close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నవ్వుతూనే ఉండండి

నవ్వండీ నవ్వండీ
నవ్వుతూనే ఉండండి

  చిన్న చిరునవ్వు గుండె గాయాలన్నింటినీ మాన్పేస్తుంది... నిజం, పెదాల అంచున మొదలై గొంతును మీటుతూ హృదయ కవాటాల్ని సరిచేయగలిగిన మహత్తరమైన మందే నవ్వు. డబ్బులతో పనిలేని ఔషధం. అందుకే చెరగని చిరునవ్వుతో ఉండే డాక్టర్లనీ నర్సుల్నీ చూస్తేనే చాలు, సగం జబ్బులు నయమైపోతాయి. ఈ విషయాన్ని గుర్తించే 1998లో నవ్వుల దినోత్సవానికి శ్రీకారం చుట్టాడు ముంబైకి చెందిన డాక్టర్‌ మదన్‌ కటారియా. అంటే ప్రపంచానికి నవ్వుల్ని పంచిన ఘనత మనదేనన్నమాట.


నవ్వుకి భాష లేదు!

 ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా ఎవ్వరితోనైనా మాట్లాడగలిగే భాష కాని భాష ఒక్కటే... అదే నవ్వు... నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దం. దానికి ప్రాంతీయభాషా భేదాలూ, జాతిమత విభేదాలూ ఏమీ తెలియవు. పైగా నవ్వడం ఎవరిదగ్గరా నేర్చుకోనక్కర్లేదు. దానికోసం పుస్తకాలు అసలే చదవక్కర్లేదు. జోకులు పేల్చనూ అక్కర్లేదు... అవునుమరి, అప్పుడే పుట్టిన పసివాళ్లకు ఎవరు నేర్పారు బోసినవ్వులు నవ్వమని..! అందుకే చిరునవ్వుల పలకరింపు చాలు... ఎదుటివాళ్లను కట్టిపడేయడానికి.


నవ్వుల శాస్త్రం!

  సలెందుకు నవ్వాలి? నవ్వడం నా స్వభావం కాదు, నేను యమా సీరియస్స్‌ అనేవాళ్లూ ఉంటారు కదా. అందుకోసమే ‘నవ్వొక శాస్త్రం’ అంటూ దాన్ని గురించి కొందరు అధ్యయనం చేస్తూ నిరంతర పరిశోధనలు చేసేస్తుంటే, మరికొందరు నవ్వుమీద బోలెడు పాఠాలూ చెబుతున్నారు. ఇంతకీ ఆ నవ్వుల శాస్త్రానికి మరో పేరే గెలంటాలజీ.


నవ్వు... సామాజికం!

  నం నవ్వగానే ఎదుటివాళ్లూ తమకు తెలీకుండానే నవ్వేస్తారు. అందుకే ఆవులింతలానే నవ్వూ అంటువ్యాధే. కానీ మేలు చేసేదన్నమాట. ఈ అసంకల్పిత ప్రతీకారచర్యవల్ల శ్వాస వేగం పెరిగి, ఆరోగ్యంగా ఉంటారు. నిజానికి ఒంటరిగా ఓ హాస్య చిత్రాన్ని చూసినప్పుడో లేదా జోక్‌ చదివినప్పుడో కన్నా చుట్టుపక్కలవాళ్లతో మాట్లాడుతున్నప్పుడో వాళ్లు నవ్వడంవల్లనో 30 శాతం ఎక్కువగా నవ్వుతారన్నది అధ్యయనం.


నవ్వొక భోగం!

