close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సౌశీల్యం

సౌశీల్యం
- మానస

‘హైటెక్‌ సిటీ’... హైదరాబాద్‌!
‘గూగుల్‌ ఆఫీసు’లో చప్పుడు చేయకుండా ఏసీ పనిచేస్తుంటే, అక్కడున్న అన్ని క్యూబికల్స్‌లోని వాళ్ళంతా తలలు తిప్పకుండా సీరియస్‌గా వర్క్‌లో మునిగిపోయి ఉన్నారు.
ఒక్క ‘నీహారిక’ మాత్రమే ముందుగా తన పని పూర్తిచేసి, రివాల్వింగ్‌ ఛెయిర్‌లో రిలాక్స్‌డ్‌గా వెనక్కి జరుగుతూ ఓసారి చుట్టూరా ఉన్న వాళ్ళందరి వంకా చూసింది. ఆ తర్వాత పోనీటెయిల్‌ విప్పి, హెయిర్‌ బ్రష్‌ చేసుకుని మళ్ళీ రబ్బర్‌బ్యాండ్‌ వేసుకుని సీట్లోంచి లేచి నిల్చుంది.
ఇంతలో లంచ్‌టైమ్‌ అవడంతో అందరూ తమతమ క్యూబికల్స్‌లోంచి బయటకివచ్చి క్యాంటీన్‌ వైపు కదలసాగారు.
క్యాంటీన్‌కి చేరుకున్న వాళ్ళంతా తమకు కావాల్సిన ఐటమ్స్‌ తీసుకుని కుర్చీల్లో కూర్చోగానే నీహారిక లేచి నిలబడింది- ‘‘ఫ్రెండ్స్‌, మీ విలువైన సమయంలో ఒక్క నిమిషం నాకోసం కేటాయించగలిగితే... నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను’’ అంది.
రోజూలాగే లంచ్‌కి కూర్చుని పక్కవాళ్ళతో కబుర్లలోకి దిగబోతున్నవారల్లా ఆ మాటలకి తలలు తిప్పి ఆమెవైపు ఆసక్తిగా చూశారు.
తన మాటలకి స్పందనగా వాళ్ళ కళ్లలో కనిపిస్తున్న అనుమతినీ ఆసక్తినీ పసిగట్టినట్లుగా- ‘‘థాంక్యూ ఫ్రెండ్స్‌... నా పేరు నీహారిక. నేనిక్కడ ప్రాజెక్ట్‌ మేనేజర్‌నని మీకు తెలుసు. నేను చెప్పాలనుకున్నదేమిటంటే... మీలో చాలామందికి పిల్లలు ఉండి ఉంటారు, లేదా చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ ఉండవచ్చు. వాళ్ళు వాడి పారేసినవీ ప్రస్తుతం వాడకుండా పక్కన పడేసినవీ - దుస్తులు కానీ పుస్తకాలు కానీ బొమ్మలూ మరేవైనా వస్తువులూ... ఇలాంటివి- మీకెలాగూ పనికిరావు అనుకుని ఇంట్లోని అటకలపైనా, స్టోర్‌రూమ్‌లలోనూ వేస్ట్‌గా పడేసిన ఐటమ్స్‌ ఏవైనా... అవి అవసరమయ్యీ, వాటిని కొనలేనీ కొనే స్తోమత లేనివారికీ మీరు బహుమతిగా ఇవ్వడం బాగుంటుంది కదా... ఓసారి ఆలోచించండి!’’ చెప్పటం ఆపి, అందరి ముఖాల్లోకీ నిశితంగా చూసింది.
