close
పదహారేళ్ల వయసు

పదహారేళ్ల వయసు
- కలగోట్ల కృష్ణమోహన్‌

‘‘చచ్చిపోవాలనుంది...’’ అంటున్న చైత్ర కళ్ళలోంచి నీళ్ళు. మౌనంగా ఆమె వైపు చూశాడు రామతీర్థ.

నాలుగైదు క్షణాలు గడిచాయి.

నిశ్శబ్దాన్ని మృదువుగా నెట్టేస్తూ ‘‘మంచి ఆలోచన’’ అన్నాడాయన.

ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ దేశవిదేశాలు తిరుగుతుండే రామతీర్థ హైదరాబాద్‌కు వచ్చి రెండు రోజులైంది. అంతకు ముందురోజు సాయంత్రం బంజారాహిల్స్‌లో కొందరు ప్రముఖులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చైత్ర తల్లిదండ్రులు రాఘవ, జానకి ప్రసంగం ముగిసిన తర్వాత ఆయనను కలిశారు. తమ కూతురు ఈమధ్య తరచూ చనిపోతానని అంటోందనీ, అలా అంటుంటే తమకు చాలా బాధగా ఉందనీ, ఆ అమ్మాయి తమకేమీ చెప్పడంలేదనీ, రామతీర్థ మాటలు విన్న తర్వాత తమ సమస్యను ఆయన పరిష్కరించగలరనే నమ్మకం వచ్చిందనీ చెప్పి- ఎలాగైనాసరే అమ్మాయిని మామూలు మనిషిని చేయాలని కోరారు. అందుకు రామతీర్థ అంగీకరించాడు. ఫలితమే ఇప్పుడు వారింట్లో ఆ అమ్మాయి గదిలో ఎదురుగా బాసింపట్టేసుకుని కూర్చున్నాడు.

రామతీర్థ అన్న మాటతో కొంత ఆశ్చర్యం చైత్ర కళ్ళల్లో ప్రవేశించింది. ఆయన తన మాటలను కొనసాగించాడు ‘‘నిజం తల్లీ, నాకు తెలిసిన నా నలభై ఎనిమిదేళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ ఆలోచన రాలేదు. నీకింత త్వరగా వచ్చినందుకు ఆశ్చర్యంగా ఉంది. ఈ తరం మమ్మల్ని మించిపోతోందనేది స్పష్టంగా తెలుస్తోంది. నీ వయసు చూస్తే పద్దెనిమిది ఏళ్ళుంటాయేమో కానీ, నీ ఆలోచన మాత్రం నిండు నూరేళ్ళది’’ అంటుండగా-

‘‘నాకు పదహారేళ్ళే!’’ అంది చైత్ర ఉక్రోషంగా.

ఆయన ఆశ్చర్యంగా ‘‘అవునా?’’ అన్నాడు.

‘ఎగతాళా’ అని చూసింది చైత్ర. అది సహజంగా అన్నట్టుగా ఉండటంతో ఏమీ అనలేకపోయింది.

రామతీర్థ మళ్ళీ మాట్లాడసాగాడు ‘‘నువ్వు చెప్పిన మాటకు నాకేమనిపిస్తోందంటే, దీన్ని - అంటే చనిపోవడాన్ని - ప్రచారం చేస్తే ఎలా ఉంటుందీ అని. ఇప్పటివరకూ నేను చూసిన, విన్న సమస్యలకు దేనికీ చావు పరిష్కారం కాదు. విదేశాల్లో కొందరు బృందాలుగా ఆత్మహత్యలకు పాల్పడిన విషయం విన్నప్పుడు ‘ఇదేం పిచ్చి’ అనుకునేవాడిని. ఇప్పుడు అనిపిస్తోంది... చాలామందికి ఇదో సులువైన పరిష్కారమని. సరే, నాకో సాయం చేస్తావా?’’ అడిగాడు.

చైత్ర అనుమానంగా ‘‘ఏంటి?’’ అని అడిగింది.

‘‘నువ్వెందుకిలా అనుకుంటున్నావో చెబితే చాలు, అందుకు ప్రతిఫలంగా నువ్వు అనుకునే ‘చావడం’ అనే దారికి ఎవరూ అడ్డం రాకుండా చూసే బాధ్యత నాది. సరేనా?’’ అన్నాడు.

