close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తిరుగుబాటు

తిరుగుబాటు
- వలివేటి నాగచంద్రావతి

కాలుగాలిన పిల్లిలా హాల్లో అటూఇటూ తిరుగుతోంది లలితాంబ. పావుగంటలో పదిహేనుసార్లన్నా గోడ గడియారం వంక చూసుంటుంది. ధ్యాసంతా అటేపెట్టి ‘గేటు చప్పుడెప్పుడవుతుందా’ అని చెవులు రిక్కించి మరీ వింటోంది.

స్నేహితురాలి బర్త్‌డే పార్టీకని సాయంత్రమనగా బయటకువెళ్ళిన కూతురు రాత్రి పన్నెండు గంటలైనా ఇంటికి రాకపోతే ఏ తల్లి అయినా ఎంత గాభరాపడుతుందో అంత కంగారూ పడుతోందావిడ.

భర్త నిద్రపోతున్న గదిదాకా వెళ్ళి ‘లేపనా వద్దా’ అని తటపటాయించి మళ్ళీ వెనక్కొచ్చింది లలితాంబ. ఆయనగానీ లేస్తే తనని సమాధానపరచటమో, పరిష్కారం వెతకటమో చేయడు సరికదా పార్టీకి పంపించినందుకు తనకో నాలుగూ, ఆలస్యం చేసినందుకు కూతురికో నాలుగూ చివాట్లు వడ్డిస్తాడు. తనకంటే ఎక్కువ హడావుడిపడిపోతాడు.

పోనీ కొడుకుని లేపుదామా అంటే ‘ఏంటమ్మా, నీ గోల. పసిపిల్లా ఏమిటి... తప్పిపోవటానికి, వస్తుందిలే వెళ్ళి పడుకో’ అని విసుక్కుంటాడు.

‘ఆమని చిన్నపిల్ల కాదు, అదే తన భయం. మొన్న సంక్రాంతికి ఇరవై నిండినాయ్‌ దానికి. కంచె వేసి కాచుకోవలసిన సమయం. ఇలా అర్ధరాత్రయినా ఇంటికి చేరుకోకపోతే కంగారుపడకుండా ఎలా ఉండగలదు తను?’

పది గంటలయినప్పట్నుంచీ ఫోన్‌ చేస్తూనే ఉంది- వచ్చెయ్యమని. ‘ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా’ అంది. గంటక్రితం ఫోన్‌ చేసినప్పుడు అసలు పలకనే లేదు. ‘బయల్దేరి చాలాసేపయింది ఆంటీ’ అంది పార్టీ ఇచ్చిన స్నేహితురాలికి ఫోన్‌ చేస్తే. ‘ఇంకో అమ్మాయి కూడా ఉందిలెండి, పదినిమిషాల్లో వచ్చేస్తారు’ తన గొంతులో గాభరా కనిపెట్టిగావును ధైర్యం చెప్పింది.

కానీ ఏదీ- పది నిమిషాలు కాదు, ఆ మాట చెప్పి ముప్పావుగంటయి పోయింది. ఇప్పటికీ అజ లేదు. ‘ఏం చేయటంరా భగవంతుడా!’ దణ్ణాలమీద దణ్ణాలు పెట్టేసుకుంటోంది లలితాంబ.

దేవుడు కనికరించాడు. గేటు శబ్దమయింది. ప్రాణం లేచొచ్చిందావిడకు. వీధి తలుపు తట్టకమునుపే దడాలున తీసి ‘‘నీకేమన్నా బుద్ధుందా...’’ లోగొంతుకలోనే ఉగ్రమంతా చొప్పించి మండిపడబోయి షాక్‌ తిన్నట్టాగిపోయింది.

