close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ వేసవిని పిల్లలకిద్దాం

  1 ప్రియనేస్తం పుస్తకం

మంచి పుస్తకం ఆత్మీయుడైన స్నేహితుడిలాంటిది. పుస్తకం వెంట ఉంటే ప్రపంచం మొత్తం తోడున్నట్లే. పిల్లలకు చదివే అలవాటు ఎలా చేయాలన్నదే పెద్దలకు దిక్కుతోచని చిక్కు సమస్య. పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు కూడా చదివే అలవాటు చేసుకోవాలి. వయసుకి తగినట్టు మంచి పుస్తకాలు సమకూర్చాలి. పుస్తకాలు లేని ఇల్లూ, కిటికీలు లేని గదీ ఒక్కటే. టీవీ, కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి ఎన్నున్నా పుస్తకాలకు ప్రత్యామ్నాయం కావు. కథలు, పజిల్స్‌, సైన్స్‌ పుస్తకాలతో పఠనం ప్రారంభించవచ్చు. పంచతంత్రం, జానపద కథలు, హాస్య కథలు, జీవిత చర్రితలు, కామిక్స్‌ ఎన్నో మార్కెట్‌లో చౌకగా లభ్యమవుతున్నాయి. బాలభారతం, బాలమిత్ర లాంటి పత్రికలూ అందుబాటులో ఉన్నాయి. పిల్లల కోసం రాసిన రామాయణ, మహాభారతాలూ దొరుకుతున్నాయి. పిల్లలందర్నీ ఒకచోట కూర్చోపెట్టి చదవమంటే ఉత్సాహంగా చదువుతారు. పెద్దలూ కలిసి చదివితే ఇంకా బాగుంటుంది. చదివేటప్పుడు అర్థం కాని విషయాల్నీ, పదాల్నీ వివరించి చెప్పాలి. వేసవి సెలవులు ఇంకా ఆరేడు వారాలున్నాయి కాబట్టి వారానికి ఒక పుస్తకం చదివినా ఆరేడు పుస్తకాలు చదివేస్తారు. పిల్లలకు చదివే అలవాటు ఏర్పడుతుంది. ఇన్ని పుస్తకాలు చదివాక ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. స్కూలు మొదలయ్యాకా ఈ అలవాటు కొనసాగే అవకాశాలు ఎక్కువ.


2 పత్రికలు వికాసవీచికలు

దినపత్రికల్లో పిల్లలకు పనికొచ్చే విషయాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు దినపత్రికలు పిల్లల కోసం ప్రత్యేక పేజీలు ప్రచురిస్తున్నాయి. చదువుకు సంబంధించిన పేజీలూ ఇస్తున్నాయి. రోజూ పత్రికలు చదివే పిల్లలు చదువులోనూ రాణించే అవకాశాలు ఎక్కువ. మార్కులూ, ర్యాంకులూ రావడమే కాదు, ఆలోచనా తీరే మారుతుంది. పదసంపద పెరుగుతుంది. వారి పరిధి విశాలమవుతుంది. ఇలాంటి విద్యార్థులే అద్భుత ప్రతిభావంతులూ, శాస్త్రవేత్తలూ, సృజనశీలురుగా తయారవుతారు.


3 రోజుకో పజిల్‌

లెక్కల మాస్టారు చక్రవర్తి డిల్లీ నుంచి వస్తూ తన కొడుకు రోహిత్‌కి పుట్టిన రోజు కానుకగా క్రికెట్‌ బ్యాటూ, బంతీ కొనితెచ్చాడు. ధర ఎంతని రోహిత్‌ తండ్రిని అడిగాడు. బ్యాట్‌, బంతి కలిపి రూ. 1100, రెంటి మధ్య తేడా రూ. 1000 లని చెప్పి, దేని ధర ఎంతో కనుక్కో చూద్దాం అన్నాడు తండ్రి. లెక్కలంటే ఇష్టం లేని రోహిత్‌ దృష్టి ఇప్పుడు ఈ చిక్కుముడి విప్పడం మీదే. విజయరామ్‌ రూ. 50,000 లకు ఒక ఆవుని కొన్నాడు. మర్నాడే మంచి బేరం వస్తే రూ. 60,000లకు అమ్మేశాడు. ఇంకా మంచి ధర పలికేదని ఎవరో చెబితే రూ. 70,000 లకు అదే ఆవుని మళ్లీ కొనుక్కున్నాడు. కొన్నాళ్లకు రూ. 80,000 లకు అమ్మేశాడు. ఇంతకీ విజయరామ్‌కి ఈ బేరసారాల్లో లాభమా, నష్టమా? ...లెక్కలంటే భయపడే పిల్లల్ని కూడా ఇలాంటి పజిల్స్‌ ఇట్టే ఆకర్షించేస్తాయి. మార్కెట్‌లో ఈ తరహా పజిల్స్‌ బోలెడన్ని ఉన్నాయి. అంతర్జాలంలోనూ లభ్యమే. సేకరించి రోజుకో ప్రశ్న అడుగుతూ ఉంటే పిల్లలు ఇంకా ఇంకా కావాలని అడుగుతారు.


