close
రేపటి తరాల కోసమే... నా ఆరాటం!

రేపటి తరాల కోసమే... నా ఆరాటం!

లా మొదలుపెట్టాలి?
ఎక్కడి నుంచి ప్రారంభించాలి?
ముందు, ఎవరి ప్రస్తావన తీసుకురావాలి?

అన్నయ్యతోనే ఆరంభిస్తా. వూహ తెలిసేనాటికే చిరంజీవి అన్నయ్య అంతెత్తు మనిషి, డిగ్రీ విద్యార్థి. తనేం చేసినా నాకు అద్భుతంగా ఉండేది. అన్నయ్య వేరే వూళ్లొ చదువుకునేవాడు. ఏ సెలవుల్లోనో వూడిపడేవాడు. ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసేవాడిని. ఆ నాల్రోజులూ మహా సందడి. కొత్తకొత్త కబుర్లు చెప్పేవాడు. సినిమాలకు తీసుకెళ్లేవాడు. అప్పట్లో నాన్న ఓ బైక్‌ కొన్నారు. నాన్న లేని సమయంలో అన్నయ్య వీధుల్లో చక్కర్లు కొడుతుంటే, కళ్లింతలు చేసుకుని చూసేవాడిని. అక్కయ్య అయితే, అమ్మ తర్వాత అమ్మంత. చిన్నప్పుడు, నాకెప్పుడూ అనారోగ్యమే. ఆస్తమా ఉండేది. ఆ సమయంలో తనే ఆసుపత్రికి తీసుకెళ్లేది. చెల్లీ నేనూ మంచి స్నేహితులం. నాగబాబు అన్నయ్య దగ్గర బాగా చనువు ఉండేది. ఏం అడగాలన్నా తననే. ఏం చెప్పినా తనతోనే.

నాన్న ఉద్యోగం కారణంగా... రకరకాల ప్రాంతాల్లో పెరిగాను. ఆయన ముక్కుసూటి మనిషి. నిజాయతీ పరుడు. దీంతో ఉద్యోగంలో ఒడుదొడుకులు వచ్చాయి. చాలారోజులు సెలవులోనే ఉన్నారు. దీంతో, జీతం వచ్చేది కాదు. నాకు వైద్యం చేయించడానికి ఇబ్బందిపడిన సందర్భాలూ ఉన్నాయి. చిన్నపిల్లాడినే అయినా, అన్నీ నాకు అర్థం అవుతూనే ఉండేవి. అమ్మకు సహనం ఎక్కువ. ప్రతి విషయాన్నీ వాస్తవిక దృక్పథంతో ఆలోచించేది. అప్పట్లో, వారపత్రికల్లో మంచి సీరియల్స్‌ వచ్చేవి. అమ్మ వాటిని కత్తిరించి, చక్కగా బైండ్‌ చేయించి పెట్టేది. వాటిని చదువుతూ పెరిగాన్నేను.

‘గ్రేస్‌’ మార్కులతో...