అందరూ కుతూహలంగా తనవైపే చూస్తూ, తన మాటలే వింటున్నారని అర్థమయ్యాక- ‘‘మీ సహకారంతో నేను కొన్నాళ్ళుగా పేదపిల్లలకి సహాయం చేస్తున్నానని మీలో చాలామందికి తెలుసు. ‘ఫెయిర్‌ హ్యాండ్స్‌’ అనే పేరుతో ఓ సంస్థని రిజిస్టర్‌ చేయించి, దానిద్వారా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను. నా కార్యక్రమాలు మీకు నచ్చితే మీరు కూడా ఇందులో మీవంతు తోడ్పాటు అందించవచ్చు. ఇందుకు మీరు చేయవలసిందల్లా- మీ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువుల్ని అట్టపెట్టెల్లో ప్యాక్‌ చేసి, ఒక్క ఫోన్‌కాల్‌ చేస్తే చాలు- ప్రతి శనివారం మా వాలంటీర్స్‌ మీ ఇళ్ళకే వచ్చి వాటిని కలెక్ట్‌ చేసుకుంటారు. మీకు వీలైతే, అభ్యంతరం లేకుంటే పేదపిల్లలకి వాటిని పంచే పనుల్లో మీరు కూడా పాల్గొనవచ్చు. ఇంతవరకూ నా మాటల్ని ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు’’ అని ముగించి కూర్చుంది.
పట్టుమని పాతికేళ్ళ వయసు కూడా లేని నీహారికనీ, పేదపిల్లల పట్ల ఆమె సేవాదృక్పథాన్నీ అందరూ చప్పట్లతో ప్రశంసించారు. తప్పకుండా ఆమెకి తమ వంతు సహకారం అందిస్తామని ఆనందంగా తెలిపారు.
అయితే, ఆ ఆఫీసులో కొత్తగా జాయిన్‌ అయిన ‘వికాస్‌’ మాత్రం దూరం నుంచే నీహారికని పరిశీలనగా చూస్తూ నిల్చున్నాడు. పరువం ఉరకలేసే పాతికేళ్ళ వయసులో మిగతా ఆడపిల్లల్లా సినిమాలూ పార్కులూ పబ్బుల వెంట తిరక్కుండా ‘మదర్‌ థెరెసా’లాగా ఈమె చేసే ఈ సమాజసేవేంటో అతడికి అర్థంకాలేదు.
‘నీహారిక’... పేరుకు తగినట్లు ఆహ్లాదం కలిగించే రూపం, ఐదడుగుల ఆరంగుళాల ఎత్తు, ఎత్తుకు తగిన లావు, నడుముని దాటిన నల్లటి పొడవాటి జుట్టు, పచ్చని శరీరఛాయ, కాటుక దిద్దినట్లుండే అందమైన పెద్దపెద్ద కళ్ళూ, ముచ్చటైన ముక్కుపై ముక్కెర బదులుగా కుదురుగా అమరిన చుక్కలాంటి పుట్టుమచ్చ, పండిన దొండపండులాంటి ఎర్రటి పెదవులూ, దోరమామిడి నొక్కులాంటి చక్కటి చుబుకం, నవ్వితే ఏటి తరగల్లా బుగ్గలపై పడే సొట్టలూ... వెరసి అద్భుతమైన సౌందర్యాన్నంతా ఒకేచోట రాశిగా పోసినట్లుండే మోడరన్‌ బాపూ బొమ్మ!
అందరూ లంచ్‌ కానిచ్చేసి వారివారి క్యాబిన్లకు వెళ్ళిపోయినా, ఆమె గురించే ఆలోచిస్తూ ఆమె అందాన్నే గుర్తుతెచ్చుకుంటూ... మెల్లగా అక్కడ్నుంచి కదిలాడు వికాస్‌. * * * ‘నీహారిక అడిగింది కదా...’ అని ఇష్టంగా కొందరూ, ఇష్టంలేకున్నా ‘ఇంటిలో చెత్త తగ్గుతుంది కదా...’ అనుకుని కొందరూ... తమతమ ఇళ్ళలో వాడకుండా పక్కన పడేసిన వస్తువుల్ని ప్యాక్‌ చేసిపెట్టి, ఆమెకు మెసేజ్‌ చేశారు. శనివారం ఉదయం వాటిని కలెక్ట్‌ చేసుకుంటామని రిప్లై ఇచ్చింది నీహారిక.
