close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కుదిరితే ఓ కప్పు... ‘అరకు’ కాఫీ!

కుదిరితే ఓ కప్పు... ‘అరకు’ కాఫీ!

క్రీస్తుశకం ఏడో శతాబ్దం...

ఇథియోపియాలోని కొండప్రాంతం. పచ్చగడ్డి మేస్తున్న గొర్రెలు ఒక్కొక్కటే మత్తుగా తలవాల్చేస్తున్నాయి. కాపరికి సందేహం వచ్చింది. చుట్టుపక్కల గాలించాడు. అతడి చూపులు పొదల్లోని ఓ మొక్క మీద ఆగాయి. అనుమానంగా ఓ గింజ తీసి నోట్లో వేసుకున్నాడు. భలేగా అనిపించింది. ఇంకొన్ని చప్పరించాడు. చిటికెడు మద్యం తాగినట్టు, కించిత్‌ మత్తు.

అవి, కాఫీ గింజలు!

ఆ రుచిని తొలిసారిగా అనుభవించిన గొర్రెలకాపరి ధన్యుడు!

* * *

నాలుగువందల సంవత్సరాల క్రితం...

బాబూ బుడాన్‌ అనే సూఫీ గురువు మక్కాయాత్రకు వెళ్లొస్తూ యెమన్‌ నుంచి ఏడు కాఫీ గింజలు తీసుకొచ్చాడు. వాటిని కర్ణాటకలోని చిక్‌మగళూరు ప్రాంతంలో నాటాడు. అలా, తొలిసారిగా కాఫీ గింజలు మన మట్టిలో మొలిచాయి. ఆ ముదురు గోధుమరంగు విత్తనాలతో నేలపిల్ల పీకలోతు ప్రేమలో పడిపోయింది. కాఫీ పంట వేల ఎకరాలకు విస్తరించింది. భారతదేశం ఇప్పుడు నూట ఏడు దేశాలకు కాఫీని ఎగుమతి చేస్తోంది.

‘షుక్రియా... బుడాన్‌ జీ!

ప్రతి గింజ మీదా ఆ కాఫీ తాగే వ్యక్తి పేరు ఉంటుందంటారు. ఆ మాట నిజమైతే, అందుకు అనుమతిస్తూ మీ సంతకం ఉండటమూ నిజమే!’

* * *

వందేళ్ల నాటి మాట.

అప్పట్లో, విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలో అంతా పోడు సేద్యమే. దిగుబడి కూడా అంతంతమాత్రమే. గిరిజనులకు ఉపాధి మార్గం చూపాలన్న ఆలోచనతో బ్రిటిష్‌ అధికారులు కాఫీ పంటను ప్రోత్సహించారు. మట్టి మహత్యమేమో, పంట విరగబండింది. నీటి స్వభావమేమో, రుచీ అద్భుతమే. తెల్లదొరలైతే ఆ కమ్మదనాన్ని మరువలేకపోయారు. సెలవులకు వెళ్తున్నప్పుడు కూడా, కాఫీ గింజల్ని మూటగట్టి ఓడలకు ఎక్కించారు. ఆరోజుల్లో... యూరప్‌లోని సంపన్న కుటుంబాలకు పొద్దున్నే కప్పు నిండా అరకు కాఫీని ఆస్వాదించడం ఓ అలవాటు, అదో ఉత్తమాభిరుచి కింద లెక్క. మధ్యలో కొంతకాలం, చల్లారిపోయిన కాఫీలా అరకు పేరు మూలనపడిపోయింది. మళ్లీ ఇప్పుడు, పునర్వైభవం మొదలైంది. ‘అరకు కాఫీ’ దుకాణం ఇటీవలే పారిస్‌ పురవీధుల్లో ప్రారంభమైంది. అత్తరునగరానికి అలా సరికొత్త కాఫీ రుచి పరిచయమైంది.