చైత్ర కొంచెంసేపు ఆలోచించింది. తర్వాత ‘‘ఎవరడ్డు వస్తారు? అయినా చెబుతాను... కానీ ఇవన్నీ మీరు ఎవరికీ చెప్పకూడదు’’ అంది.

ఆయన తల వూపాడు.

‘‘నాకో బాయ్‌ఫ్రెండున్నాడు. తన పేరు టోనీ.’’

‘‘అది కుక్క పేరు కదా అమ్మాయ్‌. ఫ్యాషనా ఏంటి కొంపదీసి.’’

‘‘కాదు. అది ముద్దుపేరు. అసలు పేరు ఏదో ఉందిలెండి. అందరూ టోనీ అంటారు. నేనయితే- ‘టో’ అంటే చాలని తనంటాడు. నేనంటే తనకు చాలా ఇష్టం. నెలక్రితం నాకోసం రమ్మీని కూడా త్యాగం చేశాడు.’’

‘‘రమ్మీ అంటే?’’

‘‘మీరనుకునేది కాదు అంకుల్‌... సారీ గురూజీ...’’

‘‘అంకులే అనులేమ్మా.’’

‘‘అంకుల్‌ అంటే బాగుంటుంది కదా!? రమ్మీ తన గర్ల్‌ఫ్రెండ్‌. తెల్లగా ఉంటుందని తెగ ఫోజు కొడుతుంది. తనతో మాట్లాడవద్దని నేను చెప్పానో లేదో వెంటనే మానేశాడు.’’

‘‘పాపం ఆ అమ్మాయి...’’ అన్నాడు.

‘‘ఏమీ కాలేదంకుల్‌. తాను చాలా క్యాజువల్‌గా తీసుకుంది. ఈమధ్య సినిమాలో ఎవరో కొత్త హీరోను చూసిందట- నచ్చాడట. ఆ ప్రేమలో ఉందిలే ఇప్పుడు. నాకు నిజానికి ఏ సమస్యా లేదంకుల్‌. నేనేం అడిగినా తెచ్చిస్తారు. నాకు ప్రత్యేకంగా లాప్‌టాప్‌ కూడా ప్రజెంట్‌ చేసింది మమ్మీ. నేనెవరితో చాటింగ్‌ చేసినా పట్టించుకోరు కూడా. ఇంత మంచి మమ్మీ డాడీలు ఎవరికీ ఉండరంకుల్‌. మా ఫ్రెండ్స్‌ అందరికీ వాళ్ళ పేరెంట్స్‌ ‘ఇలా ఉండు, ఇలా చెయ్యి’ అని రెస్ట్రిక్షన్స్‌ పెడుతుంటారు. కానీ, మా పేరెంట్స్‌ అలా కాదు. అయినా, వాళ్ళిద్దరికీ అంత టైమెక్కడ? మమ్మీ ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో, డాడీ మరొక కంపెనీలో... ఇద్దరూ కలిసి ఉండేదే తక్కువ. వాళ్ళకి ఎప్పుడైనా సెలవు దొరికితే మేము ముగ్గురం మాట్లాడుకుంటాం. ఆమధ్య డాడీ అన్నాడు- ‘నీకో ఏటీఎమ్‌ కార్డు ఇస్తాను. ప్రతిసారీ డబ్బు కోసం మమ్మీనో నన్నో అడగాల్సిన అవసరంలే’దని. అయినా నాకు డబ్బవసరం ఈమధ్య అసల్లేదు. కానీ, డాడీతో ఆ మాట చెప్పలేదు నేను. టోనీ నా వెంట తిరుగుతున్న తర్వాత కనీసం ఓ పిజ్జా కూడా నేను సొంత డబ్బులతో కొనుక్కోలేదు. అన్నీ వాడే చూస్తాడు.’’

‘‘ఇప్పుడీ విషయం మీవాళ్ళకు తెలిసిందనా నీ భయం?’’

‘‘లేదు... లేదు... వాళ్ళకి తెలియలేదు. తెలిసినా, వాళ్ళేం అనరంకుల్‌. నాకది తెలుసు.’’

‘‘మరి?’’

