close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంచితనం

మంచితనం
- అప్పరాజు నాగజ్యోతి

మేష్‌ని ఎప్పుడు తలచుకున్నా నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది... ‘వీడు ఇంత నిస్వార్థంగా, మంచికి మారుపేరులా ఎలా ఉండగలుగుతాడూ’ అని. అన్నట్టు... రమేష్‌ ఎవరో చెప్పనేలేదు కదూ! రమేష్‌ మా తమ్ముడు మధుకి క్లాస్‌మేట్‌, స్నేహితుడు.

అసలు వాడితో నా పరిచయమే చాలా చిత్రంగా జరిగింది. ఆరోజు నేనూ, మధూ స్కూల్‌కి వెళ్తుంటే, జారిపోతున్న నిక్కర్‌ని పైకి లాక్కుంటూ ‘‘తేగలు తినండి అక్కా, చాలా బావుంటాయి’’ అంటూ మా ఇద్దరి చేతుల్లో చెరో రెండు తేగలు పెట్టాడు. నిజమే, తేగలు చాలా రుచిగా ఉన్నాయి. అంతా తిన్న తరవాత గుర్తుకొచ్చి అడిగాను-

‘‘మరి, నువ్వు తిన్నావా?’’

‘‘లేదక్కా, నా దగ్గర అన్నే ఉన్నాయి. నేను మరో రోజు తింటాను.’’

ఆ క్షణాన ‘అయ్యో, తను తినకుండా అన్ని తేగలూ మాకే ఇచ్చేశాడే’ అని వాడిమీద చాలా అభిమానం కలిగింది.

ఆరోజు నుండీ ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం స్కూల్‌కి. స్కూల్లోనూ ముగ్గురం ఒక జట్టుగా ఉండేవాళ్ళం. ‘దివ్యక్కా’ అంటూ ఎప్పుడూ నా వెనకే తిరుగుతుండేవాడు. రమేష్‌ వాళ్ళది విజయవాడ దగ్గర ఏదో వూరు. వాళ్ళు వెనకబడిన కులానికి చెందినవాళ్ళు. అమ్మా, నాన్నా కూలిపనికి వెళ్తారు. వీడికి ఒక అక్కా, అన్నా ఉన్నారు. అన్న అక్కడే తాపీమేస్త్రి పనిచేస్తాడు. అక్కకి పెళ్ళి అయింది. బావకి ఇక్కడే చిన్న బైండింగ్‌ షాపు ఉంది. వాళ్ళ అక్కకీ, రమేష్‌కీ వయసులో వ్యత్యాసం ఇరవై ఏళ్ళ దాకా ఉంటుంది. వాళ్ళకి పిల్లల్లేరు. రమేష్‌నే కొడుకులాగా చూసుకుంటూ చదివిస్తున్నారు.

వీడు అందరిలాగా కూలీపనికి వెళ్ళకుండా చదువుకుని బాగుపడాలని వాడి అక్కా, బావా చూస్తుంటే, వీడికి మాత్రం చదువుమీద అసలు ధ్యాసే ఉండేదికాదు. మా మధుతోపాటు తననీ చదివించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ వాడికి చదువు ఒంటబట్టలేదు. పరీక్షలకు నాలుగు రోజుల ముందు, ముఖ్యమైన ప్రశ్నలకి మాత్రం నాచేత జవాబులు చెప్పించుకుని, అవే బట్టీపట్టి ఎలాగో అత్తెసరు మార్కులతో పాస్‌ అవుతుండేవాడు.

ఒక్క చదువు విషయం తప్పిస్తే, మిగతా అన్ని విషయాల్లో మా రమేష్‌ ఆణిముత్యమే. మానవత్వానికీ మంచితనానికీ చొక్కా, లాగూ వేస్తే అచ్చం రమేష్‌లాగే ఉంటాయి. ఇది అర్థంకావడానికి మచ్చుకి రెండు, మూడు సంఘటనలు చెబుతాను.