వ్వించడం యోగమో కాదో తెలీదుకానీ నవ్వకపోవడం మాత్రం కచ్చితంగా రోగమేనట. కండరాలన్నీ ముడుచుకుపోయి, రక్తనాళాలూ కుంచించుకుపోతాయి. అదే పగలబడి నవ్వేవాళ్లలో మొహం, కాళ్లు, చేతుల్లోని కండరాలన్నీ సమన్వయంతో కదులుతాయి. దాంతో నొప్పులు కూడా తెలియవు.
* నవ్వడంవల్ల రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసారం పెరగడంతో ఇది హృద్రోగాల్నీ నివారిస్తుంది. కాబట్టి ఇతరత్రా ఆరోగ్యనియమాలతోబాటు రోజూ కాసేపు నవ్వుతుంటే గుండెజబ్బులకు కాస్త దూరంగా ఉండొచ్చు.
* నవ్వడంవల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. తద్వారా క్యాన్సర్‌ కారణంగా దెబ్బతిన్న కణాల్ని బాగుచేసే శక్తీ నవ్వుకి ఉంది.
* నవ్వడంవల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్లకింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వేవాళ్లు నవ్వనివాళ్లకన్నా ఏడేళ్లు ఎక్కువగా జీవిస్తారట. అందుకే ఇటీవల హ్యూమర్‌, జోకర్‌థెరపీల్లాంటి వాటిని సైకియాట్రిస్టులతోపాటు ఇతర వైద్యులూ చికిత్సలో భాగంగా చేస్తున్నారు.
* నవ్వడంవల్ల గుండెవేగం 10-20 శాతం పెరుగుతుంది. రోజుకి సుమారు 15 నిమిషాలు నవ్వితే దాదాపు 40 వరకూ క్యాలరీలు కరుగుతాయట.
* హాస్యసౌరభం కార్టిసాల్‌ శాతాన్ని తగ్గించడంతోబాటు వృద్ధాప్యంతో వచ్చే మతిమరపుని తగ్గించి, జ్ఞాపకశక్తినీ పెంచుతుందని తేలింది. మంచి నిద్ర పట్టేలా చేయడంతోపాటు జీర్ణశక్తినీ పెంచుతుంది. చక్కెరనిల్వల్నీ క్రమబద్ధీకరిస్తుంది.

మొత్తమ్మీద ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్లలో యాంటీబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అదే సమయంలో రోగనిరోధకశక్తిని తగ్గించే కార్టిసాల్‌, ఎపినెఫ్రైన్‌ల శాతాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా నవ్వువల్ల ఎలాంటి జబ్బులూ దరిచేరకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి నవ్వు కచ్చితంగా భోగమే.


బంధం బలపడుతుంది

  

లిసి కూర్చుని సరదాగా సినిమా చూస్తూనో లేదా జోకుల్ని చెప్పుకుంటూనో నవ్వుకునే ప్రేమికులు లేదా భార్యాభర్తలూ, స్నేహితులూ ఎక్కువకాలం కలిసి ఉంటారట. నవ్వు వాళ్ల బంధాన్ని మరింత బలపరుస్తుంది. నవ్వు ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంచే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఫలితంగా ఒత్తిడి, కోపం, భయం, అసూయ, ఆందోళన, ద్వేషం అన్నీ పోయి ప్రేమానుబంధాలు బలపడతాయి.


జంతువులు కూడా...

సాధారణంగా మనిషి రోజుకి 13-15 సార్లు నవ్వుతాడు. ఆడవాళ్లు రోజుకి 62 సార్లు నవ్వితే, మగవాళ్లు నవ్వేది 8 సార్లేనట. అదే ఆరేళ్లలోపు పిల్లలు రోజుకి 400 సార్లు నవ్వుతారు. మనుషులే కాదు, కుక్కలూ, పిల్లులూ, కోతులూ, చింపాంజీలూ, గొరిల్లాలూ కూడా నవ్వుతాయట. హైనాలు నవ్వితే మూడు మైళ్ల వరకూ వినిపిస్తుంది.
*15 నిమిషాల నవ్వు రెండు గంటల నిద్రతో సమానం.
* ఓ జోకుని మామూలు వ్యక్తులు చెప్పినప్పుడుకన్నా కమెడియన్‌గా పేరొందిన వాళ్లు చెప్పినప్పుడే అది బాగా పేలుతుంది.
* మనం కావాలనో తెచ్చిపెట్టుకునో ఎంత గట్టిగా నవ్వినా అవతలివాళ్లకి అది ఇట్టే తెలిసిపోతుంది. నిజమైన నవ్వేదో కానిదేదో అన్నదాన్ని మెదడు ఇట్టే పసిగట్టేస్తుంది.
* కొందరు వూరికూరికే నవ్వేస్తుంటే, మరికొందరు ఎంత పెద్ద జోకు పేల్చినా నవ్వరు. దీనికి కారణం జన్యువులే. నవ్వాలని ఉన్నా నవ్వలేకపోతే ఎఫ్నొజిలియా అనే వ్యాధితో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి.
* ప్రాచీన చైనాలో ఆత్మానందం అనేదాన్ని ప్రత్యేకంగా బోధించేవారు. తమలో తామే నవ్వుకునే ఈ పద్ధతివల్ల ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయట.
* 1950లలో ప్రజలు రోజుకి సుమారు 18 నిమిషాలపాటు నవ్వేవారు. ప్రస్తుతం ఆ సమయం 4-6 నిమిషాలకు పడిపోయింది.
* రోజుకి 15 సెకన్లు ఎక్కువగా నవ్వితే మరో రెండు రోజులు ఆయుష్షు పెరిగినట్లే.


