close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కళ్యాణమస్తు

కళ్యాణమస్తు
- నామని సుజనాదేవి

రోజు బైక్‌ టైర్‌ పంక్చర్‌ కావడంతో ఆఫీసుకెళ్ళడానికి సిటీ బస్సు ఎక్కాడు శివసాయి. అతను వెనుక నుండి ఎక్కుతుండగా, ముందునుండి ఒక వృద్ధురాలు రెండు చేతుల్లో రెండు బరువైన సంచులతో ఎక్కడం చూశాడు. అసలు నిలబడటానికి స్థలంలేని ఆ బస్సులో, ‘పాపం... అంత వయసున్నావిడ ఎలా నిలబడుతుందో’ అనుకున్నాడు- తన సహజ సిద్ధమైన దయార్ద్ర హృదయంవల్ల. మెల్లగా కదులుతూ బస్సులో కొంచెం ముందువైపుకొచ్చాడు. ఇంతలో సీట్లో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి, లోనికి నెట్టుకురాలేక అవస్థపడుతున్న ముసలావిడను చూసి, తాను లేచి ఆ సంచులు అందుకుంటూ ‘‘ఇక్కడ కూర్చోమ్మా’’ అంటూ తన సీటు ఆవిడకిచ్చింది. అసలే ఉక్కపోతలో రష్‌గా ఉన్న బస్సులో అలా సీటు త్యాగంచేసిన వారెవరా అని కొంచెం పరీక్షగా చూశాడు శివ. మరుక్షణం ఆమె అందానికి వివశుడయ్యాడు. దివి నుండి భువికి విహారార్థమై వచ్చిన దేవకన్యలా ఉంది. ‘బహుశా ఆమె దిగుతుందేమో, అందుకే సీటు ఇచ్చి ఉంటుంది’ అనుకున్నాడు. కానీ, అతని అంచనాలను తలకిందులు చేస్తూ అలాగే సీటును ఆనుకుని నిలబడిన ఆమెను చూస్తూ ‘ఆమెలాగే ఆమె మనసూ అందమైనదే’ అనుకోకుండా ఉండలేకపోయాడు. బస్సులో ఉన్నంతసేపూ సభ్యత కోసం అటూ ఇటూ చూపు మరల్చుతూనే ఆమెనే గమనిస్తూ ఉండిపోయాడు. ఇంతలో దిగాల్సిన స్టేజీ వచ్చి దిగడం, అతన్ని చూసి ఆగిన కొలీగ్‌ వెహికల్‌పై ఆఫీసుకెళ్ళిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
‘‘సాయి... తను ‘త్రైలోక్య’. కొత్తగా మీ డిపార్ట్‌మెంటుకి అప్పాయింట్‌ అయిన అసిస్టెంట్‌. ఇతను ‘శివసాయి’, మీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌’’ మేనేజరుగారు పరస్పరం పరిచయం చేస్తుంటే, చేతులు జోడిస్తున్న ఆమెను విభ్రాంతిగా చూస్తూ,
‘‘వెల్‌కమ్‌ టు అవర్‌ బ్రాంచ్‌ అండ్‌ అవర్‌ డిపార్ట్‌మెంట్‌... బెస్టాఫ్‌ లక్‌’’ అంటూ చేతులు జోడించాడు.
కారణం... ఆమె బస్సులో చూసిన అమ్మాయే!
‘‘థాంక్యూ’’ చిన్నగా మనసు దోచేలా నవ్వుతూ కదిలిందామె.
