close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జాగ్రత్త పడకుంటే జలగండమే!

డవిలో ఏ జంతువూ నీటిపైన ఆంక్షలు పెట్టదు.
ప్రకృతిలో మరే ప్రాణీ పంచ భూతాలపైన ఆధిపత్యం చలాయించదు.

మనిషి మాత్రం అన్నిటికీ అతీతం. భూగోళాన్ని ముక్కలు చేసి పంచుకున్నాడు. కాలి కింద పారే నీరంతా తనదేనన్నాడు. పాతాళానికి పైపులు వేసి అందిన కాడికి తోడేశాడు. నదీప్రవాహానికి గోడలు కట్టి విచ్చలవిడిగా వాడేశాడు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అమృత ధారల్ని కాలకూటంలా మార్చేశాడు. ఆ పాపం ఇప్పుడిప్పుడే పండుతోంది. క్రమంగా అంతర్జాతీయ సమాజం జలసంక్షోభంలో చిక్కుకుంటోంది. దేశాల మధ్య జలవివాదాలు రాజుకుంటున్నాయి. మన దగ్గర పరిస్థితి మరీ దారుణం. వేసవి ప్రతాపం పూర్తిస్థాయిలో మొదలవకముందే భూగర్భ జలాలు అందనంత లోతుకి దిగిపోయాయి. బావులూ, కాలువలూ, తటాకాలూ ఎండిపోయాయి. కడివెడు నీళ్ల కోసం గ్రామీణ మహిళలు మైళ్లదూరం వెళ్తున్నారు. గతేడాది ‘లాతూర్‌’కి పట్టిన గతి, ఈసారి తమకెక్కడ దాపరిస్తుందోనని నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పుడు ప్రతి పౌరుడూ చేయగలిగింది... పొంచి ఉన్న జల గండాన్ని సమర్థంగా ఎదుర్కోవడమే. చేయాల్సింది... భవిష్యత్తులో పరిస్థితి మరింత విషమించకుండా జాగ్రత్త పడటమే.

తోడేస్తున్నాం...
మనిషి దురాశాజీవి. అందులోనూ భారతీయులకు ఆ జాడ్యం ఇంకాస్త ఎక్కువ. సాక్షాత్తూ ఐక్య రాజ్య సమితే మనకా ముద్ర వేసింది. ఉచితంగా వస్తే దేన్నైనా విచ్చలవిడిగా వాడేస్తామని నివేదికల సాక్షిగా స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఇప్పటిదాకా వినియోగించిన భూగర్భజలాల్లో పావు వంతు వాటా మనదే. చైనా, అమెరికా దేశాలు సంయుక్తంగా వాడుకున్న నీటి కంటే ఎక్కువే తోడేశాం. అయినా సరే మన దాహం తీరట్లేదు. ప్రపంచవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న ప్రజల్లో ముప్పై శాతం మంది మన దేశంలోనే ఉన్నారు.

భూమాతకి ఎంత సహనం లేకపోతే ఇన్నేళ్లుగా మనం పొడిచిన తూట్లూ, చేసిన గాయాలను మౌనంగా భరిస్తుంది! ఒకటా, రెండా... ఇరవై లక్షల పైచిలుకు బోరుబావులు. ఇంకెక్కడా నేలపైన ఈ స్థాయిలో దాడి జరగలేదు. పోనీ వాటి ఫలాలైనా అందుతున్నాయా అంటే, అందులో సగానికి పైగా బోర్లు ఎప్పుడో సమాధయ్యాయి. మిగతావి కూడా కలుషిత జలాల్నే కక్కుతున్నాయి. ‘అభివృద్ధిలో దూసుకెళ్తొంది, ఆర్థిక వృద్ధి ఆకాశాన్నంటుతోంది’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న దేశానికి ఇంతకంటే అవమానం ఏముంటుంది!

