close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మ చేతి రుచులు... ఆన్‌లైన్లో!

అమ్మ చేతి రుచులు... ఆన్‌లైన్లో!

దినా... కందాబచ్చలి ఎలా వండాలో కాస్త నేర్పించవా ప్లీజ్‌.
పిన్నిగారూ... మా చంటాడు మీ ఇంట్లో చారే కావాలని తిండి మానేసి గొడవ చేస్తున్నాడు!
బామ్మగారూ... ఈసారి ఆవకాయ కలిపేటప్పుడు నాలుగు కాయలు ఎక్కువ పడేద్దురూ..!

ఒకప్పుడు ఇరుగూపొరుగూ అనుబంధం ఇలా కూరలు ఇచ్చిపుచ్చుకోవడంతోనే బలపడేది. పక్కింటి నుంచి మసాలా వాసన ముక్కుని తాకగానే కడుపులో నకనకలు మొదలైపోయేవి. అమ్మ ఏమంటుందోనన్న భయం, ఆంటీ ఏమనుకుంటుందోనన్న మొహమాటం లేకుండా గిన్నె పట్టుకొని కూర కోసం పరుగెత్తిన జ్ఞాపకాలు చాలామందికుంటాయి. అంతెందుకూ... పదేళ్ల తరవాత, పాతింట్లో పక్క వాటాలో అద్దెకున్న బామ్మగారు తారసపడినా ‘అలాంటి గుమ్మడికాయ వడియాల్ని మళ్లీ తినలేదంటే నమ్మండీ’ అని గుర్తు చేసుకుంటాం. వంటకి ఉండే శక్తే అది. కాదు కాదు... ఆడవాళ్ల చేతి వంటకు ఉండే మహత్యం అది! కానీ అప్పటి రోజులు వేరు. ఇప్పటి ప్రపంచం వేరు. పట్టణాలు మారిపోయాయి. పొరుగింటి ఆంటీలూ, ఎదురింటి పిన్నిగార్ల శకం ముగుస్తోంది. చాలామంది ‘అమ్మ’లు సొంతూళ్లలోనే ఉండిపోతున్నారు. బ్యాచిలర్‌ బాబులంతా నగరాల్లో హాస్టల్‌ మెస్సులూ, ఆఫీస్‌ క్యాంటీన్లలో కడుపు నింపుకుంటున్నారు. బిజీ దంపతులు వారాంతాల్లో కూడా రెస్టరెంట్లపైన ఆధారపడుతున్నారు. మొత్తానికి అందరూ అన్నం తిందామని ప్లేటు ముందుపెట్టుకోగానే అమ్మ చేతి రుచులు గుర్తొచ్చి ఉసూరుమంటున్నారు.

మంచి భోజనానికి దూరమయ్యేవారి బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. అలా ఇబ్బంది పడిన కొందరు భోజన బాధితులు దానికేదైనా పరిష్కారం వెతకాలని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆ మేధోమథనం నగరవాసులకు రోజూ కమ్మని ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తోంది. గృహిణులకు స్వయం ఉపాధిలోని సంతోషాన్ని పంచుతోంది. స్టార్టప్‌ వీరులకు ఓ సమస్యను పరిష్కరించిన ఆనందంతో పాటు ఆదాయాన్నీ అందిస్తోంది. ‘ఇంటి భోజనం ఇంటర్నెట్‌’లో అన్న నినాదాన్ని అంకుర సంస్థలు అందుకున్నప్పట్నుంచీ బామ్మలు తమ పిండి వంటల నైపుణ్యాన్నంతా బయటకు తీస్తున్నారు. గృహిణులు తమ పిల్లల క్యారేజీలతో పాటు ఓ నాలుగు టిఫిన్‌ బాక్సులు ఎక్కువ సర్దుతున్నారు. ఇంటి పట్టునే ఉంటూ వంట చేయడానికి ఇష్టపడే మహిళలంతా ‘వంట్రప్రెన్యూర్లు’గా మారి కాలక్షేపానికి కాసిని కాసుల్నీ జోడిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘స్వగృహా ఫుడ్‌’ మీద ఆధారపడి బోలెడన్ని స్టార్టప్‌లు బతికేస్తున్నాయి. పాకశాస్త్రంలో ప్రావీణ్యం, నలుగురికి వండిపెట్టాలన్న ఆసక్తీ ఉన్న మహిళల్ని అవి తమ సంస్థలో భాగం చేసుకుంటున్నాయి. ఇంటి భోజనాన్ని ఇష్టపడే వాళ్లందర్నీ వినియోగదార్లుగా మార్చుకుంటున్నాయి. అల్పాహారం, మధ్యాహ్నం-రాత్రీ భోజనం, చిరుతిళ్లూ, పచ్చళ్లూ, పిండివంటలూ... ఎవరికి కావల్సినవి వాళ్లకు కోరిన సమయానికి అందేలా ఏర్పాటు చేస్తున్నాయి.

