close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సరదాగా సంపాదించేద్దాం...

సరదాగా సంపాదించేద్దాం...

నీపాటా లేకుండా ఎప్పుడూ ఆ ఫేస్‌బుక్‌లూ యూట్యూబులతో కాలం గడిపేస్తావు, నీకసలు బాగుపడే ఉద్దేశం లేదా... యూట్యూబులో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ తన కొడుకు సమయాన్ని వృథా చేసుకుంటున్నాడేమోనన్న ఆవేదనతో ఫెలిక్స్‌ అర్విడ్‌ను తండ్రి ఎప్పుడూ మందలిస్తుండేవాడు. ఆఖరికి ఆ వీడియోల కోసం యూనివర్సిటీలో చదువును సగంలో వదిలేశాడని తెలిసి కోపంతో కొడుకును ఇంట్లో నుంచి పంపేశాడు కూడా.

అయిదేళ్ల తర్వాత... ఏడాదికి అక్షరాలా వంద కోట్ల రూపాయల ఆదాయం. మొత్తం సంపాదన విలువ అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ. ఇదీ 27ఏళ్ల వయసులో ఫెలిక్స్‌ సాధించింది. 2016లో టైమ్‌ పత్రిక ‘అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులు’గా ఎంపికచేసిన ప్రపంచంలోని వందమందిలో అతడూ ఒకడు. అదే కుర్రాడు... కేవలం అయిదేళ్లే తేడా... ఈమధ్య కాలంలో అతడేం చేశాడు..? తెలియని వాళ్లకు ఇది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో కోటిరూపాయల్ని సంపాదించే ఆఖరి ప్రశ్న లాంటిదే. కానీ అప్పుడూ ఇప్పుడూ అతడు చేస్తున్న పని ఒక్కటే. అదే ‘ప్యు డీ పీ’ పేరుతో యూట్యూబులో రకరకాల కామెడీ వీడియోలను అప్‌లోడ్‌ చెయ్యడం. అతడిని ఇంతటి వాడిని చేసిందీ ఆ వీడియోలే. యూట్యూబులో ఫెలిక్స్‌ పెట్టిన వీడియోల్ని కొన్ని కోట్లమంది చూస్తున్నారు మరి. అవును... సామాజిక వెబ్‌సైట్లంటే మూడు షేర్లూ ఆరు లైక్‌లే అనుకుంటే పొరబడినట్లే. మనం సరదాగా పెట్టిన ఒక్క ఫొటో లక్షల్ని సంపాదించి పెట్టొచ్చు. అర నిమిషంలో తీసిన వీడియో కోట్లను కుమ్మరించొచ్చు.

అదే అర్హత...
‘యుద్ధానికి వెళ్లే సైనికుడికి ఆయుధం ఎంత ముఖ్యమో ఈతరానికి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో అకౌంట్‌ ఉండడం అంత ముఖ్యం’ అన్నట్లైపోయింది పరిస్థితి. ఇక, పెట్టిన ఫొటోకి లైక్‌లొస్తే పరీక్షల్లో మంచి మార్కులొచ్చినంత సంతోషం. ప్రతి పోస్టూ వారి దృష్టిలో ఓ పరీక్షే. ‘వీళ్లకు ఇంత పిచ్చేంటిరా బాబూ’ అని కొంతమంది అనుకుంటే అనుకోవచ్చుగానీ సామాజిక వెబ్‌సైట్లద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే ఉండాల్సిన ప్రధాన అర్హత అదే. వింత, వినోదం, విజ్ఞానం... విషయం ఏదన్నది కాదు, మన పోస్టుని ఎంతమంది చూశారూ ఎన్ని లైక్‌లు వచ్చాయన్నదే ముఖ్యం. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, పింటరెస్ట్‌... ఒక్కో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లో ఆదాయ మార్గాలు ఒక్కోలా ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న కాన్సెప్టు మాత్రం ఒకటే. మన అకౌంట్‌కు లైక్‌ల వర్షం ఎంత ఎక్కువ కురిస్తే బ్యాంకు అకౌంట్లో డబ్బుల పంట అంత బాగా పండుతుంది అన్నదే దాని సూత్రం. అలా అని దీనికోసం హార్వర్డ్‌ స్థాయి తెలివితేటలూ ఐఐటీ స్థాయి చదువులూ అవసరం లేదు. అంద చందాలతో నిమిత్తం లేదు. మనం మనలా ఉండొచ్చు. మనకు నచ్చిందీ మనసుకు నచ్చిందీ సరదాగా సంతోషంగా చేస్తూనే సంపాదించొచ్చు.