ఫలానా వాళ్లింట్లో నందివర్ధనం చెట్టుంది - ఇదో ప్రత్యేకత! ఫలానా వాళ్లది డాబా ఇల్లు - ఇదీ ఓ ప్రత్యేకతే! ఫలానా వాళ్లింట్లో కాఫీ బావుంటుంది - ఇదైతే ఓ ప్రత్యేకతా, గుర్తింపూ, గౌరవమూ, హోదా అన్నీ! ఆ ఆశతోనే అతిథులు తెల్లారేసరికి గడప ముందు వాలిపోతారు. స్నేహితులైతే, మాంచి కాఫీ కోసం మొహం వాచిన ప్రతిసారీ, ‘నిన్ను చూడాలనిపించి వచ్చామంటూ’... కాఫీమజిలీ కబుర్లు వినిపిస్తారు.

అవే పాలు, అదే పొడి, అంతే చక్కెర. కానీ, కొన్ని ఇళ్లలో అమృతాన్ని తలపిస్తుంది. కొన్ని కొంపల్లో కషాయాన్ని గుర్తుచేస్తుంది. అంతా, ఆ ఇల్లాలి చేతి మహత్తని అనుకోవాలి. ఇంతే ప్రత్యేకత, ఏ ఉత్పత్తికో ఉంటే - ‘జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌’ (జీయీ) వీరతాడు తగిలిస్తారు. అరకు కాఫీ మెడలో ఆ వరమాల ఎప్పుడో పడింది. ఓమోస్తరుగా, తిరుపతి లడ్డూకు సమానమైన హోదా అది.

మన్నెంలో మొనగాడు....

విశాఖ ఏజెన్సీలో, 1820 ప్రాంతంలో కాఫీ ప్రస్థానం మొదలైంది. మొదట్లో గిరిజనులు పెరటి పంటగా పండించుకునేవారు. కాఫీ గింజల్ని చిల్లరగా సేకరించి టోకున అమ్ముకోడానికి దళారి వ్యవస్థ పుట్టుకొచ్చింది. లాభాల రుచి మరిగాక... జైపూర్‌ సంస్థానాధీశులు పాచిపెంట, అరకు, పాడేరు తదితర అటవీ ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో రాఘవేంద్రరావు అనే అధికారి ఉండేవారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలోని వివిధ ప్రాంతాలు కాఫీ పంటకు అనుకూలమంటూ ప్రభుత్వానికి నివేదిక పంపింది ఆయనే. ఆ జాబితాలో అరకు కూడా ఉంది. ఆతర్వాతే, సర్కారూ ఇటువైపు దృష్టిపెట్టింది. ఆయన పేరు మీదే, చింతపల్లిలోని ఎస్టేట్‌కు ఆర్‌వీనగర్‌ కాఫీ ఎస్టేటుగా పేరొచ్చింది. స్వాతంత్య్రం తర్వాత రాష్ట్ర అటవీశాఖ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కాఫీబోర్డుతో కలసి కాఫీ సాగును ప్రోత్సహించే ప్రయత్నం మొదలుపెట్టింది. 1960లో అనంతగిరి, మినుములూరు ప్రాంతాల్లో నాలుగు వేల హెక్టార్లలో కాఫీ సాగును చేపట్టింది. మెల్లమెల్లగా పంట పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాలకూ పరిచయమైంది. 1986లో కాఫీబోర్డు, గిరిజన సహకార సంస్థ సంయుక్తంగా తోటల విస్తరణకు నడుంబిగించాయి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో... కాఫీబోర్డు అధీనంలోని తోటల్ని గిరిజన రైతులకు రెండేసి ఎకరాల చొప్పున పంపిణీ చేశారు. అప్పట్లో, అదో సంచలనం!

‘నాంది’ ప్రస్థానం...

