close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రపంచబ్యాంక్‌ డబ్బిచ్చింది!

పిల్లల కథకి
ప్రపంచబ్యాంక్‌ డబ్బిచ్చింది!

పిల్లల కోసం రాసిన ఓ బొమ్మలకథ... పెద్దలను ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. ప్రపంచబ్యాంకు దృష్టిలోనూ పడింది.ఆ కథని అన్ని భాషల్లోనూ పిల్లలకు అందుబాటులోకి తేవడం అవసరమని భావించి, అందుకు నిధులు సమకూర్చడానికి ప్రపంచబ్యాంకే ముందుకొచ్చిందంటే... ఆ పుస్తకంలో ఏముంది? పిల్లలందరూ దాన్ని ఎందుకు చదవాలి? ఇంతకీ ఆ కథ రాసిందెవరు? ఆ కథకీ మనదేశానికీ ఏమిటి సంబంధం?

ప్రియాస్‌ శక్తి, ప్రియాస్‌ మిర్రర్‌... ఈ కామిక్‌ పుస్తకాల్లో కథానాయిక ప్రియ. దేవతాదుస్తుల్లో ముస్తాబై సూపర్‌ హీరోలా పులి మీద స్వారీ చేస్తుంటుంది. ‘ప్రియాస్‌ శక్తి’ పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంది. పలు భాషల్లోకి అనువదితమైంది. ఆ స్పందన దాని సృష్టికర్తలనూ ప్రచురణకర్తలనూ ఆలోచింపజేసింది. ఫలితమే ప్రియ సూపర్‌ హీరోగా కామిక్‌ కథలు వెలువరించే పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రియ పాత్ర సృష్టికర్త రామ్‌ దేవినేని న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయుడు. దర్శక నిర్మాత, ప్రచురణ కర్త అయిన రామ్‌ 2012 డిసెంబరులో నిర్భయ సామూహిక అత్యాచార ఘటన జరిగినప్పుడు దిల్లీలో ఉన్నారు. ఘటన అనంతర పరిణామాలనూ వీధుల్లోకొచ్చి న్యాయం కోసం పోరాడిన యువతనూ గమనించిన ఆయన ఆ తర్వాత దేశమంతటా పర్యటించారు. అత్యాచార బాధితులు పలువురితో మాట్లాడారు. వివిధ రూపాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న హింస ఆయన్ని ఆలోచింపజేసింది.

పిల్లలే లక్ష్యంగా...
ఆడవాళ్లపై అత్యాచారాల విషయంలో చైతన్యం తేవాలంటే పిల్లలనే లక్ష్యంగా చేసుకోవాలనుకున్నారు రామ్‌. తన ఆలోచనలను తోటి దర్శకురాలు పరోమితా ఓరాతో పంచుకున్నారు. ఆ చర్చల ఫలితమే ప్రియ పాత్ర రూపకల్పన. శక్తిమంతమైన హిందూ పౌరాణిక పాత్రలు పిల్లలను ఆకట్టుకుంటాయని భావించిన రామ్‌ పార్వతి పాత్రను అందుకు ఉపయోగించుకున్నారు. ప్రియ ప్రధాన పాత్రలో ప్రియాస్‌ శక్తి గ్రాఫిక్‌ కథ రాశారు. డాన్‌ గోల్డ్‌మ్యాన్‌ ఆ కథకు చిత్రరూపం ఇచ్చారు. సీరియస్‌ విషయాన్ని తేలిగ్గా చెప్పడానికి గ్రాఫిక్‌ కథనం బాగా ఉపయోగపడుతుందనీ భావోద్వేగాలను బొమ్మల్లో చక్కగా ప్రతిఫలింపచేయవచ్చనీ భావించారు రామ్‌. ప్రియ పార్వతి భక్తురాలు. బాగా చదువుకొని టీచరవ్వాలని కలలు కంటుంది. తల్లిదండ్రులు ఆమెను బడి మానేేయమంటారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరుగుతుంది. అందులో ఆమె తప్పేం లేకపోయినా తమకు అప్రతిష్ఠ తెచ్చిందని కుటుంబం ఆమెను వెలివేస్తుంది. దిక్కుతోచని ప్రియ అడవిలోకి వెళ్లిపోయి భోరున విలపిస్తుంది. అది చూసిన పార్వతీదేవి ఎలాగైనా ప్రియను కాపాడాలనుకుని, ఆమెను ఆవహిస్తుంది. అంతే... అప్పటివరకూ అసహాయగా రోదించిన ప్రియ సర్వశక్తిమంతురాలిగా మారి పులి మీద స్వారీ చేస్తూ వెళ్లి తనపై దాడి చేసినవారందరి భరతం పడుతుంది. స్త్రీలను గౌరవించాలనీ పిల్లలందరినీ చదివించాలనీ అన్యాయాన్ని ఎదిరించాలనీ వూరివాళ్లకు చెప్తుంది.