ముంబైకి చెందిన అనిషా దీక్షిత్‌ ఓరోజు రిక్షా ఎక్కింది. ఖాళీగా ఉన్నాకదా, గమ్యాన్ని చేరేలోపు సరదాగా నాలుగు కబుర్లు చెబుతూ యూట్యూబ్‌లో పెడదామనుకుని రిక్షాలో కూర్చునే రోడ్డు మీద జరుగుతున్న రకరకాల సంఘటనలను వర్ణిస్తూ వీడియో తీసుకుని పోస్ట్‌ చేసింది. ఆ రిక్షా కబుర్లు చాలామందికి కొత్తగా అనిపించాయి. అంతే, లైక్‌లు వరదలా వచ్చాయి. ఆ స్ఫూర్తితో ‘రిక్షా వాలీ’ పేరుతో రోజుకో చోటుకి రిక్షాలో తిరుగుతూ ఫ్యాషన్‌, ఆహారం, మహిళల ఆత్మరక్షణ... ఇలా ఎన్నో విషయాల గురించి వీడియోలు అప్‌లోడ్‌ చెయ్యడం మొదలు పెట్టింది. ఎంత సరదాగా కాలక్షేపం చేసే పనది... కానీ అదే ఆమెకు నెల నెలా రూ.12లక్షల వరకూ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

భర్త ఆఫీసుకని ఉదయం వెళ్తే సాయంత్రానికి గానీ రాడు. పిల్లలు చదువులకని విదేశాలకు వెళ్లిపోయారు. ఆ ఒంటరితనాన్ని భరించలేకపోయింది నొయిడాకు చెందిన యాభై ఆరేళ్ల నిషా మధులిక. ఏం తోచక తనకు వచ్చిన వంటకాల తయారీని రాసుకోవడం మొదలుపెట్టింది. ఓ వంద అయ్యాయి. వాటిని బ్లాగుల్లో పెట్టాలన్నది ఆమె ఆలోచన. ‘యూట్యూబులో పెట్టు’ అని ప్రోత్సహించాడు భర్త. ఉదయం అల్పాహారంగా రోజుకో రకం వంటకాన్ని చెయ్యాలనీ దాన్నే వీడియో తీసి, పెట్టాలనీ నిర్ణయించుకున్నారు. అలా మొదటి వంటకం వీడియో 2011 మేలో అప్‌లోడ్‌ అయింది. సులభంగా చేసే వీలుండడంతోపాటు ఆ వంటకాలకు అమ్మచేతి కమ్మదనమూ తోడైంది. కొద్దికాలంలోనే లక్షలమంది ఆమె ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. అది చాలదూ సెలెబ్రిటీ హోదా రావడానికి. ఆమె ఛానల్లో ప్రకటనలు ఇచ్చేందుకు చాలా వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయని యూట్యూబ్‌ యాజమాన్యం నుంచి మెయిల్‌ వచ్చింది. మధులిక వీడియోలను చూస్తున్నవారికి తమ ఉత్పత్తుల గురించిన ప్రకటనలు చూపి ఆకట్టుకోవాలన్నది ఆయా వ్యాపార సంస్థల వ్యూహం మరి. ప్రస్తుతం ఆ ప్రకటనల ద్వారానే నెల నెలా దాదాపు 40 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు అకౌంట్లోకి చేరుతున్నాయి. ఇలా... మనకు వచ్చిందీ నలుగురికీ నచ్చేదీ ఏదైనా సామాజిక వెబ్‌సైట్లలో పెట్టొచ్చు, సంపాదించొచ్చు.