* * *

ఒకరోజు ముగ్గురం స్కూలుకి వెళ్తుంటే, ఇద్దరు చిన్నపిల్లలు ఆరేడేళ్ళుంటాయేమో... కాళ్ళకి చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో వెళ్తుంటే చూసి, రమేష్‌ గబగబా ఆ పిల్లల్ని చెప్పుల షాపుకి తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పులు కొనిచ్చాడు.

‘‘అంత డబ్బు నీకెక్కడిదిరా’’ అని అడిగాను.

‘‘స్కూల్‌ షూస్‌ కొనుక్కోమని మా బావ ఇచ్చాడక్కా’’ అన్నాడు. ‘‘నా పాత షూస్‌తో ఈ సంవత్సరం ఎలాగోలా గడిపేస్తా’’ అడక్కుండానే చెప్పాడు.

దారిలో ఎవరైనా బిచ్చగాళ్ళు కనిపించడం ఆలస్యం... మా దానకర్ణుడు, అలవోకగా జేబులోంచి అయిదు రూపాయలు తీసి ఇచ్చేసేవాడు. ఆ కాలంలో అయిదు రూపాయలు అంటే చాలా ఎక్కువ.

* * *

మరోరోజు లంచ్‌బ్రేక్‌లో, మేం ముగ్గురం కలిసి లంచ్‌ చేస్తుంటే- మా క్లాస్‌ టాపర్‌ వినయ్‌ పరిగెత్తుకుంటూ వచ్చాడు మా దగ్గరికి.

‘‘రమేష్‌, చాలా థాంక్స్‌ రా. టైమ్‌కి నా టర్మ్‌ఫీజు కట్టేశావు. లేదంటే నన్ను ఎగ్జామ్‌కి కూర్చోనిచ్చేవారు కాదు. ఇన్నాళ్ళూ చదివిన చదువంతా వేస్ట్‌ అయ్యేది.’’

వాడు వెళ్ళిన తరవాత చెప్పాడు- అవి స్కూల్‌ బుక్స్‌ కోసం వాళ్ళ బావ ఇచ్చిన డబ్బులు అని. ఆ సంవత్సరమంతా బుక్స్‌ లేక, తమ్ముడి బుక్స్‌ మధ్యమధ్యలో అడిగి తీసుకుని నోట్స్‌ రాసుకుని చాలా కష్టపడ్డాడు పాపం.

ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. తన బట్టల కోసం ఇచ్చిన డబ్బుని, పేవ్‌మెంట్‌ మీద పడుకునేవాళ్ళకు దుప్పట్లు కొనడానికి ఉపయోగించడం, లంచ్‌బాక్స్‌లో అన్నాన్ని సగానికి పైగా బిచ్చగాళ్ళకి పెట్టేయడం లాంటివెన్నో చేసేవాడు రమేష్‌.

అప్పుడు నాకూ చిన్నతనం కాబట్టి తెలీలేదు కానీ, ఇప్పుడు అనుకుంటుంటాను ‘వాడిలాంటివాళ్ళు ఇంకా ఈ భూమ్మీద ఉండబట్టే, ప్రళయం వచ్చి పృథ్వి ఇంకా మునిగిపోకుండా ఉందేమో’ అని.

* * *

నా స్కూల్‌ చదువు పూర్తయ్యాక, హైదరాబాద్‌లో కాలేజీలో చేరి, ఎంసెట్‌కి కోచింగ్‌ తీసుకుని ఇంజినీరింగ్‌లో సీటు తెచ్చుకున్నాను. ఇంజినీరింగ్‌లో చేరిన రెండేళ్ళకి సమ్మర్‌లో మా వూరికి వెళ్ళాను. ఆ ఏడు మధుదీ, రమేష్‌దీ కూడా టెన్త్‌ పూర్తి అయింది. మధుకి హైదరాబాద్‌లో నేను చదివిన కాలేజీలోనే అడ్మిషన్‌ వచ్చింది.

అప్పుడే రమేష్‌వాళ్ళ బావ మా ఇంటికి వచ్చాడు. అదే మొదటిసారి నేనతన్ని చూడటం.