ఎలాగైనా నవ్వాలి 

నసులోని ఆనందాన్ని వ్యక్తం చేసే భావనే నవ్వు. ఆనందంతోబాటు ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలకీ నవ్వుతాం. ఎలా నవ్వినా నవ్వు నవ్వే కాబట్టి, వింతగా అనిపించే విషయాలు విన్నా హాస్యభరిత సినిమాలూ కామిక్‌ స్ట్రిప్పులూ చూసినా పుస్తకాలు చదివినా మంచిదే. వాటిని పదిమందికీ చెప్పి నవ్వడం, పిల్లలతో సరదాగా గడపడం... ఇవన్నీ కుదరకపోతే లాఫింగ్‌యోగాకి వెళ్లడం... ఏదయినా గానీ రోజూ కాసేపు నవ్వుకీ కేటాయించండి... ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి..!


సెల్ఫీ..!

  ‘‘ఒరే నానీ, మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారే వాళ్ళ అమ్మాయికి మూర్ఛరోగం ఉన్నట్లుంది. మెడ పక్కకి తిరిగింది, నోరు వంకరపోయింది, నాలుక బయటకొచ్చింది. త్వరగా రా’’ కంగారుగా అరిచింది వర్ధనమ్మ.

‘‘అబ్బా బామ్మా, గట్టిగా అరవకు. ఆ అమ్మాయి సెల్ఫీ తీసుకుంటోంది, అంతే’’ తాపీగా చెప్పాడు నాని.


ఆయుక్షీణం

‘‘నా అనుభవాన్నిబట్టి ఓ విషయం తెలిసింది- తెలివైన మగాడితో తెలివిలేని స్త్రీ కాపురం చేయగలదు. కానీ తెలివైన స్త్రీ తెలివితక్కువ మగాడితో వేగడం చాలా కష్టం. నిజంగా అలాంటివాళ్ళకు దండం పెట్టాలి’’ గొప్ప సత్యం కనుకున్నవాడిలా చెప్పాడు సుబ్బారావు.

‘‘తప్పండీ, మీరు నాకు దండం పెట్టకూడదు ఆయుక్షీణం’’ సిగ్గుపడుతూ చెప్పింది వాళ్ళావిడ.


రాలగొట్టింది

రాజు అర్ధరాత్రిదాకా స్నేహితులతో గడిపి ఇంటికి వెళ్ళాడు. మర్నాడు అతని స్నేహితులు ‘‘రాత్రి అంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళావు కదా, మీ ఆవిడ ఏమీ అనలేదా?’’ అని అడిగారు.

‘‘లేదు, పైగా నేను డాక్టర్‌ దగ్గరికి వెళ్ళే శ్రమలేకుండా చేసింది’’ చెప్పాడు రాజు.

‘‘అదేంటీ?’’ అర్థంకాలేదు వారికి.

‘‘మరేంలేదు, నా ముందు పళ్ళు రెండూ తీసేయించుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాన్లే’’ చెప్పాడు రాజు.


ఎందుకు చెప్పనూ

‘‘పక్కింటాయన ఎందుకూ పనికిరాని సన్నాసటండీ, వాళ్ళావిడ చెప్పింది’’ భర్తతో అంది సుబ్బలక్ష్మి.

‘‘సర్లే, నామీద నువ్వేమీ చెప్పలేదు కదా’’ అనుమానంగా అడిగాడు రమేష్‌.

‘‘భలేవారండీ, నేనేమీ చెప్పకపోతే ఆవిడ మాత్రం ఎలా చెబుతుందీ...’’ అసలు రహస్యం చెప్పేసింది సుబ్బలక్ష్మి.


నేనూ చెప్పగలను

‘‘రాణీ, నువ్వూ నేనూ పిల్లలూ అందరం కాశ్మీరు వెళ్ళాలంటే చాలా ఖర్చవుతుంది. అందుకని నేనొక్కణ్ణీ వెళ్ళొస్తాను. వచ్చాక అక్కడి విశేషాలన్నీ మీరు మీ కళ్ళతో చూస్తున్నట్లుగా వర్ణించి చెబుతా, సరేనా’’ భార్యతో అన్నాడు కాంతారావు.

‘‘అలాగేనండీ, నేను కూడా ఇకనుంచీ నాకూ పిల్లలకూ వంట చేసుకుని, భోజనమయ్యాక, ఆ రుచులన్నీ స్వయంగా మీరు తిన్నట్టే వర్ణించి చెబుతాను’’ చెప్పింది భార్య.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.