close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వీళ్లు నీళ్లను సాధించారు!

వీళ్లు నీళ్లను సాధించారు!

ఎర్రటి ఎండాకాలం... నేలతల్లి తనకే దాహమేస్తోందన్నంతగా చుక్కనీరున్నా పీల్చేసుకుంటోంది... మన దగ్గరి చాలా పల్లెల్లాగే ఆ పల్లెల గొంతూ ఎండింది. ఈ కష్టం, అందరిలా తమకూ... అనుకోలేదా పల్లెవాసులు... ఒక్కచోట పోగయ్యారు... ఏం చేద్దామంటూ ఆలోచనలు చేశారు... తమకు తెలిసిన పాత పద్ధతుల్లో నీటిని ఒడిసి పట్టడం మొదలు పెట్టారు. గంగమ్మ కరుణించింది. అలా... ఒకటా రెండా, 800 గ్రామాలు కలిసికట్టుగా కరవును తరిమికొట్టాయి. ఇప్పుడా ప్రాంతం మధ్యప్రదేశ్‌లోని వేల పల్లెలకు గెలుపు పాఠశాల!

ధ్యప్రదేశ్‌లోని ఝాబుఆ, అలీరాజ్‌పూర్‌ జిల్లాలు. భిల్‌ జాతి గిరిజనులు 85శాతానికి పైగా ఉండే ప్రాంతం. వీరిలో ఎక్కువశాతం నిరక్షరాస్యులే. ఒకప్పుడు పచ్చని చెట్లూ, గలగలపారే సెలయేళ్లతో కళకళలాడే ప్రాంతం. కానీ పరిశ్రమలక్కడ కాలకూట విషాన్ని చిమ్మాయి. ఆధునికీకరణ అడవుల్ని ఆసాంతం మింగేసింది. ఇంకెక్కడి పచ్చని బతుకులు! ఎండలొస్తే జనం పిట్టల్లా రాలారు. నీటిపాయ అక్కడి మనుషుల్లాగే బక్కచిక్కిపోయింది. జనం బిక్కమొహం వేశారు. ఏమిటీ సమస్యకు పరిష్కారం... ఒకటి కాదు రెండు కాదు వేల గొంతుకల ప్రశ్న అది. అవును, ఇది ఒక్కరి కష్టం కాదు, లక్షలాది జనులది. అప్పుడే అక్కడి వాళ్లకు తమ పాత పద్ధతి గుర్తొచ్చింది. తమకో లేదా తమజాతికో ఏదైనా కష్టం వస్తే గిరిపుత్రులంతా ఓచోట చేరేవారు, దానికి పరిష్కారాన్ని కనుగొనేవారు, ఆ దిశగా సమష్టిగా అడుగులు వేసేవారు. ముఖ్యంగా వ్యవసాయ సంబంధిత పనుల విషయంలో అందరూ కలిసి తలోపనీ చేయడం వాళ్లకలవాటే. అలా ఎవరి పొలంలో లేదా తోటలో మనుషులు అవసరమైతే అక్కడికి అంతా వెళ్లిపోయేవారు. అందరి దగ్గర ఉన్న వ్యవసాయ పనిముట్లనూ ఆ అవసరాల కోసం వినియోగించుకునేవాళ్లు. ఆ ప్రక్రియే హలమా... అదే పద్ధతిని ఇక్కడా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఫలితంగా, నీళ్లకష్టాలు పడుతున్న కొన్ని వూళ్ల ప్రజలు ఓ కొండ ప్రాంతంలో కలిశారు. ఏం చేద్దామని ఆలోచించుకున్నారు. తర్వాత అదే స్థలానికి పలుగూ పారలతో వచ్చారు. ఆ కొండ ప్రాంతం చుట్టూ వందల కందకాలు తవ్వారు. నీటిని నేలలోకి ఇంకింపజేసేందుకు పూర్వం వాళ్లు అనుసరించిన పద్ధతి అది. వానలు పడ్డప్పుడు వీటిలోకి నీరు వెళుతుంది. అందువల్ల అక్కడి బావులూ చెరువుల్లో నీరు ఎండిపోదు. అదే తెగకు చెందిన యువకుల్లో కొందరు సామాజిక కార్యకర్తలూ ఉన్నారు. శివగంగా అభియాన్‌ అనే పేరు పెట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందర్నీ సంఘటితం చేయడానికి వాళ్లు కృషి చేస్తున్నారు.