మొత్తానికి... గిరిజనానికి కాఫీ గింజల్ని పండించడమంటూ తెలిసింది కానీ, ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద మాత్రం పెద్దగా అవగాహన రాలేదు. దీంతో గింజ నాణ్యత దెబ్బతింది. దిగుబడి తగ్గింది. రాబడి నామమాత్రమైంది. రైతు కుదేలైపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే నాంది ఫౌండేషన్‌ ఆ ప్రాంతంలో కాలుపెట్టింది. విద్య, జీవనోపాధి - ఆ స్వచ్ఛంద సంస్థ జంట లక్ష్యాలు. చిన్న, సన్నకారు గిరిజన రైతుల పరస్పర సహకార సంఘం ద్వారా... ఆరువందల గ్రామాల్లోని పదకొండు వేలమంది రైతుల్ని ఓ ఛత్రం కిందికి తీసుకొచ్చింది. ఆ సమైక్యశక్తి ముందు దళారుల పప్పులు ఉడకలేదు. లోయ పచ్చగా ఉంటేనే, కాఫీ రైతుల జీవితం వెచ్చగా సాగిపోతుంది. పంటల కోసం హద్దూ అదుపూ లేకుండా వాడే క్రిమిసంహారకాలు ప్రకృతిని వికృతంగా మార్చే ప్రమాదం ఉందని నాంది పసిగట్టింది. పరిష్కారంగా సేంద్రియ సేద్యాన్ని గిరిజనుల ముందుంచింది. రైతు రైతుగానే కాకుండా, ఓ వ్యాపారిలా ఆలోచించాలి. అప్పుడే, నాలుగు రాళ్లు వెనకేసుకోగలడు. ఆ ఆలోచనతోనే నాంది గిరిపుత్రులకు మార్కెటింగ్‌ పాఠాలు బోధించింది. కొత్త రకాల్ని పరిచయం చేసింది. కాఫీ పంటని ఒక్కోలా సాగుచేస్తే ఒక్కో రుచి వస్తుంది. కొన్నిజాతుల్ని పెద్దపెద్ద చెట్ల నీడలో పెంచితే, ఆ విత్తనాలకో ప్రత్యేకమైన పరిమళం అబ్బుతుంది. ఇలాంటి అనేక చిట్కాల్ని గిరిజనుల దాకా తీసుకెళ్లింది. అరకు తనకంటూ ఓ బ్రాండ్‌ నిర్మించుకోడానికి పరిపూర్ణ సహకారం అందించింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో, అనంతగిరి నుంచి కొయ్యూరు వరకూ మొత్తం పదకొండు మండలాల్లో... 1.52 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారిప్పుడు. మొత్తంగా, ఏడువేల టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతోంది.

అరకు కాఫీ ప్రత్యేకత అరకు కాఫీదే. రసాయనాల జాడే ఉండదు. ఇప్పటికే అరకు ప్రాంతంలో... ‘నాంది’ ఆధ్వర్యంలోని పరస్పర సహకార సంస్థ (మ్యాక్స్‌) ద్వారా సుమారు 600 మంది రైతులు తమ కాఫీ తోటలకు ‘సేంద్రియ ధ్రువీకరణ’ పొందారు. మన్నెంలోని మిగతా ప్రాంతాల గిరిజనులూ ఇదే బాటలో నడుస్తున్నారు. పాడేరు ఐటీడీఏ వీరి పొలాలకు కూడా ధ్రువీకరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, పెదబయలు ప్రాంతాల్లో రైతులు అరబికా కాఫీని పండిస్తుండగా... చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లో ఇతర రకాల్ని సాగుచేస్తున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ కొనుగోళ్లను చేపట్టింది. రైతుల నుంచి కొన్న గింజల్ని అంతర్జాతీయ మార్కెట్‌లో బహిరంగ వేలం వేసి, ఆ సొమ్మును బ్యాంకు ఖాతాల ద్వారా రైతులకు చెల్లించే పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోంది. ఇటలీ, దుబాయ్‌, స్విట్జర్లాండ్‌ వ్యాపారులు అరకు కాఫీని వేలంపాటలో పోటీపడి కొంటున్నారు. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో చిల్లర దుకాణాల్లో నేరుగా ఇన్‌స్టంట్‌ కాఫీని విక్రయిస్తున్నారు. రాబోయే పదేళ్ల కాలానికి... విశాఖ అటవీ ప్రాంతంలో రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టును చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

‘ఛాయ్‌వాలా’ మెచ్చిన కాఫీ...