కళ్ళు చెదిరే అందమే కాదు... మృదు గంభీరంగా ఉన్న కంఠస్వరం, హుందాగా ఉన్న అలంకరణ, తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం... ఇవన్నీ శివని మంత్రముగ్ధుణ్ణి చేశాయి. అలాగని ఎవరినైనా అలాగే చూసే తుంటరి సాయి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నిజానికి ఎక్కడైనా అమ్మాయిల వెనుక అబ్బాయిలు పడతారు, కానీ ఇక్కడ శివ మనస్తత్వం, అలవాట్లు, అందం అన్నీ అమ్మాయిలను ఆకర్షించి, వారినే ప్రపోజ్‌ చేసేలా ప్రోత్సహించినా, శివ ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ఎవరికీ చనువివ్వలేదు. ఆఫీసులో అందగాడు, వినయశీలి, హార్డ్‌వర్కర్‌, ఇంటలిజెంట్‌ కావడంతో అందరికీ అతనంటే అభిమానం, గౌరవం. కానీ, అతను మాత్రం పనిని తప్ప దేన్నీ పట్టించుకోడు. అలాంటి శివ త్రైలోక్య రాకతో ఒకింత డిస్టర్బ్‌ అయ్యాడు.
‘అసలు ఇలాంటి సీనులన్నీ సినిమాల్లోనే కనబడతాయి. లేకపోతే, తన బైక్‌ ఈరోజే ఏల పంక్చర్‌ కావలె... అయినదిపో, తానేల ఆ బస్సులోనే ఎక్కవలె... ఎక్కెను పో, ఆవిడ కరుణా హృదయంతో తన మనస్సేల దోచవలె... దోచినది పో, తన ఆఫీసులో తన డిపార్ట్‌మెంటుకి ఏల రావలె. వచ్చెను పో, ఎదురుగా ఏల ఆసీనురాలు కావలె... తన మనస్సేల దొంగిలించవలె. అయ్యహో... ఇది పరిష్కారము చేయకున్న తన ఆఫీసు పనులన్నియు శూన్యము... శూన్యము... శూన్యము... అయ్యబాబోయ్‌, ఇంతందాన్ని ఎదురుగా పెట్టుకుని నిగ్రహంగా ఆమెను చూస్తూ ఎలా పనిచేయగలడు...’ నిజానికి శివ అలా భయపడినా ‘వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌’ అనే అతని గుణం కొంతవరకూ అతని వర్క్‌ విషయంలో ఏ ఆటంకం రాకుండా చేసింది. కానీ, వచ్చిన చిక్కంతా రాత్రయితేనే! ఆఫీసులో ఉన్నంతసేపూ ఆఫీసు పని ఒత్తిడిలో, ఆమెతో కలిసి పనిచేయడంలోని ఆనందంతో క్షణాల్లా గడిచిపోయేది కాలం. ఇక రూమ్‌లో మరో కొలీగ్‌తో కలిసి ఉంటున్న శివ బాధ- రాత్రయితే వర్ణనాతీతమయ్యేది. ఆమె ఆలోచనల్లోపడి టవల్‌ చుట్టుకుని దానిపై నుండి డ్రాయర్‌ వేసుకోవటం, ఇంట్లో బామ్మకు ఉత్తరం రాయబోయి రామకోటిలా త్రైలోక్య పేరు రాయటం, స్టవ్‌పై కూరపెట్టి త్రైలోక్య ఆలోచనల్లో మునిగిపోయి మాడగొట్టడం, ఉండుండి ముసిముసిగా నవ్వుకోవడం... ఈ వాలకాన్నంతా చూసి శివ ప్రేమలోపడిన విషయం తేల్చి చెప్పి ‘ఎవరా అదృష్టవంతురాలు?’ అని అడిగేశాడు రూమ్మేట్‌.
దానితో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. అయినా ఎంతకాలం ఇలా... అర్థంకాలేదు. రోజూ ఆఫీసులో- ఆమె ఇమ్మీడియట్‌ బాస్‌ అతనే కావడంతో మిగతా అందరికన్నా అతనితోనే ఎక్కువ మాట్లాడేది. కానీ, ఆమె పర్సనల్‌ విషయాలు ఎప్పుడూ మాట్లాడేదికాదు. ఎన్నోసార్లు తన ప్రేమ వ్యక్తపరచాలనుకుని ఈమాత్రం స్నేహమైనా లేకుండా చేసుకున్నట్లవుతుందేమోనని భయపడ్డాడు.
