేహం వేరు అని తెలుసుకోవడం ముఖ్యం. మనదే కదాని ముద్దు పెట్టుకుంటే దీపం కూడా కాలుతుంది. కట్టుబాటంటే నిన్ను కట్టిపడేసేదని తిట్టుకోకు. ఒక్కోసారి అదే నీ చుట్టూ రక్షణ గోడ కట్టేది. మళ్ళీ చెబుతున్నా... కెరటాలు ఎన్నో పొంగుకొస్తాయి. ఫర్లేదు, చెలిమి చెలియలి కట్ట దాటకుండా మాత్రం చూసుకో...’

మాట రాలేదు నాకు. మనసంతా స్తబ్దుగా అయిపోయింది. కుండపోతగా వాన కురిశాక... ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించినట్లు...

పెద్దగా చదువుకోని అమ్మ-

గడపదాటి వీధిలోకి కూడా అరుదుగా మాత్రమే వచ్చే అమ్మ... వయసు వంతెనని కొద్దికొద్దిగా- కాస్త ఒద్దికగా ఎలా దాటాలో... చిన్నచిన్న మాటల్లో ఎంత గొప్పగా చెప్పింది...

ఎవరుంటారు అమ్మకన్నా గొప్ప సైంటిస్టులు కానీ, సైకాలజిస్టులు కానీ..!

నేను బిజినెస్‌ స్కూల్‌ నుంచి బయటకు వచ్చేంతవరకూ అమ్మ చెప్పిన ఈ వేదమే నా భుజం మీద స్నేహంగా చెయ్యి వేసింది. చెవుల్లో మంత్రధ్వనిలా మళ్ళీమళ్ళీ వినిపించింది.

అయినా... తరం తాలూకు అంతరం గొంతు విప్పుతూనే ఉంది.

పడుకునేముందు ముఖానికి పసుపు రాసి, తలకి నూనె రాసి ‘ఇప్పుడు నిద్రపో’ అని అమ్మ అంటే- ‘ఈ కాలంలో కూడా ఏమిటిది... హాయిగా మాయిశ్చరైజరూ, హెయిర్‌ క్రీమూ రాసుకోనీక’ అని విసుక్కునేదాన్ని.

తెల్లవారుజామునే నిద్రలేపి ‘నలుగు పెట్టుకుని, కుంకుడుకాయల రసంతో తలారా స్నానం చెయ్‌’ అంటుంటే, ‘నీకు ఛాదస్తం బాగా పెరిగిందమ్మా’ అని కసురుకునేదాన్ని.

ఇంకా ఎన్నని చెప్పను? స్కూటీ నడిపేటప్పుడు జాగ్రత్తలు చెప్పినా, బర్గర్లు తిన్నప్పుడు వద్దని వారించినా, కంప్యూటరు ముందు కూర్చుని గంటల తరబడి నెట్‌లో వర్క్‌ చేస్తుంటే- తగ్గించుకోమని బుద్ధులు చెప్పినా... ‘అబ్బ ఆపమ్మా నీ నీతులు’ అని తీసిపడేసేదాన్ని.

అయినా ఎంత సహనం అమ్మకి!

‘ట్రెండీగా ఉండు తల్లీ... కానీ ట్రెడిషన్‌ మర్చిపోకు’ అనేది తనకి వచ్చిన ఇంగ్లిషు పదాలు వాడుతూ... అంతేతప్ప, ఒక్క ముక్క తిట్టేది కాదు. తలచుకుంటే గుండె భారమవుతుంది. కళ్ళు నీటి చెలమలవుతాయి.

ఎలా క్షమించావమ్మా మా విసుగుని- మా తొందరపాటుని... ఎవరిచ్చారమ్మా నీకింత ఓర్పుని!

ఆ మనసు తడిని ఒడిసిపట్టుకుని మాస్టర్స్‌ పూర్తి చేశాను. జాబ్‌లో కూడా చేరాను. ఇక అప్పట్నుంచీ నాకు మంచి సంబంధం దొరకాలని అనుక్షణం ఆ దేవుడికి మొక్కుకునేది అమ్మ.

