close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీతారాములు నడిచిన క్షేత్రం... శ్రీశైలం..!

సీతారాములు నడిచిన క్షేత్రం... శ్రీశైలం..!

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో, దశ భాస్కర క్షేత్రాల్లో ఒకటైన ఆ శ్రీశైల దర్శనాన్ని సకల పాపహరణంగా భావిస్తారు భక్తులు. అందుకే కార్తికమాసంలోనే కాదు, ఏడాది పొడవునా భక్తులతో కళకళలాడుతుంటుందా పవిత్రధామం..!

మైనాకం మంధరం మేరుం
శ్రీశైలం గంధమాందనమ్‌
పంచశైలా పఠేన్నిత్యం
మహాపాతకనాశనమ్‌

ఐదు మహిమాన్వితమైన పర్వతాల్లో శ్రీశైలం ఒకటి అని దీని అర్థం.

శైలద మహర్షి కొడుకైన పర్వతుడు తపస్సుతో శివుణ్ణి మెప్పించి తనమీదే కొలువై ఉండాలనీ, సకల తీర్థాలూ శాశ్వతంగా అక్కడే నిలిచి ఉండేలా వరం పొందాడనీ అందుకే ఇది శ్రీశైలంగా ప్రాచుర్యం పొందిందనేది పురాణ కథనం. శ్రీశైల ప్రస్తావన రామాయణ, మహాభారత, భాగవతాల్లోనూ ఉంది. సీతారాములిద్దరూ వేర్వేరుగా సహస్రలింగాలను ప్రతిష్ఠించిన క్షేత్రమిది. నరరూపంలో వచ్చిన రాముడు లింగప్రతిష్ఠ ఎంత గొప్పదో తెలియజెప్పడానికే అలా చేశాడట.

తెలుగురాష్ట్రాల్లోని ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలమే. మనదేశంలో మూడు క్షేత్రాల్లో మాత్రమే జ్యోతిర్లింగమూ శక్తిపీఠమూ కలిసి ఉన్నాయి. అందులో మొదటిది కాశీ, రెండోది ఉజ్జయినీ, మూడోది శ్రీశైలం.

శ్రీశైలమహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచంలో ఏ ప్రాంతంలో పూజ చేసినా ఏ వ్రతం ఆచరించినా ‘శ్రీశైల ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్యే ఉత్తర దిగ్భాగే’ అంటూ శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నదీ సంకల్పంలో చెప్పుకుంటారు. కేదారక్షేత్రంలోని నీటిని తాగినా కాశీలో మరణించినా శ్రీశైల శిఖరాన్ని దర్శించినా పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం. పూర్వం రోడ్డు సౌకర్యం లేకున్నా కాలినడకనే శ్రీశైలానికి చేరుకుని, శిఖరేశ్వరం అనే కొండ ఎక్కి, దూరంగా కనిపించే శ్రీశైల శిఖరాన్ని చూసేవారట. అది కనిపిస్తే పునర్జన్మ నుంచి విముక్తులయినట్లే అని భావిస్తారు. శ్రీరామచంద్రుడు కూడా అక్కడనుంచే శిఖరాన్ని చూసినట్లు చెబుతారు. వేల సంవత్సరాలనాటి ఆ శ్రీశైల మల్లికార్జునుడు శాతవాహనుల కాలంనుంచీ పూజలు అందుకుంటున్నాడనీ, అయితే కాకతీయులు, విజయనగర చక్రవర్తులు ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో కృషిచేశారని శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఎక్కడ ఉంది?
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని నల్లమల అడవుల్లోని పర్వతశ్రేణుల మధ్యలో పాతాళగంగ పేరుతో ఉత్తరముఖంగా ప్రవహించే కృష్ణానదికి కుడివైపున ఉందీ క్షేత్రం.

ఎనిమిది శృంగాలూ నలభై నాలుగు నదులూ అరవైకోట్ల తీర్థాలతోనూ పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతోనూ చంద్రగుండం, సూర్యగుండం... మొదలైన పుష్కరిణులతోనూ అనంతమైన ఓషధీ మొక్కలతోనూ ఈ క్షేత్రం అలరారుతుంటుంది. ఈ మహాక్షేత్రానికి తూర్పున త్రిపురాంతకం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణంలో సిద్దవటం అనే నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.

