close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంతకుముందూ... ఆ తరవాత!

అంతకుముందూ... ఆ తరవాత!
నోట్ల రద్దుకు ఆర్నెల్లు

ఈ మధ్య కాలంలో భారత దేశాన్ని ఆశ్చర్యంలో ముంచేసిన అతిపెద్ద పరిణామం- పెద్ద నోట్ల రద్దు. చడీ చప్పుడూ లేకుండా ప్రధాని మోదీ రాత్రికి రాత్రి ప్రకటించిన ఆ నిర్ణయంతో నల్ల కుబేరుల మొహాలు తెల్లబోయాయి. హవాలా వ్యాపారాలు దివాలా బోర్డు పెట్టాయి. ఉగ్రమూకల కార్యకలాపాలకు బ్రేకులు పడ్డాయి. నకిలీ నోట్ల దందాలు నలిగిపోయాయి. కోట్ల రూపాయల పాత నోట్లు కాలి బూడిదయ్యాయి. లక్షలాది లంచగొండులకూ, అవినీతి వ్యాపారులకూ, పన్ను ఎగవేతదార్లకూ ఐటీ తాఖీదులు అందాయి. డిజిటల్‌ లావాదేవీలు రాకెట్‌లా దూసుకెళ్లాయి. మొత్తంగా నగదు రద్దు ప్రభావానికి అద్దం పట్టే ఎన్నో సానుకూల పరిణామాలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. ఓ కొత్త శకానికి పునాది వేసిన ఆ చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించి నేటికి సరిగ్గా ఆర్నెల్లు..!

‘సోదర సోదరీమణులారా... ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ఖరీదైన భవనాలూ, రోడ్ల మీద తిరిగే విలాసవంతమైన కార్లూ, వాటి యజమానులను చూడండి. పైకి ధనవంతుల్లా కనిపిస్తున్నా పాపం వాళ్లంతా పేదలేనట! అందుకే 125 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఏడాదికి పది లక్షల రూపాయలకుపైగా సంపాదిస్తున్నామని ఒప్పుకున్న వాళ్ల సంఖ్య పాతిక లక్షలు కూడా దాటలేదు. మిగిలిన వాళ్లంతా పన్నులు ఎగవేసి వేల కోట్ల రూపాయలను నల్ల ధనంగా దాచేస్తున్నారు. రెక్కల కష్టం మీద బతికే మీలాంటి చిరుద్యోగులు మాత్రం చచ్చినట్లు పన్నులు కడుతున్నారు. నిరుపేదలూ, సంపన్నుల మధ్య ఆ అంతరం తగ్గాలంటే నల్లధనం నాశనమవ్వాలి. నకిలీ నోట్లు అంతమవ్వాలి. అలాంటి అవినీతి రహిత దేశాన్ని చూడాలన్న ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నా’... పెద్ద నోట్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ చెప్పిన మాటలివి. ‘నల్ల ధనం’ అంటే కొమ్ముల తిరిగిన కోటీశ్వరులకు మాత్రమే సంబంధించిన అంశంలా అనిపించినా, దాని ప్రభావం తిరిగి తిరిగీ సామాన్యుడి మీదే పడుతుంది. ఆడవాళ్లూ, పసిపిల్లల అక్రమ రవాణా, విద్వేషాలను రెచ్చగొట్టడానికి పెట్టే ఖర్చూ, ఎన్నికల ప్రచారంలో పంచే డబ్బూ, రియల్‌ ఎస్టేట్‌ దందాలూ, ఉగ్రవాదులూ, మావోయిస్టులను ప్రోత్సహించడానికి పెట్టుబడి, హవాలా లావాదేవీలూ... ఇలాంటి ఎన్నో పనులకు ఖర్చు చేసేది ఎలాంటి లెక్కా పత్రాలు లేని ఆ నల్ల డబ్బే. మూడో కంటికి తెలీకుండా ఖర్చయ్యే ఆ కాసుల కుప్పలు దేశాన్ని అనేక కోణాల్లో నాశనం చేసేస్తున్నాయి. ఆ దారుణాలు ఆగాలంటే నల్లధనం మాయమవ్వాలి. అంటే... చలామణీలో ఉన్న పెద్ద నోట్లు రద్దవ్వాలి. ఆ సమున్నత లక్ష్యంతో ప్రధాని సంధించిన బాణం, ఆర్నెల్ల వ్యవధిలో అనేక రంగాల్ని ప్రభావితం చేసింది.