4 జూ అంటే జువాలజీ పాఠం

స్కూలూ, సూపర్‌ మార్కెట్లూ మినహా నగరాల్లోని పిల్లలు ఇష్టంగా వెళ్లేవి సినిమా థియేటర్లే. కానీ వారిని తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన ప్రదేశాలు జంతుప్రదర్శనశాలలూ, మ్యూజియంలు. హైదరాబాద్‌లోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలోని జిరాఫీల్నీ, ఆఫ్రికా సింహాలనూ, వందేళ్ల తాబేళ్లనూ మీ పిల్లలకు ఎప్పుడైనా చూపించారా? అక్కడ పులుల సఫారీ కూడా ఉంది. ఎలాగైనా ఖాళీ చేసుకుని ఒక పూర్తి రోజు పిల్లలతో జంతుప్రదర్శనశాలకు వెళ్లిరండి. పుస్తకాల్లోని బొమ్మల్ని కాకుండా సజీవంగా ఉన్న జంతువుల్ని చూపించి వాటిని పరిశీలించే అవకాశం పిల్లలకు కల్పించండి. చూసొచ్చాక వాటి జీవిత కాలం, ఆహారం, ప్రవర్తన, తెలివితేటల గురించి రాయమనండి. ఎంతో థ్రిల్‌ పొందుతారు. జూ అనుభవాన్ని ఉత్తరంగా రాసి స్నేహితులకు కానీ, బంధువుల్లోని అదే ఈడు పిల్లలకు కానీ పంపమనండి.


5 చరిత్రశాలలు

పారిస్‌లో లోవ్రే మ్యూజియం అని ఉంది. మొనాలిసా చిత్రం ఉండేది అక్కడే. ఒక్కో వస్తువుని ఒక్కో నిమిషం చొప్పున రోజులో 24 గంటలూ చూస్తే ఆ మ్యూజియం మొత్తం చూడ్డానికి నెలరోజులు పడుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజియం మనకూ ఒకటి ఉంది. అదే హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం. పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి గంటలుకొట్టే గడియారాన్నీ, అటు చూస్తే స్త్రీలా, ఇటు చూస్తే పురుషుడిలా కనిపించే అపూర్వ శిల్పసౌందర్యాన్నీ చూపించి తీరాలి. చరిత్ర పుస్తకాల్లో ఉండే పాఠ్యాంశాల్నీ మ్యూజియంలో ఉండే సంబంధిత భాగాలతో కలిపి వివరిస్తే కుతూహలం పెరుగుతుంది.


6 చుక్కల లెక్కలు

హైదరాబాద్‌లో బిర్లా నక్షత్రశాల (ప్లానెటోరియం) ఉంది. రోజూ ప్రదర్శనలుంటాయి. తెలుగులో కూడా వ్యాఖ్యానం వినవచ్చు. ఉపగ్రహాల ప్రయోగాన్నీ పనితీరునీ అర్థం చేసుకోవచ్చు. నక్షత్రశాల పక్కనే సైన్స్‌ మ్యూజియం ఉంది. అక్కడ సైన్స్‌ వింతలూ, విశేషాలూ ఎన్నో ఉన్నాయి. సైన్స్‌ సూత్రాల్ని బట్టీ పట్టించడంకాక పిల్లల్ని ఇలాంటి చోట్లకు తీసుకెళ్తూ ఉంటే వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. సొంతంగా ప్రయోగాలు చేస్తారు. ఏ ఇంట్లో శ్రీనివాస రామానుజన్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు ఉన్నారో ఎవరికి తెలుసు?