మన డబ్బావాలా...
దేశ నలుమూలల నుంచి భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌లో వాలే యువతీ యువకులెందరో. పెళ్లికాని ప్రసాద్‌లూ, ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలూ, ఇంటిని మరచిపోయి రోజులో పద్దెనిమిది గంటలు కంప్యూటర్లతో కుస్తీ పట్టే పనిరాక్షసులూ... మొత్తంగా ఆ సాఫ్ట్‌వేర్‌ సామ్రాజ్యంలో సగం మంది ఇంటి భోజనానికి దూరమయ్యేవాళ్లే. కడుపునిండా తిందామంటే దగ్గర్లో సరైన హోటల్‌ కనిపించదు. ‘వేడివేడి పిజ్జాలు రెడీ’ అంటూ వూరించే దుకాణం మాత్రం అడుక్కొకటి తగుల్తుంది. గతంలో సాఫ్ట్‌వేర్‌ కొలువులో స్థిరపడ్డ హైదరాబాదీ కుర్రాడు ముఖేష్‌కి కూడా ఆ తిండి సమస్య అనుభవమే. సహొద్యోగులు ఆన్‌లైన్‌ పిజ్జాలతో సర్దుకుపోయినా అతడి మనసు కమ్మని భోజనాన్నే కోరుకునేది. కొన్నాళ్లకు ముఖేష్‌ సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని వదిలేశాడు. వేరే అంకుర సంస్థని నెలకొల్పాడు. ఆ పనుల్లో బిజీగా ఉన్నా గతంలో లంచ్‌ బ్రేక్‌ తాలూకు చేదు జ్ఞాపకాలు మాత్రం వదల్లేదు. నగరంలో వందల ఆఫీసులున్నాయి. వేలమంది ఉద్యోగులున్నారు. వాళ్ల సమస్యను పరిష్కరించడం కంటే గొప్ప స్టార్టప్‌ ఐడియా ఏముంటుంది అనిపించింది. అంతే... స్నేహితుడు చైతన్యతో కలిసి ‘టిన్‌మెన్‌’ అనే సరికొత్త సంస్థకు ప్రాణం పోశాడు ముఖేష్‌. దాని సాయంతో ఉద్యోగులకు కమ్మని ఇంటి భోజనం అందించాలన్నది ఆ కుర్రాళ్ల ఆలోచన. అందుకే మొదట ఉద్యోగుల అవసరాలు తెలుసుకున్నారు. కొందరు మధ్యతరగతి మహిళలతో మాట్లాడారు. స్వయంగా వాళ్ల వంటల రుచిని ఆస్వాదించి తమ ప్రయాణంలో ఆ గృహిణులనూ భాగం చేసుకున్నారు. అలా ‘టిన్‌మెన్‌’ ద్వారా ఉద్యోగికీ గృహిణికీ మధ్య వారధిలా మారారు.

రెండేళ్ల క్రితం మొదలైన టిన్‌మెన్‌ ప్రస్తుతం రోజుకి వెయ్యికిపైగా కమ్మని భోజనాలను లంచ్‌ బ్రేక్‌ లోపు ఉద్యోగుల టేబుళ్ల దగ్గరకు చేరుస్తోంది. అన్నీ ఇళ్లల్లోని మహిళలు స్వయంగా వండినవే. పైగా భోజనం ప్రారంభ ధర యాభై రూపాయలే. నచ్చిన పదార్థాలు రోజుకొకటి వచ్చేట్లుగా మెనూని ఎంపిక చేసుకోవచ్చు. ఓ వారానికో, నెలకో టిన్‌మెన్‌ సభ్యత్వం తీసుకుంటే ఇక ఆఫీసులో భోజనం గురించి చింత లేదన్నమాట.

