close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనసున మనిషై

మనసున మనిషై
- సునీత గంగవరపు

‘‘నీకెన్నిసార్లు చెప్పానోయ్‌... నాకోసం వెయిట్‌ చేసి సమయాన్నీ ఆరోగ్యాన్నీ పాడుచేసుకోవద్దని. తినడానికి కావాల్సింది తోడు కాదు... ఆకలి’’- టీవీ ముందు సోఫాలో సెటిలై చేతిలోని రిమోట్‌తో ఛానెల్స్‌ మారుస్తూ అన్నాడు శేఖర్‌. ఆఫీసునుండి రావడం లేటవుతుందని ముందే ఫోన్‌ చేశాడు. నాకేమో ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూరల్లోని కమ్మదనాన్నీ మాటల్లోని మాధుర్యాన్నీ ఆస్వాదిస్తూ భోజనం చేయడం ఇష్టం. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్ళాడట. నేను మాత్రం భోంచేయకుండా తనకోసం ఎదురుచూస్తూ కూర్చోవడంతో రాత్రి పది తర్వాత వచ్చిన శేఖర్‌ నాతో అసహనంగా అంటున్న మాటలివి.

నేనేదో నాలుగు మెతుకులు తిన్నాననిపించి వంటగది సర్దేసి పక్కమీదికి చేరబోతుండగా అమ్మ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

‘‘అందరినీ చూడాలనిపిస్తోంది. రేపు ఒక్కసారి వచ్చి వెళ్ళండమ్మా’’ అమ్మ గొంతులో పెద్దరికం తెచ్చిన అధికారం లేదు. ఆత్మీయతతో కూడిన అభ్యర్థన మాత్రమే ధ్వనించింది.

‘‘సరేమ్మా, రేపే వస్తున్నాం’’ కాదని చెప్పడానికి కారణాలు వెతుక్కోకుండా వెంటనే నా అంగీకారాన్ని చెప్పాను.

అమ్మకు అయిదారు నెలల క్రితం హార్ట్‌స్ట్రోక్‌ వచ్చింది. ప్రస్తుతానికి ఇబ్బందిలేదనీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడమనీ డాక్టర్స్‌ హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ చేసేటపుడు చెప్పారు.

నాన్న ఉన్నపుడు- పల్లెటూర్లో నాన్న కట్టించిన సొంత ఇంట్లోనే అమ్మానాన్న ఉండేవారు. నాన్న పోయాక ఆ ఇంటిని వేరేవాళ్ళకు అద్దెకిచ్చి, అమ్మను పిల్లల దగ్గర- అంటే, అమ్మకు ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వారి దగ్గర ఉండమని చెప్పాం. అప్పటివరకూ అన్నయ్య దగ్గర ఉన్న అమ్మ, హాస్పిటల్లో ఉన్నప్పుడే మాతో చెప్పింది- తాను ఎవరిదగ్గరా ఉండలేననీ, నాన్న కట్టించిన ఆ ఇంట్లోనే ఉంటాననీ. ఈ వయసులో ఒంటరిగా ఉండటం మంచిదికాదని నేనూ అన్నయ్యా ఎంతచెప్పినా వినలేదు. ఇక తప్పదని ఆ ఇంట్లో అద్దెకున్నవారిని ఖాళీ చేయించి, అమ్మను అక్కడ వదిలిపెట్టాడు అన్నయ్య. ఆ ఇల్లంటే అమ్మకే కాదు... పిల్లలమైన మాకూ ఇష్టమే! మా బాల్యం, ఆటపాటలూ, తల్లిదండ్రులు పంచిన ప్రేమానురాగాలూ - పగలు జ్ఞాపకాలుగా రాత్రిళ్ళు కలలుగా మమ్మల్ని పలకరించిపోతుంటాయి.

పిల్లలు చరణ్‌, సువిధలు అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. నేను మంచం మీద పడుకున్నాక నాకు దగ్గరగా జరిగిన శేఖర్‌తో చెప్పాను.

‘‘అమ్మ రేపు రమ్మందండీ, చూడాలని ఉందట. హాస్పిటల్‌ నుంచి వెళ్ళాక అమ్మను ఒక్కసారి కూడా చూడలేదు. ఆరోగ్యం ఎలా ఉందో!?’’ చెప్తుంటే బాధతో నా గొంతు కంపించింది.