7 స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్‌వర్క్‌

మీ ఇంట్లో పెద్దవాళ్లున్నారా? లేదంటే ఎదురింట్లోనో, పక్కింట్లోనో అయినా ఉన్నారా? పిల్లలతో వారిని ఇంటర్వ్యూలు చేయించండి. ఏ ప్రశ్నలు అడగాలో ముందే రాయమనండి. వారి, బాల్యం, చదువు, ఉద్యోగాలు, వ్యాపకాలు, ఇష్టాయిష్టాలు, సంతృప్తులు - అసంతృప్తులు, అభిప్రాయాలు, అనుభవాలపై ప్రశ్నలు తయారుచేసుకోమనండి. వెలుతురు ఉన్న ప్రదేశంలో కూర్చొని, పిల్లల్ని సహజంగా ప్రశ్నలు అడగమనండి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు పక్కనే కూర్చోవద్దు. స్మార్ట్‌ఫోన్‌లో ఎడిట్‌ చేసేసదుపాయం ఉంటుంది. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే ఇంటర్వ్యూను ప్రశ్నలు - సమాధానాల రూపంలో రాయమనండి.


8 విజయగాథలు విందాం

ది అంతర్జాల ప్రపంచం. మనం కోరుకున్నదాన్ని అరచేతిలో వీక్షించే సదుపాయం ఉంది. గొప్పవాళ్లని వ్యక్తిగతంగా కలుసుకోలేకపోవచ్చు. కానీ యూట్యూబ్‌ ద్వారా వారి ఉత్తేజపూరిత ఉపన్యాసాల్ని వినవచ్చు. వ్యక్తిత్వవికాస పాఠాలు, విజయగాథలు, స్ఫూర్తినింపే మాటలు, డాక్యుమెంటరీలు ఎప్పుడు కావాలంటే ఆప్పుడు చూడొచ్చు. టెడ్‌.కామ్‌ (www.ted.com) లో అయితే స్ఫూ´ర్తినింపే ఉపన్యాసాలు వందలకొద్దీ ఉన్నాయి. మీ ఇంట్లో నెట్‌ సదుపాయం ఉంటే ఫేస్‌బుక్‌ మూసేసి ఈ విజ్ఞాన గవాక్షాన్ని ఓసారి తెరవండి. మీ పిల్లల కోసం... ఈ వేసవిలో... ఈరోజే.


9 సోదరసోదరీమణులారా!

వేదికలెక్కాలంటే పెద్దలకే హడల్‌. ప్రజలు అన్నింటికంటే ఎక్కువ భయపడేది మైకు పట్టుకోవాలంటేనే. ఇది అధ్యయనాల్లో తేలిన నిజం. స్టేజ్‌ ఫియర్‌ పోవాలంటే చిన్నప్పుడే శిక్షణ ఇవ్వాలి. సికింద్రాబాద్‌ వై.ఎం.సి.ఎ.లో యంగ్‌ అరేటర్స్‌ క్లబ్‌ ఉంది. ప్రతి శనివారం ఉపన్యాస పోటీ ఉంటుంది. ఏదైనా ఒక అంశం ఇచ్చి మూడు నిమిషాలు మాట్లాడాలని చెబుతారు. ఆ కాస్త సమయంలో తమకు తెలిసిన విషయాల్ని ఎంత బాగా చెప్పాలా అని పిల్లల మెదళ్లు పాదరసంలా ఆలోచిస్తాయి. ఇలాంటి పోటీలు మన ఇళ్లల్లోనూ పెట్టుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న పిల్లలందర్నీ పోగుచేస్తే వారికీ ఆసక్తి కలుగుతుంది. పిల్లలకు చిన్న చిన్న కథలు వినిపించి వాటినే తిరిగి చెప్పమనండి. ఏదైనా చదివించి అందులోని సారాంశాన్ని అందరికీ వివరించమనండి. జోక్స్‌ చెప్పి నవ్వించమనండి. ఇవన్నీ పిల్లల్లో బెరుకుతనాన్నీ, బిడియాన్నీ పోగొడతాయి. ఈ వేసవిలోనే మీ ఇంట్లో, మీ పిల్లలతో ఈ ప్రయోగం చేసి చూడండి. ఫలితాలు మీకే తెలుస్తాయి.