తరచూ అనారోగ్యమే కాబట్టి, ఇంట్లో అల్లరి చేసే పరిస్థితి లేదు. బళ్లొ ఒకట్రెండుసార్లు గొడవ చేద్దామని ప్రయత్నించాను కానీ, ధైర్యం చాల్లేదు. టీచర్లు వీపు చీరేయడంతో గమ్మునుండిపోయాను. పెద్దగా స్నేహితులూ ఉండేవారు కాదు. ఒకరిద్దరితో కబుర్లు చెప్పుకున్నా... వాళ్ల మాటలకూ, నా ఆలోచనలకూ పొంతన కుదిరేది కాదు. పదోతరగతిలో ఉన్నప్పుడే, ఇంజినీరింగ్‌ చదివే ఫ్రెండ్‌ ఉండేవాడు. మరో స్నేహితుడు పుస్తకాల దుకాణం యజమాని. బళ్లొ ఆర్యభట్ట సైన్స్‌క్లబ్‌కు ప్రెసిడెంటుగా ఉండేవాడిని. నాకు సైన్సంటే ఇష్టమని ఆ పదవి కట్టబెట్టారు. ఆ ఆసక్తి కూడా సైన్సు చెప్పే ఉపాధ్యాయుల వల్లే వచ్చింది. తెలుగు మాస్టారు మనసుకు హత్తుకునేలా పాఠాలు చెప్పేవారు. అలా, తెలుగుభాష మీద మమకారం పుట్టింది. దురదృష్టం ఏమిటంటే, నా జీవితంలో ఎక్కడా మంచి గణితం టీచరు తారసపడలేదు. దీంతో, లెక్కలంటే భయం పోలేదు. ప్రతి పరీక్షలోనూ అత్తెసరు మార్కులే. పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లోనూ లెక్కలే దెబ్బకొట్టాయి. మూడు మార్కుల తేడాతో ఫెయిల్‌ అయిపోయాను. సరిగ్గా ఆ సమయంలోనే, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. ఎన్టీఆర్‌ను పదవిలోంచి దించేసి, నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనిచ్చిన ఐదు గ్రేస్‌మార్కులతో ఒడ్డునపడిపోయాను. అంతా బాధపడుతున్న సమయంలో... ఆ మార్కులు తీసుకున్నందుకు ఇబ్బందిగానే అనిపించింది. అయినా తప్పలేదు. భూతంలా భయపెడుతున్న లెక్కల మీద, ఎలాగైనా పట్టు సాధించాలని ఇంటర్‌లో ఎకనమిక్స్‌, కామర్స్‌తో పాటూ గణితాన్నీ తీసుకున్నా. ఆ సమయానికే అన్నయ్య సినిమాల్లో స్థిరపడ్డాడు. కాలేజీలో ‘చిరంజీవి తమ్ముడు’ అన్న ముద్రపడిపోయింది. అన్నయ్యని అభిమానించేవాళ్లు ఉండేవారు, విమర్శించేవాళ్లూ ఉండేవారు. ఎవరు నోరు జారినా నాకు కోపం వచ్చేది. ఆ వాతావరణానికి దూరంగా వెళ్లిపోవాలనిపించేది.

చిన్నప్పటి నుంచీ గాంధీగారంటే నాకు అభిమానం. ఆయన రాసిన ‘సత్యశోధన’ చాలాసార్లు చదివాను. ఆ పుస్తకంలోని విషయాలు నన్ను వెంటాడుతూ ఉండేవి. ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నప్పుడు... కాపీ కొట్టే అవకాశం వచ్చింది. కాసేపు గాంధీజీనీ సత్యశోధననూ మరచిపోతే చకచకా చూసి రాసేసుకోవచ్చు. పరీక్ష పాసైపోవచ్చు. కానీ, అంతరాత్మ అందుకు ఒప్పుకోలేదు. నా స్థానంలో గాంధీజీ ఉంటే ఇలా చేసేవారు కాదు కదా, ఆయన నుంచి నేను నేర్చుకున్నది ఇదేనా - అనిపించింది. కాపీ ప్రయత్నాన్ని విరమించుకున్నా. ఎత్తిన తల దించకుండా, వచ్చిందేదో రాసి బయటికి వచ్చేశా.

ఫిన్‌లాండ్‌ పెన్‌ఫ్రెండ్‌షిప్‌ క్లబ్‌లో నేను సభ్యుడిని. ఆ దేశం నుంచి చాలా ఉత్తరాలు వచ్చేవి. ఓ స్నేహితుడు తాను సెలవుల్లో ఉద్యోగం చేస్తున్నట్టు రాశాడు. ఆ ఆలోచన నచ్చింది. నాకూ ఏదైనా ఉద్యోగం చేయాలనిపించింది. ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో చేరాను. కొన్నిరోజులకు పని మూసగా అనిపించింది. మానేసి, ఓ గిడ్డంగిలో కుదిరాను. దాని యజమాని నాన్న స్నేహితుడే. ఈ విషయం తెలిస్తే, ఆయన కోప్పడతారని రెండ్రోజులకే ఇంటికి పంపేశారు. అంతలోనే సెలవులు పూర్తయిపోయాయి.