తర్వాత పుస్తకం ప్రియాస్‌ మిర్రర్‌. ఇందులో ఆసిడ్‌ దాడి బాధిత యువతుల తరఫున పోరాడుతుంది ప్రియ. దాడి తాలూకు మచ్చలను కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఆడపిల్లల అక్రమ రవాణా అంశాన్ని చర్చించబోతోంది త్వరలో రాబోతున్న మూడో పుస్తకం ప్రియ అండ్‌ ద లాస్ట్‌ గర్ల్స్‌. ఈ కథకోసం అక్రమరవాణా బాధితులతో మాట్లాడడానికి ఇటీవలే కోల్‌కతాలోని సోనాగచ్చి ప్రాంతంలో పర్యటించారు రామ్‌. ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న దురాచారాలను ప్రశ్నించడమే లక్ష్యంగా మొత్తం ఐదు పుస్తకాలు వెలువరించాలన్నది వీరి ప్రాజెక్టు. పితృస్వామ్య భావజాలం, స్త్రీద్వేషం, స్త్రీలపట్ల నేరాలను ప్రేమ, సృజన, సౌభ్రాతృత్వ భావనలతో తిప్పికొట్టాలన్నదే ఈ కథల ద్వారా తాను చెప్పదలచుకున్న నీతి అంటారు రామ్‌ దేవినేని. తాను ఆశిస్తున్న సామాజిక మార్పునకు ప్రియ పాత్రను ప్రేరకంగా వాడుకుంటున్నానంటారు.

పిల్లలతోనే మార్పు
ప్రియ కథలను యానిమేషన్‌ చిత్రాలుగా సైతం రూపొందించారు రామ్‌ దేవినేని. తొలి రెండు చిత్రాలూ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో బహుమతులూ గెలుచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పనిచేస్తోంది ప్రపంచబ్యాంకు కార్యక్రమం ‘వుయ్‌ఇవాల్వ్‌’. ఇప్పుడీ కార్యక్రమం కింద ప్రియ కామిక్‌ కథల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చింది ప్రపంచబ్యాంకు. ఈ కార్యక్రమం రూపకర్త మారియా కొరీయ మాట్లాడుతూ సంప్రదాయానికి భిన్నంగా ‘విద్యావినోదం’(ఎడ్యుటైన్‌మెంట్‌) విభాగం కింద తాము దీనికి నిధులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 2012లో నిర్భయ ఘటన, ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక హింస బాధితురాలేనన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక- 2013 నేపథ్యంలో వరల్డ్‌ బ్యాంక్‌ స్పందనే తమను ఈ దిశగా ముందడుగు వేయించిందని ఆమె పేర్కొన్నారు. సమాజంలో వేళ్లూనుకుని ఉన్న వివక్షను కూకటివేళ్లతో నిర్మూలించాలంటే సమస్య మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుందనీ అందుకే తాము పిల్లల ద్వారా సామాజిక మార్పునకు బీజం వేసే ఈ పథకం పట్ల మొగ్గు చూపుతున్నామనీ మారియా తెలిపారు. సున్నితంగా, సృజనాత్మకంగా ఆలోచనల్లో మార్పు తేవడానికి ప్రియ కథలూ చిత్రాల ఆధారంగా పాఠశాలల్లో వర్కుషాపులు నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి నేరాల్లో ఇప్పటివరకూ బాధితులపైనే ఎక్కువ దృష్టిపెట్టడం జరిగిందంటారామె. కానీ ఈ నేరాలు జరగడానికి దారితీసిన పరిస్థితులూ నేరస్తుల నేపథ్యాలపై దృష్టి పెట్టినప్పుడు ఆశించిన ఫలితం సాధించవచ్చనీ అందుకే ప్రపంచ బ్యాంకు తరఫున ఈ పథకాన్ని తాము చేపట్టామనీ మారియా తెలిపారు. అలా ఇప్పుడు తొలిసారి ఓ కథల పుస్తకానికి ప్రపంచబ్యాంకు ఆర్థిక చేయూత లభించింది.


