close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాకతాళీయం

కాకతాళీయం
- శాంతా హనుమంతరావు

శంకరం ఆఫీసు నుంచి ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 8 గంటలైంది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. మామూలుగా అయితే ఈపాటికి టీవీ పలుకుతూ ఉంటుంది. వంటగదిలో గరిటెలూ గిన్నెలూ చప్పుడవుతూ ఉంటాయి. కూతురు మహిజ చదువుకుంటూనో టీవీ చూస్తూనో ఉంటుంది.

క్షణకాలంపాటు అతని మనసులోకి రాకూడని ఆలోచనలన్నీ వచ్చాయి. ‘మామగారెలా ఉన్నారో!’ అనుకున్నాడు.

కానీ ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. వీధి తలుపుకు తాళం లేదు. అంటే ‘గిరిజ, పాప ఇంట్లోనే ఉన్నారన్నమాట’ అనుకున్నాడు.

‘ఏదైనా జరిగితే నాకు ఫోను చేసేదికదా! ఛఛ, అనవసరంగా కీడు ఆలోచించాను’ అనుకున్నాడు.

మహిజ గదివైపు ఒకడుగువేసి ‘‘పాపా, అమ్మేదీ?’’ అని అడిగాడు.

‘అమ్మ గదిలో ఉంది’ అన్నట్లు గదివైపు చూపించింది.

గదిలో లైటు వెలగడం లేదు. గిరిజ తలనొప్పితో బాధపడుతోందేమోనని, లైటు వేయకుండానే బట్టలు మార్చుకున్నాడు.

భార్య నుదుటిమీద చేయివేసి చూశాడు. వేడిగా లేదు.

గిరిజతోపాటు కూతురు కూడా అన్యమనస్కంగా ఉండటంతో అతనికి అంతా గందరగోళంగా ఉంది.

ముందురోజు నుంచి అప్పటిదాకా జరిగిన సంఘటనలను నెమరువేసుకున్నాడు. తన తప్పేమీ కన్పించలేదు.

బాత్‌రూమ్‌ తలుపు చప్పుడయ్యేలా తీసి, లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకువచ్చి టవలు చప్పుడయ్యేలా దులిపి ఆరేసి, గది గుమ్మం దగ్గరకు వచ్చి, రాని దగ్గు దగ్గాడు.

ఈ శబ్దాలన్నీ గిరిజకు తన రాకను తెలియచేయడానికి మాత్రమే. కానీ, ఆమెలో మాత్రం చిన్న కదలిక కూడా లేదు. ఏం చేయాలో అర్థంకాక కాఫీ కలుపుకుని వచ్చి కుర్చీలో కూర్చుని ఆలోచించసాగాడు.

సమయం తొమ్మిదవుతోంది. గిరిజ ఇంకా లేవలేదు. వంట కూడా చేసినట్లు లేదు. మహిజ వెళ్ళి తల్లి పక్కనే పడుకుంది.

మహిజ ప్రవర్తన కూడా అంతుబట్టడంలేదు. ఇది తల్లి శిక్షణా? జుట్టు పీక్కోవాలనుంది కానీ, పీక్కుంటే ఉన్న నాలుగూ వూడిపోతాయి అనుకుని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

అలా ఎంతసేపు దిక్కులు చూస్తాడు? చివరకు ఏదైతే అదయిందని ధైర్యం చేసి గదిలోకి వెళ్ళి గిరిజను సున్నితంగా తట్టి పిలిచాడు.

‘‘ఏం గిరిజా, ఒంట్లో బాగాలేదా, ఏమయింది? ఎప్పుడూలేనిది ఈ సమయంలో నిద్రపోయావు?’’

గిరిజ నెమ్మదిగా లేచింది. ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు శంకరం.

‘‘వసుంధర చచ్చిపోయిందండీ’’ అని చెబుతూ బావురుమంది.

‘‘అరె, మొన్నటిదాకా బాగానే ఉందిగా. ఇంతలో ఏమైంది?’’