ఎదురుగా ఉంది తన కూతురేనా- వెళ్ళేటప్పుడు పూచిన తంగేడులా వెళ్ళిందే... ఇప్పుడేమిటీ, తుఫాను తాకిడి తగిలినదానిలా జుట్టు రేగిపోయి, బట్టలు చెదిరిపోయి, మొహాన రక్కులతో, భయంతో బిక్కచచ్చిపోయి... జరిగిందేమిటో గ్రహించలేనంత లోకజ్ఞానం లేనిది కాదు లలితాంబ. పైప్రాణాలు పైనే పోయినట్టయింది ఆవిడకు. కెవ్వుమని కేక వేయబోయి క్షణంలో తెలివి తెచ్చుకుంది. ఏడుస్తూ ఏదో చెప్పబోతున్న ఆమని నోరు ‘ష్ష్‌’ అన్న సంజ్ఞతో ఆపటమే కాకుండా చేత్తో నోరు మూసి లోపలికి లాగి తలుపులు మూసేసింది.

లోపలికొచ్చాక కూడా ఆమని చేయి వదల్లేదు. మాట్లాడవద్దన్నట్టు పెదవుల మీద వేలుంచుకుని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి తలుపు మూసి, బరబరా బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్ళింది. షవర్‌ కింద నిలబెట్టి నాబ్‌ తిప్పింది.

రక్కుల నుంచి కారుతోన్న రక్తం, ఆమని కళ్ళవెంట కురుస్తున్న కన్నీళ్ళూ షవర్‌ నీళ్ళతోపాటు కిందికి ప్రవహించాయి.

స్నానంచేసి ఇవతలకి వచ్చిన ఆమని తల తుడిచి ధూపం వేసింది లలితాంబ. వెక్కిళ్ళతో కూతురు చెప్పిన మాటలను కన్నీళ్ళతో వింది. గుండెల్లోని బాధ అంతా తీరేదాకా ఏడవనిచ్చింది. ఎర్రబారిన కళ్ళతో దీనంగా చూస్తోన్న ఆమని తల గుండెకు అదుముకుని, ‘‘నీకేం అవలేదు, జరిగినదంతా పీడకల. స్నేహితురాలి ఇంటినుంచి నేరుగా ఇంటికి వచ్చేశావంతే. మిగతాదంతా మరిచిపో’’ అంది దృఢంగా.

కొద్దిగా తల పైకెత్తి ‘‘కంప్లైంట్‌ ఇవ్వొద్దా అమ్మా’’ బేలగా అడిగింది ఆమని.

ఉలిక్కిపడింది లలితాంబ. ‘‘ఏమిటీ, కంప్లయింటా... మతిగానీ పోయిందా? ఏమాత్రం బయటికి పొక్కినా తలెత్తుకోలేమనీ నీ బతుకు నాశనమైపోతుందనీ నేను హడలి చస్తుంటే దండోరావేసి మరీ చెప్పమంటున్నావా నువ్వు. నోర్ముయ్యి, నేను చెప్పినట్టు విను’’ అదే దృఢత్వంతో అంది లలితాంబ.

మళ్ళీ తల దించుకుంది ఆమని అయిష్టంగా.

* * *

అతి సామాన్యమైన ఇల్లాలు లలితాంబ. ఆదర్శాలూ, విప్లవాల జోలికి వెళ్ళదు. తప్పుచేసిన వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష వేయించాలనిగానీ, బుద్దొచ్చేలా బుద్ధి చెప్పాలనిగానీ, తన మూలంగా సమాజానికేదో ఒరగబెట్టాలనిగానీ ఆత్రపడదు. తన కాళ్ళ కిందికి నీళ్ళురాకుండా ఉంటే చాలు అనుకుంటుంది.

ఇప్పుడు పడిన పిడుగు ఛాయలు తన కూతుర్ని బాధించకుండా ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రస్తుతం ఆవిడ ఆరాటం అదే.

ఆమని స్నేహితురాలికి ఫోన్‌ చేసి కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేసిందనీ, తనే అనవసరంగా కంగారుపడ్డాననీ, ఏమీ అనుకోవద్దనీ తడబడకుండా చెప్పేసింది. పది రోజులపాటు ఆమనిని ఇల్లు కదలనివ్వలేదు. కాలేజీకి కూడా వెళ్ళనివ్వలేదు. అడిగినవాళ్ళకి ‘పార్టీలో ఏం చెత్త తిందో జ్వరం, మోషన్స్‌... మంచం వదలట్లా’ అని సాకులు చెప్పింది. చివరికి భర్తకీ కొడుక్కీ కూడా తెలీకుండా రహస్యం కాపాడుకొచ్చింది.