ఆఫీసుకి పొరపాటున ఒక్కరోజు రాకపోయినా పిచ్చెక్కిపోయేది. ఏదో ఆఫీసు పనిమీద ఫోన్‌ చేసినట్లు చేసి, ఆమె క్షేమమేనని తెలుసుకునేవాడు.
రోజూ సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళిపోయాక ఆమె సీట్లో ఒకసారి అలా కూర్చునేవాడు. అంత అందాన్ని పొదువుకున్న ఆ కుర్చీదెంత అదృష్టమని అసూయపడేవాడు. అప్పుడప్పుడు ఆమె పెదాలను తాకే ఆమె పెన్నుని అపురూపంగా దాచుకునేవాడు. తెల్లవారి ఆమె తన పెన్ను కోసం చూస్తే, తనది కొత్త పెన్నిచ్చేవాడు. ఆమె జడ నుండి జాలువారిన పువ్వు మొదలుకొని, ఆమె బ్యాగ్‌ నుండి నేలరాలిన బొట్టుబిళ్ళల ప్యాకెట్‌ వరకూ అన్నీ అపురూపంగా దాచుకున్నాడు.
ఆరోజు ఆఫీసులో పని బాగా ఉండటంతో నెలాఖరు రోజు కావటంతో తప్పనిసరై రాత్రి వరకూ ఉండిపోయారు- శివ, త్రైలోక్యలు. నిజానికి మరో అసిస్టెంట్‌ రమేశ్‌ ఆరోజు రాకపోవటంతో వర్క్‌ను చూసి త్రైలోక్యనే ఉండిపోయింది. అటెండర్‌తో తెప్పించిన స్నాక్స్‌ ఆమె ముందుపెట్టి, తాను తింటూ సూటిగా అడిగాడు ఆమెను ‘‘మీతో ఒక విషయం చెబుతాను, ఏమీ అనుకోరు కదా...’’
‘‘విషయం తెలియనిదే ఎలా చెప్పను?’’
‘‘అంటే, ఒకవేళ ఆ విషయం నచ్చకపోయినా మన స్నేహం ఇలాగే సాగిపోతుందని మాట ఇవ్వాలి.’’
‘‘ఓకే... చెప్పండి.’’
‘‘నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను... మీ అభిప్రాయం..?’’
ఉలిక్కిపడింది త్రైలోక్య. ప్రేమ గురించి ఆమె వూహించింది. కానీ, ఎవరైనా ప్రేమిస్తున్నానంటారు. ఇతనేమిటీ... డైరెక్ట్‌గా పెళ్ళి అంటున్నాడు. నిజానికి ఆఫీసులో అతని గురించి అందరూ పాజిటివ్‌గానే చెప్పారు. వచ్చిన దగ్గర్నుండీ అతన్ని దగ్గరగా చూస్తుండటం వల్ల తనక్కూడా అతనంటే ఇష్టమేర్పడింది. రోజంతా అతని ధ్యాసే! ఎప్పుడెప్పుడు ఆఫీసుకొచ్చి అతన్ని చూద్దామా అనే... కానీ తన ఇంటి సంగతి?
‘‘ఒక కండిషన్‌. మీరు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటే నాతోపాటు నా పాపను స్వీకరించాల్సి ఉంటుంది’’ గంభీరంగా అంది.
‘‘పాపా..?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘ఆఁ... ఆలోచించుకుని చెప్పండి. సరేనంటే రేపు మా ఇంటికి తీసుకెళతాను... బై’’ అంటూ పనయిపోవడంతో వడివడిగా వెళ్ళిపోయింది.
