close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చల్లచల్లని గోలా...

చల్లచల్లని గోలా...

హారం కడుపుకే కాదు కళ్లకూ ఇంపుగా ఉండాలని ఐస్‌ గోలాకి ఎప్పుడో తెలిసినట్టుంది. అందుకే అది మొదట్నుంచీ రకరకాల రంగుల్ని పులిమేసుకుని తెగ వూరిస్తుంటుంది. చల్లని ఐస్‌ను కప్పులో పెట్టుకుని జుర్రేసుకోవడం యువతతోపాటు పెద్దవాళ్లకూ ఓ సరదానే. ఆరెంజ్‌, రోజ్‌, పైనాపిల్‌, కాలాకట్టా ఇలా పాత ఫ్లేవర్లే కాదు మరెన్నో కొత్త కొత్త రకాలూ, ఇంకెన్నో రుచులూ కలగలిపి ఈ తరం గోలా ఐస్‌ నోరూరిస్తోంది.

పండ్ల నుంచీ బీర్‌ దాకా...
ఐస్‌ను సన్నగా తురిమి... చేత్తో ముద్దగా చేసి, ఓ పుల్లకు గుచ్చి, దాని మీద మనకు కావలసిన ఫ్లేవర్‌ సుగర్‌ సిరప్‌ వేసి ఇచ్చే గోలా ఐస్‌ మనలో చాలా మందికి సుపరిచితమే. కావాలనుకుంటే ఒకటే ఫ్లేవర్‌తో దీన్ని లాగించేయొచ్చు. లేదంటే రెండు మూడింటి కలయికగా తినొచ్చు. దీనికంటూ సొంతంగా బోలెడు మంది అభిమానులున్నా, ఐస్‌క్రీమ్‌లు తిని బోర్‌కొట్టేసిన వాళ్లకూ ఓ మంచి ప్రత్యామ్నాయం ఇది. ఇక దీన్ని ఐస్‌ఫ్రూట్‌లాగే కాకుండా కప్పులో పెట్టుకు తినేలా బోలెడు రకాలు దొరుకుతున్నాయి. రోజ్‌, మిక్స్‌డ్‌ఫ్రూట్‌, కాలా కట్టా రకాల సిరప్‌లను కలిపి వాటికి జీడిపప్పూ బాదం తదితర ఎండుపండ్లను జోడించి చేసే డ్రైఫ్రూట్‌ గోలా, కండెన్స్‌డ్‌ మిల్క్‌ ముద్దను వాడి చేసే మలాయ్‌ గోలా, కండెన్స్‌డ్‌ మిల్క్‌తో పాటూ చాకొలెట్‌ సిరప్‌, చాకోచిప్స్‌ కలగలిపి తయారుచేసే చాకొలేట్‌ ఫలూదా గోలా, ఐస్‌క్రీమ్‌లో గోలా ఐస్‌ను ముంచి ఉంచే ఐస్‌క్రీమ్‌ గోలా... ఇలా ఎన్నో రకాలు ఇందులో ఉంటున్నాయి. పాన్‌ రుచిని కలిగించే పాన్‌ గోలా, పానీపూరీ తిన్నట్టే అనిపించేలా చేసే పానీపూరీ గోలా... పీచ్‌, కివీ, బ్లూబెర్రీలాంటి రకరకాల విదేశీ పండ్ల ముక్కలతో చేసే ఎగ్జోటిక్‌ ఫ్రూట్‌ గోలాలూ ప్రత్యేకమే. ఇక, గోలాల్లో వైన్‌, వోడ్కా, బీర్ల రుచిని కలిగించేవి సరికొత్త రకాలు. గోలాల్లో వాడే సిరప్‌లకు బదులు అచ్చంగా పండ్ల రసాలను ఉపయోగించి చేసేవీ వస్తున్నాయి. పెరుగూ, సబ్జా గింజలతో చేసే మరికొన్ని రకాలు ఒంటికి చలవ చేస్తాయి కూడా. నాలుగు గోలా ఐస్‌లంత పెద్దగా చేసే జంబోగోలా... గోలాల్లో ప్రత్యేక ఆకర్షణ. రకాన్ని బట్టి గోలా ఐస్‌లు ఐదు నుంచి 200 రూపాయల ఖరీదున్న వాటి వరకూ ఉన్నాయి.