చాలాసార్లు అనుకోకుండా తీసిన వీడియోలు కూడా కోట్లను కుమ్మరిస్తుంటాయి. అది యూట్యూబ్‌ ప్రారంభమైన కొత్త... బ్రిటన్‌కు చెందిన మూడేళ్ల పిల్లాడు హ్యారీ తమ్ముడి నోట్లో వేలు పెట్టి ‘నాన్నా చార్లీ మళ్లీ నన్ను కొరికాడు’ అని చెబుతున్న సందర్భాన్ని అనుకోకుండా వీడియో తీసిన తండ్రి దాన్ని యూట్యూబులో పెట్టాడు. కేవలం 56సెకెన్ల ఆ సరదా సన్నివేశం ఎంతోమందిని నవ్వించింది. ఉన్నట్లుండి ఆ చిన్నారులు సెలెబ్రిటీలైపోయారు. రెండు మూడేళ్లలో ఆ పిల్లలతో తీసిన వీడియోలు రూ.ఎనిమిది కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. నిమిషం కూడా లేని వీడియో కోట్ల రూపాయలను కొల్లగొట్టిందంటే ఎంత ఆశ్చర్యం..?

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ
‘లెక్క ఎక్కువైనా పర్లేదు... తక్కువ కాకుండా చూసుకో...’ మగధీరలో డైలాగ్‌ గుర్తుండే ఉంటుంది. ఫొటోలను మాత్రమే షేర్‌ చేసుకునే వెబ్‌సైట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను వాడేవాళ్లు నాలుగు రాళ్లు సంపాదించాలనుకుంటే మాత్రం ఈ డైలాగ్‌ను గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామర్లు తమ అకౌంట్‌ని అనుసరించే వారి సంఖ్య వెయ్యికి తగ్గకుండా చూసుకుంటే ప్రకటనల కోసం పోస్ట్‌ చేసే ప్రతి ఫొటోకీ నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయలు సంపాదించొచ్చు. ‘ఈ- మార్కెటర్స్‌’ సంస్థ అధ్యయనం ప్రకారం 2016 సంవత్సరం నాటికే ప్రపంచంలోని మూడోవంతు ప్రజలు సామాజిక వెబ్‌సైట్లలో సభ్యులట. అంటే, దాదాపు ఆ సంఖ్య 230కోట్ల మంది అన్నమాట. ఏ వ్యాపారం గురించైనా ప్రచారం చేసుకునేందుకూ కొత్త వ్యాపారాల్ని సృష్టించుకునేందుకూ ఇంతకుమించిన వేదిక ఏముంటుంది! అందుకే, ‘మా ఉత్పత్తిని అమ్మి పెట్టండి’ అని పేరున్న హీరోని బ్రాండ్‌ అంబాసిడర్లుగా మార్చినట్లూ సామాజిక వెబ్‌సైట్లలో ప్రాచుర్యం పొందిన వాళ్లనూ ప్రచారకర్తలుగా మార్చేస్తున్నాయి వ్యాపార సంస్థలు. అందుకు అతిపెద్ద ఉదాహరణ ఇన్‌స్టాగ్రామే. దీన్లో ఎవరి అకౌంట్‌కైనా వీక్షకులు ఎక్కువ ఉన్నారంటే వాళ్లు సెలెబ్రిటీలైపోయినట్లే. వివిధ సంస్థలు తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేయించుకునేందుకు వారి వెనక క్యూ కడతాయి. కాస్తో కూస్తో పేరున్న సెలెబ్రిటీలకైతే ఆ క్రేజ్‌ మరీ ఎక్కువ. అమెరికన్‌ గాయని సెలీనా గోమెజ్‌ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంచలనమే అయింది. ఆ సైట్‌ రికార్డులోనే అతి ఎక్కువగా 58లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయట దానికి. కోకాకోలా బాటిల్లో స్ట్రా వేసుకుని తాగుతున్నట్లున్న సెలీనా ఫొటో అది. అసలే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసరించే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా పదికోట్లమందికి పైగా ఉన్నారు. దానికి తోడు ఆ ఫొటో ఇంత పెద్ద హిట్‌. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క ఫొటో కోకాకోలాకు ఏ స్థాయిలో ప్రచారం చేసిపెట్టిందో. సెలీనా చేసే పోస్టులకు అంత డిమాండ్‌ ఉంది కాబట్టే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో ప్రచారం చేయించుకునేందుకు వ్యాపార సంస్థలు ఒక్క ఫొటోకి రూ.3.6కోట్లు చెల్లిస్తుంటాయి. ఇలా... రకరకాల ఆహార ఉత్పత్తులూ సౌందర్య లేపనాలూ దుస్తులూ బ్యాగులూ ఫ్యాషన్‌ ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ ఈ సామాజిక వెబ్‌సైట్‌ ద్వారా కోట్లను కూడబెడుతున్నవాళ్లెందరో.