వూహించినట్టే, ఫలితాల్లో నా నంబరు కనబడలేదు. అయినా, వైఫల్యాలు నాకు కొత్తేం కాదు. ఎనిమిదో తరగతి నుంచీ పరీక్ష తప్పడం అలవాటే. మరోసారి, సెప్టెంబరులో ప్రయత్నించాను. పాస్‌ కావడం అసాధ్యమని అర్థమైపోయింది. ఇంత జరుగుతున్నా, నాన్న పల్లెత్తు మాట అనేవారు కాదు. అమ్మా అంతే. అయినా, నాలోనే ఏదో అపరాధభావం. ఎదిగే వయసులో ప్రతి సంవత్సరమూ విలువైందే. స్నేహితులేమో ముందుకెళ్లిపోతుంటారు. మనం మాత్రం ఉన్నచోటే ఉంటాం. సచిన్‌ తెందుల్కర్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌... లాంటివాళ్లు వయసుకు మించిన ప్రతిభ కనబరుస్తున్నట్టు వార్తలు వచ్చేవి. నేనే ఎందుకిలా ఉన్నాను? - అన్న నిస్పృహ వెంటాడేది. ఆ ఒత్తిడిలో ఆత్మహత్యకు ప్రయత్నించాను. కాస్త ఆలస్యమైతే ప్రాణాలు పోయేవే. ఇంట్లో వాళ్లు పట్టేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు అన్నయ్యలూ, సురేఖ వదినా అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. ‘మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. డిగ్రీలు చదివితేనే చదువు కాదు. నువ్వు చదివినా చదవకపోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నీకేం కావాలో నిర్ణయించుకో’ - అని సలహా ఇచ్చారు.

