close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పెద్దలకూ పరీక్షే!

పెద్దలకూ పరీక్షే!

ఠాత్తుగా, ఇంట్లో వాతావరణం మారిపోతుంది. నాన్న మరింత గంభీరంగా కనిపిస్తాడు. అమ్మలో మునుపటి హుషారు మాయం అవుతుంది. నాన్న నడక మానేస్తాడు. అమ్మ యోగా ఆపేస్తుంది. ఇద్దరి సంభాషణల్లో ‘ఈ ఒక్క గండం గట్టెక్కితే చాలు...’ అన్న మాట తరచూ వినిపిస్తుంది.
ఇదంతా -
మార్చి ఎఫెక్ట్‌.
పెద్ద పరీక్షల ప్రభావం.
విద్యార్థులున్న ప్రతి కుటుంబంలోనూ కనిపించే దృశ్యమే. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ... పిల్లల జీవితంలో ముఖ్యమైన మలుపులు. ఆ మజిలీల దగ్గర బిడ్డ జాగ్రత్తగా అడుగువేయాలనీ, సురక్షితంగా ఒడ్డుకు చేరాలనీ ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అందులోనూ - నామకరణోత్సవం నాడు మొలకెత్తిన కల... ఒక్కో చుక్కా పేర్చినట్టూ, ఒక్కో రంగూ పులిమినట్టూ... స్పష్టమైన రూపాన్ని సంతరించుకునే సమయం ఇది. డాక్టర్‌, ఇంజినీర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ - ఏ మజిలీకి చేరుకోవాలన్నా ఈ చౌరస్తా దాటాల్సిందే. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇన్నేళ్ల జీవితం పిల్లల చుట్టే తిరిగినట్టు అనిపిస్తుంది వాళ్లకి. బుడిబుడి అడుగుల సమయానికి - ఆ చిన్నితండ్రికో, చిట్టితల్లికో... చక్కని భవిష్యత్తు ఇవ్వాలన్న ఆరాటం మొదలవుతుంది. బాసర అక్షరాభ్యాసంతో బడి ప్రయత్నాలు వూపందుకుంటాయి. ఆరునూరైనా పేరున్న స్కూల్లో సీటు సంపాదించాల్సిందే! నాన్న వీఐపీల చుట్టూ తిరిగి సిఫార్సు లేఖలు సిద్ధం చేసుకుంటాడు. అమ్మ బిడ్డను ఒళ్లొ కూర్చోబెట్టుకుని... ‘వాట్‌ ఈజ్‌ యువర్‌ నేమ్‌?’, ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ?’ తదితర ప్రశ్నలతో ‘ఇంటర్వ్యూ’కు తయారు చేస్తుంది. సరికొత్త యూనిఫామ్‌లో స్కూలు బస్సు ఎక్కుతున్న బిడ్డ - హిమాలయాన్ని అధిరోహిస్తున్న పర్వతారోహకుడిలా కనిపిస్తాడా తల్లికి. తీరకుండా మిగిలిపోయిన చిన్ననాటి కలను వారసుడి ద్వారా నిజం చేసుకోవాలని ఆరాటపడతాడు నాన్న. ఆ ప్రయత్నంలో ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారా దంపతులు. ఖర్చులు తగ్గించుకుంటారు, విలాసాలు వదిలించుకుంటారు. ‘అబ్బే! నాకు నగల మీద ఆసక్తిలేదు వదినా...’ అన్న మాటను వూతపదంగా మార్చేసుకుంటుంది అమ్మ. ‘బయటి తిండి పడదు’ అన్న సాకుతో ఉద్దేశపూర్వకంగానే విందూవినోదాల్ని దూరం చేసుకుంటాడు నాన్న. చిట్టీలు, ప్లాట్లు, పోస్టాఫీసు ఖాతాలు - సురక్షితమైన రాబడి మార్గాల కోసం ఆయన వారెన్‌ బఫెట్‌ అవతారం ఎత్తుతాడు. ‘కాలక్షేపంగా ఉంటుందనీ...’ ఆమె వేణ్నీళ్లకు చన్నీళ్లలాంటి ఉద్యోగమేదో వెతుక్కుంటుంది.
రెండు జీవితాలూ
రెండు జీతాలూ
- ఒకటే కల!
అందర్లా చదువుకుంటే అందర్లో ఒకడిగానే మిగిలిపోతాడు. ఎవరూ చదవని చదువులు చదవాలంటే, ఎవరూ చూడని ఎత్తులు చూడాలంటే... బిడ్డకు ప్రత్యేక శిక్షణేదో ఇప్పించాలి. ‘ఫలానా కార్పొరేట్‌ స్కూలు వాళ్లు ఐదో తరగతి నుంచే ఐఐటీకి కోచింగ్‌ ఇస్తారట’ అని తెలియగానే, రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతారు. స్తోమతకు మించిన వ్యవహారమే అయినా, సంతోషంగా ఆ బరువునెత్తుకుంటారు. సాయంత్రం ఇంటికి రాగానే, ‘క్లాసులో నేనే ఫస్టు!’ అని బిడ్డ చెప్పే తీపికబురు కోసం అమ్మ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. తనకేమీ పట్టనట్టు వార్తాఛానళ్లు తిరగేస్తున్నా... నాన్న చెవులన్నీ తల్లీబిడ్డల సంభాషణ వైపే. ప్రోగ్రెస్‌కార్డు మీద సంతకం చేస్తున్న సమయానికి... ఆయన ఛాతీ ఓ రెండంగుళాలు విస్తరిస్తుంది. క్లాసులో ఒక్క ర్యాంకు తగ్గినా, పరీక్షల్లో ఒక్క మార్కుపోయినా పేరెంట్‌-టీచర్‌ మీటింగులో యుద్ధమే! ప్రపంచమంతా కుట్రచేసి తన బిడ్డ ర్యాంకును తగ్గించేసినట్టు హైరానా పడిపోతుందా తల్లి. కొడుకో కూతురో పదో తరగతికి వచ్చేసరికి ‘బెస్ట్‌ కాలేజెస్‌ ఇన్‌ ఇండియా’ చిట్టాను నాన్న బట్టీ పట్టేసి ఉంటాడు. నోటిఫికేషన్‌ తేదీలూ, పరీక్ష విధానాలూ, ప్లేస్‌మెంట్‌ అవకాశాలూ... ఒకటేమిటి, సకల సమాచారాన్నీ సాధికారంగా చెప్పగల స్థాయికి చేరుకుంటాడు.
ఆ మమకారాన్ని ప్రశ్నించలేం.
ఆ తపనను తక్కువచేయలేం.
కానీ, కానీ...చాలా సందర్భాల్లో కన్నవారి ఆ ఆకాంక్ష , పెద్ద పరీక్షల సమయానికి తీవ్ర ఒత్తిడిగా మారుతోంది, రకరకాల రూపాల్లో బయటపడుతోంది. అనారోగ్యాలకూ, అనుబంధాల బీటలకూ కారణం అవుతోంది. అంతిమంగా, అసలు లక్ష్యాన్ని కూడా దెబ్బతీస్తోంది.
 