నిన్నటి వరకూ చక్కదనాల కూతుర్ని చూసుకుంటూ తెగ గర్వపడేది లలితాంబ. తన బిడ్డ అప్సరస, చదువులో సరస్వతి, ప్రతి సెమిస్టరులోనూ ఫస్టు మార్కులే. క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో మంచి జాబ్‌ కూడా వచ్చేసింది. తామింకా పెళ్ళిమాట తలపెట్టకపోయినా వరుల తరఫు నుంచి రాయబారాలు అందుతున్నాయి అప్పటికే.

‘పెళ్ళికేం తొందర... మేమంటే మేమంటూ ఐఏఎస్‌లూ బిజినెస్‌ టైకూన్లూ క్యూలు కడతారు నా ఇంటిముందు. వాళ్ళలో ఎంచుకుంటుంది నా బంగారుతల్లి’ అన్నంత దిలాసాలో ఉండేది నిన్నటిదాకా.

ఇప్పుడు ఆమని పెళ్ళి చేసెయ్యాలని తెగ తొందరపడిపోతోంది లలితాంబ. భర్త గోపాలరావుగారికి తెగ ఆశ్చర్యం. ‘‘నా కూతురు ఆకాశం నుంచి వూడిపడింది- ఏ జమీందారో వస్తేగానీ ఇవ్వననేదానివికదే. ఇప్పుడీ బ్యాంకు ఎంప్లాయిని రమ్మంటావేమిటి పెళ్ళిచూపులకి?’’ అన్నారాయన.

పంచితే తప్ప, ఆ బాధా బరువునీ మోయటం సాధ్యంకాక అప్పుడు బయటపడేసింది ‘చావు కబురు చల్లగా’ అన్నట్టుగా కడుపులో దాచుకున్న దావానలాన్ని. తల్లడిల్లిపోయారాయన.

పళ్లు పటపట కొరికాడు కొడుకు ‘‘అప్పుడే చెప్పాల్సిందమ్మా’’ అంటూ.

‘‘ఏం చేస్తావ్‌? అల్లరి చేసుకుంటే నీ చెల్లి బతుకే బుగ్గి అవుతుందిరా. అందుకే నోరు నొక్కుకున్నాను’’ అంది లలితాంబ వేదనగా. మాట్లాడలేకపోయారిద్దరూ. ‘‘ముందల్లా మనకు సరిపోదని వద్దనుకున్న సంబంధమే. ఏం చేస్తాం, తప్పదు. మా వసుంధర చెప్పింది- ‘కుర్రాడు చాలా నెమ్మదైనవాడు, బుద్ధిమంతుడు, మంచి సంస్కారవంతుడు’ అని. ఇక నేనేమీ ఆలోచించలేదు. వచ్చి అమ్మాయిని చూడమన్నాను’’ అంది నిట్టూరుస్తూ.

  * * *

ఆరోజు ఆమనికి పెళ్ళిచూపులు. పూర్వపు పద్ధతిలోనే ఏర్పాట్లు జరిగాయి. అబ్బాయి సుదర్శన్‌ తల్లీ తండ్రితో కలిసి వచ్చాడు. అంతకుముందే ఆమని ఫొటో చూసి ఇష్టపడ్డా నేరుగా చూశాక మరింత ప్రసన్నులయ్యారు పెళ్ళివారు.

అందరి ఆమోదంతో సంబంధం ఖాయం చేసుకోబోయే ముందర వధూవరులిద్దరికీ కాసేపు ఏకాంతం కల్పించారు.

‘‘జాగ్రత్తగా మాట్లాడు. ఏ మాత్రం అనుమానం రానీకు సుమా’’ పదేపదే చాటుగా కూతుర్ని హెచ్చరించింది లలితాంబ. బుద్ధిగా తల వూగించింది ఆమని.

