close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వారిద్దరికే తెలుసు...

వారిద్దరికే తెలుసు...

సారి ఆస్కార్‌ విజేతలెవరో తెలుసుకోవాలంటే ప్రపంచమంతా మరికొన్ని గంటలు వేచి చూడాలి. కానీ ప్రైస్‌వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ సంస్థకు చెందిన అకౌంటెంట్లు బ్రియాన్‌ కలినాన్‌, మార్తా రూయిజ్‌లకు మాత్రం వారెవరో ఇప్పటికే తెలుసు! ఆస్కార్‌ ఓట్లను పీడబ్ల్యూసీ లెక్కిస్తుంది. తుది ఓటింగ్‌ పూర్తయ్యాక విజేతల్ని ప్రకటించడానికి వారం ముందునుంచీ సంస్థకు చెందిన ఓ ప్రత్యేక బృందం మూడు రోజులపాటు ఈ ఓట్లను లెక్కిస్తుంది. బృంద సభ్యులందరికీ అన్ని ఓట్లూ ఇవ్వరు. వారు విడివిడిగా లెక్కించిన బ్యాలెట్లన్నింటినీ ఒక చోట చేర్చి బ్రియాన్‌, మార్తా మాత్రమే లెక్క సరిచూసుకుంటారు. అప్పుడే వీరికి విజేతల వివరాలు తెలిసిపోతాయన్నమాట. ఆపైన ఆ పేర్లను రెండు సెట్లుగా రాసి వాటిని విభాగాల్నిబట్టి వేర్వేరు సీల్డ్‌ కవర్లలో ఉంచి రెండు బ్రీఫ్‌కేస్‌లలో భద్రపరుస్తారు. బయటకు తెలిసే ఆస్కారం ఉంటుందని విజేతల పేర్లను కంప్యూటర్లలో టైప్‌ చేయరు, రికార్డుల్లో రాయరు కూడా! లాస్‌ ఏంజెలెస్‌లో అవార్డుల్ని ప్రకటించే రోజున బ్రియాన్‌, మార్తా చెరో బ్రీఫ్‌కేస్‌ పట్టుకొని స్టేజికి చెరోవైపు నిలబడి విజేతల్ని ప్రకటించడానికి స్టేజిపైకి వచ్చే వ్యక్తులకు విభాగాలనుబట్టి కవర్లని అందిస్తారు. అవార్డులు ప్రకటిస్తున్నంతసేపూ వారు అక్కణ్నుంచి క్షణం కూడా బయటకు వెళ్లరు. ఇదెంతో కష్టంతో కూడుకున్న పనే అయినా, దీన్నెంతో గౌరవంగా భావిస్తారు వారిద్దరూ!


ఈ ‘అమ్మఒడి’ ప్రభుత్వోద్యోగులది!

ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాల గురించి తెలుసు. కానీ ప్రభుత్వోద్యోగులు ఓ సంఘంగా ఏర్పడి అనాథ బాలల సంక్షేమానికి పూనుకోవడం కొత్త విషయమే. కడప జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం సొంతంగా నడుపుతున్న ‘మా అమ్మఒడి’ అనాథ శరణాలయం ఈ ముందడుగుకు సాక్ష్యం!
మాజం మనకేమిచ్చింది... అనే ఆలోచన చేసేవారు కొందరైతే, సమాజానికి మనమేం ఇస్తున్నాం... అనే ఆలోచన చేసేవారు మరికొందరుంటారు. అచ్చంగా రెండోకోవలోకే వస్తారు కడపజిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం సభ్యులంతా. నలుగురుగా మొదలుపెట్టి వేయి మందిగా మారి... మనసుండాలే కానీ పదిమందికి అన్నం పెట్టడం అనుకున్నంత పెద్ద పనికాదు అని నిరూపిస్తున్నారు. 58 మంది అనాథబాలలకు అన్నీ తామై అండగా నిలుస్తున్నారు.
తొలి అడుగులు...
‘సమాజంలో గౌరవమైన హోదా, భార్యా పిల్లలూ... ఇవన్నీ పొందేందుకు ఏదో ఒక రకంగా మనమంతా సమాజ సాయం పొందిన వాళ్లమే. ఇవేవీ అందుబాటులో లేని అభాగ్యులు చాలామంది ఉన్నారు. నిలువనీడ, కన్నవాళ్ల తోడు కూడా లేని పసిపిల్లలూ వీళ్లలో ఉన్నారు. వాళ్లకోసం మనమేదైనా చేస్తే బాగుంటుంది...’ మాటల సందర్భంలో కొందరు రెవెన్యూ అధికారులకు వచ్చిన ఆలోచన ఇది. ‘ఇంత కొద్దిమందిమి ఏం చేయగలం’ అన్న తర్జనభర్జనల తర్వాత ‘సొంతంగా కాదు... మనలాంటి ఉద్యోగులందరినీ ఈ ఆలోచనలో భాగస్వాములను చేద్దాం. ‘రెవెన్యూ ఉద్యోగుల సంఘం’ ఆధ్వర్యంలోనే ఓ అనాథశరణాలయం ఏర్పాటు చేద్దాం...అదెలా ఉండాలీ అంటే... అనాథలకు అమ్మఒడిలా... అవును దానిపేరు కూడా అదే పెడదాం ‘మా అమ్మఒడి’’... అన్న నిర్ణయానికి వచ్చారు. అలా, కడప రాధాకృష్ణనగర్‌లో ఓ చిన్నపాటి ఇంటిలో నలుగురు పిల్లలతో 2005 సంవత్సరంలో మొదలైంది ‘మా అమ్మఒడి’ అనాథశరణాలయం.
ఒక్కో మెట్టుగా...
దీన్ని ప్రారంభించినప్పుడు తమ దగ్గర ఉన్న అరకొర డబ్బులతో నెట్టుకొచ్చేవారు. కానీ అలా ఎక్కువ రోజులు నడపడం కష్టం అనుకుంటున్న తరుణంలోనే ఆ నలుగురికి మరో నలుగురు తోడయ్యారు. ఒక్క కడప జిల్లా కేంద్రంలోని రెవెన్యూశాఖ ఉద్యోగులకే కాదు మండలాలకీ, గ్రామాలక్కూడా అమ్మఒడి గురించి తెలిసింది. తామూ ఇందులో భాగస్వాములమవుతామని స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చారు. 2007లో ఆ జిల్లాకు సంయుక్త కలెక్టర్‌గా వచ్చిన గిరిజాశంకర్‌ కూడా ఇందులో భాగస్వాములవుతూ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వేయి మందికి పైగా ఉద్యోగులు భాగస్వాములుగా ఉన్నారు. తొలుత అంతా ఏడాదిలో తమ ఒకరోజు జీతాన్ని దీనికోసం ఇవ్వాలని పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకరోజు వేతనమే కాక ఎవరికి తోచినంత వారు ధన, వస్తురూపాల్లో సాయమందిస్తున్నారు. మొదట్లో ఫర్వాలేదనిపించినా కాలం గడిచేకొద్దీ పిల్లల వసతి ఇబ్బందిగా మారింది. అదే సమయంలో కడపజిల్లా కలెక్టరుగా శశిభూషణ్‌ కుమార్‌ వచ్చారు. ‘మా అమ్మఒడి’కి కడప శివారులో రాజంపేట రహదారి వెంట కొంత స్థలాన్ని కేటాయించారు. ఆ భవన నిర్మాణానికి పెన్నా సిమెంట్స్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లాంటి పెద్ద సంస్థలు చేయూతనిచ్చాయి. ప్రస్తుతం అక్కడ వివిధ వయసులకు చెందిన 58 మంది పిల్లలు ఉంటున్నారు.

