close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అతడి ఇల్లే ఓ గ్రంథాలయం

అతడి ఇల్లే ఓ గ్రంథాలయం

ఉపాధ్యాయుడిగా ఎంతోమందికి చదువు చెప్పి ప్రయోజకుల్ని చేసిన ఆయనకు పుస్తకం విలువేంటో బాగా తెలుసు. అందుకే, పదవీ విరమణ తర్వాత వూరకే ఉండిపోకుండా వూరి ప్రజలకు గ్రంథ జ్ఞానాన్ని అందించేందుకు నడుం బిగించారు. అందుకోసం, తన ఇంటి మొత్తాన్నీ గ్రంథాలయంగా మార్చేశారు.

వ్యక్తైనా సమాజమైనా అభివృద్ధి చెందడానికి విజ్ఞానమే తొలి మెట్టు. ఆ విజ్ఞానాన్ని సంపాదించాలంటే పుస్తకాలు చదవాల్సిందే. కానీ పల్లెటూళ్లలోని చాలామంది ఆర్థికస్తోమత దృష్ట్యా పుస్తకాలు కొనుక్కుని చదువుకోవడానికి ఆసక్తి చూపరు. కాస్త డబ్బుండి కొనుక్కుందామనుకున్నా మంచి పుస్తకాలను ఎంపికచేసుకునేంత అవగాహన ఉండదు. అందుకే, పల్లెల్లో గ్రంథాలయాలుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, మనదగ్గర గ్రంథాలయాలుండే గ్రామాలు చాలా తక్కువ. అదే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాహితీ వేత్త డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యను ఎన్నోసార్లు బాధపెట్టింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకుడిగా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాక ఈ విషయమై తనవంతుగా ఏం చేయగలనని ఆలోచించారు. ఆ ప్రయత్నమే రామన్నపేట మండలం వెల్లంకిలోని తన ఇంటినే గ్రంథాలయంగా మార్చేలా చేసింది.

‘ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం’ పేరిట కొన్నేళ్ల కిందట వెల్లంకిలో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంలో 15000కు పైగా పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో విద్యార్థులూ పోటీపరీక్షలకు చదివేవారికి ఉపయోగపడే పుస్తకాలతో పాటు సాహిత్యం, పురాణాలు, ఇతిహాసాలు, పరిశోధన గ్రంథాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన 200 మందికి పైగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పద్య, గద్య రచనకు సంబంధించిన గ్రంథాలు, తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే పురాతన గ్రంథాలు, 300కి పైగా పరిశోధన గ్రంథాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. వందేళ్ల క్రితం దిన పత్రికలలో ప్రముఖులు రాసిన వ్యాసాలకు సంబంధించిన ప్రతుల్ని సైతం ఇక్కడ భద్రపరిచారు. అందుకే, రోజువారీ చదువరులతో పాటు, వివిధ ప్రాంతాలలోని విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులూ ఈ గ్రంథాలయానికి వస్తుంటారు. ఉస్మానియా, కామరాజు (చెన్నై), కాకతీయ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హైŸ¹రాబాదు), తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఇక్కడకు వచ్చి వివిధ అంశాలపై పరిశోధనలు చేసి ఎం.ఫిల్‌, పీహెచ్‌డీలు (డాక్టరేట్‌) కూడా సాధించారు. ప్రస్తుతం మరో నలుగురు పరిశోధనలు చేస్తున్నారు.