‘‘టోనీ మీద నాకు ప్రేమ కలగడం లేదంకుల్‌. అంత కేర్‌ తీసుకోవడానికి నేనేం బొమ్మనా? వాడిని చూస్తే నాక్కోపం కూడా వస్తోంది. ఇది నా ఫాల్టేనని అనిపిస్తుంది. వాడేమో నా వెంట తిరుగుతున్నాడు. నాకేమో వాడిని చూస్తే కోపం వస్తోంది. నాకోసం రమ్మీని కూడా డ్రాప్‌ చేశాడు. అది తెలిసి, కొన్ని రోజులు నేను తనతో బాగా ఉండి, ఇప్పుడు తనంటే ఇష్టం లేదనిపిస్తోందంటే- నాకు నా క్యారెక్టర్‌ మీదే డౌటొస్తోంది. అందుకే చచ్చిపోవాలనిపిస్తోంది. మమ్మీ డాడీకి నేనెందుకు ఇలా అంటున్నానో తెలియదు. ఈమధ్య నాకోసం వాళ్ళు టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. అది కూడా నాకు గిల్టీగా ఉంటోంది. మమ్మీ డాడీ పెద్దగా పట్టించుకోకుండా ఉన్నంతవరకూ నాకు ఏ ఫీలింగ్‌ ప్రత్యేకంగా లేదు. వాళ్ళు నాకోసం కేర్‌ తీసుకోవడం నాకు అయిష్టంగా ఉంది. అంటే వాళ్ళను కూడా నేను ప్రేమించడం లేదేమోననిపిస్తోంది’’ అంది చైత్ర.

‘‘నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు ఇది చాలా పెద్ద చిక్కు ప్రశ్నగా అనిపిస్తోంది. నేను ఎంతమందికో రకరకాల సమాధానాలు చెప్పి ఉంటాను. కానీ, నువ్వు దీనికి చావు పరిష్కారం అనుకుంటున్నావు చూడు... దానికి నేను ఆలోచిస్తున్నాను.

ఒక రహస్యం చెప్పనా... అసలు నేను వచ్చింది నీకోసం కాదు- మీ డాడీ కోసం. ఆయన ఈమధ్య చాలా ఇబ్బందిలో ఉన్నారు.’’

‘‘అదేంటి అంకుల్‌? డాడీకి ఇబ్బందా?’’

‘‘సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ డల్‌గా ఉంది కదా, మీ డాడీవాళ్ళ కంపెనీలో కొందరిని తీసేశారు. కొందరిని రిజైన్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందులో మీ డాడీ కూడా ఉన్నారు.’’

‘‘అదొక సమస్యా!?’’

‘‘అదే తమాషా. కానీ, మీ డాడీ ఫీలవుతున్నారు. మీ మమ్మీ ఎంత చెప్పినా ఆయన డిప్రెషన్‌లో ఉన్నారు. అందుకు నేను మీ ఇంటికి వచ్చాను. ఆయనది చిన్న సమస్య అని చెప్పినా వినిపించుకోవడంలేదు.’’

‘‘అవునంకుల్‌, అది ప్రాబ్లమ్‌ కానేకాదు.’’

‘‘నువ్వు ఒక సాయం చేయాలి. కొన్ని రోజులు నీ సూసైడ్‌ థాట్‌ను వాయిదా వేసి, మీ డాడీకి మోరల్‌ సపోర్ట్‌ ఇవ్వాలి. అసలు నేను వచ్చింది అది చెబుదామనే’’ అన్నాడాయన చైత్ర కళ్ళల్లోకి చూస్తూ.

చైత్ర ఆలోచనలోపడింది.

‘‘నువ్వు చెబితే వింటారా అనుకోకు. ఆయన లోన్లీగా ఫీలవుతున్నారు. మీ మమ్మీ మాట్లాడబోతే, చికాకు పడుతున్నారట. నీతో మాట్లాడాలంటే నువ్వు డిస్ట్రబ్‌ అవుతావు అనుకుంటున్నట్లున్నారు. నీకు కొన్ని పాజిటివ్‌ థింకింగ్‌ పుస్తకాలూ, డీవీడీలూ ఇస్తాను. ఆ పుస్తకాలు చదువు. డీవీడీలు చూడు. వాటిలోని విషయాలు డాడీతో చర్చించు. కొన్ని రోజులే, ఆయన మామూలు మనిషి అయేంతవరకు. ఈలోపు నేను నువ్వు చెప్పిన విషయంపై కొంత పరిశోధన చేస్తాను. ఎందుకంటే చావు ఏ సమస్యనూ పరిష్కరించలేదనే నమ్మకాన్ని నువ్వు సవాలు చేస్తున్నావు కదా. మన చుట్టూ ఉన్న ఏ మొక్కా, ఏ జంతువూ ఆత్మహత్య చేసుకోవు. మనిషి మాత్రం చాలా సులువుగా ఆ పని చేస్తాడు. అందుకు ఎవరి కారణాలు వారికి ప్రత్యేకంగా, తిరుగులేనివిగా అనిపిస్తాయి. ఇది ఎలా సరైనదనేది నేను కొందరు గురువులతో చర్చించి తెలుసుకుంటాను. అప్పటివరకూ నువ్వు ‘చనిపోతాను’ అని ఎవరితో అనవద్దు. ఇదంతా కేవలం నాకోసం, ఆలోచించు.’’