ఉచితాల వల
దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండేది. ఆ తరవాతే ప్రజా ప్రతినిధులు ‘నిఖార్సైన రాజకీయ నేతలు’గా తయారయ్యారు. ఓటరన్నని మచ్చిక చేసుకోవడానికి అన్ని దార్లూ వెతికారు. దేశ జనాభాలో సింహ భాగం రైతులే. వాళ్లని వశ పరచుకుంటే చాలు, తమ కుర్చీ కులాసాగా ఉంటుందన్న ఆలోచన పెరిగింది. అలా ‘ఆపరేషన్‌ ఆకర్ష’ మొదలైంది. వ్యవసాయానికి విద్యుత్‌ ఉచితం, భూమి ఉంటే మోటార్లు ఉచితం, తెల్లకార్డుంటే పైపులు ఉచితం... ఇలా అనాలోచితంగా ఉచిత దండోరా వేస్తూ వచ్చారు. ధరలు అందుబాటులో ఉండటంతో జనాలు ఇష్టారాజ్యంగా బోర్లు వేశారు. విద్యుత్‌ ఉచితం కావడంతో దొరికినన్ని నీళ్లు తోడేశారు. పైగా దేశంలో నీటి వినియోగంపైన ఎలాంటి నియంత్రణా లేదు. వాడుకున్నవాళ్లకి వాడుకున్నంత! దాంతో క్రమంగా భూగర్భం వట్టిపోయింది. బోర్లు ఎండిపోయాయి. కరవు రాజ్యమేలింది. ఆఖరికి ఆ ఉచితాలే నిరుపేదల పాలిట ఉరితాళ్లయ్యాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులే స్పందించనప్పుడు, పాపం రైతన్నకేం తెలుస్తుంది... భూమిని రీఛార్జ్‌ చేయాలీ, వర్షపు నీటిని నిల్వచేయాలీ, పరిస్థితులకు తగ్గ పంటలు వేయాలీ అని. భారత్‌లో నీటి ఎద్దడికి పునాది వేసింది ఈ విధానపర లోపాలే అని ఇటీవలే యూరోపియన్‌ కమిషన్‌ తేల్చి చెప్పింది. దేశంలో నీటి కొరత వల్ల ఏర్పడిన సమస్యలకంటే, ఉన్న నీటిని సమర్థంగా ఉపయోగించుకోలేక పోవడం, పెరిగిపోయిన ప్రైవేటీకరణ, ప్రభుత్వాల వైఫల్యం, జనాల నిర్లక్ష్యం లాంటి కారణాల వల్ల ఎదురైన దుష్పరిణామాలే ఎక్కువనీ అది స్పష్టం చేసింది.

జలం నిర్జీవం
1950-60 మధ్య కాలం... అప్పుడప్పుడే భారతీయుల జీవనశైలి మారుతోంది. పారిశ్రామిక విప్లవం బుడిబుడి అడుగులేస్తోంది. స్వచ్ఛ జలానికి అప్పటికింకా కాలుష్య తాకిడిలేదు. ఆ తరవాతే అసలు కథ మొదలైంది. నెమ్మదిగా పరిశ్రమలు పెరిగాయి. జనాభా మూడింతలైంది. నీటి లభ్యత క్షీణిస్తూ వచ్చింది. క్రమంగా పారిశ్రామికవేత్తలు ‘అచ్చమైన వ్యాపారులు’గా మారారు. సంపాదనతో పాటు స్వార్థం పెరిగిపోయి పక్కవాడి గురించి ఆలోచించడం మానేశారు. అందుకే హానికారక వ్యర్థాలను నిస్సంకోచంగా నదుల్లోకి వదిలారు. ప్రాణాలు తీసే రసాయనాలను నిర్లజ్జగా నీటి కాలువల్లోకి మళ్లించారు. ఆఖరికి భూగర్భ జలాల్ని కూడా కాలుష్యంతో నాశనం చేశారు. అంతకంతకూ పెరుగుతూ వచ్చిన నగర జనాభా నీళ్ల నాణ్యతను మరింత దిగజార్చింది. నగరాల్లో ఇళ్ల నుంచి విడుదలయ్యే మురుగులో 70శాతం నదుల్లోనే కలుస్తోందని కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. పరిశ్రమల కాలుష్యం, ఇతర చెత్తాచెదారం దీనికి అదనం. ఆ నీరే నిల్వ కేంద్రాలకు చేరుతోంది. జలాశయాలూ పైపులైన్ల గుండా తిరిగి మనింటి నల్లాల్లోకే వస్తోంది. ఇంకెక్కడి మంచినీళ్లు!