నల్లడబ్బుకి చెల్లు!
గుజరాత్‌లో ఓ వ్యాపారి దగ్గర రూ.400 కోట్లు... తమిళనాడులో ఓ మైనింగ్‌ కాంట్రాక్టర్‌ ఇంట్లో రూ.142కోట్లు... కర్ణాటకలో ఓ వ్యాపారి బాత్రూమ్‌లో కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం... పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచీ పత్రికల్లో ఇలాంటి వార్తలు కోకొల్లలు. ఎప్పటికప్పుడు కోట్లాది రూపాయల అక్రమ సంపద నిల్వలు బయటపడుతూనే ఉన్నాయి. అంతకుముందు స్వచ్ఛందంగా ఆదాయాన్ని ప్రకటించడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం, గడువు ముగిశాక పరిణామాలు కఠినంగానే ఉంటాయని ముందే హెచ్చరించింది. దానికి తగ్గట్లే తరవాత జూలు విదిల్చింది. నోట్లు రద్దయ్యాక, బ్యాంకుల్లో డిపాజిట్లు మొదలయ్యాక ఒక్కో ఖాతానీ ఐటీ శాఖ భూతద్దం పెట్టి తనిఖీ చేసింది. భారీ మొత్తాలు జమ చేసిన వాళ్లందరినీ ఓ జాబితాలో చేర్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేశవ్యాప్తంగా దాడులు మొదలుపెట్టింది. తొలి యాభై రోజుల్లోనే ఐదు వేల మందికిపైగా ‘నల్ల బాబు’లను కనిపెట్టింది. దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని గుర్తించింది. ఐదు వందల కోట్ల రూపాయలను జప్తు చేసింది. నోట్లు రద్దయిన సరిగ్గా నెలరోజులకు తమిళనాడులోని ఓ ఇసుక వ్యాపారికి చెందిన భారీ అక్రమ నగదు పుట్ట బద్దలైంది. ఐటీ దాడుల్లో ఏకంగా వంద కోట్ల రూపాయల పాత నోట్లు బయటపడ్డాయి. బంగారాన్ని కూడా కలిపితే, అతడి దగ్గర దొరికిన అక్రమ సంపద విలువ అక్షరాలా రూ.142కోట్లు.

నాలుగు నెలలు పూర్తయ్యేసరికి రెండు వేల నాలుగు వందల మంది అక్రమార్కులు ఐటీ వలలో చిక్కారు. దాదాపు రూ.9400 కోట్ల రూపాయల నల్ల డబ్బు బయటపడింది. అందులో తొమ్మిది వందల కోట్ల రూపాయలను ఆ శాఖ జప్తు చేసింది. తమ ఆదాయానికి ఎన్నో రెట్లు ఎక్కువగా బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్‌ చేసిన దాదాపు పద్దెనిమిది లక్షల మందికి ఐటీ తాఖీదులు అందాయి. వాళ్లలో తొమ్మిదన్నర లక్షల మంది అధికారులకు వివరణ ఇచ్చారు. ఇప్పటికీ నిత్యం వందల మందికి ఆ శాఖ ప్రశ్నాస్త్రాలు సంధిస్తూనే ఉంది. వీటన్నింటి ప్రభావం గత ఆర్థిక సంవత్సరంలో పన్నుల సేకరణపైన స్పష్టంగా కనిపించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పదహారు శాతం ఎక్కువగా పన్నులు వసూలయ్యాయి. ఈ పరిణామాలన్నీ నోట్ల రద్దు సానుకూల ప్రభావానికి సాక్ష్యాలే. ఇంకా మదింపులు జరుగుతున్నాయి. దాడులు వేగాన్ని పుంజుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కోట్లాది రూపాయల అప్రకటిత ఆదాయం బయటికొస్తోంది. రానున్న రోజుల్లో మరింత మంది నల్ల కుబేరుల ఆట కట్టడం ఖాయం! ఆ డబ్బంతా వీలైనంత త్వరగా ప్రభుత్వానికి చేరితే, అక్కణ్ణుంచి అవి ప్రజల అభివృద్ధికి ఆసరా ఇస్తే, ప్రధాని లక్ష్యం నెరవేరినట్లే. ప్రస్తుతం ఆ దిశగానే వడివడిగా అడుగులు పడుతున్నాయి.