చైత్ర మౌనంగా ఉండిపోయింది.

మళ్ళీ రామతీర్థ మాట్లాడసాగాడు ‘‘నేను ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. అటునుంచి విదేశాలలో ఆరు నెలలపాటు ప్రసంగాలూ కార్యక్రమాలూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీ డాడీకి సంబంధించి, ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే- ఇది నా మెయిల్‌ ఐడీ. దీనికి నువ్వు సమాచారం పంపించు. ఏం చేయాలన్నది నేను నీకు మెయిల్‌ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను.’’

రామతీర్థ ఇచ్చిన కార్డును తీసుకుంది చైత్ర. ‘‘సరే, నేను బయలుదేరుతున్నాను’’ అని చెప్పి, ఆ గదినుంచి బయటకు వచ్చాడాయన. బయట హాల్లో ఉన్న చైత్ర తల్లిదండ్రులు ఆయనను చూసి లేచి నిలబడ్డారు.

‘‘రాఘవగారూ, నేను ఇక సెలవు తీసుకుంటాను’’ అన్నాడు రామతీర్థ.

‘‘నేనూ వస్తాను గురువుగారూ. మీరెక్కడకు వెళ్ళాలో చెబితే అక్కడ కారులో డ్రాప్‌ చేస్తాను’’ అన్నాడు రాఘవ.

ఇద్దరూ బయలుదేరారు. రామతీర్థ ‘ఏమి చెబుతాడా’ అని చూసింది జానకి. కానీ, ఆయన ఆమెతో ఏమీ అనలేదు.

కారులో రాఘవతో గదిలోపల చైత్రతో తను మాట్లాడిన విషయాలు చెప్పాడు రామతీర్థ. ‘‘నేను మీ గురించే వచ్చానని మీ అమ్మాయితో చెప్పాను. ఆ కారణాలన్నీ అబద్ధమే అయినా నిజమన్నట్లు మీరూ మీ భార్యా ప్రవర్తించండి’’ అని, ‘‘కొంతకాలం మీరు ఉద్యోగానికి సెలవు పెట్టడానికి వీలవుతుందా?’’ అని అడిగాడు. వీలవుతుందన్నట్లు తలూపాడు రాఘవ. అయితే సెలవు పెట్టి, ఆ అమ్మాయితో మాట్లాడటం, కొన్ని ప్రదేశాలు పర్యటించడం చేయమని సలహా ఇచ్చాడు రామతీర్థ.

***

ఆరు నెలలు గడిచాయి. రామతీర్థకు రాఘవ కుటుంబం నుంచి ఎటువంటి మెయిలూ రాలేదు. ఆయన కూడా వారి గురించి దాదాపు మర్చిపోయాడు. ఇండియా తిరిగివచ్చిన తర్వాత విశాఖపట్టణానికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న తన ఆశ్రమానికి ఆయన వెళ్ళిపోయాడు. సంవత్సరంలో తొమ్మిది నెలలు పర్యటనలకు పోగా మిగిలిన మూడు నెలలు తన ఆశ్రమంలో గడుపుతాడు రామతీర్థ. దాదాపు పదెకరాల ఆ ఆశ్రమంలో ప్రకృతి విద్య పాఠశాల, మానసిక వికలాంగుల కోసం స్వస్థాలయం ఉన్నాయి.

ఒకరోజు సాయంత్రం ఆయన పాఠశాల పిల్లలతో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళాడు రాఘవ. అతడిని చూసి ఆటను ఆపి వచ్చాడు రామతీర్థ.

‘‘అలా కూచుందాం రండి’’ అంటూ ఆ పక్కనే ఉన్న మామిడిచెట్టు కింద ఉన్న అరుగువైపు చూపించాడు. ఇద్దరూ అక్కడ కూర్చున్నారు.

