close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్త రైతులొచ్చారు..!

సినీ హీరో... కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి తన వారసుడిని పరిశ్రమకి పరిచయం చేస్తాడు.

ఓ వైద్యుడు... లక్షలు కుమ్మరించి ఎంబీబీఎస్‌ సీటు కొని కొడుకునీ తన వృత్తిలోకే తీసుకొస్తాడు.

కానీ దేశంలో నూట ఇరవైఐదు కోట్ల మంది కడుపు నింపుతున్న రైతు మాత్రం తన బిడ్డకు రైతుగా మారే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాడు. అందుకే వ్యవసాయంపైన ఆధారపడ్డ మన దేశంలో భావి రైతుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. పల్లే పట్టణం తేడా లేకుండా పొలాలన్నీ ఆధునిక వెంచర్లుగా ‘అభివృద్ధి’ చెందుతున్నాయి. ప్రస్తుత తరంలో చాలామంది వ్యవసాయేతర రంగాల వెంటే వెళ్తున్నారు.

‘రైతే రాజు’ అని ప్రకటించిన దేశంలో ప్రమాదపు అంచులో ఉన్న తొలి వృత్తి వ్యవసాయం కావడం ఎంత దయనీయం!

అయితే, అందరినీ ఆందోళన పరుస్తున్న ఈ పరిస్థితిని చక్కబరచడానికి- కారు చీకట్లో కాంతి రేఖల్లా కొంతమంది నవయువకులు నడుం బిగిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాల్నీ లక్షల్లో వేతనాల్నీ ఖరీదైన జీవితాన్నీ చిరునవ్వుతో వదిలేసి వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలని నిశ్చయించుకున్నారు. మట్టిపైన మమకారంతో నాగలిపట్టి రైతులుగా మారారు. తమ తెలివితేటలతో అన్నదాతల శ్రమని తగ్గించే పనిముట్లు కనిపెట్టారు. లాభాపేక్షలేని స్టార్టప్‌లతో వ్యవసాయదార్ల సమస్యల్ని తొలగించారు. పాడిపరిశ్రమలోకి ప్రవేశించి బక్కచిక్కిన రైతు బతుకుల్ని చక్కదిద్దారు. మొత్తంగా ఈ కొత్తతరం రైతులంతా మళ్లీ మూలాల్లోకి ప్రవేశిస్తూ భవిష్యత్తుకి భరోసానిస్తున్నారు. మసకబారుతున్న వ్యవసాయ రంగానికి కొత్త రంగులు అద్దుతున్నారు. దారితోచని రైతు లోకానికి మార్గదర్శకులవుతున్నారు.

పొలాల్లోకి నేరుగా...
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నగరంలో ఓ ఐటీ కంపెనీ... సురేష్‌ బాబు ఐదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. మన కరెన్సీ ప్రకారం అతడికి నెలకు ఐదు లక్షలకు పైగానే జీతం. సొంత వూళ్లొ కుర్రాళ్లందరికీ అతడే ఆదర్శం. కానీ ఆ కుర్రాడి ఆలోచనలు మాత్రం వేరు. ఆఫీసులో ల్యాప్‌టాప్‌ తెరని చూస్తే తమ వూళ్లొని పొలంగట్లే కనిపించేవి. ఇంటికొచ్చి సేదతీరుతుంటే చిన్నప్పుడు తండ్రితో కలిసి పంట చేలో గడిపిన జ్ఞాపకాలు వెంటాడుతుండేవి. విదేశంలోని సౌకర్యాలేవీ అతడికి సంతృప్తినివ్వలేదు. ఆ అశాంతిని భరించలేక కొన్నాళ్లు ఉద్యోగానికి సెలవుపెట్టి సొంతూరు కోయంబత్తూరుకి బయల్దేరాడు. దారి పొడవునా పరచుకున్న పచ్చదనాన్ని చూసి పరవశించిపోయాడు. ఇంటికెళ్లి పంట పొలాల మధ్య నాలుగైదు రోజులు గడిపాక, తాను కోల్పోతున్న ఆనందం ఏమిటో తెలిసింది. అదెక్కడుందో అర్థమైంది. అంతే... ఆస్ట్రేలియా జీవితానికి స్వస్తి పలికి రైతుగా స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. అప్పటిదాకా దాచుకున్న డబ్బుతో తొమ్మిదిన్నర ఎకరాల పొలం కొన్నాడు. అక్కడ విద్యుత్‌ సదుపాయం లేకపోవడంతో సౌరఫలకాలతో ఓ చిన్న ప్లాంట్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. అడవి పందులూ, ఏనుగుల బెడదను నివారించడానికి సౌర విద్యుత్‌ ప్రసరించే కంచెని నిర్మించాడు. పొలంలో సౌరశక్తితో పనిచేసే నీళ్ల పంపుని అమర్చాడు. ఇతర రైతులూ, వ్యవసాయ నిపుణుల సలహాతో పోకచెక్క, అరటి పంటల్ని వేశాడు. నీటి వినియోగాన్ని తగ్గించడానికి తుంపర, బిందు సేద్య విధానాల్ని ఆశ్రయించాడు. వేపాకూ, గోమూత్రం తదితరాలతో సొంతంగా ఎరువుల్ని తయారు చేశాడు. ఒకప్పుడు చదువులో గ్రామస్థులకు ఆదర్శంగా నిలిచిన సురేష్‌, సేంద్రియ వ్యవసాయంతోనూ తోటి వాళ్లకు స్ఫూర్తిగా మారాడు. అందుకే తమిళ వ్యవసాయ సంఘం అతడికి ‘యంగ్‌ ఫార్మర్స్‌ అవార్డ్‌’నీ అందించింది. ‘ఆస్ట్రేలియాలో పీజీ చేసేప్పుడు నేను కూడా మిగతా కుర్రాళ్లలా విదేశాల్లో స్థిరపడాలనే అనుకున్నా. అందుకే ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా తీసుకున్నా. రోజులు గడిచేకొద్దీ నేను కోరుకునే సంతృప్తి అక్కడ లేదనిపించి ఇక్కడికొచ్చా’ అంటాడు సురేష్‌.

