close
చదువే నాకు ధైర్యాన్నిచ్చింది

చదువే నాకు ధైర్యాన్నిచ్చింది

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కోడలూ, ఓ అగ్ర కథానాయకుడి కూతురూ, తెలుగువారి అభిమాన అన్నగారి మనవరాలు... బయటి ప్రపంచానికి తెలిసిన బ్రాహ్మణి ఇంతే. కానీ కాసేపు మాట్లాడితే ‘ఇరవై తొమ్మిదేళ్లకే ఇంత పరిణతా?’ అనిపిస్తుంది. ఆమె ఆలోచనల్ని గమనిస్తే కుటుంబ నేపథ్యానికి తగ్గ దారిలోనే అడుగులేస్తోందని అర్థమవుతుంది. మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆమె మనసులోని మాటల్ని చదవాల్సిందే...

నేను పుట్టింది ముంబయిలో. పెరిగింది చెన్నైలో. ఇప్పటికీ అక్కడ నాకు ఇష్టమైన ప్రాంతాలెన్నో ఉన్నాయి. చాలామంది స్నేహితులూ ఉన్నారు. సినీపరిశ్రమ హైదరాబాద్‌కి మారడంతో మేం కూడా వచ్చేశాం. చిన్నప్పటి నుంచీ నాకు లెక్కలంటే చాలా ఇష్టం. రోజులో పది గంటలపాటు కదలకుండా కూర్చుని చేయమన్నా చేసేదాన్ని. ఇంటర్మీడియట్‌లో శ్రీచైతన్యలో స్టార్‌బ్యాచ్‌లో ఉండేదాన్ని. ఒక్కమార్కు తగ్గితే ఎంసెట్‌లో ర్యాంకులు గల్లంతయిపోతాయి కదా! నమూనా పరీక్షల్లోనూ విపరీతంగా పోటీపడేదాన్ని. నా పట్టుదలకి అమ్మ క్రమశిక్షణా తోడయ్యేది. చదువు విషయంలో ఆమె కాస్త కటువుగానే ఉండేది. సెలవులొచ్చాయంటే కేంబ్రిడ్జ్‌, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి విశ్వవిద్యాలయాలు అందించే వేసవి శిబిరాల వివరాలు సేకరించి, నన్ను విదేశాలకి పంపేది. ఆ చదువే ఇప్పటి నా ఆత్మస్థైర్యానికి కారణమని నమ్ముతున్నా!

స్టాన్‌ఫోర్డ్‌కి...
ఇంటర్‌ తరవాత సీబీఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతూ అమెరికా వెళ్లా. అక్కడే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్‌ చేశా. అన్ని విభాగాల్లోనూ అత్యధిక జీపీ అందుకున్నా! ఎంబీఏ చేయడానికని దరఖాస్తు చేసుకుంటే నాలుగు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం దొరికింది. నేను స్టాన్‌ఫోర్డ్‌ని ఎంచుకున్నా. చదువుతోపాటు వివిధ క్లబ్‌ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేదాన్ని. మార్కెటింగ్‌ క్లబ్‌, అగ్రి, ఫార్మా క్లబ్‌లకు లీడర్స్‌ టీమ్‌లో ఉండేదాన్ని. అక్కడున్న రోజుల్లోనే నా దృష్టి వెంచర్‌ క్యాపిటల్‌ రంగంవైపు మళ్లింది. కొత్త పరిశ్రమలని ప్రోత్సహించి వారికి ఆర్థిక సాయం అందించడమే ఓ వృత్తిగా మారడం నాకు గమ్మత్తుగా అనిపించేది. అందుకే దానిపై ఎంతో పరిశోధన చేశాను. సింగపూర్‌లో దానికి సంబంధించి పుష్కలంగా అవకాశాలున్నాయని తెలియడంతో ఎంబీఏ తరవాత అక్కడికే వెళ్లి రెండేళ్లపాటు ఓ సంస్థలో పనిచేశాను. సీఈవోకి రిపోర్ట్‌ చేసే పనిలో ఉండటం వల్ల ఫైనాన్స్‌, డీల్‌ సోర్సింగ్‌ వంటి ఎన్నో విషయాలు ఒంట పట్టించుకున్నా. పది నుంచి పద్దెనిమిదిగంటలపాటు పనిచేసినా అలసటే ఉండేది కాదు. అర్ధరాత్రైనా పని పూర్తయ్యాక మెట్రో రైలు పట్టుకుని ఇంటికి వెళ్లిపోయేదాన్ని. అమ్మాయిలకి అంత భద్రత ఉండేదక్కడ! నా ప్రాజెక్టు పూర్తయ్యాక అమెరికా వెళ్లిపోయి, ఎంబీఏ పట్టా అందుకున్నా. తిరిగి చూస్తే అప్పటికే నేను చదువుల కోసం మన దేశం వదిలి ఏడేళ్లు గడిచిపోయాయి.