అలా ఇబ్బందిపడకూడదనే...
‘పాఠశాలకు వెళుతున్నప్పుడు నాకు పుస్తకాలు కొనిచ్చే ఆర్థిక స్థోమత కూడా మా కుటుంబానికి లేదు. దాంతో రోజూ రాత్రి స్నేహితుల పుస్తకాలు అడిగి తీసుకుని చదువుకుని మళ్లీ ఉదయాన్నే తిరిగిచ్చేవాడిని. నాలా మరెవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనూ, గ్రామీణ విద్యార్థులకు అన్నిరకాల పుస్తకాల్నీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతోనూ ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశాను. మొదట గ్రంథాలయం ఏర్పాటు కోసం స్థానికుల సహాయం కోరాను. కానీ ఎవరూ స్పందించలేదు. దాంతో సుమారు రూ.మూడు లక్షలు ఖర్చు పెట్టి నా ఇంటినే గ్రంథాలయంగా మార్పించా. దీన్లో ఎక్కువ భాగం సొంత డబ్బు కాగా కొంత దాతల నుంచి సేకరించా’ అంటారు విఠలాచార్య. తన దగ్గరున్న దాదాపు ఐదు వేల పుస్తకాలతో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారాయన. తర్వాత మిత్రులు, సాహితీ ప్రేమికులు, తితిదే వంటి ధార్మిక, సాహిత్య సంస్థల నుంచి మరిన్ని పుస్తకాలను సేకరించారు. ఇప్పటికీ ‘గ్రంథ భిక్ష’ పేరుతో వివిధ ప్రాంతాలకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే సాహిత్య కార్యక్రమాలకూ వెళ్లి పుస్తకాల్ని సేకరిస్తుంటారు.

రచయిత కూడా
పక్కన వేరే స్థలంలో మరో ఇంటిని కట్టించుకుని ఉంటున్న ఆయన 80 ఏళ్ల వయసులోనూ గ్రంథాలయ నిర్వహణను స్వయంగా చూసుకుంటారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకూ పాఠకులెవరైనా ఇక్కడ చదువుకోవచ్చు. కావల్సిన పుస్తకాలను రిజిస్టరులో నమోదు చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు కూడా. వాటిని వారం రోజుల్లో తిరిగి వ్వాలి. గడువు దాటితే రెన్యువల్‌ చేసుకోవచ్చు. ప్రతి రోజూ గ్రంథాలయానికి వచ్చే వారిలో ఉత్తమ పాఠకుడిని గుర్తించి గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా రూ.1000 నగదు పారితోషికం అందజేస్తున్నారు.

తన తదనంతరం గ్రంథాలయం బాధ్యతను చూసుకునేందుకు కొంతమంది సభ్యులతో ‘ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేశారు. ప్రతినెలా గ్రంథాలయం నిర్వహణకు అయ్యే రూ.10వేలు ఖర్చును విఠలాచార్యతో పాటు, ఫౌండేషన్‌ సభ్యులే భరిస్తున్నారు. విఠలాచార్య రచయిత కూడా. తెలుగు భాష ప్రత్యేకతను తెలిపేలా విఠలేశ్వర శతకం, స్మృత్యంజలి, దొందూ, కవితాచందన, శిల్పాచార్యులు, సింగి, సింగడు...లాంటి 20కి పైగా పుస్తకాలను రాశారు. వాస్తు శిల్పి బి.ఎన్‌.రెడ్డి, సుద్దాల హన్మంతు పురస్కారాలు, శాతవాహన విశ్వవిద్యాలయం తదితర విద్యా సంస్థలనుంచి జీవన సాఫల్యపురస్కారాలను అందుకున్నారంటేనే సాహితీవేత్తగా ఆయనకున్న గుర్తింపు అర్థమవుతుంది.

ఇక, ఆయన మంచితనం గురించి చెప్పడానికి ఈ గ్రంథాలయమే నిలువెత్తు సాక్ష్యం.

- కె.రవీందర్‌ రెడ్డి, ఈనాడు నల్గొండ
ఫొటోలు: బైరబోయిన రమేష్‌

 

ఇది అన్నదాతల వెబ్‌సైట్‌...

అన్నదాతల కష్టపడే తత్వానికి సాంకేతికత తోడైతే... అద్భుతాలు సాధిస్తారనడంలో సందేహం లేదు. అందుకే రైతుల కోసం ప్రత్యేకంగా ‘ఆగ్రోబుక్‌’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి వారు అభివృద్ధి బాట పట్టేలా చేస్తున్నాడు సుభాష్‌ లోడె.

