close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్రికెటర్లు అవ్వాలనుకున్నారు కానీ...

క్రికెటర్లు అవ్వాలనుకున్నారు కానీ...

వేసవి వచ్చిందంటే ఐపీఎల్‌ మొదలవుతుంది. ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ పండగ. అంటే, భారతీయులందరి పండగ. భారతీయులు పెద్దయ్యాక ఏ వృత్తిలోనైనా స్థిరపడొచ్చుకానీ చిన్నపుడు మాత్రం క్రికెటర్‌ అవ్వాలనుకుంటారు. ఆ జాబితాలో సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ కూడా ఉన్నారు!

సత్య... ఓ ఆఫ్‌ స్పిన్నర్‌!

మైక్రోసాఫ్ట్‌ సీయీవో సత్య నాదెళ్ల చిన్నపుడు క్రికెటర్‌ అవ్వాలని కలలు కనేవారట. ‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌’ విద్యార్థి అయిన సత్య... రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. ‘స్కూల్‌, జూనియర్‌ స్థాయి వరకూ క్రికెట్‌ ఆడాను. ఆపైన క్రికెట్‌లో ముందుకు వెళ్లే పరిస్థితిలేదని అర్థమైంది. ఆ సమయంలో ‘ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’ రంగంపైన ఆసక్తి కలిగింది’’ అని చెబుతారు సత్య. బృందంతో కలిసి పనిచేయడంతోపాటు నాయకుడు ఎలా ఉండాలో క్రికెట్‌ నేర్పిందని చెప్పే సత్యాకు టెస్టు క్రికెట్‌ అంటే ఇష్టమట. ఆప్‌లో మ్యాచ్‌ల అప్‌డేట్స్‌ చూసుకుంటారట.

ఆరోజుని మర్చిపోలేదు

గూగుల్‌ సీయీవో సుందర్‌ పిచాయ్‌... చిన్నప్పట్నుంచీ క్రికెట్‌ని ఫాలో అవుతున్నారు. సునీల్‌ గవాస్కర్‌కి వీరాభిమాని అయిన సుందర్‌ ఆయనలా మంచి బ్యాట్స్‌మన్‌ కావాలని కలలుగనేవారట. స్కూల్‌, కాలేజీ రోజుల్లో క్రికెట్‌ బాగా ఆడేవారు. ‘1986లో చెన్నైలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌కి అయిదోరోజునాడు టికెట్‌ దొరికింది. మ్యాచ్‌ డ్రా అవుతుందని ఆరోజు ఎక్కువమంది రాలేదు. నేను మాత్రం వెళ్లాను. ఆ మ్యాచ్‌ చాలా మలుపులు తిరిగి చివరకు టై(స్కోర్లు సమం)గా ముగిసింది. అదే క్రికెట్‌లోని మజా. ఆరోజుని ఇప్పటికీ మర్చిపోలేను’ అంటారు సుందర్‌.

ఆట నుంచి మాటకు...

క్రికెటర్లకు తీసిపోని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షభోగ్లే. హర్ష చదివింది హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో. ఆ స్కూల్‌ క్రికెట్‌ జట్టులో ఆటగాడు. ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసే సమయంలో అజారుద్దీన్‌, కిరణ్‌కుమార్‌ రెడ్డి, అర్షద్‌ ఆయూబ్‌లతో కలిసి విశ్వవిద్యాలయం జట్టు తరఫున ఆడారు కూడా. క్రికెట్‌ ఆడుతూనే 19ఏళ్లకే రేడియోలో క్రికెట్‌ వ్యాఖ్యానం చేశారు. తర్వాత క్రికెటర్‌ కాలేకపోయినా వ్యాఖ్యాత అయ్యారు.

క్రికెట్‌ ఎన్నో నేర్పింది...