శుక్రవారం సాయంత్రం వర్కింగ్‌ అవర్స్‌ పూర్తవగానే బయటకొచ్చి ఆఫీస్‌ క్యాబ్‌ కోసం ఎదురుచూస్తున్న నీహారిక- ‘‘రండి మేడమ్‌, నేను డ్రాప్‌ చేస్తాను’’ అని విన్పించేసరికి, తలతిప్పి చూసి కనుబొమలు ముడిచి ప్రశ్నార్థకంగా చూస్తూ
‘‘ఎవరు మీరు?’’ అని అడిగింది సీరియస్‌గా.
‘‘అయ్యో, అపార్థం చేసుకోకండి మేడమ్‌! నేను మీ ఆఫీసులో కొత్తగా చేరాను. నా పేరు వికాస్‌... నేను కూడా ప్రాజెక్ట్‌ మేనేజర్‌నే’’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు.
‘‘అవునా, నేను గమనించలేదండీ... నైస్‌ టూ మీట్‌ యూ అండీ. ఆఫీస్‌ క్యాబ్‌ వస్తుందిలెండి... అందులో వెళ్తాను’’ అంటూ సున్నితంగా వారించింది.
‘‘సరేనండీ, మీ ఇష్టం! అయితే, ఓ చిన్నమాట నీహారికగారూ...’’ అంటూ ఆర్థోక్తిలో ఆగిపోయాడు.
ఏమిటన్నట్లుగా చూసింది.
‘‘ఆదివారం ఉదయం మీ ‘ఫెయిర్‌ హ్యాండ్స్‌’ క్యాంపెయిన్‌లో నేను కూడా చేరవచ్చా? నాక్కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలంటే ఇష్టం. కానీ, వాటినెలా ఆర్గనైజ్‌ చేయాలో తెలియదు’’ అన్నాడు.
అది వినగానే నీహారిక ముఖంలో ఒక్కసారిగా ఉత్సాహం చోటుచేసుకుంది. ‘‘వై నాట్‌? తప్పకుండా రండి. వెల్‌కమ్‌ విత్‌ ప్లెజర్‌! మా సంస్థకి వాలంటీర్స్‌ అవసరం చాలా ఉంది. అందరూ వస్తువులూ డబ్బూ లాంటివి అందిస్తున్నారు కానీ, పనుల్లో పాల్గొనడానికి ముందుకు రావటం లేదు. థాంక్యూ వెరీమచ్‌ ఫర్‌ యువర్‌ ఫెయిర్‌ హ్యాండ్స్‌... వికాస్‌’’ అంది.
‘‘సో... సండే మార్నింగ్‌ ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెబితే అక్కడికి వచ్చేస్తాను. నా ఫోన్‌ నంబర్‌ తీసుకోండి’’ అంటూ తన నంబర్‌ ఇచ్చాడు.
శనివారమంతా నీహారిక ఆలోచనల్తోనే గడిపేసిన వికాస్‌కి సాయంత్రం అవుతూండగా మెసేజ్‌ వచ్చింది నీహారిక నుంచి- ‘రేపు ఉదయం 7.30కల్లా దిల్‌సుఖ్‌నగర్‌లోని స్లమ్స్‌ దగ్గరికి వచ్చేయండి... ఆలస్యం చేస్తే మళ్ళీ ఎండ పెరిగిపోతుంది.’’

* * *

ఉదయాన్నే లేచి దిల్‌సుఖ్‌నగర్‌కి చేరుకున్నాడు వికాస్‌.
అక్కడికి చేరగానే పిల్లలకి బొమ్మలు పంచే పని అప్పగించింది నీహారిక. పిల్లలందరినీ కంట్రోల్‌ చేస్తూ వారి వయసుకి తగిన బొమ్మలు పంచేసరికి తలప్రాణం తోకకొచ్చింది వికాస్‌కి. కానీ, పిల్లల ముఖాల్లో సంతోషం, సంతృప్తి చూడగానే, అంతవరకూ కలిగిన అలసట అంతా ఎవరో చేతితో తీసేసినట్లనిపించింది.
