close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంటార్కిటికా కరిగిపోతోంది...

అంటార్కిటికా కరిగిపోతోంది...

అంటార్కిటికా... మంచు ఖండం. అలాంటి చోటుకి వెళ్లడమంటే ఒక విధంగా సాహసమే. ఆ సాహసయాత్ర చేసొచ్చారు హైదరాబాద్‌కు చెందిన రఘునందన్‌ వడ్ల. అక్కడి అందాలను గుర్తుచేసుకుంటూ ఆనందపడుతూనే, భూతాపం కారణంగా అవి కనుమరుగవుతున్న తీరుకు ఆందోళన చెందుతున్నారు రఘు. ఆ పర్యటన అనుభవాలను మనతో పంచుకుంటున్నారిలా...

అంటార్కిటికా ఖండం గురించి చిన్నప్పుడు చదువుకున్నాను. భూతాపంవల్ల అక్కడ జరుగుతున్న మార్పుల గురించి తరచూ వార్తల్లో వింటున్నాను. ఏడాది క్రితంవరకూ ఆ ఖండానికి వెళ్తాననీ, వెళ్లాలనీ అనుకోలేదు. గత జులైలో ‘2041 ఫౌండేషన్‌’ నిర్వహించే ‘అంతర్జాతీయ అంటార్కిటికా యాత్ర’ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాను. ‘ఈ పర్యటన ఎందుకు చేయాలనుకుంటున్నార’ని అడిగారు వాళ్లు. ‘భారతదేశంలో గొప్ప యువశక్తి ఉంది. పర్యటన అనంతరం ఇక్కడి యువతని భూతాప పరిష్కారాల గురించి ఆలోచింపజేస్తాను. వీరి ఆలోచనలతో, ఆవిష్కరణలతో కొంతవరకైనా భూతాపాన్ని తగ్గించే అవకాశం ఉంటుంద’ని బదులిచ్చాను. పర్యటనకి ఎంపికైనట్టు అక్టోబరులో వారినుంచి మెయిల్‌ వచ్చింది. అది చూసి నాకు ఆనందంతోపాటు ఆందోళనా మొదలైంది. ఎందుకంటే ఈ పర్యటన ఖర్చు దాదాపు రూ.10లక్షలు. నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం వదులుకొని రచయితగా నిలుదొక్కుకొనే ప్రయత్నంలో ఉన్నాను. నా స్నేహితులకి విషయం చెబితే ‘అంత గొప్ప అవకాశం ఎందుకు వదులుకుంటావు... తప్పనిసరిగా వెళ్లాల్సిందే. పైగా నీ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించవచ్చు కూడా’ అన్నారు. క్రౌడ్‌ ఫండింగ్‌ద్వారా నిధులు సేకరించవచ్చని సలహా ఇచ్చి ప్రోత్సహించారు. కొందరు స్నేహితులూ, బంధువులకు విషయం చెప్పాను. వారు చాలావరకూ ఆర్థికంగా సాయపడటంతో పర్యటనకు సిద్ధమయ్యాను.

