close
పవన్‌ ఉంటే ఉత్సాహం రెట్టింపు!

పవన్‌ ఉంటే ఉత్సాహం రెట్టింపు!

  కొంచెం ఇష్టం కొంచెం కష్టం, తడాఖా, గోపాల గోపాల, తాజాగా ‘కాటమరాయుడు’ లాంటి హిట్‌ చిత్రాల దర్శకుడు కిషోర్‌ పార్థసాని (డాలీ). ‘ఏదో ఒక సినిమా తీయడం కాదు, వెరైటీ కథల్ని ఎంచుకొని భిన్నమైన సినిమాల్ని తీయడమే నా లక్ష్యం’ అంటున్న డాలీ, సినిమాపైన ఇష్టాన్నీ, దాన్ని కెరీర్‌గా మల్చుకున్న తీరునీ వివరిస్తున్నారిలా..!

చిన్నప్పట్నుంచీ అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలంటే బాగా ఇష్టం. అమితాబ్‌ సినిమాలు చూస్తే ఇంట్లోనూ ఏం అనేవారు కాదు. ఎందుకంటే అమ్మానాన్నలకీ ఆయన అభిమాన హీరో. అమితాబ్‌ సినిమాలతో మొదలైనా, క్రమంగా అన్ని సినిమాలూ చూడడం అలవాటైపోయింది. నేను పుట్టింది విజయవాడలో. పెరిగింది విజయనగరంలో. నాన్న అక్కడ వ్యాపారం చేసేవారు. అమ్మానాన్నలకు మేం ఆరుగురం. అన్నయ్య, నేను- ఇద్దరమే అబ్బాయిలం. అందరిలోకీ నేనే చిన్న. చదువులోనూ టాప్‌-10లో ఉండేవాణ్ని. విజయనగరంలో సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియెట్‌ ధర్మపురి కాలేజీలో, బీకామ్‌ మహారాజా కాలేజీలో చదివాను. తర్వాత విజయనగరంలోనే ‘ఎం.వి.జి.ఆర్‌.లా కాలేజీ’లో లా కోర్సు చేశాను. న్యాయవాది అయిపోయి కేసులు వాదించేయాలని కాదు, డిగ్రీ తర్వాత మా స్నేహితులంతా లా కోర్సులో చేరారు. అందుకని! కొన్నిరోజులు ప్రాక్టీసు చేశాను కూడా. ఇంటర్లో ఎం.పి.సి. తర్వాత బీకామ్‌, ఆపైన లా... భిన్నమైన సబ్జెక్టులు చదవడంవల్ల విభిన్న అంశాలపైన అవగాహన సినిమాలకు పనికొచ్చింది. స్కూలూ, కాలేజీల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, నాటకాల్లోనూ పాల్గొనేవాణ్ని. కొన్నిసార్లు నటుడిగా చేస్తే మరికొన్నిసార్లు స్టేజీవెనక పాత్ర పోషించేవాణ్ని. లయన్స్‌ క్లబ్‌కు అనుబంధంగా ఉండే యువకుల విభాగం ‘లియో క్లబ్‌’లో సభ్యుడిగా ఉన్నాను. పట్టణ, జోనల్‌ స్థాయిలో కార్యనిర్వాహక పదవులూ చేపట్టాను. అక్కడ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాను.