‘‘కాలంతీరి వచ్చిన చావు కాదు, ఆ రాక్షసి ఉంది కదా... దాని పని... దాని చేతులు పడిపోను.’’

‘‘ఎవరూ?’’

‘‘ఇంకెవరూ... అత్త రాక్షసి.’’

‘‘ఆమె మంచిగానే ఉండేది కదా. నువ్వు కూడా ఆమె మంచిదే అని చెప్పేదానివి.’’

‘‘ఏం మంచి, నా ముఖం మంచి? మంచిగా ఉన్నట్లు నటించేది- బయటివాళ్ళ దగ్గర. ఎవరూ లేనపుడు నానా హింసా పెట్టేది.’’

‘‘అయ్యో పాపం, ఎవరితోనైనా చెప్పవచ్చుగా పరిస్థితి ఇదని.’’

‘‘ఏం చెబుతుంది, ఎవరితో చెబుతుంది? తన కుటుంబ మర్యాద బయటపెట్టుకోలేదు కదా. కాదని చెప్పినా ఇంట్లో మగాళ్ళే నమ్మరు.

ఆ అత్త ఆవుతోలు కప్పుకున్న పులి. కనుబొమలు ఒకటి పైకీ, ఒకటి కిందకు పెట్టుకుని, వంకర నవ్వుతో మాట్లాడ్డం చూస్తుంటే నరికెయ్యాలనిపిస్తుంది.’’

అవాక్కయి నిలబడిపోయాడు శంకరం.

‘‘సర్లే, మనం చెయ్యగలిగిందేముంది... ఇంతకీ వంటయిందా... పాపకు ఆకలేస్తోందేమో.’’

‘‘ఇదిగో వండుతా, ఎంతసేపు... పది నిమిషాలు.’’

శంకరం మనసు తేలికపడింది.

భోజనాలయ్యాక తలనొప్పిగా ఉందని తొందరగా నిద్రపోయింది గిరిజ. శంకరం వసుంధర గురించి కొంతసేపు ఆలోచించి నిద్రపోయాడు. ‘సమాజంలో మేకవన్నె పులులు, పులివన్నె మేకలు ఉన్నాయి’ అనుకున్నాడు.

* * *

మరునాడు ఉదయం ఆఫీసు టైమ్‌కన్నా అరగంట ముందుగా బయలుదేరాడు శంకరం- కామేశ్వరరావు ఇంటికి వెళ్ళడానికి. ఈ విషయం గిరిజకు చెప్పలేదు.

కామేశ్వరరావు పక్క వీధిలో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగి. ఆయన భార్య దమయంతి. కొడుకు రామారావు, కోడలు వసుంధర.

శంకరం వెళ్ళేటప్పటికి కామేశ్వరరావు హాల్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ‘నమస్కారం’ చెప్పి, అక్కడున్న మరో కుర్చీలో కూర్చున్నాడు.

‘‘వూరక రారు మహానుభావులు. ఏమిటీ విశేషం శంకరం?’’

శంకరం ముఖంలో కత్తివేటుకు నెత్తురు లేదు. తన ఉనికిని తానే నమ్మలేకపోయాడు. ‘నేను రావలసిన చోటికే వచ్చానా... ఈయన కామేశ్వరరావు గారేనా? గిరిజ చెప్పింది నిజమా... కలా? గిరిజ వసుంధర గురించే చెప్పింది కదా?’ ప్రశ్నల పరంపరతో మనసు నిండిపోయింది.

‘‘నేను విన్నది నిజమేనా?’’ అని మనసులో అనుకోబోయి, పొరపాటున పైకే అనేశాడు.

‘‘అవును శంకరం...నువ్వు విన్నది నిజమే.’’

‘నిజమేనా..? ఏమైనా భగవంతుడు మనిషికి ‘మరపు’ అనే గొప్ప వరాన్నిచ్చాడు. ఆ మరపే లేకపోతే మనుషులు ఏమైపోయేవారో. ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించినవారు దూరమైనా కొద్దిరోజుల్లోనే అంతా మరచిపోతారు’ మనసులో అనుకున్నాడు.