మనమూ చేసుకోవచ్చు...
గోలాల్లో వాడే ఐస్‌ ఎలా ఉంటుందో అనుకుంటున్నారన్న భావనతో కొంతమంది గోలావాలాలు దుకాణానికి ముందు ‘శుద్ధిచేసిన నీటితో చేసిన ఐస్‌’ అని బోర్డు రాసి మరీ పెట్టుకుంటున్నారు. ఇక, అదీ కాదు అనుకుంటే మనమూ ఇంట్లోనే ఐస్‌ను తయారు చేసుకుని, దాన్ని మిక్సీలో వేసి సన్నని ముక్కలుగా చేసి, ఆ ఐస్‌ను ఓ పుల్లకు ముద్దలా అమర్చి గోలా చేసుకోవచ్చు. దీని మీద పోసేందుకు రెడీమేడ్‌ సిరప్‌లు మార్కెట్లో దొరుకుతాయి. లేదంటే, నెట్లో వివిధ సిరప్‌ల తయారీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి. పండ్ల జ్యూసుల్నీ, రస్నాల్లాంటి వాటిని కూడా ఐస్‌మీద పోసేందుకు వాడొచ్చు. నచ్చినట్టు చేసుకున్నా, నచ్చేలా తయారు చేయించుకున్నా ఎవరమైనా గోలా రుచికి భళా అనాల్సిందే!


 

అన్నం పెడతాం రండి..!

అసలే పేదరికం... ఆపైన అయినవాళ్లు అనారోగ్యంతో ఆసుపత్రిలో... అదెంత పెద్ద కష్టమో అనుభవించే వారికే తెలుస్తుంది. దానికితోడు రోగుల వెంట ఉండాల్సి వచ్చే కుటుంబ సభ్యులు రోజుల తరబడి బయటి హోటళ్లలో
తినాలంటే మరింత భారం. అలాంటి కొన్నిలక్షల మంది కష్టాన్ని అర్థం చేసుకుని కడుపునిండా భోజనం పెడుతోంది సత్యసాయి సేవా సమితి.

దిలాబాద్‌ రిమ్స్‌ హాస్పిటల్‌ ఆవరణ... మధ్యాహ్నం... 12.30 నిమిషాలు. ఆసుపత్రి లోపల్నుంచి జనం వస్తున్నారు... భోజనాలు చేసి వెళ్తున్నారు. అలా ఆసుపత్రిలో ఉన్న రోగుల బంధువులు రోజుకి కొన్ని వందలమంది మధ్యాహ్న భోజనానికి అక్కడికి వస్తుంటారు. కానీ అక్కడున్నది ఏ హోటలో కాదు, సత్యసాయి సేవాసమితి నిత్యాన్నదాన కేంద్రం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. దాన్ని ఈ సేవాసమితి అక్షరాలా ఆచరణలో పెడుతోంది. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగుల్లో పనిచేస్తే కానీ పూట గడవని వాళ్లూ చాలా తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువమంది ఉంటారు. అలాంటి వాళ్లు అనారోగ్యంతో ఎక్కువ రోజులు ఆసుపత్రుల్లో ఉండాల్సి రావడమే కష్టం. అయితే, ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. కానీ వారితోపాటు ఉండే బంధువులు బయట తినాల్సిందే. దాంతో స్తోమత లేనివాళ్లు ఒక పూట తిని, మరో పూట తినక పస్తులుంటారు. అలాంటి వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో 2012 ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రిమ్స్‌ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది శ్రీసత్యసాయి సేవా సమితి. దానికి మంచి పేరు రావడంతో సేవా సమితి ఆదిలాబాద్‌ శాఖ సభ్యులు అదే ఏడాది ఆగస్టులో స్థానిక రిమ్స్‌ ఆసుపత్రిలోనూ అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. వీటితో పాటు ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల్లోని మంచిర్యాల, జగిత్యాల, సూర్యాపేట, మెట్‌పల్లి, లక్షెట్టిపేట, ఒంగోలు, ఏలూరు, నెల్లూరు... ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అన్నదాన కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా రిమ్స్‌ ఆసుపత్రుల వద్ద రోజుకు 500 మంది వరకూ, ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రుల దగ్గర వంద మందికి పైగా రోగుల సహాయకులకు అన్నదానం చేస్తున్నారు. అలా ఏడాదికి సుమారు 11లక్షల మంది ఆకలిని తీరుస్తున్నారు.