నీటి విషయంలో మనది నిత్య దరిద్రం. భూమ్మీద ఉన్న మంచి నీటి నిల్వల్లో నాలుగు శాతం మనదగ్గరే ఉన్నా, ప్రతి ఏడుగురిలో ఒకరు సురక్షిత నీటికి దూరంగా ఉన్నారు. పట్టణాల్లో మరీ దారుణం... ప్రతి నలుగురిలో ఒకరు మురికినీళ్లే తాగుతున్నారు. భూమ్మీద అత్యంత అపరిశుభ్ర నీటిని తాగుతున్న దేశాల్ని జల్లెడపడితే అందులో మొదటి స్థానం మనకే దక్కింది. అక్షరాలా ఆరున్నర కోట్ల మంది భారతీయులకి మురికినీరే శరణ్యం. ఆ సంఖ్య దాదాపు ఇంగ్లండ్‌ జనాభాకు సమానం.

స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో దేశంలో ఒక్కొక్కరికీ అరవై లక్షల లీటర్ల నీళ్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడా నిల్వలు పద్దెనిమిది లక్షల లీటర్లకు పడిపోయాయి. మరో ఏడేళ్లలో అది 13.4లక్షల లీటర్లకు చేరుతుంది. కానీ అప్పటికీ ఇప్పటికీ జనాభాతో పాటు అవసరాలూ ఎన్నో రెట్లు పెరిగాయి. దేశరాజధాని దిల్లీనే తీసుకుంటే, అక్కడ ప్రజల దాహార్తి తీర్చడానికి రోజుకి దాదాపు 41లక్షల లీటర్ల నీళ్లు కావాలి. కానీ 31లక్షల లీటర్లే అందుతున్నాయి. అందులోనూ 13లక్షల లీటర్లు లీకేజీలూ, సరఫరా లోపాల వల్ల వృథా అవుతున్నాయి. అంటే రోజూ రాజధానికి సగం గొంతే తడుస్తోందన్న మాట. దేశంలోని అన్ని నగరాలదీ దాదాపుగా ఇదే పరిస్థితి.


దేశంలో రోజూ నాలుగు వేల కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదలవుతోంది. అందులో ఇరవై శాతం మాత్రమే శుద్ధి అవుతోంది. మిగతాదంతా నీటి వనరుల్లోకి అక్కడి నుంచి భూగర్భంలోకీ చేరుతోంది. దాని ఫలితం... మనం వాడుకునే నీళ్లలో 70 శాతం మురుగుతో కలుషితమైందే.


ఇంట్లో కుళాయి నుంచి సెకనుకో నీటి చుక్క వృథాగా కారుతున్నా, రోజుకి 33 లీటర్లు, ఏడాదికి దాదాపు పదకొండు వేల లీటర్ల నీరు వృథా అవుతున్నట్లు లెక్క. దేశంలోని కొన్ని గ్రామాల్లో మనిషికి వారానికి ఎనిమిది లీటర్ల నీళ్లే అందుతున్నాయి. అంటే ఒకచోట నల్లాలో ఒక్కరోజులో వృథా అయ్యే నీరు, మరోచోట నెల రోజుల పాటు ఓ మనిషి గొంతు తడుపుతుంది. చుక్క నీటి విలువ చెప్పడానికి ఇంతకంటే లెక్కలు కావాలా?