‘‘మీ ఆశ్రమం చాలా బాగుంది’’ అన్నాడు రాఘవ. నవ్వాడు రామతీర్థ.

‘‘నాకు మెయిల్స్‌ ఏమీ రాలేదు మీ అమ్మాయి నుంచి’’ అన్నాడు.

‘‘అవునా? తాను ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. సమస్య ఏమీ లేదు. మీరు చెప్పినట్లు నేను కొన్ని రోజులు సెలవు పెట్టాను. తనతో పూర్తికాలం గడిపాను. చైత్ర కూడా రోజూ కాలేజీ నుంచి వస్తూనే నాతో రకరకాల విషయాలు మాట్లాడేది. మీరిచ్చిన పుస్తకాలు చదివి, డీవీడీలు చూసి వాటిలో తనకు బాగా అనిపించినవి నాతో చర్చించేది. ఆ పుస్తకాలూ సినిమాలూ చైత్ర మీద బాగానే ప్రభావం చూపించాయి. మీరెళ్ళిన తర్వాత నుంచి ఇప్పటివరకూ చనిపోతాననే మాట తన నోట రాలేదు. డాక్టర్‌ అవుతానంటోంది. తనను చూస్తే చిన్నప్పటి చైత్ర గుర్తొస్తోంది. తనలో అప్పటి ఉత్సాహం మళ్ళీ వచ్చింది. మధ్యలో కొన్ని రోజులు మేమే దాన్ని మాయం చేశామని నాకు అనిపించింది. నేను నా జాబ్‌కు రిజైన్‌ చేశాను. జానకి జీతం మాకు సరిపోతుంది. సిటీ బయట ఒక స్కూల్‌ ప్రారంభించాను... కేవలం అనాథ పిల్లల కోసం. నా స్నేహితులు కొందరు ఇందుకు సహాయం అందిస్తున్నారు. త్వరలో ఒక వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఇదంతా మీవల్లే జరిగింది. నన్ను నేను తెలుసుకోవడానికి మీరు మా వద్దకు వచ్చారని నాకనిపిస్తోంది’’ అన్నాడు రాఘవ.

అతడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్న రామతీర్థ ‘‘రాఘవా, మీరు చేస్తున్న పనులకు నా అభినందనలు. ఇక మీ అమ్మాయి విషయానికి వస్తే, ఇందులో ప్రత్యేకంగా నేను చేసిందేమీ లేదు. మీరూ మీ అమ్మాయీ ఏదైతే వలయంలో ఉన్నారో దాన్ని మీరే కనుక్కున్నారు. దాన్ని మీరే చెరిపేసుకున్నారు. ఆరోజు నేను మీ అమ్మాయితో మాట్లాడినప్పుడు, కేవలం సమస్యకు పరిష్కారాన్ని చెబితే సరిపోదనిపించింది. పరిష్కారం అనేది ఆచరించాల్సిన విధానం. అందుకే అలా సూచించాను. ఇక్కడ మీరు దాన్ని సరైన మార్గంలోనే అర్థం చేసుకున్నారు. ఆధునిక విద్యా విధానంలో మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న స్కూలు పిల్లలు కొందరు ఆ పరుగులో తడబడి మరణమే శరణ్యమనుకోవడం నన్ను కదిలించి వేస్తుంది. 2004 సంవత్సరంలో తమిళనాడులో 200 మంది స్కూలు పిల్లలు అలా ఆత్మహత్యాయత్నం చేశారు. 19 మంది చనిపోయారు. అప్పట్లో ఒక పత్రిక ఈ విషయాన్ని ప్రకటించింది. ఇటీవల వార్తాపత్రికలు చూస్తే తరచూ ఇలాంటి వార్తలు కనబడుతూనే ఉన్నాయి. మీ అమ్మాయిది కూడా అటువంటి సమస్యేమో అనుకున్నాను. మాట్లాడిన తర్వాత అది మార్కులకు సంబంధించింది కాదని అర్థమైంది. నిజానికి మీ అమ్మాయికీ మీకూ మధ్య ఏర్పడ్డ కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తున్నదీ, మీరు ఏం చేస్తున్నదీ తెలియని స్థితి ఏర్పడింది. మామూలుగా ఒక చిన్న కుటుంబంలో అటువంటి పరిస్థితి ఏర్పడటం అసహజం అనే చెప్పాలి. చిన్న కుటుంబాలు మనదేశంలో తొలి దశలో ఉన్నాయి. అయితే, అవి ఆ దశలో అవసరమైన పరస్పర ఆలంబనతో నిలబడకుండా, సామాజిక స్థాయీ హోదా కోసం పరుగుపెట్టడంలో మునిగిపోయాయి. పరస్పర ఆలంబనకు మూలమైన ప్రేమలో ఒక సాదరత, బాధ్యత, గౌరవం, అవగాహన, శ్రద్ధ, నమ్మకం... అన్నీ సరైన పాళ్ళలో కలిసి ఉంటాయి. అవి కుటుంబ పునాదులకు చాలా అవసరం.