కోట్లు కురిపించే ట్వీట్లు
‘గత ఆరునెలల్లో ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ట్వీట్‌ల ద్వారా 30లక్షల రూపాయలు సంపాదించాను’... కొద్దిరోజుల కిందట ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పిన మాట ఇది. హాస్యాన్ని పండిస్తూనో వివాదాస్పద ట్వీట్లతోనో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సెహ్వాగ్‌ను ట్విటర్‌లో 90లక్షల మంది అనుసరిస్తున్నారు. అందుకే, అతడు ఏదైనా బ్రాండ్‌ ఉత్పత్తి గురించి ట్విటర్‌లో మెసేజ్‌ పెట్టినా దానికి సంబందించిన ఫొటోను ట్వీట్‌ చేసినా ఆయా కంపెనీలు ఒక్కో ట్వీట్‌కీ లక్షలు కుమ్మరిస్తాయి. అతి తక్కువ పదాలతో మెసేజ్‌ను షేర్‌ చేసుకునే సామాజిక వెబ్‌సైట్‌గా యువతలో ఎంతో ప్రాచుర్యం పొందిన ట్విటర్లో సామాన్యులకూ సంపాదన అవకాశాలు చాలానే. ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న ఏ అకౌంట్‌లోనైనా ప్రకటనలకు సంబంధించిన ట్వీట్లు చేస్తే, ఒక్కో ట్వీట్‌కీ కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి సంబంధిత కంపెనీలు. మనం చేసిన ట్వీట్లను ఎవరైనా చూసినప్పుడు కూడా ఒక్కో క్లిక్‌కీ కొంత డబ్బు మన అకౌంట్‌లో చేరుతుంది. యాభైమంది ఫాలోవర్లున్నా చాలు, ఆదాయం పొందే వీలుండడమే ట్విటర్‌ వెబ్‌సైట్‌ ప్రత్యేకత. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలోని ఏదైనా ఉత్పత్తి గురించి కూడా ఈ సైట్‌లో ట్వీట్‌ చెయ్యొచ్చు. మనం ఇచ్చిన లింక్‌ ద్వారా ఆ సైట్‌లోకి వెళ్లిన వారు ఏదైనా కొనుగోలు చేస్తే అందుకు మనకు కమిషన్‌ వస్తుంది.