హెరిటేజ్‌...
పెళ్లయ్యాక హెరిటేజ్‌ సంస్థ బాధ్యతలు వచ్చాయి. నేను ఏ పనిచేసినా వందశాతం కష్టపడతానని ఇంట్లోవాళ్ల నమ్మకం. మొదటి రోజు నుంచే అత్తయ్యతో కలిసి సంస్థలో నాదైన ముద్రవేసేందుకు ప్రయత్నించా. కార్పొరేట్‌ ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోని అత్యుత్తమ వంద సంస్థల్లో హెరిటేజ్‌ ఒకటిగా నిలవడం, ‘గోల్డెన్‌ పీకాక్‌’ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. అన్ని స్థాయుల్లోనూ సంస్థ నిర్వహణలో ఉన్న పారదర్శకత, పాడిరైతు సంక్షేమం కోసం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని చెప్పాలి. సంస్థ ద్వారా బ్యాంకులతో ఎంవోయూలు కుదుర్చుకుని పాడిరైతులకి ఏటా వందకోట్ల మేర రుణాలిస్తున్నాం. ఇలా లక్షల మందికి సాయపడుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, దిల్లీ, ఒడిశాకీ విస్తరించాం. మరికొన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నేనెప్పుడూ సంతృప్తిగానే ఉన్నా!

‘ఈ డ్రెస్సేమిటి?’
మా కుటుంబాలకి ఈరోజు ఇంత పేరూ ప్రతిష్ఠా వచ్చాయంటే అదంతా తాతగారి చలవే! ఆయనతో రక్తసంబంధం ఉన్నందుకు గర్వంగా అనిపిస్తోంది. ఆయన మాతో గడపడానికంటే ప్రజలతో కలిసిపోవడానికే ఇష్టపడేవారు. ఆయనతో ఆడుకున్న రోజులు తక్కువే. రోజూ ఉదయం ఆయనతో కలిసే అల్పాహారం తినేదాన్ని. ఆయన పొద్దున్నే ఏం తిన్నా జతగా చికెన్‌ ఉండాల్సిందే! నాకూ కోడికూరంటే ఇష్టం కాబట్టి నన్ను పక్కన కూర్చోపెట్టుకుని తినిపించేవారు. అందరికీ తాతగారంటే భయం ఉండేది, ఒక్క మా చెల్లెలికి తప్ప. ఓ సంఘటన చెబుతా... ఆ రోజు నా పుట్టినరోజు. అప్పట్లో తాతగారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ఆశీర్వాదం తీసుకుందామని వెళితే గదిలో అధికారులతో మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆయన కాషాయరంగుకు బదులుగా తెలుపు దుస్తులు వేసుకున్నారు. మా చెల్లెలు దఢాల్న తలుపు తోసుకుని లోపలికెళ్లి ‘ఏంటి ఈ డ్రెస్‌?!’ అంది సీరియస్‌గా. నేనైతే తాతగారు కోప్పడతారేమోనని భయపడిపోయాను. ఆయన మాత్రం తేలిగ్గా నవ్వేశారు.

గోడ దూకించేవారు...
చెప్పాకదా... మా చెల్లి తేజూ చాలా అల్లరిదని! మా ఇద్దరికీ కాసేపు కూడా పడేది కాదు. ఎదిగేకొద్దీ తేజూతో ఉన్న అనుబంధం విలువేమిటో తెలుసుకున్నా. ఇప్పుడు నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ జాబితాలో తేజూ కూడా ఉంది. మోక్షజ్ఞ మాకంటే చాలా చిన్నవాడు కావడంవల్ల వాడు మాతో కలిసి ఆడుకోవడం కన్నా, మేం వాణ్ని ఆడించేదే ఎక్కువ. వాడు ఏ అల్లరి చేసినా అమ్మానాన్నా నన్నే తిట్టేవారు. నేను కాస్త ఏడుపుముఖం పెడితే ‘చిన్నపిల్లాడు కదమ్మా, మనమే చూసుకోవాలి!’ అనేవారు. శరీరాన్ని దృఢంగా, చలాకీగా ఉంచుకోవాలని నాన్న చెప్పేవారు. చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేదాన్ని కాబట్టి రోజూ జాగింగ్‌కి తీసుకెళ్లేవారు. హైదరాబాద్‌లో మా ఇంటి ఎదురుగా కేబీఆర్‌ పార్క్‌ ఉంటుంది. దాన్ని తెరవక ముందే ఇద్దరం వెళ్లిపోయేవాళ్లం. నాన్న నన్ను భుజాలపై ఎక్కించుకుని గోడ దూకించేవారు. నేను లోపలకి వెళ్లాక ఆయన దూకివచ్చేవారు. మా జాగింగ్‌ అయిపోయాకే గేట్లు తెరిచేవారు. నాకు బ్యాలె డ్యాన్స్‌ నేర్పించాలన్నది నాన్న కోరిక. చెన్నైలో ఉన్నప్పుడు దానికోసం రష్యన్‌ కాన్సులేట్‌కి తీసుకెళ్లారు. నేను మాత్రం నేర్చుకోనంటూ ఏడ్చి గోల చేసి తిరిగి వచ్చేశా!