‘‘నిజమా? వయసు పైబడింది కదా... అలాంటి అనారోగ్యాలు సహజమే. ఇంత సడెన్‌గా అంటే... నాకు ఆఫీసులో సెలవు దొరకకపోవచ్చు. ఇప్పటికి మీరు వెళ్ళిరండి. వీలు చూసుకుని మరోసారి అందరం వెళ్దాం’’ చెప్పి నా సమాధానం కోసం చూడకుండా దూరంగా జరిగి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు శేఖర్‌. దగ్గరకు తీసుకుని నాలుగు మంచిమాటలు చెప్పి ఓదార్చితే బావుండనిపించింది. అయినా అలవాటైన అనుభవాలే కాబట్టి అసంతృప్తిని పక్కకు నెట్టేసి, అమ్మానాన్నల గురించి ఆలోచిస్తూ బలవంతంగా కళ్ళు మూసుకున్నాను.

మరుసటిరోజు పిల్లలిద్దరినీ తీసుకుని అమ్మ దగ్గరకు బయలుదేరాను. శేఖర్‌ కారులో బస్టాండ్‌ దగ్గర డ్రాప్‌ చేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది. ఏదో విధంగా అమ్మకు నచ్చజెప్పి మా దగ్గర ఉంచుకోవాలి, లేదా అన్నయ్య దగ్గరకైనా పంపించాలి. నేను బయలుదేరేముందు అన్నయ్య ఫోన్‌ చేసి ఈ విషయమై అమ్మను ఎలాగైనా కన్విన్స్‌ చేయమని నాకో బరువైన బాధ్యతను పురమాయించాడు.

అమ్మానాన్నలిద్దరూ ఓ ప్రభుత్వ శాఖలో పనిచేసే చిరుద్యోగులు. కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూనే చాలీచాలని జీతాలతో తాము కష్టపడుతూ కూడా పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. అన్నయ్య తర్వాత ఓ అక్క, చివర నేను. మాకు పెళ్ళిళ్ళయి ఉద్యోగాల నిమిత్తం పట్టణాల్లో స్థిరపడిపోయాం. ఉన్న వూరునూ సొంత ఇంటినీ ప్రేమించే నాన్న... రిటైరయ్యాక కూడా పిల్లల దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. తాను కష్టపడి ఇష్టంగా కట్టించుకున్న ఆ ఇంట్లోనే నాన్న ఓ రాత్రి తుదిశ్వాస విడిచాడు.

నాన్న ఎడబాటుతో అమ్మ బాగా కుంగిపోయింది. ఒంటరినయ్యానన్న బాధతో చిక్కి సగమయింది. నాన్నలేని లోటు తెలియకుండా అమ్మను కాపాడుకోవడానికి పిల్లలమైన మేం ముగ్గురం ఓ రకంగా విఫలయత్నమే చేశాం. నిజం చెప్పొద్దూ... అమ్మను నాన్న చాలా ప్రేమగా చూసుకునేవారు.

కాలం రేపిన మార్పుల సుడిలో నాన్న తదనంతరం అమ్మ కొంతకాలం వైజాగ్‌లో ఉన్న అక్క దగ్గర ఉంది. బావగారు ఓ ప్రైవేట్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌. అక్క స్థానిక కళాశాలలో క్లర్క్‌గా విధులు నిర్వహించేది. వారికి ఇద్దరు పిల్లలు. హైస్కూల్‌లో చదువుతున్నారు.

అక్క ఉదయాన్నే లేచి వంటపనీ ఇంటిపనీ చేసి పిల్లలకు క్యారేజీ సర్ది స్కూలుకు పంపిస్తుంది. బావకు కూడా అడిగినవన్నీ అందిస్తూనే తానూ సిద్ధమై కాలేజీకి వెళ్ళేటప్పటికి టెన్షన్‌తో తలనొప్పి వచ్చేస్తుందట. సాయంత్రం ఇంటికి రాగానే అలసటతో మంచంపై వాలిపోయేది. అందరు ఆడవాళ్ళూ చేసే పనులే అయినా, ఇవన్నీ చూసి ఎంతైనా అమ్మ మనసు కదా... బాధపడేది.

