close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మజా మజా మామిడి

మజా మజా మామిడి

ఎన్నో రకాలు..! 

నకు తెలిసి మామిడి అనగానే రసాలు, బంగినపల్లి, ఆల్ఫాన్సో, దశహరి, హిమాయుద్దీన్‌, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, కొబ్బరిమామిడి, మల్లిక, ఆమ్రపాలి, లాంగ్డా, అర్క అరుణ, బాంబే గ్రీన్‌, పంచదార కలశ... ఇలా కొన్ని రకాలే కనిపిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 1100 రకాలకు పైనే పండుతున్నాయి. వాటిల్లో ప్రాచుర్యం పొందిన తొలి ఐదు రకాలేమంటే...

ఆల్ఫాన్సో:  పండ్లకు రాజు మామిడి అయితే ఆ మామిడి రకాల్లో రారాజు ఆల్ఫాన్సో. మార్చి నుంచి జులై వరకూ కాసే ఈ రకం రుచిలోనే కాదు, ఖరీదైనదిగానూ పేరొందింది. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా పండే ఈ రకం మామిడిలో టెంకను పాతితే కచ్చితంగా మళ్లీ అదే రకం మామిడి మొలకెత్తకపోవడమే దీని ప్రత్యేకత.

బాదామి:  ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ రకం, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోంది. చల్లగా తింటే దీని రుచి మరింత పెరుగుతుంది.

వేలన్సియా ప్రైడ్‌:  దక్షిణ ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఈ రకం పెద్ద పరిమాణంలో గులాబీ, ఎరుపు, పసుపు రంగుల్లో అందాల విందు చేస్తుంటుంది. ఎస్‌ ఆకారంలో ఉండే ఈ పండులో అస్సలు ఏమాత్రం పీచు ఉండదు.

నామ్‌ డక్‌ మాయ్‌:  దీనికే గోల్డెన్‌ మ్యాంగో అని పేరు. ఏ మాత్రం పీచు లేని ఈ పండు రుచి చూడాల్సిందే అంటారు థాయ్‌ వాసులు. మే నుంచి అక్టోబరు ప్రారంభం వరకూ వచ్చే ఈ పండ్లు తియ్యగా మంచి వాసనతో ఉంటాయి. ఎడారిలోనూ వీటిని పండించుకోవచ్చు.

చౌసా:  పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ముల్తాన్‌, సాహివాల్‌ జిల్లాలో ఎక్కువగా పండించే ఈ రకం, మంచి వాసనతో అద్భుతమైన రుచితో ఉంటుంది. చౌసా ప్రాంతంలో హుమాయూన్‌ మీద గెలుపొందిన షేర్‌షాసురి అక్కడ పండే మామిడికి ఆ పేరు పెట్టాడు. జులై - సెప్టెంబరు దీని సీజన్‌.

ఇవేకాదు, ఎరుపూ గులాబీరంగుల్లో నోరూరించే గ్లెన్‌, హనీ మ్యాంగోగా పేరొందిన సింథేరీ, ఘాటైన తియ్యని రుచితో ఉండే మేడమ్‌ ఫ్రాన్సిక్‌, గుండ్రంగా చిన్నగా ఉండే తియ్యని కేసర్‌, ఎరుపురంగు మచ్చలతో ఉండే కెట్‌ రకాలు తరవాతి ఐదు స్థానాల్లో మామిడిప్రియులకు చవులూరిస్తున్నాయి.

భలే మందు..!