తొలి విజయం...

న్యూరోసైన్స్‌లో మునుపెన్నడూ లేనన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. మనసులోని ఏ ఆలోచన మెదడు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో శాస్త్రవేత్తలు కచ్చితంగా లెక్కేసి చెప్పగలుగుతున్నారు. ఒత్తిడికో దుర్మార్గమైన లక్షణం ఉంది... ఆ మనోస్థితిలో ప్రతి చర్యా అసంకల్పితమే! ఎవరో మీటనొక్కి నడిపిస్తున్నట్టు, ఇంకెవరో బొమ్మను చేసి ఆడిస్తున్నట్టు... తీవ్రంగా స్పందించేస్తారు. వివేకమూ విచక్షణా మంటగలిసిపోతాయి. గుండెల్లోని సున్నితత్వమంతా బండబారిపోతుంది. ఆ స్థానంలో ఎవరైనా ఉండవచ్చు - తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలూ కావచ్చు.
పిల్లలకు పరీక్షల ఒత్తిడి.
పెద్దలకు పిల్లల భవిష్యత్తు ఒత్తిడి.
ఒత్తిడి మనిషిలోని సహజ స్వభావాన్ని మింగేస్తుంది, నైపుణ్యాన్ని మరుగుపరుస్తుంది. దీనివల్ల విద్యార్థి తన బాధ్యతకు న్యాయం చేయలేడు. తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించలేరు.
అందులోనూ, విద్యార్థులకు అనేక ఒత్తిళ్లు! సిలబస్‌ పూర్తి కాలేదన్న ఒత్తిడి, ఎంత చదివినా గుర్తుండటం లేదన్న ఒత్తిడి, చదివింది పరీక్షల్లో రాదేమో అన్న ఒత్తిడి, అనుకున్నన్ని మార్కులు సాధించలేమేమో అన్న ఒత్తిడి. దీంతో, చిన్నచిన్న విషయాలకే చికాకు పడిపోతుంటారు. అర్థంలేని అసహనంతో అరిచేస్తుంటారు. అలాంటి సమయాల్లో పెద్దలు... ‘మమ్మల్నే ఎదిరిస్తావా?’ అని ఎదురుదాడికి దిగకూడదు. ‘మీసాలతో పాటూ కొమ్ములూ మొలిచాయే...’ అంటూ చేయెత్తకూడదు. పరిణతితో వ్యవహరించాలి. పరమశాంతంగా స్పందించాలి. ఆ అసహనాన్ని చిరునవ్వుతో భరించాలి. ఓదార్పు మాటలు మాట్లాడాలి. ఇంకా... ధైర్యం చెప్పాలి, భరోసా ఇవ్వాలి, ప్రేమ కురిపించాలి. ఇదంతా జరగాలంటే, ముందు అమ్మానాన్నలు ఒత్తిడిని జయించాలి. వాళ్లే శివమెత్తినట్టు వూగిపోతే, చెప్పేదేముందీ!
ఒత్తిడి వలలో పడిపోయి...చిన్నచిన్న విషయాలకు కూడా రాద్ధాంతం చేయడమూ, జీవిత భాగస్వామితోనో మరొకరితోనో గొడవలకు దిగడమూ సరికాదు. నిజంగానే, ఆ స్థాయిలో గొంతుపెంచాల్సిన సమస్య అయినా సరే, సాధ్యమైనంత ప్రశాంతంగా వ్యవహరించాలి. వీలైతే ఆ చర్చను కొద్దిరోజులు వాయిదా వేయవచ్చు. లేదంటే, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఇంకెవరికైనా అప్పగించవచ్చు.
అటు పిల్లలూ ఒత్తిడికి గురై, ఇటు పెద్దలూ ఒత్తిడిపాలైతే ఇల్లు నరకమే! పిల్లల ఒత్తిడి కొంతమేర అనివార్యమైంది. దాన్ని కనుక పాజిటివ్‌గా తీసుకోగలిగితే విద్యార్థి...మరింత శ్రద్ధగా చదువుతాడు. ఇంకాస్త ప్రణాళికతో వ్యవహరిస్తాడు. తల్లిదండ్రుల ఒత్తిడి మాత్రం, దాదాపుగా స్వయంకృతమే. మితిమీరిన ఆశల కారణంగానో, అర్థంలేని పోలికలవల్లో ఈ పరిస్థితి వస్తుంది. తెలిసీ తెలియని వయసులో బిడ్డ గుండెల మీద తన్నినప్పుడు ముద్దుగా విసుక్కుని ఉంటారే, గోటితో రక్కినప్పుడు ప్రేమగా తుడిచేసుకుని ఉంటారే! ఇదీ అలాంటి ఒకానొక దశే - అని మనసుకు సర్దిచెప్పుకోగలిగితే, కన్నమమకారం ఒత్తిడిని ఓడించేస్తుంది.
ఏదో ఓ రూపంలో, పిల్లల్లోని ఒత్తిడంతా ఆవిరికాకపోతే... బుర్రలోనే కుప్పగా పేరుకుపోతే... బ్రహ్మరాక్షసిలా మారిపోతుంది. తీవ్ర అఘాయిత్యాలకు పురిగొల్పుతుంది. పరీక్షలతోనో, ఫలితాలతోనో సంబంధం లేకుండా... తనని తానుగా ప్రేమించే మనుషులు ఉన్నారన్న నమ్మకం కలిగించగలిగితే, బిడ్డ ఒత్తిడిలేకుండా పరీక్షలకు తయారవుతాడు.

