close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడవినే పెంచుకున్నారు!

అడవినే పెంచుకున్నారు!

మామూలుగా మొక్కలూ, చెట్లూ పెంచుకోవడం తెలుసు. కానీ ఓ వూరివాళ్లు ఏకంగా అడవినే పెంచుకున్నారు. నేలతల్లికి తిరిగిచ్చేయడం అలవాటు కాబట్టి ఆ వూరివాళ్లకు బతుకునే తిరిగిచ్చేసింది. ప్రభుత్వమూ స్వచ్ఛంద సంస్థల ప్రమేయం ఏమాత్రం లేకుండానే, వాళ్లు అడవిని పెంచింది ఏకంగా 365 ఎకరాల్లో మరి!

పండని నేల ఎంత ఉంటే ఏముంది. ఫలం లేని నేలలో రైతుకు భరోసా ఏముంటుంది. అచ్చంగా అలాంటి నేలలే ఉన్నాయి ఝార్ఖండ్‌లోని అంగారా మండలం హిసాతు గ్రామంలో. 800 జనాభా, 93 ఇళ్లూ ఉన్న చిన్న గ్రామం అది. ఏడేళ్ల క్రితం, ఓ రోజు గ్రామసభ సందర్భంగా రైతులంతా పంట వేయకుండా వృథాగా ఉన్న వూరి నేలల గురించి చర్చించుకుంటున్నారు. వ్యవసాయం చేయడానికి అనువుగా ఉండే నేలలు కావవి. అందుకే వందల ఎకరాలను నిరుపయోగంగా వదిలేశారు వాళ్లు. అదే సభలో వెనుక నుంచీ ఓ గొంతు వినిపించింది ‘ఈ నేలల్లో అందరం కలిసి మనమే సొంతంగా అడవిని పెంచుకుంటే...’ అని. విన్న వాళ్లందరికీ అది మంచి ఆలోచనే అనిపించింది. సమస్యలెక్కడైతే చర్చకు వచ్చాయో అక్కడే పరిష్కారమూ లభించింది. వెనువెంటనే అడవిని ఎలా పెంచాలన్న దిశలో ఆలోచనలు సాగాయి. 25-30 మంది కలిసి ఓ ప్రణాళికను రూపొందించారు. వూరందరికీ ఎంతో ఇష్టమైన పండుగ హోలీనాడు పనులకు శ్రీకారం చుట్టారు.