ఒక్క ఫొటో చాలు...
బరువు తగ్గడానికి చిట్కాలు... పెరట్లో కొత్తిమీరను పెంచుకోవడం ఎలా... క్యాన్సర్‌ గురించి జరిగిన తాజా అధ్యయనం... తెలుగు రాష్ట్రాల్లో చూడదగ్గ ప్రదేశాలు... మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఫ్యాషన్లూ గ్యాడ్జెట్లు... ఏదైనా చూడగానే అర్థమైపోయేలా ఫొటోలతో కళ్లకు కడుతుంది పింటరెస్ట్‌. రిజిస్టర్‌ చేసుకుంటే చాలు, గూగుల్‌ ఫొటోల్లా పింటరెస్ట్‌లో అప్‌లోడ్‌ అయిన ప్రతి ఫొటో అందరికీ కనిపిస్తుంది. చెప్పాలనుకున్న విషయానికి సంబంధించి ఫొటోలూ వాటికి సంబంధించి ఒకటీ రెండులైన్ల సమాచారం మాత్రమే తెరమీద ఉంటుంది. మరికొంత తెలుసుకోవాలంటే సంబంధిత వెబ్‌సైట్‌కి పంపే లింక్‌ ఫొటో కింద కనిపిస్తుంది. పింటరెస్ట్‌ నుంచి ఆదాయం పొందే లింక్‌ కూడా అదే. ఉదాహరణకు అమెజాన్‌ ఆన్‌లైన్‌ దుకాణంలో మనకేదైనా డ్రెస్సూ లేదా గ్యాడ్జెట్‌ నచ్చిందనుకోండి, దాని ఫొటోను పింటరెస్ట్‌లో పోస్ట్‌ చేసి కింద అమెజాన్‌ లింక్‌ని ఇవ్వొచ్చు. ఆ ఉత్పత్తి నచ్చితే వాళ్లు అందులోకి వెళ్లి కొనుక్కుంటారు. అలా మనద్వారా తమ సైట్‌లో ఆ ఉత్పత్తిని ఎంతమంది కొంటే అంత కమిషన్‌ మనకొచ్చినట్లే. దీన్లో వివిధ వ్యాపార సంస్థలకు చెందిన ఉత్పత్తులకు మనం చేసే ప్రచారమే ఆదాయ మార్గం. సొంతంగా వ్యాపారాలున్నవాళ్త్లెతే ఆ వెబ్‌సైట్‌ లింక్‌ని ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ వ్యాపారం
మిగిలిన వాటిలో సంపాదించాలనుకోవడం ఉద్యోగం చెయ్యడంలాంటిదైతే ఫేస్‌బుక్‌లో ఆదాయ మార్గం వెతుక్కోవడం సొంతంగా సంస్థను స్థాపించాలనుకోవడం లాంటిది. సొంతవ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఫేస్‌బుక్‌ని మించిన ప్రచార సాధనం లేదన్నది మార్కెట్‌ వర్గాల అభిప్రాయం. ఈ సామాజిక వెబ్‌సైట్‌ వచ్చాక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు చాలామంది సొంతంగా వెబ్‌సైట్లు డిజైన్‌ చేయించుకోవడం మానేశారు. వేలూ లక్షలూ ఖర్చుపెట్టి వెబ్‌సైట్లు డిజైన్‌ చేయించుకుని మళ్లీ దానికి డొమైన్‌ నేమ్‌ కొనుక్కుని, ఆ వెబ్‌సైట్‌ని నిర్వహించుకుంటున్నందుకు గూగుల్‌ సంస్థకు ఏటా కొంత మొత్తాన్ని చెల్లించడం... అదో పెద్ద తతంగం. వ్యాపారం నడిచినా నడవకపోయినా ఇదంతా చెయ్యాలి. అయినా ఆ వెబ్‌సైట్‌ను జనం చూస్తారో లేదో తెలియదు. అదే ఫేస్‌బుక్‌లో అయితే, రూపాయి ఖర్చుపెట్టకుండా అకౌంట్‌ తెరిచి మన వ్యాపారానికి సంబంధించిన సమాచారం మొత్తాన్నీ ఫొటోలతో సహా అందులో ఉంచొచ్చు. అర్ధరూపాయి కూడా ఖర్చుపెట్టేపనిలేకుండా స్నేహితులూ బంధువులూ వారి స్నేహితుల ద్వారా అదే ప్రాచుర్యం పొందుతుంది. వనస్థలిపురానికి చెందిన ప్రియాంక ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసింది. రకరకాల డిజైనర్‌ దుస్తుల్ని కుట్టడంలో స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. కానీ తన వ్యాపారాన్ని విస్తరించేంత ఆర్థిక స్తోమత లేదు. చివరికి స్నేహితుల సలహాతో ఆమె డిజైన్లు ఫేస్‌బుక్‌ గోడలమీదికెక్కాయి. అంతే, బోలెడన్ని లైక్‌లూ షేర్లూ. వాటితో పాటే, తమకూ అలాంటివి కావాలంటూ ఆర్డర్లూ... ఇప్పుడామెకు హైదారాబాద్‌లోనే కాక ఇతర నగరాల నుంచీ వినియోగదారులున్నారు. ఆ బొటిక్‌ టర్నోవర్‌ లక్షల్లోకి చేరింది. ఆ విజయం వెనుక ఉన్నది ముమ్మాటికీ ఫేస్‌బుక్కే. ఎవరికి వారే కాకుండా, ఇతర వ్యక్తులూ సంస్థల కోసం అకౌంట్లు సృష్టించి అవి ప్రాచుర్యం పొందేలా చేసినా ఆదాయం వచ్చినట్లే. తమకు ప్రచారం కలిగేలా చెయ్యమంటూ ప్రజా ప్రతినిధులతో పాటు, పార్టీలూ వ్యాపార సంస్థలూ ప్రత్యేకంగా ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి కూడా.