సంజయ్‌ పార్థసారధి... అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘ఇండిక్స్‌’ సీయీవో, మైక్రోసాఫ్ట్‌లో సత్యాకి సీనియర్‌. ఈయన తమిళనాడు తరఫున అండర్‌-15, 19, 22 జట్లకూ, సౌత్‌జోన్‌ తరఫున అండర్‌-15, 19 జట్లకూ, యూనివర్సిటీ స్థాయిలోనూ ఆడారు. ‘జాతీయ జట్టుకి ఎంపిక కాలేకపోయినా క్రికెట్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా క్రికెట్‌ నాకు ఓర్పు నేర్పింది. ఒక్కోసారి చివరి బంతికి ఫలితం మారుతుంది. అలాగే ఏ పనిలోనైనా నిరుత్సాహపడకుండా ఆఖరి నిమిషం వరకూ ప్రయత్నిస్తే ఫలితంలో మార్పురావొచ్చు’ అని చెబుతారు సంజయ్‌.

దేశాన్ని చూపించింది...

ప్రకటనల రంగంలో సేవలకుగానూ ఇటీవల ‘పద్మశ్రీ’ పొందిన పీయూష్‌ పాండే కూడా ఒకప్పుడు క్రికెటర్‌. ఫెవికాల్‌, ఫెవిక్విక్‌, వొడాఫోన్‌ జూజూ ప్రకటనల సృష్టికర్త అయిన పీయూష్‌... రాజస్థాన్‌ రంజీ క్రికెటర్‌. తర్వాత ప్రకటనల సంస్థ ‘ఓఅండ్‌ఎమ్‌- ఇండియా’లో అకౌంట్స్‌ విభాగంలో సాధారణ ఉద్యోగిగా చేరారు. ప్రస్తుతం సంస్థ భారతీయ విభాగానికి కో-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, నేషనల్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ‘క్రికెట్‌వల్ల దేశమంతా చూసే అవకాశం వచ్చింది. అప్పట్లో జనరల్‌ బోగీల్లో ప్రయాణించి గ్రామీణ భారత్‌ను బాగా అర్థం చేసుకున్నాను’ అని చెబుతారు పాండే.

ఆ సందేహాలన్నీ మేం తీరుస్తాం!

సొంతంగా ఓ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు. ఆలోచన, పెట్టుబడి, ఆచరణ ప్రణాళిక... అన్నీ సిద్ధం. కానీ ప్రభుత్వ అనుమతులు ఎలా పొందాలో, ఏ విభాగానికి దరఖాస్తు చేయాలో, ఏయే పత్రాలు సమర్పించాలో, ఎన్ని రోజులు పడుతుందో... తెలీదు. ఓ న్యాయసలహా పొందాలంటే - తగిన లాయరెవరో తెలుసుకుని, అప్పాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. పనులు మానుకుని వెళ్లాలి. రెండు నిమిషాలు మాట్లాడినా, రెండు గంటలు మాట్లాడినా మొత్తం ఫీజు చెల్లించాలి. సమయం, శ్రమ, ఖర్చు... ఏవీ తప్పవు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఓ యువకుడు ఈ పరిస్థితులకు చూపిన పరిష్కారమే వకీల్‌సెర్చ్‌.కామ్‌.

న్యాయసంబంధ విషయాలు తెలుసుకోవాలంటే ఆన్‌లైన్లో చాలా రకాల వెబ్‌సైట్లున్నాయి. వకీల్‌సెర్చ్‌.కామ్‌ వాటికన్నా భిన్నంగా సేవలందిస్తూ ఆసియాలోనే అతి పెద్ద న్యాయసేవల వేదికగా పేరొందింది. అందుకు కారణం ఈ వెబ్‌సైట్‌ సృష్టికర్త, వ్యవస్థాపక సీఈవో హృషికేశ్‌ దాతార్‌. హృషికేశ్‌ 2010లో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌నుంచి పట్టా పొందాడు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కి వెళ్తే పెద్ద కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగమొచ్చేది. కానీ అతడు పట్టా పట్టుకుని తిన్నగా ఇంటికొచ్చేశాడు. ఏడాది పాటు రకరకాల ఆలోచనలతో కుస్తీపట్టి చివరికి వకీల్‌సెర్చ్‌.కామ్‌ స్టార్టప్‌కి శ్రీకారం చుట్టాడు. 2011లో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటూ వేలాది వినియోగదారులకు సలహాలూ సూచనలూ ఇస్తూ విజయపథంలో దూసుకుపోతోంది.

