close
సెంచరీకి దగ్గర్లో ఉన్నా!

సెంచరీకి దగ్గర్లో ఉన్నా!

పవర్‌ఫుల్‌ పంచ్‌లు విసిరే కథానాయకుడి స్నేహితుడు, గోదావరి యాసలో వెటకారాన్నీ, మమకారాన్నీ సమపాళ్లలో పలికించగలిగే కుర్రాడు, ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలిగే నటుడు... ప్రవీణ్‌. వందో సినిమావైపు వడివడిగా అడుగులు వేస్తున్న ప్రవీణ్‌ తన సినిమా ప్రయాణం గురించి చెబుతున్నాడిలా...

మా సొంతూరు అంతర్వేది. 2005లో మా పక్క వూళ్లొ ‘ఒక వూరిలో’ షూటింగ్‌ జరుగుతుంటే చూడ్డానికి వెళ్లాను. అక్కడ సునీల్‌ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుంటే, ‘రెండేళ్ల తర్వాత నా ఆటోగ్రాఫ్‌ కూడా తీసుకోవడం మర్చిపోవద్దేం’ అని జోక్‌ చేశా, బదులుగా... ‘అప్పుడు సినిమాలతో బిజీ అయిపోతావేమో, ఇప్పుడే ఇచ్చేయకూడదూ’ అని కౌంటర్‌ వేశారు సునీల్‌. అలా ఆయనతో పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచీ గోదావరి జిల్లాల్లో ఆయన షూటింగ్‌లు ఉంటే వెళ్లి కనిపించేవాణ్ని. ఓసారి అంతర్వేది ‘లక్ష్మీనరసింహ స్వామి’ ఆలయానికి కుటుంబంతో కలిసి వచ్చారు కూడా. 2007లో రాజమండ్రి దగ్గర షూటింగ్‌లో ఉన్నపుడు దిల్‌ రాజు గారికి నన్ను పరిచయం చేశారు. అప్పటికే ‘కొత్త బంగారు లోకం’ సినిమా టైటిల్‌ ప్రకటించారు. టైటిల్‌ చాలా బావుందని రాజుగారికి చెప్పాను. ‘నీకు సినిమాలపైన ఆసక్తి ఉందా’ అని అడిగారాయన. కొన్నాళ్లు అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పాను. తర్వాత దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఆడిషన్‌ చేశాక నన్ను ఆ సినిమాలో ఓ పాత్రకి ఎంపికచేశారు.

* ‘కొత్త బంగారు లోకం’కు సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె.నాయుడు. సినిమాలు చూడ్డం తప్ప నటనలో ఓనమాలు కూడా నేర్చుకోలేదు నేను. దాంతో చాలా భయపడేవాణ్ని. ఏదైనా సందేహం వచ్చినా అడగకుండా మేనేజ్‌ చేయాలనుకుని చీవాట్లు తినేవాణ్ని. ఓసారి 18 టేకులు తీసుకున్నాను. ‘నీవల్ల 400 అడుగుల రీలు, ఇంతమంది శ్రమ, సమయం వృథా. కెమెరా ముందుకు రాకముందే ఒకటికి పదిసార్లు ప్రాక్టీసు చేసుకోవాలి’ అని చెప్పారు ఛోటా. అదే సమయంలో మా పక్కనే ‘పరుగు’ షూటింగ్‌ జరుగుతుంటే రోజూ వెళ్లి పరిశీలించేవాణ్ని. తర్వాత నాది ఓ సీను మొదటి షాట్‌లోనే ఓకే అయింది. ‘ఒరే ఏం తిన్నావ్‌ ఈ షాట్‌ గ్యాప్‌లో’ అన్నారు ఛోటా. విషయం చెప్పాను.

