close
మాణిక్యాలు

మాణిక్యాలు
- శ్రీమతి నండూరి సుభద్రాదేవి

బిగ్‌ బజార్లో సరుకులు కొంటూ క్రోకరీ స్టాల్‌ లోపల ఉన్న వ్యక్తిని చూసి తుళ్ళిపడ్డాడు భార్గవ. ఆ వ్యక్తి నడివయసు దాటినవాడు. ఎవరో కష్టమర్‌తో మాట్లాడుతున్న అతడిని ఎంతసేపు అలా చూస్తూండిపోయాడో తనకే తెలియదు. అతడు కూడా అనుకోకుండా తలతిప్పి తనకేసి చూడటంతో తెలివి తెచ్చుకుని ముందుకు కదిలాడు.

తీసుకున్న సరుకులకి బిల్లు చెల్లించి బయటకు వచ్చాడేగానీ, మనసు ఇంటికి రానని మొరాయిస్తోంది. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి అతడిని చూడాలనే కోరికను బలవంతంగా అణచుకుని వెహికిల్‌ స్టార్ట్‌ చేశాడు.

ఇంటికివచ్చాక కూడా అదే ఆలోచన. మనిషిని పోలిన మనుషులుంటారని అంటారు కానీ, ఇంత దగ్గర పోలికలా? ఆ వ్యక్తిని చూస్తే తన చిన్ననాటి తన తండ్రి రూపం గుర్తొచ్చి మనసు ఉద్వేగభరితమైంది. తన అన్నయ్య కూడా ఇంచుమించు అలాగే ఉంటాడు. అన్నయ్య తర్వాత ముగ్గురు అక్కలు. ఆ తర్వాత మరో కాన్పు పోయిన మూడేళ్ళకి తను పుట్టాడు. తనకీ అన్నయ్యకీ పదహారు సంవత్సరాలు తేడా ఉంది.

అన్యమనస్కంగానే పనులు పూర్తి చేశాడు.

‘‘బజారుకి వెళ్ళొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను... ఎందుకింత పరధ్యానంగా ఉన్నారు? ఎవరితోనైనా ఏమైనా ఇబ్బంది వచ్చిందా?’’ భార్య ఝరి అడిగింది.

‘‘పెద్ద కారణమంటూ ఏమీలేదు ఝరీ’’ అంటూ జరిగింది చెప్పాడు.

‘‘మనం ఇక్కడికొచ్చి కేవలం ఎనిమిది నెలలైంది. మనకి తెలియని చుట్టాలు ఎవరున్నారిక్కడ? మనిషిని పోలిన మనుషులుండటం సహజమే. మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి నాక్కూడా ఆయన్ని ఒకసారి చూడాలని ఉంది. ఈసారి అలా సరుకులకి వెళ్ళినప్పుడు చూసొద్దాం’’ ఆఫీసుకు టైమవడంతో ఆ సంభాషణకు తెరపడింది. ఇద్దరూ ఒకే ఎమ్‌ఎన్‌సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తుంటారు. పెళ్ళయిన వారం రోజులకే ఆర్డర్లు వచ్చి జాయినయ్యారు.

ఆ సంఘటనని అంత తేలిగ్గా మర్చిపోలేదు భార్గవ.

నెల గిర్రున తిరిగిపోయింది. సరుకులకి ఈసారి ఝరినీ వెంటబెట్టుకుని వెళ్ళాడు. అసలు ఉద్దేశ్యం ‘ఆ వ్యక్తిని’ చూడటం కోసమే. ఆయన్ని చూస్తూనే తెల్లబోవడం ఈసారి ఝరి వంతైంది. ఝరికి భార్గవ తండ్రి తెలియకపోయినా, తన బావగారు అచ్చుగుద్దినట్లు ఆయనలాగే ఉంటారు. ‘‘మీ మాటలు నిజమే సుమండీ’’ అంది భర్తతో.

ఆయన కౌంటరు ఖాళీగా ఉండటంతో వీళ్ళనే పరిశీలిస్తున్నాడు. దగ్గరకి పిలిచాడు.