ఓసారి అక్క కాలేజీ నుంచి వచ్చాక తలనొప్పితో బాధపడుతూ పడుకుంటే, అమ్మ కాఫీ కలిపి ఇద్దామని వంటగదిలోకి వెళ్ళి పొరపాటున పాలగిన్నె కింద పడేసింది. అమ్మ కంగారులో వాటిమీద కాలేసి జారిపడి వారం రోజులపాటు నడవలేకపోయింది. విషయం తెలుసుకున్న బావ అక్కను కోపంతో గట్టిగా అరవడం అమ్మ వింది.

‘‘లోకంలో నువ్వొక్కదానివే కష్టపడుతున్నట్లు ఫీలవ్వకు. ఉద్యోగాలు చేసుకుంటున్న ఆడాళ్ళందరూ ఇంటిపనులు చేసుకోవట్లేదా? ముసలావిడకు ఏమైనా జరిగి మంచానపడితే ఎవరు సేవలు చేస్తారు?’’ తనకు గాయమయిందన్న బాధకంటే వారికి భారంగా మారుతుందేమోనన్న బావగారి మాటల్లోని భావం అమ్మ అర్థంచేసుకుంది. చెమ్మగిల్లిన అమ్మ ఆలోచనల్లో నాన్న మెదిలాడట.

అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగస్తులే అయినా అమ్మతోపాటు నాన్న కూడా ఇంటిపనులు చక్కబెట్టేవాడు. ఉదయం అమ్మకంటే ముందే లేచి వంటకు కావలసిన కూరగాయలు తరిగి సిద్ధంగా ఉంచేవాడు. స్టవ్‌ ముందు కూర్చున్న అమ్మకు కావాల్సిన వస్తువులు అందిస్తూనే మమ్మల్ని స్కూలుకు రెడీ చేసేవాడు. ఇంటా బయటా ఎన్ని కష్టాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వచ్చినా ఆ కోపాన్ని అమ్మమీద కానీ పిల్లల మీద కానీ చూపేవాడు కాదు. తను సంతోషంగా ఉంటూ ఇంటివాళ్ళతో బంధువులతో ఆ సంతోషాన్ని పంచుకునేవాడు.

తర్వాత అమ్మ నా దగ్గరకు వచ్చినపుడు తన మనసులోని సంగతులనీ సంఘర్షణలనీ నాతో చెప్పుకుని బాధపడింది.

శేఖర్‌ ఆఫీసుకు సంబంధించి ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా ఎక్కువ సమయం బయటే గడిపేవాడు. ఒక్కోసారి రెండుమూడు రోజులైనా ఇంటికి రాడు. వస్తానన్న రోజు ఏ అర్ధరాత్రో అతను ఇంటికి చేరేదాకా నేను మేలుకొని ఎదురుచూస్తుంటాను. అతను వచ్చాక ఆఫీసు విషయాలూ ప్రయాణంలోని అనుభవాలూ అడిగి తెలుసుకోవడం ఇష్టం నాకు.

ఆరోజు రాత్రి అన్నం వడ్డిస్తూ అడిగాను ‘‘క్యాంప్‌ విశేషాలేంటీ?’’ అని.

‘‘చిరాగ్గా ఉందోయ్‌, ఓపిక లేదు’’ అన్నాడు.

‘నిజమే, అలసిపోయి వచ్చాడు కదా’ అనుకున్నాను. కానీ, అప్పుడే ఎవరో ఫ్రెండ్‌ ఫోన్‌ చేయగానే దాదాపు అరగంటపాటు ఇంటిముందు అటూ ఇటూ పచార్లు చేస్తూ నవ్వుతూ కబుర్లు చెప్పడం నాకు వినపడింది. నాకప్పుడర్థమయింది, అతనికి ప్రయాణ బడలిక వల్ల వచ్చిన చిరాకు కాదది. భార్యపట్ల ఉన్న చిన్నచూపు వల్ల మాత్రమే పుట్టుకొచ్చిన చిరాకు.