 

మనసున్న మనిషి... బాషా!

‘ఆపదలో ఉన్నవారెవర్ని చూసినా సాయం చెయ్యాలనిపిస్తుంది. కానీ మధ్యతరగతి జీవితం... ఏం చెయ్యగలం... ధనవంతులమైతే ఎన్నైనా చేసేవాళ్లం...’ అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ నిజంగా సేవ చెయ్యాలనే మనసుంటే ఇలాంటి మాటలేవీ రావు. ఉన్నంతలోనే చేయగలిగినంత సాయం చేస్తాం... మునీర్‌బాషాలాగా!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తి... ఓ పక్క మండే ఎండ... చెప్పుల్లేకుండా నడవడమే కష్టం. అలాంటిది రెండు కాళ్లూ లేని ఓ దివ్యాంగుడు నేలమీద దేకుతూ ఒక్కో దుకాణం దగ్గరికి వెళ్లి ‘ఆకలేస్తుందయ్యా’ అంటూ అడుక్కుంటున్నాడు. అక్కడే ఫ్యాన్సీ దుకాణాన్ని నడుపుతున్న మునీర్‌బాషా అతడిని చూసి చలించిపోయాడు. కొంత డబ్బు తీసి, దివ్యాంగుడి చేతిలో పెట్టాడు. కానీ ఆ సంఘటన ఆ రోజంతా బాషాను వెంటాడింది. ‘కదల్లేని పరిస్థితుల్లో కూడా జానెడు పొట్ట నింపుకోవడానికి వారికి అన్నికష్టాలా...’ అనిపించింది. ఆ క్షణమే తన చుట్టూ ఉన్న అలాంటి వారికోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆరాటంలోంచి పుట్టుకొచ్చిందే ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ సంస్థ. 2012 జనవరిలో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ప్రతినెలా రెండో ఆదివారం రోజున దివ్యాంగులూ నిరుపేద వృద్ధులకు నెలకు సరిపడే 25 కిలోల బియ్యం, పప్పులూ ఇతర నిత్యావసర సరుకులూ అవసరాన్నిబట్టి మందులూ దుప్పట్లను కూడా ఉచితంగా అందించడం మొదలుపెట్టాడు. అలా హెల్పింగ్‌హ్యాండ్స్‌ ద్వారా ప్రస్తుతం ముప్ఫై అయిదు మంది నిరుపేద వృద్ధులూ దివ్యాంగులూ లబ్ధి పొందుతున్నారు. వాళ్లందరూ ఒకప్పుడు ఒకపూట తింటే మరోపూట తినక పస్తులుంటూ కాలం గడిపినవాళ్లే.

నలుగురుండే కుటుంబంలోనే నెలవారీ సరుకులకు కనీసం రూ.రెండు మూడువేలు ఖర్చవుతాయి. అలాంటిది ఇంతమందికి సొంత ఖర్చుతో సరుకులంటే తక్కువేం కాదు. పైగా అతడికి ఉన్న ఆదాయ వనరు ఫ్యాన్సీ దుకాణం మాత్రమే. దాంతో బాషా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా, వెనకడుగు వెయ్యలేదు. వారికి సర్దిచెప్పి నెలనెలా ఇంటి ఖర్చులకు పోనూ మిగిలిన డబ్బునంతా ఈ సేవాకార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా సరుకుల్ని ఇవ్వడం మానలేదంటేనే ఆయన మనసేంటో అర్థం చేసుకోవచ్చు.