‘‘ఏమిటీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకేసి అంత పరీక్షగా చూస్తున్నారు?’’ అడిగాడు నవ్వుతూనే.

‘‘మీరు అచ్చు మా నాన్నగారిలా, మా అన్నయ్యలా ఉన్నారు. మాది ఇక్కడ కాదు. తూర్పు గోదావరి జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు. ఎన్నో యోజనాల దూరం ఉంది. అదీగాక మిమ్మల్ని ఎన్నడూ మా బంధుజనంలో చూసి ఎరుగను. మరి ఇది ఎలా సాధ్యమో తెలియడంలేదు.’’

‘‘మనిషిని పోలిన మనుషులండటం సహజమే. పోనీ నన్ను మీరు మరో అన్నయ్య అనుకోండి. ఎక్కడ పని చేస్తుంటారు మీరు?’’ నవ్వుతూనే అడిగాడు. చెప్పాడు భార్గవ.

ఈలోగా ఎవరో కస్టమర్లు రావడంతో పనిలో పడిపోయాడతడు. వీళ్ళూ కదిలారు.

పదిహేను రోజులు గడిచాక, ఒకరోజు భార్గవ కూరలు కొనుక్కుని వస్తుంటే అతడు ఎదురయ్యాడు. నవ్వుతూ పలకరించాడు. షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతే చాకచక్యంగా మాటల్లో పెట్టాడు భార్గవ. అతడు అర్థంచేసుకుని చెయ్యి వెనక్కి తీసుకున్నాడు... ఉద్యోగాలవల్ల వచ్చిన అంతరం కావచ్చు. తన పేరు ‘ఆదినారాయణ’ అని చెప్పి ‘‘మా ఇల్లు ఇక్కడే, ఒకసారి రండి... వెంటనే వెళ్ళిపోదురు’’ అన్నాడతడు.

‘మరోసారి వస్తాను’ అనబోయి, అసలు సంగతేమిటో తెలుసుకుందామని వెళ్ళాడు భార్గవ. ఇంట్లో బీదరికం తాండవిస్తోంది. అతడి భార్యా, ఇద్దరు పిల్లలూ, ముసలి తల్లీ ఉన్నారు. అందరూ ఎంతో సంస్కారంగా పలకరించారు.

‘‘అమ్మా, నీకు మొన్నొకరోజున చెప్పానే... కాస్త నాలాగా ఉండి, వయసులో చిన్నగా ఉన్న వ్యక్తి కనిపించారని- ఆయనే ఈయన’’ పరిచయం చేశాడు తల్లికి.

ఆవిడ తల పండిన వృద్ధురాలు. భార్గవని ఆప్యాయంగా పలకరించింది.

‘‘ఏ వూరు బాబూ మీది? మా ఆదినారాయణ మీ గురించి చెప్పాడు’’ అంది.

చెప్పాడు భార్గవ.

‘‘అక్కడ ఎవరి తాలూకు?’’ ఆమె కళ్ళలో తీవ్రమైన కుతూహలం.

‘‘కుసులూరు బాపిరాజుగారి ఆఖరి అబ్బాయినండీ. వారంతా మీకు తెలుసా?’’

‘‘తెలుసు బాబూ, నేనూ అక్కడినుంచే వచ్చాను. మీ తాతగారు ఆదినారాయణగారే కదా?’’

‘‘అవునండీ, మీకు బంధుత్వం ఏమైనా ఉందా?’’

‘‘బంధుత్వమా? బంధుత్వం అంటే... అంటే...’’ తడబడిందామె. కాసేపటికి తేరుకుంది. ‘‘బంధుత్వంకంటే బలమైన బంధమే ఉంది నాకూ బాపిరాజుగారికీ.’’

‘‘అర్థమయ్యేలా చెప్పండి’’ విసుగుతో కూడిన ఆత్రుత అతడి గొంతులో.

ఆమె కొడుకూ కోడలూ కుతూహలంగా చూస్తున్నారు ఇద్దరికేసి.