కార్పొరేట్లకు పోటీ!
అటూఇటుగా ‘టిన్‌మెన్‌’ దారిలోనే నడుస్తోంది ‘మెనూ హోమ్‌ కుక్డ్‌’ అనే మరో హైదరాబాదీ స్టార్టప్‌. కాకపోతే దీని పరిధి కాస్త పెద్దది. ఆఫీసులతో ఆపకుండా ఆర్డర్‌ ఇచ్చిన వాళ్లందరిళ్లకీ ఇంటి భోజనాన్ని చేరవేస్తోంది. ఐటీ రంగంలో ఉన్న తన స్నేహితురాలి ఆకలి సమస్యలో వైష్ణవి రెడ్డికి మంచి స్టార్టప్‌ ఆలోచన కనిపించింది. ఇంటి భోజనానికి ఉన్న ఆదరణని అందిపుచ్చుకోవడానికి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ‘మెనూ హోమ్‌ కుక్డ్‌’కి తెరతీసింది. దాదాపు అందరూ గృహిణులతో నడుస్తోన్న ఈ స్టార్టప్‌, మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి పదిన్నర వరకూ బిజీబిజీగా భోజనాలు సరఫరా చేస్తోంది.

ఒకరు గుత్తి వంకాయ ఇరగదీస్తారు. ఇంకొకరు గోంగూర మటన్‌ అదరగొడతారు. అలా ఏ గృహిణి వంట ప్రత్యేకతేంటో వెబ్‌సైట్లో రాసుంటుంది. దాన్ని బట్టి నచ్చిన వంటకాన్ని ఒక్క క్లిక్‌తో తెప్పించుకోవచ్చు. మాకు ఫలానా కూరలే కావాలంటారా... ఓ రెండ్రోజుల ముందు ఆ జాబితాను పంపిస్తే చెప్పిన సమయానికి వేడివేడి పదార్థాలు గుమ్మం ముందుకొచ్చేస్తాయి. విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై, చండీగఢ్‌... ఇలా దేశవ్యాప్తంగా ఇదే తరహా సేవలందిస్తోంది ‘వాట్స్‌కుకింగ్‌’ అనే మరో సంస్థ. ఇక్కడ ఐదు వేల మందికిపైగా సభ్యులు తమ చేతులకు పనిచెబుతున్నారు. ‘గోసిబో’, ‘జబ్‌ వియ్‌ ఏట్‌’, ‘ఫ్రమ్‌ ఏ హోమ్‌’, ‘ఇన్నర్‌షెఫ్‌’, ‘కుక్డ్‌ ఎట్‌ హోమ్‌’ ... చెబుతూ పోతే ఈ అంకుర సంస్థలది చాంతాడంత జాబితా. ఇష్టమైన వాళ్లకు అప్పుడప్పుడూ చెప్పాపెట్టకుండా కమ్మని భోజనాన్ని బహుమతిగా పంపిస్తే కలిగే సంతృప్తే వేరు. ఆ సేవల్నీ అందిస్తూ చాలా సంస్థలు ఇంటి భోజనాన్ని ప్రత్యేకంగా గిఫ్ట్‌ప్యాక్‌ చేసి అడిగినవాళ్ల ఆత్మీయులకు చేరవేస్తున్నాయి. వీటిలోనూ రాయితీలూ, వోచర్లూ, క్యాష్‌బ్యాక్‌లూ అంటూ కార్పొరేట్లకు పోటీగా, రెస్టరెంట్లకు దీటుగా ఓ సరికొత్త మార్కెట్‌ను సృష్టిస్తున్నాయి.

సంప్రదాయ ఘుమఘుమలు
అన్నం, కూరా, చారూ సంగతి సరే... మరి వాటికి నిల్వ పచ్చళ్లొ, దంచిన కారప్పొళ్లొ, కాసిని పిండి వంటలో తోడైతేనే కదా నోటికి కమ్మదనం, తెలుగు భోజనానికి నిండుదనం! అందుకే కొన్ని అంకుర సంస్థలు అలాంటి సంప్రదాయ వంటకాల్లో పట్టున్న ఆడవాళ్లను వెతికి పట్టుకుంటున్నాయి. ఇంటిపట్టునే వాళ్లతో నిల్వ పచ్చళ్లనూ, అన్ని రకాల కారప్పొడులనూ, పిండి వంటలనూ తయారు చేయిస్తున్నాయి. పచ్చడి గుంటూరు మిర్చితోనే చేయాలన్నా ఓకే. పొడికి కర్నూలు కందుల్నే వాడాలన్న నియమం పెట్టినా ఫర్వాలేదు. రుచి కోసం భోజన ప్రియులు పెట్టే ఎలాంటి షరతులకైనా సంస్థలు స¾రేనంటున్నాయి. తీరిక లేదనో, చేయడం రాదనో సంప్రదాయ రుచులకు దూరమవ్వాల్సిన అవసరం లేదని హామీనిస్తున్నాయి.