పైలట్‌గా మారి ఎప్పుడంటే అప్పుడు రివ్వున గాల్లో ఎగిరిపోవాలన్నది చాలామంది కల. విప్రో, హెచ్‌పీ లాంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగమంటే కెరీర్‌కు తిరుగులేదన్నది అందరి అభిప్రాయం. అలాంటి అద్భుతమైన రంగాల్ని ముగ్గురు యువకులు మరో ఆలోచన లేకుండా వదిలేశారు... అదీ వ్యవసాయం కోసం. క్యాలికట్‌ ఐఐఎం నుంచి ఎంబీఏ చేసిన ప్రసాద్‌ గతంలో ‘గ్లాస్‌బీమ్‌’ అనే ఐటీ సంస్థకు డైరెక్టర్‌గా ఉండేవారు. ఇంజినీర్‌ అయిన నవీన్‌, హెచ్‌పీ సంస్థ ఆసియా పసిఫిక్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. ఓ ప్రైవేట్‌ వైమానిక రంగ సంస్థలో నమిత్‌ కమర్షియల్‌ పైలట్‌. వృత్తి రీత్యా తరచూ కెనడా వెళ్లొచ్చే నమిత్‌, ఖాళీ దొరికినప్పుడల్లా అక్కడ పొలాల్లో గడపడానికి ఇష్టపడేవాడు. ఆ క్రమంలోనే అక్కడి రైతులతో మాట్లాడి సేంద్రియ పద్ధతుల్లో పంటల్ని పండించే మెలకువలు తెలుసుకున్నాడు. అదే విధానాలతో సొంత రాష్ట్రం కర్ణాటకలో వ్యవసాయం చేస్తే బావుంటుందని నమిత్‌కి అనిపించింది. తన సోదరుడు నవీన్‌, కజిన్‌ ప్రసాద్‌లకూ ఆ ఆలోచన నచ్చింది. ముగ్గురివీ నెలకు లక్షల్లో జీతాలూ, విలాసాలకు ఏమాత్రం కొదవలేని జీవితాలూ. అయినా వ్యవసాయంపైన ఆసక్తితో సాహసం చేసి, ఉద్యోగాల్ని వదిలేసి కొంత భూమి కొన్నారు. ప్రస్తుతం 38రకాల టమోటాలతో పాటు, సొరకాయ, వంకాయ, క్యాబేజీ లాంటి కాయగూరల్ని పండిస్తూ వాటిని నేరుగా ఫైవ్‌స్టార్‌ హోటళ్లూ, రెస్టరెంట్లకు సరఫరా చేస్తున్నారు. ‘గతంలో ఉదయం ఎనిమిదింటికి ఆఫీసుకు బయల్దేరేవాళ్లం, ఇప్పుడు పొలానికి వెళ్తున్నాం. అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ సంతృప్తిగా ఉన్నాం’ అంటారా సోదరులు.