ప్రధాని మోదీజీ కూడా అరకు కాఫీ అభిమానే! ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా, ఓ కప్పు రుచి చూడందే వెళ్లరు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ‘నేను అరకు కాఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటాను’ అని స్వచ్ఛందంగా ప్రకటించారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో అయితే, అరకు కాఫీ స్టాల్‌ దగ్గరే అంతర్జాతీయ అతిథులంతా పోగైపోయేవారు. ‘కాఫీ పే’ చర్చలన్నీ ఆ కమ్మదనాన్ని ఆస్వాదిస్తూనే. ‘ఇంత రుచికరమైన కాఫీ నేనెప్పుడూ తాగలేదు’ అంటూ కప్పు మీద కప్పు లాగించేశారు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బార్బియర్‌. ‘ఇలాంటి స్ట్రాంగ్‌ కాఫీ కోసమే ఇన్నేళ్లుగా వెదుకుతున్నా. నా అన్వేషణ ఫలించింది’ అని మురిసిపోయారు అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్‌ సుసాన్‌. అరకులో కాఫీ మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ, మూడొందల రకాల కాఫీ చాక్లెట్లను రుచిచూడవచ్చు. కాఫీతో తయారు చేసిన కేకులూ, పిజ్జాలూ, బర్గర్లూ అందుబాటులో ఉంటాయి. విశాఖ ఏజెన్సీలో పండుతున్న ‘అరబికా’ కాఫీ 2009-10 సంవత్సరం నుంచి వరుసగా ఐదుసార్లు ‘ఫైన్‌ కప్‌ ఆఫ్‌ కాఫీ’ అవార్డును సొంతం చేసుకుంది.

జీవితాలు మారుతున్నాయి...

పాడేరు ప్రాంతంలో, కాఫీ గింజలు అనేక జీవితాల్ని మారుస్తున్నాయి. ఒకప్పుడు పూట గడవడానికే కష్టంగా ఉన్న కుటుంబాలు... కార్లలో తిరుగుతున్నాయి. పూరిళ్లు మేడల అవతారం ఎత్తేస్తున్నాయి. ఒక్క మోదాపల్లి గ్రామంలోనే యాభై అయిదు కుటుంబాలు దారిద్య్రరేఖను దాటేశాయి. రైతులు వరి, సామలు, మొక్కజొన్న తదితర సంప్రదాయ పంటల్ని పండిస్తుంటారు. ఏడాదంతా కష్టపడినా ఎకరానికి నాలుగైదు వేలు మిగిలినా గగనమే. ఆ కాస్త సంపాదనతో ఏ రైతు అయినా ఎలా బతుకుతాడూ, కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడూ! కాఫీ పుణ్యమాని గిరిజనుల బతుకులు సాఫీగా సాగుతున్నాయిప్పుడు. మూడో సంవత్సరం నుంచే పంట మొదలైపోతుంది. ఇక, నలభై ఏళ్ల వరకూ నిశ్చింత! రకాన్ని బట్టి, ఎకరాకు నలభైవేల నుంచి యాభైవేల దాకా ఆదాయం వస్తుంది. మిరియాలు, మామిడి, నేరేడు మొదలైన అంతర పంటల ద్వారా వచ్చే రాబడి అదనం. ఆమధ్య, హుద్‌హుద్‌ తుపాను బీభత్సం కాఫీ రైతుల్నీ కష్టాలపాలు చేసింది. ప్రభుత్వ తోడ్పాటుతో ఆ నష్టాల నుంచి తొందరగానే కోలుకున్నారు.