పదకొండుగంటలకల్లా ఆ కార్యక్రమం ముగిసింది. వాలంటీర్సంతా ఎక్కడివాళ్ళక్కడ వెళ్ళిపోయారు.
‘‘నీహారికా, మీరెలా వెళ్తారూ?’’ అని వికాస్‌ అడగ్గానే-
‘‘ఆకలిగా ఉంది వికాస్‌. మొదట కాస్త ఏమైనా తిని, కోఠీకి వెళ్ళి బుక్స్‌ కొనాలి. అవి కొనుక్కుని ఇంటికి వెళ్తాను’’ చెప్పింది నీహారిక.
‘‘అలాగా! అలాగైతే నేనూ వస్తానండీ. నాకు హైదరాబాద్‌లో ఏవెక్కడ దొరుకుతాయో అంతగా తెలియదు’’ అంటూ హోటల్‌ వైపు కదిలాడు వికాస్‌.
కాసేపు తటపటాయించిన నీహారిక- ఆ తర్వాత అతడిని అనుసరించింది.
టిఫిన్‌ చేశాక, ఇద్దరూ కలసి కోఠీకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్నారు. దారిలో తనకు తెలిసిన ప్రదేశాలూ వాటి ప్రత్యేకతలూ అక్కడ దొరికే వస్తువుల గురించీ క్లుప్తంగా చెప్పింది. అంతసేపు కలసి తిరుగుతున్నా వికాస్‌లో వయసు వికారాలేవీ కనబడకపోవడంతో కాస్త రిలాక్స్‌ అయింది నీహారిక.
చివర్న ఆమె వారిస్తున్నా వినకుండా నీహారికను వాళ్ళింటి వద్ద డ్రాప్‌ చేశాడు వికాస్‌. బైక్‌ చప్పుడుకి బయటకొచ్చిన నీహారిక తల్లి అనితమ్మని చూసి ‘‘నమస్తే ఆంటీ’’ అంటూ అభిమానంగా పలకరించాడు.


ఇలా కొన్ని నెలలు ఆఫీసులో కలసి పనిచేస్తూ, వీకెండ్స్‌లో సేవాకార్యక్రమాలలో పాలుపంచుకున్నాక వికాస్‌కి నీహారిక పద్ధతులు బాగా నచ్చాయి. ‘అందరితోనూ స్నేహంగా మసలుకుంటూ, పేదలపట్ల దయాపూరితంగా, తల్లిపట్ల ప్రేమగా, వృత్తిపట్ల నిబద్ధతగా ఉండే ఈ అమ్మాయి- జీవితంలో కూడా నాకు తోడుగా ఉంటే బాగుంటుంది’ అనే భావం వికాస్‌లో క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది.
ఒకరోజు ‘ఫెయిర్‌ హ్యాండ్స్‌’ క్యాంపెయిన్‌ తర్వాత అలవాటుగా హోటల్‌కి వెళ్ళారిద్దరూ. టిఫిన్‌ ఆర్డర్‌ చేశాక, నీహారిక ముఖం కడుక్కుని నాప్కిన్‌తో తడుచుకుంటూ యధాలాపంగా వికాస్‌ వంక చూసింది. ఎప్పట్నుంచో తెలీదుకానీ అతడు తనవైపే తదేకంగా చూస్తూండటాన్ని గమనించి ‘ఏమి’టన్నట్లు కళ్ళెగరేసింది.
‘‘ఏమీ లేదు నీహారికా’’ అంటూ తల తిప్పుకున్నాడు వికాస్‌.
అయితే, ఆరోజు అతడి చూపులో పిలుపులో బాడీలాంగ్వేజ్‌లో ఏదో ‘తేడా’ కొట్టొచ్చినట్లుగా కనబడుతూంటే ‘‘ఏమిటి వికాస్‌, ఏమిటలా ఉన్నారు?’’ అని అడిగింది.
‘‘ఇంతదాకా వచ్చాక వెనుకాడటమెందుకు కానీ- నీహారికా... నా గురించీ నా కుటుంబం గురించీ మీకు అంతా తెలుసు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా నేనంటే ఇష్టమైతే మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. మీ నిర్ణయమేమిటో తెలుసుకోవచ్చా?’’ అంటూ తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పేశాడు వికాస్‌.