నగదు వద్దేవద్దు...
పెద్ద నోట్లు రద్దయ్యాక అందరి కంటే ఎక్కువ బాధపడింది నల్ల కుబేరులైతే, ఎక్కువ సంతోషించింది మాత్రం విజయ్‌ శేఖర్‌ శర్మ- పేటీఎం వ్యవస్థాపకుడు. ప్రధాని నిర్ణయంతో దేశంలో డిజిటల్‌ విప్లవం మొదలైంది. టీకొట్టు నుంచి కూరగాయల వ్యాపారి దాకా స్థాయితో సంబంధం లేకుండా అందరూ ఆన్‌లైన్‌ చెల్లింపుల బాట పట్టారు. ‘పైసలొద్దు, పేటీఎం కరో’ అన్న నినాదం అందుకున్నారు. పది రూపాయలైనా, పది వేలైనా నేరుగా ఖాతాలోకి పంపించమంటున్నారు. అలా నగదు వినియోగం తగ్గి ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరగాలన్నదే ప్రధాని ఆకాంక్ష కూడా. ఈ ఆర్నెల్లలో రీచార్జ్‌ చేసుకోవడం రాని వాళ్లు కూడా మొబైల్‌ వ్యాలెట్‌ను వాడటం నేర్చుకున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లనే మినీ బ్యాంకులుగా మార్చుకున్నారు. ఆర్నెల్లలో ఆన్‌లైన్‌ లావాదేవీల సంఖ్య 23రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచీ నవంబర్‌ వరకూ జరిగిన మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో 102 కోట్లు చేతులు మారితే, చివరి ఐదు నెలల్లో జరిగిన లావాదేవీల్లో దాదాపు 2425 కోట్ల రూపాయలు ఖాతాలకు మళ్లాయి.