10 జలమే జీవం

మీ ఇంటికి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని పిల్లల్ని అడగండి. వూర్లోని ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ గురించి చెబుతారేమో కానీ, అక్కడికి నీళ్లొచ్చే జలాశయం పేరు చెప్పగలిగేవారు తక్కువ. ఆ వివరాలు మీరే చెప్పి వీలున్నరోజు వాళ్ళను అక్కడికి తీసుకుని వెళ్లండి. ఎంత శ్రమ పడితే ఇంటికి నీళ్లొస్తున్నాయో వివరించండి. పిల్లలకు నీటి విలువ బాగా తెలుస్తుంది. జనాభా పెరుగుతున్న కొద్దీ జలవనరులపై ఒత్తిడి పెరుగుతూ పోతోంది. ప్రాణావసరమైన నీటి ప్రాధాన్యం గురించి ప్రతి పౌరుడికీ తెలియాలి. పిల్లలుగా ఉన్నప్పుడే జల అక్షరాస్యత కలిగించాలి. జలం ప్రకృతి ప్రసాదం, లక్షలు ఖర్చు చేసినా మనిషి సృష్టించలేని అమూల్య వనరు. తక్కువ నీటితో జీవించడం, నీటి దుబారాని పూర్తిగా అరికట్టడం దేశసేవే.


11 వంటింటి పాఠాలు

పిల్లలు వంటగదిలోకి వస్తేనే చదువుకునే సమయం హరించుకుపోతుందని తల్లులు భావించే రోజులివి. అందుకే పెళ్లీడొచ్చిన పిల్లలకూ అన్నం వండుకోవడం తెలియడం లేదు. వంట జీవన నైపుణ్యం. చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇల్లు వదిలి వెళ్లినప్పుడు వంట రాని లోటు అనుభవమవుతుంది. అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఈ కష్టాలు రాకుండా ఉండాలంటే హైస్కూలు వయసులో ఉండగానే పిల్లలకు వంటగదిని పరిచయం చేయండి. కూరలు తరగడం, పాలు కాచడం, అన్నం వండటం, ఆమ్లెట్‌ వేయడం వంటి చిన్న చిన్న పనులతో ప్రారంభించి ఒక్కో కూరనూ రుచిగా, శుచిగా వండటం అలవర్చండి. ఆహారం విలువ, తల్లి శ్రమ పిల్లలకు అర్థమవడానికి ఇదొక మార్గం. గ్యాస్‌పొయ్యి, ఎలక్ట్రికల్‌ పరికరాల వాడకంలో మాత్రం జాగ్రత్తలు చెప్పాలి. ప్రారంభంలో పెద్దల సమక్షంలోనే వంట గది పనులు చేయడం అలవాటు చేయండి.


12 పొదుపుఖాతా అవసరం

ర్థిక అక్షరాస్యత నేర్పించడానికి బడి ఈడే సరైంది. ముందుగా మీ పిల్లల పేరుతో బ్యాంకులో పొదుపు ఖాతా తెరవండి. ఎంత స్వల్పమైనా సరే ప్రతినెలా కొంత మొత్తం జమచేయించండి. కొన్ని సార్లు విత్‌డ్రా చేయించండి. బ్యాంకుకు వెళ్తుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు విలువ తెలుస్తుంది. పొదుపు చేసే అలవాటు ఏర్పడుతుంది.


13 ఇంటింటా వనభారతి


నిషి ప్రకృతికి దూరమైన కొద్దీ, పర్యావరణానికి హాని పెరిగిపోతోంది. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాల నిర్మాణమే కాదు, అంతటా పరుచుకున్న పచ్చదనం కూడా. పిల్లలుగా ఉన్నప్పుడే మొక్కల అవసరం గురించిన స్పృహ కలుగజేయాలి. ఇందుకోసం భూములూ, పెద్దపెద్ద ఇళ్లే ఉండాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న కుండీల్లో, తొట్లల్లో, ప్లాస్టిక్‌ కవర్లలో కూడా మట్టిపోసి మొక్కలు పెంచవచ్చు. రాబోయే వర్షాకాలానికి వీటిని సిద్ధం చేసుకోవాలంటే వేసవి సరైన సమయం. తొట్లు, కుండీలు, మట్టి, విత్తనాలు, మొక్కలు సమకూర్చుకుంటే సొంతంగా పూలు పూయించవచ్చు, కూరగాయలు పండించవచ్చు. మరోవిషయం, మీరు పండ్లు తిన్నప్పుడు గింజలు పారేయకండి. మామిడి టెంకెల నుంచి సపోటా గింజల వరకూ విత్తనాల్ని జిగురుమట్టితో నీడ్‌బాల్స్‌లా చేయవచ్చు. వర్షాకాలం కాలువల పక్కన, ఖాళీ భూముల్లోనూ, కొండలు, గుట్టలపైనా వీటిని విసిరేస్తే కొన్నయినా మొలిచి చెట్లు కాకపోవు, కాయలు కాయకపోవు.