అమ్మ అలా పోరాడింది...
మా ఇంట్లో అమ్మే అన్నీ. ఆమె తరంవాళ్లలో అంత స్వతంత్ర భావాలున్న స్త్రీని నేను చూడలేదు. ఈ రోజు నాకు ఆర్థిక వ్యవహారాలపై పట్టు వచ్చిందన్నా, సామాజిక భద్రతా, బాధ్యతల గురించి ఆలోచిస్తున్నా అన్నీ అమ్మ నుంచే అందిపుచ్చుకున్నా. తను పెద్దగా చదువుకోకపోయినా, నిర్ణయాలు తీసుకోవడంలో, స్వతంత్ర ఆలోచనలతో ముందుకెళ్లడంలో తనే మాకు స్ఫూర్తి. ఇదంతా ఒక్క మాటలో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ చెబుతా. నేను ఐదో తరగతి చదివేటప్పుడు హిందీ ఐచ్ఛిక భాషగా ఉండేది. నేను మూడో భాషగా తెలుగు తీసుకునే అవకాశం ఉన్నా బడి యాజమాన్యం అందుకు ఒప్పుకోలేదు. అమ్మ ఎన్నో వెబ్‌సైట్లు వెతికి నిబంధనలన్నీ చదివి, వాటన్నింటి ప్రతులు తీసుకుని యాజమాన్యం దగ్గరకి వెళ్లి ‘మీరు నిబంధనల ప్రకారం తెలుగుని అనుమతించాల్సిందే’ అంటూ చిన్నపాటి పోరాటమే చేసింది!

లోకేష్‌తో జీవితం...
ఇప్పటికి మా పెళ్లయి పదేళ్లు. పెళ్లయేనాటికి ఇద్దరం స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకుంటున్నాం. మేం మొదట్లో కేవలం మూడు నెలలు మాత్రమే అమెరికాలో కలిసి ఉన్నాం. ఆయన చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌ వచ్చేశారు. నేను మాత్రం అక్కడే ఉండి చదువు పూర్తిచేశా. పెళ్లయ్యాక మా నాన్న తరచూ లోకేష్‌తో ఓ మాట అంటుండేవారు... ‘నా ఇల్లూ, నా ఇల్లూ అంటూ నా కూతుర్నే కొట్టేశావు కదా!’ అని.అదేంటంటే... ఇప్పుడు హైదరాబాద్‌లో మేమున్న ఇంట్లో ఒకప్పుడు లోకేష్‌, మామయ్యా, అత్తయ్యా ఉండేవాళ్లు. మేం హైదరాబాద్‌కి వచ్చాక ఆ ఇంట్లోకి మేం వెళితే, మావయ్యావాళ్లు వేరే చోటకి వెళ్లారు. చిన్నప్పుడు లోకేష్‌ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇద్దరం ‘ఇది మా ఇల్లంటే, కాదు మా ఇల్లు!’ అని కొట్టుకునేవాళ్లం. అందుకే నాన్న లోకేష్‌తో అలా అనేవారు. ఓ వేసవి సెలవులకు మా కుటుంబం అంతా కలిసి అమెరికా విహారయాత్రకు వెళ్లారట. అప్పటికి నేను అమ్మ కడుపులో ఉన్నానట. ఆ విషయం తెలిసి లోకేష్‌ పదే పదే, పాప ఎక్కడ నాకు చూపించు, ఇప్పుడే నేను చూడాలి అంటూ గోల చేశాడట. మరో పందొమ్మిదేళ్లకి ఇద్దరం భార్యాభర్తలం అయ్యాం. మొదట పెళ్లి గురించి చెప్పినప్పుడు కొంచెం కంగారు పడ్డా. తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాక అభిరుచులూ ఆలోచనలూ ఒకటేనని అర్థమైంది.