హైదరాబాద్‌ ప్రయాణం
మాది రాజస్థాన్‌ నుంచి వచ్చిన కుటుంబం. అందుకే హిందీ సినిమాలే ఎక్కువగా చూసేవాణ్ని. విజయనగరంలో తెలుగు సినిమాలు మాత్రమే రిలీజయ్యేవి. హిందీ సినిమాలు రిలీజైన ఏడాదికి వచ్చేవి. వైజాగ్‌లో బంధువుల ఇంటికి వెళ్లినపుడు కొత్త సినిమాలు చూసేవాణ్ని. అలా వెళ్లినపుడు రోజులో రెండు మూడు సినిమాలు చూస్తేకానీ తృప్తి ఉండేది కాదు. ‘క్రాంతి పిక్చర్స్‌’ క్రాంతిరెడ్డి గారు వైజాగ్‌ ప్రాంతానికి సినిమా పంపిణీదారు. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. అప్పట్లో విజయనగరంలో మూడు థియేటర్లని ఆయన లీజుకు తీసుకున్నారు. కాలేజీ రోజుల్లో టికెట్‌ అవసరం లేకుండా వెళ్లి ఆ థియేటర్లలో సినిమాలు చూసేవాణ్ని. చాలావరకూ సినిమా రిలీజ్‌ రోజున మార్నింగ్‌షో చూసేవాణ్ని. నాకు నచ్చితే మళ్లీమళ్లీ చూసేవాణ్ని. ఒక్కోసారి సినిమా మొత్తం కాకుండా అరగంట, గంట కూడా చూసొచ్చేవాణ్ని. నాకు టైమ్‌ పాసంటే సినిమానే. చివరకు రెడ్డిగారి సాయంతోనే 1999 ప్రాంతంలో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఇక్కడ దర్శకుడు వి.వి.వినాయక్‌, నిర్మాత నల్లమలపు బుజ్జిలతో కలిసి రూమ్‌లో ఉండేవాణ్ని. జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలో ఉండే ఆ గదికి నిత్యం కొత్తవాళ్లు వచ్చేవారు. అందుకే ఆ గదిని ‘పుష్పక విమానం’ అనేవాళ్లం. అది ‘లక్కీ రూమ్‌’ కూడా. దర్శకుడు సుకుమార్‌ కొన్నాళ్లు ఆ గదిలో ఉన్నారు. ఆ గదిలోనే ఉన్న యోగి, వాసువర్మ తాజాగా విక్కీ దర్శకులయ్యారు. వినయ్‌ గారు చాలా నిదానమైన మనిషి. సినిమాని ప్రేమించే వ్యక్తి. రూమ్మేట్స్‌ అందరం సినిమాలు చూస్తూ వాటి గురించి చర్చించుకునేవాళ్లం. చేతిలో డబ్బుంటే వీడియో క్యాసెట్‌లూ, సీడీలూ కొని తెచ్చేవాళ్లం. మా గదిలోనే ఒక వీడియో లైబ్రరీ ఉండేది. వినయ్‌ దగ్గర ఆది, దిల్‌, లక్ష్మీ, బన్నీ... ఇలా చాలా సినిమాలకు స్క్రిప్టు వర్కులో పనిచేశాను. ఇప్పటికీ మామధ్య సినిమాల గురించి చర్చ ఉంటుంది. తర్వాత శ్రీను వైట్ల దగ్గర ‘ఆనందం’కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. నాకు మొదట్నుంచీ సెట్స్‌లోకంటే కథ, స్క్రిప్టుమీద పని చేయడంపైనే ఆసక్తి.

మొదటి సినిమా
2009లో వచ్చిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ దర్శకుడిగా నా మొదటి సినిమా. అప్పటికి కొన్నాళ్ల నుంచీ కథ చెప్పమని బుజ్జి అడిగేవారు. తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లల జీవితంపైన ఎలా ఉంటుందో చెప్పే లైన్‌ ఎంచుకొని కథ అల్లుకున్నాను. అందులో సిద్దార్థ్‌, తమన్నా హీరోహీరోయిన్లు. మనం ఉత్తరాది నుంచి సాంకేతిక నిపుణుల్నీ, గాయనీగాయకుల్నీ, నటీనటుల్నీ తెస్తున్నాం. కానీ సంగీత దర్శకుల్ని తీసుకురావడంలేదు. ‘దిల్‌ చాహ్‌తాహై’ పాటలు నాకు బాగా ఇష్టం. వాటిని కంపోజ్‌ చేసిన ‘శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌’ త్రయాన్ని ఆ సినిమాకి పెడదామని బుజ్జిగారికి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే అన్నారు. అదే సమయంలో వారు ఒక మ్యూజిక్‌షో చేయడానికి హైదరాబాద్‌ రావడంతో వారిని కలిసి కథ వినిపించాం. వాళ్లతో చేయడంవల్ల పాటలకు పూర్తిగా కొత్తదనం వచ్చింది. ‘మా పేరెంట్‌ü్స విడిపోయారు. వాళ్లకి ఈ సినిమా చూపిస్తే బావుణ్ను’ అని నాతో చాలామంది చెప్పారు. సినిమాలో బ్రహ్మానందంగారి పాత్ర ‘గచ్చిబౌలి దివాకర్‌’ బాగా పాపులర్‌ అయింది. సినిమాకు అవార్డుల పంట పండింది. మరో రెండు భాషల్లో దీన్ని రీమేక్‌ చేశారు కూడా.