రైతు కుటుంబంలో పుట్టిన సుభాష్‌కు ఇంజినీరింగ్‌ చదివినా తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసిన అనుభవం ఉంది. విత్తనం నాటినప్పటి నుంచి పంట అమ్ముడయ్యే వరకూ రైతులు ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారో అతడికి బాగా తెలుసు. అందుకే వ్యవసాయ పనులను మరింత సులువుగా చేయగలిగే మార్గం కోసం అన్వేషించి ‘ఆగ్రోబుక్‌.కామ్‌’ అనే సైట్‌ను ప్రారంభించాడు. ఒకసారి సుభాష్‌ మహారాష్ట్రలోని తన సొంత వూరికి వెళుతుండగా దారిలో చాలామంది రైతులు స్మార్ట్‌ ఫోన్లను వినియోగించడం చూశాడట. అయితే ఆ ఫోన్లను రైతులు మాట్లాడుకునేందుకూ, పాటలు వినేందుకే పరిమితం చేయడం అతడిని ఆలోచనలో పడేసింది. అదే సెల్‌ఫోన్‌ను ఉపయోగించి వ్యవసాయాన్ని మరింత సులువుగా, లాభసాటిగా చేయవచ్చని నిరూపించడానికి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.

సమయం వృథా కాదు...
మారుమూల ప్రాంతాల్లోని రైతులు సాధారణంగా విత్తనాలూ, ఎరువులూ, పురుగుమందులూ కొనడానికి పట్టణాల్లో ఉండే వ్యవసాయ కేంద్రాలకు వెళుతుంటారు. దాంతో వ్యవసాయ పనులకు కేటాయించాల్సిన సమయం కాస్తా వృథా అయిపోతుంది. అలాకాకుండా ‘ఆగ్రోబుక్‌’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైతులు తమకు అవసరమైన విత్తనాలూ, ఎరువులూ, పురుగుమందులను ఆర్డర్‌ చేసుకోవచ్చు. దీని వల్ల రైతులకు ఎంతో సమయం కలిసి వస్తుంది. అంతేకాదు ఎరువులూ, పురుగు మందుల విషయంలో సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల రైతులు ఒక్కోసారి దుకాణదారుడు సూచించిన ఎరువులనే కొనేస్తుంటారు. వ్యాపారులు తమ సొంత లాభాల కోసం రైతులను తప్పు దారి పట్టించే అవకాశమూ లేకపోలేదు. ఈ ‘ఆగ్రోబుక్‌’ వెబ్‌సైట్‌ అలాంటి ఇబ్బందుల నుంచి రైతులను రక్షిస్తుంది. నిపుణుల సలహాలూ, సూచనలు ఈ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ సైట్‌లోకి వెళ్లి రైతులు తమకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వివిధ పంటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీల వివరాలూ దీంట్లో అందుబాటులో ఉంటాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే నిపుణులు కూడా రైతులకు సూచనలు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు. రైతులు వారిని తమ పొలం దగ్గరకు స్వయంగా తీసుకెళ్లే అవకాశమూ ఉంది. వ్యవసాయ సామగ్రికి సంబంధించిన సమాచారాన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే వ్యవసాయ ప్రదర్శనల వివరాలూ ఉంటాయి. రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోడానికి ఇది చక్కని వేదికగా కూడా పనిచేస్తుంది.

సహాయక కేంద్రం కూడా...