ఓ అధ్యయనం ప్రకారం స్మార్ట్‌ ఫోన్లను వాడేవారిలో 80శాతం మంది రోజూ నిద్రలేవగానే చేసే పనుల్లో ఒకటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో అప్‌డేట్లను చూసుకోవడమేనట. అవును, నిద్రలేవడం, టిఫిన్‌చెయ్యడం, ఆఫీసుకెళ్లడంలాగే ఫోన్‌లో సామాజిక వెబ్‌సైట్లను చూడటం కూడా రోజువారీ పనుల్లో భాగమైపోయింది. అందుకే, ఇపుడు ప్రతి వ్యాపారమూ వాటి చుట్టూనే తిరుగుతోంది. అలా అని ఈతరాన్ని తక్కువ అంచనా వెయ్యడానికి లేదు. అన్నీ లైట్‌ తీసుకున్నట్లే ఉంటారు కానీ దేన్లోనూ బాధ్యత మర్చిపోరు. సరదా కోసమైనా సమయాన్ని మరీ ఎక్కువ వృథా చేసుకునే టైపు కాదు. అందుకే, వాళ్లను తమ వ్యాపారంలో భాగస్వాముల్ని చెయ్యడానికి సామాజిక వెబ్‌సైట్లలో స్నేహితులతో పిచ్చాపాటీ చెబుతూనే బ్యాంకు బ్యాలెన్సును పెంచుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి కంపెనీలు.

అర్థమైందిగా... సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్లంటే లైక్‌లూ షేర్‌లే కాదు, ఆదాయానికి అక్షయపాత్రలు కూడా.

యూట్యూబ్‌

  యూట్యూబ్‌లో ఆదాయానికి ప్రధాన ఆధారం ప్రకటనలే. అయితే, దీనికోసం మనకు కచ్చితంగా యూట్యూబ్‌ ఛానల్‌ ఉండాలి. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లా దీన్ని మనమే సులభంగా క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆ ఛానల్‌ ద్వారా యూట్యూబ్‌లో పెట్టిన మన వీడియోని చూసేవారి సంఖ్య అయిదువేలకు చేరగానే పార్ట్‌నర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్పట్నుంచీ యూట్యూబ్‌ యాజమాన్యం మనం అప్‌లోడ్‌ చేసే వీడియోలకు ప్రకటనలను అనుసంధానిస్తుంది. అలా మన ఛానల్‌ ద్వారా ప్రకటనల్ని ఎంతమంది వీక్షకులు చూస్తే అంత డబ్బు మన అకౌంట్‌లో పడుతుంది.

ఎక్కువ సంపాదన వీరిదే...
ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం... ఏడాదికి వందకోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్న ఫెలిక్స్‌ యూట్యూబ్‌ ద్వారా అతి ఎక్కువ సంపాదిస్తున్న వారిలో మొదటి స్థానంలో ఉన్నాడు. యూట్యూబ్‌లో వెయ్యి కోట్ల వ్యూస్‌ వచ్చిన మొదటి ఛానల్‌ ‘ప్యు డీ పీ’ అతడిదే. ప్రస్తుతం ఆ ఛానల్‌లోని వీడియోలకు వచ్చిన వ్యూస్‌ 14వందల కోట్లకు పైనే. ఇక, ఫెలిక్స్‌ ఛానల్‌కు సబ్‌స్క్రైబర్లుగా మారిన వారి సంఖ్య ఎప్పుడో అయిదుకోట్లు దాటిపోయింది.

*చుట్టూ ఉన్న జనాన్ని భయపెడుతూ చాటుగా ఆ తతంగాన్నంతా వీడియోలు తీయించే రోమన్‌ యాట్‌వుడ్‌(అమెరికా) ఏడాదికి రూ.52 కోట్లను సంపాదిస్తూ రెండోస్థానంలో ఉన్నాడు.
*‘ఎంతో డబ్బు ఖర్చుపెట్టి డిగ్రీ చదివాను. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు రూపొందిస్తున్నాను. ఇదే నాకు ఆనందాన్నీ ఆదాయాన్నీ ఇస్తోంది మరి’... ‘సూపర్‌ ఉమెన్‌’ పేరుతో భారతీయ కెనడియన్‌ అమ్మాయి లిల్లీ సింగ్‌ నిర్వహించే యూట్యూబ్‌ ఛానల్‌ని క్లిక్‌ చెయ్యగానే కనిపించే మాటలివే. 170 కోట్ల వ్యూస్‌ ఉన్న ఆమె ఛానల్‌ ఏడాదికి రూ.49.5 కోట్లు సంపాదించి పెడుతూ యూట్యూబ్‌లో ఎక్కువ సంపాదించే వారిలో ప్రపంచంలోనే ఆమెను మూడోస్థానంలో నిలిపింది.