ఉద్యమంలా...
ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు కొద్దికొద్దిగానే పనులు జరిగినా వాటి ఫలితాలు మాత్రం అక్కడి వాళ్లకు కనిపించసాగాయి. అందుకే ఒక్కో వూరివాళ్లూ కలుస్తూ గుంపుగా తమ పనులు చేయడం ప్రారంభించారు. తాము ముందుగా నిర్ణయించుకున్న ప్రాంతానికి 20 నుంచి 30 వేల మంది జనం వస్తారు. హలమా పద్ధతి ప్రకారం, వచ్చిన వాళ్లు అందరూ ఒక రోజు ఒక వూరిలో పనిచేయాలన్నమాట. మరో రోజు ఇంకో వూరిలో. ఈ విధానంలో ఇక్కడి వాళ్లు కందకాలు తవ్వడమే కాదు, చెరువులూ, కుంటలూ నిర్మించుకున్నారు. కొన్ని వేల మొక్కలు నాటారు. 2016 నాటికి వాళ్లు నాటిన మొక్కల సంఖ్య 11 వేలను దాటింది. వూరికి కనీసం వంద మొక్కల్ని నాటుతారు. వాటి సంరక్షణా అంతే శ్రద్ధగా చేస్తారు. 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా 225 గ్రామాల్లో ఇలా సమష్టిగా తవ్విన కుంటల సంఖ్య 3200 అంటే పని ఎంత ఉద్యమంలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని వందల చేతి పంపులను బాగు చేశారు.

శిక్షణకూడా...
ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ఆ రెండు జిల్లాల్లోని 800 గ్రామాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. దాదాపు అన్ని వూళ్లలోనూ కార్యక్రమానికి ముందు కన్నా ఇప్పటికి నీటి మట్టాలు విపరీతంగా పెరిగాయి. చుట్టు పక్కల వూళ్లలోని కనీసం 350 బావులు తిరిగి జలకళను సంతరించుకున్నాయి. పల్లెచుట్టూ పచ్చదనం వెల్లివిరిసింది. వీటిలో 225 గ్రామాలైతే తమకు నీటి కష్టాలు ఇక లేవని చెప్పుకునే స్థాయికి చేరాయి. నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి అనే అంశం మీద శివగంగా అభియాన్‌ కింద ప్రతి వూరినుంచీ ఒక చదువు వచ్చిన వ్యక్తికి శిక్షణ ఇస్తారు. అతడు తమ వూరి వాళ్లకు ఈ విషయాల్ని నేర్పుతాడు. అంతేకాదు, వీరిలో కొంతమంది గిరిజనులు వూరూరికీ తిరిగి హలమా విధానం గురించి ప్రచారం చేస్తుంటారు. ఆయా వూళ్లలోని వాళ్లకూ మిగతా ప్రాంతాల విజయగాథల్ని వినిపించి వాళ్లనూ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తుంటారు. ఐఐటీలూ, ఎన్‌ఐటీల్లాంటి వాటిలో చదువుకున్న వాళ్లతో సహా ఎందరో వీళ్ల కార్యక్రమాల్ని చూసేందుకూ ప్రాజెక్టు వర్కుల కింద రాసేందుకూ వూళ్లకు వస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన హలమా కార్యక్రమంలో 30 వేల మంది గిరిజనులు పాల్గొనగా అక్కడికి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా వచ్చారంటే ఈ కార్యక్రమపు ప్రాధాన్యాన్ని అంచనా వేయొచ్చు. ప్రభుత్వాలు విస్మరించినా, సమష్టి కృషి ద్వారా తమ సమస్యల్ని తీర్చుకున్న ఈ గిరిజనుల విజయం ఓ ప్రగతి పాఠమే కదూ!