ఇంజినీరింగ్‌ చదివి, ఐఐఎంలో ఎంబీఏ చేసి రెండేళ్ల క్రితం దాకా యాక్సిస్‌ బ్యాంకులో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేసిన సంకల్ప్‌ కూడా ప్రస్తుతం రైతే. ఓసారి మధ్యప్రదేశ్‌లోని తమ సొంతూరు విదిషాలో పురుగుమందుల్ని ఎక్కువగా వాడటం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులు భారీగా తగ్గాయని తెలుసుకొని బాధపడ్డాడు. తన చదువూ, తెలివితేటల్ని వూరికోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉన్నపళంగా ఉద్యోగం మానేశాడు. ‘పద్మశ్రీ’ గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ని కలిసి ‘జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌’(ఎరువులూ, యంత్రాల్ని ఉపయోగించకుండా పంటలు పండించడం) మెలకువలు తెలుసుకున్నాడు. తన పదెకరాల పొలాన్ని ప్రస్తుతం అదే పద్ధతిలో సాగు చేస్తూ ఇతర రైతులకూ ఆ విధానాన్ని నేర్పిస్తున్నాడు.

న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, అక్కడే హెచ్‌పీ సంస్థలో ఏడాదికి దాదాపు రూ.80లక్షల జీతమిచ్చే ఉద్యోగం... ఇదీ గౌరవ్‌ సహాయ్‌ నేపథ్యం. కానీ గ్రామాల్లో పర్యావరణహిత సాగుపైన అవగాహన పెంచాలనే ఉద్దేశంతో అన్నీ వదిలేసి ప్రస్తుతం హరియాణాలో సొంతూళ్లొ సేంద్రియ సేద్యం చేస్తున్నాడు. మద్రాస్‌ ఐఐటీ పూర్వ విద్యార్థి ఆర్‌.మాధవన్‌, రూర్కీ ఐఐటీ నుంచి ఎంటెక్‌ పట్టా అందుకున్న వెంకటేష్‌... కారణాలేవైనా వీళ్లంతా ఎంచుకున్న గమ్యం వ్యవసాయమే.

నలుగురి కోసం...
అందరి ఆకలినీ రైతు తీరుస్తున్నాడు. మరి రైతు కడుపుని ఎవరు చూస్తున్నారు? ఈ ప్రశ్న చాలా మంది ఉన్నత విద్యావంతుల్ని కలవరపెడుతోంది. అందుకే వాళ్లు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకూ, రైతుల జీవితాల్ని బాగు చేసేందుకూ తమవంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. మనీష్‌, శశాంక్‌లు ఆ కోవకి చెందిన కుర్రాళ్లే. మనీష్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌, శశాంక్‌ ఐఐటీ దిల్లీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. ఐఐటీ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యే రోజుల్లోనే వీళ్ల మధ్య రైతుల సమస్యలు చర్చకొచ్చేవి. చదువు పూర్తయి కార్పొరేట్‌ రంగంలో కుదురుకున్నాక కూడా ఆ ఆలోచన వదల్లేదు. దాంతో కొన్నాళ్లకు ఇద్దరూ ఉద్యోగాలు మానేశారు. ఉత్తరాదిలోని పల్లెల్లో తిరిగి రైతుల ఇబ్బందుల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘రైతులకు వ్యవసాయ మెలకువలు నేర్పాల్సిన పనిలేదు, నీళ్లే వాళ్ల ప్రధాన సమస్య’ అన్నది అప్పటిదాకా ఆ స్నేహితుల అభిప్రాయం. తీరా వాళ్లతో మాట్లాడాక ఆ నమ్మకం తప్పని అర్థమైంది. ఫలానా పంటే ఎందుకు వేశారనీ, ఫలానా క్రిమిసంహారకాన్ని ఎందుకు వాడుతున్నారనీ అడిగితే, ఎవర్నుంచీ సూటిగా సమాధానం రాలేదు. దాంతో ప్రక్షాళన పునాదుల నుంచీ మొదలుపెట్టాలని ఆ ఐఐటీ మిత్రులు నిర్ణయించుకున్నారు. నేల సారాన్ని పరీక్షించడం, దానికి అనువైన పంటల్ని సూచించడం, ఆధునిక యంత్రాల వినియోగం - ఎక్కువ దిగుబడిని సాధించే పద్ధతులు నేర్పించడం, పంటను మార్కెటింగ్‌ చేయడం... ఇలా విత్తు నాటే దగ్గర నుంచి పంటను కోసే వరకూ అన్ని దశల్లో రైతుకి వెన్ను దన్నుగా నిలిచే ‘ఫార్మ్స్‌ అండ్‌ ఫార్మర్స్‌’ అనే సంస్థకు ప్రాణం పోశారు. దానికోసం వ్యవసాయ నిపుణులూ, పరిశోధకులూ, అధికారుల సాయాన్ని తీసుకుంటున్నారు. నెలనెలా వచ్చే జీతం ఒక్కసారిగా ఆగిపోతే అనేక సమస్యలొస్తాయనీ, ఆ రిస్కుకీ, వ్యవసాయంలో ఒడుదొడుకులకూ సిద్ధపడే ఈ వైపు అడుగేయాలన్నది కుర్రాళ్లకు ఈ స్నేహితుల సలహా.

