close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భూమ్మీద తొలి సూర్యోదయం అక్కడే..!

భూమ్మీద తొలి సూర్యోదయం అక్కడే..!

టీవల వెల్లింగ్టన్‌ నగరంలోని మా రెండో అబ్బాయి దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ అన్నీ తిరిగి చూశాం. పచ్చటి తివాచీ పరచినట్లుగా ఉన్న పచ్చిక మైదానాలూ వాటి మధ్యలో నిలువుగా బారులు తీరిన పైన్‌ వృక్షాలూ భూమిలోంచి ఉవ్వెత్తున ఎగసిపడే వేడినీటి బుగ్గలూ స్వచ్ఛమైన నీలిజలాలతో నిండిన సరస్సులూ వెండికొండలను తలపించే మంచు పర్వతాలూ అక్కడక్కడా చల్లారని అగ్నిపర్వతాలూ భూభాగానికి చుట్టూ జలహారం కట్టినట్లుగా ఉన్న పసిఫిక్‌ మహాసముద్రజలాలూ నీలి హారాన్ని తలపించే ఆ సాగర జలాల్లో అక్కడక్కడా పచ్చలు పొదిగినట్లుగా ఉండే దీవులతో అందానికే అందంలా అలరారుతుంటుందా దేశం.
బ్రిటిష్‌వారు ప్రపంచ జైత్రయాత్రలో భాగంగా 1840లో ఈ అందాల దేశంలోకి అడుగుపెట్టారు. అప్పటికి అక్కడ స్థానిక మావొరీ తెగ ప్రాబల్యమే ఎక్కువ. దీంతో ఆంగ్లేయులు మావొరీలతో పలు ఒప్పందాలు కుదర్చుకొని తమ వ్యాపారం కొనసాగిస్తూనే చివరకు ఆ దేశాన్ని తమ కాలనీగా మార్చుకున్నారు. అమెరికాలోని రెడ్‌ఇండియన్స్‌ మాదిరి కాకుండా మావొరీలు నేటికీ తమ ఉనికిని కాపాడుకుంటూ న్యూజిలాండ్‌ సమాజంలో ప్రముఖంగానే కొనసాగుతున్నారు. వీళ్ల భాషను అటియరోవా అని పిలుస్తారు.
ఇక్కడ భూకంపాలూ ఎక్కువే. ఏడాదిలో మూడువేల దాకా భూప్రకంపనలు నమోదవుతూనే ఉంటాయి. కానీ ఇవన్నీ రిక్టర్‌ స్కేలుమీద మూడు లోపే ఉంటాయి. కాబట్టి వాటి తీవ్రత తక్కువ. ఇక్కడి ప్రజలు ట్రాఫిక్‌ నిబంధనలను తు.చ.తప్పక పాటిస్తారు. అందుకే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

తొలి సూర్యోదయం!
గుంతలూ గతుకులూ లేని అక్కడి నున్నని రోడ్లమీద కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ క్షణం దృష్టి మరల్చితే కనుల ముందున్న సుందరదృశ్యం కనుమరుగు అవుతుందేమో అనిపించేంత అందంగా ఉంటాయక్కడి ప్రకృతి అందాలు. భూమ్మీద తొలి సూర్యోదయం కనిపించేది న్యూజిలాండ్‌లోనే. అందుకే నూతన సంవత్సర వేడుకలు మొదటగా న్యూజిలాండ్‌లోనే జరుగుతాయి.
ఆస్ట్రేలియా ఖండానికి ఆగ్నేయంగా పసిఫిక్‌ మహాసముద్రంలో రెండు ప్రధాన దీవులుగా ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంటుంది న్యూజిలాండ్‌. ఉత్తరం నుంచి దక్షిణానికి 1600 కిలోమీటర్లూ తూర్పు నుంచి పడమరకు 450 కిలోమీటర్ల నిడివితో ఉండే ఈ దేశం మొత్తం వైశాల్యం 2,68,680 చదరపు కిలోమీటర్లు మాత్రమే. విస్తీర్ణంలో కాస్త పెద్దదిగా ఉండే దక్షిణదీవిలో పర్వతాలూ స్థానిక వృక్షజాతులూ మంచుప్రవాహాలూ పచ్చికమైదానాలూ కనువిందు చేస్తుంటాయి. ఉత్తరదీవిలో అగ్నిపర్వతాలూ వేడినీటిబుగ్గలూ పెద్ద పెద్ద సరస్సులూ పచ్చిక మైదానాలూ మనల్ని మైమరిపిస్తాయి. ఎక్కడ చూసినా పశువులు స్వేచ్ఛగా మేస్తూ తిరుగుతాయి. దాహం వేసినప్పుడు అక్కడక్కడా ఏర్పాటుచేసిన నీటితొట్లలో నీరు తాగుతుంటాయి.