మనదేశంలో...
మొదట కాలక్షేపం కోసం వంటలు చేసి వీడియోలు అప్‌లోడ్‌ చేసిన నిషా మధులిక ప్రస్తుతం తన ఛానల్‌ద్వారా నెలకు రూ.40లక్షల వరకూ సంపాదిస్తూ తొలి స్థానంలో ఉంది.

*వారెవ్వా... షెఫ్‌గా మనందరికీ తెలిసిన సంజయ్‌ తుమ్మ రెండో స్థానంలో ఉన్నాడు. అతడి వంటల వీడియోలకు నెలనెలా వచ్చే ఆదాయం రూ.20 లక్షలకు వరకు ఉంటుందట. సంజయ్‌ వంటలకు 37కోట్లకు పైగా వ్యూస్‌ ఉన్నాయి.
*ట్రబుల్‌ సీకర్‌ టీమ్‌... కొంతమంది కుర్రాళ్లు నడుపుతున్న ఈ ఛానల్‌ ఆదాయం నెలకు రూ.17 లక్షలకు పైనే. సంపాదనలో మూడోస్థానం దీనిదే. రోడ్లమీదా వీధుల్లోనూ అపరిచితుల మధ్య ఏదో హంగామా సృష్టించి వీళ్లు తీసే వీడియోలను కోట్లమంది చూస్తున్నారు మరి.

తన కామెడీ వీడియోలతో సంచలనాన్ని సృష్టిస్తున్న తన్మయ్‌భట్‌ ఆదాయంలోనూ తొలి స్థానానికి పోటీ ఇస్తున్నట్లు తాజా సమాచారం. వీడియోలతో ఇలా నెల నెలా లక్షలు సంపాదిస్తున్నవారు భారత్‌లో ఇంకెందరో.

ఇన్‌స్టాగ్రామ్‌

ఫొటోలను మాత్రమే పోస్ట్‌ చేసే ఈ వెబ్‌సైట్లో ఎక్కువమంది అనుసరిస్తున్న వారిని తమ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉండమని కోరుతుంటాయి కంపెనీలు. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాచుర్యం పొందిన వాళ్లు తాము పోస్ట్‌ చేసే ఫొటోల్లో ఫ్యాషన్‌, ఆహారం, ఫిట్‌నెస్‌... ఇలా ఏ అంశం గురించైనా వ్యాపార సంస్థల తరఫున ప్రచారం చేసి ఆదాయం పొందే వీలుంటుంది. ఈ సామాజిక వెబ్‌సైట్‌లో వెయ్యి నుంచి తొమ్మిది వేలమంది ఫాలోవర్లు ఉంటే ఒక్కో పోస్ట్‌కి నాలుగు నుంచి 16వేలు సంపాదించొచ్చు. అనుసరించేవారు పెరుగుతున్న కొద్దీ ఒక్కో పోస్ట్‌ విలువ లక్ష నుంచి కోటి రూపాయల వరకూ కూడా పెరిగే అవకాశం ఉంది.

ఎవరి ఆదాయం ఎంత...
అమెరికన్‌ టీవీ తార కెన్డల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఏ ఫొటో పెట్టినా సగటున 13 లక్షల లైక్‌లు వస్తుంటాయట. అందుకే, ఆమె ఫొటోలో ఏదైనా బ్రాండ్‌ గురించి ప్రచారం చెయ్యాలంటే రూ.1.6 కోట్ల నుంచి రూ.6.5కోట్ల వరకు వసూలు చేస్తుందట. ఫాలోవర్ల సంఖ్యలోనే కాదు, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రపంచంలోనే ఎక్కువగా సంపాదించే లిస్టులో ఆమె తొలిస్థానంలో ఉంది.