ఏమతమైనా...
సేవాసమితి కేంద్రాల్లో ఏ మతం వారైనా నిరభ్యంతరంగా భోజనం చెయ్యొచ్చు. ‘శ్రీ సత్యసాయి చెప్పినట్లుగా మతంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ అన్నం, నీరు, విద్య, వైద్యం, సేవ అందించాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అంటారు సత్యసాయి భక్తులు. అందుకే, అన్నదాన కేంద్రం బోర్డు మీద వివిధ మతాల చిహ్నాలను సైతం ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం ఈ కేంద్రం నిర్వాహకులు ఆసుపత్రుల్లోని రోగుల దగ్గరకు వెళ్లి వారికి తోడుగా ఉన్న బంధువులకు భోజనం టోకెన్లను ఇస్తారు. టోకెన్లు తీసుకున్నవారి లెక్కకు సరిపోయేలా వంటలు ప్రారంభించి మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకూ భోజనాలను వడ్డిస్తారు.

అన్నదాన కేంద్రాల్లో వంటచేసే ఇద్దరు, ముగ్గురికి మాత్రమే వేతనాలు చెల్లిస్తారు. మిగతా వారంతా స్వచ్ఛందంగా సేవ చేసే భక్తులే కావడం విశేషం. సత్యసాయి సేవాసమితి స్థానిక శాఖలోని భక్తుల్లో ఒక్కొక్క కుటుంబం ఒక్కోరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని కూరగాయలు తరగడం, గిన్నెలు కడగడం, వడ్డనలు చెయ్యడం లాంటి పనులన్నిటినీ స్వచ్ఛందంగా చేస్తుంటుంది. సేవ చేసే భక్తుల్లో న్యాయవాదులూ, వైద్యులూ, ప్రభుత్వ ఉద్యోగులూ, వ్యాపారులూ, పదవీ విరమణ పొందినవారూ... అన్నివర్గాల వారూ ఉంటారు. వారు తమవంతు వచ్చిన రోజున సమయానికి అన్నదాన కేంద్రానికి చేరుకుని సహాయపడుతుంటారు.

భక్తులే దాతలు
గత అయిదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రుల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం సత్యసాయి భక్తులే. వాళ్లే దాతలుగా నిలబడి ఈ కార్యక్రమానికి అవసరమైన చాలావరకూ డబ్బును అందజేస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యుల పుట్టినరోజులూ వివాహ వార్షికోత్సవాల సందర్భంగానూ, మరికొందరు పూర్వికుల జయంతి వర్ధంతుల సమయంలోనూ, ఇంకొంతమంది నెలకోరోజు అనీ... అన్నదానానికి విరాళాలను అందిస్తుంటారు. ఎవరైనా ఫలానా రోజున ఆత్మీయుల కోసం అన్నదానం చెయ్యాలనుకుంటే అందుకు సరిపడా డబ్బును చెల్లిస్తే చాలు, ఫలనావారి తరఫున ఈరోజు అన్నదానం చేస్తున్నాం... అంటూ బోర్డుమీద రాసి, కార్యక్రమాన్ని చేపడుతుంది సేవాసమితి. ‘ఆసుపత్రికి వచ్చేవాళ్లలో ఎంతోమంది నిరుపేదలు ఉంటారు ఓ వైద్యురాలిగా నాకా విషయం బాగా తెలుసు. అందుకే, నెలకో రోజు ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. ఆకలితో వచ్చి కడుపునిండా భోజనం చేస్తున్నవారిని చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది’ అంటారు స్థానికంగా ఓ ఆసుపత్రిలో వైద్యురాలైన కందుకూరి రమ. ఇలాంటి భక్తుల కారణంగానే ఒక్క ఆదిలాబాద్‌ కేంద్రంలోనే ఏడాదికి 1.25 లక్షల మంది ఆకలితీరుతోంది.

