close
వెండి కాని వెండి ఇది..!

వెండి కాని వెండి ఇది..!

వెండి, బంగారాలంటే భారతీయులకి తగని మక్కువ. వెన్నెల కాంతుల్ని మరిపించే వెండిని గృహాలంకరణ, పూజాసామగ్రి రూపంలో వాడితే, భానోదయ కాంతుల్ని వెదజల్లే పుత్తడిని ఆభరణాల రూపంలో ధరించి మెరిసిపోతుంటారు. అంతేనా... ఇటీవల కొందరు సిరిపుత్రులు పసిడిని ఆభరణాలకే పరిమితం చేయకుండా పళ్లాలూ గ్లాసుల రూపంలో భోజనాల బల్లలమీదా మెరిపిస్తున్నారు. అందుకే ఆ రెండు లోహాల ధరలూ రోజురోజుకీ నింగిలోని చుక్కలతో పోటీపడుతున్నాయి. అయినా వాటిమీద మోజు తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉంది. అలాంటి తరుణంలో వాటికి ప్రత్యామ్నాయంగా వాడుకలోకి వచ్చిందే జర్మన్‌ సిల్వర్‌. అటు వెండి సోయగాన్నీ ఇటు పుత్తడి సొగసుల్నీ దిద్దుకుని మరింత అందంగా మెరుస్తూ వెండి, బంగారు ప్రియుల్ని ఆకర్షిస్తోంది.

ఎంతటి శ్రీమంతులకైనా పూజాసామగ్రితోబాటు కప్పులూ ప్లేట్లూ... లాంటి వస్తువులన్నింటినీ వెండితోనూ బంగారంతోనూ చేయించుకోవాలంటే కాస్త కష్టమే. ఇక, సామాన్యుల సంగతయితే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకవేళ ఎంతో కష్టపడి ఒకటో రెండో వస్తువులు చేయించుకున్నా వాటికి కాపలా కాయడం మహా కష్టం. పైగా వెండి వస్తువులు త్వరగా నల్లబడిపోతాయి. దాంతో ఎప్పటికప్పుడు వాటిని ఏ సిల్వోతోనో పాలిష్‌ చేస్తుండాలి. ఈ కష్టాలన్నీ లేకుండా చేసేదే నికెల్‌ సిల్వర్‌... ఎన్నటికీ మాయని వెన్నెల కాంతుల్ని ఇంట్లోకి తీసుకొస్తుంది. ఇక, వెండితో పోలిస్తే ధర నామమాత్రం. వెండి కిలో సుమారు నలభై వేల రూపాయలవరకూ ఉంటే, జర్మన్‌ సిల్వర్‌ ధర దాదాపు వెయ్యిలోపే. వాడకంలో కాస్త వన్నె తగ్గినట్లు అనిపిస్తే వీటిని కూడా వెండి మాదిరిగానే శుభ్రం చేసి సిల్వోతో పాలిష్‌ చేయవచ్చు. కానీ ఇది వెండిలా మరీ అంత త్వరగా నల్లబడదు. దాంతో ఇటీవల జర్మన్‌ సిల్వర్‌ వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. పూజాసామాన్లతోబాటు ఇంటి అలంకరణ వస్తువులన్నీ జర్మన్‌ సిల్వర్‌ రూపంలో అందంగా ప్రకాశిస్తున్నాయి. నిశ్చితార్థం, వివాహం.. లాంటి వేడుకల్లో పండ్లూ మిఠాయిలూ చీరసారెలూ... వంటి వాటన్నింటినీ ఈ నికెల్‌ సిల్వర్‌తో చేసిన ప్లేట్లలోనే అలంకరిస్తున్నారు. డైనింగుటేబుల్‌మీద వాడుకునే ట్రేలూ ఐస్‌క్రీమ్‌ బౌల్సూ కాఫీ కప్పులూ... ఇలా భిన్న రూపంలోనూ ఇవి మెరుస్తున్నాయి. ఇంకా వీటితో చేసిన కుంకుమభరిణెలు, కప్పుల సెట్లూ లాంటివి వేడుకల్లో బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. పైగా ఈ జర్మన్‌ సిల్వర్‌కి అటు వెండిపూతతోబాటు ఇటు బంగారు రంగునీ పూయడంతో ఇది ఆ రెండు రంగుల్లోనూ మెరుస్తోంది. కొన్నింటికి అచ్చంగా వెండి పూత పూస్తే, మరికొన్నింటికి బంగారు కోటింగ్‌ వేస్తున్నారు. ఇంకొన్ని ఆ రెండు రంగుల్లోనూ మెరిసేలా చేస్తున్నారు. దాంతో జర్మన్‌ సిల్వర్‌ కాస్తా ‘గోల్డ్‌ సిల్వర్‌’గా మారిపోయింది.