 


 

తిరగేసిన గొడుగులతో నీరూ కరెంటూ..!

చదువు ముగిసీ ముగియకముందే ఈ తరం స్టార్టప్‌ ఆలోచన చేస్తోంది. ఆ ఆలోచన - ఏ వ్యాపారం బాగా నడుస్తుంది, ఎందులో లాభాలార్జించవచ్చన్న అంశాలపై కాక పర్యావరణానికి ఎలా మేలుచేయాలి, సహజ వనరులను పెంపొందించుకుంటూ ఎలా లబ్ధి పొందాలి... అన్న దిశగా సాగితే అందరి దృష్టినీ ఆకర్షించడమే కాదు, విజయమూ సాధించవచ్చు. ‘ఉల్టా ఛాతా’ అలాంటిదే! హిందీలో ఈ మాటకి అర్థం ‘తిరగేసిన గొడుగు’ అని. అలాంటి పరికరాలతో వాన నీటిని ఒడిసి పట్టి తాగునీటిగా మార్చడమే కాక సౌర విద్యుత్తునూ తయారుచేస్తోంది ఓ జంట.

ప్రియా చోక్సి వృత్తిరీత్యా వాస్తుశిల్పి. అట్లాంటాలో ఓ పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో పనిచేసేవారు. పర్యావరణహిత నిర్మాణాలంటే ఆసక్తి. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అయిన సమిత్‌ చోక్సి అటు సిలికాన్‌ వ్యాలీలోనూ ఇటు భారత్‌లోనూ పలు స్టార్టప్‌లతో కలిసి పనిచేశారు. చదువు, ఉద్యోగాల కారణంగా సింగపూర్‌, లండన్‌, అట్లాంటా, బే ఏరియా తదితర ప్రాంతాల్లో నివసించిన వీరికి స్వదేశంలోనే ఏమైనా చేసి స్థిరపడాలనిపించింది. వినూత్నమైన ఆలోచనలకు తమ అనుభవాన్నంతా రంగరించి క్లీన్‌టెక్‌ రంగంలో పలు పేటెంట్లు పొందారు ప్రియ, సమిత్‌ దంపతులు.

 

అందంగా, ఆధునికంగా...
థింక్‌ఫై పేరుతో 2015లో సొంత టెక్నాలజీ సంస్థను నెలకొల్పారు ప్రియ, సమిత్‌. భార్యాభర్తలిద్దరి విద్యానైపుణ్యాల కలయికగా ఈ సంస్థ నుంచి తొలి ఉత్పత్తిగా ఉల్టాఛాతాలు తయారయ్యాయి. వీటి ఆకృతి తిరగేసిన గొడుగులా ఉన్నప్పటికీ అందంగా, ఆధునికంగా కన్పిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో వీటిని అమర్చడం ద్వారా వాననీటిని సేకరించవచ్చు. అన్ని గొడుగుల గొట్టాలనుంచీ కిందికి వెళ్లే నీరు పైపుల ద్వారా ఒకచోట కలుస్తుంది. అక్కడ ఈ నీటిని ప్రపంచ బ్యాంకు ప్రమాణాల మేరకు ఫిల్టర్‌ చేసే వ్యవస్థ ఉంటుంది. చివరికి ఆ వాననీరు తాగునీరుగా మారి వాడకానికి సిద్ధమవుతుంది. ఒక్క ఉల్టా ఛాతాతో ఏడాదికి లక్ష లీటర్ల నీటిని సేకరించవచ్చు. పది యూనిట్లను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఎక్కువ. వర్షాకాలంలో వాననీటిని సేకరించే ఈ ఛాతాలు మిగిలిన ఏడాది పొడుగునా తమలో ఉన్న సోలార్‌ ప్యానల్స్‌ ద్వారా సౌరశక్తినీ తయారుచేస్తాయి. ఈ సోలార్‌ ప్యానల్స్‌, బ్యాటరీ నిర్వహణ, లైటింగ్‌ వ్యవస్థ, నీటి మీటరు, ఫిల్టర్లు... ఇవన్నీ ఫైబాక్స్‌కి అనుసంధానిస్తారు. ఆ బాక్స్‌ ద్వారానే వీటిని నియంత్రిస్తారు. విశాల ప్రాంగణాలు కలిగిన సంస్థలు వీటిని ఏర్పాటుచేసుకుంటే తాగునీరు, విద్యుచ్ఛక్తి... రెండింటిలోనూ స్వావలంబన సాధించవచ్చు.

