close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పూజ వెనుక పరమార్థం!

పూజ వెనుక పరమార్థం!

భారతీయ హైందవ సంప్రదాయం, అందులోని పూజావిధానాల వెనుక మనిషి మానసిక, శారీరక ఔన్నత్యానికి దోహదపడే విశేష క్రియలున్నాయి. దీపారాధన మొదలు హారతిదాకా... గంట కొట్టడం మొదలు మంత్రపుష్పందాకా ప్రతి క్రతువులోనూ మంత్రాలకు మించిన మహిమేదో ఉందంటే, మన ధర్మానికి ఎంత పవిత్రత ఉందో అర్థమవుతుంది. ఆ ధర్మ సూక్ష్మాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా.అనంతలక్ష్మి వివరిస్తున్నారిలా...

తమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం శత సంవత్సరం దీర్ఘమాయుః...

అంటూ వందేళ్లు ఐశ్వర్యంతో ఆరోగ్యంగా జీవించమని దీవిస్తుంది వేదం. నిజానికి ఇక్కడ శతం అనే పదానికి పూర్ణం అనే అర్థం వస్తుంది. అంటే నిండైన జీవితంతో పాటు నిండైన ఆరోగ్యం, నిండైన ఐశ్వర్యం కూడా ఉండాలని భావం. మన జీవన విధానం అంత బాగుండాలని

ఆశీర్వదించే ఆ మహాగ్రంథాలు ఏ మార్గంలో ప్రయాణిస్తే, ఎలాంటి క్రతువులు ఆచరిస్తే మనం నిండునూరేళ్లూ వర్థిల్లుతామన్న సంగతిని చెప్పకుండా ఉంటాయా..! ఆ దిశలో మనిషికి దిశానిర్దేశం చేయకుండా ఉంటాయా..! వెలుగునిచ్చే జ్యోతిని నిత్యం పూజించమనే ఆ జ్ఞానదీపికలు మన బతుక్కి వెలుగుబాటలు పరవకుండా ఉంటాయా..!

మనిషి జననం మొదలు నిండు నూరేళ్ల పాటూ జరగాల్సిన క్రతువులూ మరణానంతరం నిర్వహించే సంస్కారాల వరకూ అన్ని విషయాలనూ వేదాలు పూసగుచ్చినట్టు చెప్పాయి. నల్లేరుమీద నడకలా జీవితాన్ని నడుపుకోవడమే కాదు అప్పుడప్పుడూ వచ్చే పెనుతుపానులను సమర్థంగా ఎదుర్కొనేందుకూ స్థైర్యాన్ని ఇచ్చేలా, ప్రతిదశలోనూ పాటించాల్సిన పూజా విధానాల్ని పొందికగా మలిచి మనకందించాయి. పంచభూతాలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కొన్నీ, మానసిక ప్రశాంతతను ప్రసాదించేవి కొన్నీ, ఆరోగ్యాన్ని అమర్చిపెట్టేవి కొన్నీ... అన్నీ మనకోసమే, మన బాగుకోసమే. తెలిసో తెలీకో భక్తితోనో భయంతోనో మనం యాంత్రికంగా చేసే వివిధ క్రియల వెనుక పరమార్థాన్ని తెలుసుకుంటే మన పూజకూ ఓ నిండుదనం వస్తుంది.

దీపారాధన ఎందుకు చేయాలి?
మనకు ప్రత్యక్షదైవాలు ముగ్గురు. ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు, ఇంకొకరు అగ్నిదేవుడు. సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. చంద్రుడికి నూలుపోగు వేసి కృతజ్ఞత చెప్పుకుంటాం. మరి అగ్నిదేవుడూ... ఆయన్ను అర్చించేందుకే పూర్వం పెద్దలు ఇంట్లో నిత్యాగ్నిహోత్రం నిర్వహించేవారు. రోజూ అగ్ని దేవుడిని ఆవాహన చేసి నమస్కారం చేసేవారు. నిజానికి మనం భగవంతునికి ఇవ్వదలచుకున్నది ఏదైనా ఆయన్ను చేరాలంటే అగ్ని ద్వారా మాత్రమే ఇవ్వగలం. మనం అగ్నిలో ద్రవ్యాన్ని వేస్తూ ‘ఇంద్రాయ స్వాహా...’ అన్నామనుకోండి అగ్ని దాన్ని నేరుగా ఇంద్రుడికి చేరుస్తాడు. అదీ అణువంత కూడా ఆయన ఉంచుకోకుండా. ఇలా ఏ దేవుడి పేరు చెప్పి మనం ద్రవ్యాన్ని సమర్పిస్తే ఆయనకు చేరవేస్తాడు అగ్ని. అంటే భగవంతుడికీ మనకీ అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు. కానీ ఇలా నిత్యం అగ్నిహోత్రం వెలిగించడం అందరికీ, అన్నిరోజులూ సాధ్యం కాదు కనుక కనీసం దీపారాధన చేయడం ద్వారా మనం అగ్నికి నమస్కారం చేసుకుంటాం. ధూపం ఆఘ్రాపయామి అంటాం, నైవేద్యం పరికల్పయామి అంటాం కానీ దీప ఆరాధన అంటాం. అంటే నేరుగా దీపాన్నే పూజించటం. అందుకే దీపానికి కుంకుమపెట్టి, ఓ పువ్వూ, నాలుగక్షతలూ వేసి, ఇలా చెబుతాం...