ఒక్కొక్కటిగా...
ముందుగా చుట్టు పక్కల ఉన్న నేలను అందరూ కలిసి తవ్వారు. అందులో ఆకుకూరలూ, కూరగాయలూ పెంచారు. వాటి మీద వచ్చిన లాభంతో అడవిని పెంచేందుకు మొక్కలూ ఇతర వనరులను సమకూర్చుకున్నారు. నిజానికి అప్పటికే ఆ వూరివాళ్లు లక్క కోసం కోసంగి చెట్లనూ, రకరకాల రేగిపండ్ల చెట్లనూ 200 ఎకరాల్లో పెంచుతున్నారు. వీటితో పాటు మరికొన్ని రకాల చెట్లను ఇక్కడ వేయాలనుకున్నారు. ఒక్కో దానికీ ఎనిమిది అడుగుల దూరం ఉండేలా మొక్కలు నాటారు. వాటి మధ్య మిగిలిన స్థలంలో పసుపూ, అల్లం, ఇతర దుంపకూరలను పెంచడం మొదలు పెట్టారు. ఓ పక్క కూరగాయల పెంపకమూ జరుగుతూనే ఉంది. కొంత మేర బొప్పాయితోటల్లాంటివీ పెంచడం మొదలు పెట్టారు. అలా మొత్తం 365 ఎకరాల్లో లక్ష చెట్లను నాటి జాగ్రత్తగా పెంచారు గ్రామస్థులు. చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తుల్ని అమ్మడం మొదలు పెట్టారు. మరోపక్క ఎండిపోయిన మోడుల్ని కలప తదితర అవసరాలకు విక్రయించడం మొదలుపెట్టారు. ఇక వీళ్ల అటవీ వ్యవసాయ విధానాన్ని తెలుసుకునేందుకు కొంతమంది ఔత్సాహికులు వస్తున్నారట. వాళ్లకూ తరగతులు చెబుతారు. దీనికోసం ఒక రోజుకు 100 రూపాయలు వసూలు చేస్తారు. అందులో వారి ఆహారానికి 90 రూపాయలు పోగా, మిగిలిన 10 రూపాయలూ వీళ్ల ఆదాయం. ఇలా మొత్తంగా ఏడాదికి రూ.40 నుంచి 50 లక్షల వరకూ ఆదాయం వస్తోందట. గతేడాది విపరీతంగా వర్షాలు పడటంతో అటవీప్రాంతంలో బాగా గడ్డి పెరిగిందట. దాన్ని అమ్మగా వచ్చిన నాలుగు లక్షల రూపాయలతో 70 ఆవుల్ని కొనుగోలు చేశారా గ్రామస్థులు. ప్రస్తుతం వాటి పాల నుంచి రోజుకు 5 వేల రూపాయల్ని సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన ఆదాయంలో 30 శాతాన్ని వనాభివృద్ధి పనుల కోసం, పదిశాతాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చుపెడతారు. ఈ మొత్తం ప్రక్రియా పూర్తి స్థాయిలో వూరివాళ్లే చూసుకుంటారు. ఎక్కడా ప్రభుత్వ జోక్యం ఉండదు. స్వచ్ఛంద సంస్థల అవసరమూ రాలేదు. ఎందుకంటే అడవిలోని ప్రతిమొక్కా వీళ్లకు లెక్కే. ప్రతిదానికీ ఓ గుర్తును పెడతారు. అడవి పక్కగా పారే ఓ నీటి పాయ ఉంది. మనుషులూ, వాహనాలూ, జంతువులూ... ఏవి ఇటువైపు రావాలన్నా దాన్ని దాటుకుని రావాలి. కాబట్టి, చెట్లను అక్రమంగా కొట్టడం ఉండదు.

వలసల్లేవ్‌...
ప్రస్తుతం ఈ అడవి కాక చుట్టుపక్కల అక్కడక్కడా ఉన్న బీడు భూముల్లోనూ మొక్కలు పెంచుతున్నారు. ఎక్కువ మొక్కలు నాటాలంటే అవి పెంచే నర్సరీలు కూడా పెరగాలి కాబట్టి, ఈ భూముల్ని నర్సరీలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక వూరికి చుట్టుపక్కల ఉండే చిన్నచిన్న మళ్లలో కూరగాయల సాగు కొనసాగిస్తున్నారు. ‘కొన్నాళ్ల క్రితం వరకూ పనులు లేని సమయంలో మా వూళ్లొని రెండు మూడు వందల మంది పనికోసం వలసలు వెళ్లేవాళ్లు. గత రెండేళ్లుగా అది బాగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ పనుల కోసం వలసలు వెళ్లడం లేదు. మా వూరికి దగ్గర్లో డోంబా అనే ఓ నది ఉంది. అది ఇంతకు ముందు వేసవిలో ఎండి పోయేది. ఇప్పుడు ఏడాదంతా నీళ్లతో అందంగా ప్రవహిస్తోంది. ఈ విజయం మనందరికీ చెప్పేది ఒక్కటే, ఇక్కడ పరిసరాలు పచ్చగా మారడం వల్ల మా కుటుంబాలూ పచ్చగా ఉన్నాయి. ప్రకృతితో స్నేహం చేస్తే అది ఎప్పటికీ మనకు కీడు చేయదు’ అంటారు గ్రామస్థుడు ఠాకూర్‌. మొత్తానికి హిసాతు గ్రామాన్ని చూస్తుంటే వృక్షో రక్షతి రక్షితః అన్న మాట అక్షరాలా నిజమనిపిస్తోంది కదూ!


 

నియోలైట్‌.. పసి ప్రాణాలకు భరోసా!