‘‘బాబూ, నన్ను తప్పుగా అర్థంచేసుకోకు. మీ నాన్నా నేనూ క్లాస్‌మేట్స్‌మి. ఒకే కులం కావడంతో మా ఇద్దరిమధ్య చనువుకి అడ్డంకి లేకపోయింది. ఏ బలహీన క్షణాన్నో ఒకటయ్యాం. కులానికిలేని అడ్డుగోడ ధనానికి వచ్చింది. మా పేదరికమే నా పాలిటి శాపమైంది. ‘ఛస్తా’మని బెదిరించి, మీ నానమ్మా అమ్మమ్మా మీ నాన్నకి పెళ్ళి చేశారు. అప్పటికి నేను మూడోనెల గర్భవతిని. ఇంట్లో మగదక్షత లేకపోవడంతో గట్టిగా మీవాళ్ళని నిలదీసి అడిగేవాళ్ళులేక మా అమ్మని తీసుకుని శాపగ్రస్థలా ఇంట్లోంచి బయటపడ్డాను’’ ఆవిడ ఏదో చెప్పుకుపోతోంది.

ఆమె కోడలు కాఫీ తీసుకువచ్చి టీపాయ్‌ మీద పెట్టింది.

‘‘తీసుకో బాబూ, నువ్వు పుట్టావని తెలిసింది కానీ, నిన్ను చూడటం ఇదే’’ ఆవిడ వచ్చి బుగ్గలు పుణికింది.

అసహనంగా లేచి నిలబడ్డాడు భార్గవ.

‘‘వస్తాను, పనుంది’’ ముక్తసరిగా అనేసి బయటపడ్డాడు.

‘‘కాఫీ తీసుకోలేదు’’ వెనకాల నుంచి ఆమె కోడలి గొంతు.

వినబడనట్లుగా అడుగులు వేశాడు.

ఇంటికొచ్చి అలసటగా సోఫాలో కూలబడిన భర్తను చూసి కలవరపడింది ఝరి.

ఆమె తెచ్చిచ్చిన చల్లటి నీళ్ళు తాగి, కాసేపటికి కుదుటపడ్డాడు భార్గవ.

‘‘ఏమైందండీ, ఎందుకలా ఉన్నారు?’’

‘‘ఏం చెప్పమంటావు ఝరీ... ఆవేళ మనం షాపింగ్‌మాల్‌లో చూసిన వ్యక్తి ఎవరో కాదు. మా అన్నయ్య అంటూండేవాడు... మా నాన్నకో ఉంపుడుగత్తె ఉండేదనీ, మా నాన్న పెళ్ళయ్యేదాకా అక్కడికి తరచూ వెళ్తూండేవాడనీ. ఈ మహాతల్లివల్లే మా ఇంట్లో కలతలు రేగాయి ఝరీ. మా ఇంట్లోని నగలన్నీ ఈమే కాజేసిందట. ఆ నగలూ డబ్బూ తీసుకుని వూళ్ళొంచి పారిపోయిందనీ, మా నానమ్మ ఎంతో బాధపడేదనీ చెప్పేవాడు మా అన్నయ్య. వాటికోసం పోలీసులకి కంప్లైంట్‌ ఇస్తే, ఇంటిపరువు బజారుకెక్కుతుందని నానమ్మ వూరుకుందట. తాను ధరించాల్సిన నగలు పరాయి సొత్తయి పోవడంతో అమ్మ కూడా ఎన్నోసార్లు నాన్నని ఆడిపోసుకుందట. ఇవన్నీ అన్నయ్య చెబితేనే తెల్సింది.’’

‘‘చూడండి, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఆమె పక్షాన కూడా ఆలోచిద్దాం. నగలు ఆమె రప్పించుకుందో, లేక మామయ్యగారే తీసుకువెళ్ళి ఇచ్చారో మనకి తెలియదు. ఆయన మరో వివాహం చేసుకున్నందుకు, ఆమె స్థానంలో మరో స్త్రీ ఎవరైనా అయినట్లయితే ఎంతోకొంత గొడవ జరిగి ఉండేది. నిజానికి మన ఆస్తిలో అతడికీ భాగముంది. కానీ ఆమెగానీ అతడుగానీ ఏమీ ఆశించలేదు. వారి వివరాలైనా మనకు తెలియవు కూడా.’’