నదులు నాశనం
చుట్టూ నీళ్లే. కానీ తాగడానికి ఒక్క చుక్కా పనికిరాదు. పేరుకే అవి జీవనదులు. వాటిలో పారేది మాత్రం విష జలాలు. గత పదిహేనేళ్లుగా దేశంలో ఆటోమొబైల్‌, పెట్రో కెమికల్‌, స్టీలు, అల్యూమినియం తదితర పరిశ్రమలు వెలిగిపోతున్నాయి, ఆయా రంగాల్లో ప్రపంచానికి పోటీనిస్తున్నాం అని భుజాలు చరుచుకుంటున్నాం. కానీ నీటి కొరతా, కాలుష్యం కారణంగా ఇతర దేశాల్లో ఆ పరిశ్రమలు క్షీణిస్తున్నాయనీ, అందుకే ఇక్కడవి రాణిస్తున్నాయనీ మన మెదళ్లకు తట్టదు. దేశంలో ఇలాంటి పరిశ్రమల పరిధిలోని నదులన్నీ ఇప్పటికే అంపశయ్య మీదున్నాయి. భూగర్భ జలాలు రసాయన నిల్వ కేంద్రాలుగా మారాయి. కళ్లముందే నీళ్లు పారుతున్నా, కనీసం ఒక్క చుక్క కూడా నోట్లో వేసుకోలేని దుస్థితి. దేశ రాజధాని దిల్లీ తీరంలో-పాతికేళ్ల క్రితం దాకా-యమున స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కేది. కానీ ఇప్పుడది డెబ్బై శాతం వ్యర్థాలని మోసుకెళ్తొంది. పదకొండు రాష్ట్రాల్లో యాభై కోట్ల మందికిపైగా దాహార్తిని తీర్చే గంగమ్మ, మానవ, పారిశ్రామిక వ్యర్థాలూ, మతాచారాల వల్ల పోగైన కాలుష్యం కారణంగా కుంగి కృశించి పోయింది. తాగడానికి కాదు కదా కనీసం తాకడానికి కూడా ఆ నీళ్లు పనికిరావని భారతీయ కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. దేశంలో మిగతావారి కంటే ఆ నదీ తీరంలో నివసించే వాళ్లు క్యాన్సర్‌కి గురయ్యే ప్రమాదం ఎన్నో రెట్లు ఎక్కువని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ హెచ్చరించింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నదుల్లో గంగది నిలకడగా రెండో స్థానమే. అంతెందుకు... గతంలో లక్షల మంది గొంతు తడిపిన మూసీ, భాగ్యనగరంలో ఎలాంటి దీనావస్థలో ఉందో తెలిసిందేగా.

వలసల భారతం
నీళ్లుంటేనే అన్నం, చదువూ, ఉపాధీ, జీవితం. ఏ రాజ్యానికైనా జలసిరే సిసలైన సంపద. అదే లేనప్పుడు ప్రజల్లో అసహనం పెరుగుతుంది. పాలకుల్లో అభద్రత మొదలవుతుంది. మొత్తం వ్యవస్థే అస్తవ్యస్తమవుతుంది. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం అంతర్యుద్ధాలకూ వలసలకూ ఆజ్యం పోసింది ఆ నీరే. ఒక్క తెలంగాణలోని పల్లెల్లోనే గతేడాది తాగడానికి నీళ్లు లేక పశువుల్నీ, పాకల్నీ అమ్ముకొని దాదాపు పద్నాలుగు లక్షల మందికిపైగా వలస వెళ్లారన్నది వ్యవసాయ సంఘాల మాట. దేశ వ్యాప్తంగా ఆ సంఖ్య కోట్లలోనే ఉంటుందని అంచనా. పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలనూ కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. జనాలు వలస పోతున్నారు, కాసిని నీళ్లివ్వండంటూ ఆంధ్రప్రదేశ్‌, కేరళ ప్రభుత్వాల దగ్గర చేయిజాచింది. అంతర్జాతీయంగా యెమెన్‌, లిబియా, లెబనాన్‌ లాంటి దేశాలు నీటి కొరతతో వలస బాట పట్టాయి. పరిస్థితి ఇలాగే కొనసాగి, అదే దుస్థితి మనకొస్తే 125కోట్ల మందికి ఏ దేశం మాత్రం చోటివ్వగలదు!