విటమిన్లూ ఖనిజాలూ యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉండే మామిడిపండు అనేక వ్యాధుల నుంచీ రక్షిస్తుంది. ముఖ్యంగా ఈ కాయల్లోని పాలీఫినాల్స్‌ కాన్సర్లను నిరోధిస్తాయి. ఇవి క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవడంతోబాటు ఆయా కణాలను నాశనం చేసినట్లుగా పరిశోధనల్లోనూ తేలింది. వూబకాయుల్లో చక్కెర స్థాయుల్ని కూడా మామిడి అదుపుచేయగలదన్నది మరో పరిశోధన.
* రక్తహీనతతో బాధపడేవాళ్లకి మామిడిలో ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఎసిడిటీ, అజీర్తిలతో బాధపడేవాళ్లకీ మంచి మందే.
* బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం, డయేరియా, ఎండదెబ్బ, కాలేయవ్యాధులు, ఆస్తమా, నెలసరి ఇబ్బందులు, మొలలు, స్కర్వీ, సైనసైటిస్‌... ఇలాంటి అన్ని సమస్యలకీ మామిడిపండు మంచి టానిక్‌.
* మామిడిపండులోని బీటాకెరోటిన్‌ వృద్ధాప్యాన్ని అడ్డుకుంటే, మాంజిఫెరన్‌ శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.
* పొయ్యిమీద మందపాటి గిన్నెలో ఇసుకపోసి బాగా పండిన పండును అందులో ఉంచి కాల్చి రసం పిండి తాగితే కఫం, దగ్గు తగ్గుతాయి.
* శరీరంలోని నాడులనూ ఇది పరిపుష్టం చేస్తుంది. మానసికంగా బలహీనులైనవాళ్లకి దీని రసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్‌ ఆనందాన్ని అందించే సెరటోనిన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఏకాగ్రతనీ జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. అందుకే, పడుకునేముందు ఓ మామిడిపండు తింటే మంచిదని చెబుతారు.

అన్నింటినీ మించి మామిడిపండు కడుపు నిండిన తృప్తినీ హాయైన అనుభూతినీ కలిగిస్తుంది. అందుకే అది అప్పుడూ ఎప్పుడూ మధురాతిమధురమే.

అన్నిటికన్నా తియ్యన...

క చెట్టుకి కాసిన కాయలే ఒక్కతీరున ఉండవే... ఇక, వేల రకాల మామిళ్లన్నీ ఒకే రుచితో ఎలా ఉంటాయి? కచ్చితంగా ఉండవు. అందుకే మామిడి పండ్లన్నింటిలోకీ రుచికరమైనది ఏమిటాని ఆమధ్య గిన్నిస్‌బుక్‌ వాళ్లు ఆరా తీశారట. తేనె మామిడిగా ప్రాచుర్యం పొందిన పాకిస్థానీ సింథ్‌; పసుపురంగులోనే కాసే థాయ్‌ నామ్‌ డక్‌ మాయ్‌; దక్షిణ భారతానికి చెందిన బాదామి... వంటి వాటన్నింటినీ తోసిరాజని తీపికే మారుపేరైన ఫిలిప్పీన్స్‌ స్వీట్‌ ఎలినా, గుయ్‌మారాస్‌ మామిడి రకాలు ప్రథమస్థానంలో నిలిచాయి. దాంతో ఇప్పుడు వైట్‌హౌస్‌లోనూ బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లోనూ టెంక ఉందో లేదో అనిపించే ఆ పండ్లే మధుర రుచుల్ని అందిస్తున్నాయి.

భారీ మామిడి!

కొన్ని జంతుజాతుల మాదిరిగానే కొన్ని వృక్షజాతులూ అంతరించిపోతుంటాయి. ఇందులో మామిడి రకాలకీ మినహాయింపు లేదు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని కతివాడా ప్రాంతంలో పెరిగే నూర్జహాన్‌ అరుదైనదిగానూ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరలో అంతరించిపోయే రకాల్లో ఒకటిగానూ గుర్తింపు పొందింది. సైజులోనూ రికార్డు సృష్టించిన ఈ రకంలో ఒక్కో మామిడికాయ సుమారు రెండున్నర నుంచి ఐదు కిలోల బరువు ఉండే ఈ కాయలు చెట్టుకి 70 వరకు మాత్రమే కాస్తాయి. ఆ బరువు మోయలేక చెట్టు కొమ్మలు కూడా వంగిపోతుంటాయి. అలాగని ఇది అద్భుత రుచి అని చెప్పలేం. కేవలం సైజు కారణంగానే కాయ సుమారు 300 రూపాయలైనా చాలామంది కొంటుంటారు.

అతిపెద్ద పండ్ల మార్కెట్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ దగ్గరున్న నున్న, సుమారు రెండు వేల మెట్రిక్‌ టన్నుల్ని విక్రయిస్తూ ఆసియాలోకెల్లా అతి పెద్ద మామిడిపండ్ల మార్కెట్‌గా పేరొందింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.3 కోట్ల టన్నుల మామిడికాయలు పండుతుంటే, వాటిల్లో 42 శాతం మనదేశంలోనే పండుతున్నాయి మరి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మామిడిపండ్ల మార్కెట్లు చాలానే ఉన్నా భారీ మామిడికాయలన్నీ ఒకేచోట కనిపించే అతిపెద్ద మార్కెట్‌ను చూడాలంటే మాత్రం పాకిస్థాన్‌కి వెళ్లాల్సిందే. కబీర్‌వాలా, ఫజిల్‌పూర్‌, రహిమయార్‌ ఖాన్‌ ప్రాంతాల్లో సుమారు 370 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ మార్కెట్‌లో అన్నీ భారీ మామిడికాయలే కనువిందు చేస్తుంటాయి.