* ‘కొత్త బంగారు లోకం’తో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత సినిమాలు వస్తాయా, రావా... నా భవిష్యత్తు ఏంటన్న గందరగోళంలో ఉన్నపుడు వంశీగారి ‘గోపి గోపిక గోదావరి’లో అవకాశం వచ్చింది. నేను ఆయన అభిమానిని కూడా. ఆ తర్వాత రైడ్‌, బిల్లా, రామ రామ కృష్ణ కృష్ణ, మిరపకాయ్‌... ఇలా చాలా సినిమాలు చేశాను. నాలుగేళ్ల కిందట వచ్చిన ‘ప్రేమ కథా చిత్రమ్‌’ నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. మారుతి గారు పిలిచి... ‘ఈ సినిమా కథని నీ పాత్ర ద్వారా చెప్పిస్తాను. అంటే నా ఆలోచనల్ని నువ్వే ప్రేక్షకులతో చెప్పి ఒప్పించాలన్నమాట’ అన్నారు. నటుల హావభావాల్ని బయట ఉన్నపుడు గమనిస్తూ సినిమాలో అవసరమైనపుడు ‘నువ్వలా చేస్తుంటావు కదా ఇక్కడలా చెయ్యి’ అని చెప్పి మరీ చేయించుకుంటారాయన. నాతో ఆ సినిమాలో అలాంటివి చాలా చేయించారు. ఆ సినిమా పెద్ద హిట్‌. ‘ఫ్రేమ్‌లో రెండు గంటలపాటు ఉంటూ ఎక్కడా వెగటు పుట్టకుండా బాగా చేశావు. కీప్‌ ఇట్‌ అప్‌...’ ఆ సినిమా చూశాక దర్శకుడు కృష్ణవంశీ నాతో అన్న మాటలివి. ఆయనతో అదివరకు ‘మొగుడు’ సినిమాకి పనిచేశాను. మొదట్లో కెమెరా క్లోజ్‌గా పెట్టగానే కాస్త వణుకు వచ్చేది నాకు. కృష్ణవంశీగారు ఆ విషయంలో నాలో మార్పు తెప్పించారు. ఇప్పుడు క్లోజ్‌ షాట్‌ అనగానే తెర మొత్తం నేనొక్కణ్నే కనిపిస్తానని ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాను. పెద్ద వంశీగారు కూడా క్లోజ్‌ షాట్‌ల గురించి చాలా విషయాలు నేర్పించారు.

* ప్రేమ కథా చిత్రమ్‌ తర్వాత మారుతితో కొత్త జంట, భలే భలే మగాడివోయ్‌... సినిమాల్లో ఎక్కువ నిడివి పాత్రలు చేశాను. ‘రౌడీ ఫెలో’లో మొదటిసారి నెగెటివ్‌ టచ్‌ ఉన్న రోల్‌ చేశాను. అలాంటి పాత్రల్లో నటనకు ఇంకాస్త ఎక్కువ అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అందులో నన్ను చూసి త్రివిక్రమ్‌ గారు ‘అ ఆ’కు ఎంపికచేశారు. అప్పట్నుంచీ హాస్య పాత్రలు చేస్తూనే మధ్యలో వేరేవీ చేస్తున్నాను. సినిమా చూపిస్త మావ, పటాస్‌లలో అలాంటి పాత్రలే చేశాను. నేనెంతో ఇష్టంగా చేసిన మరో సినిమా ‘ప్రేమమ్‌’. హీరో స్నేహితుడిగా స్కూలు, కాలేజీ, ఉద్యోగి... ఇలా మూడు భిన్నమైన దశల్లోని పాత్రల్లో కనిపించా. అలాంటి ఛాన్స్‌ అరుదుగా వస్తుంది. తాజాగా ‘శతమానం భవతి’తో ఓ మంచి సందేశాత్మక సినిమాలో చేశానన్న సంతృప్తి కలిగింది. ఇప్పటివరకూ 97 సినిమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెంచరీ కొడతా!

* బలమైన కోరిక, నిజాయతీ, కష్టపడి పనిచేయడం... ఈ మూడూ ఉంటే ఏదైనా సాధ్యమే. డిగ్రీ పూర్తిచేసి 2001లో హైదరాబాద్‌ వచ్చి చిన్న ఉద్యోగం చేసుకుంటూ శని, ఆదివారాల్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను. అమీర్‌పేట్‌, ఎస్సార్‌ నగర్‌ ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుగుతుంటే వెళ్లి వేషంకావాలని అడిగేవాణ్ని. ఫిల్మ్‌ స్టూడియోల చుట్టూ తిరిగేవాణ్ని. దారీతెన్నూ తెలియకుండా మూడేళ్లపాటు తిరిగినా లాభంలేకపోయింది. దాంతో వూరెళ్లిపోయాను. తర్వాత సినిమాలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.