ప్రపంచవ్యాప్తంగా పసిపిల్లలకు ప్రాణాంతకంగా మారే సమస్యల్లో మొదటిది కామెర్లు. నెలల పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి వల్ల గంటకు సగటున పదిమంది చిన్నారులు బలవుతున్నారన్నది అంచనా. తక్కువ సమయంలో,
తక్కువ ఖర్చుతో ఆ జబ్బుని దూరం చేసే పరికరాన్ని తయారుచేసి తల్లులందరితో శెభాష్‌ అపించుకుంటున్నాడు వివేక్‌ అనే కుర్రాడు.ఈ ఏడాది ‘ఫోర్బ్స్‌’ ప్రకటించిన సూపర్‌ హీరోల్లో అతడూ ఒకడు.

మయానికి సరైన చికిత్స అందించకపోతే పచ్చకామెర్లు చిన్నారుల ప్రాణాలనే హరించేస్తుంది. ఏటా ఆ సమస్య వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. సాధారణంగా కామెర్ల బారినపడ్డ పిల్లలకు ఫొటోథెరపీ విధానంలో నాలుగైదు రోజులపాటు ప్రత్యేక గదిలో కాంతి తరంగాల కింద ఉంచి చికిత్స చేస్తారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆ చికిత్స అందుబాటులో లేదు. అనేక ప్రభుత్వాసుపత్రుల్లో ఆ పరికరాలకూ కొరతే. దానికితోడు రోజుల వయసున్న పసికందులు ఎక్కువసేపు తల్లికి దూరంగా ఉండాల్సి రావడంతో ఒత్తిడి పెరిగి ఇతర దుష్ప్రభావాలూ ఎదురయ్యే అవకాశాలూ ఎక్కువే. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తూ వివేక్‌ కొప్పర్తి అనే చెన్నై కుర్రాడు ‘నియోలైట్‌’ పరికరాన్ని అభివృద్ధి చేశాడు. పరిమాణంలో అది సాధారణ ఫొటోథెరపీ పరికరాల్లో పదో వంతు ఉంటుంది. చికిత్సకయ్యే ఖర్చూ నామమాత్రమే. అన్నింటికంటే ముఖ్యంగా తల్లులు ఆస్పత్రుల వెంట తిరక్కుండా, పిల్లలు ఐసీయూల్లో గడపకుండా ఇంటి దగ్గరే కామెర్లను దూరంచేసే వెసులుబాటును ఈ పరికరం కల్పిస్తుంది. దాని ప్రయోజనాల్నీ, పరిష్కరించే సమస్య ప్రాధాన్యాన్నీ ప్రఖ్యాత అంతర్జాతీయ మేగజీన్‌ ‘ఫోర్బ్స్‌’ గుర్తించింది. చిన్న వయసులోనే వివేక్‌ చేపట్టిన పెద్ద బాధ్యతను అభినందిస్తూ అతడిని ఈ ఏడాది 30ఏళ్లలోపు 30 మంది సూపర్‌ ఎచీవర్ల జాబితాలో చేర్చింది.

స్నేహితుడి ఆలోచన
అమెరికాలో ఇంజినీర్‌గా స్థిరపడుతున్న సమయంలో వివేక్‌ పసిపిల్లల గురించి ఆలోచించడానికి కారణం అతడి స్నేహితుడికి ఎదురైన అనుభవమే. చెన్నైలో పుట్టిపెరిగిన వివేక్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి పైచదువుల కోసం అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడ అతడితో పాటు చదువుకునే శివ అనే స్నేహితుడు సెలవుల్లో ఓసారి తెలిసిన వాళ్లని పరామర్శించడానికి దిల్లీలోని ఓ ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అక్కడి ఐసీయూలో కనిపించిన దృశ్యం శివను కలవరపెట్టింది. ఆ గది నిండా కామెర్లతో బాధపడుతున్న నెలల పిల్లలే. ఎవరికీ ఒంటిమీద బట్టల్లేవు. పడుకున్న నేలా పరిశుభ్రంగా లేదు. దానికితోడు వాళ్ల తలలమీద ఫొటోథెరపీ చికిత్స కోసం వేలాడదీసిన హాలోజన్‌ ట్యూబ్‌ వేడి ప్రభావానికి చెమట్లు కక్కుతున్నారు. సరిపడా పరికరాలు లేకపోవడంతో పిల్లలంతా ఒకరికొకరు అతుక్కున్నంత దగ్గరగా పడుకున్నారు. మొత్తమ్మీద అక్కడి వాతావరణం వ్యాధిని నయం చేసే సంగతి అటుంచితే పసివాళ్లకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా కనిపించింది. దేశ రాజధానిలోని ఆస్పత్రిలోనే అలా ఉంటే పల్లెల పరిస్థితి ఏంటా అన్న ఆలోచన శివని మరింత కలవరపెట్టింది. తిరిగి అమెరికా వెళ్లాక కూడా ఆ దృశ్యం అతడిని వదల్లేదు. స్నేహితుడు వివేక్‌తో ఆ సంఘటన గురించి చర్చించి బాధపడ్డాడు. వివేక్‌ మాత్రం ఇంజినీరింగ్‌ చదివిన తాను ఆ సమస్య తీర్చడానికి ఏం చేయొచ్చోనని ఆలోచించడం మొదలుపెట్టాడు. అమెరికాలో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాక కూడా కామెర్లను తగ్గించే పరికరాన్ని అభివృద్ధి చేయడంపైనే దృష్టిపెట్టాడు.