ఉచిత బజార్‌
హెల్పింగ్‌హ్యాండ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట మరో కార్యక్రమమూ మొదలైంది. సాధారణంగా ఏ దుకాణంలోనైనా పాతవైపోయిన ప్లాస్టిక్‌ వస్తువులూ చిన్నపాటి సమస్యతో పాడయ్యే బట్టలూ అనుకోకుండా గీతలు పడినవీ, పాత గొడుగులూ టోపీలూ స్కూలు బ్యాగుల్లాంటివి చాలా ఉంటాయి. వాటిని ఎవరూ కొనరు. పెద్ద దుకాణదారులు వాటిని తక్కువ ధరకు గంపగుత్తగా అమ్మేస్తుంటారు. ‘అలాంటి వాటిని పేదలకు పంచితే ఎంత సంతోషిస్తారో...’ అనిపించింది బాషాకు. వెంటనే పట్టణంలోని పెద్ద పెద్ద దుకాణదారుల దగ్గరికి వెళ్లి, ‘ఈసారి నుంచి చిన్న చిన్న రిపేరులున్న వస్తువులూ బట్టలున్నపుడు నాకు చెప్పండి కొనుక్కుంటాను’ అని చెప్పాడు. అలా పోగుచేసిన బట్టలూ ఇంట్లోవాడే రకరకాల వస్తువుల్ని రెండు నెలలకోసారి ‘ఉచిత బజార్‌’ పేరుతో పేదలకు ఉచితంగా పంచుతున్నాడు. తనముందు ఎవరు బాధ పడుతున్నా చూడలేని మనసు అతడిది. అందుకే, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే వికలాంగులకు తన దుకాణంలోని వస్తువులను ఉచితంగా ఇచ్చి, అమ్ముకొమ్మంటాడు. దాన్నుంచి వచ్చేలాభాలతో రెండోసారి వాళ్లు మరిన్ని వస్తువులు కొనుక్కుని అమ్ముకోవచ్చు. అంతేకాదు, గతేడు నవంబరులో కురిసిన భారీ వర్షాలకు ఇళ్ల నుంచి బయటకు రాలేక అవస్థలు పడుతున్న స్థానిక తుఫాన్‌నగర్‌లోని ఎంతోమంది వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులను అందచేశాడు.

ఆర్థిక సాయం తీసుకోడు
హెల్పింగ్‌హ్యాండ్స్‌ సంస్థ చేసే సేవా కార్యక్రమాలను చూసి, చాలామంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తుంటారు. కానీ బాషా సంస్థలో సభ్యులుగా ఉన్న స్నేహితులతో సహా ఎవరి నుంచీ ఏమీ తీసుకోడు. సరుకుల్ని పంచేటపుడూ ఇతర సేవా కార్యక్రమాల సమయంలో కావాలంటే పనిలో సాయం తీసుకుంటాడంతే. ‘మనం ఎంత మంచి మనసుతో సేవ చేస్తున్నా వేరేవాళ్ల డబ్బు ఖర్చుపెట్టేటపుడు అనుకోని విమర్శలు ఎదురవ్వొచ్చు. అలాంటివాటికి ఎంత దూరంగా ఉంటే నా సేవా కార్యక్రమాల్ని అంత బాగా చేసుకోగలను. అందుకే, నాకొచ్చే ఆదాయంలోనే చేతనైనంత సాయం చేస్తా’ అంటాడు బాషా.

