close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తేలిపోతున్నాయ్‌

తేలిపోతున్నాయ్‌

‘అయ్యబాబోయ్‌ ఏం జరుగుతోంది ఇక్కడ... ఓ పక్క లైటు, మరో పక్క మొక్కల కుండీ, ఇంకోపక్క గ్లోబు అలా గాల్లో తేలిపోతున్నాయేంటీ...’ ఈ ‘ఫ్లోటింగ్‌ ఉఫో ల్యాంప్‌, ఎయిర్‌ బోన్సాయ్‌, ఫ్లోటింగ్‌ గ్లోబు’లను చూడగానే కొత్త వాళ్లెవరైనా ఇలా అవాక్కయిపోవాల్సిందే. ఇక్కడ కనిపించే లైటు కింది భాగంలో ఉన్న స్టాండు అయస్కాంత, విద్యుచ్ఛక్తిలతో పనిచేస్తుంది. దాంతో స్టాండ్‌కున్న బటన్‌ నొక్కగానే పైన గిన్నెలాంటి భాగం కొంత ఎత్తులో తేలుతూ వెలుగుతుంది. ఆఫీసు టేబుళ్ల మీద పెట్టుకునే గ్లోబుల్లోనూ అయస్కాంతంతో తేలేవి వస్తున్నాయి. ఎయిర్‌ బోన్సాయ్‌లు కూడా ఈ తరహావే. మొక్క మొదల్లో ఉండే ఇనుము కింద స్టాండ్‌లో ఉండే అయస్కాంత శక్తి కారణంగా ఈ మొక్కలు గాల్లో తేలతాయి. ఎంత విచిత్రం..!


పెనం రెండువైపులా

మినపరొట్టెకోసం పెనం మీద మందంగా పిండి వేసి మూత పెడతాం. ఒకవైపు వేగిన దాన్ని రెండోవైపు కాల్చేందుకు జాగ్రత్తగా తిప్పకపోతే ముక్కలైపోతుంది. ఇక, ఆలూ వేపుడూ, మాంసాహార వేపుళ్లలాంటివాటిక్కూడా రెండు వైపులా వేగేందుకు మాటిమాటికీ గరిటెతో తిప్పుతుండాలి. కానీ అలా ఎక్కువసార్లు కలిపితే ముక్కలు చితికి ముద్దగా అయిపోతాయి. అందుకే, ఇలాంటివాటికోసం ఇప్పుడు మార్కెట్లోకి ‘హ్యాపీ కాల్‌ డబుల్‌ పాన్‌’లు వస్తున్నాయి. పలుచగా వెడల్పుగా ఉండే ఈ పాన్‌లను ఫొటోలో చూపినట్లూ పైకీ కిందకూ ఎటు తిప్పైనా పొయ్యిమీద పెట్టొచ్చు. కాబట్టి, ఒకవైపు కాలాక రెండోవైపు తిప్పి పెట్టుకుంటే సరి.


స్ప్రే చేసేయొచ్చిలా...

బ్రెడ్లూ శాండ్‌విచ్‌ల మీదా పరాఠాల పైనా ఇంకా రకరకాల వంటకాల్లోనూ వెన్న వేస్తే ఉండే రుచే వేరు. కానీ ప్యాకెట్లలో దొరికే ఆ బటర్‌ ముక్కల్ని తురిమి లేదా చిన్న ముక్కలుగా కోసి వెయ్యడమే పెద్ద పని. అలాకాకుండా చేతికి అంటుకోకుండా కావల్సినంత మేర బ్రెడ్‌మీద మొత్తం పరుచుకునేలా వెన్నను స్ప్రే చెయ్యగలిగితే భలే ఉంటుంది కదూ... ఈ ఆలోచనతో టెక్సాస్‌కి చెందిన డగ్‌ ఫోర్‌మెన్‌ రూపొందించిందే ‘బీమ్‌ బటర్‌ స్ప్రేయర్‌’. దీన్లో కావల్సినంత సైజులో బటర్‌ ముక్కని పెట్టి బటన్‌ నొక్కితే చాలు, సులభంగా దాన్ని పదార్థాల మీద చల్లుకోవచ్చు. మీకూ కావాలంటే ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు.


జాకెట్‌... బ్యాగ్‌లా

స్టైల్‌ అనీ ఫ్యాషన్‌ కోసమనీ చలికాలం, వర్షాకాలాల్లో వెచ్చగా ఉండేందుకూ లెదర్‌ జాకెట్లు వేసుకుంటాం. అయితే, కాస్త మందంగానూ బరువుగానూ ఉండే ఆ జాకెట్లను రోజంతా ఒంటిమీద ఉంచుకోవాలంటే మాత్రం అంత సౌకర్యంగా ఉండదు. కాసేపు చేత్తో పట్టుకుందామంటే అదీ అసౌకర్యమే. ఈ సమస్యకు పరిష్కారంగా వస్తున్నవే ‘డ్యుయోకెట్‌ మ్యాజిక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌’ జాకెట్‌లు. అవసరమైనపుడు జాకెట్‌లా వేసుకుని వద్దనుకున్నపుడు బ్యాగ్‌లా మార్చుకోగలగడమే వీటి ప్రత్యేకత. అంతేకాదు, ఈ జాకెట్‌లో చిన్న చిన్న వస్తువుల్ని పెట్టుకునేందుకు వీలుగా చాలా జేబులు ఉంటాయి. కాబట్టి జాకెట్టుగా వేసుకున్నా బ్యాగులా పట్టుకున్నా అన్నిటినీ అందులో పెట్టేసుకోవచ్చు.