ఆపాత మధురం!

నేలతీరు, ఎగుమతులకు అనుకూలంగా నిల్వ ఉండటం... వంటి వాటికారణంగా కొన్ని రకాలు విశ్వవ్యాప్తంగా నోరూరిస్తుంటే, మరికొన్ని రకాలు అత్యంత మధురంగా ఉంటాయి. కానీ వాటి రుచి, స్థానికులకే పరిమితమై అత్యంత అపురూపమైనవిగా పేరొందాయి. వాటిల్లో కొన్ని...

పండూరి:  మామిడి రకాల్లోనే అత్యంత పురాతనమైనది ఆంధ్రప్రదేశ్‌లోని పండూరి లేదా పండూరివారి మామిడి. ఈ రకం చెట్లు సుమారు వంద అడుగుల ఎత్తు వరకూ ఎదిగి, మూడొందల ఏళ్లు జీవిస్తాయట. ఈ కాయలు చూడ్డానికి పప్పులో వేసుకునే మామిడికాయల మాదిరిగానే చిన్న సైజులో ఉంటాయి. కానీ రుచి అద్భుతం. ఇతర మామిడికాయల్లా పండినా రంగుదేలకుండా ఆకుపచ్చరంగులోనే ఉంటాయి. మామిడి సీజన్‌ కూడా వీటితోనే మొదలవుతుంది. దీని పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా తెలియదు కానీ చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం ఉండ్రాజవరం మండలంలోని వెలగదురు గ్రామ పరిసర ప్రాంతాల్లో దొంగలు ఓ పండును తిని టెంకను పాతగా, దాన్నుంచి మొలకెత్తిన చెట్టు నుంచే అంట్లు కట్టారట. ఆపై క్రమంగా ఇది అంతరించిపోతుండటంతో అటవీశాఖ దీని పరిరక్షణకు నడుం కట్టింది. ఫలితం కడియం నర్సరీల్లో అంట్లు కట్టిన మొక్కలు దొరుకుతున్నాయి. పూర్వం ఆంధ్ర పాంతాన్ని పాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని ఆ రుచిని తాము ఆస్వాదించడమే కాదు, మిత్ర రాజులకు వాటిని కానుకలుగా పంపించేవారట. తమ తోటల్లో కాసే ప్రత్యేక రకాలను బంధువులకూ స్నేహితులకీ పంపించే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది.

పంజవర్ణం:  తమిళనాడులోని రాజపాళ్యంకి చెందిన జగన్నాథ రాజా అనే సన్నకారు రైతు గుర్తించి పెంచుతున్న పంజవర్ణం రకం కూడా తేనె అంత మధురంగా ఉంటుందట. ఈ చెట్లు సుమారు పదిహేనేళ్ల వయసొచ్చాక ఏడాదికి వెయ్యి పండ్ల వరకూ కాస్తాయట. అయితే ఈ కాయలకు కూడా స్థానికంగానే వాడకం ఎక్కువగా ఉండటంతో వీటి రుచి ఇతర ప్రాంతాలకు చేరలేదు.

వన్నీ ఒక ఎత్తయితే, చేతులకీ మూతులకీ పూసుకుంటూ జుర్రుకుంటూ రసాస్వాదన కలిగించే చెరకురసాలు, నూజివీడు రసాలు, చిన్న రసాలు, పెద్దరసాలు, సువర్ణరేఖ, పంచదార కలశ... వంటివన్నీ మాత్రం మనకే సొంతం. ఎందుకంటే ప్రపంచదేశాలతోబాటు మనదేశంలోని ఇతర ప్రాంతాల్లో తినేవన్నీ కోత పండ్లే మరి. ఇవే కాదు, ఆయా ప్రాంతాలకే పరిమితమవుతూ మన దృష్టికి రాని అపురూపమైన మామిళ్ల రుచులెన్నో... ఎన్నెన్నో..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.