అగ్నిపర్వతలోయలో...
మా పర్యటనలో భాగంగా ఉత్తర దీవుల్ని ఎంపికచేసుకుని, అక్కడ చూడాల్సిన పర్యటక ప్రదేశాలను ముందుగానే నిర్ణయించుకుని బుక్‌ చేసుకున్నాం. దాంతో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పర్యటించగలిగాం. ముందుగా వైమాంగు అగ్నిపర్వతలోయను దర్శించాం. అక్కడ 1886 జూన్‌లో టరవేర అనే అగ్నిపర్వతం బద్దలయిందట. పెద్ద ప్రళయం సంభవించినట్లుగా బద్దలైన దీని పేలుడుకి ఏడు సరికొత్త బిలాలు ఏర్పడ్డాయి. నాలుగు గ్రామాలు నామరూపాలు లేకుండా కనుమరుగైపోయాయి. వనసంపద, వన్యప్రాణులు అంతరించిపోయాయి. ప్రపంచంలోనే అగ్నిపర్వతం పేలుడు కారణంగా రూపుదిద్దుకున్న భూ ఉష్ణ వ్యవస్థగా ఇది రికార్డు సృష్టించింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వేడి నీటి బుగ్గలు ఇక్కడ ఏర్పడ్డాయి. ఇన్‌ఫెర్నోక్రేటర్‌ అనే బిలం దగ్గర ఏర్పడిన నీలం సరస్సులోని నీరు దాదాపు 12 మీటర్ల ఎత్తున ఎగసిపడుతుంటుంది. ఈ లోయలో ఓ సరికొత్త జీవవైవిధ్యం చోటు చేసుకుంది. ఇటీవల కొన్ని అరుదైన మొక్కలూ వృక్షజాతులూ ఆ వేడి వాతావరణంలో పెరగడంతో మళ్లీ అక్కడ అడవులు రూపుదిద్దుకుంటున్నాయి. మేం ఆ లోయలోని వేడినీటి బుగ్గల్నీ రంగురంగుల నీళ్ల సరస్సుల్నీ అక్కడ నివసించే పక్షుల్నీ చూసి ఆనందించాం.
తరవాత వెయ్‌టోమో మిణుగురుల గుహ దగ్గరకు వెళ్లాం. చిమ్మచీకటితో నిశ్శబ్దంగా ఉండే ఆ గుహలో నదిలోని పడవలో ప్రయాణిస్తూ పైకి చూస్తే అమావాస్య చీకట్లో కనబడే నక్షత్రాల మాదిరిగా ఆ మిణుగురు పురుగులు కనువిందు చేశాయి.