మల్లికార్జునస్వామి!
చుట్టూ ఎత్తైన ప్రాకార గోడలతో విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది మల్లికార్జునుడు కొలువైన ప్రధానాలయం. ఇక్కడి జ్యోతిర్లింగం చాలా చిన్నది. స్వామికి కుడివైపున ఉన్న రత్నగర్భ గణపతిని సేవించుకున్నాకే ఆ మల్లికార్జున లింగాన్ని దర్శించుకోవాలి అని చెబుతారు. దేశంలో మరెక్కడా ఇలాంటి గణపతి కనిపించడు. ఉత్సవ సమయాల్లో తప్ప కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ లింగాన్ని చేతులతో స్పృశించి, తలను కూడా తాకించి నమస్కారం చేసుకోవచ్చు. స్వామిని దర్శించుకున్నాక లింగానికి ఎడమవైపున ఉన్న భద్రకాళీసమేత వీరభద్రస్వామికి నమస్కరించుకుని బయటకు వస్తారు. ఇక్కడ భ్రమరాంబికాదేవి ఆలయంలో అమ్మవారు అష్టభుజాలతో ఆయుధాలు ధరించి, మహిషంపై కాలుంచి నిల్చుని ఉంటుంది. కానీ పూజారులు చేసే అలంకారంవల్ల కూర్చున్నట్లుగానూ రెండు చేతులే ఉన్నట్లూ కనిపిస్తుంది. అమ్మవారి గర్భాలయం వెనక భాగంలోని గోడకు చెవి ఆన్చి వింటే ఝుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుందట.

ఒకప్పుడు ఆ కొండ ప్రాంతాన్ని పాలించిన అరుణాసుర అనే రాక్షసుణ్ణి భ్రమరరూపంలో వధించి, భ్రమరాంబికగా వెలిసిందనీ అందుకే ఆ ఝుంకారం అని అంటారు. దక్షయజ్ఞంలో మరణించిన సతీదేవి మెడభాగం పడిన ప్రదేశం కావడంతో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగానూ ఇది పేరొందింది. ఈ ఆలయం శిల్పకళ ఉట్టిపడుతూ ఎంతో అందంగా ఉంటుంది. ఈ ఆలయం దగ్గరే సీతాదేవి ప్రతిష్ఠించిన సహస్రలింగం కనిపిస్తుంది.

ఎన్నెన్నో ఆలయాలు!
శ్రీశైలంలో ఉన్నన్ని ఆలయాలూ ఉపాలయాలూ మరే క్షేత్రంలోనూ కనిపించవు. సాక్షి గణపతి, హటకేశ్వరస్వామి, శ్రీశైల శిఖరం, పాలధార, పంచధార...ఇలా అక్కడ అణువణువూ పుణ్యధామమే. మల్లికార్జునస్వామి గర్భాలయానికి ఆనుకుని బ్రహ్మగుండం, సప్త మాతృకలకి ఆనుకుని విష్ణుగుండం ఉంటాయి. ప్రధాన దేవాలయం వెనకభాగంలో పాండవుల పేర్ల మీద శివలింగాలు ప్రతిష్ఠించిన ఐదు దేవాలయాలు ఉంటాయి. మరో పక్క ముడతలు పడిన ముఖంలా ఉన్న వృద్ధ మల్లికార్జున లింగం ఉంటుంది.

మల్లికార్జునుడి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. శ్రీశైలాన్ని దర్శించినట్లు సాక్ష్యం చెప్పేది ఈ గణపతే అన్నది ఓ నమ్మకం. ఆ కారణంతోనే ఆయన్ని సాక్షి గణపతి అని పిలుస్తారు. ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హటకేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి అటిక(ఉట్టి)లో వెలిశాడట. అందుకే ఆ పేరు. దీనికి సమీపంలోని లోయలోనే ఆది శంకరాచార్యులవారు శివానందలహరి రచించారట. అక్కడి కొండపగుళ్ల నుంచి పాలధార, పంచధారలు వస్తుంటాయి. పాలధార శివుడి ఫాల భాగం నుంచి వచ్చిందనీ, పంచధార పరమేశ్వరుడి అయిదు ముఖాలనుంచీ ఉద్భవించిన ధార అనీ చెబుతారు. పాలధార తెల్లగానూ పంచధార తియ్యగానూ ఉంటాయి. ఈ నీరు, కొంతదూరం ప్రవహించి, భోగవతి పేరుతో పాతాళగంగలో కలుస్తుందట. విజయవాడకి 270 కి.మీ., హైదరాబాద్‌కి సుమారు 232 కి.మీ. దూరంలో ఉందీ మహిమాన్విత క్షేత్రం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.