మానవసేవే మాధవ సేవ... అందరికీ తెలిసిన మాటే. కానీ దాన్ని ఆచరణలోనూ చూపిస్తున్నారు సత్యసాయి సేవా సమితి సభ్యులు.

- మంద రామచంద్రం, ఆదిలాబాద్‌ డెస్కు
ఫొటోలు: బేగ్‌, ఎదులాపురం

 

కనిపిస్తే కోట్లే!

అత్తారింటికి దారేదీ సినిమాలో ‘వాడి వాచ్‌ అమ్మితే, మీ బ్యాచ్‌ సెటిల్‌ అయిపోద్ది...’ అని పవన్‌కల్యాణ్‌ని ఉద్దేశించి అంటుంది సమంత. ఇదే డైలాగ్‌ని మన క్రికెటర్లకి ఆపాదించి చెప్పాలంటే వాళ్లు ఆడే బ్యాట్‌మీద మన బ్రాండ్‌
స్టిక్కరున్నా చాలు, అమ్మకాలు ఆకాశాన్ని అంటేస్తాయి అంటున్నాయి ప్రముఖ కంపెనీలు. ఆ నమ్మకం విలువ ఎన్నెన్ని కోట్లో తెలుసా...

ఆటని మతంగా భావించి, అందులోని క్రీడాకారుల్ని దేవుళ్లుగా అభిమానించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. ఆ ఆట క్రికెట్‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి, 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో అంతగా ప్రాముఖ్యత ఉన్న క్రికెటర్లను వ్యాపార సంస్థలు వదులుకుంటాయా... ఈ కారణంతోనే పేరున్న క్రికెటర్లతో ప్రచారం చేయించుకునేందుకు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు కోట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి.

విరాట్‌కోహ్లీ...
110కోట్ల రూపాయలు... కోహ్లీతో స్పోర్ట్స్‌ కంపెనీ ‘ప్యూమా’ ఈమధ్య కుదుర్చుకున్న ప్రచార ఒప్పందం విలువ. దీన్లో భాగంగా కోహ్లీ ‘ప్యూమా’ కంపెనీ షూ, క్రీడా దుస్తులు, యాక్సెసరీస్‌... లాంటివాటికి ఎనిమిదేళ్లపాటు ప్రచారకర్తగా ఉంటాడు. ఆటతో పాటు, అందమూ గర్ల్‌ఫ్రెండూ అన్నీ కలసి 28 ఏళ్ల కోహ్లీకి యువతలో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించిపెట్టాయి. దానికితోడు టీమ్‌ ఇండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారడంతో పాటు ఈమధ్య అతడు చేసిన డబుల్‌ సెంచరీలు కూడా మార్కెట్‌లో కోహ్లీ స్థాయిని అమాంతం పెంచేశాయి. ఆడి, బూస్ట్‌, కోల్గేట్‌, జియోనీ, ఎమ్‌ఆర్‌ఎఫ్‌, మాన్యవర్‌, విక్స్‌... ఇలా దాదాపు 20 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీకి ఆయా వ్యాపార సంస్థలు ఒక్కోటి ఏడాదికి రూ.10-14 కోట్లు చెల్లిస్తున్నాయి. ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం 2016లో కోహ్లీ ఆదాయం రూ.134 కోట్లు.