వెబ్‌సైట్‌ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకునే పరిజ్ఞానం చాలా తక్కువమంది రైతులకు మాత్రమే ఉంటుంది. అందుకే ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పెదనల్లబల్లి అనే మారుమూల గ్రామంలో సహాయక కేంద్రాన్నీ ఏర్పాటుచేశాడు సుభాష్‌. తెలంగాణలో పనిచేసిన అనుభవంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. రైతుల సౌలభ్యం కోసం ఆ కేంద్రంలో ఒక ఉద్యోగినీ నియమించాడు. అతడు నెట్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం, రైతులు అడిగిన సమాచారం తీసివ్వడం లాంటి సాంకేతిక సహకారం అందిస్తాడు. సుమారు పదిహేను వందలమంది రైతులు ఇప్పటికే ఈ కేంద్రం సేవలను వినియోగించుకుంటున్నారు. చుట్టుపక్కల ఆరు గ్రామాల్లోని రైతులూ, యువతా ఈ కేంద్రంలోని ఇంటర్నెట్‌ సేవలనూ వినియోగించుకుంటున్నారు. ఈ కేంద్రానికి వచ్చే చాలామంది రైతులు ఏ పంట వేయడానికి ఎంత ఖర్చవుతుంది, ఎంత రాబడి వస్తుందనే విషయాన్ని ఎక్కువగా వాకబు చేస్తుంటారట. అందుకే రైతుల సౌలభ్యం కోసం ఏ పంట వేస్తే ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని పట్టిక రూపంలో సూచించే పనిలో ఉన్నాడు సుభాష్‌.

 వ్యవసాయదారులకు సాంకేతిక సహకారాన్ని అందించడంతో పాటుగా స్థానిక యువత తమ కాళ్ల మీద నిలబడే ఏర్పాట్లూ చేస్తున్నాడు సుభాష్‌. పెదనల్లబల్లి గ్రామ పరిసరాల్లో కోయ తెగవారు ఎక్కువ. వారి జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి కూడా ఈ కేంద్రం కృషిచేస్తోంది. ఈ ప్రాంతంలో ఉసిరికాయలు ఎక్కువగా కాస్తాయి. కోయ తెగకు చెందిన యువకులు సంతలో వాటిని అతి తక్కువ ధరకు అమ్ముతుంటారు. ఈ విషయాన్ని గమనించిన సుభాష్‌ కోయ యువకులకు ఉసిరికాయల మురబ్బాను తయారుచేయడంలో శిక్షణ ఇప్పించి వ్యాపారం ప్రారంభించేలా చేశాడు. ఈ మురబ్బా రుచికరంగా, ఉండటంతోపాటు ఆరోగ్యానికీ మంచిది కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దీనికి మంచి గిరాకీ ఏర్పడింది. దాంతో విరాళాలు సేకరించి వారి వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాడు సుభాష్‌.

‘చదువుకున్న వ్యవసాయదారులకు సాంకేతిక సహకారం అందించేందుకు వెబ్‌సైట్‌ను మొదలుపెట్టాను. చదువుకున్నవాళ్లకు మాత్రమే వెబ్‌సైట్‌ సేవలు పరిమితం కావడం నన్ను ఆలోచనల్లో పడేసింది. క్షేత్రస్థాయిలోనే అన్నదాతలకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఖమ్మంజిల్లాలోని మారుమూల గ్రామంలో వ్యవసాయ సహాయక కేంద్రాన్ని ప్రారంభించాను. దీని ద్వారా స్థానిక యువకులకు ఉపాధి కల్పించడానికీ కృషిచేస్తున్నాం’ అంటాడు సుభాష్‌

వెబ్‌సైట్‌ వేదికగా అన్నదాతల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం, చదువురాని రైతుల కోసం మారుమూల గ్రామంలో సహాయక కేంద్రాన్నీ ఏర్పాటు చేయడం... రైతుల కోసం ఏమైనా చేయాలనే సుభాష్‌ తపనకు నిదర్శనం. కష్టానికి సాంకేతికత తోడై అన్నదాతలు అభివృద్ధి బాట పడితే సుభాష్‌ కృషి ఫలించినట్టేగా...


 

మజా మజా ఖర్బుజా..!