రోజువారీ దినచర్యలో భాగంగా ఏవో ముఖ్యమైన విషయాలు తప్ప, అంతరంగిక మనోభావాలు నేను అడగడం, తాను చెప్పడం మరచిపోయాం. యాంత్రికంగా మారిన మా సంసార జీవితాన్ని అమ్మ నిశ్శబ్దంగా గమనించేది.

ఇక్కడ కూడా బహుశా అమ్మకు నాన్న గుర్తువచ్చేవాడేమో! నాన్న ఎప్పుడైనా వూరికి వెళ్తే... వచ్చాక, బస్‌ ఎక్కింది మొదలుకొని తిరిగి ఇంటికి వచ్చేదాకా, బస్‌లో పల్లీలు కొనుక్కొని తిన్న విషయం సహా పూసగుచ్చినట్లు అమ్మకు చెప్పేవాడు. నాన్న తెచ్చిన మిఠాయిలు తింటూ మేం కూడా ఆ విషయాలు ఆసక్తిగా ఆలకించేవాళ్ళం.

అమ్మ నా దగ్గర కొంతకాలం ఉన్న తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. తన భారాన్ని పూర్తిగా ఎవరిమీదా మోపకూడదని అమ్మ ఉద్దేశం కాబోలు. చివరకు ఏమయిందో, ఏమనుకుందోగానీ సొంతింటిలోనే ఒంటరిగా ఉండటానికి సిద్ధపడింది. కానీ అమ్మ వయసూ, ఆరోగ్యరీత్యా అలా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అమ్మను ఒప్పించడానికి ఏమేం మాట్లాడాలో మనసులో రిహార్సల్స్‌ వేసుకుంటుండగా నేను దిగాల్సిన స్టేజీలో బస్‌ ఆగడంతో నా ఆలోచనలకు కూడా బ్రేక్‌ పడింది.

మమ్మల్ని చూడగానే- దిగులుగా నీరసంగా ఉన్న అమ్మ మొహంలోకి కొత్త కళ వచ్చింది. నన్నూ పిల్లల్నీ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ అంది ‘‘అల్లుడు కూడా వచ్చుంటే బాగుండేది కదమ్మా’’ అని.

నేను మాట్లాడలేదు. పిల్లలిద్దరూ అమ్మమ్మతో చేరి ముద్దుముద్దుగా ముచ్చట్లు చెప్తుంటే వింటూ నేను వంట చేశాను. నలుగురం కలిసి భోంచేశాక నిద్రకు ఉపక్రమించడానికి ముందు నేను అమ్మ పక్కన మంచం మీద కూర్చున్నాను. మరో మంచంపైన పిల్లలిద్దరూ నిద్రపోయారు.

‘‘ఏమ్మా, కుటుంబ పరిస్థితులెట్లా ఉన్నాయి? అల్లుడుగారు బాగా చూసుకుంటున్నారు కదూ’’ అమ్మ అడిగింది.

నాకు నాన్న గురించి తెలియకపోయి ఉంటే ‘బాగా చూసుకోవడం’లోని సంక్షిప్త అవగాహననుబట్టి వెంటనే తల వూపేసేదాన్ని. కానీ, ప్రేమకు పరిపూర్ణ నిర్వచనంగా గుర్తుండిపోయిన నాన్న ప్రేమ జ్ఞాపకం వచ్చి మౌనంగా ఉండిపోయాను. అయినా ఎందుకో బాధనిపించలేదు. ప్రేమరాహిత్యపు కృత్రిమ జీవితానికి అలవాటుపడి ఉండటం కారణం కావచ్చు.

నేను మాట మారుస్తూ అన్నాను ‘‘మా సంగతి తర్వాత. ముందు నీ గురించి చెప్పు. ఇక్కడ ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావమ్మా? ఏదైనా అనారోగ్యం వచ్చి మంచంపడితే ఎవరు చూస్తారు? రేపు మాతోపాటు వచ్చేసెయ్‌. మా దగ్గర ఉందువుగానీ.’’

అమ్మ కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు.

‘‘పోనీ, మా దగ్గర ఉండటం ఇష్టం లేకపోతే అన్నయ్య దగ్గరైనా ఉండు. అసలు అన్నయ్య దగ్గర నుంచి ఎందుకు వచ్చేశావు?’’ అమ్మ దగ్గర నాకు చనువెక్కువ. అందుకే కాస్త గట్టిగానే నిలదీశాను.