సమన్వయ పాత్రే!

బెత్తంలా బెదిరించడమా...
మార్గసూచిలా దారి చూపడమా...
పరీక్షల సమయంలో తమ పాత్ర ఏమిటనే విషయంలో కన్నవారికి ఓ స్పష్టత అవసరం. చదువులకు అవసరమైన ముడిసరుకును అందించడం, చదువుకోడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం, ప్రణాళికాబద్ధంగా చదువుకునేలా ప్రోత్సహించడం, నిస్పృహకో నిరాశకో గురైన సమయంలో నేనున్నానన్న భరోసా కల్పించడం - ఇంతవరకే తమ బాధ్యతని పరిమితం చేసుకోవడం ఉత్తమం.
పిల్లల్లో పరీక్షల బూచి రకరకాల రూపాల్లో బయటపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆహారపు అలవాట్లనూ ప్రభావితం చేస్తుంది. వేళకి భోంచేయరు. పళ్లెం ముందు కూర్చున్నా కోడిలా కెలికి వదిలేస్తారు. అలాంటి సమయాల్లో అమ్మల పాత్రే కీలకం. ఓపిగ్గా పక్కనే కూర్చుని వడ్డించాలి. అవసరమైతే గోరుముద్దలు తినిపించాలి. ఇష్టమైన వంటలు చేసిపెట్టాలి. వాటిలోనూ, పోషక విలువలు పోకుండా జాగ్రత్తపడాలి. బాబో పాపో పరీక్ష బాగా రాయాలంటూ మొక్కుల పేర్లతో రోజుల తరబడి ఉపవాసాలు చేయడమూ మంచిది కాదు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కీలక సమయంలో పిల్లల ఆలనాపాలనా చూసుకోలేరు. అమ్మానాన్నలు మంచంపడితే పిల్లలూ బెంబేలెత్తిపోతారు. చదువుల మీద దృష్టిపెట్టలేకపోతారు. కాబట్టి, పరీక్షల మాసంలో పిల్లల ఆరోగ్యం ఎంత ముఖ్యమో పెద్దల స్వస్థతా అంతే ప్రధానం.
విద్యార్థులకు తగినంత నిద్రా అవసరమే. జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే మనోబలం... చక్కని నిద్రతోనే మెరుగుపడతాయి. నిద్రలోనే మెదడు, అప్పటిదాకా చదివిన విషయాల్ని ప్రత్యేకమైన అరల్లో నిక్షిప్తం చేసుకుంటుంది. నిద్ర తగ్గితే బుర్ర చురుగ్గా పనిచేయలేదు. అయోమయం అధికం అవుతుంది. పరీక్షల్లో ఒక ప్రశ్నకు ఇంకో జవాబు రాసే ఆస్కారమూ ఉంటుంది. పిల్లలు సమయానికి నిద్రపోయేలా చూడాల్సిన బాధ్యత కన్నవారిదే. పడక సరిగా లేకపోతే వెన్నునొప్పిలాంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. గదిలో ధారాళంగా గాలీవెలుతురూ సోకుతున్నాయో లేదో గమనించాలి. అదే సమయంలో తమ నిద్ర గురించీ ఆలోచించాలి. పిల్లల గదిలో దీపం ఆరేదాకా, నిద్రపోకూడదన్న పిచ్చి నియమం పెట్టుకోకూడదు.