వేసవి అనగానే నోరూరించే మామిడిపండో చల్లచల్లని పుచ్చపండో మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ వాటితోబాటుగా ఈ కాలంలో వచ్చే ఖర్బూజాలను చూడగానే నీరసంగా మొహం పెట్టేస్తారు. కానీ ఇవి మంచి పోషకాహారమే కాదు, ఆరోగ్యానికీ మేలుచేస్తాయి. మరెన్నో వ్యాధుల్నీ దూరంగా ఉంచుతాయి.

ఖర్బూజాలో చాలానే రకాలు ఉన్నప్పటికీ, వలలాంటి నిర్మాణాన్ని కలిగిన తోలుతో ఉండే ఖర్బూజాలే మనదగ్గర ఎక్కువగా దొరుకుతాయి. ఇప్పుడిప్పుడు నిమ్మఫ్లేవర్‌ కలిగిన లెమన్‌ డ్రాప్‌, తియ్యగా ఉండే షుగర్‌ మెలన్‌, తెల్లగా ఉండే వైట్‌ హనీ డ్యూ, ఆకుపచ్చని గాలియా, పసుపురంగులోని పర్షియన్‌, కాస్త కోలగా ఉండే శాంటా క్లాజ్‌, చారలతో ఉండే టస్కన్‌... ఇలా చాలానే వస్తున్నాయి. వీటిల్లో కొన్ని ముక్కలుగా కోయకుండానే స్పూనుతో తినేలా ఉంటాయి. వీటిల్లో కొన్ని రకాలు వేసవిలోనే పండినప్పటికీ చాలావరకూ ఏడాది పొడవునా లభ్యమవుతున్నాయి. ఈ ఖర్జూజా జాతికే చెందిన కొన్ని దోస రకాలను గోదావరి లంకల్లోనూ పండిస్తుంటారు. లంక దోసకాయలుగా పేరొందిన ఇవి మంచి వాసనతో ఎంతో రుచిగానూ ఉంటాయి. వీటిల్లో అధికంగా ఉండే నీటిశాతం కారణంగా వేసవిలో దాహార్తిని తీర్చడంతోబాటు అందులోని ఎలక్ట్రోలైట్లు అలసటనీ తీర్చి సేదతీరుస్తాయి. అందుకే ఈ పండును నేరుగా తినడంతోబాటు జ్యూసులూ కస్టర్డ్‌ వెరైటీలూ సలాడ్లూ ఐస్‌క్రీముల్లోనూ వాడతారు. ముఖ్యంగా మంట కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధుల్ని నివారిస్తాయన్న కారణంతో ప్రపంచవ్యాప్తంగా వీటి వాడకం బాగా పెరిగింది.

* అజీర్తి, పోషకాల లేమి, రోగనిరోధకశక్తి లేకపోవడం, తరచూ నీరసంతో బాధపడేవాళ్లకు ఇది మంచి ఆహారం.

* ఖర్బూజాల్లో అత్యధిక శాతంలో ఉండే నీరు జీర్ణాశయాన్ని తేమగా ఉంచుతూ టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

* వీటిల్లో పుష్కలంగా ఉండే కెరోటినాయిడ్లూ కుకుర్బిటాసిన్లూ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రకరకాల క్యాన్సర్లనీ నరాల వ్యాధుల్నీ తగ్గిస్తాయట. ఇందులోని విటమిన్‌-ఎ వూపిరితిత్తులూ, నోటిక్యాన్సర్లు రాకుండా చూస్తుంది.

* ఇటీవల ఖర్బూజాల నుంచి సూపర్‌ ఆక్సైడ్‌ డిస్‌మ్యుటేజ్‌ అనే ఎంజైమ్‌ను సేకరిస్తున్నారు. ఇది ఎంతో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రకమైన ఒత్తిడి కారణంగానే కొలెస్ట్రాల్‌, బీపీలు పెరిగి హృద్రోగాలు రావడం జరుగుతుంటుంది. అలాగే రక్తాన్ని పలుచగా చేసే ఎడినోసిన్‌తోబాటు గడ్డలు కట్టకుండా చేసే లక్షణాలు ఇందులో ఉన్నాయి. దీన్ని నిమ్మరసంతోబాటు ఉదయాన్నే తింటే మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయట.