అమ్మ కూర్చునే ఓపికలేనట్లు మెల్లగా పడుకుని నా చేతి గాజులను సవరిస్తూ చెప్పసాగింది- ‘‘నేను మీ అంత చదువుకోలేదమ్మా. మీకున్నపాటి లోకజ్ఞానం కూడా నాకు లేదు. కానీ, నా వ్యక్తిగత జీవితానుభవానికీ మీ జీవితాలకూ చాలా వ్యత్యాసముంది. మీ ముగ్గురి కుటుంబాలనూ నేను గమనించాను. సంపాదన కోసమో అవసరం కోసమో ఒకరిమీద ఒకరు ఆధారపడి అసంతృప్తితో బతుకుతున్నట్లుంది కానీ, ఒకరి కోసం ఒకరు బతుకుతున్నట్లుగా లేదు. అందరు భార్యాభర్తలూ నేనూ మీ నాన్నా ఉన్నట్లే ఉండాలనీ అలా ఉండటంలేదనీ నేననడం లేదు. కానీ, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థంచేసుకోవాలి. ఒకరితో ఒకరు అన్నీ పంచుకోవాలి. ఈ ప్రయత్నం చేయకుండా ఎప్పటికప్పుడు రాజీపడి బతుకుతుంటే... చివరకు మన బతుకులో ఏ అనుభూతీ మిగలదు. అంటీముట్టనట్లుండే మీ బంధాలను అర్థంచేసుకుని, అంగీకరించే శక్తి నాకు లేదు. అందుకే ఎవరి దగ్గరా ఇమడలేకపోతున్నాను.’’ ఆమ్మ గొంతులో ఆవేదన ఉంది.

‘‘అందరూ అన్ని పరిస్థితులూ మనమనుకున్నట్లే ఉండకపోవచ్చు కదమ్మా! మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనమూ మారాలి. మన ఆలోచనల్లో మార్పు రావాలి.’’

నా మాటలకు అమ్మ చిన్నగా నవ్వింది.

‘‘శైలూ, కాలం ఏదైనా, పరిస్థితులు ఏవైనా... ప్రేమించడానికీ ప్రేమను వ్యక్తపరచడానికీ దేవుడు మనిషికి మనసిచ్చాడు. ఆ మనసుకు స్పందించే గుణాన్నిచ్చాడు. ప్రతిస్పందించే సౌలభ్యాన్నిచ్చాడు. ప్రతి మనిషిలోనూ లోపాలుంటాయి. కానీ, సంసార జీవితం సాఫీగా సాగడానికి లోపాలను క్షమించుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ ముందుకు కదలాలి.’’

అమ్మ కొంచెంసేపు ఆగి మంచినీళ్ళు తాగి మళ్ళీ చెప్పసాగింది.

‘‘అన్నయ్య దగ్గర ఎందుకు ఉండలేదని అడిగావు కదూ! మీ అన్నయ్య డ్యూటీ నుంచి ఏ మధ్యరాత్రికో ఇంటికొస్తాడు. పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు నీళ్ళిచ్చి, అన్నంపెట్టి ఆకలి తీర్చి ఆప్యాయతను పంచాలి భార్య. కానీ, మీ వదిన టీవీ చూస్తూనో ఫోన్‌లో మాట్లాడుతూనో అసలు భర్త వచ్చాడన్న విషయాన్నే గుర్తించదు. చూసినా చూడనట్లు వూరుకుంటుంది. భర్తకు దగ్గరగా కూర్చుని ప్రేమగా వడ్డించటం, ఇద్దరూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకోవడం నేనింతవరకు చూడలేదు. పోనీ, నీ గురించి చెప్పు... నువ్వు పూర్తి సంతోషంగా ఉంటున్నట్లు గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పగలవా? ఒకరి అనుభూతుల్నీ ఆనందాల్నీ మరొకరు పంచుకోనపుడు, పంచుకునేవారు లేనపుడు ఆ సంసారంలో సంతోషముంటుందా?’’

అర్థవంతమైన అమ్మ విశ్లేషణకు నాకు నోటమాట రాలేదు.