అతడు చెప్పింది విన్న నీహారిక మొదట ఆశ్చర్యపోయింది. ఆపై కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత తననితాను స్థిరపరచుకుంటూ ‘‘వికాస్‌, ఇన్నాళ్ళూ నేను మిమ్మల్నొక స్నేహితుడిగానే భావించాను. ఆ కోణంలోనే చూశాను కానీ, ఈరోజు మీరిలా మాట్లాడుతూంటే ఏమి బదులివ్వాలో తెలియటం లేదు. ఈ విషయం మా అమ్మతో కూడా మాట్లాడి సమాధానమివ్వడానికి నాకు కాస్త వ్యవధి కావాలి’’ అంది నీహారిక.
తను కాదంటుందేమోనని జంకుతున్న వికాస్‌- ఆమె అలా వ్యవధి కావాలని అడగగానే నిశ్చింతగా వూపిరి పీల్చుకున్నాడు. ఎంతో సంతోషంగా అక్కడినుంచి బయలుదేరబోతూ ఆన్నాడు- ‘‘ఎంత సమయమైనా తీసుకో నీహారికా, కానీ కాదని మాత్రం చెప్పకేం.’’

* * *

‘‘ఏమయిందమ్మా, ఎందుకలా ఉన్నావ్‌?’’ ఇంటికి రాగానే ఎప్పటిలాగా హుషారుగా విశేషాలన్నీ కబుర్లుగా చెప్పకుండా ఏవేవో ఆలోచనల్లో మునిగివున్న కూతురుకి కాఫీ అందిస్తూ అడిగింది నీహారిక తల్లి అనితమ్మ.
నీహారిక జరిగిన విషయాలన్నీ తల్లికి వివరంగా చెప్పింది.
అన్నీ విన్న తర్వాత అడిగింది అనితమ్మ ‘‘నీహా, నీకా అబ్బాయంటే ఇష్టమేనా?’’
‘‘అలా అడిగితే ఏమీ చెప్పలేనమ్మా. కానీ అతడ్ని కాదనడానికి కారణాలు కూడా ఏమీలేవు. అలాగని ఔననాలంటే మాత్రం... గతం గుర్తొచ్చి నా మనసు చితికిపోతోందమ్మా’’ అని కన్నీరు పెట్టుకుంది నీహారిక.
అనితమ్మ కూడా అప్రయత్నంగా చెంపల మీదకి జారిన కన్నీటిని తుడుచుకుంటూ ‘‘జరిగినదాంట్లో నీ తప్పేముంది నీహా! అసలు ఆ విషయం వికాస్‌కి తెలియాల్సిన అవసరమే లేదు. కానీ, నీ ఆత్మతృప్తి కోసం ఆ అబ్బాయిని రేపు మన ఇంటికి పిలిచి నీ విషయం చెప్పు. అంతా విన్న తర్వాత కూడా అతడు నిన్ను ఇష్టపడుతూంటే పెళ్ళి చేసుకో, లేదా మునుపటిలాగే నీ పనుల మీదకి మనసుని మరల్చుకో! ఇంతకుమించి ఇంకేముందమ్మా చేయటానికి? ఈమాత్రం దానికి ఎందుకింతగా ఆవేదన చెందుతావు చెప్పు?’’ అంటూ అనునయిస్తూ కూతుర్ని వూరడించింది అనితమ్మ.
కాసేపటికి తేరుకున్న నీహారిక ‘‘నిజమేనమ్మా, అంతకుమించి మరో మార్గం కూడా ఏమీలేదులే!’’ అంటూ నిట్టూర్చింది. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ‘‘నా గతం గురించి చెప్పాక వికాస్‌ నన్ను కాదన్నా బాధపడను కానీ, ఆ తర్వాత ఏమీ జరగనట్లుగా ప్రతిరోజూ ఆఫీసులో తన ఎదురుగా తిరగటం నాకు చేతకాదమ్మా. నేను జాబ్‌కి రిజైన్‌ చేయటానికి ఒప్పుకుంటేనే వికాస్‌కి నిజం చెబుతాను’’ అంది.
