close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నచ్చినవాళ్లతో వెళ్లిపోవచ్చు

నచ్చినవాళ్లతో వెళ్లిపోవచ్చు

ప్రేమిస్తే ఒప్పుకోని పెద్దల గురించీ ప్రాణాలు తీసే కుల పంచాయతీల గురించీ చాలా కథలే విన్నాం. కానీ ‘నచ్చినవారితో వెళ్లిపోండి మీ బంధాన్ని పెళ్లిగా మేం మారుస్తాం’ అనే తెగలు కూడా మనదగ్గర ఉన్నాయి. అవే మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ నిమార్‌, అలీరాజ్‌పూర్‌, ఝాబువా జిల్లాల్లో ఉండే భిల్‌, భిలాలా తెగలు. ఏటా హోలీకి వారం రోజుల ముందు వీళ్లు భగోరియా మేళా పేరుతో సంబరాలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయి మీద గులాల్‌ని జల్లుతారు. ఆ అమ్మాయిక్కూడా అబ్బాయి నచ్చితే తిరిగి రంగుని జల్లుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి అక్కణ్నుంచి దూరంగా వెళ్లిపోతారు. తిరిగొచ్చాక వాళ్లిద్దర్నీ తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా భార్యాభర్తలుగానే గుర్తిస్తుంది. అందుకే ఈ మేళాని ‘సామూహిక స్వయంవరం’ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇందులో పాల్గొనే చాలా మంది యువతీయువకులు ముందుగా ప్రేమలో పడినవారే. ఆ విషయాన్ని ఇలా పెద్దల సమక్షంలో వెలిబుచ్చుతారు. ఇక, ముందుగా పరిచయంలేని వాళ్లు గులాల్‌ జల్లితే అమ్మాయి తనకి నచ్చకపోతే దాన్ని తుడిచేసుకుని పక్కకెళ్లిపోతుంది. కావాలంటే ఆ అబ్బాయి ఆ తర్వాత అమ్మాయి మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఆమె ఒప్పుకుంటే వచ్చే ఏడాది మేళాలో ఒకటి కావొచ్చు. ఇది ప్రేమ జంటలను కలిపే సంప్రదాయం అన్నమాట.

యజమానులు లేని దుకాణాలు

మిజోరాంలోని సెలింగ్‌ పట్టణంలో ఉన్న ఆ హైవేమార్గంలో కొండలూ అడవులూ వరి పంటలు తప్ప ఎక్కడా ఇళ్లు కనిపించవు. కానీ దార్లో అక్కడక్కడా కూరగాయలూ పండ్లూ పండ్లరసాల బాటిళ్లతో పాటు ఇతర అటవీ ఉత్పత్తుల్ని అమ్మే చిన్న దుకాణాలుంటాయి. కానీ దుకాణాల్లో మనుషులెవరూ ఉండరు. ఆయా ఉత్పత్తుల ధర మాత్రం పక్కనే ఓ అట్ట మీద రాసి ఉంటుంది. వాహనాల్లో అటువైపుగా వెళ్లేవారు ఈ దుకాణాల దగ్గర ఆగి కావల్సినవి తీసుకుని ధర ఎంతైతే అంత పక్కనున్న డబ్బాలో వేసి వెళ్లిపోతారు. సరైన మొత్తం చిల్లర లేకపోతే ఆ డబ్బాలోంచి తీసుకుంటారు కూడా. అక్కడి రైతులు అడవిలోనూ స్థానిక కొండల్లోనూ ఆయా కాలాల్లో దొరికే అటవీ ఉత్పత్తుల్ని సేకరించి వాటిని రోడ్డు పక్కన చెక్కబల్లమీద అమ్మకానికి పెట్టి తమ పొలాల్లో పనులు చేసుకోవడానికి వెళ్లిపోతారు. సాయంత్రం పని ముగించుకుని వచ్చి డబ్బాలోని డబ్బుని తీసుకెళ్తారు. ఈ ప్రాంతం పట్టణానికి 60-70 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి, తమకు దొరికే కొంచెం ఉత్పత్తుల్ని తీసుకుని అంతదూరం వెళ్లి అమ్ముకోలేరు. వాటికోసం రోజంతా దుకాణాల్లోనూ కూర్చోలేరు. అందుకే, ఈ పద్ధతిని ఎంచుకున్నారు. పూర్వం నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటివరకూ డబ్బులు వెయ్యకుండా దుకాణంలోని ఉత్పత్తుల్ని తీసుకెళ్లిన సంఘటనలు చాలా అరుదట.