మోదాపల్లి రైతు రాజారత్నం కాఫీ ద్వారా ఏటా రూ.4 లక్షల ఆదాయం కళ్లజూస్తున్నాడు. అంతర పంటగా మిరియాలు సాగు చేసి, మరో లక్షన్నర సంపాదిస్తున్నాడు. చక్కని ఇల్లు కట్టుకున్నాడు. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాడు. ఎర్రగుప్ప గ్రామానికి చెందిన తరడా అప్పలమ్మ పదేళ్ల క్రితం... పది రూపాయల కూలీ కోసం రోజంతా కష్టపడేది. ప్రభుత్వం కాఫీ సాగు నిమిత్తం ఆరెకరాలు కేటాయించడంతో దరిద్రమంతా వదిలిపోయింది. ఏటా రెండు లక్షల రూపాయల వరకూ ఆదాయం వస్తోంది. ఆమె కృషికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాన్ని అందించింది. గిరిజనుల్లో కృతజ్ఞతాభావం ఎక్కువ. తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన కాఫీసాగును కూడా అమ్మతల్లి పూజంత శ్రద్ధగా చేస్తారు.

అంతర్జాతీయం...

అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దాలన్న తొలి ఆలోచన రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ వ్యవస్థాపకుడు అంజిరెడ్డిది. ఆయన చొరవతోనే మిగతా దిగ్గజాలూ ఇటువైపు వచ్చారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ సహ- వ్యవస్థాపకుడు క్రిష్‌ గోపాలకృష్ణన్‌, సోమా ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ మాగంటి రాజేంద్రప్రసాద్‌, రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు చెందిన సతీష్‌రెడ్డి... ఈ నలుగురూ అరకు కాఫీ వీరాభిమానులే. ఆ రుచీ పరిమళమూ ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాకూడదని బలంగా విశ్వసించేవారే. ఆ అభిమానంతోనే అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. ‘భవిష్యత్తులో దాతృత్వానికి అర్థం మారబోతోంది. చేపను ఇస్తే ఓ పూట కడుపునింపగలం. చేపనుపట్టే గాలం ఇస్తే ఓ జీవితకాలం బతకడం నేర్పగలం - వగైరా సూక్తులకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. అదే ఓ వ్యాపార వ్యవస్థను నిర్మించడం ద్వారా ఏకకాలంలో వందల జీవితాల్నీ వేల జీవితాల్నీ మార్చగలం. అలాంటి ప్రయోగమే ఇక్కడ జరుగుతోంది’ అంటారు ఆనంద్‌ మహీంద్రా. అలా అని, ఒక్క పారిస్‌కే పరిమితం కావడం లక్ష్యం కాదు. న్యూయార్క్‌, టోకియో, స్విట్జర్లాండ్‌లలోనూ అరకు కాఫీ అడుగుపెట్టబోతోంది. కొలంబియన్‌, సుమత్రా తదితర ప్రసిద్ధ కాఫీ రుచులు గట్టిపోటీని ఎదుర్కోడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రపంచంలో కాఫీ అలవాటు ఉన్న ప్రతి దేశంలోనూ జెండా ఎగరేయాలన్నది ‘అరకు కాఫీ’ ఆలోచన. దేశీయంగానూ మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఇప్పటిదాకా కొడగు, చిక్‌మగళూరు లాంటి ప్రాంతాలే కాఫీకి పేరెన్నికగన్నాయి. ‘అరకు’ అడుగుపెట్టడంతో ఒకట్రెండు సంస్థల ఆధిపత్యానికి కూడా కాలం చెల్లినట్టే.