ఒకటే సందడి...
‘కొంచెం ఇష్టం... ’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు భిన్నమైన నవలలూ, కథలూ చదివే అలవాటుంది. అందుకే ఒకే తరహా కాకుండా రకరకాల కథాంశాలతో సినిమాలు తీయాలనుకుంటాను. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి అలానే తీస్తారు. మొదట కుటుంబ కథా చిత్రం తీశాను. రెండోది దానికి భిన్నంగా ఉండాలనుకున్నాను. కానీ, అందరూ ‘మాకూ అలాంటి సినిమా కావాలి, తీస్తారా’ అని అడిగేవారు. దాంతో అవకాశాలు వదులుకున్నాను. అప్పటికి నా దగ్గర కొన్ని కథలకు బేసిక్‌ లైన్లు ఉన్నాయి కూడా! నా దగ్గరున్న మరో కథని వినిపించాలని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ గారిని కలిస్తే... ఆయన దగ్గర అప్పటికి ఓ తమిళ సినిమా రీమేక్‌ హక్కులున్నాయి. దాన్ని ముందు చేద్దామన్నారు. అదే నాగచైతన్య, సునీల్‌ నటించిన ‘తడాఖా’. రీమేక్‌ని అచ్చం అలానే తీయడం నాకు నచ్చదు. బేసిక్‌ లైన్‌ను ఉంచి స్వేచ్ఛ ఇవ్వమని అడుగుతాను. ‘తడాఖా’ కథ గురించి సురేష్‌గారిని పది రోజులు సమయం అడిగి కొన్ని మార్పులు చేశాను. ఆ సినిమా బాగా ఆడింది. హిందీలో వచ్చిన ‘ఓమైగాడ్‌’ని రీమేక్‌ చేద్దామని నిర్మాత సురేష్‌బాబు గారు అన్నపుడు కొత్తదనం ఉందని వెంటనే అంగీకరించాను. అదే ‘గోపాల గోపాల’... ఆ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ గారిని దేవుడి పాత్రకు అనుకున్నాక దాని స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. పవన్‌కి సరిపోయేలా పాత్ర నిడివిని పెంచాం. ‘సినిమా మొత్తం మీ పాత్ర చెరగని చిరునవ్వుతో కనిపిస్తుంది’ అని పవన్‌కి చెప్పాను. ఆ అంశం ఆయనకు బాగా నచ్చింది. ఆ సినిమా సమయంలో కృష్ణుడి గురించి నేను కూడా బాగా చదివాను. అది ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే! ఆ సినిమా రిలీజ్‌కు ముందే నాతో మరో సినిమా చేస్తానని పవన్‌ చెప్పడంతో నా ఆనందానికి అవధుల్లేవు. చెప్పినట్టే పవన్‌ ఈసారి ‘కాటమరాయుడు’కి అవకాశం ఇచ్చారు. పవన్‌తో పనిచేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆయన ప్రతిభ ఉన్న నటుడే కాదు, సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి కూడా. ఆయనుంటే సెట్‌ మొత్తం సరదాగా, సందడిగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలనిపిస్తుంది. ‘కాటమరాయుడు’ నా కెరీర్‌లో మరో హిట్‌. ‘గోపాల గోపాల’ కథని కల్యాణ్‌గారికంటే ముందు నిర్మాత శరత్‌ మరార్‌గారు విన్నారు. అంతకు ముందు ఆయనతో పెద్దగా పరిచయంలేదు. మా సమావేశం జరిగిన 15 నిమిషాల తర్వాత ఫోన్‌చేసి ‘మనం మున్ముందు చాలా దూరం ప్రయాణిస్తాం’ అని చెప్పారు. ‘కాటమరాయుడు’తో ఆ మాటలు నిజమయ్యాయి. ఏదైనా సమస్య ఉంటే హైరానా పడిపోకుండా కూర్చొని మాట్లాడుతూ పరిష్కారం కోసం ఆలోచించే స్వభావం శరత్‌ గారిది. అలాంటివారితో మళ్లీ మళ్లీ పనిచేయాలనిపిస్తుంది.

దానికంటే ఇదే మేలు
మొదట్నుంచీ నేను స్వేచ్ఛాజీవిని. చిన్నప్పుడు ఇంట్లో ఆంక్షలు పెట్టలేదు. బయటనుంచి లేటుగా వస్తే తిన్నావా లేదా అని అడిగేవారు తప్ప, ఎక్కడికి వెళ్లొచ్చావని అడగేవారు కాదు. అలాగని ఆ స్వేచ్ఛని నేను దుర్వినియోగం చేసుకోలేదు. స్వేచ్ఛకన్నా సృష్టిలో మరేదీ పెద్దది కాదు. స్వేచ్ఛ ఉంటేనే ఆలోచనా పరిధి పెరుగుతుంది, జీవితం ఆనందంగా ఉంటుంది. కోరికలు తక్కువ ఉంటే కష్టాలూ తక్కువే. హైదరాబాద్‌లో తినడానికీ ఉండడానికీ నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. నాకు రెండే కోరికలు సినిమా చూడాలి, సినిమా తీయాలి. వాటికి ఎప్పుడూ ఇబ్బంది కాలేదు. రీమేక్‌లే చేస్తున్నానన్న అసంతృప్తి కూడా నాకులేదు. నిజానికి ప్రతి సినిమాకీ ఎక్కడో ఒక దగ్గర స్ఫూర్తి ఉంటుంది. అది చెప్పి న్యాయబద్ధంగా చేస్తే రీమేక్‌. చెప్పకుండా చేస్తే ఫ్రీమేక్‌. అలాంటపుడు ఫ్రీమేక్‌ కంటే రీమేక్‌ మంచి పనే కదా! దీపక్‌, విక్కీ, వాసు, శ్రీను, క్రాంతి రెడ్డి... వీరంతా నా మిత్ర బృందం. వీరే నా బలం.