ఆరోజు... పెళ్ళివారు వచ్చి ముందు గదిలో కూర్చున్నపుడు- నాకు అప్పుడే పెళ్ళి వద్దు- అంటూ పేచీకి దిగిన నన్ను చూసి ‘నీ మనసులో ఎవరైనా ఉన్నారా?’ అని అడిగి, నా ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది అమ్మ. నా మనసులో ఎవరూ లేరని తెలిశాక, నిశ్చింతగా నిట్టూర్చి నిమిషంలో నన్ను అపరంజి బొమ్మలా అలంకరించి, కోరివచ్చిన ఆ అందగాడి ముందు కూర్చోబెట్టింది. ఇద్దరం ఒకరికొకరం నచ్చామని తెలుసుకుని మురిసిపోయింది.

ఇక అక్కడి నుంచీ హడావుడి అంతా అమ్మదే. తన ఒళ్ళు హూనమైనా పగలూ రాత్రీ ఆపని పని!

బియ్యం కట్టేది, పసుపు కొట్టేది, పట్టు చీరలు తెచ్చేది, బంగారపు గాజులు కొనేది... ఇంకా చాలా చాలా... ఇవన్నీ మామూలుగా రాలేదు. నాన్న డబ్బు చాలక ఇబ్బందిపడుతుంటే, అమ్మ తన బంగారమంతా అమ్మేసిందని తర్వాత ఎప్పుడో తెలిసింది. ఇవేమీ పట్టించుకోకుండా పీటల మీద కూర్చున్నాను నేను.

మామిడాకుల పచ్చి పరిమళం చుట్టుముడుతుంటే... సొగసుగా వేసిన మల్లెపూల జడమాటు నుంచి వెచ్చటి వేళ్ళు నా మెడలో మాంగల్యం కడుతుంటే... అమ్మ కళ్ళలో వెలిగిన సంతృప్తి చూసినప్పుడు- అప్పుడే నిజంగా కనిపించింది నాకు అరుంధతీ నక్షత్రం.

ఈ పరవశాల పారాణి ఆరకుండానే అప్పగింతల వేళ ఓ దుఃఖం మేఘంలా కమ్మేసింది. ‘బాబూ, ఈ చిట్టితల్లి మా ఇంటిదీపం, మా కంటివెలుగు. దాని కంట్లో నలకపడితే, దాని కాల్లో ముల్లు విరిగితే మా గుండెలు జారిపోతాయి. పువ్వులాంటి పిల్లను నీ చేతిలో పెడుతున్నాం. ప్రాణంలా చూసుకో’ అంటూ పదేపదే చెప్పింది పూడిపోతున్న గొంతుతో. చిన్నప్పుడు నేను పక్క తడిపితే ఆప్యాయంగా బట్టలు మార్చిన అమ్మ- ఇప్పుడు నిస్సహాయంగా నాకోసం ఏడుస్తూ నా భుజాన్ని తడిపేస్తుంటే...

పెళ్ళయ్యేంత వరకూ ఓ బెంగ...

పెళ్ళై మెట్టినింటికి వెళ్ళిపోతుంటే ఆగకుండా పొంగే కన్నీటి గంగ...

నేను వెళ్ళిపోయాను... అమ్మను వదిలి!

కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు- అన్నిటికీ మించి ఎగసిపడే సరికొత్త భావాల అనుభవాలు...

ఎదురుగా ‘అతను’...

ఎదురుచూసే ఉత్సుకతని ఏమని చెప్పను?

బిడియపు గడియ తీస్తే...

మొహమాటం మోహమాటమై, తీరని తమకం తీయని గమకమై, అనుభూతి ఇంతై... ఇంతింతై... కలల కౌగిలింతై... గడియారమే తెలియని ఘడియలవి.

కానీ కాలం వూరుకోదుగా...

ఏవో చిరాకులు- చిన్నచిన్న గొడవలు...

అసహనాలుగా మారే అలకలు- భేదవిభేదాలు... మాటల యుద్ధాలు...

మళ్ళీ అమ్మే దిక్కు...

తక్షణం నా ముందు వాలిపోయింది.

