close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోలిక

పోలిక
- మద్దూరి గంగారాం

సాయంత్రం వాతావరణం ఆహ్లాదంగా ఉంది. కిటికీ తెరలు పక్కకు లాగుతూ అలవాటుగా పక్క డాబా వైపు చూసింది విమల. తనని చూసి స్నేహంగా చెయ్యి వూపింది సుగుణ. తను కూడా చెయ్యి వూపింది. ఇది రోజూ ఇంచుమించుగా జరిగేదే. పక్కింటి సుగుణ తన చిన్న మనవడితో ఆటలాడుతూ పాలు పట్టిస్తూ ఇంటిముందున్న పూలపందిరి కింద కూర్చుంది. ఆ చంటాడు పాలు తాగుతూ మధ్యలో నోట్లోంచి సీసా తీసేస్తూ- మామ్మ మొహంలోకి చూసి నవ్వడం, మళ్ళీ పాలు తాగడం. ఇది చూస్తూ సుగుణ వాణ్ణి ముద్దులాడుతూ పరవశించిపోతోంది. ఆ దృశ్యం చూసిన విమల నిట్టూర్చుతూ హాల్లో సోఫాలో కూర్చుని ఆలోచనల్లోకి జారిపోయింది.

తనకీ ఇద్దరు పిల్లలు- అమ్మాయి, అబ్బాయి. ఎగువ మధ్యతరగతి కుటుంబం. భర్త రామం బ్యాంకులో ఉద్యోగి. రెండేళ్ళలో పదవీ విరమణ చేస్తాడు. పిల్లలు బుద్ధిమంతులు. మంచి చదువులు, ఉద్యోగాలు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరేసి పిల్లలు కూడా. కానీ, ఉద్యోగాలరీత్యా చాలా దూరాన ఉంటారు. వీలైనప్పుడు వస్తుంటారు. వచ్చినపుడు పిల్లలు తననూ, తాతనూ కొత్తగా చూస్తారు. తమ దగ్గర కాస్త అలవాటయ్యేసరికి మళ్ళీ వెళ్ళిపోతారు. సంసారంలో దేనికీ లోటు లేదు కానీ, తెలియని అసంతృప్తి. ఏం చెయ్యాలో తెలియనంత విపరీతమైన తీరిక. తనూ, తన భర్తా... అంతే. పండగొచ్చినా, పిల్లల పుట్టినరోజులు వచ్చినా అంతర్జాలంలో చూసుకోవడమే! మనవలకు రకరకాలుగా చిరుతిళ్ళు వండి పెట్టాలనీ, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని వెంటేసుకుని సరదాగా వెళ్ళాలనీ... తనకీ ఒక పెద్దరికం, బాధ్యతా వచ్చాయన్న ఆనందం కావాలనీ మనసు కోరుతోంది. కానీ, ఏం లాభం... పిల్లలను అనడానికి వీల్లేదు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు బైటకు వెళ్ళారు. కానీ, ఇలా ఎంతకాలం? భర్త పదవీ విరమణ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ, తన భర్త ‘నేను ఇక్కడి పనులన్నీ మానేసి రాలేను. అయినా మనకి అక్కడేం పని’ అనేస్తాడు. ‘అయినా ఇంకా రెండేళ్ళు ఉందిగా. అప్పుడు ఆలోచిద్దాంలే’ అంటాడు. తనకి చిన్నచిన్న సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వాటితోనే కాలం గడుపుకోవాలి.