వ్యాలెట్ల రాజ్యం
పేటీఎం, మొబీక్విక్‌, ఆక్సిజన్‌ లాంటి చాలా మొబైల్‌ వ్యాలెట్లు ఎప్పట్నుంచో ఉన్నా వాటికి స్వర్ణయుగం మొదలైంది మాత్రం ఆర్నెల్ల ముందే. ‘పేటీఎం’ అయితే మార్కెట్లో పోటీనే లేనట్టుగా దూసుకెళ్లింది. తొలి ముప్ఫయి రోజుల్లో ఏకంగా రెండు కోట్ల మంది కొత్త ఖాతాదారులు ఆ సంస్థ పంచన చేరారు. అంతకుముందు దాకా రోజూ పది లక్షలకు అటు ఇటుగా ఉన్న లావాదేవీల సంఖ్య ఇప్పుడు డెబ్భై లక్షలు దాటింది. రోజూ 120కోట్ల రూపాయలకుపైగా డబ్బులు ఆ ఆప్‌ ద్వారా చలామణీ అవుతున్నాయి. పేటీఎం వ్యాలెట్లలో భద్రపరచుకునే డబ్బుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే వెయ్యి రెట్లు పెరిగింది. మొబీక్విక్‌, ఆక్సిజన్‌, చిల్లర్‌, నుప్పీ... అన్ని సంస్థలూ తమ ఐదారేళ్ల లక్ష్యాలను కొన్ని నెలల్లోనే దాటేశాయి. కళ్లముందున్న అవకాశాన్ని అందుకునేందుకూ, పోటీలో నిలబడేందుకూ కస్టమర్లను వూపిరి సలపని ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆప్‌ డౌన్‌లోడు చేసుకున్నా, దాంట్లోకి డబ్బులు జమ చేసినా, చెల్లింపులు జరిపినా, స్నేహితులకు సిఫార్సు చేసినా... ప్రతి దానికీ ఎంతోకొంత క్యాష్‌బ్యాక్‌ తాయిలాన్నీ అందిస్తూ వచ్చాయి. ఆఖరికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భీమ్‌’ ఆప్‌ కూడా వినియోగదార్లకు రివార్డుల వరాలు ప్రకటించింది. మొత్తంగా నోట్ల రద్దు పుణ్యమా అని ఎన్నడూ లేని విధంగా వినియోగదార్లకు ఆఫర్లు అందితే, వూహించని విధంగా వ్యాలెట్లకు గిరాకీ పెరిగింది.

అవసరాలు మనిషికి అన్నీ నేర్పిస్తాయి. అందుకే కొన్నాళ్ల ముందు దాకా బ్యాంకు ఖాతాలే లేని చాలామంది గ్రామీణులు ఇప్పుడు మొబైల్‌ లావాదేవీలు అవలీలగా సాగిస్తున్నారు. ఏకంగా వూళ్లకు వూళ్లే నగదు వాడకానికి దూరమవుతున్నాయి. మహారాష్ట్రలోని దాసాయ్‌, తెలంగాణలోని ఇబ్రహీంపూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మసాగరం, గుజరాత్‌లోని అకోదర... ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో గ్రామాలు నగదు రహితంగా మారి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. కొన్ని వందల గ్రామాలు అదే దారిలో ముందుకెళ్తున్నాయి.

హవాలాకి బ్రేకులు
ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల వ్యాపారం, అంతర్గత అల్లర్లూ... దేశాన్ని నాశనం చేసే ఇలాంటి కార్యకలాపాలన్నింటికీ కోట్ల రూపాయల నిధులు కావాలి. ‘హవాలా మార్కెట్‌’ ద్వారా సంఘ వ్యతిరేక శక్తులకు విచ్చలవిడిగా కావాల్సినంత డబ్బు సమకూరుతోంది. ఇక్కడో హవాలా వ్యాపారి చేతిలో వెయ్యి కోట్లు పెడితే, క్షణాల్లో ఏ దుబాయ్‌లోనో, పాకిస్థాన్‌లోనో స్థానిక కరెన్సీని మరో హవాలా వ్యాపారి కావల్సిన వాళ్లకి అప్పగిస్తారు. అడ్డూఅదుపూ లేకుండా సాగుతోన్న ఆ చీకటి వ్యాపారానికి ‘నగదు రద్దు’ గొడ్డలి పెట్టయి కూర్చుంది. ఆ నిర్ణయం ప్రకటించిన వారంలోనే ఓ హవాలా వ్యాపారి ఏకంగా 450కోట్ల రూపాయల పాత నోట్లని కాల్చి బూడిద చేశాడు. ఇంకొందరు కట్టలుకట్టలుగా డబ్బుని చెత్త బుట్టల్లో పారేశారు. ముంబై, అహ్మదాబాద్‌, జైపూర్‌, దిల్లీ కేంద్రాలుగా రోజుకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన హవాలా లావాదేవీలు జరుగుతాయి. ఇప్పుడా వ్యాపారం ఎనభై శాతం మేర పడిపోయిందన్నది నిఘా వర్గాల అంచనా. హవాలా ఫోన్‌ కాల్స్‌ కూడా యాభై శాతం తగ్గిపోయాయి. ఒక్క కేరళకే గల్ఫ్‌దేశాల నుంచి ఏటా నలభై వేల కోట్ల రూపాయల హవాలా డబ్బు చేరుతుంది. కానీ గత ఆర్నెల్లలో అక్కడ హవాలా రాకెట్‌ ఆనవాళ్లు కనిపించలేదని నిఘావర్గాలు చెబుతున్నాయి. నిత్యం అల్లర్లతో కొట్టుమిట్టాడే కశ్మీర్‌ వ్యాలీలో కూడా అంతర్గత గొడవలూ, పోలీసులూ జవాన్లపైన రాళ్ల దాడులూ అరవై శాతం తగ్గాయి. ఆ కార్యకలాపాలకు నిధుల్లేక కశ్మీర్‌లో కొత్త నోట్లను కొల్లగొట్టడానికి బ్యాంకుల్ని లూటీ చేసే ప్రయత్నాలూ జరిగాయి. గోవా కేంద్రంగా నడిచే మాదక ద్రవ్యాల వ్యాపారానికీ వూపు తగ్గింది. విదేశాల్లో సంపాదించిన డబ్బునంతా పన్నులు కట్టకుండా అడ్డదారిలో తరలించే ఎన్నారైల కథా నోట్ల రద్దుతో అడ్డం తిరిగింది.