మసాలాబాక్స్‌... పేరుకి తగ్గట్లే వీళ్ల పదార్థాల్లోనూ ఘాటెక్కువే. రుచిలో తేడా రాకుండా నేరుగా రైతుల దగ్గర్నుంచే వీళ్లు పంటల్ని కొంటున్నారు. చేత్తోనే దంచాలని మహిళలకు సూచిస్తూ పచ్చళ్లూ, పొడులను తయారు చేయించి సరఫరా చేస్తున్నారు. అందుకే ప్రతి ప్యాకింగ్‌ మీద దర్జాగా ‘హ్యాండ్‌క్రాఫ్టెడ్‌’ అన్న ముద్రనూ వేసుకొని వినియోగదార్లకు అందిస్తున్నారు. ‘పికిల్‌ అండ్‌ పౌడర్‌’ అనే మరో సంస్థలో అయితే యాభై ఏళ్లు పైబడ్డ ఆడవాళ్లకే పెద్దపీట. పెద్దల అనుభవం పచ్చళ్లూ, పిండి వంటలకు అదనపు రుచిని తెచ్చిపెడుతుందన్నది వాళ్ల ఉద్దేశం కాబోలు. గోంగూర నుంచి పీతల పచ్చడి వరకూ, కొబ్బరి నుంచి కాకరకాయ పొడిదాకా... ఏది కావాలన్నా ఇక్కడ దొరికేస్తుంది. నూట ఇరవై మందికిపైగా గృహిణుల హస్తవాసితో సంస్థ మూడు పొడులూ, ఆరు పచ్చళ్లుగా ముందుకెళ్తొంది.

ఒంటరిగా తినొద్దు!
‘రేపు మధ్యాహ్నం ఓ పది మంది ఇంటికి భోజనానికి వస్తారు. నీకు బాగా వచ్చిన కూరలన్నీ వండిపెట్టు. ఆ వచ్చే అతిథులెవరో నాక్కూడా పరిచయం లేదు’... చాలా నెలల క్రితం గోపీ కిశోర్‌ తన తల్లితో చెప్పిన మాట ఇది. ఇంట్లో వాళ్లకైతే ఎలాగైనా వండొచ్చు కానీ, బయటివాళ్లకు నచ్చేలా చేయడం తనకు సాధ్యమేనా అన్నది ఆ తల్లి సందేహం. కొడుకు మాట కాదనలేక చికెన్‌ బిర్యానీ, రొయ్యల వేపుడు, ఎగ్‌ ఫ్రై, సాంబార్‌లాంటి పదార్థాలతో చక్కటి విందు సిద్ధం చేసింది. గోపీ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఆహ్వానానికి స్పందిస్తూ ఎనిమిది మంది అపరిచితులు భోజనానికొచ్చారు. ‘బ్రేవ్‌’మని ఒక్క తేన్పుతో ఆ ఆతిథ్యం ఎలా ఉందో చెప్పేశారు. అతిథులకు తన వంట నచ్చిందన్న సంతృప్తి తల్లిది. తన ఆలోచన సక్సెస్‌ అయిందన్న సంతోషం గోపీది. ‘ఫీజ్ట్‌’ అనే సరికొత్త స్టార్టప్‌కి ఆ సంఘటనే పునాది.