నిన్న మొన్నటిదాకా కర్ణాటకలోని మాండ్యా జిల్లా పేరు చెబితే అన్నదాతల అప్పులూ ఆకలి చావులే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడది సేంద్రియ సేద్యానికి కేంద్ర బిందువుగా మారుతోంది. అమెరికాలోని ‘సాన్‌ హోసే’లో సొంతంగా ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థను నడిపించే మధుచందన్‌ ఆ మార్పునకు మూలం. ఐటీ సంస్థ ద్వారా కోట్లు సంపాదిస్తున్నా, మధుచందన్‌ మనసెప్పుడూ తన సొంత జిల్లా మాండ్యాలోని రైతుల గురించే ఆలోచించేది. మళ్లీ ఆ నేలను పచ్చగా మార్చి రైతుకి పూర్వ వైభవం తేవాలని తపించేవాడు. ఆ ఆలోచననే జీవిత లక్ష్యంగా మార్చుకొని అమెరికా నుంచి మాండ్యాకి మకాం మార్చాడు. మొదట పరిచయం ఉన్న రైతుల్ని సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు ప్రోత్సహించాడు. వాళ్ల ద్వారా ఇంకొందర్నీ ఆ దిశగా నడిపించాడు. మొత్తం అందర్నీ కలిపి ఓ సంఘంగా ఏర్పాటు చేశాడు. ఆర్గానిక్‌ వ్యవసాయ నిపుణులూ, శాస్త్రవేత్తలతో వాళ్లకి ఎప్పటికప్పుడు సలహాలిప్పించాడు. ఆ ప్రయత్నం ఫలించి తొలి ఏడాది దిగుబడి అదిరిపోయింది. ఎక్కడికో తీసుకెళ్లి పంటను అమ్మకుండా, తమ వూరికి దగ్గర్లోని రహదారి పక్కన ‘ఆర్గానిక్‌ మాండ్యా’ పేరుతో ఓ స్టోర్‌ని ఏర్పాటు చేశాడు. ప్రారంభించిన తొలి నాలుగు నెలల్లోనే దాని ఆదాయం కోటి రూపాయలు దాటింది. మధుచందన్‌ వేసిన ముందడుగు వేల మంది రైతులకు వరంగా మారింది.

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ టాపర్లలో ఒకడైన చంద్ర దూబే, మధ్యప్రదేశ్‌లోని స్వగ్రామం సాగర్‌ పరిసరాల్లో నేలను సారవంతం చేసి దిగుబడి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మెకానికల్‌ ఇంజినీర్‌ కాబట్టి, దానికోసం ఆధునిక వ్యవసాయ యంత్రాలపైనే ఆధారపడ్డాడు. వాటిని ఉపయోగించడంలో రైతులకు శిక్షణ ఇస్తూ వాళ్ల శ్రమను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. బిట్స్‌ పిలానీలో చదివిన అంకిత్‌ కుమార్‌ బిహార్‌లోని తమ వూరి బీడు భూమిలో రైతులందరితో కానుగ చెట్ల సాగు చేయిస్తూ కొత్త ఆదాయ మార్గం చూపుతున్నాడు.