సంప్రదాయానికి భిన్నంగా ఉన్న కొత్త ఉత్పత్తిని వినియోగదారులకు పరిచయం చేయడం అంత తేలిక కాదు. అందుకు వారు చాలానే కష్టపడ్డారు. తొలి ఏడాది వారిద్దరూ నయా పైసా జీతం తీసుకోలేదు. పరికరాల ఉత్పత్తికి తోడు కార్యాలయ నిర్వహణ, సిబ్బంది నియామకం తదితరాల మీద దృష్టి పెట్టారు. తొలియత్నంలోనే గోద్రెజ్‌లాంటి వినియోగదారులు దొరకడంతో వీరి పని కాస్త సులువైంది. మొదటి ఏడాదిలో 30 యూనిట్స్‌ అమ్మగా కోటి రూపాయలు సమకూరాయి. నమ్మకం పెరిగింది. స్మార్ట్‌ సిటీస్‌ పెరుగుతున్న నేపథ్యంలో సంవత్సరానికి 300 యూనిట్లు అమ్మాలనీ దేశంలోని వంద ప్రముఖ కంపెనీలను తమ వినియోగదారులుగా మార్చుకోవాలనీ ఆశిస్తూ ముందడుగేస్తున్న థింక్‌ఫై యాజమాన్యం ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులకు అదనపు హంగులూ సమకూర్చుతోంది. ఉల్టా ఛాతాలకు ఇప్పుడు మొబైల్‌ ఛార్జ్‌ యూనిట్‌నీ జతచేశారు. ఒక కిలోవాట్‌ స్థానంలో 1.5 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్‌ పవర్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు. 2020నాటికి 1.9 ట్రిలియన్‌ డాలర్లకు చేరనున్న గ్లోబల్‌ మార్కెట్‌కి పర్యావరణ హిత పరికరాలు అందించడాన్ని దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నారు సమిత్‌. ప్రస్తుతం భారత్‌లో పర్యావరణహిత సాంకేతిక ఉత్పత్తుల మార్కెట్‌ 15 బిలియన్‌ డాలర్లుంది. పెరుగుతున్న పట్టణీకరణ, నీటి కొరత నేపథ్యంలో ఉల్టా ఛాతా లాంటి ఉత్పత్తుల అవసరం ఎంతైనా ఉంటుందని థింక్‌ఫై భావిస్తోంది. నిపుణులైన ఇంజినీర్ల బృందాన్ని ఏర్పాటుచేసుకున్న థింక్‌ఫై సమయానికి పెట్టుబడులూ అందడంతో పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టింది.