సినీ నటుడూ నృత్య దర్శకుడూ లారెన్స్‌ రెండేళ్ల క్రితం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాళహస్తికి వచ్చారు. హెల్పింగ్‌హ్యాండ్స్‌ సంస్థ గురించి తెలిసి, వద్దని చెబుతున్నా రూ.లక్ష విరాళాన్ని ఇచ్చి వెళ్లిపోయారు. వెంటనే ఆ డబ్బుతో ఆయన పేరు చెప్పి, అనాథలకు దుస్తులూ, సంస్థద్వారా నెలనెలా లబ్ధి పొందుతున్నవారికి నిత్యావసర సరుకులూ ఇతరత్రా సామగ్రీ అందచేశారు.

బాషా మంచిమనసును చూసి, ఇప్పుడు కుటుంబ సభ్యులతో పాటు దుకాణంలో పనిచేసే సిబ్బంది కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న ఆరుగురు ప్రతి నెలా తమ జీతంలో రూ.400 పొదుపు చేస్తూ.. ఏదైనా ప్రత్యేక దినోత్సవం రోజు సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా... పేద వృద్ధులకు చీరలు పంచారు.

మంచి పనికి నలుగురి తోడూ ఉంటుంది మరి.

- ఎస్‌.రవీందర్‌ రావు, ఈనాడు, చిత్తూరు డెస్కు
చిత్రాలు: బి.రాజేష్‌ కుమార్‌
సంతోషమంతా ఆ దేశానిదే!
ఒక దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరు పొందాలంటే... దాని వెనుక బోలెడు బలమైన కారణాలే ఉంటాయి. ప్రజల్లో సంతోషంగా ఉన్న భావనను బలపరచాలంటే ఆహారం నుంచి ఆరోగ్యం దాకా అక్కడి ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలే తీసుకుని ఉండాలి. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ‘హ్యాపీయెస్ట్‌ కంట్రీ ఇన్‌ ద వరల్డ్‌’ అంటూ 155 దేశాలున్న జాబితాలో మొదటి స్థానంలో నార్వేను నిలబెట్టిందంటే... అంత హోదా ఆ దేశానికి వూరకే వచ్చి ఉండదు కదూ!

సంతోషం... డబ్బుతో కొలవలేం. చదువుతో సరితూచలేం. అయినా అవసరానికి సరిపడానే తప్ప, అంతకు మించిన డబ్బు కొత్త సంతోషాన్ని తెచ్చిపెట్టలేదు అంటాడో గొప్పవ్యక్తి, అది నిజమే. మరి నార్వే ప్రజలు ప్రపంచంలోనే సంతోషంగా ఉన్నారంటే... వాళ్ల దగ్గర ఏవో తాంత్రిక విద్యలూ, మరేవో మాయా మూలికలూ ఉన్నాయనుకుంటే మాత్రం పొరపాటే. ఆ దేశం అందరిలా సంతోషానికి చేరే దారిని కనుక్కోవడమే కాదు, ఆ మెట్లను ఎక్కడమూ మొదలు పెట్టింది!

అత్యుత్తమ విద్య, వైద్యం
ప్రపంచంలోనే ప్రజల వైద్యం కోసం అతి ఎక్కువ బడ్జెట్‌ను కేటాయిస్తున్న దేశాల జాబితాలో తొలిస్థానాల్లో ఉంటుంది నార్వే. ప్రతి వెయ్యి మంది రోగులకూ నలుగురు డాక్టర్లు, ఏడుగురు నర్సులు ఉంటారక్కడ. అక్కడి ప్రజల సగటు జీవిత కాలం 82 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించే ప్రజలుగా చెప్పే జపాన్‌ వారి సగటు జీవితకాలం కన్నా ఇది రెండేళ్లే తక్కువ. హెచ్‌ఐవీ, టీబీ, మలేరియాలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం 0.1 శాతం మాత్రమే ఉందంటే శుభ్రతా, ఆరోగ్యాల పట్ల వాళ్లు ఎంత శ్రద్ధ తీసుకుంటారో అంచనా వేయొచ్చు. ఇక అక్కడి పౌరులెవరైనా కనీసం 10 సంవత్సరాలు నిర్బంధంగా చదువుకోవాలి. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లల్నే పాఠశాలలో చేర్చుకుంటారు. నేర్చుకునే తీరూ, ఆసక్తులను బట్టి విశ్లేషణా, అనధికారిక గ్రేడింగులే తప్ప మార్కులూ పర్సంటేజీల ప్రస్తావనే ఈ చదువుల్లో ఉండదు. అక్కడ కాలేజీలే కాదు విశ్వవిద్యాలయ స్థాయి విద్యా ఉచితమే. నార్వే దేశంలో మూడో వంతు ప్రజలు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారే. నాణ్యతా పరంగా ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంటుంది ఇక్కడి విద్య.