అనేక ప్రయోగాలు...
ఓసారి నాగబాబు అన్నయ్య వేయిమంది విజేతల కథలున్న ఓ పుస్తకం ఇచ్చాడు. వేయి జీవితాలూ... వేయి విజయాలూ - చాలా అద్భు´తంగా అనిపించింది. అందులోనూ లియొనార్డో డా విన్సీ బహుముఖ ప్రతిభ ఆశ్చర్యపరచింది. ఆయనలా, ఒకేసారి అనేక రంగాల మీద పట్టు సాధించాలని ఉండేది. ప్రతి వృత్తీ ఆసక్తిగానే అనిపించేది. ఏదీ నన్ను పట్టి ఉంచేది కాదు. దీంతో అన్నీ అరకొరగానే నేర్చుకున్నా. దేశమంతా తిరిగాను. పారా గ్లైడింగ్‌ నేర్చుకున్నాను. కర్ణాటక సంగీతంలో ప్రవేశం సంపాదించాను. వయొలిన్‌ సాధన చేశాను. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సులో చేరాను. బొమ్మలేసే ప్రయత్నం చేశాను. విదేశీభాషలు నేర్చుకోవాలనుకున్నాను. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ గురించీ కొంత తెలుసుకున్నాను. అలా....రెండుమూడేళ్లు చాలా ప్రయోగాలే జరిగాయి. వీటన్నిటితో, అయోమయం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి రోజంతా సినిమాలు చూసేవాడిని. ‘రేయ్‌! వీడియోలు చూసీ చూసీ వీడియో రికార్డర్‌లో హెడ్‌లు అరుగుతున్నాయే కానీ, నీ హెడ్‌ లోంచి ఒక్క ఐడియా కూడా రావడం లేదు’ అని మందలించేవారు అన్నయ్య. చివరికి, ‘ఇన్ని అవకాశాలిచ్చినా నువ్వేమీ చేయడం లేదు. ఇవన్నీ ఎందుకు కానీ, సినిమాల్లో ప్రయత్నించు’ అని సలహా ఇచ్చారు. నాకు మాత్రం నటించగలననే నమ్మకం కుదర్లేదు. వీలైతే, ఎవరిదగ్గరైనా అసిస్టెంట్‌ డైరెక్టరుగా చేరాలని ఉండేది. ఆ మాటే చెప్పాను. ‘నువ్వు ఇంకెవరి దగ్గరో పనిచేయగలవని నేను అనుకోవడం లేదు...’ అని తేల్చేశారు. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఓ షార్ట్‌టర్మ్‌ కోర్సు ఉండేది. విద్యార్హతతో పన్లేదు. దరఖాస్తుతో పాటు ఓ షార్ట్‌ఫిల్మ్‌ పంపితే చాలు. ఓ అంధుడి ప్రపంచం ఎలా ఉంటుందనే కోణంతో కథ రాసుకుని ఫిల్మ్‌ తీసి పంపాను. వెంటనే బయల్దేరి రమ్మని కబురొచ్చింది. కాకపోతే, ఫీజు ఎక్కువ. ఇప్పటికే అన్నయ్యకు బరువైపోయాను. మరింత భారం వేయడానికి మనసొప్పలేదు. న్యూయార్క్‌ ఆలోచన విరమించుకున్నా. మిగిలింది ఒకటే దారి, అన్నయ్య చెప్పినట్టు సినిమాల్లో నటించడం. నన్ను సత్యానంద్‌ గారి దగ్గరికి పంపారు. నటన సంగతి తర్వాత, ముందు నాలోని బిడియాన్ని పోగొట్టడం చాలా అవసరమని ఆయనకు అర్థమైపోయింది. మొదట్లో, లేచి నిలబడి బిగ్గరగా అరవమని చెప్పేవారు. అలా అరవాలంటే జంకూగొంకూ ఉండకూడదు. ఎవరేం అనుకుంటారో అన్న ఆలోచనే రాకూడదు. ఆ సాధన బాగా ఉపయోగపడింది. అలా సిగ్గునూ మొహమాటాన్నీ బద్దలుకొట్టాను. సినిమా చేసినా చేయకపోయినా, నా బతుకు నేను బతకగలననే ధైర్యం కలిగింది. అదో గొప్ప మార్పు. మొదటి సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది కానీ, రెండుమూడేళ్లు గడిచినా షూటింగ్‌ మొదలుకాలేదు. ఏం చేయాలో తోచేది కాదు. ‘ఇక ఎదురుచూసే ఓపికలేదు, రేపటిదాకా చూస్తాను. బెంగళూరు వెళ్లిపోయి ఏదైనా నర్సరీలో మొక్కలు పెంచుకుంటాను. నాకు తెలిసిన పని అదొక్కటే..’ అని అమ్మకు స్పష్టంగా చెప్పేశాను. అనూహ్యంగా, ఆరోజు సాయంత్రానికే సినిమా ఖరారైపోయింది.

మొదటి సినిమా చాలా ఇబ్బందిగా అనిపించింది. అసందర్భమైన డాన్సులూ కృతకమైన డ్రస్సులూ ఎబ్బెట్టుగా అనిపించేవి. అదే చివరి సినిమా కావాలని బలంగా కోరుకున్నా. రెండో సినిమాను, మొహమాటం కొద్దీ ఒప్పుకోవాల్సి వచ్చింది. మెల్లమెల్లగా ఆ వాతావరణం అలవాటైపోయింది. ఏ సినిమా చేసేముందు అయినా, అందులో ఆనందాన్ని వెతుక్కుంటాను. కష్టపడిపోయి నటించాలని అనుకోను. నాకు నచ్చిన పాత్రలే నేను చేయగలను. నాకు తెలిసిన భావోద్వేగాలే నేను పలికించగలను. నాకు ప్రయాణం ముఖ్యం. ఫలితాలు కాదు. గెలుపైనా ఓటమైనా ఆ ప్రయాణంలో భాగమే. ఓ సినిమా ఘనవిజయం సాధించిందని తల ఎగరేస్తే, రేపు వైఫల్యం ఎదురైనప్పుడు ఆ తలే మళ్లీ దించుకోవాల్సి వస్తుంది. రెండూ నాకిష్టం ఉండవు. దర్శకుడిగా ‘జాని’ సినిమా ఓటమిని నేను ఆనందంగానే స్వీకరించాను. నా చుట్టూ ఉన్నవాళ్లే భరించలేకపోయారు. తామే ఓడిపోయినంత బాధపడ్డారు. ఆ అంచనాలే నామీద ఒత్తిడి పెంచాయి. అలా అని వాళ్లను వదిలి దూరంగా వెళ్లలేను. వాళ్లతో పోరాడనూ లేను. ‘జాని’ తర్వాత కూడా సినిమాలు మానేద్దామనుకున్నా. ‘ఈ ఒక్క సినిమా చెయ్‌’ అనేవారు. అలా, ఒకదాని తర్వాత ఒకటి... ఇరవైరెండు సినిమాలు పూర్తయిపోయాయి.