ఆ సినిమా ఆదర్శం
ఒకే ఉత్పత్తితో పర్యావరణహిత, నీటి సంరక్షణ, సౌరవిద్యుచ్ఛక్తి లాంటి కీలక రంగాలలో ప్రత్యేక ముద్ర వేసిన ప్రియకి ఈ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణగా నిలిచింది ఓ సినిమానేనట. చిన్నప్పుడు చూసిన ఫ్రెంచి సినిమా ‘అమీలియా’ ఆమెని ఎంతగానో ఆలోచింపజేసింది. ఒక సాధారణ బాలిక తన జీవనపోరాటం సాగిస్తూనే తన చుట్టూ ఉన్నవారి బాగుకోసం, వారి జీవితాల్లో మార్పు కోసం ఎలా సవాళ్లను స్వీకరించిందో ఆ చిత్రం చక్కగా చూపించిందంటూ ఇతరులను సంతోషపెట్టడంలోనే మన సంతోషం ఉంటుందనీ ప్రియ చెబుతుంటారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోకి వస్తున్న మహిళలకు స్ఫూర్తినీ మార్గదర్శకత్వాన్నీ ఇవ్వగల మహిళలు ఎక్కువగా లేరన్నది ఆమె అభిప్రాయం. ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి పెట్టాలనీ అచ్చంగా మహిళలతో ఒక ఇంక్యుబేటర్‌ లాంటిది ఏర్పాటుచేయాలన్నదీ ప్రియ ఆకాంక్ష. నిజమేగా... అలాంటి సౌకర్యం ఉంటే ప్రియలాంటి సృజనశీలురైన మహిళలు మరిన్ని సరికొత్త సాంకేతిక ఉత్పత్తులతో ముందుకువచ్చి దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర నిర్వహిస్తారు కదా!


 

ఈ శిక్షణ బధిరుల కోసం...

వృత్తి నైపుణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి చాలా సంస్థలు కృషిచేస్తున్నాయి. కానీ బధిరుల విషయానికి వచ్చేసరికి అలాంటివి అరుదనే చెప్పాలి. వారి కోసం ప్రత్యేకంగా ప్రయత్నిస్తోంది హైదరాబాద్‌కు చెందిన ఈ ‘డెఫ్‌ ఎనేబుల్డ్‌ ఫౌండేషన్‌’.

దైనా వైకల్యం ఉన్నవారికి మాత్రమే సాటి అంగవికలుర సాధకబాధకాలు బాగా తెలుస్తాయి. సందీప్‌, హరిహర కుమార్‌లు కూడా అలాంటివారే. అందుకే వారి సంక్షేమం కోసం ఏమైనా చేయాలని పరితపించారు. ఆ తపనకు ప్రతిరూపమే ఈ ‘డెఫ్‌ ఎనేబుల్డ్‌ ఫౌండేషన్‌’(డి.ఇ.ఎఫ్‌). దీని ద్వారా బధిరులకు అవసరమైన వృత్తి నైపుణ్యాలను అందించాలనుకున్నారు. ఇతరులతో పోలిస్తే వారికి ఉపాధి దొరకడం కాస్త కష్టమే. అందరూ పాఠశాల స్థాయిలోనే నేర్చుకునే ప్రాథమిక అంశాలను కూడా వీళ్లు ఎదిగిన తర్వాత నేర్చుకోడానికి ప్రయత్నిస్తారు. కంప్యూటర్‌ నిర్వహణ, ఆంగ్లభాషలో ప్రాథమిక పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్‌ సంపాదించే విషయాల్లో సరైన శిక్షణ దొరక్క ఇబ్బందిపడుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడానికి ముందుకొచ్చిందీ సంస్థ.

వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ...
డి.ఇ.ఎఫ్‌.సంస్థ బధిరులకు మూడు నెలలపాటు వృత్తి నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందిస్తోంది. దీంట్లో భాగంగా కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడం నేర్పిస్తారు. ఉద్యోగాలకు అవసరమైనంత మేరకు ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని పెంపొందిస్తారు. అభ్యర్థుల జనరల్‌నాలెడ్జ్‌ పెరిగేందుకూ కృషిచేస్తారు. వీటన్నింటినీ ‘ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌’లోనే బోధిస్తారు. ఈ లాంగ్వేజ్‌లో అక్షరాలతో మొదలు పెట్టి వాక్యాలూ, సంభాషణలూ అన్నీ ఉంటాయి. అలాగే నిత్య జీవితంలోని వివిధ వస్తువులూ, ప్రదేశాల పేర్లూ అన్నీ దీంట్లో ఇమిడి ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని బధిరులందరినీ ‘ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌’ ఒకే తాటి మీద నడిపిస్తుంది. అందుకే బోధనంతా దీంట్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుందీ సంస్థ. అలాగే శిక్షణ సమయంలోనే వివిధ అంశాల మీద ఆంగ్లంలో రాయించడం ద్వారా వారి ఆంగ్ల భాషా నైపుణ్యాన్నీ ఎప్పటికప్పుడు అంచనా వేసి మెరుగుపరుస్తారు.