ఎక్కడైనా వాడొచ్చు!
కొన్నాళ్లకు శివ కూడా వివేక్‌కి తోడయ్యాడు. దాంతో ఇద్దరూ ఉద్యోగం మానేసి దాచుకున్న డబ్బులతో తాము తయారు చేసే పరికరం పేరుతోనే ‘నియోలైట్‌’ అనే సంస్థను నెలకొల్పారు. అమెరికాలోనే ఇంకొందరు యువ ఇంజినీర్లను తమతో చేర్చుకుని ప్రస్తుతం వాడుకలో ఉన్న పరికరాలకంటే చాలా తక్కువ పరిమాణంలో, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తూ ఎన్నో రెట్లు వేగంగా కామెర్లను నివారించగల ఫొటోథెరపీ పరికరాన్ని తయారు చేశారు. ‘ఒక సంచీలో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లేలా నియోలైట్‌ పరికరం ఉంటుంది. ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించడం వల్ల హాలోజన్‌ కాంతి వల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలకూ పిల్లలు దూరమవుతారు. ముఖ్యంగా పిల్లలు చికిత్స సమయంలో తల్లులకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. సౌరశక్తితో పాటు ఛార్జి్గంగ్‌ ద్వారా కూడా పనిచేయడంతో విద్యుత్‌ సదుపాయం లేని వెనకబడిన ప్రాంతాల్లో, కోతలు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతోమంది పిల్లల ప్రాణాలను ఇది కాపాడగలుగుతుంది, నా చదువునీ, తెలివినీ దేశం కోసం ఉపయోగించాలన్న ఆశ ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు’ అంటాడు వివేక్‌.

‘స్కై లైఫ్‌’ పేరుతో అమెరికా ప్రజల అవసరాలకు తగ్గట్లుగా వేగంగా కామెర్లను తగ్గించే కాస్త ఖరీదైన మరో పరికరాన్ని వివేక్‌ బృందం తయారుచేసింది. అక్కడ ఒక్కో స్కైలైఫ్‌ పరికరం అమ్ముడైన ప్రతిసారీ భారత్‌లోని ప్రభుత్వాస్పత్రులకు ఒక్కో నియోలైట్‌ పరికరాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అనేక పోటీల్లో సాధించిన విజయాల ద్వారా లభించిన గ్రాంట్లు, ఇన్వెస్టర్ల పెట్టుబడులతో పరికరాల తయారీని పెంచారు. భారత్‌లోని ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకొని పరికరాలను సరఫరా చేయడంతో పాటు అవసరమైన కుటుంబాలకు వాటిని అద్దెకిచ్చే ప్రయత్నాల్లోనూ ఉన్నారు. వివేక్‌ సంస్థను నడిపిస్తూనే దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో స్టార్టప్‌ పాఠాలూ చెబుతున్నాడు. ప్రస్తుతం అతడి బృందం చంటిపిల్లల్లో ‘హైపోథర్మియా’ అనే మరో సమస్యను దూరం చేసే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి కాస్త సామాజిక కోణం కూడా తోడైతే ఫలితాలు ఇలా ఉంటాయన్న మాట!


 

అనుకోకుండా కనిపెట్టేశారు..!