పక్కింటి సుగుణది మధ్య తరగతి కుటుంబం. సుగుణ భర్త సూర్యం ఒక రైసు మిల్లులో గుమాస్తా. నాలుగైదు షాపుల్లో అకౌంట్స్‌ రాస్తాడు. చాలా కష్టజీవి. సుగుణ కూడా టైలరింగ్‌ చేస్తూ భర్తతో సమానంగా కష్టపడింది. ఉన్నంతలో ఇద్దరు కొడుకులను చదివించారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి మసలుకొనేవారు. ప్రైవేటు స్కూళ్ళలో టీచర్లుగా జాయినైపోయారు. పెళ్ళిళ్ళు చేశారు. కోడళ్ళు కూడా చిన్న కుటుంబాల్లోంచి వచ్చారు. కష్టం సుఖం తెలిసినవారు. కోడళ్ళిద్దరూ కూడా అత్తామామలపట్ల ప్రేమగా, కుటుంబంపట్ల బాధ్యతగా ఉంటారు. వాళ్ళు కూడా బట్టల షాపులో ఒకరూ, చిన్న కాన్వెంట్‌లో ఒకరూ ఉద్యోగాల్లో చేరి, వాళ్ళవంతుగా కుటుంబానికి సాయంచేస్తూ ఉన్నంతలో అంతా సంతోషంగా ఉంటారు. పెద్ద అబ్బాయికి పాప. కాన్వెంటుకి వెళ్తొంది. చిన్నబ్బాయి కొడుకే ఈ చంటాడు. ఈ ఇంటి పనులతో క్షణం తీరిక ఉండదు సుగుణకి. ఎప్పుడూ హడావుడిగా ఇంటిపనులతో సతమతమవుతూ, ఇల్లంతా తన చేతుల మీదుగా సమర్థంగా నడుపుతూ అందరూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంది. ఈ సందడి చూస్తూ తనకీ అలా ఉండాలనీ, పిల్లలూ భర్తా ఇలా తన చుట్టూ తిరుగుతూ ప్రతిదానికీ తనమీద ఆధారపడాలనీ... ఇలాంటి కోరిక తన మనసులో రేగుతుంటుంది. కానీ, తనకు అది తీరని కోరికే. సుగుణది నిండైన జీవితం. అది ఆమె అదృష్టం. ఈ ఆలోచనలతో ఉన్న విమల ఫోన్‌ రింగవడంతో ఈ లోకంలోకి వచ్చింది.

* * * 

నవ్వుతూ చెయ్యి వూపిన విమలే గుర్తొస్తోంది సుగుణకి. చంటాడు పాలు తాగి నిద్రపోవడంతో ఆలోచనల్లోకి నెమ్మదిగా జారింది సుగుణ. విమలదీ తనదీ ఇంచుమించు ఒకటే వయసు. కానీ, విమల ఎంత హుషారుగా ఉంటుందీ. పిల్లలు దూరంగా ఉన్నా అన్నిరకాలా స్థితిమంతులు. విమల ఎప్పుడూ సంతోషంగా, స్థిమితంగా ఉంటుంది. భార్యభర్తలిద్దరూ కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక అనాథాశ్రమ నిర్వహణలో సభ్యులుగా కూడా ఉన్నారు. ఆ విధంగా నలుగురిలో మంచి పేరుప్రతిష్ఠల్నీ గౌరవాన్నీ పొందుతున్నారు. విమలది చాలా మంచి మనస్తత్వం. తనకి తోచినంతలో నలుగురికీ సాయం చేస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఆమెను అనేకమంది ఇష్టపడి గౌరవిస్తారు. తనకి కూడా అలా ఉండాలనీ నలుగురిలో మంచిపేరు తెచ్చుకొనేలా మంచిపనులు చేయాలనీ చేతనైన సామాజిక సేవ చేయాలనీ చదువుకునేటప్పట్నుంచీ ఎంతో కోరిక. కానీ ఏదీ... ఈ సంసారం అనే వూబిలోంచి బైటపడే మార్గంలేదు. రోజురోజుకూ బాధ్యతలు పెరుగుతున్నాయ్‌ తప్ప తగ్గడం లేదు. ఇంతే, తన జీవితం మారదు. ఎంతైనా విమలది హుషారైన జీవితం, అది ఆమె అదృష్టం. ఈ ఆలోచనలతో ఉన్న సుగుణ, భర్త సైకిల్‌ బెల్‌ కొడుతూ గుమ్మంలో ఆగేటప్పటికి గబుక్కున లేచి తలుపు తీయడానికి వెళ్ళింది.