దొంగనోట్లు చిత్తుకాగితాలే!
నోట్ల రద్దుకి ముందు దేశంలో దాదాపు ఐదొందల కోట్ల రూపాయల విలువ చేసే దొంగ నోట్లు చలామణీలో ఉన్నాయని అంచనా. ఇప్పుడవి కేవలం చిత్తు కాగితాల్లా మిగిలిపోయాయి. ఈ దొంగ నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేదీ హవాలా వ్యాపారులే. వాళ్లు భారత్‌లో జరిపే చెల్లింపుల్లో నలభై శాతం దొంగనోట్లే ఉంటాయి. అంటే... కోటి రూపాయలకు నలభై లక్షలు! అవన్నీ రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులుగా మారి చలామణీలోకి వచ్చేస్తున్నాయి. ఈ దొంగనోట్లలో తొంబై శాతం పాకిస్థాన్‌లోనే అచ్చవుతున్నాయి. ఈమధ్యే పాకిస్థాన్‌లో కరెన్సీని అచ్చువేసే రెండు ముద్రణాలయాలు మూతపడ్డాయి. నకిలీ నోట్లు అచ్చేసే అక్కడి ఓ వ్యాపారీ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నాలుగు నెలల క్రితం కొత్త ఐదొందల రూపాయల నకిలీ నోట్లతో నిండిన కంటైనర్లు కొచ్చిన్‌, తూతుక్కుడి ఓడ రేవులకు చేరాయట. కానీ ప్రస్తుత నోట్లతో పోలిస్తే అవి నాసిరకంగా ఉండటంతో వ్యాపారులు వాటిని తీసుకోకుండా తిరిగి పంపించారన్నది నిఘా వర్గాల మాట. అంటే కొత్త నోట్ల నాణ్యత కూడా నకిలీ దందాకి కత్తెరేసినట్లే!