‘‘దివ్యమ్మా, రమేష్‌ నీ ఒక్కదాని మాటే వింటాడమ్మా... వాడినెలాగైనా కాస్త తొందరగా ఏదో ఒక దాంట్లో కుదురుకునేట్టు చూడమ్మా’’ అన్నాడు. నేనూ, నాన్నగారూ ఆలోచించి, రమేష్‌ని పిలిపించి వాడికి నచ్చజెప్పి, వాడిచేత పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ రాయించాం. రిజర్వేషన్‌ ఉండడం వలన తేలిగ్గానే సీటు దొరికింది - ఫార్మసీ బ్రాంచ్‌లో. రమేష్‌ అక్కా, బావా చాలా సంతోషించారు- ఇక వాడు స్థిరపడినట్టేనని.

ఎలాగో తంటాలుపడి పాలిటెక్నిక్‌ పూర్తిచేశాడు రమేష్‌. ఇంకా ఏ ఉద్యోగంలోనూ చేరకుండానే, ఒకరోజు సడన్‌గా మరో అమ్మాయితో కలిసి పెళ్ళిదండలతో వచ్చి మా ఎదురుగా నిలబడ్డాడు. షాక్‌ అయ్యాం. ఆ పిల్ల వాడికి దూరపు చుట్టమేనట. సవతితల్లి ఆ పిల్లని ఒక ముసలివాడికిచ్చి కట్టబెట్టబోతుంటే, ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. దాంతో వీడు ఆవేశంగా ఆ అమ్మాయిని అప్పటికప్పుడు గుళ్ళొ పెళ్ళి చేసుకుని తీసుకువచ్చాడు- అదీ సంగతి.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. పిల్ల కాస్త రంగు తక్కువైనా కళగా ఉంది. వీడికి ఈడూజోడు. అమ్మాయి పేరు వరలక్ష్మి. రమేష్‌ అక్కా, బావా లబోదిబోమన్నారు. వాడి పెళ్ళిమీద వాళ్ళ బావ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అతని చెల్లెలి కూతుర్ని రమేష్‌కిచ్చి పెళ్ళి చేయాలనుకున్నాడు. వీడిలా చేయడంతో, వాడి బావ వాడిని ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఇక చేసేదేముంది, నాన్నే వాడికి ఇల్లూ అదీ ఏర్పాటుచేశారు. బ్యాంకు ద్వారా లోన్‌ ఇప్పించి, రమేష్‌ చేత సెంటర్‌లో ఒక మెడికల్‌ షాప్‌ పెట్టించారు.

* * *

నాకు క్యాంపస్‌ సెలక్షన్‌ వచ్చి జాబ్‌లో చేరిన సంవత్సరంలోనే రవితో నా వివాహం జరగడం, ఆ తరవాత నేను బెంగుళూరుకి షిఫ్ట్‌ అవడం జరిగింది.

తమ్ముడు మధు కూడా ఇంజినీరింగ్‌ కాగానే హైదరాబాద్‌లోనే జాబ్‌లో చేరాడు. వాడి పెళ్ళికి మా వూరికి వెళ్ళాను. మరదలిది బ్యాంకులో ఉద్యోగం. పెళ్ళి బాగా జరిగింది. పెళ్ళిలో హడావుడంతా రమేష్‌దీ, వాడి భార్యదే. అన్నట్టు రమేష్‌కి ఇద్దరు మగపిల్లలు- అశోక్‌, విశాల్‌.

మధు పెళ్ళి జరిగిన నాలుగు రోజులకనుకుంటా... వరలక్ష్మి పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చింది.

‘‘వదినా, షాప్‌కి బ్యాంకువాళ్ళు తాళం వేశారు. ఈ కాగితాలిచ్చి, వెంటనే డబ్బులు కట్టకపోతే రమేష్‌ని జైల్లో పెట్టిస్తామన్నారు’’ అని చెప్పింది.

బ్యాంకుకి రమేష్‌ ఏడాదిగా లోన్‌ వాయిదాలు కట్టట్లేదనీ అందుకు బ్యాంకు తగిన చర్య తీసుకుంటుందనీ - బ్యాంకు ఇచ్చిన నోటీసు పేపర్స్‌ అవి.