‘‘ఇక మీ అక్క విషయానికి వస్తే- రంగు తక్కువనీ ఎత్తు తక్కువనీ మీ బావ ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉంటాడు. ఇంకా... పని సరిగా రాదనీ వేళకు అన్నీ అమర్చిపెట్టడంలేదనీ ఇల్లాలంటే ఇంటి పనులకూ వంట పనులకూ కేటాయించబడిన యంత్రంలా భావించి అసహనాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటాడు. ఇంట్లో ప్రతి పనికీ స్త్రీల మీద ఆధారపడుతూనే, మళ్ళీ స్త్రీలను చిన్నచూపు చూసే మగవారి నైజం నాకు నచ్చదు’’ అమ్మ చెప్పడం ఆపింది.

నిజమే... అమ్మ జీవితానుభవానికీ మా జీవితాలకూ పొంతనలేదు. అమ్మ నాన్నకంటే తక్కువే చదివింది. అందంలో కూడా సాధారణ స్థాయికంటే తక్కువే ఉంటుంది. అక్కకు వచ్చింది అమ్మ పోలికే. నాన్న మాత్రం తెల్లగా పొడుగ్గా సినిమా హీరోలా ఉంటాడు. అయినా అమ్మను ఎప్పుడూ తక్కువచేసి మాట్లాడలేదు. తనతో అమ్మను బయటికి తీసుకెళ్ళడానికి ఆసక్తి చూపేవాడు. అందరికీ అమ్మను సంతోషంగా పరిచయం చేసేవాడు.

అమ్మ చెప్పినవన్నీ అక్షరసత్యాలు. వాటిని క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడానికి నాకున్న లోకపరిజ్ఞానం, జీవితానుభవం చాలవు.

అమ్మ కొద్దిగా ఆయాసపడుతూ లేచి కూర్చుంది. నేను టాబ్లెట్‌తోపాటు మంచినీళ్ళు కూడా ఇచ్చాను. టాబ్లెట్‌ వేసుకున్నాక అమ్మ కొంచెం స్థిమితపడింది.

‘‘నేను ఎక్కువగా పాడేపాట గుర్తుంది కదా శైలూ! ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు- నీ కోసమే కన్నీరు నింపుటకు’ అనే పాట. అంతటి ప్రేమా అలాంటి తోడూ దొరికితే మనిషికి ఏ అవసరాలూ గుర్తురావు. అలాంటివారి జీవితమంతా వికసించిన పూలతోటే అవుతుంది.’’

అమ్మ మాటలకు అడ్డుపడుతూ అన్నాన్నేను- ‘‘సరే, అవన్నీ ఇప్పుడెందుకులేమ్మా! ఇంతకూ నువ్వు రేపు మాతో వస్తున్నావా లేదా?’’

అమ్మ చిన్నగా నవ్వింది. ‘‘నువ్వు చిన్నపిల్లవు. నీకెందుకు తల్లీ ఈ ఆరాటం? రేపు మీ అన్నయ్య వస్తానన్నాడుగా... వచ్చాక మాట్లాడదాంలే, వెళ్ళి పడుకో’’ నా తల నిమురుతూ చెప్పింది అమ్మ. ఎంత పెద్దవారైనా చిన్నవాళ్ళుగా కన్పించేది తల్లిదండ్రులకే. గుండెల్లో దాచుకుని చూసుకోగలిగేది తల్లిదండ్రులే. నాక్కూడా నిద్ర వస్తుండటంతో ఆవులిస్తూ లేచాను.

తెల్లారాక తెలిసింది... అమ్మకు మా దగ్గరకు రావడం కూడా ఇష్టంలేదని... తనను తననుగా ప్రేమించిన నాన్న దగ్గరికే వెళ్ళి..పో..వ..డం... ఇష్టమనీ..!

* * *

సమయం రాత్రి పది గంటలు కావస్తోంది. బాల్కనీలో ఒంటరిగా కూర్చుని ఉంది నా కూతురు సువిధ. చరణ్‌ పెళ్ళి చేసుకుని భార్యతో కలిసి బెంగుళూరులో స్థిరపడ్డాడు. శేఖర్‌ ఐదేళ్ళ క్రితమే కాలంచేశాడు.