*4.3 కోట్ల ఫాలోవర్లున్న హాలీవుడ్‌ కమెడియన్‌ కెవిన్‌ హార్ట్‌తో ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేయించుకోవాలనుకుంటే ఒక్క ఫొటోకి రూ.6కోట్లు చెల్లించాల్సిందేనట. అతి ఎక్కువ ఆదాయాన్ని పొందే రెండో ఇన్‌స్టాగ్రామర్‌ అతడే.
*హాలీవుడ్‌ గాయని సెలీనా గోమెజ్‌ ఏదైనా బ్రాండ్‌ గురించిన ఒక్క ఫొటో పోస్ట్‌ చేసిందంటే ఆమె అకౌంట్లో రూ.3.6 కోట్లు చేరినట్లే. అందుకే, ఆమె మూడో స్థానంలో ఉంది.

మనదేశంలో...
మనదగ్గర ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది అనుసరించేది సినిమా వాళ్లనే. అందులోనూ బాలీవుడ్‌ హీరోయిన్‌లు దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా, శ్రద్ధా కపూర్‌లవే తొలి మూడు స్థానాలు. సినిమా విశేషాలూ రోజువారీ పనులూ పార్టీలూ... ఇలా రకరకాల ఫొటోలతో దర్శనమిస్తూ వీళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఎవర్‌ గ్రీన్‌ తారలైపోయారు. 1.8 కోట్ల మంది ఫాలోవర్లతో దీపికా పదుకొణె, 1.5 కోట్ల అభిమానులతో ప్రియాంకా చోప్రా, 1.4 కోట్లు మందితో శ్రద్ధాకపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను ఏలేస్తున్నారు. మార్కెట్‌ వర్గాల లెక్కల ప్రకారం వీళ్లు ఏదైనా బ్రాండ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చెయ్యాలంటే ఒక్కో ఫొటోకి రూ.50లక్షలకుపైనే వసూలు చేస్తారట.

ట్వీట్లకూ ఆదాయం

ట్విటర్‌లో ఎవరైనా ప్రకటనల ద్వారా సులభంగా ఆదాయాన్ని పొందొచ్చు. అయితే, అందుకోసం మన అకౌంట్‌ను కనీసం 50మంది అనుసరించాల్సుంటుంది. తర్వాత ట్విటర్‌ అకౌంట్‌ను స్పాన్సర్డ్‌ట్వీట్స్‌, మై లైక్స్‌ సైట్లకు అనుసంధానించుకోవాలి. ఈ సైట్లద్వారా ఎంపిక చేసుకున్న ప్రకటనల గురించి మన అకౌంట్లో ట్వీట్‌ చెయ్యొచ్చు. అలా చేసిన ప్రతిసారీ ఒక్కో ట్వీట్‌కీ కొంత మొత్తాన్ని మన పేపాల్‌ అకౌంట్లో జమ చేస్తాయి ఆయా ప్రకటనల సంస్థలు. అంతేకాదు, మనం ట్వీట్‌ చేసిన సందేశాన్ని మన ఫాలోవర్లు క్లిక్‌ చేసిన ప్రతిసారీ ఒక్కో క్లిక్‌కీ కొంత డబ్బు మన అకౌంట్‌లో చేరుతుంది. మిగిలిన సామాజిక వెబ్‌సైట్లలానే ట్విటర్‌లో కూడా ఫాలోవర్లు పెరిగే కొద్దీ ఒక్కో ట్వీట్‌ ధర పెరుగుతుంది. అది వందల నుంచి లక్షల వరకూ ఎంతైనా ఉండొచ్చు.

భారత్‌లో ట్విటర్‌లో ఎక్కువ మంది అనుసరిస్తున్న వ్యక్తుల్లో నరేంద్ర మోదీ(2.8 కోట్లు), అమితాబ్‌ బచ్చన్‌ (2.5 కోట్లు), షారూఖ్‌ ఖాన్‌ (2.3 కోట్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతి ఖరీదైన ట్వీట్‌ అమెరికన్‌ నటుడు ఛార్లీ షీన్‌దే. ఇతడు ఒక్కో ప్రచార ట్వీట్‌కి అత్యధికంగా రూ.32 లక్షలు వసూలు చేస్తున్నాడు. మనదగ్గర షారూఖ్‌ ఖాన్‌లాంటి వాళ్లతో ప్రచార ట్వీట్లు చేయించుకునేందుకు ఆయా కంపెనీలు ఒక్కో ట్వీట్‌కూ దాదాపు 20 లక్షల రూపాయలు చెల్లిస్తున్నాయి.

- యార్లగడ్డ మధులత

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.