ఒత్తిడికి మాటలే మందు. ఎంత వీలైతే అంత మాట్లాడనివ్వాలి. మనసులోని ఆలోచనలన్నీ చెప్పనివ్వాలి. ‘ఏం ఫర్వాలేదు. నువ్వు బాగా రాయగలవు’, ‘ఒత్తిడేం పెట్టుకోవద్దు’ ...అంటూ ధైర్యం చెప్పాలి. ‘చదువు ఎలా సాగుతోంది?’, ‘సందేహాలేమైనా ఉన్నాయా?’, ‘రివిజన్‌ ఎంతవరకు వచ్చింది?’, ‘నిపుణుల సలహాలు అవసరమా?’ అన్నది వాకబుచేస్తూ ఉండాలి. అమ్మానాన్నలు రోజూ ఒక పూట అయినా, పిల్లలతో కలసి భోంచేయాలి. ఆ సమయంలో ఆశావాదాన్ని పెంచే విషయాల్నే ప్రస్తావించాలి. ప్రశ్నపత్రాల లీకేజీ గురించో, మార్కుల స్కాముల గురించో ఉపన్యాసాలు దంచేసి బుర్రలు ఖరాబు చేయకూడదు. వైఫల్యాల ప్రస్తావన అసలే వద్దు. ‘సీటు రాకపోతే...’, ‘ర్యాంకు తెచ్చుకోకపోతే...’ తరహా నెగెటివ్‌ పదజాలాన్ని యథేచ్చగా వాడేయకూడదు.
ప్రతి క్షణమూ మన కనుసన్నల్లోనే మెలగాలన్న చండశాసన ధోరణి వద్దేవద్దు. కాస్త మార్పు కోసమో, కించిత్‌ ఉత్సాహం కోసమో పిల్లలు - కాసేపు స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు, ఫేస్‌బుక్‌ అప్‌డేట్స్‌ చూసుకోవచ్చు, టీవీ ముందు కూర్చోవచ్చు. అంతమాత్రాన, హైరానా పడాల్సిన అవసరం లేదు. ‘పరీక్షలంటే భయం లేకుండా పోయింది’ అనో, ‘బొత్తిగా బాధ్యత లేకుండా ఉంటున్నావ్‌’ అనో... తిట్ల దండకం అందుకోకూడదు. ‘పెద్ద పరీక్షలొస్తున్నాయ్‌. ఎవరూ వాడితో మాట్లాడ్డానికి వీల్లేదు. వాడిని సినిమాలకూ, షాపింగ్‌లకూ పిలవకూడదు. క్రికెట్‌ ముచ్చట్లు పెట్టకూడదు...’ తరహా నిబంధనలతో పిల్లల్ని ఒంటరివాళ్లను చేయడమూ తగదు. హఠాత్తుగా కేబుల్‌ వైర్లూ, బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్లూ కత్తిరించేయడం కూడా సరికాదు. తమ మీద అపనమ్మకంతోనే అమ్మానాన్నలు ఇలా వ్యవహరిస్తున్నారని పిల్లలు చిన్నబుచ్చుకుంటారు. అది ఆత్మన్యూనతకు దారితీస్తుంది. ఈ సమయంలో అదంత మంచి పరిణామం కాదు.