టెక్‌ సాయం...
రోజుకో కొత్త రకం టీవీ మార్కెట్లోకి వస్తుంది. పూటకో వెరైటీ ఫీచర్‌తో సెల్‌ఫోన్లు తయారవుతున్నాయి. జనాకర్షణ ఉన్న బోలెడన్ని పరికరాలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఎటొచ్చీ రైతులమీద కన్నేసే టెక్‌ నిపుణులే కరవయ్యారు. అందుకే ఆధునిక పరికరాలు వాళ్లకి త్వరగా అందుబాటులోకి రావట్లేదు. మన దేశంలో ఎనభై శాతం మంది సన్నకారు రైతులే. భారీ యంత్రాలు కొనే శక్తి వాళ్లకుండదు. అలాగని కూలీలతో పనిచేయిస్తే గిట్టుబాటు కాదు. దీర్ఘకాలంగా అన్నదాతల్ని వేధిస్తున్న ఈ సమస్యకి దేవీ మూర్తి అనే అమ్మాయి పరిష్కారం చూపిస్తోంది. అమెరికాలోని డ్రెక్సెల్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ... ఇవీ దేవి విద్యార్హతలు. డబ్బుకి ఏమాత్రం లోటులేని కుటుంబ నేపథ్యం. చదువు పూర్తయ్యే వరకూ ఒక్కసారి కూడా ఆమె పొలాల్లో కాలు పెట్టింది లేదు. ‘నువ్వు చాలా మంచి జీవితాన్ని చూశావు, ఒక్కసారి రైతుల సమస్యల్ని కూడా చూడు. వాళ్లకోసం నీ చదువు ఉపయోగపడుతుందేమో ఆలోచించు’ అని ఐఐఎంలో ఓ స్నేహితుడిచ్చిన సలహా దేవి గమ్యాన్ని మార్చింది. అసలు క్షేత్రస్థాయిలో వాళ్ల సమస్యలేంటో తెలుసుకుందామని రెండేళ్ల పాటు పొలాల మధ్య గడిపింది. రైతులతో మాట్లాడింది. వాళ్ల సభలూ, సమావేశాలకూ హాజరైంది. చిన్న రైతులు పొలానికి పెట్టే ఖర్చులో నలభై శాతం కూలీలకే సరిపోతుందని అర్థం చేసుకుంది. ఆ సమస్యకు ఆమె చూపిన పరిష్కారమే ‘కమల్‌ కిసాన్‌’.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యంత్రాలు మన రైతుల అవసరాలకు సరిపోవనీ, వాళ్ల పరిస్థితులకు తగ్గట్లు తక్కువ బడ్జెట్‌లో అనువైన యంత్రాలు తయారు చేయాలనీ దేవి నిర్ణయించుకుంది. ‘కమల్‌ కిసాన్‌’ అనే సంస్థని నెలకొల్పి రైతుల అవసరాలకు తగ్గట్లు విత్తనాలను నాటడానికీ, భూమిపైన తేమ ఆవిరవ్వకుండా ప్లాస్టిక్‌ కవర్లు పరచడానికీ, చెరకు పంట వేయడానికీ అనువైన అనేక యంత్రాలకు రూపకల్పన చేసింది. వాటి వల్ల రైతులకు శ్రమతో పాటు పనిగంటలూ కలిసొస్తున్నాయి. కూలీలకిచ్చే డబ్బూ ఆదా అవుతోంది. ‘కాస్త సామాజిక స్పృహ ఉన్న యువతకు ఇంతకంటే మంచి రంగం మరోటి ఉండదు’ అన్నది దేవి మాట.

ఆత్మహత్యల తరవాత విద్యుత్‌ ప్రమాదాలే ఎక్కువ శాతం రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. ఏ అర్ధరాత్రో వచ్చే ఉచిత కరెంటు కోసం వేచి చూస్తూ చీకట్లో కరెంటు తీగలు తగిలి చాలా మంది చనిపోతుంటారు. ఆ వార్తలు అమెరికాలోని నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీలో చదువుకునే కార్తీక్‌ అనే కుర్రాడిని బలంగా తాకాయి. ఆ ప్రభావంతో మొదలైందే ‘క్లారో ఎనర్జీ’. సౌర విద్యుత్‌ సాయంతో పనిచేసే మోటార్లూ, పంపులను తయారుచేసే ఆ సంస్థ పుణ్యమా అని ప్రస్తుతం దాదాపు పన్నెండు వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.