‘‘ఏమిటి శంకరం, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?’’

‘‘నిన్న రాత్రే తెలిసిందండీ. పాపం, ఈ వయసులో...’’ మొహమాటంతో ముక్తసరిగా చెప్పాడు.

‘‘ఏం చేస్తాం, ఎప్పుడేది జరగాలో అది జరుగుతుంది. అంతా లలాట లిఖితం. మనం ఏదీ ఆపలేమయ్యా! ఎంత కష్టమైనా ఓర్చుకోవాలి. బాధను దిగమింగుకోవాలి.’’

‘‘రాత్రి మా ఆవిడ చెప్పింది ఇలా అని... చాలా బాధపడింది.’’

‘‘మీ ఆవిడ మనసు మరీ సున్నితం. ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేదు.’’

‘‘అసలిది ఎలా జరిగిందండీ?’’ ఆయన వైఖరికి కోపం ముంచుకొస్తున్నా ముఖాన్ని కాస్త విచారంగా పెట్టి అడిగాడు.

‘‘అడక్కు, ఏం చెప్పమంటావు? అంతా మా రాత, ఖర్మ.’’

‘అడక్కు’ అన్నమాట ఆయన తరచుగా ఉపయోగించేమాట.

అడగొద్దన్న తరవాత అడిగితే బాగుండదని మౌనంగా ఉండిపోయాడు శంకరం. ‘ఎంత వేదాంతం అబ్బితే మాత్రం... పరామర్శకు వచ్చిన వాడి దగ్గర బాధను కనీసం నటించాలి కదా’ అనుకున్నాడు.

ప్రత్యక్ష పరిచయం చాలా తక్కువేగానీ, గిరిజ ద్వారా తెలిసిన విషయం ‘వసుంధర చాలా మంచిదని.’

ఎవరైనా ఎరిగున్నవాళ్ళు పోతే ఆ కుటుంబ సభ్యుడిలా బాధపడిపోతాడు శంకరం. పరామర్శ అతనికొక గండం. ఓదార్చడం ఎలాగో తెలియదు. భార్యను వెంట తీసుకురానందుకు తనను తాను తిట్టుకున్నాడు.

‘ఆయన ఎలాంటివాడైనా పరామర్శించడానికి వచ్చాక తప్పుతుందా? చల్లని నీళ్ళైనా చల్లారబెట్టాలి’ అనుకుంటూ... ‘‘ఆమధ్య ఏదో పనిమీద ఇటు వచ్చాను. అప్పుడామె కూరలు కొంటూ ఉండటం చూశాను.’’

‘‘ఔనయ్యా, ఇది జరిగి పదిహేను రోజులయింది.’’

‘ఓహో, అందుకే కాబోలు చుట్టాలెవరూ లేరు’ అనుకున్నాడు మనసులో శంకరం.

‘‘మాకీ విషయం తెలియదండీ, తెలిస్తే వెంటనే వచ్చి ఉండేవాళ్ళం’’ అన్నాడు నొచ్చుకుంటూ.

‘‘అయ్యో, దాందేముందయ్యా...ఇప్పుడొచ్చావు కదా! మంచితనం లేకపోతే ఇప్పుడు మాత్రం వస్తావా? అవునూ, గిరిజ ఇంట్లో లేదా?’’

‘‘నేనొచ్చినట్లు ఆమెకు తెలియదండీ, వంట చేస్తోంది.’’

‘ఇక వెళ్ళిపోవడం మంచిది. చావు పరామర్శకు వచ్చినపుడు వెళ్ళొస్తాననకూడదు కదా’ అని మనసులో అనుకుని, లేచి వీధి గుమ్మంవైపు అడుగువేశాడు శంకరం.

‘‘ఒక్క క్షణం ఆగు శంకరం, కాఫీ తాగి వెళ్దువుగానీ’’ అన్నారు కామేశ్వరరావుగారు.