మా వైవాహిక జీవితంలో లోకేష్‌ నాకిచ్చిన గొప్ప సర్‌ప్రైజ్‌ అంటే... నేను స్టాన్‌ఫోర్డ్‌లో అత్యధిక జీపీ సాధించినప్పుడు చంద్రబాబు గారితో సహా ఫ్యామిలీ అందరినీ ఒప్పించి అమెరికా తీసుకురావడమే! అది గుర్తొచ్చినప్పుడల్లా ఎంత సంతోషంగా అనిపిస్తుందో!

‘ఓ.. ఈ రోజు దీపావళా!’
చిన్నప్పుడు నేను మామయ్యని చూసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయనకెప్పుడూ పనే లోకం. ఈ మధ్య అధికారి ఒకరు నాతో ఓ విషయం పంచుకున్నారు. ఆరోజు దీపావళి. మావయ్య అధికారులతో ఏదో సమావేశం ఏర్పాటుచేశారు. రాత్రి ఎనిమిది కావొస్తుంది. పండగ రోజు కదా, ముఖ్యమంత్రి ఇంటికెప్పుడు పంపిస్తారా అని అధికారులు ఎదురుచూస్తున్నారు. కానీ ఎవరూ ఆ మాట ఆయనతో చెప్పలేకపోయారు. ఈలోగా లోకేష్‌ సమావేశ గదికి దగ్గరలో ఓ టపాకాయ పేల్చాడట. ఆ శబ్దం విన్నాకే ‘ఓ ఈ రోజు దీపావళా, మీరిక వెళ్లండి’ అన్నారట. మావయ్యగారూ, దేవాంశ్‌ కలిస్తే ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. వాడు అడిగే ప్రతి సందేహాన్నీ ఓపిగ్గా తీరుస్తుంటారు. ఓసారి ఆవుని చూసి ‘అదేమిటీ’ అన్నాడట. ఆయన ‘ఆవు తెల్లగా ఉంటుంది, పాలు ఇస్తుంది, అని మొదలుపెట్టి రాష్ట్రంలో ఎన్ని ఆవులున్నాయి? ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయి? వాటి పోషణ ఎలా...’ ఇలా గణాంకాలే చెబుతూ పోయారట!!

అమ్మలానే అత్తయ్యకూ మనోనిబ్బరం చాలా ఎక్కువ. ఇరవై ఏళ్లుగా హెరిటేజ్‌ని అద్భుతంగా నడుపుతున్నారామె. ‘సున్నా ఆదాయం’ ఉన్న సంస్థని రెండువేల కోట్ల వ్యాపారం అందుకునే స్థాయికి తీసుకెళ్లిన ప్రతిభ అత్తయ్యది. ఇన్నేళ్లపాటు అటు ఇంటినీ, ఇటు వ్యాపారాన్ని సమన్వయం చేసుకోవడంలోనూ ఆమెకు తిరుగులేదు.

ఈతంటే ఇష్టం
ఆరోగ్యం, పోషకాహారంతో పాటు నాకు ఇష్టమైన మరో అంశం ఫిట్‌నెస్‌. ఈ విషయంలో అత్తయ్యే నాకు స్ఫూర్తి. ఆమెలానే నేను కూడా ఫిట్‌నెస్‌పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా. రోజూ దేవాంశ్‌ స్కూల్‌కి వెళ్లాక ఓ అరగంట పాటు జాగింగ్‌ చేస్తా. వారంలో కచ్చితంగా కొంత సమయం శరీరానికి వ్యాయామం ఉండేలా చూసుకుంటా. నాకు ఈత అంటే చాలా ఇష్టం. వారంలో నాలుగు రోజులు, రోజుకి కనీసం అరగంటైనా నీళ్లలో ఉంటా. టీవీలో బ్యాడ్మింటన్‌ ఆసక్తిగా చూస్తాను. పీవీ సింధు గెలిచినప్పుడు ఎంత గర్వపడ్డానో.

చదువే ధైర్యం
రాజకీయాలే కాదు ఏ రంగంలో అయినా స్త్రీపురుషులకు మధ్య పరిధులు నిర్ణయించడం వల్ల ఉపయోగం ఉండదనేది నా ఆలోచన. ఫలానావారి కూతురిగా, కోడలిగా వ్యాపార రంగంలోకి రావడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఎలా వచ్చినా అక్కడ నిలదొక్కుకోవాలంటే సామర్థ్యం ఉంటేగానీ సాధ్యం కాదు. ఇది వ్యాపారానికే కాదు, రాజకీయాలకూ వర్తిస్తుంది. అలాంటి స్వతంత్ర ఆలోచనలు చేయడానికీ, అమలు చేయడానికీ మహిళకు ధైర్యం కావాలంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుందనేది నా అభిప్రాయం. నాకా ధైర్యాన్ని ఇచ్చింది చదువే మరి.

- కొరపాటి స్వాతి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.