పాడి పరిశ్రమకు తోడు
ప్రపంచంలోనే అతిపెద్ద పాడి పరిశ్రమ మనది. ఏటా లక్ష కోట్ల రూపాయలకుపైగా వ్యాపారం చేస్తోన్న రంగమది. అంకెలు భారీగానే కనిపిస్తున్నా పాడిరైతుల సమస్యలు మాత్రం తీరట్లేదు. కల్తీ దాణా, నీటి సమస్యలూ, కార్పొరేట్‌ పాడి పరిశ్రమలూ... అన్నీ కలిసి చిన్న రైతుల్ని చిదిమేస్తున్నాయి. ఫలితంగా చాలామంది ఆ రంగాన్ని వదిలి వెళ్తున్న దశలో, కొందరు ఉన్నత విద్యావంతులు ఏరికోరి పాడి పశువుల్ని నమ్ముకుంటూ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నారు. విజ్ఞాన్‌ గడోదియా కూడా అలాంటి వాళ్లలో ఒకరు. ఐఐటీ దిల్లీ నుంచి బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌, ఆపైన కలకత్తా ఐఐఎం నుంచి ఎంబీఏ, విదేశాల్లో ఉద్యోగాలూ... కెరీర్‌ పరంగా తిరుగులేని నేపథ్యమది. గతంలో ఆయన కొన్నాళ్లు ‘యస్‌ బ్యాంక్‌’కి సూక్ష్మ రుణాల విభాగాధిపతిగా పనిచేశారు. ఆ హోదాలో తరచూ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకునేవారు. సరైన ఉపాధిలేక గ్రామాలనుంచి వలసవెళ్లే వాళ్లని పిలిచి, నగరాల్లో ఆవు పాలకి మంచి గిరాకీ ఉందనీ, ఆవుల్ని కొనే ఉద్దేశం ఉంటే రుణం ఇప్పిస్తాననీ చెప్పేవారు. అయినా పెద్దగా స్పందన ఉండేది కాదు. దాంతో తానే నేరుగా రంగంలోకి దిగి వాళ్లకి స్ఫూర్తినివ్వాలనుకున్నారు. బ్యాంకు ఉద్యోగం వదిలేసి జైపూర్‌కి సమీపంలో కొంత స్థలాన్నీ, ఐదు ఆవుల్నీ కొని పాల ఉత్పత్తి మొదలుపెట్టారు. అక్కడే చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని, గోవుల బాగోగులు చూసుకుంటూ ఉత్పత్తి పెంచుకుంటూ వెళ్లారు. క్రమంగా డెయిరీలో పశువుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. జైపూర్‌లోని వందల ఇళ్లకు అక్కణ్ణుంచే పాల సరఫరా మొదలైంది. అన్నింటి కంటే ముఖ్యంగా విజ్ఞాన్‌ నింపిన స్ఫూర్తితో, చుట్టుపక్కల ముప్ఫై గ్రామాల్లో కనీసం ఇంటికో ఆవునైనా పెంచుతుండటం విశేషం.

ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి ఎంటెక్‌ చేసిన నిహార్‌ రంజన్‌ కూడా ఒడిశాలోని తన స్వగ్రామంలో పశువుల్ని సాకుతున్నాడు. జనాలకు కల్తీలేని పాలని అందించాలన్న ఉద్దేశంతో, లాభం-నష్టం రెండూ లేని పద్ధతిలో ప్రస్తుతం పాల ఉత్పత్తిని సాగిస్తున్నాడు. కలకత్తా ఐఐఎం నుంచి పీజీ చేసిన అంకిత, నెలకు లక్షన్నర జీతాన్ని వదిలి పశువుల్ని నమ్ముకున్న పవన్‌ దాక్లా, స్వగ్రామంలో పాల సమృద్ధి కోసం పనిచేస్తున్న సంతోష్‌ సింగ్‌... పాడిని నమ్ముకొని తాము జీవిస్తూ, ఇతరులకూ ఉపాధినిస్తున్న పట్టభద్రులెందరో.

***

దేశానికి పునాదులు పల్లెలు. ఆ పల్లెలకు మూలం వ్యవసాయం. ఆ వ్యవసాయానికి ఆధారం రైతులు. సరైన సదుపాయాలూ, ప్రోత్సాహాలూ లేక రైతు బక్కచిక్కి పోతున్నాడు. దిగుబడిలేక పొలాలు దిగాలు పడుతున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన పల్లెలు ఆకలి మంటలతో నీరసించిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత విద్యావంతులు పల్లె బాట పట్టడమంటే... బీడువారిన భూమికి చినుకు తడి తగిలినట్లే... ఎండిపోతున్న కొమ్మ కొత్త చివురు తొడిగినట్లే...!