నేను సినిమాను సినిమాలానే చూస్తాను. ప్రేక్షకుడు వినోదం కోసమే థియేటర్‌కు వస్తాడు. అతడి మీద బలవంతంగా సందేశాన్ని రుద్దడం నాకిష్టం లేదు. కాకపోతే, అంతర్లీనంగా ఎంతోకొంత మంచిని చెప్పే ప్రయత్నం ఉంటుంది. ‘కాటమరాయుడు’ విషయంలోనూ అంతే! నా అభిమానులు కోరుకునేవన్నీ అందులో ఉంటాయి.

మొక్కలు మాట్లాడతాయి
జీవితంలో ఏదో ఒకరోజు, ఒక్క మొక్కయినా ఉండే ఇల్లు కట్టుకోవాలని కలలుగనేవాడిని. నాకు పచ్చదనమంటే ఇష్టం. ఓ శీతలపానీయ ప్రకటనలో కనిపిస్తే చాలా డబ్బిస్తామన్నారు. మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నా. అలాంటివి తాగే అలవాటు నాకు లేదు. నేను తాగకుండా మరొకరికి సిఫార్సు చేయడమూ సరికాదు. అప్పటికే ఒప్పందాలు జరిగిపోయాయి కాబట్టి, వెనక్కి తగ్గడమూ భావ్యం కాదు. పొలం కొని నాలుగు మొక్కలు నాటితే అయినా, ఆ పాపం పరిహారం అవుతుందన్న నమ్మకంతో సేద్యంలోకి వచ్చాను. జపాన్‌ ప్రకృతిసేద్య నిపుణుడు ఫుకువోకా రాసిన ‘గడ్డిపరక విప్లవం’ నన్ను చాలా ప్రభావితం చేసింది. నారు పోసి, నీళ్లు కట్టి, కలుపుతీసి, క్రిమిసంహారకాలు గుప్పించి... మహా కష్టంగా పంట పండించాల్సిన పన్లేదు. చేపకు ఎవరైనా ఈత నేర్పారా, పక్షికి ఎవరైనా ఎగరడం బోధించారా? మొక్కకు మాత్రం ఇన్ని హింసలెందుకు? విత్తు చల్లి వదిలేస్తే సరిపోతుంది - అంటాడు ఫుకువోకా. ఆ పద్ధతిలోనే పంటలు పండించాను. మంచి దిగుబడే వచ్చింది. అంతలోనే అంతర్మథనం - నటుడిగా నేను వందలమందికి ఉపాధి ఇవ్వగలను. ఆ అవకాశాన్ని వదులుకుని, సేద్యమూ పంటలూ అంటూ నన్ను నేను పొలానికి పరిమితం చేసుకోవడం న్యాయం కాదేమో అన్న ప్రశ్న స్థిమితంగా ఉండనీయలేదు. దీంతో, మళ్లీ సినిమాల మీద దృష్టిపెట్టాను. అలా అని, వ్యవసాయాన్ని పూర్తిగా పక్కనపెట్టలేదు. అప్పుడు చేసేవాడిని, ఇప్పుడు చేయిస్తున్నా....అంతే, తేడా!