ఒకరికి వండటం ఇష్టం. మరొకరికి తినడం ఇష్టం. కొందరు అన్ని రకాల పదార్థాల్నీ అవలీలగా చేస్తారు. ఇంకొందరు అన్ని ప్రాంతాల రుచుల్నీ ఆబగా లాగిస్తారు. ఇలాంటి వాళ్లందర్నీ ఒక్కటి చేసే వేదికే ఫీజ్ట్‌. కనీసం ఓ పది మందికి రుచికరమైన ఆహారం వడ్డించగల వాళ్లెవరైనా ఇందులో సభ్యులుగా చేరొచ్చు. ఇంటి భోజనాన్నీ, పొరుగింటి రుచుల్నీ ఇష్టపడేవాళ్లెవరైనా అతిథులుగా మారొచ్చు. సంస్థలో పేరు నమోదు చేసుకొని ఎంత మందికి ఎలాంటి పదార్థాలు వడ్డించాలనుకుంటున్నదీ ఆతిథ్యమిచ్చేవాళ్లు చెబితే చాలు, ఠంచనుగా ఆ సమయానికి అతిథులు ఇంటి తలుపు తడతారు. ఈ విందుల వల్ల నాలుగ్గోడలకే పరిమితమైన వంటింటి మహారాణులు నలుగుర్నీ మెప్పించే హోమ్‌ షెఫ్‌లుగా మారుతున్నారు. ఇంటి భోజనం కోసం మొహం వాచిన వారికి ఆ కొరత తీరుతోంది. అపరిచితుల మధ్య ఆత్మీయత పెరుగుతోంది. కులాసా కబుర్లతో మొదలై కెరీర్‌ సలహాల దాకా వాళ్ల సంభాషణలు సాగుతున్నాయి.

‘ఇంకెప్పుడూ ఒంటరిగా తినకండీ’ అన్నది ఫీజ్ట్‌ నినాదం. కమ్మని ఇంటి భోజనం, కాస్త వినోదం, చక్కటి ఆతిథ్యం కలగలిపి మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచడమే దాని వ్యాపార విధానం.

సొంత కుంపటి
సంస్థలతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో వేరు కుంపటి పెట్టినవాళ్లూ ఉన్నారు. చెన్నైలో పనిచేస్తున్న రోజుల్లో తన కూతురు భోజనం కోసం పడ్డ ఇబ్బంది దీపికని షెఫ్‌గా మార్చింది. అలాంటి వాళ్ల జిహ్వ చాపల్యాన్ని కాస్తయినా దూరం చేయడానికి ‘లీలాస్‌ కిచెన్‌’ పేరుతో ఓ ఫేస్‌బుక్‌ పేజీని మొదలుపెట్టింది. అక్కడే ఆర్డర్లు తీసుకొని రోజూ ముప్ఫయి మందికి తగ్గకుండా వండిపెడుతోంది. గతంలో షెఫ్‌గా పనిచేసి ఇప్పుడు ఇంటి పట్టునే ఉంటూ ఫైవ్‌స్టార్‌ రుచుల్ని తన పేజీ ద్వారా పదిమందికీ పంచుతున్నారు రీతూ అనే మరో గృహిణి. ఫేస్‌బుక్‌ని జల్లెడపడితే ఇతరులకు స్వయం పాకం ప్రయాసని తగ్గిస్తూ ఉపాధి పొందుతున్న మహిళలు చాలామంది తారసపడతారు. స్వీట్లూ, సాస్‌లూ, బిస్కెట్లూ, కేకులూ... తినడానికి పనికొచ్చే ప్రతి పదార్థాన్నీ ఇంటర్నెట్‌ సాయంతో ఇంటి నుంచి ఇంటికి అందిస్తున్నారు. ‘తిన్నవాళ్ల ఉదరం ఉదారంగా ఇచ్చే ప్రశంసలే మా అసలు సంపాదన, ఆహారం ద్వారా వచ్చే డబ్బంతా అదనమే’ అన్నది ఆ మహిళల మాట.

ఉద్యోగం చేస్తే డబ్బొస్తుంది. కానీ నలుగురికి వండిపెడితే సంతృప్తీ మిగుల్తుంది. ఆ ఉద్దేశంతోనే గృహిణులు ఆన్‌లైన్‌ షెఫ్‌లుగా మారుతున్నారు. భర్త ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డ దీపమ్‌ ప్రేమానంద్‌, తన రెండేళ్ల కూతుర్ని చూసుకోవడానికి కెరీర్‌ని వదులుకుంది. కానీ ఇంట్లో ఖాళీగా ఉండటమంటే ఆమెకు మహా బోరు. భార్య చేతి పనితనం తెలిసిన భర్త ఆమె దగ్గర ఈ ఆన్‌లైన్‌ వంటిళ్ల ప్రస్తావన తెచ్చాడు. అలా తన వంటింటి నైపుణ్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని రోజూ 30-40మందికి వండి పెడుతోందామె. అదీ తన కూతుర్ని క్షణం కూడా విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండానే. చిన్నప్పట్నుంచీ వంట గదిలో గరిటె తిప్పడం అంటే ప్రణతికి చాలా సరదా. తన వంట నలుగురూ బావుందంటే చాలు, దాన్ని చేయడానికి పడ్డ కష్టమంతా మరచిపోతానంటారామె. ఆ సంతృప్తి కోసమే ఆమె ఆన్‌లైన్‌ షెఫ్‌గా మారారు. వినియోగదార్లు ఇచ్చే ఫైవ్‌స్టార్‌ రేటింగులతోనే తన కడుపు నిండిపోతుందని అంటున్నారు. హోమ్‌ షెఫ్‌లుగా మారిన మహిళలెవర్ని కదిలించినా ఇలాంటి సమాధానాలే వినిపిస్తాయి.