ఆలోచనే నాంది
హృషికేశ్‌ కుటుంబంలో లా చదువు వారసత్వంగా వస్తోంది. అతని తండ్రి మద్రాస్‌ హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాది. దాంతో సహజంగానే హృషికేశ్‌ని న్యాయశాస్త్రం ఆకర్షించింది. లా చదివేటప్పుడు ఓసారి బెంగళూరు ఐఐఎంకి వెళ్లిన హృషికేశ్‌ తనలో ఓ వ్యాపారి కూడా ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. చదువుతూనే టీషర్టుల వ్యాపారంలోకి దిగాడు. వ్యాపారంలో ఎన్ని కోణాలుంటాయో ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాడు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వివిధ న్యాయసహాయ సంస్థల్లో పనిచేసిన అనుభవం మరికొన్ని కొత్త ఆలోచనలకు అంకురార్పణ చేసింది. వందలకోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో న్యాయసహాయం అందరికీ అందని మానిపండని అర్థమైంది. నమ్మదగిన, స్తోమతకు తగిన, స్నేహపూర్వక సహాయం అందక మధ్యతరగతి వారే అవస్థలు పడుతోంటే ఇక నిరుపేదల సంగతేమిటన్న ఆలోచన అతడిని కదిలించింది. ఒక్క లీగల్‌ విభాగంలోనే కాదు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని అర్థమైంది. అందుకే అన్నిరకాల సేవలూ ఒకేచోట లభ్యమయ్యేలా వకీల్‌సెర్చ్‌.కామ్‌ రూపొందించాడు హృషికేశ్‌. సాంకేతికత సహాయంతో న్యాయ సమస్యల పరిష్కారానికి పూనుకున్నాడు.

వినియోగదారుల సంతృప్తి, విభిన్న, విస్తృత సేవలు అందించడం, అత్యంత సులువైన సాంకేతికత... ఇవే తమ సంస్థ విజయానికి కారణమంటాడు హృషికేశ్‌. ఎంబీఏ చదవకుండానే హృషికేశ్‌ వ్యాపారరంగంలో రాణించగలుగుతున్నాడంటే అందుకు కారణం... అతడి దృష్టిలో వ్యాపారమంటే మనుషులు, జీవితం- రెండిటినీ మేనేజ్‌ చేయడం. దాన్ని కళాశాలలో నేర్పించరనీ ఆచరణ ద్వారానే నేర్చుకుంటామనీ నమ్ముతాడు హృషికేశ్‌. అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం కొంతవరకూ మాత్రమే ఉపయోగపడుతుందన్నది అతని అభిప్రాయం.