ఆగంతుకులకు అడ్డు
మావోయిస్టులూ, నక్సల్స్‌ సానుభూతిపరులైన చాలామంది, వాళ్ల కార్యకలాపాల కోసం పెద్ద మొత్తంలో నిధుల్ని అందిస్తుంటారు. అలా ఎన్నో ఏళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మావోయిస్టు నేతలు సేకరించి దాచిన డబ్బంతా మట్టిపాలైంది. మావోయిస్టు సానుభూతిపరుడైన ఓ వ్యాపారి, వాళ్లకి చెందిన దాదాపు రెండొందల యాభై కోట్ల రూపాయలను రాంచీలోని ఓ బ్యాంకులో జమ చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే నక్సల్స్‌ ఇన్నాళ్లూ రహస్యంగా దాచి, తరవాత బయటకు తీసిన దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు పోలీసులకు పట్టుబడ్డాయి. తరవాతి కాలంలో వాళ్లకు నిధులు అందడమూ తగ్గిపోయింది. వూహించని పరిణామంతో కంగుతిన్న మావోయిస్టులూ, నక్సలైట్లూ అత్యధిక సంఖ్యలో ప్రభుత్వానికి లొంగిపోవడం మొదలుపెట్టారు. తొలి నలభై రోజుల్లో దేశవ్యాప్తంగా ఏడొందల మంది మావోయిస్టులు తుపాకీని వదిలేశారని ప్రధాని చెప్పారు. ‘ఇప్పటిదాకా ఫలితాలు బావున్నాయి. ఇకపైనా పట్టు బిగిస్తే కొద్ది రోజుల్లో దేశంలో మావోయిస్టులూ, నక్సలైట్ల ప్రాబల్యం తగ్గడం ఖాయం’ అంటున్నాయి నిఘా సంస్థలు.

డిపాజిట్ల వెల్లువ
నోట్ల రద్దుకు ముందు 15.5లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే రూ.500, రూ.1000 నోట్లు చలామణీలో ఉండేవి. గడువు ముగిసేసరికి 14.5లక్షల కోట్లు విలువ చేసే నోట్లు మాత్రమే బ్యాంకులకు చేరాయి. అంటే ఒక్క దెబ్బతో ఎలాంటి లెక్కలూ లేని లక్ష కోట్ల రూపాయల నల్ల ధనం గాల్లో కలిసిపోయిందన్న మాట. నోట్ల రద్దు నేరుగా సాధించిన తొలి విజయమిది. మరోపక్క యాభై రోజుల్లో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు... ఏ బ్యాంకూ కల్లో కూడా వూహించని నగదు నిల్వలవి. అప్పటిదాకా కనీస బ్యాలెన్స్‌ కూడా లేని లక్షలాది బ్యాంకు ఖాతాల్లో చేరిన మొత్తమే పాతిక వేల కోట్ల రూపాయలు దాటింది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో పదమూడు వేల కోట్ల రూపాయలు జమయ్యాయి. మరో పక్క యాభై రోజుల్లో ఏకంగా ఎనభై వేల కోట్ల రూపాయల రుణ బకాయిలు బ్యాంకుల్ని వెతుక్కుంటూ వచ్చాయి. మరో మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర ఎగ్గొట్టిన రుణ ఖాతాల్లో చెల్లింపులు జరిగిపోయాయి. మొత్తంగా నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకులు నిధులతో పరిపుష్టమయ్యాయి. దానివల్ల ఆ రంగం మరింత బలోపేతమవుతుందనీ, మున్ముందు రుణాలపైన వడ్డీ తగ్గే అవకాశమూ ఉందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం అమ్మాయిలూ, పిల్లల అక్రమ రవాణా పెద్ద స్థాయిలో తగ్గిందని నోబెల్‌ గ్రహీత కైలాష్‌ సత్యార్థి చెప్పడం విశేషం. దాంతో పాటు క్రికెట్‌ బెట్టింగుల జోరూ తగ్గింది. రియల్‌ ఎస్టేట్‌ అక్రమ పెట్టుబడులూ, లంచాలూ, ఎన్నికల ప్రచార ఖర్చులూ తదితర లావాదేవీల్లో తిరోగమనం కనిపించింది. సామాన్యుడు కలలు కనే దేశంగా భారత్‌ మారడానికి ఈ సానుకూల పరిణామాలన్నీ గట్టి పునాది వేస్తున్నాయి.