అసలేమిటీ జర్మన్‌ సిల్వర్‌?
నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే జర్మన్‌ సిల్వర్‌లోనూ ఒక్క వెండి పోగు కూడా కనిపించదు. కాపర్‌, నికెల్‌, జింక్‌ లోహాల సమ్మేళనమే జర్మన్‌ సిల్వర్‌. అయితే ఈ మూడూ కలిపిన లోహం అచ్చం వెండిలా మెరవడంతో ఇది నికెల్‌ సిల్వర్‌గా పేరొందింది. నిజానికి ఇందులో రాగి శాతమే ఎక్కువ. అయినప్పటికీ నికెల్‌ కలిసేసరికి దాని రంగు పూర్తిగా మారిపోతుంది. ఆ కారణంతోనే దీన్ని నికెల్‌ సిల్వర్‌ అనీ అంటున్నారు. కాపర్‌, నికెల్‌, జింక్‌లు కలిసిన ఈ లోహసమ్మేళనాన్ని క్యుప్రో నికెల్‌ పేరుతో మొదటగా 19వ శతాబ్దంలో చైనాలో వాడేవారు. దీన్నే పాక్‌టోంగ్‌ అనీ పిలిచేవారు. అప్పట్లో అక్కడనుంచి పాశ్చాత్య దేశాలకు ఎగుమతి అయ్యేది. స్టెర్లింగ్‌ సిల్వర్‌ను పోలినట్లుండే దీన్ని యూరోపియన్లు వైట్‌ కాపర్‌ అని కూడా అనేవారు. తరవాత జర్మన్లు దీనికోసమే ప్రత్యేకంగా కంపెనీలు పెట్టి మరీ భారీగా తయారుచేయడంతో ఆ విధానమే యూరప్‌ అంతటా ప్రాచుర్యం పొంది, జర్మన్‌ సిల్వర్‌గా వాడుకలోకి వచ్చింది.

వన్నె తగ్గని వెన్నెల!
తరవాతి కాలంలో ఎలక్ట్రోప్లేటింగ్‌ విధానం కూడా వినియోగంలోకి రావడంతో వెండికి బదులుగా దీన్ని వాడటం ప్రారంభించారు. ఐరోపా దేశాల్లోని సంపన్నుల భోజనాల బల్లమీద కనిపించే వెండి డిన్నర్‌సెట్లూ కట్లెరీ సెట్లనూ పోలి ఉండే వాటిని నికెల్‌ సిల్వర్‌తో చేయడం ప్రారంభించారు. దాంతో మధ్యతరగతి ప్రజలు నికెల్‌ సిల్వర్‌నే వెండికి బదులుగా వాడటం ప్రారంభించారు. అలా నగలూ రకరకాల గృహాలంకరణ వస్తువుల్లోనూ ఇది వెండికి ప్రత్యామ్నాయంగా మారిపోయింది. ఆ విధంగా మనదేశానికీ వచ్చిన నికెల్‌ సిల్వర్‌ను మన స్వర్ణకారులు మనదైన నగిషీలతో మరింత అందంగా చెక్కుతూ రకరకాల ఆభరణాలు కూడా తయారుచేయడం మొదలెట్టారు. క్రమంగా గృహాలంకరణ వస్తువుల్నీ చేయసాగారు. ముఖ్యంగా వెండి నగల వాడకం ఎక్కువగా ఉన్న రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలే నికెల్‌ సిల్వర్‌ వస్తువుల తయారీకీ పేరొందాయి. క్రమంగా దేశవ్యాప్తంగా వీటిని తయారుచేస్తుండటంతో మార్కెట్లో ఇవి అందంగా కొలువుదీరుతున్నాయి. దాంతో వెండి వస్తువుల మీద ఎంతో ఇష్టం ఉండి, వాటిని కొనుగోలు చేయలేని మధ్యతరగతి ప్రజల పాలిట ఈ జర్మన్‌ వెండి ఓ వరంగా మారింది. ఇత్తడి పుత్తడి కానట్లే జర్మన్‌ సిల్వర్‌ అసలైన వెండి కాకపోవచ్చు. కానీ ఇది వెండిలా త్వరగా నల్లబడదూ, పైగా ఖరీదూ తక్కువ. అందుకే ఈ వెండి కాని వెండి ఇంటింటా వెన్నెల సోయగాన్ని కురిపిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.