‘‘ఎందుకని కట్టలేదు’’ అన్న నా ప్రశ్నకి వరలక్ష్మి తన బాధనంతా వెళ్ళగక్కింది.

‘‘వదినా, పేటలో ఎవరి ప్రాణంమీదకొచ్చినా ఉచితంగా మందులు ఇచ్చేస్తాడు. దాంతో కాస్త డబ్బులు పెట్టి మందులు కొనుక్కునేవాళ్ళు కూడా మా షాపుకే వచ్చి ఫ్రీగా మందులు తీసుకుని వెళ్తున్నారు. రెండేళ్ళుగా షాపు నష్టాల్లో నడుస్తోంది. మా అవసరాలకు కూడా అప్పులే చేయవలసి వస్తోంది.’’

బ్యాంకువాళ్ళతో మాట్లాడి, కొంత గడువు తీసుకుని, షాపుని అమ్మేయగా వచ్చిన డబ్బులతో లోన్‌ కట్టేసి, మిగతా అప్పులు కూడా తీర్చేశాక చేతికి మిగిలిందేమీ లేదు. మా మరదలు సాయంతో లోన్‌ ఇప్పించి రమేష్‌కి ఒక ఆటో కొనిపెట్టాం.

ఆ తరవాత ఆర్నెల్లకి నేనూ మావారూ లండన్‌ వెళ్ళాం. నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నాం. మా పాప అక్కడే పుట్టింది. ఆ నాలుగు సంవత్సరాలలో ఒకసారి మాత్రం రమేష్‌తో, వరలక్ష్మితో ఫోన్‌లో మాట్లాడాను.

వరలక్ష్మి తన కష్టాలు చెప్పుకుంది. ‘‘వదినా, రమేష్‌ తన ఆటోలో వికలాంగులూ, వృద్ధులూ, బీదవాళ్ళూ ఎక్కితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు. ఈమధ్య వాళ్ళ అన్న కూతురిని కూడా మా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాడు. ఖర్చులు పెరిగిపోతున్నాయి’’ అని.

వినడమే తప్ప ఏమీ చేయలేకపోయాను.

  * * *

లండన్‌లో ప్రాజెక్ట్‌ పూర్తిచేసుకుని, ఇండియాకి తిరిగిరాగానే షాకింగ్‌ న్యూస్‌ వినాల్సి వచ్చింది. రమేష్‌ చనిపోయాడు. బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి వచ్చి, పదిరోజుల్లోనే సడన్‌గా పోయాడు. రమేష్‌ పోయిన తరవాత వరలక్ష్మీ, పిల్లలూ ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. చిన్నతనం నుంచీ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడినవాడు రమేష్‌. వాడికి అకాలమరణం ఏమిటీ అనిపించింది. వాడి భార్యకీ, పిల్లలకీ ఏ విధమైన సహాయం కూడా చేసేందుకు వీలులేకపోయిందే అని చాలా బాధపడ్డాను.

* * * 

మావారూ, నేనూ సొంతంగా కంపెనీ స్టార్ట్‌ చేయడంతో బాగా బిజీ అయిపోయాం. ఏళ్ళు గడిచిపోయాయి. పాప మెడిసిన్‌లో చేరింది. ఆరోజు నా ఛాంబర్‌లో కూర్చుని ఏదో బిజినెస్‌ ప్రపోజల్‌ని స్టడీ చేస్తుండగా, మా పీఏ మూర్తిగారు వచ్చారు.

‘‘మేడం, చిన్న రిక్వెస్ట్‌... ఒక అబ్బాయి బయట వెయిట్‌ చేస్తున్నాడు. చూడటానికి చాలా మంచివాడులా కనిపిస్తున్నాడు. అతనికి మన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని...’’ అంటూ ఆగాడు.

నా కళ్ళల్లో ఆశ్చర్యాన్ని గమనించాడేమో... ‘‘క్షమించండి, మన కంపెనీలో మెరిట్‌కే తప్ప రికమండేషన్స్‌కి స్థానంలేదని తెలుసు. కానీ, విషయమేంటంటే...’’ అంటూ ఇలా చెప్పుకొచ్చాడు.