అన్నట్టుగానే మర్నాడు వికాస్‌ని ఇంటికి రమ్మని ఆహ్వానించింది నీహారిక. అతడు రాగానే వాళ్ళింటి డాబా పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి టిఫిన్‌, కాఫీలు ఇచ్చాక చెప్పటం మొదలుపెట్టింది.

* * *

‘‘మాది వరంగల్‌ దగ్గర చిన్న పల్లెటూరు. మా నాన్న చిన్న రైతు. మా అమ్మ డిగ్రీదాకా చదివినా బంధుత్వం కారణంగా వ్యవసాయం చేస్తున్న నాన్నతో పెళ్ళి జరిగింది. మా ఇల్లు వూరికి కాస్త ఎడంగా, మా పొలానికి దగ్గరగా ఉండేది. అమ్మానాన్నకి నేనొక్కదాన్నే కూతుర్నవడంతో ఏ లోటూ లేకుండా పెంచారు నన్ను. వాళ్ళెంత గారాబం చేసినా నేనెప్పుడూ హద్దుమీరి ప్రవర్తించేదాన్ని కాదు.
అమ్మ దగ్గరే ట్యూషన్‌ కావడంతో బాగా చదివేదాన్ని. అన్ని క్లాసుల్లో నేనే ఫస్ట్‌! పదవ తరగతిలో కూడా స్కూల్‌ ఫస్ట్‌ నేనేననేవారు మా టీచర్లంతా. పదవ తరగతి పరీక్షలు పూర్తయినరోజు ముందుగా అనుకున్న ప్రకారం పరీక్ష హాలు నుండే మా ఫ్రెండ్స్‌తో కలసి వరంగల్‌లో సినిమాకి వెళ్ళాం’’ అని ఆపింది నీహారిక.
‘‘అయితే ఏంటీ? పరీక్షలవగానే అందరూ సరదాగా సినిమాకెళ్ళటం సహజమే కదా’’ అన్నాడు వికాస్‌.
ఓసారి దీర్ఘంగా వూపిరి పీల్చుకుని మళ్ళీ చెప్పటం మొదలెట్టింది నీహారిక. ‘‘పెద్ద సినిమా కావడంతో లేటుగా వదిలారు. అలవాటైన దారే కాబట్టి చీకటిగా ఉన్నా చకచకా నడుస్తూ రాసాగాం. వూళ్ళొకి వచ్చాక అందరి ఇళ్ళూ మా ఇంటికంటే ముందే రావటంతో ఒక్కరొక్కరే వెళ్ళిపోయారందరూ. తెలిసిన దారే అయినా అంత రాత్రివేళ, అలా చీకటిలో ఒక్కదాన్నే ఎప్పుడూ నడవలేదు కాబట్టి నాకు కాస్త కంగారుగా ఉండింది.


అంతలో... దూరంగా ఎవరో వస్తూండటం చూసి ‘నాన్నేమో, నాకోసం ఎదురొస్తున్నారేమో’ అనుకుని గబగబా ముందుకెళ్ళాను. అయితే దగ్గరపడేకొద్దీ అతనెవరో తెలిసింది- మా వూరి హరిబాబు! ‘హమ్మయ్యా, తెలిసినవాడే కదా’ అనుకుంటూ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అతడ్ని చేరుకునేసరికి గుప్పుమని సారా వాసన కొట్టింది.
వెంటనే దూరంగా జరగబోయాను కానీ, అంతలోనే మందు మత్తులో ఉన్న హరి నా భుజాలపై బలంగా చేతులేసి నన్ను బలవంతంగా పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్ళాడు’’ అని చెప్పి ఆగి, తలెత్తి వికాస్‌ ముఖంలోకి చూసింది. తను చెప్తున్నది వింటున్న వికాస్‌ ముఖం పాలిపోయి ఉండటం గమనించినా, చెప్పటం ఆపదలచుకోలేదు నీహారిక.