చక్కని క్రమశిక్షణ
పిల్లలంతా ఉదయం 5:30 గంటలకే లేస్తారు. వాళ్ల వాళ్ల ఆసక్తులను బట్టి యోగా, వ్యాయామాలను చేస్తారు. ఇక్కడ కరాటేలోనూ శిక్షణ నిస్తున్నారు. భోజనానికి చక్కని వసతి ఉంది. ఐదారేళ్ల పిల్లల నుంచి బీటెక్‌ పూర్తిచేసిన వాళ్లవరకూ ఉన్నారిక్కడ. ఒక్కసారి ఇందులో చేరితే బట్టలూ, భోజనం మొదలు చదువు పూర్తై సొంత కాళ్లమీద నిలబడేదాకా అన్ని బాధ్యతలూ అమ్మఒడే చూసుకుంటుంది. ప్రస్తుతం ఇక్కడ
వసతిని బట్టి పిల్లల్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలూ కళాశాలల్లో చదివిస్తున్నారు. ఈ ఏడాది ఏడోతరగతి వరకూ ఉండేలా సొంతంగా పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలకు ఉచిత సేవలందించే డాక్టర్లూ, ఉచితంగా సామాను తెచ్చిపెట్టే ఆటోవాళ్లతో సహా ఎందరో అమ్మఒడి వెనుక నిలిచారు.
ఇక, ఇందులో కొత్త పిల్లలను మే నెలలో చేర్చుకుంటారు. ఎంతమందికి ఆహారం, వసతి అందించగలం అన్న విషయాన్ని అంచనా వేసుకుని ఆ మేరకు వచ్చిన దరఖాస్తుల్లో కొందరిని ఎంపిక చేసి చేర్చుకుంటారు. దరఖాస్తులో పేర్కొన్నది ఎంతవరకూ నిజమో నిర్ధారణ చేసుకున్నాకే ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతం 21మంది సభ్యుల కమిటీ దీనికోసం పనిచేస్తోంది. కలెక్టర్‌ ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
‘తిరిగి ఆశించకుండా సేవ అందిచడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. ఈ పిల్లలు పెద్ద చదువులు పూర్తి చేస్తుంటే, మా పిల్లలు ఉత్తీర్ణులైనప్పటి కన్నా సంతోషంగా ఉంటుంది’ అంటారు అమ్మఒడితో తొలినాళ్ల నుంచీ పనిచేస్తున్న ప్రభాకర్‌ రెడ్డి. ప్రజాసేవలో కొత్తదారి తొక్కిన అమ్మఒడి ఎందరికో స్ఫూర్తిదాయకం కదూ!

- గాలి సురేష్‌, ఈనాడు, కడప
చిత్రాలు: శ్రీనివాస్‌ పట్నాయక్‌

దివ్యాంగులూ కార్లు నడపొచ్చిక...  

