close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చకచకా కోసేయొచ్చు

చకచకా కోసేయొచ్చు

కూరగాయల్ని కొయ్యడమేమీ చిన్నపని కాదు. అరడజను ఆకు కూర కట్టల్ని కొయ్యాలన్నా కనీసం పది నిమిషాలు పడుతుంది. కానీ ఈ ‘ముంజర్‌ ఫ్లోరా సలాడ్‌ కట్టర్‌ బౌల్‌’ ఉంటే గిన్నెడు కూరగాయల్ని నిమిషంలో కత్తిరించేయొచ్చట. గిన్నెలా ఉండే ఈ సలాడ్‌ బౌల్‌ మొత్తానికీ ఆ చివర్నుంచి ఈ చివరకు చాకు పట్టేంత ఖాళీలు ఉంటాయి. కాబట్టి, ఈ గిన్నెలో ఆకుకూరలూ టమోటాలూ కీరాలు... లాంటి వాటినన్నిటినీ వేసి మూతపెట్టి బోర్లించి పైనున్న ఖాళీల్లోనుంచి కోస్తే సరి. చిటికెలో అన్నీ ముక్కలైపోతాయి. ఇంకాస్త సన్నగా కావాలంటే, ఈ గిన్నెను ఓసారి అటూ ఇటూ కదిపి మళ్లీ కోస్తే సరి. ఇలా... సలాడ్లకూ కూరలకూ ముక్కల్ని చకచకా కోసేసుకోవచ్చు.

చల్లగా విహరిద్దాం

సెలవుల్లో కుటుంబంతో కలసి పిక్నిక్‌లకు వెళ్లడం మామూలే. కానీ వేసవిలో చల్లటి పానీయాలు వెంట లేకపోతే, ఉత్సాహం కాస్తా నీరు కారిపోతుంది. ఆ సమస్యలేకుండా మనం ఎటువెళ్తే అటు పదార్థాలను చల్లగా ఉంచే కూలర్‌తో పాటు టేబుల్‌నూ రెండు కుర్చీలనూ వెంట తీసుకెళ్తే భలే ఉంటుంది కదా... ‘అవన్నీ ఎలా తీసుకెళ్తాం...’ అనేయకండి, వీటన్నిటినీ కలిపి చిన్న పెట్టెలా మడిచేయొచ్చు. అదే ఈ ‘మల్టీ ఫంక్షన్‌ రోలింగ్‌ కూలర్‌’ ప్రత్యేకత. తెరిచినపుడు టేబుల్‌, దాని మధ్య భాగంలో అమరిన కూలర్‌, విడిగా రెండు స్టూళ్ల సెట్‌తో కనిపిస్తుంది ఇది. ఈ కూలర్‌లో ఐసు ముక్కలు వేసి, మనం పిక్నిక్‌కు తీసుకెళ్లాలనుకున్న పదార్థాలూ డ్రింకులూ నీళ్ల బాటిళ్లలాంటివాటినన్నిటినీ అందులో పెట్టేసుకోవచ్చు. ఇక, టేబుల్‌లా ఉన్న భాగాన్ని పక్కకు మడిచేస్తే చిన్నసైజు ట్రాలీ సూట్‌కేసులా మారిపోతుంది కాబట్టి, దీన్ని కారులో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. రోజంతా చల్లచల్లగా గడపొచ్చు.

మూడు తెరల ల్యాప్‌టాప్‌

ల్‌ఈడీ, హెచ్‌డీ టెక్నాలజీలు వచ్చాక ఫోనులూ టీవీల్లో సైజులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. మరి, ల్యాప్‌టాప్‌లను మాత్రం ఇంకా ఎన్నిరోజులని అలాగే చూస్తాం. ఈ ఆలోచనతోనే అమెరికాకు చెందిన రేజర్‌ కంపెనీ ‘ప్రాజెక్ట్‌ వెలెరీ’ పేరుతో ఓ కొత్తరకం ల్యాప్‌టాప్‌కు రూపకల్పన చేసింది. మామూలుగా 17 అంగుళాల వెడల్పుతో ఉండే ఈ ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ను కావాలనుకుంటే అంతకు రెండింతలు పెంచుకోవచ్చట. అదెలా అంటారా... వెలెరీ ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ వెనుక భాగంలో తీసి పెట్టుకునే వీలున్న మరో రెండు స్క్రీన్‌లు ఇమిడి ఉంటాయి. కావాలనుకున్నపుడు వాటిని రెండు వైపులకూ బయటికి లాగి మూడు తెరలనూ ఒకే స్క్రీన్‌గా మార్చుకోవచ్చు. అంటే ఈ ల్యాప్‌టాప్‌ అటు సౌకర్యంగానూ ఉంటుంది, ఇటు కావల్సినపుడు పెద్ద స్మార్ట్‌ టీవీ అంత సైజులోకీ మారిపోతుందన్నమాట. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందట.