అయితే ఆ సమావేశ సమయాన్ని చాలా వరకూ వరుడు సుదర్శనమే యూజ్‌ చేసుకున్నాడు. వాచలత్వమూ కాదూ వాక్‌చాతుర్యమూ అనలేమూ... ఎదుటివాళ్ళని ఆకర్షించే విధంగా కాస్త ఎక్కువగా మాట్లాడే అలవాటున్నవాడతను. కొత్తదనం లేకుండా తనే మాట్లాడి ఆమనికి కొత్తదనం పోగొట్టాడు.

నువ్వు నాకు బాగా నచ్చావన్నాడు. ముఖ్యంగా నీ తేట కళ్ళూ, చక్కని వంపున్న మెడా చాలా బావున్నాయన్నాడు. తను పూర్తిగా ఈ కాలానికి చెందినవాడినన్నాడు. భార్యంటే- అత్తమామలకీ భర్తకీ యంత్రంలా సేవ చేయాలనేవాణ్ణి కాదన్నాడు. తనది సంకుచిత మనస్తత్వం కాదన్నాడు. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలన్నాడు. ఆమె ఉద్యోగం చేసుకోవటం తనకు సమ్మతమేనన్నాడు. వచ్చే జీతం తన ఇష్టప్రకారమే ఖర్చు చేసుకోవచ్చునన్నాడు.

తనో తెల్లకాగితంవంటి వాడిననీ, తనకే విధమైన అఫైర్సూ లేవనీ అన్నాడు. ఆమె కూడా ఎలాంటి మొహమాటాలూ గోప్యతా లేకుండా పారదర్శకంగా ఉంటే సంతోషిస్తానన్నాడు. తనతో సమానంగా చూసుకుంటాననీ గౌరవిస్తాననీ అన్నాడు.

అతను సృష్టించిన ఆ స్నేహ వాతావరణం మూలాన ఆమని బిడియం నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. ఎందుకోగానీ ‘ఇతను నన్ను సరిగా అర్థంచేసుకోగలడు’ అన్న విశ్వాసం కుదిరింది. మనసు మాట్లాడే ధైర్యాన్ని పుంజుకుంది. ఏది ఏమైనా ఆమె నిజాయితీగానే ఉండదలుచుకుంది.

‘‘మీరే కాదు, మీ భావాలు కూడా నాకు నచ్చాయి’’ సిగ్గుపడుతూ చెప్పింది ఆమని. కాస్త ఆగి, ‘‘జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరిమధ్యన అరమరికలూ దాపరికాలూ ఉండకూడదన్నారు. మీరు సరిగ్గా చెప్పారు. మనం అలాగే ఉండాలనుకుంటున్నాను నేను. ముందే మనం ఒకరినొకరం వెల్లడయిపోదాం. నాకు జరిగిన యాక్సిడెంట్‌ మీకు చెబుతాను దయచేసి వినండి... ఆమని ఉన్నదున్నట్టుగా తనమీద జరిగిన అత్యాచారాన్ని చెప్పేసింది. బలవంతంగా, నా ఇష్టానికి వ్యతిరేకంగా నాకు జరిగిన అవమానమది. నా మనసుకీ శరీరానికీ అయిన గాయమది. అదేదో నా అపరాధమన్నట్టు మావాళ్ళు ఇది దాచిపెట్టడం నాకు నచ్చలేదు. ముందుముందెప్పుడో అది బయటపడి, మీరు నన్ను నిలెయ్యటం, మనస్పర్థలతో అనుమానాలతో ఇద్దరి జీవితాలూ నరకప్రాయమవ్వటం నాకిష్టం లేదు.

నా వంతు తప్పు లేకుండా నిజం మీ ముందుంచాను. ఇక ఏ నిర్ణయమైనా మీ ఇష్టం.’’

అప్పటికే సుదర్శన్‌ లేచి నుంచున్నాడు.