‘పరామర్శకొచ్చినపుడు కాఫీ తాగొచ్చో తాగకూడదో’ అనే సందేహం వచ్చింది శంకరానికి. గిరిజ ఏమంటుందో- అనుకుంటుండగా ‘‘ఎవరండీ వచ్చారు?’’ అన్న ఆడ గొంతు వినబడింది.

‘ఆ గొంతు ఎవరిదో కాదు, అత్త రాకాసిదే’ అనుకున్నాడు శంకరం. పళ్లు పటపటలాడించాడు చప్పుడవకుండా.

‘‘గిరిజా వాళ్ళాయన, శంకరం... ఆంధ్రా బ్యాంకు.’’

‘‘లోపలికి రమ్మనండి, కాఫీ ఇవ్వండి.’’

‘‘నేనూ అదే అంటున్నానే.’’

‘రాకాసి రాదేం బయటకు. నేనే లోపలికి వెళ్ళాలేమో’ అనుకుంటూ పక్క గది గుమ్మందాకా వెళ్ళాడు.

‘‘నన్ను పడగొట్టేశాడు నాయనా దేవుడు. నా కుడిభుజం విరిగిపోయింది.’’

‘నంగనాచి, తనను దేవుడు పడగొట్టేశాట్ట... కోడలు కుడి భుజమని ఇప్పుడు తెలిసింది. మనిషి బతికుండగా వారి విలువ తెలియదు. చనిపోయాక దొంగ ప్రేమ నటిస్తారు. వాళ్ళ గురించి మొసలి కన్నీళ్ళు కారుస్తారు’ మనసులోనే తిట్టుకున్నాడు.

‘‘లోపలకు వెళ్ళవయ్యా, అభిమానంతో వచ్చావు’’ అనుమతిచ్చినట్లున్నారు కామేశ్వరరావుగారు.

‘ఓహో, ఈవిడగారు దుఃఖా గృహంలో కూర్చుందేమో. నేను వెళ్ళి పలుకరించాలి కాబోలు’ మనసులో కారాలూ మిరియాలూ మిరపకాయలూ నూరుతూ లోపలికెళ్ళాడు.

వసుంధర అత్తగారు మంచంమీద పడుకుని ఉంది.

అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శంకరం. కామేశ్వరరావుగారు మంచంమీద కూర్చున్నారు.

‘‘ఆపరేషన్‌ చేయవలసి వచ్చింది.’’

‘‘అయ్యో పాపం!’’

‘‘రాతయ్యా... రాత...’’

‘మీ రాత బంగారంగానూ, కాస్త ఉండండీ.’’

‘‘దెబ్బమీద దెబ్బ’’ అన్నాడు శంకరం ముక్తసరిగా.

‘‘ఔనయ్యా, ఆమధ్య ఆ చేతికే దెబ్బ తగిలింది.’’

‘‘ఇంకా నయం, ఇంతటితో వదిలాడు దేముడు’’ అంది ఆమె.

‘ఔను, నిన్ను కూడా తీసుకుపోవలసింది’ అనుకున్నాడు శంకరం. అంతలోనే ‘పాపం’ అనుకుని వాళ్ళు చూడకుండా లెంపలేసుకున్నాడు.

‘‘మీ అబ్బాయి ఏడీ?’’ అడిగాడు శంకరం, అతన్ని పరామర్శించడం ముఖ్యంకదా అనుకుని.

‘‘ఆఫీసుకెళ్ళాడు బాబూ. కొంపలో ఎవరేమయిపోయినా ఆఫీసులు తప్పవు కదా’’ అంది నిష్ఠూరంగా.

‘‘ఏమయ్యా శంకరం, నువ్వు వచ్చినప్పటినుండీ చూస్తున్నాను. నువ్వు మాట్లాడింది తక్కువ, ఆలోచించేది ఎక్కువ. ఏంటి సంగతి?’’

‘గిరిజ ఒకసారి చెప్పిందిగా... వాళ్ళాయన ఎక్కువ మాట్లాడడని.’