 
నమ్మకాల్ని రుద్దకండి...

ఎంత బాగా చదువుకున్నా, పరీక్షల సమయంలో పిల్లల మనోస్థైర్యం కాస్త తక్కువ స్థాయిలోనే ఉంటుంది. దీంతో, ఎవరు ఏ చిన్న ప్రతికూల వ్యాఖ్య చేసినా తీవ్రంగా స్పందిస్తారు. నేరుగా మనసులోకి తీసుకుంటారు. పెద్ద పరీక్షలు దగ్గరపడగానే... ఏ బాబాల దగ్గరికో, జ్యోతిష్కుల దగ్గరికో తీసుకెళ్లి చేయి చూపించడం అస్సలు మంచిది కాదు. ఎదుటి మనిషి బలహీనతను సొమ్ముచేసుకునే ఏ మోసకారి అయినా, ఆ అమాయకత్వాన్ని స్వార్థానికే వాడుకుంటాడు. గ్రహబలం బాగాలేదనో, ఏలిననాటి శని ఎక్కి కూర్చున్నాడనో భయపెట్టితీరతాడు. శాంతులూ హోమాలూ చేయాలంటూ చిట్టా ముందుంచుతాడు. లక్షకో రెండు లక్షలకో బేరం పెడతాడు. శ్రద్ధగా చదువుకోవాల్సిన సమయంలో పిల్లలు తావీజు కేంద్రాల చుట్టూ తిరగడమంటే కాలాన్ని వృథా చేసుకోవడమే. తీరా వెళ్లొచ్చాక బాబాలు చెప్పినట్టు వినకపోతే, ఏం అవుతుందో అన్న భయం. ఆ తర్జనభర్జనలన్నీ పిల్లలకు వినిపిస్తూనే ఉంటాయి.
ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడే మూఢనమ్మకాలు పెరుగుతాయి, హేతువిరుద్ధమైన భావాలు బలపడతాయి. ఇప్పుడిప్పుడే వికసిస్తున్న పసివాళ్లను బలవంతంగా అటువైపు లాక్కెళ్లకూడదు. స్వశక్తిని నమ్ముకున్నవాళ్లు ఏ అదృశ్యశక్తుల ముందో సాగిలపడాల్సిన అవసరం రాదు. అయినా, ఎన్ని తాయెత్తులు కట్టుకున్నా ఎన్ని రక్షరేకులు చుట్టుకున్నా...ఎవరి ప్రయత్నం వాళ్లు చేయాల్సిందే, ఎవరి పరీక్ష వాళ్లు రాయాల్సిందే. కురుక్షేత్ర సంగ్రామంలో కూడా ...కృష్ణుడు ఆయుధం పట్టలేదూ, యుద్ధం చేయలేదూ. ‘నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. ఫలితాల సంగతి పక్కనపెట్టు...’ అంటూ పార్థుడికి కర్మసిద్ధాంతాన్ని బోధించాడంతే. ఆ బోధ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకూ వర్తిస్తుంది.
పరీక్షల ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోలేని పిల్లల్ని భవిష్యత్తులోనూ... ఆ దుష్ప్రభావాలు వెంటాడుతూ ఉంటాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలంటే భయపడే విద్యార్థి పెద్దయ్యాక... జీవితమనే పరీక్షను ఎదుర్కోవడంలోనూ అంతే గందరగోళంగా వ్యవహరిస్తాడు. వీలైతే, సవాళ్లను తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తనచుట్టూ ఓ రక్షణ వలయం నిర్మించుకుని, బయటికి రాకుండా దాక్కోవాలని అనుకుంటాడు. పోటీ అనివార్యమైన సమాజంలో ఆ పలాయనవాదం అస్సలు మంచిది కాదు. సవాళ్లే లేవంటే, విజయాలూ లేనట్టే. విజయాలు లేవంటే, జీవితం నిస్సారమైనట్టే. ఓరకంగా పెద్ద పరీక్షలు అనేవి..రేపటి జీవితానికి సంసిద్ధుల్ని చేసే వర్చువల్‌ సంక్షోభాలు.
నిజానికి, కన్నవారి బాధ్యత ఏ మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనో మొదలైపోదు. అంతకంటే చాలా ముందే ప్రారంభం కావాలి. ఓ చదరంగంలా, ఓ టెన్నిస్‌లా పరీక్షల్ని పాజిటివ్‌-ఒత్తిడితో స్వీకరించే మానసిక పరిణతిని పిల్లలకివ్వాలి. యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుల్లానో, పులి బోన్లోకి తలపెడుతున్న మేకల్లానో భావించినంత కాలం... అదో భయంకర రాకాసిలానే కనిపిస్తుంది.
విద్యార్థులు..
తమను తాము గెలిచే పరీక్షలో విజయం సాధిస్తే...
ప్రశ్నపత్రాన్ని గెలిచే పరీక్షనూ సునాయాసంగా అధిగమిస్తారు.

* * *

ఓ జెన్‌ గురువు దగ్గర సకిటో అనే శిష్యుడు ఉండేవాడు. చాలా చురుకైన వాడు. క్షాత్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. కత్తియుద్ధంలో గురువును ఓడించాలన్న కోరిక కలిగింది. ఓ రోజు హఠాత్తుగా వెళ్లి దాడి చేశాడు. గురువు అంతే వేగంగా శిష్యుడి ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు.
‘నిజమే, నువ్వు నాకంటే శక్తిమంతుడివే. కాకపోతే నైపుణ్యాన్ని నైపుణ్యంలానే ప్రదర్శించాలి. దానికి ఓటమి భయాన్నో, గెలుపు కోరికనో జోడిస్తే ....ఆ ప్రతిభ రాణించదు’ అని సలహా ఇచ్చి భుజం తట్టాడు గురువు.
పరీక్షా అంతే, అచ్చమైన నైపుణ్య పరీక్షే! అంకెలతో లంకెపెట్టుకోవాల్సిన పన్లేదు. విద్యార్థిలోని ‘సకిటో’కి ఆ విషయాన్ని బోధించాల్సిన బాధ్యత అమ్మానాన్నల్లోని ‘జెన్‌’ గురువులదే.