చిటికెలో అప్పడాలు రెడీ

ప్పడం అంటే సులువుగా అయిపోతుందనుకుంటాం. కానీ బాండీ పెట్టి నూనె కాగాక ఒక్కో అప్పడాన్నీ నూనెలో వేయించి తియ్యాలి. అంటే పది అప్పడాలు వేగాలంటే పది నిమిషాలు పట్టేస్తుంది. మళ్లీ గిన్నెల్ని కడుక్కోవాలి. హడావుడి జీవితాల్లో ఆ సమయం ఎంత విలువైందో తెలియంది కాదు. పైగా నూనెలో వేయించినవి ఆరోగ్యానికీ అంత మంచివి కాదు. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ‘పాపడం ఎక్స్‌ప్రెస్‌.’ పొడవాటి ట్రేలా ఉండే దీన్లో ఒకేసారి పది అప్పడాలను వరుసగా నిలబెట్టి ఓవెన్‌లో పెట్టొచ్చు. ఈ ట్రే అడుగు భాగంలో రంధ్రాలు కూడా ఉంటాయి. కాబట్టి ఓవెన్‌ ఆన్‌ చెయ్యగానే అన్నివైపులనుంచీ వేడి సమానంగా వచ్చి నిమిషంలో పది అప్పడాలూ వేగిపోతాయి. దీనికి నూనె కూడా అవసరం లేదు కాబట్టి, ఆరోగ్యానికీ మంచిదే.

కళా... కాంతి...

‘మా స్టెబిలైజర్‌ను గోడకు పెడితే ఇంటికే అందం వచ్చేస్తుంది...’ ఈమధ్య టీవీలో కనిపిస్తున్న ఓ కంపెనీ ప్రకటన ఇది. ఇంట్లో పెట్టే ఏ వస్తువైనా ఇంటి అందాన్ని పెంచాలన్న కోరిక జనంలో ఆ స్థాయిలో ఉంది మరి. అలాంటిది రాత్రిపూట కచ్చితంగా వెలిగించే లైట్లను ఇంటి అలంకరణలో భాగం చెయ్యకుండా ఉంటారా... టెర్రకోట కళాకృతులతో రూపొందించిన ఈ టేబుల్‌ ల్యాంపులు అలాంటివే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ‘అలోచ్య’ సంస్థ వీటిని ప్రత్యేకించి ఇంటి అలంకరణకోసమే రూపొందిస్తోంది. ఎంత బాగున్నాయో కదూ... మీకూ కావాలంటే ఆ సంస్థ ఆన్‌లైన్‌ సైట్‌ నుంచి తెప్పించుకోవచ్చు.

తాతయ్య కుర్చీ

తాతయ్యా... అంటూ దగ్గరకొచ్చిన పిల్లల్ని రెండు వైపులా కూర్చోబెట్టుకుని కథలూ కబుర్లూ చెప్పడం పెద్దవారికి ఎంత ఆనందాన్నిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే, ఇద్దరు ముగ్గురు పిల్లలున్నప్పుడు వారిని పక్కన కూర్చోబెట్టుకోవడానికి హాల్లో అయితే సోఫాలుంటాయి. కానీ బాల్కనీలోనూ పెరట్లోనూ కుర్చీలో కూర్చుని, పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుందామంటే కుదరదు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే ‘స్టోరీ టైమ్‌ ఛెయిర్‌’. మామూలు రాకింగ్‌ చెయిర్‌లా ఉండే దీనికి హ్యాండిల్స్‌ దగ్గర రెండువైపులా చిన్న పిల్లలు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ స్నాక్స్‌ ప్లేట్లలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఎంత మంచి ఆలోచన..?

ఇక... చెయ్యి కాలదు

  గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, మామూలు టీ... ఏదైనా గాజు టీపాట్‌లో పోసి, అతిథుల టేబుల్‌ మీద పెడితే ఎంత చూడచక్కగా ఉంటుందో. కానీ వేడి వేడి పానీయాలతో ఉన్న గాజు పాత్రలను హ్యాండిల్‌తో పట్టుకున్నా చేతులకు వేడి తగులుతుంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ వచ్చిందే ఈ ‘హ్యాండ్‌ బ్లోన్‌ గ్లాస్‌ కెటిల్‌’. లోపల వేడిని బయటకు రాకుండా నియంత్రించే ప్రత్యేకమైన మందపాటి గాజుతో దీన్ని తయారు చేస్తారు. ఇంకెందుకాలస్యం, ఈ గాజు కెటిల్‌తో అందంగా ఆతిథ్యమిచ్చేయండి.

వామ్మో బ్యాగే..?

నం కొత్త బ్యాగును తగిలించుకుని వెళ్తే తెలిసినవాళ్లెవరైనా చూసి బాగుందనాల్సిందే... అనుకునేవాళ్లు కొందరు. రోడ్డుమీద వెళ్లేవాళ్లు సైతం మన బ్యాగును చూసి ఆశ్చర్యంతో కళ్లప్పగించాల్సిందే... అనుకునేవారు మరికొందరు. ఈ రెండోతరహా వారికోసం మార్కెట్లోకి వస్తున్నవే ఈ ‘బ్లడీ క్లెవర్‌ పర్సు’లు. ఒక్కసారిగా చూస్తే రక్తం అంటుకున్న కత్తిలా కనిపించే ఈ బ్యాగుల్ని చూస్తే ఎవరైనా హడలిపోకుండానూ ఆశ్చర్యపోకుండానూ ఎలా ఉంటారులెండి...

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.