ఏదైనా సాధించి తీరాలనే తపనా, పట్టుదల ముందు అంగవైకల్యం తలవంచి తీరాల్సిందేనని నిరూపించాడు హరీష్‌కుమార్‌. ఒంటి చేత్తో డ్రైవింగ్‌ చేస్తూ ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యక్తిగా రెండు రికార్డులు సృష్టించాడు. తనలాంటి వారి కోసం దేశంలోనే మొదటిసారిగా డ్రైవింగ్‌ స్కూలూ ప్రారంభించాడు.
రీష్‌కు పుట్టుకతోనే కుడిచేయి పనిచేయలేదు. ఆ చేతిని చూసుకుని అందరిలా ఆడుకోలేక పోతున్నానని బాధపడేవాడు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ దాని గురించి ఆలోచించడం మానేసి చదువు మీదే దృష్టి పెట్టాడు. డెహ్రాడూన్‌లో డిగ్రీ చదివిన తర్వాత దిల్లీ ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేశాడు. ఆ తర్వాత టెలికామ్‌ రంగంలో ఇంజినీర్‌గా చేరి జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగాడు. ఆ సమయంలోనే స్నేహితుడు కానుకగా ఇచ్చిన లిమ్కా రికార్డుల పుస్తకం హరీష్‌ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ పుస్తకంలో చదివిన దీపా మాలిక్‌ కథనం హరీష్‌లో కొత్త ఆశలకు పూపిరి పోసింది. వెన్నెముకకు ఎన్నో ఆపరేషన్లయిన తర్వాత కూడా దీపా డ్రైవింగ్‌ చేయడం, ఆటల్లో రికార్డులు సృష్టించడం అతడిని ఆలోచనల్లో పడేసింది. తనకు చిన్నతనం నుంచీ ఎంతో ఇష్టమైన డ్రైవింగ్‌లో తానెందుకు రికార్డు నెలకొల్పకూడదని ఆలోచించాడు. తన అభీష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
2013లో ఒంటి చేత్తో 15,963 కిలోమీటర్లు డ్రైవింగ్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. దేశంలోనే ఎక్కువ దూరం ప్రయాణించిన మొదటి దివ్యాంగుడిగా రికార్డు నెలకొల్పాడు. 29 రోజుల్లో 28 రాష్ట్రాలూ, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రయాణించాడు. ఆ మరుసటి సంవత్సరం 2014లో మరో రికార్డూ సృష్టించాడు. 129 గంటల్లో అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయిల మీదుగా 6,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వరుసగా రెండోసారి తన పేరును లిమ్కా రికార్డుల పుస్తకంలో నమోదుచేసుకున్నాడు. ఈ రెండు ప్రయాణాలకూ సాధారణ కారునే ఉపయోగించాడు. ఇష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లి రికార్డులు సాధించిన హరీష్‌ను ఎంతోమంది దివ్యాంగులు అభినందించారు. ‘తమకూ వాహనాలు నడపాలని ఉంటుందనీ, నేర్పడానికి ఎవరూ ముందుకు రావడంలేద’నీ వాపోయారు.
స్కూలు మొదలైందిలా...
హరీష్‌ కూడా మొదట్లో అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నవాడే కావడం వల్ల దివ్యాంగుల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. వారి కోసం డ్రైవింగ్‌ స్కూల్‌ ఏర్పాటుచేయాలనే ఆలోచన రావడంతో ముందుగా ఆర్టీఏ అధికారులను కలిసి కొన్ని వివరాలను సేకరించాడు. దేశంలో దివ్యాంగులకు డ్రైవింగ్‌ నేర్పించే స్కూలే లేదన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘ఎబిలిటీ ఆన్‌ వీల్స్‌’ పేరుతో డ్రైవింగ్‌ స్కూలును ప్రారంభించాడు. దాంట్లో ఇప్పటివరకూ సుమారు మూడువందల మంది డ్రైవింగ్‌ నేర్చుకుని లైసెన్సునూ సంపాదించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా దివ్యాంగులకు లైసెన్సులు జారీ చేసే విషయంలో ఉన్న కఠిన నియమాలను హరీష్‌ కృషి ఫలితంగా సవరించింది.
ఈ స్కూల్లో డ్రైవింగ్‌ పాఠాలతో పాటుగా కొన్ని ప్రత్యేక సేవలూ అందుబాటులో ఉంటాయి. వెన్నెముకా, కాళ్లూ, చేతులకు సంబంధించిన వైకల్యానికి అనుగుణంగా వాహనంలో మార్పులు చేసి డ్రైవింగ్‌ నేర్పిస్తాడు హరీష్‌. డ్రైవింగ్‌ నేర్చుకున్న తర్వాత వాహనాల కొనుగోలు నుంచి వాహనదారుడి అవసరాలకు తగినట్టుగా మార్పులు చేసిన వాహనాన్ని ఆర్టీఏ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌ చేసేంతవరకూ అవసరమైన అన్ని ప్రక్రియలనూ స్వయంగా చూసుకుంటాడు. రవాణాపన్నూ, బీమాలకు సంబంధించి ఏమైనా మినహాయింపులు ఉంటే అవి దివ్యాంగులకు అందేలా చూస్తాడు. ఉపాధి కల్పనలోనూ వారికి సహకరిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించి వాటి ద్వారా దివ్యాంగులకు రుణాలు మంజూరు అయ్యేలా సహకరిస్తాడు. చక్రాల కుర్చీతో లోపలికి వెళ్లగలిగే సౌలభ్యమున్న వాహనాలను అద్దెకిస్తాడు.కార్పొరేట్‌ సంస్థలు దివ్యాంగుల సహాయానికి ముందుకు వచ్చేలా కృషిచేస్తున్నాడు. అంతేకాదు ‘ఎబిలిటీ ఆన్‌ వీల్స్‌’ అనే పుస్తకాన్ని రాసి దాంట్లో డ్రైవింగ్‌ నేర్చుకుని లైసెన్స్‌ సంపాదించే క్రమంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకుకట్టాడు.

ధైర్యంగా బయటకు...
‘సొంతంగా వాహనం నడిపే సామర్థ్యముంటే దివ్యాంగులు ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతారు. వాళ్లకు ఆ భరోసా ఇచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా. మా సేవలు అహ్మదాబాద్‌ చుట్టుపక్కలకే పరిమితం చేయకూడదనే ఉద్దేశంతో ‘ఎబిలిటీ ఆన్‌ వీల్స్‌’ వెబ్‌సైట్‌నూ ప్రారంభించాను. దీని ద్వారా దివ్యాంగులెవరైనా సలహాలూ, సహాయం కోసం నన్ను సంప్రదించవచ్చు. ఒంటిచేత్తో వాహనం నడుపుతూ 28 రాష్ట్రాల్లో ప్రయాణించిన తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది దివ్యాంగులు వచ్చి నన్ను అభినందించారు. వాళ్లు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నన్ను అభినందించి వెళ్లడం నాలో ఆలోచనలు రేపింది. ఏదైనా సాధించాలనే తపన వారిలోనూ మొదలవడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. సానుకూల దృక్పథం లేకపోవడమే అసలైన అంగవైకల్యం. అందుకే ముందుగా వారిలో ఆశావహ దృక్పథం పెంచడానికి ప్రయత్నిస్తున్నా’ అంటాడు హరీష్‌కుమార్‌. ఇతడి ప్రయత్నం ఫలించి ఇంకెంతమంది దివ్యాంగులు తమ కలలను నిజం చేసుకోనున్నారో కదా...