షాక్‌ తిన్నాడు శివ. ఆమె మెడలో మంగళసూత్రాలుగానీ కాలికి మెట్టెలుగానీ లేవు. ఫ్యాషనయి మెట్టెలు పెట్టుకోలేదేమో... లోనికి వేసుకునే బంగారు గొలుసు మంగళసూత్రమేనేమో... పెళ్ళయి భర్త చనిపోయాడా... లేక విడాకులు తీసుకుందా... ఇంత చిన్న అమ్మాయికి ఇప్పటికే ఇన్ని అనుభవాలా..? రాత్రంతా ఎంత ఆలోచించినా, మనసు ఆమెను స్వీకరించడానికే మొగ్గు చూపింది. బహుశా అతని ఆదర్శభావాలు అందుకు కారణమేమో.
తెల్లవారి ఆఫీసుకు రాగానే విష్‌ చేస్తూ ‘‘ఎప్పుడు తీసుకెళతారు, మన... సారీ ‘మీ’ ఇంటికి’’ అంటూ కొంటెగా అడుగుతున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ- ‘‘బాగా ఆలోచించారా?’’ అంది.
‘‘అనుమానమా?’’
‘‘ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు.’’
‘‘ఒక్కోసారి ప్రశ్నలే సమాధానమవుతాయి.’’
అలా ఆ సాయంత్రం అతని బైక్‌పై కూర్చుని తన ఇంటికి తీసుకొచ్చింది త్రైలోక్య.
రాగానే హాల్లో కుర్చీలో కూర్చున్న ఒక వయసు మళ్ళినావిడను చూపిస్తూ ‘అమ్మ’ అని పరిచయం చేసి, ‘‘అమ్మా, ఇతను శివసాయి అని నా కొలీగ్‌’’ అంటూ పరస్పర పరిచయాలు చేసి, ఫ్రెషప్‌ అయి వస్తానంటూ అతన్ని అక్కడ కూర్చోబెట్టి ముందు కొన్ని మ్యాగజైన్‌లు వేసి లోనికెళ్ళింది.
‘‘ఎన్నో నోములు నోచి పూజలు చేయగా కడుపున పడింది మా అమ్మాయి. అందుకే నేను దానికి దాదాపు ఏ నానమ్మలాగానో ఉంటాను. ఇది పుట్టగానే వాళ్ళ నాన్న చనిపోయారు. ఎంతో కష్టపడి పెంచాను. వాళ్ళ నాన్నగారుంటే రాణిలా పెరగాల్సింది. కానీ, ఏ ముద్దూ ముచ్చటకూ నోచుకోలేదు’’ అంటూ, ‘‘అమ్మాయ్‌, పింకీ పొద్దుట్నుండీ ఏమీ తినలేదు. కాస్తంత బిస్కెట్లో ఏదో పెట్టి రా తల్లీ’’ అని, ‘‘మాది ప్రేమ వివాహం కావటంతో ఎటువైపువాళ్ళూ ఆదుకోలేదు. చిన్నప్పటి నుండీ కష్టాల్లోనే పెరిగింది. ఏదో... ఇప్పుడే కాస్తంత మెరుగయ్యాం’’ తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోతోంది త్రైలోక్య తల్లి పద్మావతి.
పాప కోసం ఆసక్తిగా చూస్తూ, ఆమె మాటలు వింటూ ఆ గదిని పరీక్షిస్తున్న అతను ఎదురుగా కనిపిస్తున్న అల్మారాలోని కర్చీఫ్‌లను చూసి భృకుటి ముడివేశాడు. ఎదురుగా ఉన్న అల్మారాలో ఒక్కో అరలో ఒక్కో వస్తువు చక్కగా సర్ది ఉన్నాయి.
