close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో..!

దక్షిణాది కశ్మీర్‌!
తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అత్యంత చల్లని ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే లంబసింగి తరవాతే మిగిలినవన్నీ. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గ్రామమే లంబసింగి. ఆంధ్రా కశ్మీరుగా పేరొందిన లంబసింగిలో డిసెంబరు - జనవరి నెలల్లో ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీలకూ పడిపోతుంది. మిగిలిన కాలాల్లో పది డిగ్రీల సెల్సియస్‌కు మించదు. చలికాలంలో అయితే పదిగంటల తరవాతే సూర్యోదయం. చిత్రంగా ఈ వూరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వాతావరణం యథాప్రకారంగానే ఉంటుంది. వేసవిలో అరకులోకన్నా చల్లగా ఉండే ఈ ప్రదేశంలో ఎటు చూసినా చిక్కని పచ్చదనం పరిచినట్లే ఉంటుంది. ఈ ప్రాంతానికే కొర్ర(కర్ర)బయలు(బయట) అని పేరు. ఎవరైనా పొరబాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారట. అక్కడి దట్టమైన అడవుల్లోని చెట్ల మధ్యలోంచి నడుస్తుంటే ఇంగ్లిష్‌ కవి రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ చెప్పిన ‘ద వుడ్స్‌ ఆర్‌ లవ్లీ, డార్క్‌ అండ్‌ డీప్‌’ అన్న కవిత తప్పక గుర్తొస్తుంది. అక్కడున్న పొడవాటి చెట్ల మధ్యలోని చల్లని వాతావరణం కారణంగానే ఈ ప్రాంతంలో కాఫీ, మిరియాల తోటల పెంపకాన్ని చేపట్టింది అటవీశాఖ. పక్షిప్రేమికులకీ ఇది ఆటవిడుపే. పక్షుల కుహుకుహురాగాలు సందర్శకులకు వీనులవిందు కలిగిస్తుంటాయి. దీనికి 27 కిలోమీటర్ల దూరంలోనే కొత్తపల్లి జలపాత అందాలు గిలిగింతలు పెడుతుంటాయి. ఇక్కడ ఓ నాలుగు రోజులపాటు ఉండాలనుకునేవాళ్లు చింతపల్లిలో ఉండొచ్చు. చింతపల్లి నుంచి సీలేరు ఘాట్‌రోడ్డు ప్రయాణంలో మబ్బులు మనముందే పరుగులుతీస్తూ మిట్ట మధ్యాహ్నం వేళలో కూడా మంచుపడుతూ మధురానుభూతిని కలిగిస్తుంది. అందుకే వేసవిని ఆస్వాదించాలనుకునే ప్రకృతిప్రియులు లంబసింగి దారి పడుతున్నారు. కాబట్టి ఆ చల్లని ప్రదేశంలో గడపాలనుకునేవాళ్ల పాలిట స్వర్గధామం... ఈ చల్లని కొండగ్రామం..!

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌ నుంచి 571, విశాఖపట్టణానికి 101, చింతపల్లికి 19, నర్సీపట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి బస్సు, ట్యాక్సీల్లో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌ నుంచి వెళ్లేవాళ్లు విశాఖపట్టణం వరకూ రైల్లో వెళ్లి, అక్కడ నుంచి బస్సు, ట్యాక్సీల్లో ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు.

అరకులోయ
పచ్చకోక కట్టుకున్న తూర్పుకనుమల సిగలో విరిసిన మరో ముగ్ధసింగారమే అరకులోయ. పొగమంచు జలతారు ముసుగేసుకుని, గిరిజనుల థింసా నృత్యగానాలతో పర్యటకుల్ని రారమ్మని ఆహ్వానిస్తుంటుంది. ఓ పక్క కొండల మధ్యలోంచి దూకే జలపాతాలూ మరోపక్క ఆవులిస్తున్న లోయలూ ఇంకోపక్క చీకటి సొరంగాలూ ఎటుచూసినా ప్రకృతి సుందరి అందాలే. చుట్టూ కొండలూ ఆ మధ్యలోని లోయలో విరిసిన వలిసెపూల అందాలను చూడాలంటే మాత్రం చలికాలం ప్రారంభంలోనే అరకులోయకి ప్రయాణం కట్టాలి. అడవిబిడ్డల మధ్యలో అక్కడి చల్లని వాతావరణంలో ఓ నాలుగురోజులపాటు సేదతీరాలనుకునేవాళ్లు మాత్రం ఎప్పుడైనా బయలుదేరవచ్చు. 36 సొరంగాలు దాటుకుంటూ వెళ్లే విశాఖ - అరకులోయ రైలు ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. అరకు వెళ్లే దారిలోనే ప్రాచీనకాలంనాటి బొర్రాగుహలు రాతియుగానికి తీసుకెళ్లిపోతాయి. కాలచక్రం ఓసారి గిర్రున వెనక్కి వెళ్లిపోయి, వేల సంవత్సరాల క్రితం మనిషి జాడల్ని పోల్చగలిగితే ఎంత బాగుణ్ణో అనిపించకమానదు. ఇక, అక్కడి బొంగు చికెన్‌ రుచి సరేసరి.