‘నేనొచ్చిందెందుకు... జరుగుతున్నదేమిటి?’ అర్థంకాలేదు శంకరానికి. ముభావంగా ఉండిపోయాడు. ‘ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను’ అనుకున్నాడు.

‘‘అమ్మాయ్‌, కాఫీ పట్టుకురా రెండు కప్పులు. ఔనూ, నీకూ కావాలా?’’ కామేశ్వరరావుగారు భార్యనడిగారు.

‘‘నలుగురితోపాటు నారాయణ’’ అంది.

పది నిమిషాల్లో కాఫీ వచ్చింది.

శంకరం పక్కకు తిరిగిచూశాడు. కళ్ళముందు మెరుపు మెరిసినట్లయింది. ‘ఎవరీ అమ్మాయి... వసుంధర చెల్లెలు కదూ’ అనుకున్నాడు.

‘వసుంధర స్థానాన్ని ఈమె భర్తీ చేస్తుందేమో’ అనే ఆలోచన రాగానే ఆమెపట్ల జాలి కలిగింది.

కామేశ్వరరావుగారి వంకా, ఆయన భార్య వంకా కసిగా చూస్తూ ‘ఎంత దుర్మార్గులు’ అనుకున్నాడు.

చేతి గడియారం చూసుకున్నాడు. ఆఫీసుకు టైమవుతోందని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడి ఆఫీసుకు చేరుకున్నాడు.

వసుంధర చెల్లెలే కళ్ళల్లో స్థిరపడిపోయింది. నల్లతాచులాంటి ఆమె పొడవైన జడ అతణ్ణి వెంటాడుతోంది.

గిరిజ బ్యాంకుకు ఫోను చేసింది శంకరం వచ్చాడో లేదో తెలుసుకోవడానికి.

‘‘ఆఁ గిరిజా, నేను బ్యాంకుకు వచ్చేశాను.’’

‘‘అదేంటండీ, చెప్పకుండా వెళ్ళిపోయారేంటి? టిఫిన్‌ తిన్నారా? సేమ్యా, కొబ్బరిపచ్చడి చేశాను. పోనీ నన్ను బ్యాంకుకు తెమ్మంటారా?’’

‘‘వద్దు గిరిజా, కాఫీ తాగాను. సాయంత్రం ఇంటికొచ్చాక తింటాన్లే.’’

‘‘సరే, ఉంటాను.’’

* * *

సాయంత్రం శంకరం ఇంటికి వచ్చాక ఇద్దరూ టిఫిన్‌ తిని టీవీ ముందు కూర్చున్నారు.

‘‘ఉదయం చెప్పకుండా ఎక్కడకు వెళ్ళారు?’’

‘‘కామేశ్వరరావు గారింటికి వెళ్ళాను. దమయంతిగారి భుజం విరిగింది. దెబ్బమీద దెబ్బ.’’

‘‘దెబ్బమీద దెబ్బేంటి? ఓహో, జబ్బ మీద దెబ్బా?’’

‘‘అది కాదే...’’

‘‘ఏదో ఒకటి పోనీండి. అన్నట్టు... ఏమండీ, ఒక శుభవార్త.’’

‘‘ఏంటది?’’

‘‘వసుంధర చచ్చిపోలేదండీ, పల్లెవాళ్ళు రక్షించారు. బహుశా రేపటి ఎపిసోడ్‌లో అత్త భరతం పడుతుంది.’’

భార్య వంక వెర్రివాడిలా చూశాడు శంకరం.

ఆమె కళ్ళలోని ఆనందాన్ని చెదరగొట్టలేక ‘‘ఓహో’’ అన్నాడంతే.

‘‘అవునూ, ఇందాక ఏంటీ అన్నారూ... దమయంతిగారికి దెబ్బ తగిలిందన్నారు కదూ, రేపు వెళ్ళి చూసొస్తాన్లెండి.’’

(నీతి: భావ ప్రకటన సవ్యంగా సంపూర్ణంగా ఉండాలి.)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.