‘‘అతడి బలం ముందర నా బలం పనిచేయలేదు. ఆ చీకట్లో నా అరుపులు ఎవరికీ వినిపించలేదు. అరగంట నరకయాతన తరవాత ఎవరో వస్తున్న అలికిడికి నన్ను వదిలేసి చీకట్లోకి పారిపోయాడు హరి. నేను రాకపోయేసరికి నన్ను వెదుక్కుంటూ వచ్చిన అమ్మానాన్న నన్ను ఆ స్థితిలో చూసి, గుండెలు పగిలేలా ఏడ్చారు. నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిన నాన్న- ఉదయాన్నే హరిని పట్టుకుని చితకబాదాలని వెళ్ళేసరికి వాడు శవరూపంలో కనిపించాడు. తాగిన మత్తులో చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో తన ప్రాణాలు తీసుకున్నాడు.
హరి ఓ అనాథ. తల్లిదండ్రులూ బంధువులూ ఎవరూ లేరతడికి. తినడానికి తిండి దొరక్క, గాలికి పెరిగాడు. ఏదైనా కావలసి వచ్చినప్పుడు అడిగితే ఇవ్వరని దొంగతనాలకు పాల్పడేవాడు. చెడు సావాసాల కారణంగా మందు, సిగరెట్లు, జూదం వగైరాలన్నీ అలవాటయ్యాయి. స్వతహాగా మంచివాడే అయినా పరిస్థితులే అతడ్ని అలా తయారుచేశాయి.
సెలవలు కావడం, హరి చనిపోవడంతో నాకు జరిగిన అన్యాయం ఎవరికీ తెలియలేదు. కానీ, నా గురించిన దిగులుతో నాన్న గుండెపోటుతో చనిపోయాడు. స్కూలు ఫస్ట్‌ వచ్చానని కార్పొరేట్‌ కాలేజీవాళ్ళు ఎలాంటి ఫీజూ తీసుకోకుండా నన్ను వాళ్ళ కాలేజీలో చేర్చుకోవడానికి ముందుకు రావడంతో వూళ్ళొని పొలం, ఇల్లూ అమ్మేసి, అమ్మా నేనూ హైదరాబాద్‌కి వచ్చేశాం.
నేను బాగా చదువుకుని ఇంజినీర్‌ అయ్యాక- హరిలాగా ఎవరూ తయారవకూడదనీ, అలాంటివాళ్ళవల్ల నాలాగా ఎవరికీ అన్యాయం జరగకూడదని నాకు తోచిన రీతిలో, తెలిసిన మార్గంలో పేదపిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తున్నా’’ అంటూ ఆగింది.
ఓసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకుని మళ్ళీ చెప్పసాగింది. ‘‘ఇంతవరకూ నా గతం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం రాలేదు కాబట్టి నాలోనే దాచుకున్నాను. కానీ నాతో జీవితం పంచుకోవాలని ఆశిస్తున్న నీకు చెప్పకపోవటం మాత్రం నైతికంగా తప్పే అవుతుంది. అందుకే నీకు వివరంగా చెప్పాను’’ అని ఓ క్షణం ఆగి, తలెత్తి అతడి ముఖంలోకే చూస్తూ అంది- ‘‘ఇక నీ ఇష్టం వికాస్‌. నా గురించి అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడేట్లయితే, నేను కావాలని కోరుకుంటున్నట్లయితే... నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు.’’
నీహారిక చెప్పటం పూర్తయ్యాక చాలాసేపటి వరకూ వికాస్‌ మాట్లాడలేదు. ఆ తర్వాత- అతడి స్పందన కోసమే ఎదురుచూస్తున్న ఆమెకి కనీసం ‘వెళ్తున్నా’ననైనా చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడు అక్కడినుంచి.

* * *

మరుసటిరోజు ఆఫీసుకి వెళ్ళాక తెలిసింది నీహారికకి- వికాస్‌ లీవ్‌ పెట్టి వెళ్ళిపోయాడని!