వ్యాపారవేత్తలు సామాజిక బాధ్యతగానే ‘ప్రాజెక్ట్‌ అరకు’ను భుజానికి ఎత్తుకున్నారు. దీని ద్వారా వచ్చిన లాభాన్నంతా విస్తరణకే వినియోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మొత్తం ఐదు రకాల అరకు కాఫీలు అందుబాటులో ఉంటాయి. అందులో ఓరకం ధర కిలోకు - ఏడు వేలు! వైన్‌ తయారీలో ఉపయోగించే టెక్నాలజీనే ఇక్కడా అనుసరిస్తారు. దీంతో నాణ్యత తిరుగులేని విధంగా ఉంటుంది. అరకు మట్టికో గొప్పదనం ఉంది. ఆ కారణంగానే, ఇదీ అని చెప్పలేని ఓ కొత్త పరిమళం కాఫీలో గుబాళిస్తుంది. ఆ ప్రత్యేకతనే యూఎస్‌పీ (యునీక్‌ సెల్లింగ్‌ ప్రపోజిషన్‌)గా తీసుకుని ప్రచారంలో దూసుకెళ్లాలన్నది ఆలోచన.

గిరిపుత్రుల శ్రమ....
దిగ్గజాల మద్దతు...
చక్కని మార్కెట్‌ వ్యూహం...

రంగు, రుచి, చిక్కదనం- లాంటి ఈ మూడు ప్రత్యేకతలూ ‘అరకు కాఫీ’ని అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలబెట్టడం ఖాయం.

మంచి కాఫీ లాంటి పరిణామమిది!

- యద్దనపూడి ఛత్రపతి
సహకారం: గురునాథ్‌, అనిల్‌
ఫొటోలు: గోపి

వధువు చేతి కాఫీ...

ఎంత అందంగా అయినా ఉండవచ్చు, ఎన్ని ఆస్తిపాస్తులకైనా వారసురాలు కావచ్చు. కాఫీ పెట్టడం రాకపోతే మాత్రం కష్టమే. టర్కీలో... కాఫీ కలపడం తెలియని అమ్మాయికి కొత్త కుటుంబంలో కలసిపోయే స్వభావమూ ఉండదని బలంగా నమ్ముతారు. ఫలానా అబ్బాయికి ఫలానా అమ్మాయి సరిపోతుందా, లేదా అన్నది నిర్ణయించే ముందు - అమ్మాయిని కాఫీ పెట్టి తీసుకురమ్మంటారు. ఆ రుచిని బట్టే దాంపత్య జీవితాన్నీ వూహిస్తారు. పెళ్లి తర్వాత కూడా, ‘మా ఆవిడ చేతి కాఫీ పరమచండాలంగా ఉంటోంది...’ అన్న ఫిర్యాదుతో కోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉందక్కడ.

యాక్‌... ఎంతోరుచి!

కొన్ని అంతే! తలుచుకుంటేనే డోకు వచ్చేస్తుంది. వూహించుకుంటేనే కంపరం పుట్టేస్తుంది. కానీ, ఒక్కసారి రుచి చూడగానే అపోహలన్నీ తొలగిపోతాయి. గతం గురించి ఆలోచించకుండా, వర్తమానాన్ని ఆస్వాదించేస్తాం, అప్రయత్నంగానే ‘ఆహా...’ అనేస్తాం! ఇండొనేషియాలో షివిట్‌ జాతికి చెందిన పిల్లికి కడుపునిండా కాఫీ గింజలు తినిపిస్తారు. గింజల్ని అది శుభ్రంగా జీర్ణించుకుని, మలరూపంలో విసర్జించాక ... ఆ వ్యర్థాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆరుబయట ఎండబెడతారు. దాంతో కాఫీపొడి తయారు చేసుకుంటారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కాఫీ రుచుల్లో ఇదొకటి.

పంచాయతీ!