ఈ శిక్షణ తరగతుల్లో పాఠాలు చెప్పే రమ్య కూడా బధిరురాలే. సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్న రమ్య బధిర విద్యార్థులకు పాఠాలు బోధించడానికి వివిధ సంస్థలకు వెళ్లేది. ఆ క్రమంలోనే ఆమెకు సందీప్‌, హరిహరకుమార్‌లతో పరిచయమైంది. ‘ఈ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నపుడు అర్థమైంది వాళ్లెంత చురుకైనవాళ్లొ. చెప్పిన విషయాన్ని చెప్పినట్టు వెంటనే గ్రహించేవాళ్లు. ఎంతో నిశిత దృష్టి ఉంటే తప్ప అర్థంచేసుకోవడం సాధ్యంకాదు. వాళ్లకున్న సమస్యల వల్ల వారి శక్తియుక్తులన్నీ మరుగున పడిపోతున్నాయేమో అనిపిస్తుంటుంది. చాలామంది ఫ్రెంచ్‌, స్పానిష్‌లాంటి విదేశీ భాషలు నేర్చుకుంటుంటారు. అలాంటివాళ్లు సరదా కోసమైనా సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకుని వాళ్లతో మాట్లాడి చూడండి వాళ్లెంత సంతోషిస్తారో’ అంటుంది రమ్య.

 

  ఉపాధి దొరికే వరకూ...
బధిరులకు తోడ్పడటానికి సందీప్‌, హరిహరకుమార్‌లు 2009లో డి.ఇ.ఎఫ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. తర్వాత ఈ సంస్థ చెన్నై, ముంబయి, ఇండోర్‌, తంజావూర్‌, పుదుచ్చేరి, తిరుచ్చి, విజయవాడ, విశాఖపట్నాలకూ విస్తరించింది. వారికి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఏడాదిలో కొన్ని నెలలకు మాత్రమే పరిమితంకాదు. ఒక జట్టుకు శిక్షణ పూర్తవగానే మరో జట్టుకు శిక్షణ మొదలవుతుంది. అయితే ఒక్కో జట్టుకూ పదిమంది అభ్యర్థులను మాత్రమే ఎంపికచేస్తారు. దీని వల్ల అభ్యర్థులను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దడానికి అవకాశముంటుంది. వినికిడి సమస్య ఉండి మాట్లాడగలిగేవాళ్లూ శిక్షణకు అర్హులే. శిక్షణ ఇవ్వడంతోనే ఈ సంస్థ పని అయిపోదు. తగిన ఉపాధి దొరికే వరకూ అభ్యర్థులకు తమ సహాయ సహకారాలను అందజేస్తుంది. కొన్ని కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ అభ్యర్థులను ఉద్యోగాలకు పంపిస్తుంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకూ పద్ధెనిమిది వందలమందికిపైగా ఉద్యోగాలు పొందారు. మరి కొందరు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రముఖ సంస్థలు కూడా ఉద్యోగ నియామకాల కోసం డి.ఇ.ఎఫ్‌ను సంప్రదిస్తున్నాయంటే ఈ సంస్థ అందించే శిక్షణ ఎంత బాగుంటుందో అర్థంచేసుకోవచ్చు. అలాగే బధిరులకూ సమాజానికీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకూ ఈ సంస్థ తన వంతుగా కృషిచేస్తుంది. వీరి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి వివిధ కార్పొరేట్‌ సంస్థల సహకారంతో అవగాహనా శిబిరాలను ఏర్పాటుచేస్తుంది. ర్యాలీలను నిర్వహించడం ద్వారా తమ కార్యక్రమాల వివరాలు ప్రజల్లోకి వెళ్లేలా చేస్తారు.