ప్రధాని రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన కొత్తల్లో సామాన్యుడు డబ్బుల కోసం చాలా ఇబ్బందులే పడ్డాడు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాశాడు. ఇప్పటికీ అక్కడక్కడా నోట్ల కొరత వేధిస్తూనే ఉంది. ఆశించిన స్థాయిలో జీడీపీ పెరగలేదు. అనుకున్నంత కిందకి ధరలు దిగిరాలేదు. అయినా ‘ఇబ్బందులు తాత్కాలికం, ఫలితాలు దీర్ఘకాలికం’ అని ప్రధాని చెప్పిన మాటలకి విలువిస్తూ వస్తున్నాడు. ఈ ఆర్నెల్లలో కనిపించిన అనేక పరిణామాలు- పరిస్థితులు కొంత మారాయని చెప్పకనే చెబుతున్నాయి. మంచి భవిష్యత్తు కోసం ప్రజలు ఎన్ని సమస్యలనైనా చిరునవ్వుతో స్వాగతిస్తారనీ రుజువైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నోట్ల రద్దు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. నెలతప్పిన తల్లి బిడ్డనెత్తుకోవాలంటే తొమ్మిది నెలలు ఆగక తప్పదు. అలాగే, ప్రభుత్వం నమ్మిన మాటా, ప్రజలకు చెప్పిన మాటా నిజమవుతుందో లేదో తేలాలన్నా ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిందే... ఇదే నమ్మకంతో, ఇంతే ఓపికతో..!

పాపం కాలియాచక్‌! 

పెద్ద నోట్లు రద్దు చేశాక బ్యాంకులూ, ఏటీఎంలన్నీ జనాలతో కిటకిటలాడితే, పశ్చిమ బంగాలోని కాలియాచక్‌ అనే గ్రామం మాత్రం సందడి కోల్పోయింది. ప్రధాని నిర్ణయంతో నేరుగా దెబ్బతిన్న తొలి గ్రామం అదే. కాలియాచక్‌కి ‘నకిలీ నోట్ల రాజధాని’ అన్న పేరుంది. దేశంలో చలామణీ అయ్యే నకిలీ నోట్లలో ఎనభై శాతం అక్కడి నుంచే వస్తాయి. వూళ్లొ ఎక్కువ శాతం కుర్రాళ్లకి దొంగ నోట్లను రవాణా చేసే కొరియర్లుగా పనిచేయడమే ప్రధాన ఆదాయ మార్గం. బంగ్లాదేశ్‌ సరిహద్దుకి కాలియాచక్‌ చాలా దగ్గరగా ఉంటుంది. దాంతో పాకిస్థాన్‌ నుంచి వచ్చే దొంగ నోట్లు బంగ్లాదేశ్‌ మీదుగా మొదట ఈ వూరికే చేరుకుంటాయి. ఇక్కణ్ణుంచి దేశవ్యాప్తంగా సరఫరా అవుతాయి. బంగ్లాదేశ్‌ నుంచి ఒక నోట్ల సంచీ భారత్‌కు చేరే లోపు కనీసం ముప్ఫయి మంది కొరియర్ల చేతులు మారుతుంది. ఏ వ్యక్తీ ఒకట్రెండు కిలోమీటర్లకు మించి నోట్ల కట్టలతో ప్రయాణించడు. దాంతో నకిలీ నోట్ల దందా జరుగుతుందని తెలిసినా, వాటిని చేరవేసే కొరియర్లను వెంటనే పట్టుకోవడం పోలీసులకూ, జవాన్లకూ తలకుమించిన పనిలా మారింది. ఒకవేళ నిందితులు దొరికినా, డబ్బు అప్పటికే మార్కెట్లోకి ప్రవేశించి ఉంటుంది కాబట్టి దాన్ని వెనక్కి తేవడం కష్టం. ఇప్పుడా సమస్యకు నోట్ల రద్దు చెక్‌ పెట్టింది. ఆర్నెల్లుగా ఉపాధి కరవవడంతో చాలామంది కుర్రాళ్లు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. రాబోయే రోజుల్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉంటే, నకిలీ నోట్ల బెడద చాలావరకూ దూరమయ్యే అవకాశం ఉంది.