త్తునిస్తుంది, గమ్మత్తుగా ఉంటుంది! ఆ పానీయాన్ని తాగాలా, వద్దా? తాగితే పుణ్యమా, పాపమా? - అన్న కోణం లోంచి అప్పట్లో చాలా చర్చే జరిగింది. చివరికి ఆ పంచాయతీ పోప్‌గారి దగ్గరికి వెళ్లింది. ఎంత గొప్ప తీర్పరి అయినా, పైపై వాదనలతో ఓ నిర్ణయానికెలా వస్తారు? సేవకులు ఓ కప్పులో వేడివేడి కాఫీ తీసుకొచ్చారు. నాలుక మీద పడగానే, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న అనుభూతి కలిగిందా పెద్దాయనకు. ‘నిస్సందేహంగా ఇది గౌరవనీయుల పానీయమే...’ అని తీర్పు ఇచ్చేశారు. అలా, కాఫీ వాటికన్‌లో కాలుపెట్టింది.

అందం+ఆనందం+ఆరోగ్యం

కాఫీపొడి చక్కని సౌందర్య సాధనం కూడా. పొడిచర్మంతో బాధపడేవారు రెండు చెంచాల డికాక్షన్‌లో కాస్తంత ఆలివ్‌నూనె కలిపి మర్దనా చేసుకుంటే, మంచి నిగారింపు వస్తుందని అంటారు. డికాక్షన్‌లో ఓట్స్‌, తేనె కలిపి పూసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. పాలూ నెయ్యీ కలిపి పూసుకుంటే ఒంటికి పేరుకుపోయిన చెత్తంతా వదిలిపోతుంది. బ్లాక్‌ కాఫీ బరువును తగ్గిస్తుందన్న ప్రచారమూ ఉంది. కాఫీ వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యల్ని దూరం చేస్తుందని కొన్ని అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి.

‘కాఫీ’ప్రెన్యూర్స్‌!

కాఫీని నమ్మినవాళ్లు ఎన్నటికీ చెడిపోరు. ఆ రెండక్షరాల మీద విశ్వాసంతోనే ‘కాఫీ డే’ కోట్ల రూపాయల వ్యాపారమై కూర్చుంది. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చి పన్నెండు వందల కోట్ల రూపాయలు సమీకరించుకుంది. అంకుర్‌గుప్తా, రోనక్‌కా పటేల్‌ అనే కుర్రాళ్లు ‘బ్రూ బెర్రీస్‌’ పేరుతో ప్రారంభించిన కాఫీ వ్యాపారం దాదాపు రెండొందల యాభై అవుట్‌లెట్లకు విస్తరించింది. ‘భారతీయులు కాఫీ అంటే ప్రాణమిస్తారు. కమ్మని కాఫీ దొరుకుతుందంటే, ఎంత దూరమైనా వచ్చేస్తారు. ధర గురించి అస్సలు ఆలోచించరు’ అంటారా మిత్రులు. కాఫీ సాగును పర్యావరణంతో ముడిపెట్టింది అర్షియా అనే యువతి. ఈ సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌ ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో కాఫీపంటను సాగుచేసే పద్ధతిని ప్రచారం చేస్తోంది. అర్షియా తన బ్రాండ్‌కు పెట్టుకున్న పేరు - ‘బ్లాక్‌ బజా కాఫీ’. కాఫీ తోటల్లో కనిపించే ఓ రకమైన పక్షి పేరు బ్లాక్‌ బజా.

స్ఫూర్తి ఖండాంతరాలకు...

రకులో చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో వస్తున్న మార్పులు ప్రపంచం దృష్టినీ ఆకర్షించాయి. అందులోనూ, నాంది ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాలు నెల్సన్‌ మండేలా మంత్రివర్గంలో పనిచేసిన జేనాయుడును చాలా ప్రభావితం చేశాయి. నాయుడి జేజమ్మ తెలుగువారే. తరాలక్రితం ఆమె కుటుంబం దక్షిణాఫ్రికాకు తరలివెళ్లింది. అరకు విజయాన్ని ఆయన అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, దక్షిణాఫ్రికాలో మరో అరకు ఉద్యమం మొదలైంది. కాఫీతో పాటూ ఇతర పంటలూ పండిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.