‘‘నేను ఇందాక క్యాంటీన్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేసి బయటకు రాగానే, ఈ అబ్బాయితో అతని ఫ్రెండ్‌ అంటున్న మాటలు నా చెవినపడ్డాయి. ఇతన్ని, ఆ ఫ్రెండ్‌ మందలిస్తున్నాడు.

‘ఏంట్రా, నువ్వు చేసిన పని. నీ కడుపు మాడ్చుకుని ఆ ముసలోళ్ళిద్దరికి నీ దగ్గర మిగిలిన కొంచెం డబ్బుతో టిఫిన్‌ పెట్టించావు. ఇప్పుడు చూడు... నీకు ఇంటికి తిరిగి వెళ్ళటానికి కనీసం బస్సు చార్జీలు కూడా లేవు. మరీ ఇంత తనకు మాలిన ధర్మం పనికిరాదురా.’

దానికి ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా మేడమ్‌- ‘పోనీలేరా, నేను వయసులో ఉన్నాను. తిండి తినకుండా నాలుగురోజులు ఉండగలను, నాలుగు మైళ్ళు నడవగలను. కానీ, వాళ్ళని చూడు... వాళ్ళ కడుపులకి ఇంత తిండి పడకపోతే, ఏ క్షణాన్నైనా రాలిపోయేట్టున్నారు. మన కళ్ళముందు రెండు ముసలి ప్రాణాలు ఆకలితో అల్లాడిపోతుంటే మనం చూస్తూ వూరుకుంటే, మనం ఎత్తిన ఈ మనిషి జన్మకీ మానవత్వానికీ ఇక అర్థమేముందిరా’ అని.

ఈ కాలంలో పూర్తిగా కనుమరుగైపోతున్న మానవత్వపు విలువలు ఇతనిలో మెండుగా కనిపించడంతో, అతనికి ఏదైనా సహాయం చేద్దామనిపించి మీ దగ్గరకు తీసుకుని వచ్చాను మేడమ్‌’’ అన్నారు మూర్తిగారు.

మూర్తిగారు చెప్పిన సంఘటన వినగానే, నా మనసుకి వెంటనే స్ఫురించిన వ్యక్తి- మా రమేశ్‌. ఆ అబ్బాయిని లోపలికి పంపించమని చెప్పాను. అయిదు నిమిషాల తర్వాత, నా రూమ్‌లోకి వస్తున్న అతన్ని చూడగానే పోల్చుకోగలిగాను. మొహంలో స్పష్టంగా రమేష్‌ పోలికలు కనిపిస్తున్నాయి. అతని ఫైల్‌ తీసుకుని బయోడేటా, సర్టిఫికెట్స్‌ చూశాను. సందేహం లేదు, ఇతను రమేష్‌ కొడుకు అశోక్‌.

ఇంతకాలానికి రమేష్‌ కుటుంబానికి సహాయం చేసే అవకాశాన్నిచ్చినందుకు ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మూర్తిగారిని పిలిచి అప్పటికప్పుడు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ టైప్‌ చేయించి సంతకం చేసి ఇచ్చాను అశోక్‌కి. అడ్వాన్స్‌గా ఖర్చులకి రెండువేలు ఇప్పించాను. చాలా సంతోషంగా ఉందిప్పుడు.

అశోక్‌ వెళ్ళిన తరవాత లంచ్‌టైమ్‌ అయ్యేవరకూ అతి కష్టమ్మీద ఆగి, ఆ తరవాత మా డ్రైవర్‌కి అశోక్‌ ఇంటి అడ్రస్‌ చెప్పి బయలుదేరాను. పావుగంటలో చేరుకున్నాం. కారు దిగుతుంటే ‘‘మేడం, మీరు ఇక్కడ...’’ అని అశోక్‌ అంటుంటే,

‘‘కేవలం ఆఫీస్‌లోనే మేడమ్‌. ఇక్కడ నీకు అత్తని. మీ నాన్నా, నేనూ ఒక తల్లి కడుపున పుట్టకున్నా అంతకంటే ఎక్కువగానే కలిసి ఉన్నాం అప్పట్లో’’ అంటూ అశోక్‌ని దగ్గరకు తీసుకున్నాను. ఈలోగా వరలక్ష్మి బైటకి వచ్చి నన్ను చూస్తూనే ‘‘వదినా, ఎన్నాళ్ళకు’’ అంటూ కౌగిలించుకుంది.