‘‘అంటే, ఏమిటీ నీ ఉద్దేశ్యం... ఆ అలగావాళ్ళని సమర్థిస్తున్నావా? ఆస్తికోసం కోర్టెక్కమను. వ్యాజ్యానికి వెయ్యేళ్లు, మనిషికి నూరేళ్ళు. ‘ఓడిపోయినవాడు కోర్టులో ఏడిస్తే, నెగ్గినవాడు ఇంటికొచ్చి ఏడుస్తా’డని నానుడి ఉండనే ఉంది ఝరీ. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది’’ అక్కడనుండి కదిలాడతడు.

‘‘వాళ్ళకి ఆ ఉద్దేశ్యం ఉంటే, ఎప్పుడో ఆ పని చేసేవారు. వాళ్ళఇంట్లో పరిస్థితులేమిటో మనకి తెలియదు. వాళ్ళు మనింటికి వచ్చి ఎన్నడూ మనల్ని ఇబ్బందిపెట్టిన దాఖలాలు నాకైతే తెలియదు. నాదీ ఆ వూరే కదా’’ అన్నదామె.

‘‘ఝరీ, మా నాన్న లేడు, సాక్ష్యానికి రాడు. మా అమ్మ పోయింది. ఇక వీళ్ళ ప్రస్తావన మనకెందుకు? అతడు ఎవరి సంతానమో మనకి తెలీదు. ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుని ఉండవచ్చు కదా? వద్దు వద్దనుకుంటూనే మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక వాళ్ళని నువ్వు సమర్థించడానికి వీల్లేదు’’ శిలాశాసనంగా చెప్పి లోపలికెళ్ళాడు.

ఇక మాట్లాడటానికేమీ మిగలక ఝరి కూడా పనిలోపడింది. ఝరి- భార్గవకి దూరపు చుట్టం. ఒకే వూరూ, చదువులూ ఒకటే కావడంతో సంబంధాలు కుదుర్చుకుని పెళ్ళి చేశారు. కాకతాళీయంగా ఉద్యోగాలూ ఒకేచోట రావడంతో ఈ వూరు వచ్చి కాపురం పెట్టారు.

‘‘ఝరీ, మనం సరుకుల కోసం బిగ్‌ బజార్‌కి వెళ్ళొద్దు. ఎక్కడపడితే అక్కడ కిరాణాకొట్లు ఉన్నాయిగా’’ అన్నాడో రోజు. అప్పటికి రెండు నెలలయిపోయింది అక్కడికి వెళ్ళి.

‘‘అలాగేలెండి’’ అంది ఝరి.

ఆమె తండ్రి వూరి నుంచి వస్తూ, కొన్ని సరుకులు అక్కడనుంచి తెచ్చాడు. దాంతో ఇక కొన్నాళ్ళపాటు సరుకుల కోసం వెళ్ళాల్సిన అవసరం కలగలేదు వాళ్ళకి.

ఒకరోజున ఆఫీసు వర్క్‌తో బిజీగా ఉన్నాడు భార్గవ. ఎవరో విజిటర్‌ వచ్చారని కబురు తెలియడంతో బయటకొచ్చాడు. ఆదినారాయణ నిలబడి ఉన్నాడు. ఏహ్యంగా అతడికేసి చూశాడు భార్గవ.

‘‘ఏమిటీ, సరాసరి ఇక్కడికే దాపురించావ్‌?’’ కటువుగా అడిగాడు.

‘‘అమ్మ... అమ్మ మిమ్మల్ని ఒకసారి చూడాలని అనుకుంటోంది. మీరు కనిపిస్తారేమోనని ఇన్నాళ్ళూ చూశాను. ఇవాళ తప్పనిసరయి వచ్చా’’ మాటల్ని కూడదీసుకున్నాడు.