ఒక అరలో బొట్టు, కాటుక, పౌడర్‌, దువ్వెన... మరో అరలో కర్చీఫ్‌లన్నీ వరుసగా మడతపెట్టి ఉన్నాయి. అందులో ఒక వరసలోనివన్నీ లేడీస్‌ కర్చీఫ్‌లు, మరో వరసలోనివన్నీ తెల్లటి పెద్ద కర్చీఫ్‌లు. ఎవరేమనుకుంటారోనని కూడా ఆలోచించకుండా ఒక్క ఉదుటున ఆ అర దగ్గరకొచ్చి అనుమానంగా తెల్ల కర్చీఫ్‌లను తెరిచి చూడసాగాడు. సందేహం లేదు. అవి తనవే. తన రూమ్మేటు కర్చీఫ్‌ల నుండి, తనవి గుర్తించడానికి ఫాబ్రిక్‌ పెయింట్‌తో ‘ఎస్‌’ అని ఇంగ్లీష్‌ అక్షరం అందంగా పెయింట్‌ చేశాడు. ఇవి అవే. అంటే, తన టేబుల్‌పై పెడితే పోయాయనుకున్నవి. తనకు కర్చీఫ్‌ తీసి తుడుచుకున్నాక సాయంత్రం అలా కుర్చీ హ్యాండిల్‌పై ఆరేయడం అలవాటు. పొద్దుట్నుంచీ అలా తుడుచుకుని సాయంత్రం ఆఫీసు పనివేళలు అయిపోయాక, మొహం కడుక్కుని, కర్చీఫ్‌తో తుడుచుకుని అది తడిగా అవుతుంది కనుక, కుర్చీ హ్యాండిల్‌పై ఆరేసేవాడు. అలా ఆరేసినవి అప్పుడప్పుడు పోతే... తాను- గాలికి కొట్టుకుపోయాయేమోనని పట్టించుకోకపోయేవాడు. మరి ఇవన్నీ ఇంత పదిలంగా ఇక్కడ ఉండటం ఏమిటీ?

ఇంతలో లోపల్నుండి క్రీమ్‌ కలర్‌ లంగా, జాకెట్‌లపై మెరూన్‌ కలర్‌ ఓణీతో, తలలో మల్లెల మాలతో, చేతిలో ఉన్న ట్రేలో స్వీట్‌, బూందీ, పళ్ళూ పట్టుకుని వచ్చింది త్రైలోక్య. రోజూ చుడీదార్‌లలో చూసి ఇప్పుడిలా చూస్తుంటే అచ్చ తెలుగింటి ఆడపడుచులా ఎంతో అందంగా అనిపించిందతనికి.
అతని చేతిలోని కర్చీఫ్‌లను చూసి దొరికిపోయిన దొంగలా తల వంచుకుంటూ ‘‘స్వీట్‌ తీసుకోండి’’ అంటూ ప్లేట్‌ అందించింది.
‘‘పాపను తీసుకొస్తున్నారనుకుంటే ఇవి తెచ్చారేంటీ..?’’
‘‘పాపా... ఏ పాపా?’’ అడిగింది పద్మావతి.
‘‘అదే, త్రైలోక్యగారి పాప... ఎంత వయసు?’’ అడిగాడు ఉత్సుకతతో. అసలు ఆమె ఒక బిడ్డ తల్లంటే ఎవరూ నమ్మరు.
‘‘భలే ఉన్నావు బాబూ...నా కూతురు పెళ్ళయినట్లు కనబడుతోందా? పెళ్ళేకాని అమ్మాయికి పాపెక్కడిది?’’ అడిగిందావిడ కాస్త కోపంగా.
‘‘మరి... పింకీ...’’
‘‘ఓ అదా... మా కుక్కపిల్ల. పెరట్లో కట్టేసిన మా కుక్కపిల్ల.’’
‘‘మరి... నాకు ఇంట్లో పాప ఉంది అన్నారే’’ అయోమయంగా అన్నాడు.