పది రోజుల యాత్ర
‘2041 ఫౌండేషన్‌’ వ్యవస్థాపకుడు రాబర్ట్‌ స్వాన్‌. ఉత్తర, దక్షిణ ధృవాల్ని కాలినడకన చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి. 14 ఏళ్లుగా ఏటా అంటార్కిటికా యాత్రని ఏర్పాటు చేస్తున్నారాయన. హైదరాబాద్‌కు చెందిన సంధ్య కూడా ఈ యాత్రకు ఎంపికయ్యారు. మేమిద్దరం హైదరాబాద్‌లో మార్చి ఒకటిన బయలుదేరి 37 గంటల విమాన ప్రయాణం తర్వాత అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌ చేరుకున్నాం. ఈ యాత్రకు వచ్చే వారందరూ ఈ నగరాన్ని ముందుగా చేరుకోవాలి. సమయం ఉండటంతో అక్కడ రెండ్రోజులు పర్యటించాను. అది చాలా అందమైన నగరం. విశాలమైన రహదారులూ, ట్రాఫిక్‌లో క్రమశిక్షణా కనిపించాయి. అయిదో తారీఖున మా అంటార్కిటికా యాత్ర మొదలైంది. ఆరోజే మొదటిసారిగా స్వాన్‌ని కలిశాను. ఆయనతో కరచాలనం నాలో నూతనోత్సాహాన్నీ, ధైర్యాన్నీ నింపింది. యాత్రకు వచ్చిన సభ్యులందరం ఆరోజు రాత్రి ఒకే హోటల్‌లో బసచేశాం. ఉదయం అల్పాహారాలు ముగించుకొని ఉషువాయా బయలుదేరాం. ఛార్టర్డ్‌ విమానాల్లో రెండు గంటలు ప్రయాణించి అక్కడికి చేరుకున్నాం. అక్కడ మాకు చల్లని గాలి స్వాగతం చెప్పింది. అదో చిన్న పట్టణం. దక్షిణ అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే దక్షిణ దిక్కున చిట్టచివరి పట్టణమిది. మేం అక్కడున్న ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి మా పాస్‌పోర్ట్‌ల మీద పెంగ్విన్‌ స్టాంపు వేయించుకున్నాం. ఇదేం తప్పనిసరి కాదు, కానీ అంటార్కిటికా వెళ్లామన్న గుర్తుగా అందరూ ఈ పనిచేస్తారు. నేను మొట్టమొదటిసారిగా షిప్‌ ఎక్కింది ఆరోజే. షిప్‌ ఎక్కకముందున్న ఆందోళన పోయి, ఆ సమయానికి కేవలం ఉత్సాహం మాత్రమే నాలో ఉంది. షిప్‌ సిబ్బంది మాకు స్వాగతం పలికారు. ఆ తర్వాత మా పాస్‌పోర్ట్‌లు తీసుకున్నారు. షిప్‌ నాలుగో అంతస్తులో నాకూ సహ ప్రయాణికుడు వాల్టేర్‌కీ రూమ్‌ ఇచ్చారు. ఆ చిన్న గదిలో రెండు పక్కలు, ఒక బాత్రూమ్‌, ఒక కుర్చీ, ఒక టేబుల్‌ ఉన్నాయి. అందులోంచి బయట అందాల్ని వీక్షించడానికి వీలుగా ఒక అద్దం ఉంది. మేం ఎక్కువ సమయం ఈ అద్దంలోంచి బయటకు చూస్తూ గమనించేవాళ్లం. మా ప్రయాణంలో చాలా ముఖ్యమైన, ప్రమాదకరమైన ఘట్టం ‘డ్రేక్‌ పాసేజ్‌’ను దాటడం. పసిఫిక్‌, అట్లాంటిక్‌ మహా సముద్రాలు కలిసే ప్రాంతమది. రెండు మహా సముద్రాలు కలుస్తాయి కాబట్టి అక్కడ అలల తీవ్రత ఎక్కువ. ఆ సమయంలో మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని ముందుగానే హెచ్చరించారు. అదృష్టవశాత్తూ భయపడినంతగా ఏమీ జరగలేదు. కొంత తల తిరిగినట్టు, కడుపు తిప్పినట్టు అయింది. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక అంతా మామూలుగా అనిపించింది.