* * *

 మొబైల్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకుని మాట్లాడసాగింది విమల. అవతలనుంచి తాము ఆర్థికసాయం అందించి చదివించిన ఒక అబ్బాయి ఫోన్‌ చేసి, ‘తాను చాలా మంచి కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యాననీ, ఇది అంతా మీ దయవల్లే జరిగిందనీ’ ఆనందంతో, గద్గదస్వరంతో చెబుతున్నాడు. అది విన్న విమల ఆనందంతో పొంగిపోయింది. గాల్లో తేలినట్లుగా అనుభూతి చెందింది. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. అతనికి మంచి ఉద్యోగం వచ్చిందని చాలా ఆనందపడింది. అతనికి ఆశీస్సులు చెప్పింది. ఫోన్‌ పెట్టేసి ఇల్లంతా కలియ తిరిగింది. భర్తకూ పిల్లలకూ ఫోన్‌ చేసి చెప్పింది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఒక అనాథ జీవితాన్ని తమకి చేతనైనంతలో బాగుచేయగలిగారు. సమాజాన్ని అంతా ఉద్ధరించనవసరం లేదు. తమ పరిధికి మించకుండా ఉన్నంతలో నలుగురికీ తోచిన సాయం చేయడం చాలా మంచి విషయం.

అలా మళ్ళీ ఆలోచనలోపడింది విమల. అవును, తనెందుకు జీవితంపట్ల అశాంతిగా ఉండాలి? అందరి జీవితం ఒకేలా ఉండదుగా. ఎవరికి లభించిన జీవితంలో వారు తృప్తిగా బతకాలి. తన భర్త రామం తరచుగా అంటారు ‘మనం పిల్లల దగ్గరకి వెళ్ళి మాత్రం ఏం చేస్తాం. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నాలుగురోజులు బాగానే ఉంటుంది. మనకి అక్కడేం పని ఉండదు. ఏమీ తోచదు. అదే ఇక్కడైతే మనకి తగ్గది ఏదో ఒక పని చేసుకోవచ్చు. మనం వెళ్ళవలసిన రోజు ఒకటి తప్పక వస్తుంది. అప్పుడు ఎలాగూ తప్పదు. మనకి లభించిన ఈ జీవితాన్ని సంతోషంగా, హాయిగా అనుభవించు. మనం ఇద్దరం ఒకరికొకరు తోడు. కొత్తగా జీవితం మొదలుపెట్టినట్లుగా భావించవోయ్‌’ అని చమత్కరిస్తాడు నవ్వుతూ. అలా నవ్వుతున్న రామం వదనం కనులముందు కదలాడింది విమలకు. తన పెదవులు కూడా నవ్వుతో విచ్చుకున్నాయి. ‘నిజమే, ఈ జీవితాన్ని ఇంకా అందంగా మలచుకుంటాను. నా గురించి సుగుణ ఇలా ఆలోచిస్తుందా..? ఆమెకి అంత తీరికే ఉండదు. హాయిగా తన సంసారమే తన సర్వస్వం అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఎవరి జీవితం వారిది. పోలిక అనవసరం. సాయంత్రం మహిళా సంఘంలో చిన్న కార్యక్రమం ఉంది. వికలాంగుల సంక్షేమం కోసం ఒక కార్యక్రమం రూపొందించాలి. ఆయన వచ్చి బండిమీద తీసుకెళ్తానన్నారు. తొందరగా వెళ్ళాలి’ అనుకుంటూ హుషారుగా ఉత్సాహంగా సోఫాలోంచి లేచింది విమల.

* * *

 విమల ఇంటిముందు బండి చప్పుడు వినబడి అటుగా చూసింది సుగుణ. ‘సాయంత్రమైందిగా ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు- చిలకా గోరింకల్లా’ అనుకుంది. ఈరోజు సుగుణకు చాలా చిరాగ్గా ఉంది. పిల్లల్నీ భర్తనీ అందర్నీ విసుక్కుంటూనే ఉంది. కొడుకులూ కోడళ్ళూ నిశ్శబ్దంగా అయిపోయారు. సూర్యం ఒకటే ఆలోచిస్తున్నాడు- ‘ఏమైంది సుగుణకి? ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేది. ఈరోజు ఎందుకిలా ఉంది..?’ అక్కడికీ దగ్గరగా వెళ్ళి ఆరాటంగా, లాలనగా అడిగాడు... ‘ఒంట్లో బాగలేదా సుగుణా?’ అని. కస్సుమందిగానీ, జవాబివ్వలేదు. ఇక ఆరోజు రాత్రీ అలాగే అందరూ నెమ్మదిగా భోజనాలూ పనులూ కానిచ్చి పడుకున్నారు. రోజూలాంటి సందడి లేనేలేదు. ఇల్లంతా ఏదోలా ఉంది. వరండాలో పడుకున్నారు సుగుణా, సూర్యం. రాత్రి పదకొండు దాటింది. బెంగపడిన సూర్యం, తనచేతిని సుగుణ చెయ్యి మీద వేశాడు. ఆప్యాయమైన ఆ స్పర్శకు దుఃఖం తన్నుకొచ్చింది సుగుణకు. ఏడుస్తున్న సుగుణను ఆర్తిగా దగ్గరకు తీసుకున్నాడు సూర్యం. ‘‘ఏమైంది సుగుణా, ఎందుకలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా... ఏం జరిగింది. నువ్వలా ఉంటే నేను తట్టుకోలేను సుగుణా’’ భారంగా అన్నాడు సూర్యం.