14 కలసి నడవండి

రోగ్యాన్ని కోల్పోయిన తర్వాత కానీ దాని విలువ తెలియదు. ఆరోగ్యమే మహాభాగ్యమని బడిగోడలపై రాసినా దాని అర్థం వయసు మీరాక అనారోగ్యం పాలైనప్పుడే బోధపడుతుంది. చిన్నప్పుడే జాగ్రత్తపడితే చక్కెర వ్యాధీµ, రక్తపోటూ వచ్చేవి కాదేమో అని చాలామంది పెద్దవాళ్లు అనుకోవడం వింటూనే ఉంటాం. ఆరోగ్యం పట్ల పిల్లలకు చైతన్యం కలిగించడం చాలా అవసరం. ఆహారం, వ్యాయామం, విశ్రాంతి శ్రుతి తప్పనప్పుడే ఆరోగ్యం గతి తప్పకుండా ఉంటుంది. మీరు నడక కోసం పార్కుకి వెళ్లేటప్పుడు పిల్లల్నీ తీసుకెళ్లండి. మీకు నడిచే అలవాటు లేకుంటే పిల్లలకోసమైనా అలవాటు చేసుకోండి. మీరు నడుస్తూ పిల్లల్ని నడిపించండి. వారితో కలసి మీరూ పరుగెత్తండి.


15 వందేమాతరం

కొన్నేళ్ల క్రితం- మంత్రులు, అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. చివర్లో జనగణమన ఆలాపన జరగాలి. పాడేవారు ఎవరూ లేరు. ప్రముఖుల్లో ఒక్కరికీ జాతీయగీతం పూర్తిగా రాదు. అంతా అభాసుపాలయ్యారు. ‘జనగణమన రాని అధినాయకా జయహే!’ అని మర్నాడు పత్రికల్లో వార్త వచ్చింది. జాతి గౌరవాన్ని ప్రతిబింబించే జనగణమన, వందేమాతరం, ప్రతిజ్ఞ, తెలంగాణ గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, చేయెత్తి జైకొట్టు తెలుగోడా, జయ జయ జయ ప్రియభారత తదితరాల్ని ప్రతి ఒక్క విద్యార్థి చేతా కంఠస్థం చేయించాలి. ఎవరి అభిరుచుల్ని బట్టి వారు మరికొన్ని పాటల్నో, గీతాల్నో, గేయాల్నో నేర్చుకోవచ్చు. వేమన పద్యాలూ, సుమతీ శతక పద్యాలు కూడా కొన్ని పూర్తిగా వచ్చి ఉండటం చాలా మంచిది. ఐయ్యేఎస్‌ ఇంటర్వ్యూల్లోనూ వీటిని అడిగినట్లు విజేతల ముఖాముఖీల్లో చదువుతూనే ఉంటాం. తల్లిదండ్రులు కాస్త ప్రోత్సాహం అందిస్తే పిల్లలు ఇవన్నీ తేలిగ్గా నేర్చేసుకుంటారు.


16 దేశం మనదీ...

డిలో ప్రతిజ్ఞ చేయడం పిల్లలందరికీ అలవాటు.. ‘భారతదేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు’ అని. మరి మన మాతృభూమి గురించి పిల్లల్లో ఎంతమందికి తెలుసు. మన మహనీయులు, రాజ్యాంగం, చట్టసభలు, రాష్ట్రాలు, భాషలు, నదులు, భూములు, పంటల గురించి పౌరులందరికీ తెలిసుండాలి. ఒక్కోరోజు ఒక్కో అంశాన్ని తీసుకుని దేశం గురించి తెలుసుకోమని పిల్లల్ని ప్రోత్సహించాలి. ఈ విజ్ఞానం పెరిగి పెద్దయ్యాక వృత్తి ఉద్యోగాల్లో సైతం ఎంతో ఉపయోగపడుతుంది.