ఇక్కడ 22శాతమే!

  న్‌లైన్‌, మొబైల్‌ వ్యాలెట్లూ, క్రెడిట్‌ డెబిట్‌ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలన్నీ ప్రభుత్వ లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఎవరూ పన్ను ఎగ్గొట్టే అవకాశం ఉండదు. ప్రజల్ని అలా తక్కువ నగదు వినియోగించేలా చేసి, భవిష్యత్తులో దేశాన్ని నగదు రహితంగా మార్చాలన్నదే ప్రభుత్వ ప్రణాళిక. ప్రభుత్వం ప్రజలూ కలిసి పనిచేస్తే అదేమీ అసాధ్యం కాదని బెల్జియం, ఫ్రాన్స్‌, కెనడా లాంటి దేశాలు నిరూపిస్తున్నాయి. బెల్జియంలో 93శాతం, ఫ్రాన్స్‌లో 92శాతం, కెనడాలో 90శాతం ఆర్థిక లావాదేవీలు నగదు రహితంగానే జరుగుతున్నాయి. భారత్‌లో మాత్రం ఆ సంఖ్య కేవలం 22శాతమే. నోట్ల రద్దు తరవాత డిజిటల్‌ చెల్లింపులు 400శాతం నుంచి వెయ్యి శాతం మేర పెరిగాయి. నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక కూడా అవి అదే స్థాయిలో కొనసాగితే ‘డిజిటల్‌ భారత్‌’ని చూడటం పెద్ద కష్టమేం కాదు.

అంకెలేమంటున్నాయి...

18.7లక్షలు... పెద్ద నోట్లు రద్దయ్యాక దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘లోక్‌ అదాలత్‌’లలో పరిష్కారమైన కేసుల సంఖ్య. పాత నోట్లను మార్చుకునే గడువు ముగిసేలోపే ఆ లోక్‌ అదాలత్‌లను ఏర్పాటు చేయడంతో, దాదాపు రూ.640 కోట్ల రూపాయలను ఇచ్చి పుచ్చుకొని, లక్షల మంది తమ వివాదాల్ని పరిష్కరించుకున్నారు.
* రూ.340కోట్లు... డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్‌ యోజన’, ‘డిజీధన్‌ వ్యాపారి యోజన’ పథకాల సాయంతో ఇప్పటిదాకా ‘నీతి ఆయోగ్‌’ ప్రజలూ, వ్యాపారులకూ అందించిన నగదు బహుమతుల విలువ.
* 11... అధిక సైబర్‌ భద్రతగల దేశాల్లో మన స్థానం. దీనివల్ల ఆన్‌లైన్‌ లావాదేవీల్లో అనేక దేశాలతో పోలిస్తే మనకి రిస్కు తక్కువేనన్నది బ్యాంకింగ్‌ వర్గాల మాట.
* 64లక్షలు... గత ఆర్నెల్లలో జరిగిన మొబైల్‌ వ్యాలెట్ల లావాదేవీలు. అంతకు ముందు ఆర్నెల్లలో జరిగింది కేవలం 2.8లక్షలు.
* రూ.2425 కోట్లు... గత నవంబర్‌ నుంచి మార్చి వరకూ జరిగిన డిజిటల్‌ లావాదేవీల విలువ. గత ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ జరిగిన డిజిటల్‌ చెల్లింపుల విలువ(రూ.101కోట్లు)తో పోలిస్తే ఇది 23రెట్లు ఎక్కువ.
* రూ.3421కోట్లు... ఏటా విడుదల చేసే కొత్త నోట్లను ముద్రించడానికి ఆర్‌బీఐ చేస్తున్న ఖర్చు. ఇప్పుడున్న స్థాయిలోనే డిజిటల్‌ చెల్లింపులు కొనసాగితే ప్రభుత్వానికి ఇందులో సగం భారం తగ్గే అవకాశం ఉంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.