అక్కడ హనుమంతుడిని పూజించరు

నుమంతుడిని తలుచుకుంటే చాలు, కష్టాలు తీరిపోతాయని నమ్ముతారు హిందువులు. కానీ ఉత్తరాఖండ్‌లోని ద్రోణగిరి గ్రామంలో ఎవరూ హనుమంతుడిని పూజించరు. బుటియా తెగకు చెందిన ఈ గ్రామస్థులు నిజానికి హిందువులే. హిందూ దేవతలందర్నీ పూజించే వీళ్లు ఆంజనేయస్వామిని మాత్రం ద్వేషిస్తారు. దీనికి వాళ్లు చెప్పే కారణమేంటంటే... త్రేతాయుగంలో రామ-రావణ యుద్ధం జరిగిన సమయంలో మూర్ఛిల్లిన లక్ష్మణుడిని బతికించడానికి సంజీవని మూలికను తెమ్మని హనుమంతుడిని పంపిస్తాడు రాముడు. కానీ, ద్రోణగిరి పర్వతంమీద ఉండే ఆ మూలిక ఏదో తెలియక పర్వత శిఖర భాగాన్ని పెకలించి తీసుకెళ్తాడు ఆంజనేయస్వామి. అయితే, విశిష్టమైన ఔషధగుణాలున్న వనమూలికలు దొరికే ద్రోణగిరి పర్వతాన్ని స్థానికంగా ఉండే బుటియా తెగ ప్రజలు దైవంలా కొలిచేవారట. కొండపైభాగంలో గుంతలా కనిపిస్తున్న ఆనవాలు దానికి సంబంధించిందే అంటారు వాళ్లు. ప్రాణాలను నిలబెట్టే ఔషధ మూలికలనూ తాము దైవంగా కొలిచే పర్వతాన్నీ తమకు కాకుండా చేశాడన్న ఆ కోపంతోనే అక్కడి ప్రజలు తరతరాలుగా ఆంజనేయస్వామిని ద్వేషించడం మొదలుపెట్టారు. అందుకే, హనుమంతుడిని పూజించడాన్నీ పిల్లలకు ఆ దేవుడి పేరు పెట్టడాన్ని కూడా గ్రామంలో నిషేధించారు.

జీవితాంతం పరాఠాలు ఉచితం

క్క పరాఠా... గంటలో ఆ మొత్తాన్నీ తినగలిగితే రూ.5,100 నగదుతో పాటు, జీవితాంతం మా హోటల్లో ఉచితంగా పరాఠాల్ని తినే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చు. ‘హిందుస్థాన్‌ స్పెషల్‌ పరాఠా’ పేరుతో హరియాణాలోని రోహ్‌తక్‌లో ఉన్న ‘తపస్య పరాఠా భండార్‌’ వినియోగదారులకు పెడుతున్న పోటీ ఇది. ‘ఇంత సులభమైన పోటీనా...’ అనుకుంటే మనం పొరబడినట్లే. ఎందుకంటే ఇది కిలో పిండితో చేసిన పరాఠా. అంటే... ఒక అడుగూ ఆరు అంగుళాల చుట్టుకొలతతో ఉండేంత పెద్దదన్నమాట. పర్లేదు ఓసారి ప్రయత్నిస్తాం... అనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు.


 

చిన్నారులకు ‘ప్రేమ’ నివాసం

చిన్న అనారోగ్యమని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఓ పాపకు అక్కడ వేరొకరికి ఇచ్చిన ఇంజక్షన్‌ ఇవ్వడంతో ఎయిడ్స్‌ సోకింది. మరో బాబుకి కడుపులో ఉండగానే తల్లి నుంచి ఆ వ్యాధి వచ్చింది. దానికితోడు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులూ దూరమై అనాథలుగా మారారు. హెచ్‌ఐవీ బారిన పడిన ఇలాంటి ఎంతోమంది పసివాళ్లని అక్కున చేర్చుకుని ఆలనా పాలనా చూస్తోంది ఆ సంస్థ.

యోలా ప్రేమ నివాసం... గుంటూరు జిల్లాలోని మాచవరంలో సెయింట్‌ ఆన్స్‌ మిషనరీ సంస్థ ఏర్పాటు చేసిన ఆశ్రమం ఇది. లోపలికి అడుగు పెడితే బుడి బుడి అడుగులు వేసే వారి దగ్గర్నుంచి 15 ఏళ్లకు పైగా వయసున్న పిల్లలు 70మందికి పైగా కనిపిస్తారు. విధి విచిత్రం ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ చావుబతుకులతో పోరాడుతున్నవారే. ఎవరో చేసిన తప్పులకు ఎయిడ్స్‌ బారిన పడిన చిన్నారులు వారంతా. కొందరికి తమకు ఆ వ్యాధి ఉందని తెలుసు. కానీ చాలామంది చిన్నారులకు తామెందుకు అక్కడున్నామో కూడా తెలియదు. వీరిలో కొందరికి తల్లిదండ్రులు ఉండగా, మరికొంతమందికి నా అన్నవాళ్లెవరూ లేరు.