ఇద్దరినీ కూర్చోపెట్టి చెప్పింది... ‘కోపం కర్పూరంలా వెలిగి ఆరిపోవాలి. అప్పుడే కాపురంలో వెలుగు ఆరకుండా ఉంటుంది. భార్యాభర్తల రాజ్యంలో అనుమానం, అవమానం... ఈ రెండు పదాలూ నిషిద్ధం. కాదని కలతలు వస్తే సర్దుకోవాల్సింది సూట్‌కేస్‌ కాదు, కాస్త అహాన్నీ... కొన్ని అభిప్రాయాల్నీ..! అది ఓడిపోవడం కాదు - ఓర్పుతో గెలవడం.’

అప్పటిదాకా బింకంగా ఉన్న తను కూడా అమ్మ చేతుల్లో ముఖం దాచుకున్నాడు.

జీవితపు లోతుల్ని అనుభవాల కవ్వంతో చిలికిన నా ‘ఛాదస్తపు’ అమ్మ అందించిన అమృతపు చుక్కలివి...

అన్నీ సద్దుమణిగి ఏడాది దాటుతుండగానే కడుపుపండింది నాకు.

అమ్మ సంతోషం పట్టతరమా?!

‘ఇది చెయ్యి, అది చెయ్యకు... ఇది తిను, అది తినకు... పురిటికి పుట్టింటికి వచ్చావు. పండంటి బిడ్డను కనాలి... ఆ చిట్టి అల్లరి ఏడుపు మేం వినాలి’ అంటూ ఎన్ని సేవలు, ఎన్ని జాగ్రత్తలు...

నన్ను కనడమే కాదు... నిద్రలోనూ నాకు అలసట కలగకూడదని నా కలల్ని కూడా తనే కంటూ...

నన్ను అమ్మని చెయ్యాలని నా అమ్మ పడే తపన... కాదు... అది తపస్సు...

నాకు సేవలు చేయడం ఇంకా పూర్తి కానేలేదు, నాకు పుట్టబోయే బిడ్డకు సేవలు చెయ్యడానికి ఆనందంతో ఎదురుచూస్తోంది అమ్మ.

ఏమిటమ్మా ఇంత శ్రమ... ఎక్కడిదమ్మా ఈ అంతులేని ప్రేమ... దేవుడైనా అవతారానికీ అవతారానికీ మధ్య కాస్త విశ్రాంతి తీసుకుంటాడేమో కానీ... నీకు మాత్రం అరక్షణం విరామం కూడా లేదా అమ్మా...

నిన్న - ఈరోజు - మళ్ళీ రేపు...

అప్పుడు - ఇప్పుడు - మళ్ళీ ఎప్పుడైనా...

పొత్తిళ్ళలోనూ, అత్తిళ్ళలోనూ, ఆగని కన్నీళ్ళలోనూ, ఆర్తిగా అల్లుకునే కౌగిళ్ళలోనూ... ఎటుచూసినా, ఎక్కడ చూసినా నువ్వై... విశ్వమంతా మోగే మమతల మువ్వై...

ఏమివ్వగలనమ్మా నీకు...

ఈరోజు అమ్మ రోజు(మదర్స్‌ డే) కదా...

నేనూ అమ్మను కాబోతున్న ఈ సమయంలో నా అణువణువులో ఆగక పొంగే భావాలన్నీ అక్షరాలుగా మార్చి...

నాలోని ప్రాణశక్తినంతా పదాలుగా పేర్చి...

జీవితంలో ఎప్పుడూ చెప్పని ఒకే ఒక్కమాట చెప్పాలని ఉందమ్మా...

నాకు తెలుసు- నువ్వు పెదవులు బిగించి ‘నాకు అలా చెప్పాలా... అసలు అలా చెప్పొచ్చా’ అంటూ ప్రేమగా విసుక్కుంటావు...

అయినా చెబుతాను...

నా తృప్తి కోసం చెబుతాను...

నీకు అమ్మనై పుట్టి నీ రుణం తీర్చుకోవాలన్నంత ఆర్తితో తపనతో ప్రేమతో చెబుతాను...

థ్యాంక్‌యూ అమ్మా..!
- అజయ్‌శాంతి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.