* * *

ముక్క చివాట్లు పెట్టాడు తండ్రి ఆనందరావు.

‘‘కొంప ముంచావు కదే’’ తల బాదుకుంటూ ఏడ్చింది లలితాంబ.

‘‘నీకేమన్నా పిచ్చా’’ కస్సుమన్నాడు అన్న.

ఏమాత్రం పశ్చాత్తాపపడలేదు ఆమని. నిశ్శబ్దంగా మౌనాన్ని ఆశ్రయించిందంతే.

‘పెదవి దాటితే పృథివి దాటుతుందంటారు. గుప్పెట్లో ఉంచాల్సిన గుట్టు బట్టబయలు చేసిందీ తెలివితక్కువ పిల్ల. అతగాడీ మాట ఇంకెవరి చెవిలోనన్నా వూదితేనో?’ నాలుగు రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ భార్యాభర్తలు పడిన ఆందోళన వర్ణనకతీతం.

‘వెళ్ళి ఆ సుదర్శన్‌ చేతులు పట్టుకుందాం- దయుంచి ఆ విషయాలేవీ వెల్లడి చెయ్యొద్దు నాయనా- అని వేడుకుందాం. ఆమనిని ఎక్కడో గుజరాత్‌లో పనిచేస్తున్న మేనమామ దగ్గరికి పంపించేసి- అక్కడే ఎవరితోనన్నా ముడిపెట్టించేయమందాం’ అన్నదాకా ఆలోచనలు చేశారు. చివరికి ‘కట్టకట్టుకుని దేన్లోనయినా దూకేద్దాం’ అన్న దారుణమైన పరిష్కారందాకా కూడా వెళ్ళిపోయారు.

* * *

ఉష్ణగుండంలా ఉన్న వాతావరణంలోకి దూసుకొచ్చిన మలయమారుత వీచిక- సుదర్శన్‌ నుంచి వచ్చిన ఉత్తరం.

‘మీ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఈ విషయం మీకు తెలియచేయటానికి చాలా సంతోషిస్తున్నాను’ - ఈ వాక్యం మటుకు పైకి చదివి వినిపించారు గోపాలరావుగారు.

ఇంట్లో పండగ వాతావరణం వెల్లివిరిసింది. అందరి మొహాల్లోనూ హర్షాతిరేకం. లలితాంబ కళ్ళల్లో ఆనందభాష్పాలు.

వాళ్ళనటు వెళ్ళనిచ్చి మిగతా ఉత్తరం చదివింది ఆమని.

‘ఈ నిర్ణయం నానుంచి వస్తుందని మీరు వూహించి ఉండరు. అవును, నిజమే... ఒక శీలం పోగొట్టుకున్న అమ్మాయికి తాళికట్టే సాహసం చేస్తారనుకోరు ఎవరూ. కానీ, నేనందరిలాంటి వాడిని కాదు. నాదలాంటి ఇరుకు మనసు కాదు.

నా గురించి నేను చెప్పుకోగూడదుగానీ ‘నీది గొప్ప క్షమా గుణం రా’ అంటుంటారు నా స్నేహితులు.

అది అతిశయోక్తి కాదు. బాధలో ఉన్న ఎవరిని చూసినా కరిగిపోతాన్నేను. వాళ్ళు నాకు పడనివాళ్ళే అవనీ నేరస్తులవనీ పాపాత్ములవనీ... దీనావస్థలో కనబడితే చాలు- నా శాయశక్తులా వాళ్ళకు సాయం చేయకుండా ఉండలేను. ఏం చేయను, ఈ బలహీనత నాకలవాటై పోయింది.

ఆమని విషయమే తీసుకోండి- రాత్రివేళస్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్ళకుండా ఉండాల్సింది. వెళ్ళినా మగవాడి మనసు చెదిరేలా అలంకరించుకోకుండా ఉండాల్సింది. అనుకునో అనుకోకుండానో ఓ తప్పు జరిగింది. ఓ మచ్చపడింది. ఓ కళంకం అంటింది. అక్కడితో ఆ అమ్మాయి అందరిలా సజావుగా జీవితం గడిపే మార్గం మూసెయ్యటమేనా? జరిగింది తలచుకుని క్షణక్షణమూ కుంగి కృశించిపొమ్మని శపించటమేనా? తప్పు చేసినంత మాత్రాన తనకంత శిక్ష ఎందుకు వేయాలి? క్షమించి మంచి జీవితాన్నివ్వలేమా- అని ఆలోచించాను.