ఇలా మొదలైంది
సెయింట్‌ ఆన్స్‌ సంస్థ మొదట 2006లో మాచవరంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ప్రారంభించింది. అయితే, సరిపడినంతమంది విద్యార్థులు లేకపోవడంతో కొద్దిరోజులకే పాఠశాల మూతపడింది. తర్వాత భవనాలన్నీ ఏ ఉపయోగం లేకుండా ఉండిపోయాయి. దాంతో వాటిని ఏదైనా మంచిపనికి ఉపయోగించాలని నిర్ణయించుకుంది పాలకవర్గం. అనాథాశ్రమాలైతే చాలానే ఉంటాయి కానీ హెచ్‌ఐవీ సోకిన చిన్నారులకు ఆశ్రయం ఇచ్చేవే తక్కువ. ఈ ఆలోచనతోనే అలాంటి పిల్లలకోసం ఆ భవనాల్లో ఆశ్రమాన్ని నడపాలనుకున్నారు. అలా 2011లో అయిదెకరాల స్థలంలోని పెద్ద భవనంలో అయిదుగురు పిల్లలతో లయోలా ప్రేమ నివాసం ప్రారంభమైంది. దీని గురించి విన్న పలువురు హెచ్‌ఐవీ సోకిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ వదిలేసి వెళ్లారు. తల్లిదండ్రులు ఎయిడ్స్‌తో చనిపోవడంతో అనాథలుగా మారిన వారి పిల్లలను బంధువులూ ఇక్కడికి తీసుకొచ్చి వదలడం మొదలుపెట్టారు. కొంతమంది పిల్లల్ని చూడ్డానికి బంధువులు నెలనెలా వస్తుంటారు. మరికొంతమంది పిల్లలకు ఆ అదృష్టం కూడా ఉండదు.
హెచ్‌ఐవీ సోకిన వాళ్లు ప్రాణాలతోనే కాదు, చాలాసార్లు సమాజంతో కూడా పోరాడాల్సిన పరిస్థితి. ప్రేమ నివాసం పిల్లల విషయంలోనూ అదే జరిగింది. ‘ఎయిడ్స్‌ రోగుల పక్కన కూర్చోవడం వల్లా వారితో కలివిడిగా ఉండటంవల్లా ఆ వ్యాధి అంటుకోదు...’ అని వైద్యులు చెబుతున్నా చాలామందికి ఇంకా ఆ భయం పోవడంలేదు. ఆ కారణంతోనే ఆశ్రమంలోని చిన్నారుల చదువుకీ ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. సంస్థ ప్రారంభించిన కొద్దిరోజులకే చదువుకునే వయసున్న పిల్లల్ని స్థానికంగా ఉన్న మండల పాఠశాలలో చేర్పించారు. కానీ అక్కడ చదువుతున్న మిగిలిన పిల్లల తల్లిదండ్రులు ‘వాళ్లు మా పిల్లల పక్కన కూర్చోవడానికి వీల్లేదంటూ’ గొడవకు దిగారు. దాంతో కొన్నాళ్లు అదో సమస్య అయింది. నెమ్మదిగా ఉపాధ్యాయులు వారికి అవగాహన కల్పించి ఒప్పించారు. అలా బాధిత చిన్నారులు బడిమెట్లు ఎక్కారు. ఆశ్రమం ఏర్పాటుచేసిన బస్సులోనే వీళ్లు బడికి వెళ్లొస్తారు. పిల్లలందరూ రోగులే కాబట్టి వారికి పోషకాహారం తప్పనిసరి. అందుకే, రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనాలతో పాటు, ఉదయం పాలూ గుడ్లూ పండ్లనూ సాయంత్రం రాగి జావ, బఠాణీలు, గుగ్గిళ్లనూ పెడతారు. దీనికోసం ఆశ్రమ స్థలంలోనే పప్పుధాన్యాలను పండిస్తున్నారు. ఇక్కడ చదువుతోపాటు, చిత్రలేఖనాన్ని కూడా నేర్పిస్తారు. పిల్లల్లో ఉత్తేజానికి యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివాటిని చేయిస్తారు.