ఎలా పనిచేస్తుందంటే...
వకీల్‌సెర్చ్‌కి ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో కార్యాలయాలున్నాయి. పారదర్శకత, సమర్థత, విశ్వసనీయత... ఈ మూడూ ప్రధానలక్ష్యాలుగా దేశవ్యాప్త వినియోగదారులకు సేవలందిస్తున్న వకీల్‌సెర్చ్‌ చిన్న వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటోంది. సాధారణ పౌరులకు ఆర్‌టీఐ దరఖాస్తు నింపడం, ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలుచేయడంతో మొదలుపెట్టి, వివిధ వ్యాపారాలకు అనుమతులు పొందడం, ట్రేడ్‌ మార్క్‌, కాపీరైట్‌, పేటెంట్‌లాంటివి పొందడం, కాంట్రాక్టులూ తదితరాలకు లీగల్‌ డాక్యుమెంట్లు తయారుచేసుకోవడం, వ్యాపార నిర్వహణ క్రమంలో తలెత్తే పలు సందేహాలకు సలహాలివ్వడం... ఇవన్నీ ఈ వెబ్‌సైట్‌ ద్వారా జరుగుతున్నాయి. ఇందుకోసం లాయర్స్‌ నెట్‌వర్క్‌ ఉంది. బ్రాండ్‌ నిర్మాణం, మార్కెటింగ్‌ తదితరాల గురించీ సలహాలిస్తారు. ఆయా సేవలకు రుసుము రూ.299 - 799 మధ్య ఉంటుంది. ‘వీలునామా రాయడం ఎలా, చెక్‌ బౌన్స్‌ అయితే ఏం చేయాలి’ లాంటి సాధారణ సేవలకు సంబంధించిన ఒకో ప్రశ్నకు రూ.149 చొప్పున వసూలుచేస్తారు.అనుభవజ్ఞులైన సలహాదార్లూ మెంటార్లూ ఉండడం ఈ వెబ్‌సైట్‌కి వ్యాపారపరంగా తోడ్పడుతోంది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీతో కలిసి పనిచేస్తూ వారి సభ్యులకూ సేవలందిస్తోంది. ప్రస్తుతం దేశంలోని దాదాపు ఐదు శాతం ట్రేడ్‌మార్కులకు సంబంధించిన పని వకీల్‌సెర్చ్‌ చేస్తోంది. ట్యాక్సీ ఫర్‌ ష్యూర్‌ నుంచి సులేఖా వరకూ పలు సంస్థలు వీరికి క్లయింట్లుగా ఉన్నాయి.

మిగతా స్టార్టప్స్‌ లాగే హృషికేశ్‌కీ చాలా సవాళ్లే ఎదురయ్యాయి. బిజినెస్‌, లీగల్‌ అంశాల్లో విశ్వసనీయత ముఖ్యం. ముఖాముఖి కలిసి మాట్లాడితేనే కానీ సంతృప్తి చెందరు. ఆ దృక్పథాన్ని మార్చి మెప్పించడానికి చాలానే కష్టపడింది వకీల్‌సెర్చ్‌ టీం. తమ పనిపై తమకు నమ్మకముంటే ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చనే హృషికేశ్‌ మరో ఐదేళ్ల తర్వాత ఏటా 10 లక్షల వినియోగదారులకు సేవలందించగల బిలియన్‌ డాలర్‌ బిజినెస్‌గా తమ వ్యాపారాన్ని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆసియాలోనే అతి పెద్ద లీగల్‌ సర్వీస్‌ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న తమ సంస్థని ఈ ఏడాది చివరికల్లా 100 నగరాలకు విస్తరించాలనీ త్వరలోనే ఇతర దేశాలకు సేవలందించాలనీ ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నాడు. వినియోగదారులకు విలువైన సమయాన్ని ఆదా చేయగలగడం, వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడడం తనకు తృప్తినిస్తాయనే హృషికేశ్‌ యువతకు స్టీవ్‌జాబ్స్‌ మాటలనే గుర్తుచేస్తాడు. ‘భవిష్యత్తు గురించి అనిశ్చితత్వానికి సిద్ధంగా ఉండండి. కొత్త కొత్త వాటిని ప్రయత్నిస్తూ మిమ్మల్ని నిజంగా కదిలించేదేదో తెలుసుకోండి. స్టీవ్‌ జాబ్స్‌ చెప్పింది గుర్తుంచుకోండి.. ఎప్పుడూ ఒక్కచోట సెటిల్‌ కావద్దు’ అన్నది హృషికేశ్‌ వారికిస్తున్న సలహా.

ఇది నిద్రాదానం!