ఎం.ఎస్‌.ధోనీ
ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోనీ భారత క్రికెట్‌ టీమ్‌కి అందించిన విజయాలు అతడిని ఎన్నో ఏళ్లుగా ప్రకటనల స్టార్‌గా నిలిపాయి. ధోనీతో ప్రచారం చేయించుకోవాలంటే ఒక్కో బ్రాండ్‌కీ ఏడాదికి రూ.8-12 కోట్లు ముట్టజెప్పాల్సిందేనట. ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గల్ఫ్‌ ఆయిల్‌, లావా మొబైల్స్‌, బిగ్‌బజార్‌, స్పార్టన్‌, మైసూర్‌ శాండల్‌, టీవీఎస్‌ స్టార్‌ సిటీ... లాంటి బ్రాండ్లకు ప్రచార కర్తగా పనిచేస్తున్న అతడి సంపాదన గత ఏడాది రూ.125 కోట్లు. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కాబట్టి, ముందు ముందు ఈ విలువ తగ్గే అవకాశాలున్నాయన్నది మార్కెట్‌ నిపుణుల అంచనా.

యువ్‌రాజ్‌ సింగ్‌
ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన యువ్‌రాజ్‌ సింగ్‌ ఆటను క్రీడాలోకం ఎప్పటికీ మర్చిపోలేదు. క్యాన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకోవడానికి ముందు అతడి ఒక్కో బ్రాండ్‌ విలువ ఏడాదికి రూ.4-6 కోట్లు. అదిప్పుడు రూ.1-2 కోట్లకు దిగింది. అప్పో మొబైల్స్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌... లాంటి బ్రాండ్లకు ప్రస్తుతం యువ్‌రాజ్‌ ప్రచారకర్తగా ఉన్నాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌
2016లో ఆల్‌రౌండర్‌గా అత్యుత్తమ ర్యాంకులో నిలిచిన రవిచంద్రన్‌ అశ్విన్‌ వీఐపీ, మూవ్‌, మన్నా హెల్త్‌ మిక్స్‌, స్పెక్స్‌ మేకర్స్‌, రామ్‌రాజ్‌ లినెన్‌ షర్ట్స్‌... లాంటి ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నాడు. అందుకు గానూ ఒక్కో కంపెనీ నుంచి ఏడాదికి 1.50 నుంచి 1.75 కోట్ల రూపాయలు అతడి ఖాతాలోకి చేరుతున్నాయి. 2018 నాటికి కోహ్లీ తర్వాతి స్థానం రవిచంద్రన్‌దే అన్నది మార్కెట్‌ వర్గాల అంచనా, నమ్మకం.

రోహిత్‌ శర్మ
గతేడాది ప్రముఖ వాచ్‌ బ్రాండ్‌ ‘హబ్లట్‌’ ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకున్న రోహిత్‌శర్మ ఈ ఏడాది ప్రారంభంలో రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలసి వీఐపీ కంపెనీ ‘అరిస్టోక్రాట్‌’ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఎంపికయ్యాడు. వీటితోపాటు అడిడాస్‌, నిసాన్‌, సియట్‌... లాంటివాటికి ప్రచారం చేస్తున్న రోహిత్‌ ఒక్కోదానికీ ఏడాదికి రూ.కోటి వసూలు చేస్తున్నాడు.

ఇన్నిన్ని కోట్లు ఇచ్చేస్తున్నాయి కాబట్టి, క్రికెటర్లు ఆయా కంపెనీల కోసం ఏడాదంతా కష్టపడి ప్రచారం చేస్తారనుకుంటే మనం పొరబడినట్లే. సంబంధిత బ్రాండ్‌ల టీవీ ప్రకటనల షూటింగులైనా ఇతర ప్రచార కార్యక్రమాలైనా మహా అయితే నాలుగైదు రోజులు కేటాయిస్తారు అంతే. అంటే కోహ్లీ లాంటి వారితో ఒప్పందం కుదుర్చుకుంటే వాళ్లు పనిచేసిన నాలుగు రోజులకీ 10-14 కోట్ల రూపాయలను చెల్లించినట్లన్నమాట.