కన్నీటి కథలెన్నో...
సిస్టర్‌ జయశీలతో పాటు మరో ఇద్దరు సిస్టర్ల పర్యవేక్షణలోనే మొత్తం ఆశ్రమం నడుస్తోంది. ‘నంద్యాలకు చెందిన ఓ చిన్నారికి ఐదేళ్ల వయసున్నప్పుడే తండ్రి హెచ్‌ఐవీతో చనిపోయాడు. తల్లికి కూడా అది సోకి మరో రెండేళ్లకు మరణించింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద పాపకు వ్యాధి లేకపోవటంతో బంధువులు చేరదీశారు. చిన్నపాపను వాళ్ల పెదనాన్న ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించారు. కారంపూడికి చెందిన ఆటోడ్రైవర్‌ నుంచి భార్యకు వ్యాధి సంక్రమించింది. గర్భిణిగా ఉన్న సమయంలో ఆమె మందులు వాడకపోవటంతో చిన్నారికి వ్యాధి సోకింది. బాబు పుట్టిన నాలుగేళ్లకే తల్లి చనిపోవడంతో తండ్రి ఆశ్రమంలో వదిలివెళ్లాడు... ఇలా ఇక్కడున్న ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ’ అంటారు సిస్టర్‌ జయ.
ప్రేమ నివాసంలోని పిల్లల్ని నెలకోసారి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తారు. రాత్రివేళ ఏదైనా అవసరమైతే ఈ పిల్లలకు అత్యవసర వైద్యం చేసేందుకు సిస్టర్‌ జయ ప్రత్యేకంగా శిక్షణ పొందారు కూడా. ఇక్కడి చిన్నారులు పదోతరగతి పూర్తయ్యాక బయట ఉండి ఇంటర్‌ విద్యను చదివేందుక్కూడా సంస్థ సహాయం చేస్తుంది. చదువుమీద ఆసక్తి చూపని పెద్ద పిల్లలకు టైలరింగ్‌లోనూ శిక్షణ ఇప్పిస్తారు. సెయింట్‌ ఆన్స్‌కు అనుబంధమైన సాస్‌ సంస్థే ప్రతినెలా ఆశ్రమ నిర్వహణకు అవసరమైన డబ్బుని సమకూరుస్తోంది. అప్పుడప్పుడూ దాతలు పిల్లలకు తోచిన సహాయం చేస్తుంటారు.
తల్లీతండ్రీ పక్కన లేకపోతేనే పసిపిల్లలకు ఎంతో కష్టం. అలాంటిది అనాథలుగా ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడటం అంటే ఇంకెంత బాధపడే విషయమో చెప్పనక్కర్లేదు. అలాంటి చిన్నారులను చేరదీస్తోన్న లయోలా ప్రేమనివాసాన్ని అభినందించకుండా ఉండగలమా..?!

- డి.నగేష్‌బాబు, ఈనాడు, గుంటూరు
చిత్రాలు: వెంకటేశ్వర్లు


మదరసాల్లో గాయత్రీ మంత్రం!

పేరుకి అవి మదరసాలే. కానీ వాటిలోనుంచి కలమాలతోబాటు ‘ఓం భూర్భువ స్సువః’... అన్న గాయత్రీ మంత్రం వీనులవిందుగా వినిపిస్తుంటుంది. లోపలకు వెళ్తే హిందూ ముస్లిం విద్యార్థులంతా కలసిమెలసి చదువుకుంటూ ఆడుకుంటూ కనిపిస్తారు... అదే మధ్యప్రదేశ్‌లోని మదరసా గురుకుల్‌ విద్యాపీఠ్‌, మదరసా జైన్‌ వర్థమాన్‌... వంటి పాఠశాలల ప్రత్యేకత!

తసామరస్యం గురించి ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప దానికోసం కృషి చేసేవాళ్ల సంఖ్య తక్కువ. పైగా రాజకీయ ప్రయోజనాలకోసం మత విద్వేషాల్ని పెంచేవాళ్లే ఎక్కువ. అందుకే మతసామరస్యమన్నది ఎప్పటికీ ఓ అసంపూర్ణ కలగానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంటుంది. కానీ మధ్యప్రదేశ్‌లోని మందసోర్‌ జిల్లాలోని మదరసాలను సందర్శించినప్పుడు అది నిజమయ్యే తీరుతుందనిపిస్తుంది. అంతేకాదు, చాలామందిలో మదరసాలమీద ఉన్న దురభిప్రాయమూ తొలగిపోతుంది.