* * *

అమ్మకు వ్యాపారం తెలీదు. కస్టమర్లంతా తన కుటుంబ సభ్యులే అనుకుంటుంది. డబ్బాలో వాళ్లు తినేదానికంటే ఓ ముద్ద ఎక్కువే పెడుతుంది.

అమ్మకు మార్కెట్‌ గిమిక్కుల అవగాహన లేదు. అందుకే కృత్రిమ రంగులూ, వంట సోడాలూ, నిల్వ ఉంచే రసాయనాల జోలికి వెళ్లదు.

అమ్మకు డబ్బు వ్యామోహమూ తక్కువే. వంట చేస్తే వచ్చే లాభం కంటే తిన్నవాళ్ల మొహాల్లో సంతృప్తికే ఎక్కువ విలువిస్తుంది.

అమ్మ అమృత హస్తాలు తగిలిన పదార్థాల రుచికి తిరుగులేదు. వాటిని నమ్ముకున్న స్టార్టప్‌లకూ ఎదురు లేదు. వూరికే అంటారా మరి... బ్రహ్మ తన అంశను అమ్మ చేతిలో దాచాడని..!

షెఫ్‌గా మారాలంటే...

రుచిగా వండే నైపుణ్యం, పరిశుభ్రమైన వంట గదీ ఉంటే చాలు, గృహిణులెవరైనా హోమ్‌ షెఫ్‌లుగా మారిపోవచ్చంటున్నాయి అంకుర సంస్థలు. అన్ని సంస్థలూ మొదట ఇంటి వంట గదుల్ని పరిశీలిస్తాయి. తరవాత నాలుగైదు రోజుల పాటు పదార్థాల్ని రుచి చూస్తాయి. అన్నీ కుదిరాయి అనుకుంటేనే షెఫ్‌లుగా చేర్చుకుంటాయి. వినియోగదార్ల నుంచి ఆ వంటలకు వచ్చే రేటింగ్‌లూ, కామెంట్లే షెఫ్‌లుగా వాళ్ల మనుగడకు కీలకం. మహిళలు ఆయా వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకుంటే, తరవాతి ప్రక్రియ సంస్థలే చూసుకుంటాయి.

‘ఫైవ్‌స్టార్‌’ గృహిణి

ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బస చేసే కొందరు అతిథులూ ఇంటి భోజనాన్నే ఇష్టపడతారు. ఆ హోటళ్లు కూడా మహిళల చేతి రుచుల ప్రాధాన్యాన్ని గుర్తించాయి. అందుకే గేట్‌వే గ్రూప్‌, తాజ్‌ గ్రూప్‌ లాంటి ప్రముఖ హోటళ్లు కొందరు గృహిణులతో ఒప్పందం చేసుకుంటున్నాయి. హోటల్‌లో వాళ్ల కోసం ఒక ప్రత్యేక వంటగదిని ఏర్పాటు చేసి రోజుకో రెండు మూడు గంటల పాటు అక్కడికొచ్చి, తమకు బాగా నైపుణ్యమున్న వంటల్ని చేసిపెట్టమని ఆహ్వానిస్తున్నాయి. హోటల్‌ మెనూలో వాళ్ల వంటలకి పెట్టిన పేరు... ‘హోమ్‌ స్టైల్‌ ఫుడ్‌’.