బ్యాట్‌మీద స్టిక్కరుకీ కోట్లు

క్రికెటర్లకి క్రేజ్‌ ఎలా ఉందంటే... వాళ్లు ఆడే బ్యాట్‌మీద తమ కంపెనీ లోగో స్టిక్కరుని అంటించుకున్నా కోట్ల రూపాయల్ని చేతిలో పెడుతున్నాయి వ్యాపార సంస్థలు. కోహ్లీ తన బ్యాట్‌మీద ఎమ్‌ఆర్‌ఎఫ్‌ (మద్రాస్‌ రబ్బర్‌ ఫ్యాక్టరీ) స్టిక్కర్‌ని అంటించుకున్నందుకు రూ.8 కోట్లు చెల్లిస్తోంది ఆ కంపెనీ. ఇక, అతడు మ్యాచ్‌ ఆడేటపుడు ఏ బ్రాండ్‌ షూ, గ్లోవ్స్‌, యాక్సెసరీస్‌ వేసుకుంటే ఆ బ్రాండ్‌ తరఫున ఏడాదికి మరో రూ.రెండు కోట్లు అతడి ఖాతాలో చేరతాయి. ఇలాగే ధోనీ బ్యాట్‌ మీది ‘స్పార్టన్‌’ కంపెనీ స్టిక్కర్‌కి రూ.6కోట్లు, యువ్‌రాజ్‌సింగ్‌ బ్యాట్‌ మీద కనిపించే ప్యూమా స్టిక్కర్‌కి రూ.4 కోట్లు, ఎమ్‌ఆర్‌ఎఫ్‌ స్టిక్కర్‌ కోసం శిఖర్‌ ధావన్‌కి రూ.3కోట్లను... ఆయా కంపెనీలు ముట్టచెబుతున్నాయి. ‘సియట్‌’ బ్రాండ్‌ స్టిక్కర్లు అంటించుకునేందుకు సురేష్‌రైనా, రోహిత్‌ శర్మలతో ఆ సంస్థ రూ.మూడు కోట్లతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.


 

మనసు గాయం మానింది!

ప్రతిచోటా కొత్తకొత్త రుచుల్ని అందించే కెఫేలు వస్తున్నాయి. కానీ వాటికి పూర్తిగా భిన్నమైనది చెన్నైలోని రైటర్స్‌ కెఫే. ఇక్కడ రుచికరమైన వంటకాలే కాదు జీవితానికి అవసరమయ్యే స్ఫూర్తి పాఠాలూ దొరుకుతాయి.

స్మాది ప్రేమ వివాహం... పెళ్లైన తర్వాత- తెలిసింది భర్త పచ్చితాగుబోతని. దానికితోడు వేధింపులు. ఇవన్నీ తట్టుకోలేక చనిపోదామనుకొని ఒంటికి నిప్పంటించుకుంది. అంతలో ఎవరో చూసి కాపాడటంతో బతికింది. తర్వాత తన కాళ్లపైన తాను నిలవాలనుకుంది. కానీ కాలిన గాయాలు మానడానికి చాలా సమయం పట్టింది. గాయాలు మానినా మచ్చలు పోలేదు. ‘జీవనోపాధి ఎలా’ అన్న సందిగ్ధంలో ఉన్నపుడు ఆమెకు ‘రైటర్స్‌ కెఫే’ రూపంలో ఓ మార్గం కనిపించింది. కోమల, పునీతవల్లి, పరిమళ, ప్రియదర్శిని, మారియా, మంజుల... అందరూ కాలిన గాయాలున్నవారే. వీరిలో కొందరు ఇతరుల కారణంగా గాయాలపాలైతే, కొందరు వివాహబంధం సరిగ్గాలేకపోవడంవల్ల ఆత్మహత్యా ప్రయత్నంలో అలా మిగిలారు. మరికొందరు ప్రమాదవశాత్తూ గాయాలైనవారున్నారు. వీరందరూ చెన్నైలో ఉన్న రైటర్స్‌ కెఫేలో కొత్త జీవితాన్ని పొందగలుగుతున్నారు. ఇలాంటివారికి ఆసరా ఇవ్వడానికే ఈ కెఫేని ఏర్పాటుచేశారు.