పుల్ల ఐస్‌... చీకుతుంటే ఆ మజానే వేరు. శాండ్‌విచ్‌... రుచి అమోఘం. కార్న్‌ఫ్లేక్స్‌... స్పైసీగా భలే కరకరలాడుతుంటాయి. ఇలా ఎవరికి నచ్చిన ఆహారపదార్థాన్ని వాళ్లు పొగిడేస్తూ తినేయడమే కాదు, ఒక్కోసారి వీటిని ‘ఎవడు కనిపెట్టాడోగానీ’ అని కూడా అనుకుంటూ ఉంటాం. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... మనం ఇష్టంగా తినే చాలా పదార్థాలు అనుకోకుండా పుట్టుకొచ్చినవే. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి.

 

పుల్ల ఐస్‌...

సంవత్సరం 1905... కాలిఫోర్నియాకు చెందిన పదకొండేళ్ల పిల్లాడు ‘ఫ్రాంక్‌ ఎప్పర్‌సన్‌’ ఓ సాయంత్రం ఆరుబయట కూర్చుని గ్లాసులో పోసిన సోడాను చిన్న పుల్లతో కలుపుతూ తాగడం మొదలు పెట్టాడు. ఇంతలో ఏదో గుర్తొచ్చి దాన్నక్కడ వదిలేసి లోపలికెళ్లాడు. తరవాత ఆ విషయం మర్చిపోవడంతో రాత్రి చలికి గ్లాసులోని సోడా గడ్డకట్టిపోయింది. ఉదయాన్నే ఫ్రాంక్‌ గ్లాసులోని పుల్లను తియ్యబోతే దాంతోపాటు గడ్డకట్టిన సోడా ఐస్‌ కూడా రావడంతో ఎలా ఉంటుందా అని దాని రుచి చూశాడు. అది బాగా నచ్చడంతో అప్పట్నుంచీ రకరకాల పుల్ల ఐస్‌లు చేసుకుని తినడం మొదలు పెట్టిన ఫ్రాంక్‌ తొమ్మిదేళ్ల తర్వాత దానికి పేటెంట్‌ కూడా తీసుకున్నాడు.

శాండ్‌విచ్‌...

దయాన్నే వేగంగా చేసుకోగలిగే టిఫిన్‌ ఏదంటే చాలామందికి గుర్తొచ్చేది శాండ్‌విచ్‌ గురించే. మరి అదెలా అనుకోకుండా తయారైందో తెలుసా... బ్రిటన్‌కు చెందిన ‘జాన్‌ మొంటగు’ అనే గ్యాంబ్లర్‌ పేకాట ఆడుతూ మధ్యలోంచి లేచి వెళ్లి తినడానికి బద్దకించి తన దగ్గర పనిచేసే అబ్బాయిని రెండు బ్రెడ్‌ల మధ్యలో వండిన మాంసాన్ని పెట్టి తీసుకురమ్మన్నాడట. అప్పట్నుంచీ ఆ రుచికి జాన్‌తో పాటు ఎంతోమంది అభిమానులైపోయారు. పైగా దాన్లో ఎన్నెన్నో కొత్త మార్పులను కూడా తెచ్చారు.

చాకొలెట్‌ చిప్‌ కుకీస్‌

సాచుసెట్స్‌లోని ఓ రెస్టారెంట్‌ యజమాని అయిన ‘రుత్‌ గ్రేవ్స్‌’ 1930ల్లో ఓసారి చాకొలెట్‌ కుకీస్‌ చెయ్యడానికి చాకొలెట్‌ను కరిగించి పోసేసరికి ఆలస్యమవుతుందని వాటిని పలుకులుగా చేసి పిండి పైన వేసిందట. తీరా చూస్తే బేక్‌ చేసినా ఆ చాకొలెట్‌ పలుకులు కరగకుండా కుకీస్‌ పైన అంటుకుపోయాయి. అలా చాకొలెట్‌ చిప్‌ కుకీస్‌ అందరికీ పరిచయం అయ్యాయి.

టీ...