* ఇందులోని కొన్ని పదార్థాలు మానసిక ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమిని నివారిస్తాయి.

* నెలసరి సమస్యల్నీ ఖర్బూజా నిరోధిస్తుందట. ఆ సమయంలో దీన్ని రోజూ తింటే నొప్పి కూడా తగ్గుతుందట.

* ఈ పండులోని ప్రొటీన్లూ కొల్లాజెన్‌ పదార్థాలూ కణాల పునర్నిర్మాణానికి దోహదపడతాయి. దాంతో చర్మం త్వరగా వడలిపోకుండా నిగనిగలాడుతూ ఉంటుంది. కణాల పనితీరుకు అవసరమయ్యే పొటాషియం కూడా ఇందులో సమృద్ధిగా దొరుకుతుంది. క్రమం తప్పకుండా ఈ పండ్ల రసం తాగితే ఎగ్జిమా లాంటి చర్మ సమస్యలూ తగ్గుతాయి. ఎ, సి విటమిన్లు సమృద్ధిగా ఉండే ఖర్జూజా కంటివ్యాధుల్ని దూరంగా ఉంచుతుంది. వీటిని క్రమం తప్పకుండా తినేవారిలో కంటిలో శుక్లాలు వచ్చే అవకాశం 40 శాతం తక్కువట.

* ఇందులోని సీఆర్‌పీ అనే ప్రొటీన్‌ రోగనిరోధకశక్తి లేకపోవడం కారణంగా తలెత్తే వ్యాధుల్ని నివారిస్తుందట.

అందుకే మరి... చల్లని ఖర్బూజా రకాలను కడుపారా ఆస్వాదించండి... ఆరోగ్యంగా జీవించండి..!


 

వంద గ్రామాలకు నీళ్లు తెచ్చింది

వేసవి వచ్చిందంటే నీళ్ల కోసం కన్నీళ్లు పెట్టే గ్రామాలు రాజస్థాన్‌లో ఎన్నో. నీటి ఎద్దడితో ఏడాదికి ఒక్క పంటనూ పండించుకోలేక పేదరికంతో అల్లాడిపోయే వూళ్లు ఇంకెన్నో. అలాంటి వంద గ్రామాల్లో రెండొందల చెక్‌డ్యామ్‌లను నిర్మించి వాళ్ల నీటికష్టాలను తీర్చి, మూడు పంటలు పండించుకునేలా చేసిందామె.

సంవత్సరం... 1999-2000. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌ నీటి కరవుతో మరింత విలవిల్లాడింది. ఆ వార్తలూ ఫొటోలూ నిత్యం పత్రికల్లో వస్తుండేవి. చాలామందిలా వాటిని చూసి పక్కన పడేయలేకపోయింది ముంబైలో ఉండే సామాజిక కార్యకర్త అమలా రుయా. వెంటనే రాజస్థాన్‌కి వెళ్లిపోయింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో పర్యటించి సమస్య గురించి లోతుగా అధ్యయనం చేసింది. అప్పుడే ఆమెకు పరిష్కారం కూడా దొరికింది. స్థానికంగా చాలా గ్రామాల్లో చిన్నాపెద్దా కొండలున్నాయి. వర్షాకాలంలో అక్కడి నుంచి వచ్చే నీటితోనే వ్యవసాయం చేస్తారు రైతులు. అయితే, ఒక్కసారిగా పారే నీటికి ఎక్కడా అడ్డుకట్టలు లేకపోవడంతో చాలా నీరు వృథాగా పోయేది. చెక్‌డ్యామ్‌ల ద్వారా ఆ జలాన్ని ఒడిసిపట్టి స్థానికంగా నీటి కొరతను పునాదులతో సహా పెకలించేయాలని నిర్ణయించుకుంది అమల. తక్కువ ఖర్చుతో నిర్మించే ఈ చెక్‌డ్యామ్‌లు ఎగువ నుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. దేశంలో పేరుపొందిన ‘ఫీనిక్స్‌ మిల్స్‌ లిమిటెడ్‌’ అధినేత అశోక్‌ రుయా భార్య అమల. అందుకే, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ‘ఆకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ పేరుతో స్వయంగా ఓ సంస్థనూ నెలకొల్పింది.