‘మన దేశంలోని ప్రతి పౌరుడికీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తంచేసే హక్కు ఉన్నట్టే బధిరులకూ ఉంది. అలాగే వీరికీ మిగతా వారిలా గౌరవప్రదంగా జీవించే హక్కూ ఉంది. అలా జీవించగలమనే ధీమా ఆర్థికంగా నిలదొక్కుకున్నపుడే వస్తుంది. వారికి స్వతంత్రంగా జీవించగలమనే భరోసాను ఇవ్వడానికి మావంతుగా కృషిచేస్తున్నాం’ అంటున్నారు వ్యవస్థాపకులు సందీప్‌, కుమార్‌లు. ఈ కృషి ఇంకా ఎన్నోవేల మందికి జీవనోపాధిని కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం.


 

మెట్రో వ్యర్థాలకు ప్రకృతి అందాలు

కాంక్రీటు అరణ్యాలంటారు నగరాల్ని. దేశ రాజధాని దిల్లీ అయితే కాంక్రీటు నగరంగానే కాదు, కాలుష్య నగరంగానూ ప్రసిద్ధి. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజారవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసే క్రమంలో దిల్లీ మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చారు. ఈ మెట్రో రైలు వ్యవస్థ నిర్మాణ క్రమంలో టన్నుల కొద్దీ వ్యర్థాలు తయారయ్యాయి. తవ్విపోసిన మట్టి, కాంక్రీటు దిమ్మలు, లోహపు గొట్టాలు, గ్రానైటు ముక్కలు... వెరసి బోలెడంత చెత్త మిగిలింది. దాన్నంతా ఏం చెయ్యాలన్న ప్రశ్నకు సమాధానంగా వెలసిందే ప్రకృతి మెట్రో పార్కు.

వ్యర్థా్థలకి కొత్త అర్థాలు చెప్పే కళాఖండాలతో తీర్చిదిద్దిన ఈ ప్రకృతి పార్కు పౌరులకు బహుళ ప్రయోజనాలు అందించడానికి సిద్ధమైంది. డీఎంఆర్‌సీ ఆధ్వర్యంలో ఇటీవలే దీనిని ఆవిష్కరించారు. దాదాపు పదెకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పార్కులో సభలూ సమావేశాలూ నిర్వహించుకునేందుకు ఆడిటోరియం, కళాప్రదర్శనలకు ఆంఫి థియేటర్‌, యోగా కేంద్రం, ధ్యానసాధనకు ప్రాంగణం, పిల్లలకు ఆటస్థలం, పెద్దలకు వ్యాయామశాల, ఆహ్లాదాన్నిచ్చే ఓ చిన్న సరస్సు, రెయిన్‌ ఫారెస్ట్‌... తదితరాలన్నీ ఏర్పాటుచేశారు. పూర్తిగా పర్యావరణ హితంగా రూపొందించిన ఈ పార్కులో పలు రకాల మొక్కల్ని పెంచే నర్సరీని కూడా నిర్వహిస్తున్నారు. నీటిని శుద్ధి చేసే ప్లాంటు నెలకొల్పి శుద్ధిచేసిన నీటినే మొక్కలకు వినియోగిస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి ఇంకుడు గుంతను ఏర్పాటుచేశారు. శాస్త్రి పార్క్‌ మెట్రో స్టేషన్‌కి కాలి నడక దూరంలోనే ఉన్న ప్రకృతి పార్కు వద్ద 72 కార్లు నిలిపేందుకు పార్కింగ్‌ ఏర్పాటు కూడా ఉంది.