ప్పుడు టీ మన జీవితంలో ఓ భాగం అయిపోయింది కానీ దీని రుచిని కనిపెట్టింది కూడా అనుకోకుండానే. క్రీస్తు పూర్వం 2737లో చైనా చక్రవర్తి ‘షెన్‌ నంగ్‌’ వేడినీళ్లలో ఓ ఆకు పడటం వల్ల దాని రంగు మారడాన్ని గమనించాడు. తాగితే దాని రుచి కూడా బాగుండడంతో అప్పట్నుంచీ ఆయన దాన్ని రోజూ తాగడం మొదలు పెట్టాడట. అలా చైనాలో ప్రారంభమైన టీ ఘుమఘుమలు ప్రపంచం మొత్తానికీ పరిచయం అయ్యాయి.

ఆలూ చిప్స్‌...

వీటి వెనుక కూడా ఆశ్చర్యపోయే కథనం ఉంది. 1853లో న్యూయార్క్‌లోని మూన్‌లేక్‌ లాడ్జ్‌ రెస్టారెంట్‌కి వచ్చిన ఓ కస్టమర్‌ ఆలూ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కోసం ఆర్డరిచ్చాడట. తీరా అతనడిగినదాన్ని తీసుకొస్తే బంగాళాదుంప ముక్కలు ఇంత మందంగా ఉన్నాయేంటీ అని మూడు నాలుగుసార్లు వెనక్కు పంపాడట. దాంతో అక్కడ పనిచేసే షెఫ్‌ ‘జార్జ్‌ క్రమ్‌’కు విసుగొచ్చి ఈసారి ఆలూ ముక్కలు అసలతను ఫోర్కుతో తినే వీల్లేకుండా చెయ్యాలనుకుంటూ ముక్కలను కాగితం అంత పలుచగా కోసి, నూనెలో వేయించి తీసి వాటిమీద మసాలా పొడి జల్లాడట. ఆశ్చర్యంగా కస్టమర్‌కి అవి తెగ నచ్చేశాయట. అప్పట్నుంచీ ఆలూ చిప్స్‌ హవా ప్రారంభమైంది.

కార్న్‌ఫ్లేక్స్‌...

1895లో డాక్టర్‌గా పనిచేసే ‘జాన్‌ హార్వే కెలాగ్‌’, అతని తమ్ముడు ‘విల్‌ కీత్‌ కెలాగ్‌’ వారి దగ్గరికొచ్చే రోగులకు ఏదైనా త్వరగా అరిగేలా ఉండే మంచి పోషకాహార వంటకాన్ని తయారు చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే రకరకాల ప్రయోగాలు చేసేవాళ్లు. అలా ఓరోజు గోధుమ పిండిని ఉడికించి, బయట పెట్టి తర్వాత దానిగురించి మర్చిపోయారు. మళ్లీ చూసేసరికి అదికాస్తా గట్టిగా అయిపోయిందట. అయితే, దాన్ని పడెయ్యడం ఎందుకని, పలుచని అప్పడాల్లా అవుతాయనే ఉద్దేశంతో రోలర్స్‌ మెషీన్‌లో వేశారు. తీరా చూస్తే పిండి చిన్న చిన్న ముక్కలై బయటికొచ్చింది. కెలాగ్స్‌ సోదరులు వాటిని బేక్‌ చేసి రోగులకు ఇవ్వగా చాలా ఇష్టంగా తిన్నారట. దాంతో అదే పద్ధతిలో మొక్కజొన్న పిండితో చేసి చూశారట. అలా కెలాగ్స్‌ సోదరులు కార్న్‌ఫ్లేక్స్‌కు పేటెంట్‌ను తీసుకున్నారు.

ఐస్‌క్రీమ్‌ కోన్‌...

1904 సంవత్సరంలో అమెరికాలో ‘సెయింట్‌ లూయీ వరల్డ్‌ ఫెయిర్‌’ జరుగుతున్న సమయంలో ఎండలు బాగా ఉండడంతో ఐస్‌క్రీమ్‌కి బాగా డిమాండ్‌ పెరిగిపోయిందట. దాంతో ‘హామ్వి’ అనే ఓ వర్తకుడి దగ్గర ఐస్‌క్రీమ్‌ సర్వ్‌ చేసే గిన్నెలన్నీ అయిపోయాయట. ఐస్‌క్రీమ్‌ను ఎందులో పెట్టి అమ్మాలా అని అతను టెన్షన్‌ పడుతుంటే పక్కనే ర్యాపర్లలా ఉండే పేస్ట్రీలను అమ్మే వర్తకుడు తన పేస్ట్రీలను కోన్‌లా చుట్టి అందులో ఐస్‌క్రీమ్‌ పెట్టి ఇవ్వమని సలహా ఇచ్చాడట. అప్పట్నుంచీ ఐస్‌క్రీమ్‌ కోన్‌లు వాడుకలోకి వచ్చాయి.