విద్యార్థీ...విజయీభవ!

ఆత్మవిశ్వాసం రీక్షకు తీసుకెళ్లాల్సినవాటి జాబితాలో... పెన్ను, పెన్సిలు, హాల్‌టికెట్‌, నీళ్ల సీసాతో పాటూ ఆత్మవిశ్వాసమూ ఉండాలి. మెదడుకు ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్థులంటే మహా ప్రేమ. ఎప్పుడో చదివిన విషయాల్ని కూడా చకచగా గుర్తుచేస్తుంది.


చక్కని ప్రణాళిక

న్ని రాత్రులు నిద్రలేకుండా గడిపామన్నది కాదు, ఎంత ప్రణాళికతో చదివామన్నది ముఖ్యం. ఉన్న సమయం ఎంత? చదవాల్సిన పాఠాలెన్ని? దేనికెంత? - అని విభజించుకుంటే సరిపోతుంది.


పంచుకోండి...

మీ మనసులోని ఆలోచనల్నీ భయాల్నీ అపోహల్నీ ఎవరో ఒకరితో పంచుకోండి. ఆ వ్యక్తి ... నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, అక్కయ్య కావచ్చు, స్నేహితుడైనా కావచ్చు.


పరీక్ష రోజు...

ఖాళీ కడుపుతో వెళ్లకండి. అలా అని, పొట్టనిండా ఫలహారం కుక్కేసుకోకండి. తేలికైన మితాహారం సరిపోతుంది. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోండి. మహానగరాల్లో అయితే, ట్రాఫిక్‌ చిక్కుల్నీ దృష్టిలో పెట్టుకోవాలి. పరీక్ష అయిపోయాక, కాస్త విశ్రాంతి తీసుకుని రేపటి పరీక్షకు సిద్ధం కావాలి. చేసిన తప్పుల్నీ, చిన్నాచితకా పొరపాట్లనీ తలుచుకుని బాధపడటం అనవసరం.

మీదైన ప్రపంచం

అమ్మానాన్నలైనా, పిల్లల పరీక్షల గురించే పొద్దస్తమానం ఆలోచిస్తూ బుర్ర ఖరాబు చేసుకోవడం సరికాదు. ఆ ఇరుకిరుకు ప్రపంచం లోంచి బయటికి వచ్చేయాలి. తమ జీవితాన్ని తాము జీవించాలి. చాలామంది తల్లిదండ్రులు ఆ రెండుమూడు నెలలూ నడక మానేస్తారు, యోగా ఆపేస్తారు. నెలసరి వైద్య పరీక్షలు కూడా చేయించుకోరు. పెళ్లిళ్లకూ శుభకార్యాలకూ గైర్హాజరు అవుతారు. ఎప్పుడూ పిల్లల ధ్యాసే. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే ఆస్కారం ఉంది. రక్తపోటు దారితప్పవచ్చు. మిగతా రోజులతో పోలిస్తే, పరీక్షలప్పుడు పిల్లలకు ఇంకాస్త ఎక్కువ సమయం కేటాయించాలే కానీ, వాళ్ల నీడలా మారిపోకూడదు. ఆ ధోరణి కన్నబిడ్డలకైనా చికాకు కలిగిస్తుంది. పిల్లల పెంపకాన్ని సముద్రంలో నౌకాయానంతో పోలుస్తాడు ఓ రచయిత. సంద్రం కాసేపు ప్రశాంతంగా ఉంటుంది, కాసేపు ఆటుపోట్లతో హోరెత్తిస్తుంది. ఈరోజు ఒకలా ఉంటుంది. రేపు ఇంకోలా. ఆ మార్పుల్ని వూహించలేమన్నది రచయిత హృదయం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.