ఐక్యరాజ్య సమితి 122 దేశాల్లో నీటి నాణ్యతను పరీక్షిస్తే అందులో మన స్థానం 120. 180 దేశాల్లో ప్రజలకు నీటి లభ్యతపైన సర్వే చేస్తే అందులో మనది 133వ స్థానం. ఏటా దేశంలో సంభవించే శిశు మరణాల్లో ఇరవై శాతం నీటి సంబంధిత వ్యాధుల చలవే. కలుషిత నీటి వల్ల ప్రతి పందొమ్మిది సెకన్లకూ ఒక చిన్నారి ప్రాణం గాల్లో కలుస్తోంది. అనారోగ్యాలూ, వైకల్యాలకు గురవుతున్న వాళ్ల సంఖ్యకైతే లెక్క లేదు.


గొంతులో వేడివేడి కాఫీ పడందే చాలామందికి తెల్లారదు. అలాంటి ఓ కప్పు కాఫీ తయారు చేయడానికి(చక్కెర, కాఫీపొడి, పాల ఉత్పత్తికి) అక్షరాలా 140లీటర్ల నీళ్లు కావాలి. ఒక టీషర్టు తయారీకి 2700 లీటర్లు, జీన్స్‌కి పదివేల లీటర్లు, కిలో చికెన్‌కి 4500 లీటర్లు, కిలో బియ్యానికి ఐదు వేల లీటర్లు, ఒక కారుకి దాదాపు లక్షా యాభైవేల లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి. అంటే మన తిండీ, బట్టా, సౌకర్యం... అన్నిటికీ నీరే ఆధారం.


గ్రామీణ భారతంలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు రోజూ నీళ్ల కోసం కనీసం ఆరుసార్లు బావుల చుట్టూ తిరుగుతున్నారు. అలా ఏడాది మొత్తానికి సగటున రెండొందల కిలోమీటర్లపైనే నడుస్తున్నారు. దీని వల్ల మహిళలు ఉపాధికీ పిల్లల సంరక్షణకీ, పిల్లలు చదువులకీ దూరమవుతున్నారు. భారతీయ పల్లెల్లో సగటున ఒక్కొక్కరూ తమ దినసరి సంపాదనలో పదిహేడు శాతాన్ని నీళ్ల కోసమే ఖర్చు చేస్తున్నారని ‘వాటర్‌ ఎయిడ్‌’ అనే అంతర్జాతీయ సంస్థ లెక్కకట్టింది.

పల్లె మేల్కొంది...
సమస్యను సృష్టించుకుంది మనమే. దాన్ని అంతం చేయాల్సిన బాధ్యతా మనదే. ఆ విషయంలో కొంత మంది అందరికంటే ముందే కళ్లు తెరిచారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో చిన్న పల్లె హివరే బజార్‌. ఒకప్పుడు అదీ కరవు ప్రాంతమే. నీళ్లు లేక ఉపాధి కరవైంది. వలసలు పెరిగాయి. పిల్లలు చదువులకు దూరమయ్యారు. ఆడవాళ్లు లేచింది మొదలూ నీటి వూటలను వెతుక్కుంటూ వెళ్లేవారు. కొన్నాళ్లకు... తమకే ఎందుకీ మందభాగ్యం అన్న ఆలోచన మొదలైంది. నీళ్లే అన్ని సమస్యలకూ మూలమని అర్థమైంది. వర్షాలు మాత్రమే వూళ్లొ నీటికి ఆధారం. అవి పడ్డప్పుడే ప్రతి చుక్కనూ దాచుకోవాలని నిర్ణయించుకున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో వాన నీటిని నిల్వ చేసే పద్ధతులు తెలుసుకున్నారు. ఇంకుడు గుంతలు తవ్వారు. లక్షల మొక్కలు నాటారు. బావుల్నీ, బోర్లనీ, చెరువుల్నీ రీఛార్జ్‌ చేసి, మళ్లీ ఎండిపోకుండా చంటిపిల్లల్లా కాపాడుకున్నారు. ఇప్పుడక్కడ పచ్చదనం లేని ప్రాంతం మచ్చుకైనా కనిపించదు. స్వశక్తితో సుభిక్షంగా మారిన ఆ పల్లె విజయం, కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులకిప్పుడు పాఠ్యాంశం.