చాలా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా ఎక్కువే. డ్రైవర్లు నిద్రలేకుండా వాహనాల్ని నడపడమే దీనికి ప్రధాన కారణం. మరి అలా నిద్ర ‘లేని’ వాళ్లకోసం మొదలయ్యిందే ‘నిద్రాదాన్‌’. రోడ్ల మీద జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు తన వంతు బాధ్యతగా ఓ వ్యక్తి చేసిన మేలైన ఆలోచన ఇది.

కలిగా ఉన్నవాడికి అన్నం దానం చేయడం గొప్పది. మరి నిద్రకు కరవు పడ్డ వాళ్ల గురించి మనమెప్పుడైనా ఆలోచించామా... రాష్ట్రాలు దాటుకుంటూ రోడ్ల మీద బండిని నడిపే డ్రైవర్ల పరిస్థితిని వూహించామా?! వాళ్లను అడిగితే ఎక్కడైనా కాస్త ప్రశాంతంగా నిద్రపోయే చోటు దొరికితే బాగుణ్ణు... అనే అంటారు. జాతీయ రహదారుల మీద నిద్ర లేకుండా రోజుల తరబడి బండి నడిపే వాళ్లకు ఓ చోట చక్కగా నిద్ర పోయే సౌకర్యాన్ని ఉచితంగా కల్పించేదే ‘డ్రైవర్‌ సర్వీస్‌ సెంటర్‌’... అదే, ‘నిద్రాదాన్‌’.

నిద్రే కారణం...
ఆల్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం 2012 సంవత్సరంలో సుమారు లక్షా ముప్పైతొమ్మిది వేల పైచిలుకు మరణాలు రోడ్డు ప్రమాదాల వల్ల జరిగితే అందులో నిద్రలేమి కారణంగా జరిగినవి ఇరవై ఆరున్నర వేలకు పైనే. 2013లో సంభవించిన లక్షా ముప్పైఏడు వేలకు పైన మరణాల్లో ఇరవైనాలుగు వేలకుపైగా వాటికి కారణం కూడా నిద్రాలోపమే. మొత్తంగా చెప్పాలంటే ఏడాదిలో రోడ్డు ప్రమాదాల వల్ల లక్షన్నర మంది చనిపోతుంటే అందులో పాతికవేలకు పైగా మరణాలకు నిద్రలేమే కారణం. ఓసారి ఇస్తాంబుల్‌లో రోడ్డు రవాణా అంశం మీద జరిగిన ఓ సదస్సుకు వెళ్లారు అగర్వాల్‌ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ అధినేత రమేష్‌ అగర్వాల్‌. అందులో ఓ వక్త మాట్లాడుతూ ఇండియా రోడ్డు ప్రమాదాల్లో ముందుంటుంది అని చెబితే... ఇంగ్లిష్‌ అర్థం చేసుకోవడంలో కాస్త ఇబ్బంది ఉన్న రమేష్‌ మన దేశాన్ని ఏదో అంశంలో పొగిడారు అనుకుని చప్పట్లు కొట్టారట. అప్పుడందరూ ఈయన్ను వింతగా చూడటంతో చప్పట్లు ఆపేసినా... ఇంతకీ అక్కడ మాట్లాడిందేమిటి అన్న అంశం మీద రమేష్‌ దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలతో పాటూ, వీటిలో చాలా రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిద్రలేమే కారణమన్న విషయాన్నీ తెలుసుకున్నారు. దీన్ని నిర్మూలించాలంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని సంకల్పించారు. హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని డ్రైవర్లతో మాట్లాడారు. తన ఆలోచనను తన తమ్ముడు రాజేందర్‌తో పంచుకొన్నారు. చివరకు డ్రైవర్లు నిద్రపోయేందుకు ఒక ఏర్పాటు చేయడమే మంచి మార్గమన్న నిర్ణయానికి వచ్చారు. దాని ఫలితమే 2012లో మొదలైన నిద్రాదాన్‌ కేంద్రం.