ఇవ్వగలను. అంతటి విశాల హృదయాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు. ఒక పతితను ఉద్ధరించే అవకాశం నాకు అందించాడు. అందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను, నా స్నేహితులెవ్వరూ ఇలా చెడిపోయిన అమ్మాయిని పెళ్ళిచేసుకోలేదు. చేసుకోరు కూడా. ఇది నాకు మాత్రమే సాధ్యం. అందుకు నేను గర్వపడుతున్నాను.

మీరిక నిశ్చింతగా ఉండండి. కళంకితే అయినా ఆమనిని నేను వివాహమాడతాను. తను పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగి ఇస్తాను. కాకపోతే, ఇకముందైనా ఈ తిరుగుళ్ళూ అవీ తగ్గించి, కాస్త పద్ధతిగా ఉండమనండి. నాకు క్షమాగుణం ఎక్కువ కదాని మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే మాత్రం బాగుండదు- ముందే చెబుతున్నాను.

నాకు కృతజ్ఞతలు తెలపాలని మీరు తహతహలాడుతుంటారని తెలుసు. వద్దు. నాకు పొగడ్తలు ఇష్టముండవు. నన్ను మొహమాట పెట్టకండి దయచేసి. వెంటనే ముహూర్తాలు పెట్టించండి.’

- సుదర్శన్‌

‘ఆహా...ఎంత సంస్కారవంతుడో’ చేతిలోకి లెటర్‌పాడ్‌, పెన్నూ తీసుకుంటూ నవ్వుకుంది ఆమని.

‘సుదర్శన్‌గారూ, నమస్కారం

మీరు నామీద అపరిమితమైన క్షమావర్షం కురిపించారు. మీ సంస్కార గుణానికి నిజంగా అభినందనలు. కానీ మీరు అనవసరంగా అక్కర్లేనిచోట మీ దయాగుణం చూపించారనిపిస్తోంది.

నాక్కావాల్సింది ఒక దుర్మార్గుడు పాశవికంగా గాయపరిచినందుకు సానుభూతి మాత్రమే, దయా బిక్ష కాదు.

నా తప్పును క్షమిస్తానన్నారు. నేను పతితనే అయినా పెళ్ళిచేసుకుంటానన్నారు. కానీ నాది తప్పు కాదు, నేను పతితను కాను. మనసా వాచా కర్మణా నేను పవిత్రురాలిని... అలా భావించిన వారికే నేను భార్యనవుతాను.

అంతేగానీ ఉద్ధరిస్తున్నాననే అపోహలో కాలరెత్తుకుంటున్న మీలాంటివారికి వంగిపోయి లొంగిపోయి, తాళి కట్టినందుకు జీవితాంతం కృతజ్ఞతగా మీ పాదాలముందు తల వంచుకుని బతుకుతానని ఎప్పుడూ అనుకోకండి.

మళ్ళీ చెబుతున్నాను. ఎవరో చేసిన పాపం నాకంటదు. నేను పవిత్రురాలిని. ఆ నమ్మకంతో నేను తలెత్తుకు బతుకుతాను. అలా నమ్మే వ్యక్తి ముందే తల వంచుతాను. అలాంటి వ్యక్తి తారసపడకపోతే ఒంటరిగానే ఉంటాను... ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా!

ఎవరేమనుకున్నా ఐ డోంట్‌ కేర్‌. సెలవు.

- ఆమని

ఆ ఉత్తరాన్ని స్వయంగా తనే పోస్ట్‌ చేసి వచ్చింది ఆమని ధైర్యంగా తలెత్తుకుని.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.