అదిగదిగో అంటార్కిటికా...
32 దేశాలకు చెందిన 80 మంది మా బృందంలో ఉన్నారు. అత్యధికంగా మనదేశం నుంచే 20 మంది ఎంపికయ్యారు. మమ్మల్ని చిన్న బృందాలుగా వేరుచేశారు. మా ఎనిమిది మంది బృందంలో ఒక వ్యాపారవేత్త, పర్వతారోహకురాలు, ఒక యోగా టీచర్‌, ప్రపంచాన్ని చుట్టొచ్చే లక్ష్యంతో ఉన్న మరో మహిళ... తదితరులున్నారు. షిప్‌లో దాదాపు ఒకటిన్నర రోజుల ప్రయాణం తర్వాత ఓరోజు ఉదయాన్నే బయట చూసేసరికి ఒక అద్భుతమైన కళాఖండం కనిపించింది. అదో పెద్ద మంచు పర్వతం. చాలా దూరం నుంచి అంటార్కిటికాకు ఆహ్వానం పలుకుతున్నట్టుంది. వెంటనే ఆ అద్భుతాన్ని చూడ్డానికి డెక్‌పైకి వెళ్లాం. షిప్‌ అంటార్కిటికా వైపు వెళ్లేకొద్దీ కనీవినీ ఎరుగని అద్భుతమైన ప్రకృతి సోయగాల్ని చూసే భాగ్యం కలిగింది. అంటార్కిటికాలో మా మొదటి మజిలీ ‘హాఫ్‌ మూన్‌ ఐలాండ్‌’లో. ఆ మంచు ద్వీపానికి కాస్త దూరంలోనే షిప్‌ను నిలిపి ఉంచారు. అక్కణ్నుంచి చిన్న రబ్బరు పడవల్లో ప్రయాణించి ద్వీపం మీదకు వెళ్లాం. ప్రతి పడవలో ఎనిమిది మంది యాత్రికులతోపాటు ఇద్దరు పరిశోధకులు ఉండేవారు. వాళ్లు మాకు గైడ్‌లుగా వ్యవహరించేవారు. చలిని తట్టుకోవడానికి పడవల్లో వెళ్లేటపుడు మందపాటి దుస్తులు వేసుకున్నాం. హాఫ్‌ మూన్‌ ఐలాండ్‌లో మాకు ఓచోట 50 వరకూ సీల్స్‌ నిద్రిస్తూ కనిపించాయి. రెండు సీల్స్‌ మాత్రం నీళ్లలో ఆడుకుంటున్నాయి. కాస్త దూరంగా పెంగ్విన్‌లు కనిపించాయి. ముందుకు వెళ్లేకొద్దీ వేల సంఖ్యలో పెంగ్విన్‌లు దర్శనమిచ్చాయి. పెంగ్విన్‌లు సామూహిక జీవులు. అవి నీటిలోంచి ఒడ్డునున్న మంచుపైకి వచ్చి సేదదీరుతూ కనిపించాయి. మేం ఆ చిన్న పడవలో రోజుకో చోటకి వెళ్తూ వీలుంటే నేలమీదకు దిగేవాళ్లం. లేనిచోట అందులోనుంచే చూసేవాళ్లం. సీల్స్‌, పెంగ్విన్‌లతోపాటు అక్కడ మంచు కొండల అందాలు మమ్మల్ని రెప్పవాల్చనిచ్చేవి కావు. ఆ కొండలు లేత నీలిరంగులో వివిధ పరిమాణాల్లో విచిత్రమైన ఆకారాల్లో ఉన్నాయి. అక్కడున్న నాలుగురోజులూ మేం ఎన్నో సీల్స్‌నీ, తిమింగలాల్నీ, పక్షుల్నీ చూశాం. అంటార్కిటికాలో పగటి సమయం ఎక్కువ. రాత్రి పదివరకూ వెలుగు ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు తిరిగేవాళ్లం. చిన్న పడవలో వెళ్లినపుడు ఒక తిమింగలం నా చేతికి దగ్గరగా వచ్చింది. చేయి చాపితే తాకేదే. అంత పెద్దదైన ఆ జీవి మమ్మల్ని పట్టించుకోకుండా ఎంతో ప్రశాంతంగా వెళ్లిపోయింది. మా పక్కనుంచి వెళ్లిన చిన్న చిన్న తిమింగలాలకు లెక్కేలేదు. అక్కడ జీవుల్ని పట్టుకోవద్దని మాకు ముందే చెప్పారు. మరీ ముఖ్యంగా విష దంతాలుండే సీల్స్‌ జోలికి వెళ్లొద్దన్నారు. ఒక సీల్‌ మా పడవ వెంబడి కోపంగా వచ్చింది. మాకు ఒక్కసారిగా భయమేసింది. అంతలోనే మళ్లీ ఆగిపోయింది. సీల్స్‌ సముద్రంలో స్నానం చేస్తుంటే చూడ్డానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. అక్కడి వింతలూ విశేషాల్ని చూశాక దేవుడు సృష్టించిన అద్భుతమే అంటార్కిటికా అనిపించింది.