బొర్రా గుహల నుంచి కారు లేదా బస్సులో ఘాట్‌రోడ్డులో అరకుకు ప్రయాణం నగరజీవిలోని ఒత్తిడినంతా చేత్తో తీసేసినట్లుగా మాయం చేస్తుంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే ఎత్తైన సిల్వర్‌ ఓక్‌ చెట్లూ వాటికి పాకించిన మిరియాల పాదులూ ఆ మధ్యలోని కాఫీ పొదలూ ఎటుచూసినా ఆటవిడుపే. ఆ కాఫీ తోటలకు ఓ పక్కగా ఆగి, అక్కడి గిరిజన యువతులు అందించే కాఫీని రుచి చూడకపోతే అరకు పరిసరాల్ని అవమానించినట్లే. ఆ చల్లని కొండల్లో వేడి వేడి కాఫీ గొంతు దిగుతుంటే స్వర్గం ఎక్కడో లేదు, ఇదే అనిపించక మానదు. వంపులు తిరిగిన ఘాట్‌రోడ్డు మెలికలన్నీ దాటుకుని, విశాలమైన మైదానాన్ని తలపించే లోయలోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తే ఓ వరసలో పేర్చినట్లుగా గాలికొండ, రక్తకొండ, సుంకరిమెట్ట, చిటమోంగొండి కొండలు కనువిందు చేస్తాయి. తూర్పుకనుమల్లో కెల్లా ఎత్తైన జింధగడ శిఖరం ఇక్కడే ఉంది. లోయలో నుంచి కొండల్లోకి ఒరిగిపోతున్న సూర్యాస్తమయ, సూర్యోదయ దృశ్య అందాల్ని చూసి తీరాల్సిందే. అరకులోయలో నిర్మించిన ట్రైబల్‌ మ్యూజియం, కళాగ్రామాలు గిరిపుత్రుల సంస్కృతీసంప్రదాయాలూ కళలకూ అద్దం పడతాయి. అక్కడే రంగురంగుల పూలసోయగాలూ గులాబీల గుబాళింపులతో కొలువుదీరిన పద్మనాభపురం బొటానికల్‌ గార్డెన్స్‌లో తిరుగుతుంటే సమయమే గుర్తుకురాదు.

తరవాత సరిగ్గా ఇక్కడకు 26 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అనంతగిరి కొండల్నీ అక్కడి కాఫీతోటల్నీ ఉరకలెత్తే జలపాతాల్ని కూడా చుట్టేయ్యొచ్చు. పాడేరు వెళ్లే దారిలోని చాపరాయి, కటికి జలపాతాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆ కొండల్లోని అందాలను వీక్షిస్తూ నాలుగురోజులు ఉండాలనుకునేవాళ్లకోసం పర్యటక శాఖ రిసార్టులతోబాటు ప్రైవేటు హోటళ్లూ లాడ్జ్‌లూ వున్నాయక్కడ. అనంతగిరికి సరిగ్గా 11 కిలోమీటర్ల దూరంలోని తైడలో జంగిల్‌బెల్స్‌ రిసార్టులోనూ సేదతీరవచ్చు. అరకులోయలోనూ ప్రభుత్వ అతిథి గృహాలతోబాటు ప్రైవేటు హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. అయితే ముందుగానే వాటిని బుక్‌ చేసుకుని వెళ్లడం మంచిది.

ఎలా వెళ్లాలి:
విశాఖపట్టణం నుంచి 132 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకుకు ఉదయాన్నే రైలు ఉంటుంది. ఆ రైల్లో బొర్రా గుహల వరకూ వెళ్లి, వాటి సందర్శన అనంతరం కాఫీతోటలమీదుగా బస్సు లేదా ప్రైవేటు వాహనంలో అరకులోయకు చేరుకోవచ్చు. తిరిగి విశాఖకు వచ్చేటప్పుడు కారు లేదా బస్సులో వస్తే ఘాట్‌రోడ్డు అందాలను వీక్షించవచ్చు.

హార్స్‌లీ హిల్స్‌!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నైరుతీదిక్కున ఉన్న మరో చల్లని కొండ ప్రదేశమే హార్స్‌లీ హిల్స్‌. ఏడాది పొడవునా చల్లగా ఉండే ఈ ప్రాంతం చెంచు తెగలకీ పుంగనూరు ఆవులకీ పెట్టింది పేరు. ఆంధ్రా వూటీగానూ పేరొందిన దీని అసలు పేరు ఏనుగు మల్లమ్మకొండ. ఒకప్పుడు ఇక్కడ నివసించే మల్లమ్మ అనే బాలిక, ఏనుగుల్ని సంరక్షిస్తుండేదట. అక్కడ నివసించే చెంచులకి ఏదైనా జబ్బు చేస్తే మందు ఇచ్చేదట. ఉన్నట్లుండి ఒకరోజు ఆ అమ్మాయి ఆకస్మికంగా మాయమైపోవడంతో ఆమెనో దేవతగా భావించి గుడి కట్టించి పూజించసాగారట చెంచులు. అందుకే దీనికా పేరు. తరవాత కడప జిల్లా కలెక్టరుగా వచ్చిన బ్రిటిష్‌ ఆఫీసరు విలియం డి.హార్స్‌లీ ఈ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి చేయడంతో ఇది హార్స్‌లీ హిల్స్‌గా స్థిరపడిపోయింది.