సాజ్యం త్రివర్తి సంయుక్తం
వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం
త్రైలోక్యం తిమిరాపహం

ఈమూడు వత్తులతో నేను వెలిగించిన దీపం మూడు లోకాలలోని చీకట్లను పారదోలాలి అని దీనర్థం. మన ఇల్లు ఒక్కటే కాదు, మూడు లోకాలూ వెలుగులు విరజిమ్మాలన్న గొప్ప భావన ఇందులో దాగుంది. అచ్చంగా దీపానికే పూజచేసే సంప్రదాయమూ కొన్ని చోట్ల ఉంది. మనకిష్టమైన దైవాన్ని దీపపు వెలుగులో చూస్తూ పూజ చేయడం మరో పద్ధతి.

ఘంటానాదం విశేషం ఏమిటి?
మన ఇంట్లోకానీ, గుళ్లొకానీ పూజ మొదలు పెట్టే ముందు ఘంటానాదం చేస్తాం. మంత్రపరంగా అయితే

ఆగమార్థంతు దేవానాం
గమనార్థంతు రాక్షసాం
కురుఘంటారావం తత్ర
దేవతాహ్వానలాంఛనం...

అంటాం. దేవతలు వచ్చేందుకూ, రాక్షసగణాలు పారిపోయేందుకూ గుర్తుగా లాంఛనంగా మనం ఘంటానాదాన్ని చేస్తాం. అయితే ఘంటానాదానికి సంబంధించి శాస్త్రపరమైన విషయం ఒకటి ఉంది. మనం గంట రింగున మోగుతుంది అంటాం. నిజానికి గంటకు సంబంధించిన శబ్ద తరంగాలు వృత్తాకారంలో ఉంటాయి. వృత్తాకారంలో వచ్చే శబ్దం ఎప్పుడూ రింగులు రింగులు తిరుగుతూ పెద్దవృత్తాలను ఏర్పరుస్తుంది. అంటే అది ఆ ప్రాంతంలో శక్తి వలయాల్ని సృష్టిస్తుందన్నమాట! అంతేకాదు గంట శబ్దానికి కుడిఎడమ మెదళ్లను సమన్వయం చేసే శక్తి ఉందట. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం అంటూ గంటలు మోగించడం క్రైస్తవ సంప్రదాయంలోనూ చూస్తాం. ఇలాంటి ఓ ప్రత్యేక శక్తిని సృష్టిస్తుంది కనుకనే చాలా మతాలు ఘంటానాదానికి గొప్ప స్థానాన్నిచ్చాయి.

ప్రదక్షిణలోని ఆంతర్యం?
ఆలయంలోకి ప్రవేశించగానే మనం చేసేపని ప్రదక్షిణ. ప్రదక్షిణలోనూ రెండు రకాలు. ఒకటి ఆత్మప్రదక్షిణ, రెండోది దైవ ప్రదక్షిణ. దేనికదే ఓ ప్రత్యేకత కలిగింది. నిజానికి మనం ఆలయంలోకి ప్రవేశించగానే దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. మంత్రపరంగానైతే ప్రదక్షిణల్లో మనం సత్వ, రజో, తమో గుణాల్ని విడనాడి త్రిగుణాతీతంగా అవుతామనీ, అలాంటి స్థితిలో దైవ ప్రార్థన చేయాలనీ చెబుతాం. ప్రదక్షిణ వల్ల శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఏ రకంగా అంటే... ముందుగా మనం ఆత్మ ప్రదక్షిణను తీసుకుందాం. బొంగరం సాధారణంగా పడిపోయి ఉంటుంది. అది ఎప్పుడైతే తనచుట్టూ తాను తిరగడం మొదలు పెడుతుందో అప్పుడు నిటారుగా నిలబడగలుగుతుంది. ఇక్కడ ప్రదక్షిణ బొంగరానికి నిలబడే శక్తిని ఇస్తుందన్నమాట. అలాగే భూమిని చూద్దాం... అది నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. విశ్వంలో వేలాడుతున్నట్టు కనిపించినా దానంతట అది నిలబడేందుకు కావలసిన శక్తిని భ్రమణం ఇస్తుంది. అలాగే, భూమి నిరంతరం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి నుంచి శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. ఇదేవిధంగా మనం శక్తికేంద్రకమైన దైవం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆయన్నుంచి శక్తిని పొందుతాం. ఇందులోనూ మరో విషయం ఉంది, ప్రదక్షిణ అంటే కుడిదిశలో తిరగడం అని అర్థం. అంటే మనం సవ్యదిశలో తిరుగుతామన్నమాట. విశ్వంలో ఏ పదార్థమైనా సవ్య దిశలో తిరిగినప్పుడు దాన్నుంచి పాజిటివ్‌ ఎనర్జీ ఉద్భవిస్తుంది.