మా ఇంట్లో టీవీలేదు!  

రాజన్‌ ఆనందన్‌... భారత్‌, ఆగ్నేయాసియా దేశాల గూగుల్‌ విభాగాలకు ఉపాధ్యక్షుడు, ఎండీ. వందకోట్ల భారతీయుల్ని ఆన్‌లైన్‌ బాట పట్టించే లక్ష్యంతో పనిచేస్తున్న గూగుల్‌ బృందానికి సారధి. భారత్‌లో గూగుల్‌ లక్ష్యాల గురించీ తన గురించీ ఆయనేం చెబుతున్నారంటే...
న్నూ, నాపేరునీ చూడగానే అంతా భారతీయుణ్నే అనుకుంటారు. కానీ నేను పుట్టిపెరిగింది శ్రీలంక రాజధాని కొలంబోలో. లంకలో స్థిరపడ్డ తమిళ కుటుంబం మాది. నాన్న వి.ఎస్‌.కుమార్‌ ఆనందన్‌ ఈతలో ఛాంపియన్‌. భారత్‌-శ్రీలంకల మధ్య ఉన్న పాక్‌ జలసంధిని ఈదిన రికార్డు ఆయనకు ఉంది. వృత్తిరీత్యా న్యాయవాది అయినా ఎన్నో గిన్నిస్‌ రికార్డులు అప్పట్లో ఆయన పేరున ఉండేవి. ఇంగ్లిష్‌ ఛానెల్‌ ఈదే ప్రయత్నంలో మరణించారు. క్రీడలూ, సాహసాల్ని మా ఇంట్లో బాగా ప్రోత్సహించేవారు. అయినా నాకు చదువంటేనే ఇష్టం. అన్నయ్య ఆటలాడుతుంటే, ఎవరూ చెప్పకున్నా నేను ఒక్కణ్నే కూర్చుని బుద్ధిగా చదువుకునేవాణ్ని.
* నాకు పైలట్‌ అవ్వాలని ఉండేది. 16 ఏళ్లపుడు అందుకు అవసరమైన శిక్షణ కూడా తీసుకున్నాను. కానీ పైలట్‌ కావడానికి నా వయసు సరిపోదని చెప్పడంతో చాలా నిరాశ చెందాను. తర్వాత అమెరికా వెళ్లి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎమ్‌.ఐ.టి) నుంచి ‘బి.ఎస్‌’, స్టాన్‌ఫర్డ్‌ నుంచి ‘ఎం.ఎస్‌’ పూర్తిచేశాను. ఆపైన ‘మెకెన్సీ అండ్‌ కో’లో తర్వాత డెల్‌, మైక్రోసాఫ్ట్‌లలో పనిచేశాను. ఈ సమయంలో డెల్‌ వ్యవస్థాపకుడు మైఖేల్‌ డెల్‌, మైక్రోసాఫ్ట్‌ మాజీ సీయీవో స్టీవ్‌ బామర్‌ లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేశానని చెప్పడంకంటే వారినుంచి చాలా నేర్చుకున్నాననడం సబబేమో! 2011లో గూగుల్‌ ఇండియా ఎండీగా బాధ్యతలు స్వీకరించకముందు మైక్రోసాఫ్ట్‌ భారతీయ విభాగానికి ఎండీగా ఉన్నాను. గూగుల్‌కు వచ్చాక సంస్థ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌లతో దగ్గరగా పనిచేశాను. ల్యారీ ‘మూన్‌షాట్‌ థింకింగ్‌’ నాకెంతో ఇష్టం. వూహకు అందని అంశాల్ని వూహించడమే ఈ మూన్‌షాట్‌. ‘10, 20 శాతం అభివృద్ధితో ఈ ప్రపంచాన్ని మార్చలేం. ఏంచేసినా దాని ప్రభావం 10 రెట్లు ఉండాల’నేది ల్యారీ, గూగుల్‌ల విధానం.
* భారత్‌లో 100కోట్ల మందిని ఆన్‌లైన్లోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ 35కోట్ల మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. వీరిలో 10 కోట్లమంది గ్రామీణులున్నారు. వారిలో మహిళలు కోటిమందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ‘ఇంటర్నెట్‌ సాథి’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌లతో సైకిళ్లపైన కొన్ని బృందాలను దేశవ్యాప్తంగా వివిధ గ్రామాలకు పంపిస్తూ మహిళలకు ఇంటర్నెట్‌ వినియోగంపైన అవగాహన కల్పిస్తున్నాం. ఆ బృందాల్ని మూడు లక్షల గ్రామాలకు పంపాలనేది మా లక్ష్యం. భారతీయుల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తుల్నీ తీసుకొస్తున్నాం. యూట్యూబ్‌ ఆఫ్‌లైన్‌ అందుకో ఉదాహరణ. దీన్లో భాగంగా వీడియోల్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నాక ఆఫ్‌లైన్లో 48 గంటలపాటు చూసుకోవచ్చు. భారత్‌లో విజయవంతమైన ఈ విధానాన్ని మరో 80 దేశాల్లోనూ అమల్లోకి తెచ్చాం. 2018నాటికి భారత్‌లో కొత్తగా రెండు కోట్ల వ్యాపార సంస్థల్ని ఆన్‌లైన్లోకి తీసుకురావడం, 2020 నాటికి 20లక్షల మందికి ఆండ్రాయిడ్‌ పైన శిక్షణ ఇచ్చి వారిని డెవలపర్స్‌గా తీర్చిదిద్దడం మా ముందున్న లక్ష్యాలు.
* ఈ లక్ష్యాల్ని చేరడానికి వారంలో అయిదు రోజులు 15-18 గంటలపాటు పనిచేస్తాను. ప్రతి శనివారం మూడు గంటలపాటు నేను వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టిన కంపెనీల వ్యవస్థాపకులకు మార్గనిర్దేశం చేస్తుంటాను. భారత్‌, శ్రీలంకలలో ఈ కంపెనీలున్నాయి. సోషల్‌ నెట్‌వర్క్‌ విషయానికొస్తే... ట్విటర్‌లో చురుగ్గా ఉంటా. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉంది కానీ ఎక్కువ సమయం కేటాయించను. మా ఆవిడ రాధిక, మా అమ్మాయి మాయాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తాను.
* మా ఇంట్లో పదేళ్లుగా టీవీ లేదు. అన్నీ ఆన్‌లైన్లోనే అందుబాటులో ఉంటున్న ఈరోజుల్లో టీవీ లేని లోటు మాకు పెద్దగా తెలియలేదు. ఇంట్లో టీవీ తీసేయడానికి కారణం ఇంటర్నెట్‌ కాదు, మా అమ్మాయి ఏడాది వయసులో టీవీ దగ్గరికి వెళ్లి వైర్లని లాగుతుండేది. దాంతో వాళ్లమ్మకు భయమేసి తీయించేసింది. ఆ తర్వాత మా ఇంట్లోకి టీవీ మళ్లీ రాలేదు. మా పాపకు ఇప్పుడు 11 ఏళ్లు. కంప్యూటర్‌ కోడింగ్‌ నేర్చుకుంటోంది. ప్రోగ్రామింగ్‌ నేర్చుకుంటే గణితం మరింత సులభంగా అర్థమవుతుందని వాళ్ల టీచర్‌ చెబితే నేర్చుకుంటోంది. కోడింగ్‌కు సంబంధించిన సందేహాల్ని మాయా అడుగుతుంటే చాలా ఉత్సాహంగా తీరుస్తుంటా.

