close
మస్త్‌ మస్త్‌... మంచినీళ్ల బాటిల్‌..!

మస్త్‌ మస్త్‌... మంచినీళ్ల బాటిల్‌..!

స్కూలూ కాలేజీ ఆఫీసూ విహారయాత్ర... ఎక్కడకు వెళుతున్నా తప్పనిసరిగా మనతో ఉండే వస్తువుల్లో ఒకటి మంచినీళ్ల సీసా... అది లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టనివాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే అవి కూడా కొత్త కొత్త ఫీచర్లతో మరింత స్మార్ట్‌గా ముస్తాబవుతున్నాయి..!

రీరానికి మంచినీళ్లు ఎంత అవసరమో అందరికీ తెలుసు. సాధారణంగా రోజుకి కనీసం రెండు లీటర్లయినా తాగాలి. ఒంటితీరుని బట్టి కొందరికి అంతకన్నా ఎక్కువ అవసరం కావచ్చు. అయినా కొందరు ఏదో ఒక కారణంతో తాగడానికి బద్ధకిస్తుంటారు. అదే ఓ వాటర్‌బాటిల్‌ నిత్యం పక్కనే ఉంటే నీళ్లు తాగాలన్న విషయం అనుక్షణం గుర్తుంటుంది. సరిగ్గా ఆ కారణంతోనే ఇప్పుడు అంతా ఓ బాటిల్‌ను వెంటే పెట్టుకుంటున్నారు. దాంతో మంచినీళ్ల సీసాలు రకరకాల రంగుల్లోనూ పరిమాణాల్లోనూ ఆకారాల్లోనూ తయారవుతూ నేటి తరాన్ని ఆకర్షిస్తున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు చేత్తోనే పెయింట్‌ చేసిన బాటిళ్లనూ విడుదల చేస్తున్నాయి. నాసిరకం ప్లాస్టిక్‌ స్థానంలో నాణ్యమైన ప్లాస్టిక్‌ వాడకం పెరిగింది. తాజాగా స్టెయిన్‌లెస్‌ స్టీలు బాటిళ్లు రంగప్రవేశం చేశాయి. శుభ్రం చేసుకోవడం తేలిక కావడంతోపాటు పర్యావరణపరంగానూ మంచిదన్న కారణంతో క్రమంగా అందరూ స్టీలు బాటిళ్లకే జై కొడుతున్నారు. ఇవి కూడా ప్లాస్టిక్‌లో మాదిరిగానే రకరకాల రంగుల్లోనూ విభిన్న డిజైన్లలోనూ దొరుకుతున్నాయి. ప్లాస్టిక్‌, సిలికాన్‌, స్టీలు, చెక్క, మట్టి...దేంతో తయారయినప్పటికీ వాటర్‌ బాటిళ్లలో వస్తోన్న ఫీచర్లు కోకొల్లలు. వాటిల్లో కొన్ని...


 

మడిచెయ్యొచ్చు..!

నీళ్లున్నప్పుడయితే సరే, అవి అయిపోయినప్పుడు కూడా బాటిల్‌ బ్యాగులో అంత స్థానాన్ని ఆక్రమించడం వృథా కదా. సరిగ్గా ఈ ఆలోచనతో వచ్చినవే ముడుచుకునే బాటిళ్లు. అవసరం లేనప్పుడు వీటిని మడిచి పెట్టేసుకోవచ్చు. వీటిల్లో కొన్నింటికి జేబుకో సంచీకో తగిలించుకునేలా హ్యాండిళ్లు కూడా ఉంటున్నాయి. వీటికుండే రబ్బరు గ్యాస్కెట్లు చుక్క నీరు కూడా బయటకు కారకుండా చేస్తున్నాయి.


డబ్బుల్నీ దాచుకోవచ్చు!

క్కోసారి పర్సు పట్టుకోవడం మహా చిరాగ్గా ఉంటుంది. లేదూ ఏ జిమ్‌కో ఆటలకో వెళ్లినప్పుడు గభాల్న బ్యాగు జిప్పులు లాగి డబ్బులూ, తాళాలూ వెతకడమూ ఇబ్బందే. అలాంటి సందర్భాల్లో కొన్ని నోట్లూ లేదా కార్డులూ తాళం కూడా దాచుకునేవే కాంటిగో, మౌంటప్‌ వంటి కంపెనీలు తయారుచేసిన వ్యాలెట్‌ లేదా స్టోరేజ్‌ వాటర్‌ బాటిల్స్‌. కొన్నింటిలో ఫోను పెట్టుకునే సౌలభ్యం కూడా ఉంది. మరిచిపోకుండా ఏ రోజు వేసుకునే మందుల్ని ఆ రోజు వేసుకునేలా ఆది, సోమ... ఇలా వారాల పేర్లతో కూడిన అరలున్నవీ వస్తున్నాయి.


