close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వందే శంకరమ్‌ జగద్గురుమ్‌

వందే శంకరమ్‌ జగద్గురుమ్‌

ఆది శంకరులు జగద్గురువులు. భరతఖండ వాసులు అనేక మతాలుగా విడిపోయి తంత్ర, క్షుద్ర పూజా విధానాలవైపు నడుస్తున్న సమయంలో, మన సనాతన ధర్మాన్ని అద్వైత మతంగా తెరకెక్కించి, దేశ ప్రజలందర్నీ ఒక్కతాటి మీదకు తెచ్చిన మహనీయుడాయన. ఆయన జన్మస్థలమైన కాలడిలో శంకరుల గుర్తులూ, పునీతమైన ప్రదేశాలూ చాలానే ఉన్నాయి.

(ఈరోజు ఆదిశంకరుల జయంతి)

దాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం
వందే గురు పరంపరాం!

గురుకులాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు గురుపరంపరను గుర్తు చేసుకుని నమస్కరించి అభ్యాసం మొదలు పెట్టడం హిందూ సంప్రదాయంలో పరిపాటి. తొలి గురువైన సదాశివుడికీ, తర్వాతి శంకరాచార్యులకూ, నాకు విద్యనేర్పిన గురువులకూ నమస్కారం అని దీని అర్థం. హైందవ సంప్రదాయంలో అంతటి స్థానాన్ని పొందారు శంకరాచార్యులు. నిజానికి ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యులు పుట్టే సమయానికి బౌద్ధం భారతదేశంలోకి బాగా చొచ్చుకొచ్చింది. అందులోనూ హీనయాన బౌద్ధం హిందూ మతాన్ని ద్వేషించేది. అది కాక సుమారు 70 మతాల దాకా పుట్టుకొచ్చాయి. తంత్ర క్షుద్ర పూజలు పెరిగాయి. శైవ వైష్ణవుల కొట్లాటలూ తారాస్థాయికి చేరాయి. ఆధ్యాత్మికమనే భావనకు అర్థమే మారిపోతున్న కాలమది. అలాంటి స్థితిలో అద్వైత భావనను ఒక మతంగా తీసుకువచ్చారు శంకరులు. శివకేశవులకు భేదం లేదని చెప్పడమే కాదు ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి ఎన్నో చర్చోపర్చలు జరిపి, ఎందరినో ఈ మతం వైపు తీసుకువచ్చారు. అందులో భాగంగానే ఉత్తరాన బదరీనాథ్‌లో జ్మోతిర్మఠాన్నీ, దక్షిణాన కర్ణాటక శృంగేరీలో శారదా పీఠాన్నీ, తూర్పున పూరీలో గోవర్థన పీఠాన్నీ, పశ్చిమాన ద్వారకలో కాళికా పీఠాన్నీ స్థాపించి హిందూ మత పరిరక్షణకు కృషి చేశారు. ఆయన అద్వైత భావన ఎంతో మందిని ఆకర్షించింది. హిందూ మతం మన దేశంలో ఇప్పుడీ స్థానంలో ఉందంటే అది శంకరాచార్యుల చలవే.

నిత్య స్మరణీయం...
బ్రహ్మసత్యం జగన్మిథ్య
జీవో బ్రహ్మైవ నాపరః

బ్రహ్మమొక్కటే సత్యం, జగత్తు మిథ్య. ఈ జీవుడే(ఆత్మ) బ్రహ్మం. జీవుడూ బ్రహ్మం వేరు వేరు కాదు అనేది శంకరుల మాట. ఈ భావాన్ని భగవద్గీత, పురాణాల సారంగా చెబుతారాయన. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే వేదాలూ, ఉపనిషత్తులకు భాష్యం కావాలని భావించారు. అందుకే బ్రహ్మసూత్రాలకూ ఐతరేయోపనిషత్తు, ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తూ... ఇలా ఎన్నో ఉపనిషత్తులతో పాటూ భగవద్గీత, విష్ణుసహస్రనామాలూ, గాయత్రీ మంత్రాలకు భాష్యం రాశారు. నిత్య పూజలో ఉపయోగపడేలా గణేశపంచరత్న స్తోత్రం, సౌందర్యలహరి, లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, భజగోవిందం, కనకధారాస్తవంలాంటివెన్నో రచించారు. బ్రహ్మచారిగా భిక్షాటనకు వచ్చిన శంకరులకు ఓ పేద ఇల్లాలు తన వద్ద ఉన్న ఒకేఒక్క ఉసిరికాయను భిక్షగా వేసిందట. అది చూసి చలించిన శంకరులు లక్ష్మీదేవిని స్తుతించారట. వెనువెంటనే బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందట. ఆ స్తోత్రమే కనకధారా స్తవంగా బహుప్రాచుర్యం పొందింది.