నాకు మొక్కలంటే ప్రాణం. అవి నాతో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. వాటిని, ‘ఏరా తల్లీ....’ అని పిలవాలనిపిస్తుంది. పొలంలో, ఓ గులాబీ కొమ్మ పాలిపోయినట్టు అనిపించింది. ‘మిగతావన్నీ బావున్నాయి. నువ్వు మాత్రం ఎండిపోతున్నావేరా! అంతకష్టమేం వచ్చిందీ’ అని ప్రేమగా నిమిరేవాడిని. ఒకట్రెండు రోజుల్లోనే ఆ కొమ్మకు కొత్త జీవం వచ్చింది. ఓసారి ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల గ్రామానికి వెళ్లాం. అక్కడ తీవ్రమైన నీటి సమస్య. పాతాళం దాకా తవ్వినా నీళ్లు పడలేదట. ఎందుకో, ఓ చోట కాలుపెట్టగానే.... నా మనసుకు గలగలల సవ్వడి వినిపించింది. మావాళ్లను పిలిచి తవ్వమని చెప్పాను. పుష్కలంగా నీళ్లు పడ్డాయి. ప్రకృతిని ప్రేమించేవాళ్లకే ప్రకృతి భాష తెలుస్తుంది.

రేపటితరం కోసం...
నాకు రాజకీయాలంటే గౌరవం. అవి సమాజాన్ని శాసిస్తాయి. మన జీవితాల్నీ శాసిస్తాయి. ఒక సమస్యనో, సంక్షోభాన్నో ఎత్తిచూపడానికి ఓ సాధనం అవుతాయి. పరిష్కారం కోసం పోరాడే శక్తినిస్తాయి.

నాయకుడు అనేవాడు...

గుంపుతో నడవాలి. కానీ, నాలుగు అడుగులు మాత్రమే ముందుండాలి.

దీనివల్ల ఎత్తూపల్లం తెలుస్తాయి. జనాన్ని జాగ్రత్తగా నడిపించవచ్చు.

నలభై అడుగులు ముందుంటే, గుంపుకు కనబడడు, గుంపేం అనుకుంటోందో వినబడదు.

నాలుగు అడుగులు వెనక్కి నడిస్తే,

గుంపులో కలసి పోతాడు. అందర్లో ఒకడిగా మిగిలిపోతాడు.

- అంటుంటాడు త్రివిక్రమ్‌. ఆ మాట నిజమే. ‘ప్రజారాజ్యం’ నాకు చాలా పాఠాలు నేర్పింది. అవన్నీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. జనంలోకి వెళ్లి ‘జనసేన’ను విస్తరించడానికి ఆరునెలలు సరిపోతుంది. ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ముచేయని మనుషులు నాకిప్పుడు కావాలి. తాత్కాలిక ప్రయోజనాల కోసం వచ్చేవాళ్లు నాకు అవసరం లేదు. ఎవరొచ్చినా... నాకోసం కాదు, నా సిద్ధాంతాల కోసం రావాలి. నేను ఉన్నా లేకపోయినా, నా ఆలోచనా విధానాన్ని అనుసరించేవాళ్లు రావాలి. హార్వర్డ్‌లో ఉపన్యాసానికి వెళ్లినప్పుడు స్టీవ్‌జార్డింగ్‌ అనే వ్యూహకర్తను కలుసుకున్నా. ఆయనకు మన రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. ‘భారతదేశం భవిష్యత్తులో అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. అయితే, మీ దేశానికి అంకితభావం కలిగిన నాయకత్వం కావాలి. అపార యువశక్తిని సద్వినియోగం చేసుకోకపోతే... అది విచ్ఛిన్నకరంగానూ మారవచ్చు’ అని చెప్పారు. ఆ హెచ్చరిక అక్షరాలా నిజం. నేను కూడా ‘జనసేన’లో యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తున్నా.