అతడి ఫోన్‌కి కాల్‌ చేసినా ‘కాల్‌ ఫార్వడెడ్‌’ అని రెస్పాన్స్‌ వస్తూండటంతో తన విషయంలో అతడి నిర్ణయమేమిటో అర్థమైపోయింది నీహారికకి. ఇక ఆ ఆఫీసులో ఉద్యోగం చేయాలనిపించలేదామెకి. అయితే తన ప్రాజెక్ట్‌ చివరి దశలో ఉండగా రిజైన్‌ చేయడానికి కూడా ఆమె మనసు అంగీకరించలేదు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్ట్‌ పూర్తిచేయడానికి ఉపక్రమించింది.
వారంరోజుల తర్వాత ఓరోజు ఆఫీసులో వికాస్‌ గొంతు వినిపించడంతో ఠక్కున లేచి తన క్యాబిన్‌లోంచి బయటకి వచ్చింది నీహారిక. అందరినీ పలకరిస్తూ, నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న వికాస్‌- నీహారికని అసలు పలకరించలేదు, కనీసం ఆమెవైపు చూడనైనా చూడలేదు. అతడి నిరాదరణకి నీహారిక మనసు రంపంతో నిలువునా చీరేసినట్లనిపించింది. గిరుక్కున వెనక్కి తిరిగి తన క్యాబిన్‌లోకి వెళ్ళబోయేంతలో-
‘‘నీహారికా...’’ అన్న వికాస్‌ పిలుపుకి ఓ క్షణం ఆగి, కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగింది.
‘‘ఫ్రెండ్స్‌’’ అంటూ అందరినీ పిలిచి, నీహారిక తేరుకునేలోపే ఆమె ఎదుట మోకరిల్లినట్లుగా వంగి, కుడిచేతిని ముందుకు చాచి తలెత్తి ఆమె కళ్ళలోకే చూస్తూ అన్నాడు ‘‘నీహారికా, నన్ను పెళ్ళి చేసుకుంటావా?’’
అంతే, అక్కడున్నవాళ్ళంతా ‘‘వావ్‌ఁ... వాటె ప్రపోజల్‌!’’ అన్నారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ... ఆనందంగా కేకలు పెడుతూ... హుషారుగా బల్లలు చరుస్తూ.
నీహారిక హృదయం సంతోషంతో ఉప్పొంగింది. మనసులోని సంచలనమంతా పటాపంచలైపోయింది. అందరి చప్పట్ల మధ్య వికాస్‌ ప్రపోజల్‌ని అంగీకరిస్తున్నట్లుగా అతడి చేతిలో చేయి వేసింది.
వికాస్‌ లేచి ఆమెను పొదివి పట్టుకుని, ‘‘నాకు నీకన్నా నీ మనసే బాగా నచ్చింది. శీలంకన్నా ‘నిజం చెప్పాలి, సమాజాన్ని మంచి దారిలో నడపా’లన్న నీ సౌశీల్యం ఎక్కువ ఆకట్టుకుంది. నీకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనీ, ఈలోపల అమ్మను కూడా ఒప్పించాలనీ- నీకు నా అంగీకారాన్ని వెంటనే చెప్పలేదు. బాధపెట్టి ఉంటే క్షమించు. అన్నట్టు, సాయంత్రం అమ్మా నేనూ వస్తాం, అత్తయ్యగారికి చెప్పు. నిన్ను ఇంట్లో దింపేసి, నేను వెళ్ళి అమ్మను తీసుకొస్తాను. ఆఁ... మర్చిపోయాను, వూరినుంచి పుస్తకాలూ బొమ్మలూ చాలా తెచ్చాను. ఈ సండే పిల్లలకు పంచేద్దామా. ఇకనుంచీ నీ బాధ్యతల్లో నాకూ సగం నీహా’’ తల వంచి ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు వికాస్‌.
ఆనందాశ్చర్యాలతో రెప్పవాల్చక అలా చూస్తూండిపోయింది నీహారిక.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.