ఎన్నో ఎత్తుపల్లాల్నీ ఆటుపోట్లనీ అనుభవాల సారాంశాల్నీ చవిచూసిన 70 వసంతాల జీవితం... ఇక అనుభవించడానికేమీ లేదన్నట్లు స్తబ్దంగా సాగుతోంది. సువిధ జర్నలిస్టు. అల్లుడు వివేక్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌. ప్రస్తుతం సువిధ ఎనిమిది నెలల గర్భిణీ. ఇటీవల స్కూటీపై వస్తుండగా జరిగిన యాక్సిడెంట్‌లో కుడికాలు ఫ్రాక్చర్‌ కావడంతో డాక్టర్లు రెండు నెలలు బెడ్‌రెస్ట్‌ కావాలని చెప్పారట. కాన్పు కోసం నా దగ్గరికి రమ్మని చెప్పాను. కానీ భర్తను వదిలిపెట్టి రావడం సువిధకు ఇష్టంలేదు. పంపించడం అతనికీ ఇష్టంలేదు. అందుకే కష్టమైనా నేనే వారి దగ్గరికి రావాల్సి వచ్చింది.

చాలా రోజుల తర్వాత నా కూతురూ, అల్లుడి అన్యోన్య దాంపత్య జీవితాన్ని దగ్గరగా చూసిన నాకు చాలా సంతోషమేసింది. సువిధ నెలతప్పిన దగ్గరనుంచే అల్లుడు కాలు కిందపెట్టనిచ్చేవాడు కాదు. యాక్సిడెంట్‌లో గాయపడిన తర్వాత భార్యకు అన్ని సేవలూ చేయడంతోపాటు ఇంటిపనుల్లో కూడా నాకు సహాయం చేసేవాడు.

‘‘మీరు పెద్దదిక్కుగా మాకు తోడుంటే చాలు అత్తయ్యా, వంట నేను చేయగలను’’ అనేవాడు. వయసురీత్యా చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న నాపై ఎక్కువ పనిభారం మోపకూడదనే అల్లుడి సంస్కారం, కుటుంబంపట్ల అతడి శ్రద్ధ... నాకు ముచ్చటేసేది.

‘‘భోజనం చేయకుండా ఆకలితో అంతసేపు ఉండకూడదమ్మా! కాస్త ఏదైనా తిను. అల్లుడు వచ్చాక మళ్ళీ ఇద్దరూ కలిసి భోంచేద్దురుగానీ’’ అని అప్పటికి చాలాసార్లు చెప్పి ఉంటాను సువిధకు. కానీ వినలేదు. బాల్కనీలోని ఈజీ ఛైర్లో భర్తకోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

పది తర్వాత హడావుడిగా వచ్చిన వివేక్‌ స్నానం చేసి సువిధ దగ్గరకు బాల్కనీలోకి వెళ్ళాడు.

‘‘సారీ సువిధా, బ్యాంకులో ఆడిట్‌ జరుగుతుందన్నాగా... అందుకే లేటయింది. ఇంతసేపు ఆకలితో ఉండకపోతే నువ్వు తినేయవచ్చు కదా’’ వెనుక నుంచి ఆమె భుజాల చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు.

‘‘నువ్వు లేకుండా నాకు ఆకలేస్తుందా? నువ్వు రాకుండా నాకు నిద్రపడుతుందా... బావా?’’ వివేక్‌ టీషర్ట్‌ను పిడికిలితో బిగించి పట్టుకుని ముందుకు లాగుతూ అంటోంది సువిధ. అతడు అలాగే తన ముఖాన్ని ఆమె ముఖానికి చేరువగా...

గదిలోని కిటికీలోంచి వాళ్ళిద్దరినీ చూస్తున్న నేను చూపులు మరల్చుకున్నాను.

నాకు అమ్మా నాన్నా గుర్తొచ్చారు. అమ్మ కూడా నాన్నను ‘బావా’ అని పిలిచేది. తృప్తిగా ఆనందంగా చూస్తున్న వారి రూపం కళ్ళల్లో మెదిలి మూసుకున్న నా కళ్ళలోంచి కన్నీటి బిందువై మెల్లగా జారి చల్లగా నా చెంపలను తాకింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.