2019 ఎన్నికల నాటికి ఆ స్థాయికో ఈ స్థాయికో చేరాలన్న ఆరాటం లేదు. ఇదంతా నా కోసం కాదు, రేపటి తరం కోసం. గతంలో రాజకీయ నాయకులు చేసిన తప్పులకు, నేటితరం బలి అవుతోంది. రేపటితరానికి ఆ దుస్థితి రాకూడదు. చక్కని సమతౌల్యం ఉన్న, శక్తిమంతమైన పౌర సమాజాన్ని నిర్మించాలి. రాజకీయాల్లో మురికి ఉంది. దాన్ని కడగాల్సిన అవసరమూ ఉంది. ఒడ్డున నిలబడి కడగలేం. అందులోకి దిగాల్సిందే. అలా అని, అసహ్యించుకుంటూ దిగకూడదు. ప్రేమగా దిగాలి. నేను ప్రణాళికను నమ్మను. అనుకున్న ప్రకారమే అన్నీ పక్కాగా జరుగుతాయనీ అనుకోను. అలా కుదరదు కూడా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎదురు నిలబడగల మానసిక సంసిద్ధత ముఖ్యం.

చిత్తశుద్ధితో నువ్వు చెరువు తవ్వగలిగితే చాలు.

ఏదో ఒకరోజు వర్షం పడుతుంది.

చెరువు నిండుతుంది.

వాటంతట అవే చేపలూ చేరతాయి.

- అంటాడో పాశ్చాత్య రచయిత.

‘జనసేన’ ద్వారా నేను చేస్తున్నది అలాంటి దీర్ఘకాలిక పోరాటమే.