కమ్మని రాయితీలు

కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ఇంటి భోజనాన్ని అందించే స్టార్టప్‌లూ కస్టమర్లపైన ఆఫర్లూ, వోచర్లూ, క్యాష్‌బ్యాక్‌ తాయిలాలు విసుర్తున్నాయి. తొలిసారి ఆర్డర్‌ చేస్తే 40శాతం, నెల మొత్తానికి సభ్యత్వం తీసుకుంటే పదిశాతం... ఇలా కమ్మని రాయితీలతో ఆకర్షిస్తున్నాయి. పార్సిళ్లను కూడా శుభ్రమైన డబ్బాల్లో అందిస్తూ, చెప్పిన సమయానికి వచ్చి మళ్లీ వాటిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాయి. ‘హోలాషెఫ్‌’ అనే స్టార్టప్‌ అయితే ఏకంగా ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో పనిచేసిన అనుభవమున్న షెఫ్‌లతో ఇంటి దగ్గరే వంట చేయిస్తూ కావల్సిన వాళ్లకు సరఫరా చేస్తోంది. వాళ్ల ఆలోచన రతన్‌టాటాకూ నచ్చి కొంత పెట్టుబడి సమకూర్చారు. భారత్‌లో హోం డెలివరీ ఆహార మార్కెట్‌ విలువ పదివేల కోట్ల రూపాయలకు పైనే. ఈ కొత్త స్టార్టప్‌లతో ఆ మార్కెట్‌లో భారీ చీలిక వస్తుందన్నది రతన్‌ అభిప్రాయం.

డబ్బావాలా స్ఫూర్తి

ముంబైలో బాగా పేరున్న ‘డబ్బావాలా’ను ఇంగ్లిష్‌లోకి మారిస్తే మా ‘టిన్‌మెన్‌’. ఇంచుమించు వాళ్లు చేసే పనినే మేము ఆన్‌లైన్‌ ద్వారా చేస్తున్నాం. చాలామంది మహిళలు డబ్బుకంటే వండి పెట్టడంలోని ఆనందాన్ని పొందేందుకే ఈ వైపు వస్తున్నారు. అందుకే రుచి గురించి వాళ్లకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ పిల్లలకి వంట చేసే చోటే బయటి వాళ్ల కోసమూ వండుతారు కాబట్టి పరిశుభ్రత విషయంలో భయపడాల్సిన పన్లేదు. ఆప్‌లో, వెబ్‌సైట్లో వచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఎప్పటికప్పుడు తాము వండే పద్ధతిలో మార్పులు చేసుకునే అవకాశమూ ఉంటుంది. మా హోమ్‌షెఫ్‌లు సగటున నెలకు రూ.30-40వేలు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌లోనే మేం రోజుకి వెయ్యికి పైగా భోజనాలను సరఫరా చేస్తున్నాం... అదీ ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకుండా!

- ముఖేష్‌,
టిన్‌మెన్‌ సహ వ్యవస్థాపకుడు

మూడొందల విందులు!

భిన్నమైన వంటలూ, వ్యక్తులను ఒకదగ్గరకు చేర్చే ఉద్దేశంతో మొదలైందే ఫీజ్ట్‌. ఆతిథ్యమిచ్చే వాళ్ల ఇంటికి భోజనానికి వచ్చే వాళ్లందరూ అపరిచితులే కాబట్టి ఇద్దరి భద్రతా కీలకమే. అందుకే విందు ఏర్పాటు చేసే వాళ్ల ఇల్లు ఉన్న ప్రాంతాన్నీ పరిగణనలోకి తీసుకుంటాం. వంట గది శుభ్రతా, ఇంటి వాతావరణం, వాళ్ల మాటతీరూ... అన్నీ ముఖ్యమే. భోజనానికి సంబంధించిన ధరను నిర్వాహకులే నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలకూ ఈ వేదికను విస్తరిస్తున్నాం. ఇతరులకు వండిపెట్టాలని చాలామందికి ఉన్నా, ఇల్లు చిన్నదనో, వూరికి దూరంగా ఉందనో విందుని నిర్వహించలేకపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం ప్రయోగాత్మకంగా ఓ ఫుడ్‌ హబ్‌ని నిర్మిస్తున్నాం. వండే వాళ్లూ, తినేవాళ్లూ అక్కడికే వచ్చి సమయం గడపొచ్చు. ఇప్పటిదాకా మా ద్వారా మూడొందల మందికిపైగా కమ్మని విందు వేడుకలకు ఆతిథ్యమిచ్చారు. ఐదువేల మందికిపైగా ఆ రుచుల్ని ఆస్వాదించారు.

- గోపీ కిశోర్‌, వంశీ కృష్ణ
ఫీజ్ట్‌ వ్యవస్థాపకులు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.