రసం తీసేస్తుంది..!

త్తాయి, నారింజ, కమలా, నిమ్మ... వంటి సిట్రస్‌ పండ్ల రసాన్ని తాజాగా ఆస్వాదించాలనుకునేవాళ్లకోసం జ్యూసర్‌ బాటిళ్లూ ఉన్నాయి. రెండు విభాగాలుగా ఉండే ఈ బాటిల్‌లో అడుగున జ్యూసర్‌ బిగించి ఉంటుంది. అందులో ఆయా పండ్ల ముక్కల్ని కోసి పెట్టి మనకు కావలసినప్పుడు మధ్యలో ఉన్న భాగాన్ని తిప్పి, ఓసారి బాటిల్‌ను షేక్‌ చేస్తే చాలు, ఎంచక్కగా ఆ పండ్ల రసాన్ని నేరుగా తాగేయవచ్చు. అంటే బాటిలే జ్యూసర్‌లా పనిచేస్తుందన్నమాట.


ఫ్రూట్‌ ఇన్‌ఫ్యూజర్లు!

  రోగ్యకరమైన మంచినీళ్లతోబాటు రుచిగానూ ఉండాలనుకునేవాళ్లకోసం వస్తున్నవే సరికొత్త ఫ్రూట్‌ ఇన్‌ఫ్యూజర్లు. ఈ సీసాలోపల రంధ్రాలతో కూడిన పొడవాటి గొట్టంలాంటి దాంట్లో తాజా పండ్లముక్కలో నిమ్మచెక్కో పుదీనా, కొత్తిమీర వంటివో వేసి, బాటిల్‌లో నీళ్లు నింపితే ఆయా పండ్లముక్కల రుచీ వాసనా నీళ్లలో కలిసి మంచినీళ్లు ఇంకా ఇంకా తాగాలనిపిస్తాయి. మంచినీళ్లు సరిగ్గా తాగనివాళ్లకి ఇవి ఎంతో ఉపయోగం. పైగా వీటిల్లోని విటమిన్లూ ఒంటబడతాయి. తరచూ తాగుతుండటంవల్ల ఇవి జీవక్రియను పెంచి బరువు తగ్గేందుకూ దోహదపడతాయట.


వడబోసేస్తాయి..!

రచూ ప్రయాణాలు చేసేవాళ్లకోసం తయారైనవే ఫిల్టరు వాటర్‌ బాటిళ్లు. అతినీలలోహిత కాంతితో పనిచేసే బ్యాటరీల్ని చొప్పించిన ఈ బాటిళ్లు, ఎలాంటి నీటినైనా వడబోసేస్తాయి. ఎందుకంటే, గుక్కెడు నీళ్లు దాహాన్నీ తీరుస్తాయి. ప్రాణాల్నీ నిలుపుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక వ్యాధుల్నీ కొనితెస్తాయి. కాబట్టి ఎంతో అవసరమైనప్పుడు ఎక్కడయినా ఏ ట్యాప్‌ నీరు పట్టుకున్నా ఈ బాటిల్‌ వెంట ఉంటే భయం లేకుండా వాటిని తాగేయవచ్చు. కొన్ని ప్రదేశాల్లో క్లోరిన్‌, క్లోరమైన్ల శాతం చాలా ఎక్కువ. ఆయా పదార్థాల శాతాన్ని తగ్గించి వేగంగా వడబోసే హైడ్రోస్‌ వంటి బాటిళ్లూ చాలానే వస్తున్నాయి. అంతేకాదు, మారుమూల ప్రదేశాలకు వెళ్లినప్పుడు మంచినీటి ట్యాపులు కూడా కనిపించకపోవచ్చు. అప్పుడు ఏ గుంతల్లోని నీటితోనయినా ఆర్చుకుపోతున్న నోటిని తడుపుకోవాలనిపిస్తుంది. అలాంటి సమయంలో ఉపయోగపడే లైఫ్‌ సేవర్‌ లాంటివీ ఉన్నాయి. ఇవి కలుషిత నీటిలోని వైరస్‌లూ బ్యాక్టీరియా ఇతరత్రా సూక్ష్మజీవుల్ని నాశనం చేయడంతోబాటు ఆ నీటిని పూర్తిగా వడబోసి మంచినీటిని అందిస్తాయి.