నాకు చాలా తొందరగా బోర్‌కొట్టేస్తుంది. ఒక పుస్తకాన్ని ఒకేసారి పూర్తిచేయలేను. కొన్ని పేజీలు చదివి మరో కొత్త పుస్తకం చదువుతాను. కొన్ని రోజులకు మళ్లీ పాత పుస్తకం తిరగేస్తాను. అలా ప్రతిదాంట్లోనూ కొత్తదనం వెతుక్కుంటాను. సినిమా రంగంలో ప్రతీరోజూ కొత్తగా ఉంటుంది. కథ, సెట్‌, మాటలు, పాటలు, నటీనటులు... ఆ కొత్తదనం నాకు నచ్చుతుంది. అందుకే ఇక్కడ కొనసాగగలుగుతున్నాను. దానికితోడు మన ఆలోచనల్ని లక్షల మందితో పంచుకోవచ్చు. నాకు సినిమాతోనే పెళ్లి అయింది... కాబట్టి మరో పెళ్లి చేసుకోలేదు. వివాహబంధంమీద నాకంత నమ్మకంలేదు. ఈ విషయమై ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. తర్వాత అర్థం చేసుకున్నారు. నాకు ఒంటరితనం బాగా ఇష్టం. ఖాళీ దొరికితే బ్యాగులో రెండు జతల బట్టలు వేసుకొని ఒకరిద్దరు ఫ్రెండ్స్‌ని తీసుకొని కారులో దూరప్రయాణానికి వెళ్లిపోతాను. భార్యా, పిల్లలూ ఉన్నవారికి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉండదు. అలా వెళ్లినపుడు మామధ్య సినిమా అంశాలు చర్చకు వస్తాయి. ఒక్కోసారి కథ ఆలోచన కూడా రావొచ్చు. ప్రస్తుతం నా దగ్గర రెండు మూడు కథల లైన్లు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయి స్క్రిప్టులుగా తీర్చిదిద్దడమే నా ముందున్న పని!

ఇంకొంత...

మా బంధువులు రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో ఉన్నారు. ఎప్పుడైనా వాళ్లని చూసొస్తాను. అన్నయ్య విజయనగరంలో ఉంటాడు. అప్పుడప్పుడూ అక్కడికి వెళ్తుంటాను. అమ్మానాన్నా ఉన్నన్ని రోజులూ అన్నయ్యే చూసుకున్నాడు.
* వైజాగ్‌ తరచూ వెళ్తాను. వీలైతే రోజంతా బీచ్‌లో కూర్చుంటాను.
* ఎప్పుడు టైమ్‌ దొరికినా యోగా చేస్తాను. యోగా, ధ్యానంతో ప్రశాంతత వస్తుంది. వ్యాయామాలు చేయాలి. కానీ, కండబలంతోపాటు మానసిక బలమూ ముఖ్యమే.
* ఇంట్లో ట్రెడ్‌మిల్‌ ఉంది. దానిపైన నడుస్తూ... టీవీలో ఇంగ్లిష్‌ సీరియల్స్‌ చూస్తుంటాను.
* ‘డాలీ’ పేరుతో ఇంట్లోవాళ్లు పిలిచేవారు. తరవాత సినిమా స్నేహితులకి తెలిసింది. వాళ్లూ అలానే పిలవడం మొదలుపెట్టారు.
* రోడ్డు ప్రయాణం చాలా ఇష్టం. కారు తీశాకే ఎటువైపన్నది నిర్ణయించుకున్న రోజులున్నాయి. బయట తిరుగుతుంటే కంటికి ఏదో కొత్తదనం ఉంటుంది. రూమ్‌లో కూర్చుంటే బోర్‌ కొడుతుంది.
* సంజయ్‌లీలా భన్సాలీ నా అభిమాన దర్శకుడు. కొత్త సినిమాలతోపాటు అన్ని భాషల్లోనూ పాత సినిమాలు చూస్తుంటాను. చాలాసార్లు అలా సినిమాలు చూస్తూండగానే తెల్లవారిపోతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.