పుణ్యక్షేత్రం...
కేరళలోని గురువాయూర్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలడి గ్రామంలో ఆది శంకరాచార్యులు జన్మించారు. తల్లి ఆర్యమాంబ, తండ్రి శివగురువు. శంకరుల గురువు గోవింద పాదాచార్యులు. ఎనిమిదో ఏట శంకరాచార్యుడు సన్యాసం స్వీకరించాలనుకోగా, తల్లి ఒప్పుకోలేదు. ఒక రోజు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా మొసలినోటికి చిక్కారు శంకరాచార్యులు. ‘అమ్మా ఎలాగూ పోతున్నాను, నాకు సన్యాసిగా వెళ్లే అవకాశాన్నివ్వు’ అనడంతో ఆమె ఒప్పుకుంటుంది. ఆది శంకరులు సన్యాసం తీసుకున్నట్టు మంత్రం చదివిన వెంటనే ఆయన్ను మొసలి వదిలిపెడుతుంది. ఇది జరిగిన చోటును కాలడిలో మొసలిఘాట్‌గా చూడొచ్చు. శంకరుల చిన్నతనంలో ఒకసారి తన తండ్రి వూరికి వెళుతూ అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టిరమ్మంటారు. అమ్మవారు నిజంగానే వచ్చి పాలు తాగేదాకా శంకరులు గోల చేశారట. అదే కాలడి దగ్గరి కాత్యాయనీ దేవాలయం. తర్వాత శంకరులు సౌందర్యలహరి రాసింది ఈ అమ్మవారిని గురించే. ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శంకరాచార్యుల తండ్రి పూజారిగా చేసిన మంజప్ప కార్విల్లి కావు శివదేవాలయం ఉంది. వృద్ధులైన ఈయన తల్లిదండ్రులు అంతదూరం వెళ్లి అర్చన చేసుకోలేక శివుడిని ప్రార్థించారట. కలలో నాట్యమాడే తెల్లజింకను వెంబడిస్తే తన లింగం దర్శనమిస్తుందని చెప్పాడట శివుడు. ఆ చోటే కాలడికి దగ్గర్లో ఉన్న తిరువెల్లమాన్‌ మల్లి దేవాలయం. కాలడికి సమీపంలోనే నయతోడూ శంకరనారాయణ దేవాలయం ఉంది. ఇక్కడే శంకరాచార్యులు విష్ణువుని ప్రార్థించారట. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై శివుడిలో కలిసిపోయాడట. అందుకే ఈ ఆలయంలో ముందుగా శివుడికీ తర్వాత విష్ణువుకీ అర్చన చేస్తారు. కాలడిలో శంకరులకు ఒక ప్రత్యేక ఆలయం ఉంది. తల్లికి దూరమవుతోందని ఆయన పూర్ణానదిని తన ఇంటివైపు మళ్లించిన చోటు ఈ ఆలయానికి దగ్గర్లోనే ఉంది. ఆ తీరం వెంటే శంకరులు కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడే అచ్యుతాష్టకం చెప్పారు. ఇక్కడికి దగ్గర్లోనే శృంగేరీ పీఠం ఉంది. కాలడి గ్రామంలోకి వెళ్లగానే కంచిపీఠం వాళ్లు నిర్మించిన కీర్తిస్తంభం అనే ఎనిమిదంతస్తుల భవనం కనిపిస్తుంది. శంకరుల జీవిత చరిత్ర అంతా చిత్రాల రూపంలో ప్రదర్శనకు ఉంచారక్కడ. మొత్తంగా ఆర్ష ధర్మాన్ని పాటించే వాళ్లకు ఈ కాలడి ఓ దివ్యక్షేత్రం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.