‘రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణమహర్షి, ఓషో, యూజీ కృష్ణమూర్తి, బడేబాబా....నన్ను అపారంగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ‘నిన్ను నీవు తెలుసుకో’ అంటాడు రమణ మహర్షి. ఆధ్యాత్మిక మార్గంలో నడిచినంత మాత్రాన, వ్యావహారిక జీవితంలో అంతా సాఫీగా ఉండాలన్న నియమమేం లేదు. ఆ దారి వేరు. ఈ దారి వేరు. ఒకటి అంతర్గతం. మరొకటి బహిర్గతం. దేని ప్రస్థానం దానిదే. ప్రకృతి సూత్రాల్ని ఎవరూ తిరగరాయలేరు. ఎప్పుడు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. రోజూ పద్మాసనం వేస్తుంటే పద్మాసనమే వస్తుంది. కానీ నటన రాదు. మంచి నటుడు కావాలంటే, మళ్లీ కష్టపడాల్సిందే. మహేష్‌భట్‌ పుస్తకం ‘మైండ్‌ ఈజ్‌ ఎ మిత్‌....’ నాలోని ద్వైదీభావాన్ని పటాపంచలు చేసింది’
‘నేను డబ్బును గౌరవిస్తాను. అయితే, ఆ డబ్బును భౌతిక వస్తువుగా చూడను. అందులో ఓ మనిషి తాలూకు శ్రమను చూస్తాను. సంపద ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదని కోరుకుంటాను. ఆ శ్రమ ఫలం అందరికీ దక్కాలనుకుంటాను. ఎవరి సంపాదనా బ్యాంకుల్లోనో బీరువాల్లోనో మూలగకూడదు. సరైన మార్గంలో, ఆ సంపద మరింత సంపదను సృష్టించాలి. ఇంకొంతమందికి ఉపాధినివ్వాలి. ఒక సినిమా కోసం ఇంత మందిమి కష్టపడతాం. కానీ, ఏమాత్రం కష్టపడకుండా వందల కోట్లు సంపాదించేవాళ్లను ఏమనాలి? అలాంటివాళ్ల మీదే నా తిరుగుబాటంతా?’
‘పుస్తకాలు నా స్నేహితులు. జీవితం గురించి అవి విపులీకరించి చెప్పాయి. చివుకుల పురుషోత్తం రాసిన ‘ఏది పాపం, ఏది పుణ్యం’ పదో తరగతిలోనే చదివాను. మార్క్‌ట్వెయిన్‌, నండూరి రామమోహనరావు నన్ను ప్రభావితం చేసిన రచయితలు. కేశవరావు ‘అతడు అడవిని జయించాడు’ కూడా అంతే గొప్ప పుస్తకం. జీవనాధారం కోల్పోయినప్పుడు మనిషి పడే ఆవేదనను కళ్లకు కట్టారు అందులో. కాబట్టే రైతులూ, చేనేతకార్మికులూ, ఉద్దానం కిడ్నీ బాధితులూ నా సాయం కోరగానే, వెంటనే స్పందించాను. పరమహంస యోగానంద ‘ఒక యోగి ఆత్మకథ’, గాంధీజీ ‘సత్యశోధన’, శేషేంద్రశర్మ ‘ఆధునిక మహాభారతం’ ...నాకు నచ్చిన పుస్తకాల జాబితా చాలా పెద్దది. రోజూ కాసేపైనా పుస్తకాలు చదువుతాను. కొన్ని పుస్తకాలు మళ్లీ మళ్లీ చదువుతాను’
‘నాకు మహిళలంటే అపార గౌరవం. స్త్రీ అనగానే అమ్మ గుర్తుకొస్తుంది, అక్కచెల్లెళ్లు గుర్తుకొస్తారు. ప్రకృతిలో మహిళే అసలుసిసలు సృష్టికర్త. ఓ తల్లి తన పిల్లలకు మంచి ఆలోచనా విధానాన్ని ఇవ్వగలిగితే... సమాజానికి అంతకు మించిన ఉపకారం ఉండదు. అమ్మ నుంచి నేను కృతజ్ఞతాభావం నేర్చుకున్నా. ఆమేం పెద్దగా చదువుకోలేదు. ఐదో తరగతితోనో, ఆరో తరగతితోనో ఆపేసింది. రోజూ దీపం వెలిగించే ముందు దండం పెట్టుకునేది. ‘ఎవరికమ్మా ఆ దండాలు?’ అని అడిగితే, ‘ఎడిసన్‌కి నాన్నా! ఆయనే లేకపోతే మనకు ఇంత వెలుగు లేదు కదా?’ అనేది. మహిళలు పెద్దపెద్ద సత్యాల్ని కూడా సులభంగా సాధనలో పెట్టేస్తారు. నా జీవితంలో తారసపడిన మహిళలతో నాకు ఇబ్బంది ఏర్పడి ఉండవచ్చు. నేనిచ్చిన గౌరవాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులూ ఉండవచ్చు. అయినా సరే, ఒకరిద్దరి లోపాలకు అందరినీ వేలెత్తిచూపడం సరికాదు’
‘పురాణాల్లో పరశురాముడు నాకు ఇష్టం. ఆ పాత్రను ఎలా చూస్తానంటే - సమాజాన్ని కాపాడాల్సినవాళ్లు, ధర్మాన్ని పాలించాల్సినవాళ్లు...బాధ్యత మరిస్తే... అడవుల్లో ఉన్నవాళ్లనూ హింసించడం మొదలుపెడితే - అధర్మానికి అది పరాకాష్ట. పరశురాముడు ధర్మసంస్థాపన కోసం ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడు’
‘త్రివిక్రమ్‌ నా ఆత్మీయుడు. మొదట్లో, తన పేరు త్రివిక్రమ్‌ అని కూడా తెలియదు. పోసానిగారి అసిస్టెంట్‌గా మాత్రమే తెలుసు. నా రెండో సినిమాకు తను పనిచేశాడు. ఓ సన్నివేశంలో... ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుగడకు మూలం - అన్న మాట నాకు నచ్చింది. నా మనసులోనూ దాదాపుగా అలాంటి భావనే ఉండేది. ఎవరు రాశారా అని వాకబు చేస్తే, త్రివిక్రమ్‌ పేరు చెప్పారు. ‘జాని’ చూశాక, కథ చెప్పడానికొచ్చాడు. వింటూవింటూ నిద్రలోకి జారిపోయాను. మా ఇద్దరి భావాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి.’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.