మరాఠ్వాడలోని మరో పల్లె ‘పాల్వె బద్రక్‌’ కూడా గతంలో కరవు గ్రామమే. వెనకటి తరం ఆడవాళ్లందరిదీ బావుల వెంట కాళ్లరిగేలా తిరిగిన అనుభవమే. కానీ ఇప్పుడక్కడ తెల్లారేసరికి ప్రతి ఇంటి ముందూ కుళాయిలు నీటి ధారతో కళకళలాడుతున్నాయి. పైపులు కొని, మోటార్లు బిగిస్తే కాదు, భూమ్మీద పడ్డ ప్రతి బొట్టునీ భద్రంగా దాచుకోవడం ద్వారా సాధ్యమైన విజయమది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల మీద ఆధారపడకుండా గ్రామస్థులంతా కలిసి చెక్‌డ్యామ్‌లు నిర్మించి, ఇంకుడు గుంతలు తవ్వుకొని, భూగర్భ నీటిమట్టాన్ని పెంచుకోవడం ద్వారా సాధించిన సమృద్ధి అది.

మగవాళ్లు విఫలమైన చోట ఆడవాళ్లు బాధ్యత తీసుకోక తప్పదు. కేరళలోని ‘కళికవు’ గ్రామంలో అదే జరిగింది. ఏళ్ల తరబడి అక్కడి మహిళలు నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచీ నడిచీ అలసిపోయారు. చివరికి ఓ ఇరవై మంది మహిళలు బృందాలుగా ఏర్పడి గ్రామ చుట్టుపక్కల నీటి చెమ్మని వెతుకుతూ దాదాపు వంద బావుల్ని తవ్వారు. ఆ ప్రయత్నం ఫలించి, ఏడాది తిరిగేలోగా తమ నీటి కష్టాల్ని దూరం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని లంగ్టో, గుజరాత్‌లోని కలావడ్‌, కర్ణాటకలోని చామరాజ్‌నగర్‌, నల్గొండలోని నర్సింగబట్ల ... ఇలా కలసికట్టుగా తమ తలరాతలు మార్చుకున్న గ్రామాలెన్నో. దేశం నిండు కుండలా మారాలంటే వీలైనంత త్వరగా ఆ స్ఫూర్తి అన్ని ప్రాంతాల్నీ తాకాల్సిందే.

***

రిజర్వాయర్లకు సైనిక భద్రతలూ, చేతి పంపులకు ఇనుప సంకెళ్లూ, నదుల పక్కన సాయుధ దళాలూ, ట్యాంకర్ల చుట్టూ 144 సెక్షన్లూ... గుక్కెడు నీళ్ల కోసం ఇంకెన్ని ఘోరాలు చూడాలో, ఇంకెందరు ప్రాణాలు వదలాలో! ఇప్పటికీ మించిపోయింది లేదు. నీళ్లు పోసే వాడికే పండుని కోసే హక్కని అర్థం చేసుకుంటే చాలు... ప్రతి వర్షపు బొట్టునీ భద్రంగా భూమిలో దాచుకుంటాం. వాడుకున్న ఒక్కో నీటి చుక్కకీ లెక్క కట్టి పునర్వినియోగంలోకి తీసుకొస్తాం. మనం కలుషితం చేసే నీరు ఏదో ఒక రూపంలో చివరికి మన గొంతులోకే చేరుతుందన్న ఎరుకతో అడుగేస్తాం. నీటిని వృథా చేయడమంటే కూర్చున్న కొమ్మని నరుక్కోవడమేనని గుర్తిస్తాం.