‘‘అమ్మ... ఎవరికి అమ్మ? నాకు రావడానికి వీలవదు’’ లోపలికెళ్ళబోయాడు.

‘‘చూడండి... మీరు నన్ను చీదరించుకున్నా సరే, అమ్మ పెద్దావిడ. ఆవిడ వయసుకి అయినా గౌరవం ఇచ్చి, రేపు ఆదివారం ఒకసారి రండి’’ వెళ్ళిపోయాడు ఆదినారాయణ సమాధానం కోసం ఎదురుచూడకుండా.

‘అనవసరం’ అనుకుంటూనే, ఇంటికివెళ్ళాక ఝరితో చెప్పాడు.

‘‘ఏం చేద్దామనుకుంటున్నారు?’’ అడిగింది ఝరి.

‘‘నాకు వెళ్ళాలని లేదు ఝరీ. ఆ అలగా కొంపకి నేను వెళ్ళను’’ చీదరగా అన్నాడు.

‘‘అస్తమానూ ‘అలగా, అలగా’ అని ఎందుకంటారు? అహం పెరిగితే పతనం మొదలైనట్లేనని వినలేదా? పెద్దావిడ... ఏ కారణంచేత కబురుపెట్టిందో, వెళ్ళడం మానేసినా మనకొచ్చిన నష్టంలేదు. కానీ, ఆ పెద్దామెకేదైనా తేడా వస్తే? జీవితాంతం మనసులో కలుక్కుమంటుందా లేదా... ఆలోచించండి. పోనీ, నేను కూడా వద్దామనుకుంటే మా అక్కా బావగారూ లంచ్‌ కొస్తామని ఫోన్‌ చేశారు. మీరు వెళ్ళిరండి. ఇంట్లో కూర్చుని వ్యతిరేకంగా ఆలోచించడం మంచిది కాదు.’’

అయిష్టంగానే బండి బయటికి తీశాడు.

‘‘అక్కడ వాళ్ళతో ఏమీ గొడవ పడకండి. అవసరమైనంత వరకే మాట్లాడటం మంచిది’’ ఇంకా ఏదో హితవు చెప్పబోయింది ఝరి. మధ్యలోనే తుంచేశాడతడు.

‘‘అయ్యాయా నీ ప్రవచనాలు? ఇక లోపలికెళ్ళు. అసలే మా ‘పితృపాదులు’ చేసిన నిర్వాకానికి వూళ్ళొ తలెత్తుకోలేకపోయారు మావాళ్ళు. ఇక నేను కూడా వీళ్ళకి సేవ చేసుకుని తరించాలి. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కబురుపెట్టిందో మహాతల్లి’’ కసిగా వెహికిల్‌ స్టార్ట్‌ చేసుకుని దూసుకుపోయాడు.

నిట్టూర్చి లోపలికి నడిచింది ఝరి. ‘ఏ గొడవలు పెట్టుకొస్తాడో’నని లోపల ఆమెకి బెరుగ్గానే ఉంది. అక్క ఫోన్‌ చేయడంతో మాటల్లోపడిపోయింది.

‘‘వచ్చావా బాబూ, లోపలికి రా’’ నవ్వుతూ ఆప్యాయంగా ఆహ్వానించిందామె.

అదేమీ పట్టించుకోకుండా విసురుగా లోపలికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ‘సంగతేమిటో చెప్పండ’న్నట్లు అసహనంగా ఆమెకేసి చూశాడు.

‘‘నాన్నా బాపిరాజూ, పక్క గదిలోకెళ్ళి చదువుకోండి’’ మనవడిని ఉద్దేశించి అంది. వాళ్ళు లోపలికెళ్ళిపోయారు.

బాపిరాజు... తన తండ్రి పేరు. ఒక్కమాటు మనసు ఉద్వేగభరితమైంది.

తన అన్నయ్యకి ఇద్దరూ అమ్మాయిలే. తండ్రి పేరు పెట్టుకోవడానికి ఒక్క మగ నలుసైనా పుట్టలేదని అస్తమానూ అనుకుంటూంటాడు. ఈమె కొడుకుది కూడా తన తాతగారి పేరే... విస్తుబోయాడతడు.