ఇంకొంత

గుడ్‌గావ్‌ కార్యాలయంలో ఉంటాను. కానీ ఎప్పుడూ ప్రయాణాలే ఉంటాయి. క్యాబిన్‌తోపాటు ఆఫీసులో నాకో క్యూబికల్‌ ఉంది.
మా బృందానికి దగ్గరగా ఉండాలని అక్కడే ఎక్కువ సమయం ఉంటాను.
* ‘గూగుల్‌ తర్వాత’ అన్న ఆలోచన లేదు. గూగుల్‌తో నా ప్రయాణం బాగుంది.
* నేను పుట్టింది శ్రీలంకలోనే అయినా భారతీయురాలైన రాధికా చోప్రాను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మాయి ఇక్కడే పుట్టింది.
* భారత్‌-శ్రీలంక క్రికెట్‌ మ్యాచ్‌ సమయంలో రెండు దేశాలకీ సమానమైన మద్దతిస్తా.
* లంక, కేరళ రుచులంటే ఇష్టం. ఐస్‌క్రీమ్‌ ఎక్కువగా తింటాను. ఈ అలవాటు నుంచి బయటపడాలని చాలాసార్లే అనుకున్నా!
* వివిధ రకాల కళలన్నా ఎంతో అభిమానం. నా శ్రీమతితో కలిసి ప్రపంచవ్యాప్తంగా జరిగే కళా ప్రదర్శనలకు వెళ్తుంటా.