కరిగిపోతోంది!
అంటార్కిటికా మొత్తం వైశాల్యం 1.4కోట్ల చ.కి.మీ. భూమ్మీద ఉన్న మంచి నీటిలో 70 శాతం అక్కడ గడ్డకట్టి ఉంటుంది. అదిగాని కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం 60మీటర్లు పెరుగుతుందని అంచనా. వూహకే భయంకరంగా ఉంది కదూ! కానీ మనం జాగ్రత్త పడకపోతే భూతాపం ఇలాగే పెరిగితే అది నిజమయ్యే రోజు ఎంతో దూరం లేదు. ఇప్పటికే ఆ ఆనవాళ్లు అక్కడ కనిపిస్తున్నాయి. మాకు అక్కడక్కడా పెద్ద పెద్ద మంచు ముక్కలు నీటిపైన తేలుతూ కనిపించాయి. అవి ఒకప్పుడు మంచు ద్వీపాల్లో భాగంగా ఉండేవి. ఉష్ణోగ్రతలు పెరగడంవల్ల కొద్దికొద్దిగా కరిగి వాటినుంచి వేరుపడ్డాయి. మాతోపాటు వచ్చిన నిపుణులు చెప్పడం ప్రకారం ఆ మంచు ముక్కలు కొన్ని వేల సంవత్సరాలనుంచి అంటార్కిటికాలో భాగంగా ఉండి ఈ మధ్యనే వేరుపడ్డాయి. ఓరోజు మేమంతా షిప్‌ డెక్‌పైన ఉన్నపుడు విశాలమైన ఘనాకార మంచు దిబ్బ కనిపించింది. మా షిప్‌ దాని పక్కనుంచే వెళ్లింది. అది ‘లార్సెన్‌ బి ఐస్‌ షెల్ఫ్‌’. 2002లో అంటార్కిటికా నుంచి చీలిపోయిన మంచు దిబ్బ అది. ఒకప్పుడు గ్రేట్‌ బ్రిటన్‌ అంత వైశాల్యంలో ఉండేదట. ఇలాంటి మార్పులు అక్కడ ఎన్నో కనిపిస్తుంటాయి. అంటార్కిటికాలో జంతువులూ, పక్షులూ మాత్రమే ఉంటాయి. కానీ వాటి భవిష్యత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవుల చేతుల్లోనే ఉంది.

ఈసారి దొరికిపోయాం!
నేను రాసిన ‘గ్రేట్‌ ఇండియన్‌ ట్రెజర్‌’ పుస్తకాన్ని మార్చి 11న అంటార్కిటికాలోనే రాబర్ట్‌ స్వాన్‌ ఆవిష్కరించారు. బహుశా మనదేశం నుంచి అక్కడ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసిన మొదటి రచయితని నేనే కావొచ్చు. తిరుగు ప్రయాణంలో డ్రేక్‌ పాసేజ్‌ కష్టాల్ని తప్పించుకోలేకపోయాం. అద్దంలోంచి చూస్తే బయట అలల ఉధృతి చాలా తీవ్రంగా కనిపించింది. మేం షిప్‌లో సరిగ్గా నడవలేకపోయాం. కూర్చున్న సోఫా అటూఇటూ కదలిపోయేది. కళ్లు తిరిగాయి, కడుపు తిప్పింది. ఏమీ తినబుద్ధి కాలేదు. ఒకసారి వాంతి కూడా చేసుకున్నాను. అలల తాకిడిని తగ్గించుకోవడానికి మేం కొంత దూరం పసిఫిక్‌లోకి వెళ్లి మళ్లీ అట్లాంటిక్‌లోకి వచ్చాం. దాంతో అనుకున్న సమయానికంటే ఆలస్యంగా తిరిగి ఉషువాయా చేరాం. అక్కణ్నుంచి బ్యూనస్‌ ఎయిర్స్‌ చేరుకున్నాం. అక్కడ మిత్రులందరికీ వీడ్కోలు చెప్పి భారత్‌ తిరుగు ప్రయాణమయ్యాం. భూగోళాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న విషయాన్ని అంటార్కిటికా పర్యటన అనుభవంకంటే గొప్పగా మరెక్కడా తెలుసుకోలేమేమో అనిపించింది.

ర్యటన చివరి రోజున స్వాన్‌ మా అందరితో ఒకటే చెప్పారు... ‘మీరు చూసిన అంటార్కిటికా కథని సాధ్యమైనంత ఎక్కువమందితో పంచుకోండి’ అని. నేను అక్కణ్నుంచి వచ్చినప్పటి నుంచీ ఆ ప్రయత్నమే చేస్తున్నాను. భవిష్యత్తులోనూ చేస్తాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.