ఆ తరవాత వరలక్ష్మి చెప్పిన సంగతులు వింటుంటే మనసు ఏదో అనిర్వచనీయమైన అనుభూతికి లోనయింది.

‘‘వదినా, రమేష్‌ చనిపోయిన తరవాత ఇద్దరు పిల్లలతో ఎలా బతకాలీ అని చాలా భయపడ్డాను. కానీ, రమేష్‌ మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు వదినా. మాతోనే ఉన్నాడు. రమేష్‌ చనిపోయాడని తెలియగానే, రమేష్‌ దగ్గర అంతకుముందు చేబదులు తీసుకున్న వాళ్ళంతా ఆ డబ్బంతా వడ్డీతో సహా తెచ్చి మాకియ్యడమే కాకుండా, దగ్గరుండి నాకు కుట్టుమిషన్‌ కొనిపెట్టి, నా బతుక్కి ఒక ఆధారాన్ని కల్పించారు.

రమేష్‌ చనిపోయినా, తన మంచితనం మమ్మల్ని వెన్నంటే ఉండి, మా బాగోగులు చూసుకుంది వదినా. పదేళ్ళ వయసులో అశోక్‌ ఒకనాడు కడుపునొప్పితో గిలగిల్లాడుతుంటే, వాడికి ఉచితంగా వైద్యంచేసి వాడి ప్రాణాలు కాపాడాడు ఒక డాక్టర్‌. ఆ డాక్టర్‌ కొడుకుని ఒకరోజు రోడ్డుమీద కారు గుద్దేసి వెళ్తే, రమేష్‌ ఆ పిల్లాడిని హాస్పిటల్లో చేర్పించడమే కాకుండా, తన రక్తం కూడా ఇచ్చి బతికించాడని ఆ డాక్టరే చెప్పాడు.

వదినా, అప్పట్లో రమేష్‌వాళ్ళ అన్న కూతుర్ని చదివిస్తున్నాడని నీతో చెప్పానే... అది అచ్చం వాళ్ళ బాబాయి పోలికే. ఆ పిల్ల తను బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవడమే కాక అశోక్‌నీ, విశాల్‌నీ కూడా తన దగ్గరే పెట్టుకుని చదివించింది. రమేష్‌ చేసిన మంచి పనులన్నీ ఏదో ఒక రూపంలో తిరిగి మమ్మల్ని ఆదుకున్నాయి వదినా. చూడు, ఇప్పుడు మా అశోక్‌కి నీ ఆఫీసులో ఉద్యోగమూ అలాగే వచ్చిందిగా. అందుకే అప్పట్లో రమేష్‌ చేసే పనులన్నింటికీ విసుక్కునే నేను ఇప్పుడు నా పిల్లలు చేసే మంచి పనులు వేటికీ అడ్డుపడట్లేదు’’ అంది వరలక్ష్మి.

తను చెప్పిందంతా విన్నాక ఈమధ్యే చదివిన కొటేషన్‌ గుర్తుకొచ్చింది ‘వెన్‌ యు డు గుడ్‌ టు అదర్స్‌, గుడ్‌థింగ్స్‌ కమ్‌ బ్యాక్‌ టు యు’ అని. అంటే- మనం ఎవరికైనా మంచి చెస్తే, ఆ మంచి ఏదో ఒక రూపంలో తిరిగి మనల్ని చేరుకుంటుందన్నమాట.

మంచికీ మానవత్వానికీ భూమ్మీద ఎప్పటికీ చోటుంటుంది అనుకుంటుంటే మనసుకు ఎంతో తృప్తిగా, హాయిగా అనిపించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.