అంటించే హెడ్‌బోర్డులు

మంచం హెడ్‌బోర్డుల్ని పెద్దగా రకరకాల డిజైన్లలో చేయించుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇంట్లోని అన్ని మంచాలనూ ఆ తరహాలో చేయించుకోవాలంటే ఖర్చు ఎక్కువ. అద్దె ఇళ్లలో ఉండేవారు అటూ ఇటూ మారేటపుడూ ఇబ్బందే. అలా అని వదిలేయనక్కర్లేదు. ఈ హెడ్‌బోర్డు స్టిక్కర్లతో చిటికెలో మంచానికి ఆ అందాన్ని తెచ్చేయొచ్చు. చెక్క, ఇనుముతో చేసిన రకరకాల హెడ్‌బోర్డుల డిజైన్లతో వేరు వేరు రంగుల్లో దొరికే ఈ వాల్‌ స్టిక్కర్లను మంచం వెనుక భాగంలో అంటిస్తే తక్కువ ఖర్చుతో కావల్సిన అందం మన మంచం సొంతమవుతుంది.


పచ్చని అందం

‘టేబుల్‌ మ్యాట్‌లంటే ఎప్పుడూ అవేనా... కాస్త కొత్తగా ఇంకాస్త భిన్నంగా మరికాస్త అందంగా ఉండే మ్యాట్‌లు దొరకవెందుకనీ...’ ఇకమీదట మనం ఇలా బాధపడనక్కర్లేదు. ఎందుకో ఈ పచ్చగడ్డి మ్యాట్‌లను చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లాస్టిక్‌ గడ్డితో తయారు చేసిన ఈ మ్యాట్‌లు చూడ్డానికి అచ్చం మామూలు గడ్డిలా ఉండి అటు ఆహ్లాదాన్నీ పంచుతాయి, ఇటు అందంగానూ భిన్నంగా కూడా ఉంటాయి. పైగా గభాల్న తినేటపుడు ఏమైనా ఒలికినా టేబుల్‌ మొత్తం పాకదు. వీటిని శుభ్రపరచడం కూడా సులభమే. వీటిలో పళ్లానికి సరిపడా ఉండేవాటితో పాటు, టేబుల్‌ మధ్యలో పొడవుగా వేసేవీ టేబుల్‌ మొత్తానికి సరిపడా సైజులో ఉన్నవీ దొరుకుతాయి. ఈ పచ్చగడ్డి మ్యాట్‌లూ వాటిమీద అందంకోసం అమర్చిన రంగు రంగుల ప్లాస్టిక్‌ పూల వల్ల టేబుల్‌ కూడా ఇంట్లో ఓ అలంకరణ వస్తువైపోతుంది అనడంలో అతిశయోక్తి ఏముందీ..?


దానంతటదే నడిచే బైక్‌

బైక్‌ మీద దూసుకుపోవడం ఎంత సరదానో అదుపు తప్పి పడితే అంత ప్రమాదం కూడా. అంతెందుకు, దాన్ని ఆపి కాలు కిందపెట్టడం కొంచెం ఆలస్యమైతే చాలు, పక్కకు ఒరిగిపోతుంది. ముందుకు వంగి ఆ హ్యాండిళ్లను అలానే పట్టుకుని నడపడమూ కష్టమే. అలాకాకుండా దానంతటదే నిలబడే, నడిచే బైక్‌ వస్తే ఎంత బాగుంటుందో కదూ... అలాంటిదే హోండా కంపెనీ రూపొందించిన ఈ ‘రైడింగ్‌ అసిస్ట్‌’ బైక్‌. రొబోటిక్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ బండి ఆగి ఉన్నపుడు స్టాండ్‌ వెయ్యకపోయినా పడదు. అంటే రోడ్డు మీద వెళ్తున్నపుడు ఏదైనా అడ్డొచ్చి బ్రేక్‌ వేసినా అదుపు తప్పి పడిపోయే సమస్య తక్కువన్నమాట. ఇక, లాంగ్‌డ్రైవ్‌లలో బటన్ల సహాయంతో దీనికి సూచనలిచ్చి మనం హ్యాండిల్‌ పట్టుకోకుండా కూర్చున్నా తీసుకెళ్లిపోతుంది. పార్కింగ్‌లాంటివి చేసేటపుడైతే రిమోట్‌ సహాయంతో దానంతటదే మన వెనుక నడిచి వచ్చేలా చేయొచ్చు. కొత్తతరం కోసం డిజైన్‌ చేసిన ఈ కొత్త బైక్‌ని ఈమధ్య లాస్‌వేగాస్‌లో జరిగిన సీఈఎస్‌ షోలో ప్రదర్శించింది హోండా సంస్థ.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.