ఐఐటీ పల్లెబాట

బాగా చదువుకున్నవాళ్లే పట్టించుకోకపోతే వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందుతుంది... ఖరగ్‌పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్లకు వచ్చిన ఈ ఆలోచనే వాళ్లనీ అక్కడి విద్యార్థుల్నీ పల్లెవైపు నడిపించింది. కొందరు విద్యార్థులూ, ఐఐటీ ప్రొఫెసర్లూ కలిసి క్యాంపస్‌కి దగ్గర్లోని కేంతియా అనే పల్లెను దత్తత తీసుకున్నారు. మితిమీరిన రసాయనాలూ, క్రిమిసంహారకాల వినియోగంతో నిస్సారమైన అక్కడి నేలలో జీవం నింపాలని నిశ్చయించుకున్నారు. దానికోసం కొందరు రైతుల దగ్గర్నుంచి పదిహేనెకరాల భూమిని సేకరించి దాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నారు. ‘ఎస్‌ఆర్‌ఐ’ పరిజ్ఞానం ద్వారా అక్కడ తక్కువ నీళ్లతో ఎక్కువ వరిని పండించే ప్రయత్నం చేస్తున్నారు. కేంతియా రైతులకు పరిచయం లేని మొక్కజొన్న, సోయా, పల్లీ లాంటి వాణిజ్య పంటల సాగులో శిక్షణ ఇస్తున్నారు. వూళ్లొ పెద్ద చెరువుని తవ్వి వర్షపు నీటిని సేకరించే పనినీ మొదలుపెట్టారు. ఆధునిక వ్యవసాయ యంత్రాల్ని ఉపయోగించే పద్ధతుల్నీ వాళ్లకి నేర్పిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీతో పాటు ఇతర ఐఐటీల్లో చదువుకున్న విద్యార్థులూ వ్యవసాయంపైన మక్కువతో ఆ ప్రాజెక్టులో భాగమయ్యారు. మద్రాస్‌ ఐఐటీలో చదివిన అభిషేక్‌, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదులుకొని ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. వాళ్లంతా ఆ గ్రామంలోనే ఉంటూ రైతులకు ఆధునిక సాగు విధానాలపైన శిక్షణ ఇస్తున్నారు. మూడేళ్లలో కేంతియాను ఆదర్శ పల్లెగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

కుర్రాళ్ల కోసం ‘ఆర్య’

  దేశ జనాభాలో 35శాతం 15 నుంచి 35మధ్య వయసు వాళ్లే ఉన్నారు. వాళ్లలో డెబ్భై ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీళ్లలో ఎనభై శాతం రాబోయే రోజుల్లో పట్టణాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారన్నది అంచనా. మరోపక్క పద్దెనిమిది రాష్ట్రాల్లో ఐదు వేల మంది రైతుల్ని సర్వే చేస్తే, వాళ్లలో 76శాతం మంది ప్రత్యామ్నాయ ఉపాధి దొరికితే వ్యవసాయానికి దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అటు యువతంతా పట్టణ బాట పట్టి, ఇటు రైతులూ కాడిని వదిలేస్తే దేశ ఆహార భద్రతే ప్రమాదంలో పడుతుందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) హెచ్చరిస్తోంది. దానికి నివారణా చర్యల్నీ ఆ సంస్థే చేపట్టింది. పాతిక రాష్ట్రాల పరిధిలోని ఒక్కో కృషి విజ్ఞాన కేంద్రంలో మూడొందల మంది చదువుకున్న గ్రామీణ యువతను ఎంపిక చేసుకొని, వాళ్లకు వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తోంది. ఆ ప్రాజెక్టుకు వాళ్లు పెట్టిన పేరు ‘ఆర్య’ (ఎట్రాక్టింగ్‌ అండ్‌ రీటెయినింగ్‌ యూత్‌ ఇన్‌ అగ్రికల్చర్‌). అది పూర్తి స్థాయిలో ఫలితాల్నిస్తే భవిష్యత్తు కాస్త ఆశావహంగా మారుతుందన్నది వ్యవసాయ నిపుణుల మాట.

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.