‘‘బాబూ, ఆ వేళ కోపంగా మధ్యలోనే వెళ్ళిపోయావు. నాకు కూడా ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒక్కసారి శాంతంగా విను...

నేను వూళ్ళొంచి వెళ్ళిపోతున్నానని కబురు తెలిసి మీ నాన్న బస్టాండుకి పరుగెట్టుకొచ్చాడు. అప్పటికి రాత్రి ఎనిమిదయింది. పల్లెటూరు మూలాన వూరు మాటుమణిగింది. నేనూ మా అమ్మా బస్సులో కూర్చున్నాం. కిటికీ దగ్గరకొచ్చి, నా చెయ్యి అందుకుని చిన్నమూటని చేతిలోపెట్టి, గుడ్లనీళ్ళు కుక్కుకున్నాడు. నేను తేరుకునే లోపలే బస్సు కదిలింది. ఆ మూటని బట్టలమధ్య పడేసి ఆలోచిస్తూ కూర్చున్నాను.

దూరపుచుట్టం ఇంట్లో దిగి పరిస్థితి చెప్పాను. ఆ పెద్దాయన మమ్మల్ని అర్థంచేసుకున్నాడు. ఎక్కడైనా కూలిపనులకి వెళ్ళాలనుకున్నాం. ఎన్నాళ్ళు శరీరం సహకరిస్తే అన్నాళ్ళు చేయాలని అనుకున్నాను. ఒకరోజున యథాలాపంగా మూట విప్పి చూస్తే అందులో కొంత డబ్బూ నగలూ ఉన్నాయి. నగలను చూడగానే కంగారు పుట్టుకొచ్చింది. ఈపాటికి నామీద పోలీసు కంప్లైంటు ఇచ్చే ఉంటారని వణికిపోయా. తేరుకుని అమ్మతో చెప్పి మూట చూపించాను.

‘ప్రస్తుతం డబ్బు అవసరమే కనుక వాడుకుందాం. వాళ్ళ బంగారం మనకి వద్దు. ఆయాచితంగా వచ్చిన బంగారం మనల్ని భస్మం చేస్తుంది. వద్దుగాక వద్దు తల్లీ’ అంది అమ్మ. ఆ మాటలు నాకూ సబబుగానే తోచాయి. తప్పనిసరి పరిస్థితిలో డబ్బు వాడుకున్నాంగానీ, బంగారం ముట్టుకోలేదు. అయినా, మీ ఇంటి ఆడవాళ్ళ శోకం నన్ను కట్టి కుదిపేసింది. ఎన్ని అవసరాలు వచ్చినా బంగారం జోలికి వెళ్ళలేదు. మీ నాన్నగారు మరణించారన్న కబురు తెలిసి పునిస్త్రీతనాన్ని తుడిచేసుకున్నాను. బంగారం మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేద్దామనే అనుకున్నాను చాలాసార్లు. కానీ, మీ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఎలా అర్థం చేసుకుంటారో తెలీదు. వాళ్ళుపోలీసులకి ఫిర్యాదు చేస్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమిటి? ఇవన్నీ ఆలోచించి నిమ్మకు నీరెత్తినట్లు ఇలా ఉండిపోయాను. ఇన్నాళ్ళకు నువ్వు కనిపించావు. మీ వస్తువులు మీకు చేరిస్తే నాకు నిశ్చింత’’ అంటూ లోపలికెళ్ళి ఒక మాసిపోయిన చిన్న మూటను తెచ్చి చేతిలోపెట్టింది.

స్థాణువయ్యాడు భార్గవ. ఏం వూహించాడు వీళ్ళ గురించి... ఏం జరుగుతోంది?

కొద్దికాలంపాటు తన తండ్రితో కాపురం చేసినందుకు మోసిన భారంకాక, భరిస్తున్న వైధవ్యం... తల్లికితగ్గ తనయుడూ, అతనికి తగ్గ భార్యా..!