శివాన్‌... సివంగులు!  

బిహార్‌లోని శివాన్‌ జిల్లా... భారత మొదటి రాష్ట్రప్రతి బాబూ రాజేంద్రప్రసాద్‌ పుట్టింది అక్కడే. కానీ శివాన్‌ కొన్నాళ్లుగా  ఎన్నో కేసుల్లో చిక్కుకొని జైల్లో ఉన్న ‘రాష్ట్రీయ జనతా దళ్‌’ నేత మహ్మద్‌ షాబుద్దీన్‌ జిల్లాగా వార్తల్లో వినిపిస్తోంది. అదే జిల్లా ఇప్పుడు క్రీడాకారుల ఖిల్లాగా మారబోతోంది!
బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో బాలికలంటే బాల్య వివాహాలూ, బాల కార్మికులే గుర్తొస్తారు. అమ్మాయిలకు చదువులూ, ఆటలనే మాట అక్కడ కనిపించదు, వినిపించదు. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ మార్పు వస్తోంది. అందుకో ఉదాహరణ శివాన్‌ జిల్లా మైర్వా తాలూకా లక్ష్మీపూర్‌ గ్రామం. ఈ మార్పు వెనుక కీలక వ్యక్తి 43ఏళ్ల ఉపాధ్యాయుడు సంజయ్‌ పాథక్‌. ఆయన ఆ గ్రామంలో బాలికలకు ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. బిహార్‌లో వెయ్యి మంది బాలురకు బాలికల సంఖ్య 940. జనాభాలోనే కాదు, సమాజంలోనూ వారిది వెనకబాటే. అందుకే బాలికల క్రీడలపైన ప్రత్యేక దృష్టిపెట్టి 2009లో క్రీడా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు సంజయ్‌. మొదట వారి వూరి చివరనున్న ఓ ఖాళీ ప్రదేశంలో
శిక్షణను మొదలుపెట్టారు. ప్రారంభంలో పుతుల్‌ కుమారి, తారా ఖతూన్‌ అనే ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఫుట్‌బాల్‌లో శిక్షణ పొందేవారు. ఏడాది తిరిగేసరికి ఆ సంఖ్య 30కి పెరిగింది. ఆ సమయానికే వారిలో కొందరు జిల్లాస్థాయిలో అవార్డులు గెల్చుకున్నారు.
సాగు ఆపేశాడు!
ఓ పక్క బాలికలు అవార్డులు తెస్తుంటే మరోపక్క శిక్షణ కేంద్రం దగ్గర కొందరు కుర్రాళ్లనుంచి అల్లరి ఎదురయ్యేది. అది ప్రభుత్వ స్థలం. అందువల్ల అక్కడికి ఎవర్నీ రావొద్దని చెప్పే హక్కు తనకు లేదని భావించిన సంజయ్‌... 2015 మార్చిలో తన ఎకరా పొలాన్నే మైదానంగా మార్చేశారు. దానికి తన తండ్రి పేరున ‘హిమేశ్వర్‌ ఖేల్‌ వికాస్‌ కేంద్ర’ అని పెట్టారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్న బాలికల బృందానికి ‘రాణీ లక్ష్మీబాయి క్లబ్‌’ అని పేరు పెట్టారు. చుట్టూ ఆకుపచ్చని వరి, పసుపుపచ్చని ఆముదం పంటలు... వాటి మధ్య సంజయ్‌ శిక్షణ ఇచ్చే మైదానం ఉంటుంది. లక్ష్మీపూర్‌కు 10, 15కి.మీ. దూరంలోని కడేరియా, బిలాస్‌పూర్‌ లాంటి గ్రామాలనుంచీ అనేకమంది బాలికలు రోజూ తెల్లవారుజామునే నిద్రలేచి సైకిళ్లపైన హాకీ స్టిక్‌లూ, హ్యాండ్‌బాల్‌, ఫుట్‌బాళ్లను పెట్టుకొని తోవలో తమ స్నేహితురాళ్లనీ వెంటబెట్టుకొని ఆరింటికల్లా మైదానాన్ని చేరుకుంటారు. ఆ ఎకరా స్థలంలోనే ఓ పక్క హాకీ, ఫుట్‌బాల్‌ గోల్‌పోస్టులూ, మరోపక్క బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ కోర్టులూ, మైదానం చుట్టూ రన్నింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుచేశారు సంజయ్‌. మైదానం దగ్గరకు చేరుకున్నాక బాలికలంతా మొదట వ్యాయామాలు చేస్తారు. తర్వాత ఎవరి ఆటలో వారు నిమగ్నమైపోతారు. అక్కడ ఫుట్‌బాల్‌, హాకీ, హ్యాండ్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌లతోపాటు అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటారు. ఉదయం 8:30 వరకూ ప్రాక్టీసు చేసి ఆ తర్వాత వారంతా స్కూళ్లకి వెళ్తారు. 
విదేశాలూ వెళ్తున్నారు
సంజయ్‌కు ఆటలు ఆడిన అనుభవం లేదు. అయినా పిల్లలకు నేర్పడానికి వివిధ మార్గాల్లో తెలుసుకుంటూ తానూ ఆడుతూ వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. శివాన్‌ జిల్లా సరిహద్దులు కూడా దాటని బాలికలు సంజయ్‌ ప్రోత్సాహంతో విదేశాలకూ వెళ్లొస్తున్నారు, ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అమృత, నిషా, తారా, సింధు, ఖుష్బూ, అంతిమా, మమతా, నీలూ... ఇలా 30మంది వివిధ వయసుల కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. 100 మీటర్ల పరుగు అండర్‌-14 విభాగంలో అంతిమా కుమారి జాతీయ స్థాయిలో స్వర్ణం గెల్చుకుంది. సైకిలు రిపేరు దుకాణం నడిపే సుధన్‌ అన్సారీ కుమార్తె తారా... 2014లో ఫ్రాన్స్‌ వెళ్లి స్కూల్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఆడింది. ఈమె సోదరి సల్మా కూడా జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి. వీరి చెల్లెళ్లు సర్లా, సబ్రా కూడా ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. ‘పిల్లల్ని ఆటలు ఆడిస్తున్నందుకు మొదట్లో వూళ్లొవాళ్లూ, బంధువులూ మమ్మల్ని చాలా అనేవారు. కానీ మేం పిల్లల ఇష్టాన్ని కాదనలేదు. ఇప్పుడు వారికి వస్తున్న అవార్డులూ, గుర్తింపు చూసి వారే మెచ్చుకుంటున్నారు’ అని చెబుతుంది వీరి తల్లి రసుల్లా బేగం. ఎలక్ట్రీషియన్‌ కుమార్తె నిషా గతేడాది తజిక్‌స్థాన్‌లో అండర్‌-16 ఫుట్‌బాల్‌ పోటీల్లో ఆడింది. పదేళ్ల కాజల్‌, శృతి తదితరులు ఏదో ఒక రోజున భారత జట్టుకు ఆడతారని చెబుతున్నారు సంజయ్‌.
సంజయ్‌ వారికి శిక్షకుడు మాత్రమే కాదు, సంరక్షకుడు కూడా! పిల్లలకు బూట్లు, జెర్సీలూ, టీషర్టులూ, ఫుట్‌బాళ్లూ, హాకీ స్టిక్సూ, చుట్టుపక్కల టోర్నీలకు వెళ్లేందుకు ఖర్చులూ... అన్నీ తానే సమకూర్చుతున్నారు. తన నెల జీతంలో రూ.12వేలు శిక్షణ కేంద్రం నిర్వహణకు కేటాయిస్తారాయన. ఆపైన స్నేహితులూ, గ్రామస్థుల నుంచి విరాళాలు సేకరిస్తారు. బాలికల సౌకర్యార్థం మైదానం దగ్గర రెండు గదుల్నీ నిర్మిస్తున్నారు. ‘పిల్లలు తెచ్చే అవార్డులు శిక్షణ కేంద్రం నిర్వహణ గురించిన ఆందోళనలన్నింటినీ మర్చిపోయేలా చేస్తాయ’ని చెబుతారు సంజయ్‌.
ఉదయమే కాదు, పాఠశాల నుంచి సాయంత్రం తిరిగొచ్చాక చీకటి పడేంతవరకూ బాలికలంతా ఆ మైదానంలో ఆడతారు. ఆపైన ఇంటికి వెళ్తూ రేపటి కోసం ఎదురు చూస్తారు.