నేరాలు మచ్చుకే...
లంచం, అవినీతి రహిత దేశాల జాబితాలో నార్వే ఎప్పుడూ తొలి పది స్థానాల్లోనే ఉంటోంది. ఇక ప్రపంచంలోనే అతి తక్కువ నేరాలు నమోదయ్యే దేశాల్లో నార్వే ఒకటి. ఇక్కడి జైళ్లు మానవతా విలువల పరంగా హెచ్చుస్థాయిలో ఉన్నాయని ప్రపంచం వ్యాప్తంగా పేరు. ఉరి, జీవితకాలపు కారాగార శిక్షా అసలిక్కడ లేనేలేవు. గట్టి శిక్షలు లేకపోతే వాళ్లు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడతారనుకుంటే పొరపాటే. కఠిన శిక్షలు విధించే అమెరికాలో రెండోసారి నేరానికి పాల్పడేవారు 52 శాతం ఉండగా నార్వేలో అది 20 శాతమే ఉంది. మనిషిలో మార్పు తీసుకురావడమే తప్ప వారిని శిక్షించడం జైళ్ల ఉద్దేశం కాదన్నది నార్వే సిద్ధాంతం.

ధనం, జీతం ఎక్కువే...
చమురును ఉత్పత్తి చేసే భాగ్యవంతమైన దేశాల్లో నార్వే ఉంది. అలా అని విపరీతంగా చమురును తోడేసి దాంతో డబ్బు సంపాదించేయడం లేదు. కొద్దికొద్దిగా మాత్రమే ఉత్పత్తి చేస్తూ అందులో వచ్చే డబ్బును భావితరాల కోసం పెట్టుబడిగా పెడుతోంది. నార్వే ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లు. ఇక్కడ నాలుగున్నర లక్షల కొలనులున్నాయి. మధ్యయుగపు కళాసోయగం ఉట్టిపడే భవంతులూ, చర్చిలూ, రంగురంగుల ఇళ్లూ ఈ దేశపు ప్రత్యేకతలు. ఫ్యోర్డ్స్‌గా పిలిచే పెద్ద కొండల మధ్య లోతైన నీళ్లతో సన్ననిదారులు ఉండే ప్రాంతాలు ఈ దేశానికి మాత్రమే ప్రత్యేకమైన అందాలు. వీటన్నింటినీ జాగ్రత్తగా కాపాడుతూ పర్యటకం నుంచీ డబ్బు సంపాదిస్తోంది. దేశానికి కావలసిన విద్యుత్తులో 95శాతానికిపైగా జలవిద్యుత్తు ద్వారానే వస్తోంది. ఇక్కడి ఉద్యోగులకు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నా జీతాలు ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు లింగభేదం అతి తక్కువగా ఉన్న దేశాల్లో నార్వే ముందువరుసలో ఉంది. ఇవేకాదు... చెప్పుకుంటూ పోతే నార్వే ప్రత్యేకతలు ఇంకెన్నో. ఏ రంగంలో చూసినా సుస్థిరాభివృద్ధి అనేది నార్వే గమనసూత్రంగా కనిపిస్తుంది. భవిష్యత్తుకు అంత భరోసా ఉన్నప్పుడు అక్కడి ప్రజలు సంతోషంగా ఉండటంతో ఆశ్చర్యం ఏమైనా ఉందంటారా!