తన తల్లి మరణించాక, ఆమె ఒంటిమీద ఉన్న బంగారం పంచుకుంటూ, ఆమె కెంపుల నెక్లెస్‌ ‘నాకు కావాలంటే నాకే కావాలని’ వాదులాడుకుని, సంవత్సరాల తరబడి ఎడమొహం, పెడమొహంగా బతుకుతున్న అక్కలు జ్ఞప్తికి వచ్చారు. ఎవరు అలగా మనుషులు? ఏమీ తెలుసుకోకుండా వీళ్ళని గూర్చి తప్పుగా ఆలోచించాడే! చదువుకున్న చదువు ఏమయింది? ఝరికి ఉన్నపాటి ఇంగితం తనకు లేకపోయింది. ...ఆలోచనలు తెగడం లేదు భార్గవ అంతర్మథనంలో.

‘‘అలా నిట్రాడులా నిలబడ్డావేమే, వెళ్ళి నీ మరిదికి కాఫీయో టీయో తీసుకురా’’ కోడలికి చెప్పిందామె.

తాగుతాడో లేదోనని సందేహిస్తూనే లోపలికి వెళ్ళింది కోడలు.

ఆమె తెచ్చిన కాఫీ అందుకుంటూ ఆలోచనల్లో పడ్డాడతడు.

‘వీళ్ళ కుటుంబానికి ఏదో ఒకటి చేయాలి. మరీ పేదరికంలో ఉన్నారు, కానీ అభిమానధనుల్లా ఉన్నారు. ఏదైనా ఇస్తే తీసుకునేలా లేరు. అయినా తప్పదు, సెంటిమెంటుతో ఒప్పించాలి. అలాగే వీళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావాలి. ఝరి కూడా అభ్యంతరం చెప్పదు. రైట్‌...’ ఒక నిశ్చయానికొచ్చాడు.

హుషారుగా ఖాళీ కప్పు పక్కన పెట్టాడు.

‘‘అమ్మా, బట్టలు సర్దుకో’’ అన్నాడు ఆవిడకేసి తిరిగి.

‘‘ఎందుకూ?’’ అందరూ తెల్లబోయారు.

‘‘ఎందుకేమిటమ్మా, ఈ చిన్నకొడుకు దగ్గర కూడా కొన్నాళ్ళుండవా?’’ గారంగా అన్నాడు.

ఆవిడ మనసు వరద గోదారే అయింది.

‘‘మా నాయనే, మా బాబే’’ అంటూ అతన్ని కౌగిలించుకుంది.

‘‘అయితే ఒక షరతు అమ్మా, నన్ను నిజంగానే నీ బిడ్డగా భావిస్తే, నేను మళ్ళీమళ్ళీ ఈ ఇంటికి రావాలంటే... ఈ నగలు వదిన తీసుకోవాలి. కాదంటే నాన్నగారి మీద ఒట్టే. అన్నయ్యా నీక్కూడా ఇదే చెబుతున్నా’’ అన్నాడు స్థిరంగా. ఆమె ఏమీ మాట్లాడలేక కళ్ళనీళ్ళతో చూస్తుండిపోయింది.

ఆదినారాయణ వచ్చి అతడి వీపు తట్టాడు నవ్వుతూ.

చిన్నప్పుడు ఆడుకుంటూ పడిపోతే తన తండ్రి వీపుతట్టి భుజాన వేసుకున్నప్పటి స్పర్శ అది. ఆమె కళ్ళు తుడుచుకుంటూ లోపలికెళ్ళి నాలుగు చీరలు సంచీలోపెట్టి తెచ్చుకుంది.

‘‘అన్నయ్యా, ఆదివారం వదిననీ పిల్లల్నీ తీసుకుని ఇంటికి రా’’ అన్నాడు ఆమెతో బయల్దేరుతూ, వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని.

ధుమధుమలాడుతూ ఒంటరిగా వెళ్ళి, పెద్దావిడతో నవ్వుతూ కబుర్లు చెబుతూ వస్తున్న భర్తని చూసి తేలిగ్గా నిట్టూర్చిన ఝరి, ఆనందంగా ఎదురెళ్ళింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.