మీకెన్ని నీళ్లు కావాలి?

  యసూ ఎత్తూ శరీర ఉష్ణోగ్రతను బట్టి ఎవరెన్ని నీళ్లు తాగాలో తెలిపే బ్లూ ఫిట్‌ వాటర్‌ బాటిళ్లూ వస్తున్నాయి. ఈ బాటిల్‌తోబాటు దానికి సంబంధించిన ఆప్‌ను ఫోనులో డౌన్‌లోడ్‌ చేసుకుంటే అది మీరు ఏ టైమ్‌కు ఎన్ని నీళ్లు తాగారో రికార్డు చేస్తుంది. ఏ కారణంతోనయినా మీరు మర్చిపోతే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయిందంటూ ఫోన్‌ ద్వారా ఆ బాటిల్‌ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది.


నీళ్లు చల్లినట్లుగా...

ట్రెక్కింగ్‌కు వెళుతున్నప్పుడో ఎండలో తిరిగినప్పుడో ఆటలాడుకుంటున్నప్పుడో మొహంమీద షవర్‌బాత్‌ చేసినట్లుగా నీళ్లు చల్లుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా... ఆ ఫీల్‌నే అందిస్తున్నాయి ఆక్వాబోట్‌ 1000 వాటర్‌బాటిల్స్‌. వీటికి ఓ పక్కగా ఉన్న బుడిపెలాంటి బటన్‌ను నొక్కితే చాలు, షవర్‌లోంచి వచ్చినట్లే వాటిల్లోని నీళ్లు మొహంమీద చిందుతాయి.


చల్లచల్లగా..!

ఎంత ఖరీదైన బాటిలయినా చల్లని నీళ్లు పోస్తే కాసేపటికి వేడిగానే అయిపోతుంటాయి. కానీ ఎంత ఎండలో తిరిగినా నీళ్లు వేడెక్కకుండా ఉండాలనుకునేవాళ్లకి టెర్రకోట మిట్టీ కూల్‌ బాటిళ్లు ఉండనే ఉన్నాయి. ఫ్రిజ్‌ నీళ్లు పెద్దగా ఇష్టపడనివాళ్లకీ ఇవి ఎంతో ఉపయోగం. పైగా పర్యావరణ ప్రియం.


బాటిల్‌తో సహా...

అంత పెద్ద వాటర్‌బాటిల్‌ను మోసుకుని వెళ్లడం ఎందుకూ అనుకునేవాళ్లకోసం వచ్చినవే ఎడిబుల్‌ వాటర్‌ బాటిల్స్‌. బుల్లి బంతుల్లా ఉండే వీటిని నేరుగా నోట్లో వేసుకుని చప్పరించేయవచ్చు. వాడిపారేసే బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ విధానంలో సోడియం ఆల్జినేట్‌, కాల్షియం లాక్టేట్‌ల సాయంతో నీటిని ఓ పలుచని పొరలో బంధించి ఉంచుతారు. పొరతోసహా నీటిని తాగేయవచ్చు. వీటిల్లో తినే రంగుల్నీ కలుపుతున్నారు.


డంబెల్స్‌..!

ప్రత్యేకంగా జిమ్‌కి వెళ్లాల్సిన పని లేకుండా ఆఫీసులోనో లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు వీలయితే అప్పుడు కసరత్తులు చేసుకునేందుకు ఉపయోగపడేవే డంబెల్‌ బాటిళ్లు. వాటిల్లోని నీటితో దాహమూ తీరుతుంది. ఇవే కాక, ఏ టైమ్‌కి ఎన్ని నీళ్లు తాగాలో మార్క్‌ చేసినవీ, స్ఫూర్తిని కలిగించే వ్యాఖ్యలున్నవీ, చేతికి నొప్పి లేకుండా పట్టుకోవడానికి సౌకర్యంగా ఉండేవీ... ఇలా రకరకాల ఫీచర్లు ఉన్నవి చాలానే వస్తున్నాయి. ఇక, ఎంపిక మీదే మరి!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.