ఏడాదికి రూ.300 కోట్లు
ఆకార్‌ ట్రస్టు సభ్యులు గ్రామాల్లోకి వెళ్లి చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవడమే నీటి సమస్యకు సరైన పరిష్కారమని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. నీటి కరవుతో విలవిల్లాడుతున్న తమను ఆదుకోవడానికి వచ్చిన సంస్థకు గ్రామస్థులు తమవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. అలా మొదటి రెండు చెక్‌డ్యామ్‌లూ దౌసా జిల్లాలోని మండావర్‌ గ్రామంలో నిర్మాణమయ్యాయి. ఫలితం... వర్షాకాలంలో నిండిన ఆ జలాశయాలు స్థానికరైతులకు ఆ ఏడాది రూ.12 కోట్ల విలువైన పంటను పండించి పెట్టాయి. ఆ ఉత్సాహం చుట్టుపక్కల గ్రామాలకూ విస్తరించింది. కొద్ది నెలల్లోనే ఆ సంస్థ దౌసా, అల్వార్‌, సీకర్‌, ఝన్‌ఝను... తదితర జిల్లాల్లోని వందకు పైగా గ్రామాల్లో 200కు పైగా చెక్‌డ్యామ్‌లను నిర్మించింది. అంతకు ముందు ఒక్క పంటక్కూడా నీరు అందుతుందా లేదా అని భయపడే ఇక్కడి రైతులు రుయా పుణ్యమా అని ఏడాదికి మూడు పంటలు పండించడం మొదలుపెట్టారు. కూరగాయల పంటలూ సాగులోకొచ్చాయి. ఈ చెక్‌డ్యామ్‌ల ద్వారా పండిన పంటల ఆదాయం ఏడాదికి రూ.300 కోట్లకు చేరిందంటేనే అక్కడ ఎంత మార్పొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

వలసలు లేవు...
ఒకప్పుడు వేరే రాష్ట్రాలకు కూలీలుగా వలస వెళ్లినవారు కూడా ఇప్పుడు తిరిగొచ్చి సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. పిల్లల్ని మంచి చదువులు చదివిస్తున్నారు. డ్యాముల ద్వారా చుట్టుపక్కల బీటలు వారిన నేలలో కూడా నీరు చేరింది. ఎండిపోయిన చేతి పంపుల నుంచి జలం పొంగింది. బిందెడు నీటికోసం మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే ఆడబిడ్డలు గుమ్మం ముందే నీటిని పట్టుకుంటున్నారు. దాంతో ఆడపిల్లలూ బడికెళ్తున్నారు. మహిళలు పాడి పశువుల్ని పెంచి వాటిద్వారానూ ఆదాయం పొందుతున్నారు. ‘నాలుగేళ్ల కిందట కుటుంబాన్ని పోషించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాలకు వెళ్లి కూలీగా పనిచేసేవాణ్ని. వూళ్లొ చెక్‌డ్యామ్‌ని నిర్మించాక నా పొలంలోనే మూడు పంటలు పండుతున్నాయి. పది గేదెల్ని కొనుక్కున్నా. ఇంతకు ముందు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వూరికి ఒకటీ రెండూ మోటార్‌ సైకిళ్లు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఇంటికి ఒకటీ రెండూ బైక్‌లు వచ్చేశాయి. వ్యవసాయానికి ట్రాక్టర్‌లనూ కొంటున్నాం’ అంటాడు గద్రతా గ్రామానికి చెందిన దేవ్‌కరణ్‌. ఇంతకుముందు ఈ గ్రామాల్లోని అబ్బాయిలకు పిల్లనివ్వడానిక్కూడా ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. ఇప్పుడు ఆ సమస్యా తీరింది.