సముద్రమట్టానికి 4,100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వందలకొద్దీ పక్షిజాతులూ ఎలుగుబంట్లూ సాంబార్లూ పాంథర్లూ అడవికోళ్లూ వంటి జంతువులూ; ఎర్రచందనమూ బీడీ కుంకుడూ సీకాయా దేవదారూ వెదురూ వంటి చెట్లకు నిలయమైన కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ; పర్యావరణ ఉద్యానవనమూ; మల్లమ్మ ఆలయం... ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఎత్తైన యూకలిప్టస్‌ చెట్ల నుంచి వీచే చల్లని గాలీ కాఫీ తోటల ఘుమఘుమలూ సందర్శకుల్ని మైమరిపిస్తాయి. దేశంలో జోర్బింగ్‌ క్రీడను అందించే అతికొద్ది ప్రదేశాల్లో ఇదీ ఒకటి. అయితే దీనికోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్‌ చేసుకోవాలి. రాపెల్లింగ్‌, ట్రెక్కింగ్‌... వంటి ఆటలకీ ఇది నెలవే. ఇక్కడకు దగ్గరలోనే గాలిబండ, వ్యూపాయింట్‌, పడవల్లో విహరించే గంగోత్రీ సరోవరం, మదనపల్లి శివాలయాల్నీ సందర్శించవచ్చు. పర్యటకశాఖవారి హరిత అతిథి గృహాలతోబాటు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు కూడా ఉంటాయి.

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌ నుంచి 531 కి.మీ., తిరుపతి నుంచి 128, మదనపల్లె నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. రైల్లో వెళ్లాలనుకుంటే ములకలచెరువు స్టేషన్‌లో దిగి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి, మదనపల్లిల నుంచి బస్సులు తిరుగుతూనే ఉంటాయి.

అనంతగిరి
వికారాబాద్‌ సమీపంలో ఉండే అనంతగిరి ఏడాది పొడవునా సందర్శించదగ్గ ప్రదేశం. నిండైన ఆకుపచ్చ చీర కట్టుకున్న ఈ సుందరసీమలో ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు మించదు. అయితే చినుకులు మొదలయ్యే సమయంలో ఇది మరింత అందంగా కనువిందు చేస్తుంటుంది. మనిషి జీవించిన అత్యంత ప్రాచీన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ప్రాచీన గుహలూ మధ్యయుగంనాటి గుడులు పచ్చని అడవులూ జలపాతాలతో మనసును మరోలోకంలో విహరింపజేస్తుందీ ప్రదేశం. అప్పట్లో ఓ ముస్లిం చక్రవర్తి ఇక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని కట్టించడం విశేషం. అన్నింటికన్నా ప్రాచీనకాలంనాటి ఈ ఆలయ సందర్శన భక్తులకు ఆనందపారవశ్యాన్నీ కలిగిస్తుంది. ఇక్కడి కొండల్లోనే పుట్టిన ముచికుందా నది హైదరాబాద్‌ గుండా మొత్తం 240 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండజిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడికి సమీపంలోనే ఉన్న నాగసముద్ర సరోవరంలో పర్యటకులు పడవ షికారుకి వెళ్లవచ్చు. ట్రెక్కింగ్‌, క్యాంపింగ్‌..వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి.

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌కు సుమారు 90కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరికి బస్సు సౌకర్యం ఉంది. కారులోనూ బైక్‌ మీదా కూడా వెళ్లి రావచ్చు.

ఇవేకాదు, అటు స్వామికార్యం ఇటు స్వకార్యం రెండూ నెరవేరాలనుకునేవాళ్ళకోసం శేషాచలకొండల్లో వెలసిన తిరుమల వెంకన్ననీ, నల్లమల కొండల్లో కొలువైన శ్రీశైల మల్లన్ననీ సందర్శించి, అక్కడి పుణ్యతీర్థాల్లో మునకలేసి, ఆ కొండగాలిలో తేలివచ్చే అడవిపూల పరిమళాల్నీ చెట్ల చల్లదనాన్నీ ఆసాంతం ఆస్వాదించి రావచ్చు. ఆధ్యాత్మిక చింతనతోబాటు ట్రెక్కింగులు చేయాలనుకునే సాహసికులకీ ఈ పుణ్యక్షేత్రాలు నిలయాలే. ఇంకెందుకు ఆలస్యం... ఆనందంగా విహరించండి..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.