డ్రైవర్ల సేవకు...
దేశరాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలను కలిపే ఎనిమిదో నంబరు జాతీయ రహదారి మన దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన రోడ్డు మార్గం. ఆ రహదారిలోనే జైపూర్‌-అజ్మేర్‌ మధ్య 50 ఎకరాల స్థలాన్ని నిద్రాదాన్‌ కేంద్రంకోసం కేటాయించుకున్నారు. అక్కడ ఏడు భవంతులను నిర్మించారు. వాటిలో 500 మంది డ్రైవర్లు నిద్రపోవచ్చు. ఫ్యాన్లూ, దుప్పట్లను ఏర్పాటు చేశారు. వాళ్ల ట్రక్కులు నిలుపుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని పక్కనే ఏర్పాటు చేశారు. అందులోని సామాన్లకు భద్రతగా ఉండేందుకు పదిమంది భద్రతా సిబ్బందిని నియమించారు. సాధారణంగా కొందరు డ్రైవర్లు లారీలోనే పడుకుంటారు. మరి కొందరు రోడ్ల వెంట ఉండే లాడ్జీలను ఆశ్రయిస్తారు. అయితే లారీలోని సరకు పోతుందేమోనన్న భయం ఎప్పుడూ వీళ్లను సరిగా నిద్రపోనివ్వదు. దీనికి భిన్నంగా వాళ్లు ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఈ ఏర్పాటన్నమాట. ఇక అక్కడే వాహనాలకు చిన్నా చితకా రిపేర్లు చేసేందుకు ఒక రిపేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రోజుల తరబడి ప్రయాణాలు చేయడం వల్ల చాలా మంది డ్రైవర్లకు గడ్డం జుట్టూ పెరిగిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ల కోసం ఇక్కడ ఒక ఉచిత క్షవరశాలనూ ఏర్పాటు చేశారు. స్నానం చేసేందుకూ, కాలకృత్యాలు తీర్చుకునేందుకూ శుభ్రమైన బాత్రూమ్‌లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వాటిని నిరంతరం శుభ్రం చేసేందుకూ ఇక్కడ సిబ్బంది ఉంటారు. ఇక, డ్రైవర్లకు ఆహారాన్నందించేందుకూ, చిన్న చిన్న అవసరాలను తీర్చేందుకూ నామ మాత్రపు రుసుము తీసుకుని నడిచే హోటలూ, దుకాణాలున్నాయి. ఇక్కడున్న మరో ప్రత్యేక ఏర్పాటేమిటంటే... డ్రైవరు లోపలకు రాగానే ఒకరు స్వాగతం చెప్పి పళ్లెంలో కాళ్లు ఉంచి కడుగుతారు. డ్రైవర్లకు తామిస్తున్న గౌరవం ఏమిటన్న విషయం తెలిపేందుకే ఈ ఏర్పాటట. నెలకు 15వేల మంది డ్రైవర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం, దీని ఏర్పాటు తరువాత ఆ రహదారి వెంట చనిపోయేవారి సంఖ్య నెలకు నలభైకిపైగా తగ్గిందట. అంటే ఈ ఏర్పాటు నెలకు 40 మందిని రక్షిస్తోందన్న మాట! ఈ లెక్కలు ఇచ్చిన ఉత్సాహంతో ఆరో నంబరు జాతీయ రహదారి వెంట సూరత్‌, కోల్‌కతాల మధ్య మరో 250 పడకల సౌకర్యం గల నిద్రాదాన్‌ కేంద్రాన్ని సిద్ధం చేశారు. ఇలాంటి కేంద్రాలు అన్ని రాష్ట్రాల్లోనూ, ప్రధాన రహదారుల వెంటా రావాలంటారు రమేష్‌. ఈ విషయమై ఇప్పటికే ఆయన చాలా మంది ప్రభుత్వాధికారులతోనూ చర్చలు జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రమేష్‌ ఎంచుకున్న మార్గం ఎక్కడైనా ఆచరణీయమే మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.