రైతులూ భాగస్వాములే
ఒక డ్యాముని నిర్మించడానికి సుమారు రూ.ఐదులక్షలు వ్యయమవుతుంది. డ్యామ్‌ సైజుని బట్టి ఖర్చు పెరగొచ్చు కూడా. మొత్తం వ్యయంలో 40శాతాన్ని స్థానిక రైతుల నుంచి సేకరిస్తారు. మిగిలిన 60శాతం ఆకార్‌ ట్రస్టే భరిస్తుంది. దీనికోసం ఫీనిక్స్‌ మిల్స్‌తో పాటు, ఇతర పెద్ద వ్యాపార సంస్థలూ దాతల నుంచి విరాళాలను సేకరిస్తుంది సంస్థ. ‘ఎక్కువ డ్యామ్‌లను కట్టాలంటే మొత్తం ఆర్థిక భారాన్ని మొయ్యడం సంస్థకు సాధ్యం కాని పని. అందుకే, రైతుల్నీ భాగస్వాములుగా చేశాం. ఆర్థిక సహకారం విషయంలోనే కాదు, నిర్మాణం పూర్తయ్యాక డ్యామ్‌ నిర్వహణ బాధ్యతను కూడా వారికే అప్పగిస్తాం’ అంటారు అమలా రుయా.

రాజస్థాన్‌ తర్వాత ఆకార్‌ ట్రస్ట్‌ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, జల్నా జిల్లాల్లోనూ మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లోనూ చెక్‌డ్యామ్‌లను నిర్మించింది. ఈమధ్యే ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పనుల్ని ప్రారంభించింది.

పిల్లల ఆకలి అమ్మకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదు. అందుకే, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసిన అమలా రుయాను స్థానికంగా అందరూ నీళ్లతల్లి (వాటర్‌ మదర్‌) అని పిలుచుకుంటారు. ఆమె సేవలకు లక్నో నేషనల్‌ లీడర్‌షిప్‌ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులూ వరించాయి.

నిజంగా ఆమెది అమ్మ మనసే కదా!


 

రాజన్న... ఓ జక్కన్న

గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రి పుష్కరఘాట్లో కృష్ణుడి రూపంలోని 15 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చూసి ‘ఎంతందంగా ఉందీ’ అనుకున్నవారెందరో. ఇక, నది ఒడ్డున ఉన్న గోదావరి మాత ప్రతిమను చూస్తే నదీమతల్లి నడిచొచ్చిందా... అనిపించకమానదు. వడయార్‌ చేతిలో ప్రాణం పోసుకున్న విగ్రహాలకు అంతటి ప్రత్యేకత ఉంటుంది మరి. ఆయన పూర్వికులు రెండు శతాబ్దాల కిందటే మైసూర్‌ నుంచి ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. వడయార్‌ తండ్రి శ్రీనాథరత్న లక్షకుపైగా శిల్పాలకు రూపమిచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తండ్రి శిక్షణలో వడయార్‌ కూడా అదే కళలో ప్రఖ్యాతిగాంచారు. తెలుగు తల్లి విగ్రహంతో పాటు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన అనేక విగ్రహాలు ఈ తండ్రీకొడుకులు కలిసి రూపొందించినవే. తండ్రి మరణించాక ఇరవయ్యేళ్ల నుంచీ రాజ్‌కుమార్‌ తయారుచేసిన విగ్రహాలు నాలుగువేలకు పైనే. వీటిలో ఎక్కువ కాంస్యం, పంచలోహ విగ్రహాలే. వాటినే రంగులతో ఎంతో సహజంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఆయన ప్రత్యేకత.