‘‘అబ్బే, ఏమీ లేదండీ. ఏదో చిరాగ్గా నీరసంగా అనిపించింది. ఇప్పుడు బాగానే ఉంది, మీరు పడుకోండి.’’ మామూలుగా పలికిన ఆమె మాటలతో కొంచెం తేరుకున్నాడు సూర్యం.

అలసిన శరీరం క్షణాల్లో నిద్రపోయాడు.

కళ్ళుమూసుకు పడుకున్నదేగానీ సుగుణకు నిద్ర రాలేదు. సాయంత్రం నుంచీ తన ప్రవర్తనా ఆలోచనలూ తలచుకుంటే తనకే సిగ్గుగా ఉంది. ‘ఎందుకలా ప్రవర్తించింది తను. తన అదృష్టం ఎంతమందికి వస్తుంది. ఇంటిల్లిపాదీ తనమీద ఆధారపడతారు. కోడళ్ళు కూడా ఎంతో సహాయంగా ఉంటారు పాపం, అత్తగారు అన్ని పనులూ చెయ్యలేరని వాళ్ళే చీకటితో లేచి చాలా పనులు చక్కబెట్టి ఉద్యోగాలకు వెళతారు. వాళ్ళు రాగానే కాస్త టిఫినూ కాఫీ అందిస్తే, ఆ మొహాల్లో కనబడే ఆనందానికీ అభిమానానికీ ఏదిసాటి వస్తుంది. చంటిపిల్లలు నిద్రపోయాక అందరూ కలసి కింద కూర్చుని నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ భోజనాలు చేస్తారు. చిన్నకొడుకు చాలా హుషారు. ఎప్పుడూ ఏవో ఛలోక్తులు చెబుతూ అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. ఆ నవ్వులతో ఎంతకీ భోజనాలు తినడం అవ్వదు. ఆ తర్వాత అందరూ కలిసి ఇల్లంతా శుభ్రం చేసుకుని హాయిగా నిద్రపోతారు. నేనున్నాననే కదా... వాళ్ళకంత నిశ్చింత.

తన భర్తకి తనమీద ఎంత నమ్మకం. ‘ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండటానికి నువ్వే కారణం సుగుణా’ అని తరచుగా అంటాడు. ఇంత చక్కని జీవితం తనకుండగా, ఎదురింటివాళ్ళ, పక్కింటివాళ్ళజీవితంలా లేదని తను బాధపడి అందరినీ బాధపెట్టడం ఎంత అవివేకం! అందరి జీవితం ఒకలా ఉండదు. తన గురించి విమల ఇలా ఆలోచిస్తుందా... ఎప్పటికీ ఆలోచించదు. అయినా ఆమెకంత తీరిక ఎక్కడిది? తన పనులతో ఎప్పుడూ హడావుడిగా ఉంటుంది. నేను మాత్రం ఇలా ఎందుకు ఆలోచించాలి..? ఎవరి జీవితం వారిది. పోలిక అనవసరం.’

ఇలా ఆలోచించగానే చాలా ప్రశాంతంగా అయింది సుగుణ మనసు. ‘రేపు తనే అందరికన్నా ముందు లేచి, పిల్లలకు అన్నీ చేసి సంతోషపెట్టాలి. పాపం, సాయంత్రం తన ప్రవర్తన చూసి అందరూ బిక్కమొహాలు వేశారు. వాళ్ళందరి మొహాల్లో ఆనందం నింపాలి. అది తన చేతుల్లోని పని. ముందు నావాళ్ళకి నేను సేవ చేసుకోవాలి. ఉన్నంతలో సంతోషంగా జీవించాలి’ అనుకుంటూ హాయిగా నిద్రపోయింది సుగుణ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.