వినియోగం తగ్గించడం(రెడ్యూస్‌), పునరుత్పాదన(రీసైకిల్‌), పునర్వినియోగం (రీయూజ్‌)... నీళ్ల విషయంలో నిత్యం స్మరించాల్సిన సూత్రమిది. అత్యాశను ఏ శక్తీ సంతృప్తి పరచలేకపోయినా, ప్రాణికోటి అవసరాల్ని తీర్చే శక్తి ప్రకృతికి ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే నరనరాల్లో ఇంకిపోయిన ఆ నిర్లక్ష్యపు ధోరణి నుంచి ముందు మనిషి బయట పడాలి.

మనం నింగిని శాసించాం, చంద్రమండలాన్ని దాటొచ్చాం, అంగారకుడిపైనా జెండా పాతాం, కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా ఇప్పటిదాకా ఒక్క నీటి చుక్కని కూడా సృష్టించే పద్ధతిని కనిపెట్టలేకపోయాం. మన ఆలోచన మారితే, నీరే నిజమైన బంగారం అని నమ్మితే, జలసిరిని కృత్రిమంగా ల్యాబొరేటరీల్లో సృష్టించాల్సిన అవసరం ఎప్పటికీ రాదు..!


మనమేం చేయొచ్చు...

ఒకసారి వాడిన నీటిని మళ్లీ వాడుతున్నామంటే, తక్షణం నీళ్లపైన యాభై శాతం రాయితీ పొందుతున్నట్టే. వాషింగ్‌ మెషీన్లూ, స్నానపు గదులూ, గిన్నెలు తోమే సింకుల నుంచి వృథాగా పోయే నీటిని శుద్ధి చేసి మొక్కలకూ, ఇతర అవసరాలకూ వాడుకోవచ్చు. ‘గ్రే వాటర్‌ సిస్టమ్స్‌’ని అమర్చుకుంటే సులువుగా ఆ నీటిని శుద్ధి చేయొచ్చు.
* వెయ్యి చదరపు అడుగుల ఇంటిపైన అంగుళం మందంలో వర్షం కురిసినా అది 2200 లీటర్ల నీటికి సమానం. వానాకాలంలో డ్రమ్ముల్లో అలా పడే నీటిని సేకరించినా, ఇంకుడు గుంతల్లో భద్రపరిచినా మళ్లీ ఏడాది దాకా నీళ్ల కోసం వెతుక్కునే పనుండదు.
* మొక్కల్ని పెంచుకోవడం మంచిదే. అందులోనూ కరవును తట్టుకునే రకాల్ని పెంచడం మరీ మంచిది. నెలల తరబడి నీళ్లు లేకపోయినా బతికే మొక్కలు నర్సరీల్లో దొరుకుతాయి. వాటిని ఎంచుకోవడం ఉత్తమం.
* పళ్లు తోమేప్పుడూ, స్నానం చేసేప్పుడూ నల్లా కట్టకుండా వదిలేస్తే, నెల తిరిగేసరికి ఆరొందల లీటర్ల నీళ్లు డ్రైనేజీ పాలైనట్లే. ఇల్లూ, బైకులూ, కార్లను శుభ్రం చేయడానికి నీళ్లబదులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటే ప్రకృతితో పాటు తోటి మనుషులకూ సాయపడ్డట్లే. పైపులూ, ట్యాపుల లీకేజీలూ, పగుళ్లను వెంటనే సరిచేయించడంలో నిర్లక్ష్యం దేశద్రోహంతో సమానం!
* నలుగురు మనుషులున్న కుటుంబం నీటి వినియోగంతో సంబంధం ఉన్న పనులు చేసేప్పుడు కాస్త పొదుపుగా ఉంటే రోజుకి కనీసం నూటయాభై లీటర్ల నీళ్లు ఆదా అవుతాయని అంచనా.