ఆమె కోసం అతడు
‘ముఖంనిండా కాలిన మచ్చలున్నవారిని కుటుంబమూ, సమాజమూ చులకనగా చూస్తాయి. వాళ్లలోనూ అందవిహీనంగా ఉన్నామన్న భావన ఉంటుంది. ఆ పరిస్థితిలో మార్పు తెచ్చి వారికి ఆర్థిక స్వేచ్ఛను కల్పించి, ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నమే ఇది’ అని చెబుతారు రైటర్స్‌ కెఫే మేనేజర్‌ లులు బుహారి. ఇలాంటివారికి రైటర్స్‌ కెఫేలో వెయిటర్స్‌గా ఉపాధి కల్పించడంతోపాటు కేకులు, బ్రెడ్‌లూ, పిజ్జా సహా మరికొన్ని విదేశీ వంటకాల తయారీలోనూ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న ఏడుగురికి స్విట్జర్లాండ్‌ నుంచి షెఫ్‌ను తీసుకొచ్చి నాలుగు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. డిసెంబరులో ఈ కెఫే ప్రారంభమైంది. దీని ప్రారంభం వెనుక కీలక వ్యక్తి ఎమ్‌.మహదేవన్‌. చెన్నైకు చెందిన ఈయన ‘ఓరియంటల్‌ క్విజీన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థకు యజమాని. ఈ సంస్థ చెన్నైలో ‘హాట్‌ బ్రెడ్స్‌’, ‘ఫ్రెంచ్‌ లోఫ్‌’ లాంటి కొన్ని గొలుసుకట్టు బేకరీ దుకాణాలూ, రెస్టారెంట్లను నడుపుతోంది. ఆచార్యుడిగా పనిచేసిన మహదేవన్‌ పదిమందికీ ఉపాధినివ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగం విడిచిపెట్టి బేకరీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ‘‘నేనొక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ఆకలంటే తెలుసు. కష్టమంటే తెలుసు. ఆ అనుభవాలే తోటివారి గురించి ఆలోచించేలా చేశాయి. ‘పేదల్ని ఎప్పుడూ మర్చిపోకు. నువ్వు వంద సంపాదిస్తే అందులో 50 మాత్రమే నీది. మిగతా సగం సమాజానిది’ అని అమ్మ చెప్పేది. ఇలాంటి సంస్థల్ని ప్రారంభించి సమాజ ఉద్ధరణకు నా వంతు సాయం చేయాలని మొదట్నుంచీ ప్రయత్నిస్తున్నాను’’ అని చెబుతారు మహదేవన్‌. ఇదివరకు చెన్నైలోని ఓ జైల్లో ‘ఫ్రీడమ్‌ బేకరీ’ని ప్రారంభించారు. ఇక్కడ ఖైదీలకు కేకులూ, బ్రెడ్‌ల తయారీలో శిక్షణ ఇస్తూ శిక్ష అనంతరం ఉపాధి పొందేలా సాయపడుతున్నారు. చెన్నై లయోలా కాలేజీలో ప్రారంభించిన ‘గివ్‌ లైఫ్‌ కెఫే’ద్వారా భర్త మరణించిన స్త్రీలకు ఆర్థిక ఆసరా ఇస్తున్నారు. ఆయా కెఫేలద్వారా వచ్చే ఆదాయాన్ని అలాంటివారికి చేయూతనివ్వడానికే కేటాయిస్తారు. ‘నేను సేవా దృక్పథంతో ప్రారంభించిన అన్ని కెఫేలూ లాభాల బాటలో నడుస్తున్నాయి. వీటికి సామాన్యుల సహకారం కూడా ఉంది. వారే కొనకుంటే ఇవి నడవవుగా’ అంటారు మహదేవన్‌.