17 పల్లెకు పోదాం...

గరాల్లో ఉండే పిల్లలకు మార్కులూ, ర్యాంకులూ బాగా రావచ్చు కానీ నిజ జీవితంలో చాలా విషయాలు తెలియవు. వాడే నీళ్లు, తాగే పాలు, తినే బియ్యం, వండే కూరగాయలు ఎలా వస్తాయో తెలియవు. పిల్లలకు ఇవన్నీ చూపించాలి. పల్లెల్లో కలివిడితనం, పలకరింపులూ ఎక్కువ. ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. వారి ఆటపాటలూ అలాగే ఉంటాయి. అక్కడ వారం రోజులున్నా పిల్లలకు చాలా విషయాలు తెలుస్తాయి. గ్రామాలకు వెళ్లినప్పుడు పిల్లలను టీవీలకు అతుక్కుపోనీయకుండా వూర్లోని చుట్టాల ఇళ్లకు తీసుకెళ్లి పరిచయం చేయండి. చెరువూ, పశువుల కొట్టం చూపించండి. పాల కేంద్రానికీ, పొలం దగ్గరకూ తీసుకెళ్లండి. వూర్లో ధాన్యంమిల్లు, నూనె గానుగ, పిండిగిర్నీలుంటే చూపించండి. 80, 90 ఏళ్లున్న పెద్దవాళ్ల దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించండి. వూర్లో నచ్చిన ప్రదేశాలవీ, ఇంట్లోని పెద్దలవీ ఫొటోలు తీయించండి. ఇంటికి తిరిగి వచ్చాక ఫొటోల ప్రింట్లు వేయిస్తే పిల్లల సంతోషానికీ వాటిని పంపిస్తే పెద్దవాళ్ల ఆనందానికీ అవధులుండవు.


18 ప్రియమైన తాతయ్యకు...

‘తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది’ అని పొడుపు కథ చెబితే ‘ఉత్తరం’ అని చటుక్కున సమాధానం చెప్పేవాళ్లు పిల్లలు ఇదివరకు. ఉత్తరం ఒక సాహిత్య ప్రక్రియ. మహామహులు రాసిన ఉత్తరాలు పుస్తకాలుగా అచ్చయ్యాయి. ఇందిరకు నెహ్రూ రాసిన ఉత్తరాలు చరిత్ర గ్రంథం. గాంధీజీ తన అభిప్రాయాల్ని ఉత్తరాల్లోనే తెలిపేవారు. మరిప్పుడు ఉత్తరాలంటే ఇన్సూరెన్స్‌ కంపెనీ నోటీసులూ, సూపర్‌మార్కెట్ల సేల్స్‌ ఆహ్వానాలూ. ఉత్తరాన్ని ఈ-మెయిల్‌, వాట్సప్‌లు మింగేశాయి. ఆత్మీయతని పంచడానికీ, పెద్దవాళ్లని పలకరించడానికీ ఉత్తరానికి మించినది మరొకటి లేదు. పిల్లలతో కనీసం వాళ్ల అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలకైనా ఉత్తరాలు రాయించండి. రాసే పదిపదిహేను నిమిషాలైనా పెద్దవాళ్ల గురించి పిల్లలు తలచుకుంటారు. మాతృభాషలో రాసే శక్తి పెరుగుతుంది. ఫోన్లో మెసేజ్‌ని ఒకసారి చూసి డిలిట్‌ చేేసినట్లు కాకుండా, ఉత్తరాన్ని మళ్లీమళ్లీ చదువుకుంటారు. ఈ వేసవి సెలవుల్లో కనీసం వారానికి ఒక ఉత్తరమైనా పెద్దవాళ్లకు రాయించండి. మనవళ్లూ, మనవరాళ్ల రాతల్ని చూసి మురిసిపోతారు అమ్మమ్మలూ, నాన్నమ్మలూ.


19 ఆ రెండూ...