అదండీ సంగతి... అనుకోకుండానే వచ్చినా మనందరి మనసులనూ దోచుకునే రుచులైపోయాయి ఇవి.


 

ఆలోచన మీది... ముడిసరుకు మాది

సొంతంగా రోబో తయారుచేయాలన్నది ఓ యువకుడి కల... తాను తయారుచేసుకున్న బైక్‌ మీద షికారుచేయాలన్న కోరిక మరొకరిని నిద్రపోనీయదు. కానీ కలకన్నంత సులభం కాదు వాటిని సాధించడం. నైపుణ్యమున్నా డబ్బు, మౌలిక సదుపాయాలు.. చాలా కావాలి. అలాంటివారికోసం వెలసిందే ఈ మేకర్స్‌ అసైలమ్‌. అద్భుతమైన ఆలోచనలకు ఆకృతినిస్తున్న వీరి గురించి ప్రధాని మోదీకి తెలిస్తే మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా వీరినే నియమించేవారేమో.

దిల్లీకి చెందిన వైభవ్‌ ముంబయిలో ఓ స్టార్టప్‌లో పనిచేసేవాడు. ఓరోజు ఆ భవనం కప్పు కూలి, ఫర్నిచరంతా విరిగిపోయింది. వైభవ్‌కి కొత్త ఫర్నిచర్‌మీద మళ్లీ పెట్టుబడి పెట్టాలనిపించలేదు. వృత్తిరీత్యా మెకానికల్‌ ఇంజినీర్‌ అయిన వైభవ్‌కి వడ్రంగం పని ఇష్టం. అందుకని తానే బల్లలు తయారుచేయడానికి పూనుకున్నాడు. ఎవరికైనా బల్లలు తయారుచేయడంలో ఆసక్తి ఉంటే తనతో కలవవచ్చని ఫేస్‌బుక్‌లో ఓ సందేశం పోస్ట్‌ చేశాడు. ఆదివారం ఆరుగురు వచ్చారు. అందరూ కలిసి సరదాగా టేబుల్స్‌ తయారుచేశారు. ఇదేదో బాగుంది... వారం వారం కలుద్దామనుకున్నారు. అలా ప్రతివారం వచ్చేవారి సంఖ్య పెరుగుతూ పోయింది. వైభవ్‌ దానికి ‘మేకర్స్‌ అసైలమ్‌’ అని పేరు పెట్టుకున్నాడు. ఎవరికిష్టమైన వస్తువు వారు తయారుచేయడం మొదలెట్టారు. అందుబాటులో అన్నిరకాల పరికరాలూ ఉండడంతో కొత్త కొత్త ఆవిష్కరణలకు అదో నెలవైంది. విఫలమవుతామన్న భయం లేదు. పైవాళ్లకు నచ్చదన్న చింత లేదు. తాము కోరుకున్న రూపం ఇవ్వడానికి ఎవరికి వారు మనస్ఫూర్తిగా పనిచేయడమే. రెండు నెలలు తిరిగేసరికల్లా అక్కడ కదలడానికి చోటు లేనంత సామగ్రి చేరింది. బోలెడన్ని వస్తువులు రూపుదిద్దుకునే దశలో ఉన్నాయి. అప్పుడు బాంద్రాలో ఓ గ్యారేజీ అద్దెకు తీసుకుని తమ సరంజామా అంతా అందులో చేర్చారు. వైభవ్‌ ఉద్యోగం మానేశాడు. పూర్తి సమయం మేకర్స్‌ అసైలమ్‌కే కేటాయించాడు. అనూల్‌ అనే మరో మిత్రుడూ, మరికొంతమందితో కలిసి ఓ బృందం తయారైంది.