నిజానికి మీ అమ్మాయి చనిపోవడం అనే విషయంపై సీరియస్‌గా లేదు. ఆ మాట తరచూ అనడంవల్ల మీరు భయపడ్డారు. ఒక్క సంతానం చాలనుకున్న తల్లిదండ్రులు ఆ ఒక్కరితో కూడా కాలం గడపలేనంత బిజీ అయిపోతే... ఏం చేస్తాం, అలా అవుతున్నారిప్పుడు.

ప్రపంచాన్ని చూడని మనుషులు తమకు ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యకూ తల్లడిల్లిపోతారు. ఆ సమస్య మధ్యలో నిలబడి దాన్ని అధిగమించడమెలా అని చింతిస్తారు. వారి జీవితాన్ని అది చుట్టుముట్టేసిందే అని వాపోతారు. కేవలం ఉపన్యాసం ద్వారా దానికి పరిష్కారం లభించదు. ప్రయత్నించడం వల్లనే లభిస్తుంది. ప్రయత్నించడం వల్ల దాని ఎత్తూ పొడవూ లోతూ మీకర్థం అవుతాయి. మరింత ఆలోచిస్తే దాని కాలమూ మీరు గమనించగలరు. అప్పుడిక అది మిమ్మల్నేమీ చేయలేదు.

వ్యక్తి తన ఇరవైనాలుగు గంటల కాలాన్ని గడపడానికి ఆధునిక జీవితం ఎన్ని సౌకర్యాలను సమకూర్చిందో అంతే చెత్తను కూడా పేర్చింది. వాటి మధ్యలో ‘నేను’ అన్న విషయం తప్ప మరొకటి గుర్తుకురాని పరిస్థితి కల్పించుకుంటున్నాడు మనిషి. ఒక దశ దాటిన తర్వాత, అనుకున్నవన్నీ దొరికిన తర్వాత, వాటితో సంతృప్తి రానప్పుడు, తనను తాను ప్రశ్నించుకుని ఒక రకమైన నిస్సత్తువకు లోనవుతున్నాడు. దానికి కారణం అతడు ప్రకృతి నుంచి దూరంగా వెళ్ళడమే.

మనం కూర్చున్న ఈ మామిడిచెట్టు భూమిలో తను నిలబడటానికి వీలుగా వేళ్ళను జొప్పించి, అట్టడుగు పొరల్లో నుంచి నీటిని గ్రహించి, సూర్యుడి కిరణాలను తీసుకుని ఆహారాన్ని తయారుచేసుకుంటుంది. అక్కడితో ఆగదు, వందలకొద్దీ ఫలాలను అందిస్తుంది. ఏ ప్రతిఫలం ఆశించి ఇస్తుంది?

ప్రకృతి సూత్రమేమిటంటే- ఇవ్వడం. మనిషి ఒక్కడూ అలా కాకుండా తీసుకోవడంలో మునిగి తేలుతున్నాడు. అవేవీ తనకు ఆనందాన్నివ్వవని తెలిసినప్పుడు ఆధ్యాత్మికత వైపు చూస్తున్నాడు. అది కూడా వలయమే. కాకపోతే కొంచెం పెద్దది. ఇదా ప్రకృతి చెపుతోంది? కాదు, నీ జీవితానికి కావలసింది తీసుకో, ప్రతిఫలంగా నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు... అంతే. జీవితంలో ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదు. జీవితానికి అర్థం జీవించడం, ఇతరులను జీవించనీయడమే’’ అన్నాడు రామతీర్థ.

అవునన్నట్లు తలూపాడు రాఘవ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.