ది ఎస్‌.ఎం.ఎస్‌., వాట్సప్‌ మెసేజ్‌ల కాలం. ఈ రోజు ఏం జరిగిందీ స్థిమితంగా ఆలోచించుకునే ఓపికా లేదు, తీరికా లేదు. పిల్లలకు ప్రధానంగా రెండు విషయాలు నేర్పిస్తే జీవితం పద్ధతిగా సాగుతుంది. ఒకటి, ఉదయం లేవగానే ఆ రోజు చేయాల్సిన పనుల గురించి 15 నిమిషాల పాటు ప్రశాంతంగా ఆలోచించడం. రెండోది, పడుకునే ముందు 15 నిమిషాలు ఆ రోజు ఏం జరిగిందీ సావధానంగా సమీక్షించుకోవడం. తన సంతృప్తికరమైన జీవితానికి ఇవి రెండూ చాలా ఉపయోగపడ్డాయని ప్రసిద్ధఆంగ్ల రచయిత కుష్వంత్‌ సింగ్‌ చెప్పేవారు. రోజువారీ అనుభవాల్ని డైరీలోనో, ఒక ప్రత్యేక పుస్తకంలోనో పొందుపరిస్తే అది విలువైన జీవిత పాఠాల దొంతరే అవుతుంది.


20 అలవాట్లే వ్యక్తిత్వం

నిషి అలవాటుకి బానిస. పాత అలవాట్లు ఒక పట్టాన మారవు. ఆలోచనలు పనులుగా, పనులు అలవాట్లుగా, అలవాట్లు వ్యక్తిత్వంగా రూపాంతరం చెందుతాయనేది శాస్త్రం. మంచి అలవాట్లు ఏర్పడాలంటే మంచి ఆలోచనల బీజాలు నాటాలి. ఒక అలవాటుని జీవితంలో భాగం చేసుకోవాలంటే ఎంత కష్టమైనా 21 రోజులపాటు అమలుచేసి తీరాలంటారు. అప్పుడది వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. పిల్లలకూ, పిల్లల గురించి మీకూ అనేక ఆకాంక్షలు ఉండి ఉంటాయి. ఈ వేసవిలో పిల్లలపై బడి ఒత్తిళ్లు ఉండవు కాబట్టి ఈ 21 రోజుల ప్రయోగం చేయండి వారి ప్రగతికి అడ్డుగా నిలుస్తున్న కొన్ని పాత అలవాట్లు పొగొట్టుకోవచ్చు. కొన్ని కొత్త అలవాట్లను అలవర్చుకోవచ్చు.


21 రేపటి స్వప్నం

రిధులూ, పరిమితులూ లేకుండా ఆలోచించడం పిల్లలకు అలవాటు. వయసు పెరిగే కొద్దీ ఆలోచనలకు సంకెళ్లు పడతాయి. స్కూలు చదువు పూర్తయ్యేలోపే తల్లిదండ్రులూ, కుటుంబ సభ్యులూ, ఉపాధ్యాయులూ కొన్ని వేలసార్లు వారి ఆలోచనలపై, ఆశలపై నీళ్లు చల్లుతారు. ‘నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నీమొహం నీకంత శక్తి లేదు, మొదటి నుంచీ నువ్వింతే’ వంటి మాటలతో పిల్లల్ని కుంగదీస్తారు. పిల్లలకు తమపై తమకు నమ్మకం కలిగిస్తే వారు సాధించే విజయాలకు ఆకాశమే హద్దు. వారు భవిష్యత్తులో ఏం కావాలనుకొంటున్నారో వారితోనే రాయించండి. తర్వాత చర్చించండి. ఇలాచేస్తే వారి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ముందుచూపు ఏర్పడుతుంది. సంకల్పం కలుగుతుంది. పిల్లలు తమ అంతరంగాన్నీ, ఆకాంక్షల్నీ గుర్తించేలా ఈ ‘భవిష్యత్‌ దర్శనం’ చేయించాలి.

***

  లోచనలు మనసులోనే ఉండిపోతే, చివరికి అవి కేవలం ఆకాంక్షలుగానే మిగిలిపోతాయి. అమలులో పెడితేనే వాటి విలువేంటో తెలుస్తుంది. అందుకే... ఇప్పుడే పిల్లల్ని పిలవండి. మీకూ వాళ్ళకీ కూడా నచ్చిన ఓ ఆలోచనతో తొలి అడుగు వేయండి. మంచి పనికి ఈరోజు, ఈ నిమిషం, ఈ క్షణానికి మించిన మంచి సమయం మరోటి లేదు..!

- మానుకొండ నాగేశ్వరరావు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.