రోటోరువ సరస్సులో...
తరవాత లేక్‌ టూర్‌కి పేరొందిన రోటోరువ ప్రాంతానికి వెళ్లాం. అక్కడ పెద్ద పెద్ద సరస్సులు ఆరు ఉన్నాయి. సరస్సు దగ్గరకు వెళ్లడానికి బస్సు ఎక్కాం. సరస్సు ఒడ్డుకు వెళ్లాక దిగాలేమో అనే అంతా అనుకున్నాం. కానీ అది నేరుగా సరస్సులోకి దిగిపోయింది. అందరం ఉలిక్కిపడి కేకలు పెట్టాం. కానీ ఆ బస్సు ఆగకుండా మరింత లోతుగా నీళ్లలోకి వెళ్లిపోతోంది. అంటే ఆ బస్సు నీళ్లలోకి దిగగానే పడవలా మారిపోయే బస్సన్నమాట. రోడ్డుమీద చక్రాలతోనూ నీళ్లలోకి దిగగానే పడవ మాదిరిగా తేలుతూ ప్రయాణిస్తుంది. ఆ విధంగా మూడు సరస్సుల్లో తిప్పి తీసుకొచ్చారు. వూహించని ఈ సరదా అందరినీ ఆనందంలో ముంచెత్తింది.
అక్కడనుంచి హాబిటన్‌గా పిలిచే సినిమా షూటింగ్‌ సెట్‌ దగ్గరకు వెళ్లాం. 1998లో పీటర్‌ జాక్సన్‌, న్యూలైన్‌ సినిమా సంస్థతో కలిసి నిర్మించిన ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ అనే సినిమాకోసం అనువైన స్థలంకోసం ఏరియల్‌ సర్వే చేశారట. అప్పుడు అలెగ్జాండర్‌ అనే భూస్వామికి చెందిన 1250 ఎకరాల అందమైన గొర్రెల క్షేత్రం కనిపించిందట. దాంతో అక్కడ మొత్తం 39 హాబిట్‌ హోల్స్‌ నిర్మాణాలను చేపట్టారు. సెట్‌కు అవసరమైన ఓ పెద్ద ఓక్‌ వృక్షాన్ని సమీప ప్రాంతం నుంచి నరికి తీసుకొచ్చి అక్కడ నాటారు. అది అక్కడ మొలిచిన సహజ వృక్షమే అని భ్రమించేలా దాన్ని తీర్చిదిద్దారు. తైవాన్‌ నుంచి కొన్ని కృత్రిమ ఆకులు కూడా తీసుకొచ్చి అమర్చారట. తీరా అంతా అయిపోయిందనుకున్న సమయంలో దాని ఆకుల రంగు అక్కడి అదే జాతి చెట్ల ఆకుల రంగు కంటే భిన్నంగా ఉందని గ్రహించి మళ్లీ ఆకులన్నింటికీ సరైన రంగును స్ప్రే చేయించి దాన్ని సహజ చెట్టుగా రూపొందించారు. దాన్ని చూసినవాళ్లెవరూ అదో కృత్రిమచెట్టు అని అనుకోలేరు. దాంతో ఈ సెట్‌ పర్యటకులకు ఓ అద్భుత ఆకర్షణగా మారి, నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

నీలాకాశం!
ఉత్తర దీవిలోని ఉత్తరకొననే బే ఆఫ్‌ ఐల్యాండ్స్‌ అంటారు. సుమారు 260చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ తీరంలో మొత్తం 144 దీవులు ఉన్నాయి. 1769లో తొలి యూరోపియన్‌ కెప్టెన్‌ జేమ్స్‌ కుక్‌ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయనే ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టాడట. ఆయన తరవాత ఆంగ్లేయులు న్యూజిలాండ్‌లో తొలిసారిగా కాలుమోపిన ప్రదేశం ఇదే. స్థానిక మావొరీ నేతలతో కీలకమైన వైతాంగి ఒప్పందం కుదుర్చుకున్నది కూడా ఇక్కడే. గతంలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో బ్రెజిల్‌ రాజధాని నగరం రియో డి జనేరో వద్ద కనబడే ఆకాశం బాగా నీలం రంగులో ఉంటుందట. ఆ తరవాత బే ఆఫ్‌ ఐలాండ్స్‌లో మాత్రమే ఆకాశం అంత నీలంగా కన్పిస్తుందట.
ఇక్కడ పర్యటకుల్ని ఆకట్టుకునే అంశాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి పసిఫిక్‌ జలాల్లో ఓడలో ప్రయాణించడం వింత అనుభూతిని అందిస్తుంది. ఓడ చుట్టుపక్కల డాల్ఫిన్‌లు ఎగురుతూ మనకు అంతులేని వినోదాన్ని కలిగిస్తాయి. సముద్రంలో చాలా దూరం ప్రయాణించాక ఓడ పట్టేంత పెద్ద రంధ్రం ఉన్న ఓ కొండ కనిపిస్తుంది. మనం చూస్తుండగానే ఓడ అందులో దూరి మరో పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు అంతా ఆనందంతో కేకలుపెట్టాం. అక్కడి నుంచి కేప్‌ రియంగాకు బస్సులో బయలుదేరాం. మేం ఎక్కిన బస్సు ‘90 మైల్‌ బీచ్‌’ గుండా ప్రయాణించింది. సముద్రజలాలను తాకుతూ బస్సు అంత దూరం ప్రయాణించడం భలే వింత అనుభూతిని కలిగించింది. కేప్‌ రియంగాకు చేరుకునే ముందు పర్యటకులకు చిన్న ఆటవిడుపు ఉంటుంది. అక్కడ నిట్టనిలువుగా ఉండే ఇసుక గుట్టలమీదకు ఎక్కి చిన్న చెక్క సాయంతో దానిమీద పడుకుని కిందకి జారాం. ఇదయ్యాక కేప్‌కు చేరుకున్నాం. అక్కడ ఓ లైట్‌ హౌస్‌ ఉంది. దానిమీద నిలబడి చూస్తే కనుచూపు మేర నీలాకాశం, పసిఫిక్‌ మహాసముద్రం కలగలసిపోయి అనంతంగా కనబడుతుంటుంది. అక్కడ నుంచి ప్రపంచంలోని ఇతర నగరాలకూ ముఖ్య ప్రాంతాలకూ ఎంతెంత దూరమో తెలిపేలా రాసిన బోర్డులు ఉన్నాయక్కడ.