‘‘భడవా... భడవాని... ఎప్పుడూ అల్లరే... ముసలితనంలో బాల్యం వస్తుందని... నన్ను మా అమ్మాయి ‘నా పాపవి’ అంటుంది బాబూ... ఏమీ అనుకోకు. చెప్పాను కదా, ప్రేమ వివాహమైనందున నాకు మా అమ్మాయీ, దానికి నేనూ తప్పితే ఎవరూ లేరు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా, తను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నవుతానని చేసుకోవడం లేదు. ఎవరైనా దానితోపాటు నన్ను కూడా వాళ్ళతో ఉంచుకుంటానంటేనే చేసుకుంటానంటోంది. ఈ కాలంలో అలా ఎవరుంటారు బాబూ... కనీసం మీరైనా చెప్పండి. దీని మంకుపట్టుతో నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. నేనేమో బయట తిరగలేను. ఇదేమో నన్నొదిలి చేసుకోనంటోంది. ఎలా కుదురుతుంది’’ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అందావిడ.
త్రైలోక్య ఒక పక్కగా నిలబడి ఉండటంతో ఆమె ముఖంలోని భావాలు కనబడటంలేదు.
‘‘అమ్మకు చాదస్తం... మీరేం అనుకోకండి, తీసుకోండి’’ టీపాయ్‌ పైనున్న ప్లేట్‌ మళ్ళీ అతనికందిస్తున్న ఆమె, అమృతాన్ని పంచుతున్న మోహినిలా అనిపించిందతనికి.
‘‘నేను అందుకే వచ్చానండీ. మీకు ఇష్టమైతే, మీ త్రైలోక్యను నేను పెళ్ళిచేసుకుంటాను. మాతోపాటే మీరూ మీ దీవెనలూ కలకాలం మాకందిస్తూ మా ఇంట్లోనే ఉండాలి’’ అన్నాడు శివ.
‘‘బాబూ...’’ అంటున్న ఆమెతో-
‘‘దయచేసి అడ్డుచెప్పకండి. నాకు వెనకా ముందూ ఎవరూలేరు. ఇలా ఒక అనుబంధం కోసం ఎంత మొహంవాచి ఉన్నానో! ఇలా నా కోరిక తీరుతుంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది? కలో గంజో, కష్టమో సుఖమో మాతోపాటు మీరు... నాకూ తల్లిలేని లోటు తీరుతుంది.’’
‘‘నాకు చాలా సంతోషంగా ఉంది బాబూ. ఈ స్వీట్‌ తీసుకో. ఎన్నాళ్ళకు దేవుడు నా మొర ఆలకించాడు’’ సంతోషం పట్టలేకపోతోందావిడ.
అతని వెంట ముందు రూములోకొచ్చిన ఆమె చేయి అందుకుంటూ ‘‘దొంగపిల్లా... నన్నెంత ఉడికించావు’’ అన్నాడు.
‘‘ఇంతకాలం ఎవరొచ్చినా అమ్మ నాతోపాటే ఉంటుందంటే అయిష్టం వ్యక్తంచేశారు. నాకది ఇష్టంలేకే పెళ్ళి చేసుకోనన్నాను. మిమ్మల్ని చూశాక మనసు మిమ్మల్ని వదిలి రాననేది. ఒకరోజు మీరు మీటింగులో ఉన్నప్పుడు, ఏదో పేపర్‌ అవసరమై మీ డ్రాయర్‌ సొరుగు తీశాను. మీరు దాచిన నా పెన్నులు, తలనుండి రాలిన పూలు...మీ ఆరాధనను దృఢపరిచాయి. అంతకుముందే మీ కర్చీఫ్‌లను దాచుకునే నేను, ‘ఇద్దరం తోడుదొంగల’మని నవ్వుకున్నాను’’ నెమ్మదిగా అతనితో మధురస్మృతులు పంచుకుంది.
‘‘నిజంగా అయామ్‌ వెరీ లక్కీ... రేపే 116 కొబ్బరికాయల మొక్కు ఉంది వస్తావా తోడుగా’’ చిలిపిగా అతను అడుగుతుంటే,
‘‘ఆశ, దోశ... అప్పుడే జంటగా చేద్దామనే... నా మొక్కు నేనూ తీర్చాలిగా...’’ త్రైలోక్య నవ్వుతుంటే గుళ్ళొ జేగంటలు శుభప్రదంగా మ్రోగాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.