2500 ఏళ్ల కవొరీ చెట్టు!
కేప్‌ నుంచి తిరుగు ప్రయాణంలో టానె మహుటా అనే కవొరీ జాతి చెట్టు ఉండే అడవికి తీసుకెళ్లారు. మావొరీ భాషలో టానె మహుటా అంటే ‘లార్డ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌’ అని అర్థమట. ఈ అడవిలోని కవొరి చెట్లు అతి పురాతనమైనవి. వీటిలో ఓ చెట్టు వయసు ఎంతో సరిగ్గా తెలీదుగానీ అది 168 అడుగుల ఎత్తు ఉంది. దీని వ్యాసం ఐదుమీటర్లు. ఆధునిక పరీక్షల ద్వారా దీని వయసు 1250-2500 ఏళ్ల మధ్యలో ఉంటుందని అంచనా వేశారు. ఇలాంటి చెట్లు అనేకం ఉన్నాయక్కడ.
తరవాత న్యూజిలాండ్‌లోనే అతి పెద్ద నగరమైన ఆక్లాండ్‌ను సందర్శించాం. ప్రేమికుల నగరంగా భావించే దీన్ని మావొరీలు టమాకీ మకౌరా అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన పది నగరాల్లో ఆక్లాండ్‌ది మూడోస్థానం. ఈ నగరంలో అనేక చారిత్రక కట్టడాలూ పురావస్తు ప్రదర్శనశాలలూ పూలతోటలూ ఉన్నాయి. వీటితోబాటు ఇక్కడ తప్పక చూడదగ్గవి స్కై టవర్‌, సీ లైఫ్‌ ఆక్వేరియం. నగరానికి ఓ సంకేతంగా మారిన ఈ స్కై టవర్‌ ఎత్తు 328 మీటర్లు. దీన్ని భూకంపాల్ని తట్టుకునేలా నిర్మించారు. ఇక్కడ నుంచి గాల్లోకి దూకి విన్యాసాలు చేస్తుంటారు. పై అంతస్తులో రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ కూడా ఉంది. దీని పైకి ఎక్కితే ఆక్లాండ్‌ నగరం మొత్తం కనిపించింది. తరవాత ఆక్వేరియంకు వెళ్లాం. ఆక్వేరియం మధ్యలోంచి వెళ్తుంటే చుట్టూ సొరచేపలు, తిమింగలాలు, త్రిభుజాకారంలో తోక ఉన్న చేపలు, స్టార్‌ చేపలు, సీహార్స్‌లు... ఇలా విభిన్న సముద్రజీవులు కనువిందు చేశాయి. అక్కడే మంచుగడ్డలతో హిమ వాతావరణాన్ని ఏర్పాటుచేసి పెంగ్విన్‌లను కూడా పెంచడం ఆశ్చర్యం కలిగించింది. వాటిని అంత దగ్గరగా చూసినప్పుడు ఒకలాంటి వింత అనుభూతి కలిగింది. అవన్నీ చూసి వెల్లింగ్టన్‌కు తిరిగిరావడంతో మా న్యూజిలాండ్‌ ఉత్తర దీవుల యాత్ర ముగిసింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.